Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపనిషత్తులు

వికీసోర్స్ నుండి

ఉపనిషత్తులు : పతి వేదమునకును దానికి సంబంధించిన బ్రాహ్మణమందుగాని, ఆరణ్యకమందుగాని ఉపనిషద్భాగము కూడ చేరియున్నట్లు విదితమగుచున్నది. బ్రాహ్మణారణ్యక కములలో ఇమిడియున్న ఉపనిషద్భాగములు కాక ఆయా వేదములకు సంబంధించినవిగా ప్రసిద్ధినొందిన ఉపనిషత్తులును, ఆయాదేవతల పేరను, ఋషుల పేరను వెలసిన ఉపనిషత్తులును, మరికొన్ని కలవు. లోకమున నిట్లు వ్యాప్తినొందిన ఉపనిషత్తులు సుమారు రెండువందలు కలవు. వాటిలో నిజముగ వేదాంతములనదగినవి పది ఉపనిషత్తులు మాత్రమే. అవి ఈశ- కేన- కఠ -పశ్న-ముండ - మాండూక్య - తైత్తిరీయ-ఐతరేయ - ఛాందోగ్య - బృహదారణ్యకము లనునవి. వాటిపై శ్రీశంకర- రామానుజ - మధ్వాచార్య ప్రభృతులు స్వీయమ తాను సారముగ భాష్యములను వ్రాసిరి. శేషించిన వ్యాఖ్యలు ఆయా కాలములందు ఆయా మతాభిమానులగు పండితులచే రచింపబడినవి. ఉపనిషత్తులు 108 అని లోకమునందుగల వాడుకను ము క్లికోపనిషత్తుకూడ బలపరచుచున్నది.

ఈ అష్టోత్తర శత - ఉపనిషత్తులలో ఐత రేయ-కౌషీతకీ - ఆత్మ ప్రబోధ - నాదబిందు - నిర్వాణ - ముద్గల-అక్షమాలికా - త్రిపురా - సౌభాగ్య - బహ్వృచములను పది ఉపనిషత్తులు ఋక్శాఖకు చెందినవి.కేన-చాంరోగ్య - ఆరుణి - మైత్రాయణి - మైత్రేయీ - వజ్రసూచీ - యోగచూడామణి - వాసుదేవ - సన్యాస - అవ్యక్త సావిత్రీ రుద్రాక్ష జాబాల - దర్శన - జాబాలికా. కుండికా - మహోపనిషన్నామకములైన పదునారు ఉపనిషత్తులు సామశాఖకు చెందినవి. కరవల్లి - తైత్తిరీయ -

నారాయణ - బ్రహ్మ - కైవల్య - శ్వేతాశ్వతర - గర్భ-అమృతబిందు - అమృత నాద - కాలాగ్నిరుద్ర- క్షురికా - సర్వసార - శుకరహస్య- తేజోబిందు -ధ్యానబిందు -బ్రహ్మవిద్యా - యోగతత్త్వ = దక్షిణామూర్తి - కఠ -స్కంద - శారీరక - వరాహ యోగశిఖా - ఏకాక్షర -అక్షి - అవధూత - రుద్రహృదయ - యోగకుండలినీ -పంచబ్రహ్మ - కలిసంతరణ - ప్రాణాగ్నిహోత్ర - సరస్వతీ రహస్యములు అను ముప్పది రెండు ఉపనిషత్తులు కృష్ణ యజుశ్శాఖకు చెందినవి.

ఈశావాశ్య - బృహదారణ్య -జాబాల- సుబాల - హంస - పరమహంస- మంత్రికా నిరాలంబ - తార సార - త్రిశిఖి - బ్రాహ్మణ - అద్వయతారక - పైంగల -భిక్షుకా - తురీయాతీత - అధ్యాత్మ - ముక్తికా - శాట్యా యనీ - యాజ్ఞ వల్క్యములు - అను పందొమ్మిది శుక్ల యజుశ్శాఖకు సంబంధించినవి. ప్రశ్న- ముండక మాండూక్య - బృహజ్జాబాల- నృసింహతాపినీ- నారద పరి వ్రాజక - సీతా - శరభ - మహానారాయణ - రామ రహస్య - రామతాపినీ - శాండిల్య - పరమహంస- పరి వ్రాజక - అన్నపూర్ణా - సూర్య - ఆత్మ - పరంబ్రహ్మ -పాశుపత-త్రిపురతాపినీ - దేవీ- భావనా - భస్మ జాబాల - గణపతి - మహావాక్య - గోపాలతాపినీ - కృష్ణ -హయగ్రీవ - గరుడ - దత్తాత్రేయ - అథర్వశిఖా - అథర్వ శిరోనామకములు ముప్పదియొకటి అథర్వశాఖకు చెందినవి. ఇవిగాక ఇతిహాస - తత్త్వపంచకరణము మున్నగు ఉపనిషత్తులింకను వందకుపైగా గలవు.

సంహితా బ్రాహ్మణములందుసృష్టి, ప్రజాపతిచే నిర్మింపబడినట్లు వర్ణింపబడినది. ఉపనిషత్తులయందు అవిద్యాపరి కల్పితమైనట్లు వర్ణింపబడినది. ఋగ్వేదాదుల కాలమందే పరమేశ్వరుడు జగదభిన్న నిమిత్తోపాధాన కారణమనురీతి ఆత్మవిజ్ఞాన మంకురించెను. అయ్యాత్మ విజ్ఞానాంకురమే యజురాది సంహితలందు విస్మృతినొంది తుదకు ఉపనిష ద్రూపమున పరిణమించి సకలలోకమునకు నాత్మతత్త్వము బోధించు దివ్యజ్యోతియై వెలుగుచున్నది. ఉపనిషత్తులందు ప్రతిపాదింప బడినది పరమాత్మతత్త్వము. ఈ ఉపనిషత్తులు పిదప వెలువడిన వివిధ వేదాంత శాస్త్రములకును, ద్వైత, అద్వైత - విశిష్టాఽద్వైతాది భిన్న మతములకును ఆలంబనము లైనవి. మొత్తముమీద ఉపనిషత్తులన్నియు అజ్ఞానము సంసారదుఃఖ హేతువనియు, ఆత్మజ్ఞానము ముక్తి కారణమనియు సోపప త్తికముగ నిరూపించినవి.

ఉపనిషత్తుల కాలము నిరూపించుట సాధ్యమైన పనిగాదు. సుప్రసిద్ధములయిన ఉపనిషత్తులలో కొన్ని బౌద్ధ మతమునకు పూర్వమునందుపుట్టెనని పాశ్చాత్య విమర్శకులు కొంద రూహించిరి. పూర్వోపనిషత్తులకాలము క్రీ. పూ. 1000-300 ల మధ్య కాలమని తెలియుచున్నది. ఆరణ్యకములందు అంతర్భూతములయిన తైత్తిరీయము, బృహదారణ్యకము, వాటి బ్రాహ్మణములు అవ్యవహిత - ఉత్తర కాలమందే ఆవిర్భవించినవి. ఛాందోగ్యమునందలి సరళగద్య శైలినిబట్టి అది పై రెండింటికంటే ముందే పుట్టియుండును. ఐతరేయము, కాషీతకి - ఇవి పై మూడింటికంటే తరువాతివి. ఇయ్యయిదును ప్రథమకాలికములు. కేనోపనిషత్తు గద్యపద్యమయము. అందుచే నది గద్యమయములైన తైత్తిరీయాదులకును పద్య మయములయిన కఠాదులకును మధ్యకాలమున బుట్టియుండును. ఈశాన్య- కఠవల్లీ -శ్వేతాశ్వతర - ముండకోప నిషత్తులు ద్వితీయ కాలికములు .ప్రశ్న - మైత్రాయణీ - మాండూక్యోపనిషత్తులు తృతీయ కాలికములు. వీటియందలి భాష ఎక్కువగా లౌకిక భాషకు చెందినదై యున్నది. మహానారాయణోపనిషత్తు విశిష్టాద్వైత మంకురించిన కాలమున జనించినది. ఇట్లే రుద్ర హృదయాదులు కొన్ని శైవ మతావలంబనములు. సూర్యోపనిషదాదులు కొన్ని సౌరమతా వలంబనములు. గణపత్యాదులు కొన్ని గాణాపత్యమూలములై వెలసినవి. రాసు తాపినీ – గోపాల తాపినీ- హయగ్రీవ - రుద్రాక్షాదులు వివిధ పౌరాణిక మతములు వెలసిన పిదప బయలు వెడలినవి అని విమర్శకుల అభిప్రాయము.

ఉపనిషత్పదమునకు ముఖ్యార్థము : 'ఉపనిషత్' అను పదమునకు బ్రహ్మవిద్య, అనగా బ్రహ్మజ్ఞానము, అని అర్థము. ఎట్లన; “షద్ విశరణగత్య వసాదనేషు" అను వ్యాకరణ శాస్త్రానుసరణముచే 'సద' ధాతువునకు 3 అర్థములు. (1. నిశరణము = విశ్లేషము అనగా శైథిల్యము; 2. గతి, అనగా ప్రాప్తి; 3. అవసాదనము = నాశనము).

1. మొదటి ధాత్వర్థము ననుసరించి బ్రహ్మజ్ఞానము గల మానవులకు గర్భవాస - జన్మ - జరా- రోగాది అనర్థ

సంఘమును (విశాతయతి) శైథిల్యమును పొందించునది అని ఉపనిషత్ (బ్రహ్మవిద్య) శబ్దార్థము.

2. రెండవ ధాత్వర్థానుసారము యథోక్తముగా ముముక్షువులను పరబ్రహ్మమును పొందించునది అని ఉపనిషత్ (బ్రహ్మవిద్య) శబ్దార్థము.

3. మూడవ ధాత్వర్థానుసారము సంసార బీజమగు అవిద్యాదికమును నశింపచేయునది అని ఉపనిషత్ (బ్రహ్మవిద్య) శబ్దార్థము.

ఇవ్విధముగా పై మూడు ధాత్వర్ధములు 'ఉపనిషత్' శబ్దవాచ్యమగు బ్రహ్మవిద్యకు కలవుగాన ఉపనిషత్ శబ్దమునకు బ్రహ్మవిద్య యని అర్థము. మరియు విద్యారణ్య భాష్యమున "ఉప-సమీపే - నిషణ్ణం అప్యాం పరంశ్రేయః ఇత్యుపనిషత్" తా॥ ఉత్కృష్టమగు శ్రేయస్సునకు (అనగా అత్యంతిక పురుషార్థమగు మోక్షమునకు) సాధనము ఉపనిషత్తు అని శ్రీ విద్యారణ్య యతీంద్రులు వ్రాసి యున్నారు. ఈ ప్రకారముగ శ్రీ మచ్ఛంకర భగవత్పాదులు, శ్రీ సురేశ్వరాచార్యులు, శ్రీ విద్యారణ్య యతీంద్రులు మున్నగు పూజ్యపాదులు ఉపనిషత్పదమునకు బ్రహ్మజ్ఞానము ముఖ్యార్థముగా సెలవిచ్చిరి.

ఉపనిషత్పదమునకు గౌణార్ధము: ఇక బ్రహ్మజ్ఞాన ప్రతిపాదకమగు గ్రంథమునకు ఉపనిషన్నామముచే వ్యవహారము గౌణము(లాక్షణికము). లోకములో లాంగలంజీవనం'అను లౌకిక ప్రయోగమునకు 'నాగలి జీవనము'అను అర్థము సిద్ధించగా నాగలి ఎన్నడును జీవనము కానేరదు కాన లక్షణావృత్తిచే జీవనవాచకముగు జీవన శబ్దమునకు జీవన సాధనము అను అర్థమును చెప్పుచున్నట్లును, ఇదే విధముగా వేదములో 'ఆయుర్వైఘృతం' (కృ, య, సం, 2 కాం. 3 ప్ర.) (ఆయుష్కా మేష్టి - కుండ లేష్టి - అను కర్మలో బంగారుకుండలములను ఘృతములో మంచి విధ్యను సారము ఆ కుండలములతో నేతిని పానముచేయు సందర్భములోనిది) అను మంత్రమునకు ప్రతిపదార్థము "ఘృతము ఆయువు" అని చెప్పవలసిరాగా మృతము ఆయువు కానేరదు; లక్షణావృత్తిచే 'ఆయువునకు హేతువు ఘృతము' అని చెప్పుచున్నట్లును, ప్రకృతమున ముఖ్యవృత్తిచే బ్రహ్మ జ్ఞానము చెప్పెడి ఉపనిషత్పదమునకు లక్షణచే బ్రహ్మజ్ఞాన ప్రతిపాదక' గ్రంథము (వేద భాగము) అని అర్ధము.

ఇవ్విధముగా ఉపనిషత్ పదాఽర్థ నిర్వచనానంతరము ఉపనిషత్ప్రతిపాద్యమగు ఆత్మజ్ఞానము మానవునకు అన్నిటి కంటె సర్వోత్తమమైనదిగాన అట్టి ఆత్మను తెలిసికొనుటకు ఉపాయమెద్ది అను విచికిత్సపై ఉపనిషత్తులో "నాయ మాత్మాప్రవచ నేనలభ్యో, నమేధయా, నబహునాశ్రుతేన” (కఠవల్లీ 28 ము, ము. 2. 2) అని చెప్పబడినది. ఆత్మ దుర్విజ్ఞేయము అనగా సుఖముగా తెలిసికొనుటకు శక్యమైనది కాదు—— అట్టి ఆత్మ వేదశాస్త్రాదుల అధ్యయనము చేతగాని, గ్రంథ, తదర్థ-ధారణాశక్తి చేతగాని, ఉపనిషద్విచారాతిరిక్త శాస్త్రశ్రవణము చేగాని జ్ఞేయముకాదు. అనగా వీటివలన ఆత్మజ్ఞానము లభించదు. ఇక నేమన పరమేశ్వర- ఆచార్య- అనుగృహీతమగు ఉపనిషద్విచారము చేతనే లభించును. కానీ ఆత్మజ్ఞానము కొరకు ఉపనిష ద్విచారము చేయవలెనని ఫలితార్ధము.

ఇట్టి ఉపనిషద్విచారణకు సాధనములు బహిరంగ, అంతరంగ భేదములచే రెండు విధములు.

"సామాన్యముగా మానవునకు సంచితములగు మహా పాపములచే ఆత్మవిద్యయందు అరుచి పుట్టును." అని పురాణము లందు చెప్పబడినది.

శ్లో, “మహాపాప వశాంపుంసాం | జ్ఞానయజ్ఞో నరోచతే |
ప్రత్యుత జ్ఞానయజ్ఞస్తు | ప్రద్వేష్యో భాసతే స్వతః."

సంచిత మహాపాపములుగల మానవునకు జ్ఞానమార్గము రుచించదు. దానిని గూర్చి స్వతః ద్వేషము జనించును. అట్టి మానవునకు బహిరంగ సాధనములగు యజ్ఞాదులు ఆత్మవేదనమందు వివిధిషను (రుచిని) పుట్టించును. అని శ్రుతులు చెప్పుచున్నవి.

బహిరంగ సాధనములు : శు: “తమేతం వేదాను వచనేన, బ్రాహ్మణా వివిదిషంతి, యజ్ఞానదానేన తపసో 2 నశ నేన" వేదాధ్యయనము, యజ్ఞము, (నిష్కామకర్మ) దానము, తపస్సు, అనశనవ్రతము, (ఉపవాసాదులు) ఇవి మానవునకు ఆత్మవేదనమందు అరుచిని తొలిగించి రుచిని పుట్టించునని తాత్పర్యము.

యజ్ఞాదులు స్వర్గాధిఫలములకు సాధనములుకదా అవి వివిధషకు ఎట్లు కారణమగును అనినచో 'ఉత్తరము ఫల కామనతో చేయు యజ్ఞములు సాంసారిక ఫలములకు సాధనములైనను ఫలాఖసంధి ఫలకామన లేకయే ఈశ్వ

రార్పణ బుద్ధితో చేయబడు యజ్ఞాదికర్మలు ఆత్మవేదన మందు అరుచిరూపమగు విఘ్నమును కలుగజేయు మహా పాపమును నశింపజేయునని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో నిట్లు చెప్పెను.

"బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగంత్యక్త్వా కరోతి యః ॥
లిప్యతే న సపా పేన | పద్మపత్ర మివాంభసా॥

" తామరాకునకు ఉదకలేపము ఎట్లుండదో అటులనే ఈశ్వరార్పణబుద్ధిచే కర్మలను జేయు మానవునకు పాప లేపముండదు. అనగా ఇట్టికర్మలచే పాపములు నశించునని పైశ్లోక తాత్పర్యము.

"ఇట్టి కర్మలచే సిద్ధించెడి పాపక్షయమునకు వైరాగ్యము చిహ్నము." అని నైష్కర్మ్య సిద్ధియందు చెప్పబడినది :

"శోధ్యమానంతు తచ్చిత్తం! ఈశ్వరార్పిత కర్మభిః |
వైరాగ్యం బ్రహ్మలోకాదౌ వ్యవ క్త్యథ సునిర్మలం

ఈశ్వరార్పణబుద్ధిచే చేయబడిన కర్మలచే కలిగిన పాపక్షయము మూలమున చి త్తశుద్ధికలిగి బ్రహ్మజ్ఞానమునకు అంతరంగ సాధనమగు నిర్మలవైరాగ్యము లభించును అని ఈశ్లోక తాత్పర్యము. వైరాగ్యమనగా హిరణ్య గర్భుడు మొదలు స్తంభము వరకుగల సంసారమునందు (అనగా సమస్త జగత్తునందును) ఈశ్వరార్పణబుద్ధిచే చేయబడిన కర్మఫలమే. లోకములో జన్మాంతర కృత పాపముచే అజీర్ణవ్యాధిగ్రస్తుడగు మానవునకు దానజపాదులు, పాపక్షయ మూలమున అన్న మందలి అరుచిని తొలగించి రుచిని పుట్టించునట్లు ప్రకృతములో జన్మాంతర సంచితములైన మహాపాపములచే జనించిన ఆత్మవిద్య యందలి అరుచిని, అట్టి యరుచికి కారణములగు పాపములను నిష్కామకర్మాదులు క్షయముచేసి, చిత్తశుద్ధి సంపాదనము మూలమున ఆత్మవిద్యయందు రుచిని (వివిధిషను) పుట్టించును. కావున వేదాధ్యయనము, నిష్కామకర్మ, దానము, తపస్సు, అనశనము, బహిరంగ సాధనములు అని తెలియనగును.

అంతరంగ సాధనములు: పూర్వోదాహృత నిష్కామ కర్మాదుల ననుష్ఠించుటచే ఆత్మవిద్యయందు రుచి జనించిన పిదప, అంతరంగ సాధనములగు నిత్యానిత్య వస్తువివేక, వైరాగ్యాదులుగల మానవునకే ఆత్మవిద్యయందు అధికారము కలుగును గాన అంతరంగ సాధనములనుగూర్చి వివరింపవలసి యున్నది. అంతరంగ సాధనములు నాలుగు. వాటిలో మొదటిది నిత్యానిత్య వస్తువివేకము : 'తద్య థేహకర్మ చితోలోకః క్షీయతే ఏవ మేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే.' అనుదానినిబట్టి లోకములో వ్యవసాయము మున్నగు లౌకిక కర్మలచే సంపాదింపబడిన ధాన్యాదిఫలములు ఎటుల క్షీణించునో అటులనే యజ్ఞాది కర్మలచే పరలోకములో సంపాదింపబడిన స్వర్గాదిఫలములు గూడ క్షీణించును అని తెలియుచున్నది. ఇటువంటి శ్రుత్యాదులవలన నిత్య- అనిత్య వస్తువులను వివేచన చేయుట (వేరుచేయుట) నిత్యానిత్య వస్తువివేక మనబడును.

రెండవ అంతరంగసాధనము వైరాగ్యము (ఇహా ముత్రార్థఫలభోగవిరాగము) : “పరీక్ష్యలోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా. న్నాస్త్యకృతః కృతేన" అను శ్రుతి కర్మలచే సంపాదింపబడిన ఫలములు అనిత్యములనియు, కర్మలచే మోక్షము ఎన్నడును సిద్ధింపదనియు తెలిసికొని కర్మ- తత్ఫలములవలన వైరాగ్యమును పొంది, బ్రహ్మజ్ఞాన సంపత్తికొరకు గురుసమీపమున కేగవలెను అని బోధించుచున్నది. ఇవ్విధమున వైరాగ్యమును పొందిన పిదప అవసరమగు మూడవ అంతరంగసాధనము శమాది సాధనసంపత్తియై యున్నది. "శాంతో దాంత ఉపరత స్తితియుస్సమాహితశ్రృద్ధావితో భూత్వాఽఽత్మన్యే వాత్మానం పశ్యేత్ " అనుశ్రుతి అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, సన్యాసము, శీతోష్ణాది ద్వంద్వ సహనము, చిత్తసమాధానము (ఏకాగ్రత), శ్రద్ధ అనునవి కలిసి శమాదిసాధన సంపత్తి యగుచున్నది.

ఇది గల మానవునకు పిదప నవసరముగు నాలుగవ అంతరంగ సాధనము ముముక్షుత్వమనునది (మోక్షేచ్ఛ): మానవునకు అపేక్షితములగు సర్వపురుషార్థములలో మోక్షము అత్యుత్తమమైనదిగాన అట్టి మోక్షమునుగూర్చిన ఇచ్ఛ అందరకును ఉండునుకదా ! అట్టి మోక్షేచ్ఛను అంతరంగ సాధనములలో నొకటిగా చెప్పుట ఎందులకని శంకింపరాదు. ఏలన మోక్షేచ్ఛ సఫలేచ్ఛ, విఫలేచ్ఛ అని రెండు విధములు. లోకములో మహారాజునకు పుత్రుడై రాజ్యప్రాప్తికి అర్హుడైయుండి కారణాంతరములచే రాజ్యము సంప్రాప్తము కానివానికి రాజ్యము కావలెనను ఇచ్ఛ ఎట్లు సఫలేచ్ఛ అగుచున్నదో, త ద్విపరీతముగ నీచ వంశమందుబుట్టి ఎవ్విధముగను రాజ్య ప్రాప్తికి అర్హత లేని మానవునకు జనించిన రాజ్యేచ్ఛ ఎట్లు విఫలేచ్ఛ అగుచున్నదో, అటులనే మోక్షేచ్ఛ సర్వజన సాధారణమైనను, నిత్యాఽ నిత్యవస్తువివేకాది సాధన సంపత్తిలేక యే మోక్షమును గోరువానిఇచ్ఛ విఫలేచ్ఛయగును. కావున సఫలేచ్ఛయే (సాధన సంపత్తితోగూడినవారి మోక్షేచ్ఛయే) ఇచ్చట ముముక్షుత్వము అనబడును. కాన విరోధములేదు.

ఇట్టి సఫలేచ్ఛకలవానికే బ్రహ్మవిద్యయందు అధికారముకలదని శ్రీ వ్యాసమహర్షి ఉత్తరమీమాంసా శాస్త్రములో "అథాఽతో బ్రహ్మజిజ్ఞాసా" అను సూత్రముచే (జిజ్ఞాసాధిక రణములో) సాధన చతుష్టయ సంపత్త్య నంతరమున బ్రహ్మజ్ఞానముకొరకు విచారణచే యవలెను అని చెప్పియుండిరి.

బ్రహ్మలక్షణము : "లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః” అను తార్కిక సమయానుసారము ఏవస్తువునైన తెలిసి కొన దలచినవాడు అవస్తువునకు అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవము అను మూడు దోషములచే దూషితము కాని అనగా నిర్దుష్టమగు లక్షణమును, ప్రమాణమును చెప్పినచో, ఆవస్తువును తెలిసికొనుట శక్యమగును. ఎట్లన: గొః కిం లక్షణం ? సాస్నాదిమ త్త్వం లక్షణం. అనగా గోవును ఎరుగనివానికి దానిని తెలియజెప్పవలెనన్న- గంగడోలు వగై రాలు కలది గోవు. అది చక్షురింద్రియ ప్రమాణముచే తెలిసికొనదగినది, అను రీతిగా గోవును గూర్చి లక్షణప్రమాణములను చెప్పినచో గోరూపవస్తుజ్ఞాన మెట్లుగల్గునో, అటులనే ప్రకృతములో బ్రహ్మజ్ఞానము కావలెనన్నచో బ్రహ్మమునకు లక్షణ ప్రమాణములను చెప్పుట అవసరము.

బ్రహ్మమునకు లక్షణములు రెండు. 1. తటస్థ లక్షణము. 2. స్వరూపలక్షణము (ఉపనిషత్తులలో),

1. తటస్థలక్షణము : ఇట శ్రుతి - యతోవా ఇమాని భూతాని జాయంతే! యేన, జాతానిజీవంతి | యత్ప్రయం త్యభిసంవిశంతి | తద్విజిజ్ఞాసస్వ, తద్భహ్మేతి | (తై.ఉ.4.) అనగా మనచే చూడబడుచున్న సమస్త భూతములును ఎవనివలన పుట్టుచున్నవో, ఉత్పన్నములైన సర్వభూతముల్లును ఎవనిమూలమున జీవించుచున్నవో, వినాశనమును పొందుచున్న సర్వభూతములును ఎవనియందు లీనమగుచున్నవో అదియే బ్రహ్మము. అనగా జగత్తుయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారణమైనదియే బ్రహ్మము. ఈవిధముగా వరుణుడు తనపుత్రుడగు భృగువునకు బ్రహ్మ లక్షణమును చెప్పెను. 'తథాచ - సృష్టి, స్థితి, లయ కారణత్వం, బ్రహ్మత్వం ఇతి ఫలితం' దీనినే ఉత్తర మీమాంసా శాస్త్రములో “జన్మాద్యస్య యఈ" (ఉ. మీ. 1. 1. 2.) అనిచెప్పి ఈ సూత్రమునకు విషయ వాక్యముగా ప్రకృతమగు (యతోవా ఇవనీత్యాది) ప్రతివాక్యము నుల్లేఖించిరి.

దృష్టాంతత్రయము :-ఇట్లే బ్రహ్మమునకు భూత కారణత్వమును, ప్రసిద్ధ దృష్టాంత త్రయముచే ముండకోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది.

"యథోర్ణనాభి స్పృజతే గృష్ణా తేచ, యథాపృథివ్యా మోషధయ స్సంభవంతి, యథా సత పురుషాత్కేశ లోమాని, తథాఽక్షరా త్సంభవ తీహ విశ్వం" (1 ముం. 1-7)

లోకములో కారణమాత్రము, సహాయము లేనిదే, కార్యమును సృజింపజాలదు. నీళ్ళు, చక్రము మున్నగువాటి సహాయములు లేనిదే, కుమ్మరివాడు ఒక్కడును కుండలను నిర్మింపజాలడు. అట్లే సహాయశూన్యుడగు పరమాత్ముడు (బ్రహ్మము) ఒక్కడు జగత్తును ఎట్లు సృజింపగలడు అనినచో సమాధానము కారణమాత్రము సహాయము లేనిదే కార్యము సృజింపబడదు అను వ్యాప్తి, దోషగ్రస్త మగుటచే, ఊర్ణనాభి దృష్టాంతముచే, బ్రహ్మమునకు జగత్కారణత్వమును శ్రుతి చెప్పుచున్నది (యథోర్ణ...తేచ. దీని యర్థమిది. లోకములో (ఊర్ణనాభి) సాలె పురుగు ఇతర సహాయము నపేక్షింపకయే స్వయముగా దారము నెట్లు సృజించునో అటులనే పరమేశ్వరుడుకూడ ఇతరసహాయము నపేక్షింపకయే జగత్తును సృజించును.

లోకములో కార్యోత్పత్తి స్థలములో కార్యము పుట్టిన పిదప కారణమునకు (పూర్వావస్థాపమర్దము) పూర్వావస్థ యొక్క మార్పుగాని, పూర్వాకారము యొక్క తీరోధానముగాని చూడబడుచున్నది. ఎట్లన: మట్టి ముద్దచే కుండను నిర్మించినపిదప కారణమగు మట్టిముద్ద యొక్క పూర్వావస్థ ఎట్లు మారునో, మరియు

నలుపలకలు గల ఇటుకలచే గోడను నిర్మించిన తరువాత గోడకు కారణమగు ఇటుకల పూర్వపు చతుష్కోణా కారము ఎట్లు కనిపించదో (తిరోహితనుగునో) అటులనే బ్రహ్మము జగత్తునకు కారణమైనచో భూతసృష్టి అయిన పిదప కారణమగు బ్రహ్మమునకు (మృత్పిండాదులకువలె) పూర్వావస్థ యొక్క మార్పుగాని, పూర్వాకార తిరో ధానముగాని (నిర్వికారత్వాది శ్రుతులచే) లేదుకదా ! లేనినాడు బ్రహ్మము జగత్తుకు కారణమెట్లగును అనినచో సమాధానము : ఈశంకపై, శ్రుతి, పృథివ్యోషధి దృష్టాంతముచే బ్రహ్మమునకు జగత్కారణత్వమును చెప్పుచున్నది. (యథా పృ... వంతి) ఓషధులకు కారణమగు పృథివికి ఓషధులు పుట్టినపిదప వెనుకటి మృత్పిండమువలెనే (పూర్వావస్థాపమర్దము) మార్పుగాని, ఇటుకలవలె ఆకారతిరో ధానముగాని లేకయే, ఓషధులనుగూర్చి పృథివి ఎట్లు కారణమగుచున్నదో, అటులనే, జగత్కారణమగు బ్రహ్మమునకుగూడ (పృథివికివలె) ఉపమర్ద తిరోధానము లేకయే, బ్రహ్మము జగత్తునకు కారణమగు చున్నది.

ఎట్లు మట్టితో చేయబడిన కుండను గూర్చి దారములు కారణములు కానేరవో అటులనే అచేతనమగు జగత్తునకు (తద్విలక్షణమగు) చేతనమగు బ్రహ్మము కారణ మెట్లగునన్నచో సమాధానము : ఈశంక పై శ్రుతి, కేశ, సఖ, దృష్టాంతముచే బ్రహ్మమునకు జగత్కారణత్వమును చెప్పుచున్నది. (యథాసతఙతి). లోకములో చేతనుడగు పురుషుని వలన అచేతనములగు కేశములు, నఖములు (గోళ్ళు) ఎట్లు పుట్టుచున్నవో, అటులనే చేతనమగు బ్రహ్మమునుండి అచేతనమగు జగత్తుపుట్టుటలో విరోధము కానరాదు.

ఈవిధముగా (పాలిపురుగు, పృథివి, పురుషుడు) అను నీమూడు దృష్టాంతములచే ముండకశ్రుతి చెప్పిన జగ దుత్పత్తి, స్థితి, లయ, కారణత్వమును, తటస్థ లక్షణమును బ్రహ్మమునకు సంగతమైనవి.

లోకములో 'కాకవంతో దేవదత్తగృహాః' అనుచు దేవదత్తుని ఇంటికి (లక్షణమును) గుర్తును చెప్పునపుడు కాకాశ్రయమైనది, అనగా కాకులకు ఆధారమైనది (కాకులు వ్రాలినవి) దేవదత్తుని ఇల్లు అను స్థలములో లక్ష్యమగు దేవదత్త గృహముతో కాకాశ్రయత్వ రూపధర్మమునకు అవయవావయవిభావసంబంధము లేకయే, తటస్థముగా నుండి, ఇంటికి ఎట్లు లక్షణమగు చున్నదో, అనగా దేవదత్త గృహములో కొంతభాగము ఎగిరిపోయినప్పుడు దేవదత్త గృహైక దేశము భగ్నమైనది అనునట్లు, కాకులు ఎగిరిపోయినను దేవదత్తుని ఇంటిలో కొంతభాగము ఎగిరిపోయినది అను వ్యవహారము లేకయే కాకాశ్రయత్వ ధర్మము తటస్థముగా నుండి ఇంటిని ఎట్లు తెలియజేయునో, అటులనే ప్రకృతములో లక్ష్యమగు బ్రహ్మముతో సంబంధము లేకయే జగజ్జన్మాది కారణత్వము బ్రహ్మమును తెలియజేయునుగాన బ్రహ్మమునకిది తటస్థలక్షణము అని తాత్పర్యము. అటులయినచో జగత్తునకు బ్రహ్మము ఉపాదాన కారణమను వ్యవహారమెట్లు సంగతమగును అనినచో సమాధానము : భ్రాంతి స్థలములలో ఉపాదాన కారణములు రెండు విధములు.

1. పరిణామ్యుపాదానము. 2. వివర్తోపాదానము అని.—1. జగత్తునకు మాయ పరిణామ్యుపాదాన కారణము. లోకములో (కుండకు మట్టివలె) జగత్తునకు సత్వరజస్తమోగుణాత్మకమగు మాయ పరిణామ్యుపాదానము (అనగా మాయయే జగద్రూపముగ పరిణ మించినది). కావున కుండకు కారణమగు మృత్తు యొక్క ఎరుపు, నలుపు మున్నగు ధర్మములు కార్యమగు కుండ యందు సంక్రమించినటుల కారణమగు మాయ యొక్క ధర్మములు (సత్త్వరజస్తమోగుణములు) కార్యమగు జగత్తునందు సంక్రమించినవి. కావున మాయ జగత్తునకు పరిణామ్యుపాదాన కారణము.

2. జగత్తునకు బ్రహ్మ వివర్తోపాదాన కారణము. రజ్జు సర్పస్థలములో త్రాడును చూచి (అధిష్ఠానము యొక్క) అజ్ఞానముచే పాము అనుకొనినప్పుడు అనగా, అధిష్ఠానమగు త్రాడునందు పామును కల్పించినప్పుడు (సృష్టించి నప్పుడు) ఆ కల్పనకు అధిష్ఠానమగు త్రాడు కల్పితమైన పామునకు నివర్తోపాదాన కారణము. అధిష్ఠానమగు త్రాడులేనిచో పాము అనుకొనుటయే తటస్థించదు కావున అధిష్ఠానము (త్రాడు) మాత్రము సత్యము. పాము అసత్యము. ఇదేవిధముగా శుక్తి రజతస్థలములలో ముత్తెపు చిప్పను చూచి వెండి అనుకోనినప్పుడు అధిష్ఠానమగు ముత్తెపు చిప్పయందు (అధిష్ఠానము యొక్క) అజ్ఞానముచే వెండిని కల్పించినప్పుడు (సృష్టించినపుడు) ఈకల్పనకు

అధిష్ఠానమగు ముత్తెపుచిప్ప, కల్పితమైన వెండికి వివర్తోపా దానకారణము. అధిష్ఠానమగు ముత్తెపుచిప్ప లేనిచో వెండి అనుకొనుటయే తటస్థించదు. అధిష్ఠానమగు ముత్తెపుచిప్ప మాత్రము సత్యము. కల్పితమైన వెండి అసత్యము. ఇట్టి భ్రాంతిస్థలములలో అంతటను అధిష్ఠానము సత్యమయిన దనియు, (ఉండితీరవలసినది.) కల్పితమైనది అసత్యమైన ధనియు తెలియవలెను.

ప్రకృతములో సత్యమగు బ్రహ్మమునందు మాయచే అధిష్ఠానము యొక్క (అజ్ఞానముచే) కల్పితమైన జగత్తునకు బ్రహ్మము వివర్తోపాదాన కారణము. అధిష్ఠానమగు బ్రహ్మ సత్యము. కల్పితమైన జగత్తు అసత్యము అని తాత్పర్యము.

ఫలితము : వెనుకటి రెండు ఉదాహరణములలో కల్పితములయిన పామునకు, వెండికి, వివర్తొపాదాన కారణములు త్రాడును, ముత్తెపుచిప్పము అయియున్నవి. కావున అధిష్ఠానములగు త్రాడును, ముత్తెపుచిప్పను తెలియజెప్పుటకు ఏది పామో (అనగా దేనిని పామనుకొంటివో) అది త్రాడు. ఏది వెండియో (దేనిని వెండి యని అనుకొంటివో) అది ముత్తెపుచిప్ప అనునట్లు ప్రకృతములో సత్యమయిన అధిష్ఠానము, వివర్తొపాదాన కారణముఅగు బ్రహ్మమునకు మాయచే కల్పితమైన జగజ్జన్మాది కారణత్వమును పురస్కరించుకొని ఏది జగజ్జన్మాది (కల్పనాధిష్ఠానమో) కారణమో అది బ్రహ్మమని బ్రహ్మమునకు తటస్థలక్షణము, జగజ్జన్మాది కారణత్వము. ఈలక్షణము వెనుకటివలెకాక, దేవదత్తగృహన్యాయముగ బ్రహ్మ మును స్పృశించకయే, బ్రహ్మమును తెలియజేయును గాన తటస్థలక్షణము అని వ్యవహారము. వివర్తొపాధానము కాన ఉపాదాన కారణము అను వ్యవహారమును సంగతమే.

బ్రహ్మమునకు స్వరూప లక్షణము: "సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అనునది. (తైత్తిరీయోపనిషత్.) ఈశ్రుతి లోని సత్య, జ్ఞాన, అనంత పదములు మూడును కూటస్థము, చిద్రూపము, అద్వితీయము అగు బ్రహ్మమును చెప్పుచున్నవి. తదుక్తం పూర్వాచార్యైః. "కౌటస్థ్యమేవ సత్యత్వం స్ఫురణం జ్ఞానముచ్యతే! అనంత్య మేక తాచైవం బోధ్యతే బ్రహ్మ తై స్త్రిభిః||"

ఈ మూడింటిలో ప్రత్యేకముగా ఒక్కొక్కటియే బ్రహ్మమునకు లక్షణమని కొందరిమతము.

సత్యత్వాదిధర్మములు బ్రహ్మమునకు స్వరూపలక్షణము లగుచో బ్రహ్మమునకు సత్యత్వాది ధర్మసంబంధ ముండవలెను కదా ! అట్లైనచో "అసంగో హ్యయం పురుషః" ఇత్యాది వాక్యములచే బ్రహ్మమునకు ఏ సంబంధము లేనటుల బోధించునట్టి శ్రుతులతో విరోధ మేర్పడదా అను ప్రశ్నకు సమాధానము : లోకములో భుజించిన అన్నమును జీర్ణము చేయుటకు సేవించిన ఔషధము అన్నమును జీర్ణముగావించి తానుకూడ ఎట్లు జీర్ణమగునో, మరియు నీటి యొక్క కాలుష్యమును తొలగించుటకు నీటియందుంచిన ఇండుగు చూర్ణము కాలుష్యమును తొలగించి తానుకూడ ఎట్లు నివృత్తమగునో అటులనే సత్యజ్ఞానాది శబ్దములచే చెప్పబడు సత్యత్వాది ధర్మములు మిథ్యా భూతములయిన అజ్ఞానతత్కార్యములను నిర్వర్తింప జేసి అఖండబోధరూపమగు బ్రహ్మమునకు ఉపలక్షకములగుచు (బోధకములగుచు) సత్యత్వాది ధర్మములుగూడ అవిద్యా కార్యములగుటచే (మిథ్యాభూతములు కావున) ఆ ధర్మములుకూడ నివృత్తము లగును. అందుచే బ్రహ్మ నిర్ధర్మమైనదికాన అసంగత్వాది శ్రుతులతో విరోధము లేదు. ప్రశ్న: బ్రహ్మమునుండి సత్యత్వధర్మము నివృత్తమైనచో బ్రహ్మమునకు మిథ్యాత్వము సంభవింపదా అనినచో సమాధానము : లోకములో నీటియందుంచిన ఇండుగు చూర్ణముచే తొలగిపోయిన నీటికాలుష్యము, ఇండుగు చూర్ణము, నివృత్తమైన పిదప తిరిగి ఎట్లురాదో; మరియు ఔషధముచే జీర్ణమైన అన్నము ఔషధము, జీర్ణమైన పిదప, తిరిగి అజీర్ణము ఎట్లుకాదో, అటులనే ప్రథమములో సత్య జ్ఞానాది పదములచే బ్రహ్మమునందు నివృత్తమైన అజ్ఞానాదులు సత్యత్వాది ధర్మములు నివృత్తములైన పిదప నీటికాలుష్యమువలె తిరిగి రానేరవు. కాన బ్రహ్మమునకు మిథ్యాత్వము ప్రసక్తము కానేరదు.

సత్య - జ్ఞాన - అనంత శబ్దములు మూడును ప్రత్యేకముగా బ్రహ్మమునకు మూడులక్షణములుగా చెప్పబడినవి. ఇదేవిధముగా "విజ్ఞాన మానందం బ్రహ్మ" "అత్రాయం పురుష స్స్వయం జ్యోతి ర్భవతి పూర్ణమదః పూర్ణమిదం” ఇత్యాది శ్రుతులలో ఆనంద, స్వయంజ్యోతిః, పూర్ణాదిశబ్ద


ములు బ్రహ్మమునకు ప్రత్యేక లక్షణములుగా చెప్పబడు చున్నవికదా ! బ్రహ్మ మొక్కడే యగుచో ఇన్ని లక్షణములు దానికి చెప్పుట ఎందులకు? అనేక లక్షణములు చెప్పుటచే బ్రహ్మమునకు (నానాత్వము) అనేకత్వము సంభవింప కుండునా అను ప్రశ్నమునకు సమాధానము - విద్యారణ్య భాష్యములో "బ్రహ్మణి నివర్తనీయానాం పురుష భ్రాంతీనాం బహువిధ త్వేనలక్షణబాహుళ్యం! న త్వేతావతా బ్రహ్మణో వివిధత్వమస్తి నిర్విశేషమేవ సర్వైరపి లక్షణైః ప్రతిపాద్యతే॥" అని చెప్పబడినది. బ్రహ్మము విషయములో నివారింపదగిన పురుషభ్రమలు బహువిధములగుటచే అన్ని భ్రమలను తొలగించుటకు పెక్కు లక్షణములు చెప్పబడినవి. అంతమాత్రము చే బ్రహ్మమునకు బహువిధత్వము సంభవము కాదు. ఎందుచేతనన, సర్వలక్షణములచేతను నిర్విశేషమగు బ్రహ్మమే చెప్పబడుచున్నది. కాని సవిశేషమైన బ్రహ్మము చెప్పబడుట యేలేదు. కావున లోకులు సుఖముగ తెలిసికొనుటకే అనేక లక్షణములు చెప్పబడినవి. కాబట్టి బ్రహ్మమునకు నానాత్వము కలుగదు.

బ్రహ్మమునకు ప్రమాణము : వస్తుసిద్ధి సాధనములగు లక్షణ, ప్రమాణములలో బ్రహ్మలక్షణములను చెప్పినపిదప బ్రహ్మవిషయములో ప్రమాణ నిరూపణము చేయవలసి యున్నది. వస్తుజ్ఞానమునకు సాధనముగ వ్యవహరింపబడు చతుస్సు, శ్రోత్రము, వాక్కు మున్నగు ఏ యింద్రియములకును ఆత్మ గోచరించునదికాదు. ఇంద్రియ మనస్సుల చేతనే సర్వవస్తువులను తెలిసికొనవలెనుగాని ఉపాయము లేదు. అట్టి ఆత్మను తెలిసికొనరీతియు శిష్యులకు ఉపదేశించు విధానమును తెలియుటలేదు. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములచే బ్రహ్మమును తెలిసికొనుటకు శక్యముకాదు అని ఇట్లు అనేక శ్రుతులు వక్కాణించుచున్నవి.

కేనోపనిషత్తులో "నతత్ర చక్షుర్గచ్ఛతి, న వాగ్గచ్ఛతి, నోమనః, నవిద్మో, నవిజానీమో యధైత దనుశిష్యాత్ "కే.ఉ.3. “యచ్చక్షుషా న పశ్యతి” “యచ్ఛోత్రేణ నశ్రుణోతి" కే. ఉ. 7. 8.

"నచక్షుషా పశ్యతి కశ్చవైనం" తై. ఉ. 5. 1.

“యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ !" తై. ఉ. 3. 11.

“యదాహ్యేవైష - అదృశ్యేఽ. నాత్మ్యేఽనిరుక్తే" తై. ఉ.3.

ఇక బ్రహ్మమును తెలిసికొనుట ఎట్లన: బృహదారణ్యకములో "తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి' "ఉపనిషత్స్వ వాధిగతః ఔపనిషదః" అను రీతి శాకల్యుని గూర్చి యాజ్ఞవల్క్యునిచే పలుకబడిన ఈ వాక్యముచే పరబ్రహ్మరూపుడగు పురుషుని ఉపనిషత్ప్రమాణముచేతనే తెలిసికొనవలెనని ప్రతీతమగుచున్నది. మరియు "అణోరణీయాన్—ధాతుఃప్రసాదా న్మహిమాన మీశం" అను శ్రుతి 'అధికారసంపత్తికల పురుషుడు ఈశ్వర కటాక్షమువలన పరమాత్మను తెలిసికొనును' అని బోధించుచున్నది.

'పూర్వాచార్యైరప్యుక్తం ఈశ్వరానుగ్రహా దేషాం పుంసా మద్వైతవాసనా” ఈశ్వరానుగ్రహము వలన మానవునకు ఆత్మ సాక్షాత్కారము లభించునని పూర్వాచార్యులు సెలవిచ్చిరి. మరియు

"తద్విజ్ఞానార్థం సద్గురు మేవాభిగచ్ఛేత్" అను శ్రుతి ఆత్మవిజ్ఞానముకొరకు సద్గురుసన్నిధి కేగవలెను, సద్గురుకటా క్షమువలన ఆత్మజ్ఞానము లభించును అని బోధించుచున్నది.

బ్రహ్మవిషయములో ప్రమాణమును చెప్పుట ప్రకృతము కాగా, ‘ఔపనిషదం' అనుశ్రుతి. ఉపనిషత్తులచే పరమాత్మ తెలిసికొనదగినవాడని బోధించుచున్నది. 'ధాతుః ప్రసాదాత్ ' అనుశ్రుతి - ఈశ్వరానుగ్రహముచే బ్రహ్మజ్ఞానము ప్రాప్తమని బోధించుచున్నది. 'గురుమేవాభిగచ్ఛేత్ ' అను శ్రుతి.ఆచార్యకృపచే బ్రహ్మజ్ఞానము ప్రాప్యమని బోధించు చున్నది. ఈ విధముగ ఈ మూడు శ్రుతులు ఒకే బ్రహ్మమును తెలిసికొనుటకు విరుద్ధములైన వేరు వేరు ఉపాయము లను (ఉపనిషత్తులను, ఈశ్వరానుగ్రహమును, ఆచార్యాను గ్రహమును) చెప్పుటచే ఈ మూడింటిలోను దేనివలన ఆత్మజ్ఞానము లభించును అనినచో సమాధానము "న బహునా శ్రుతేన"అను శ్రుతి వ్యాఖ్యలో ఆనందగిరులవారు 'పరమేశ్వరాఽఽచార్యానుగృహీతేన తు లభ్యతఇత్యాహ' ఈశ్వరానుగ్రహము, ఆచార్యానుగ్రహముతో గూడిన ఉపనిషత్ జ్ఞానముచేత ఆత్మజ్ఞానము లభించునని స్పష్టముగ వ్రాసియుండుటచే పై శ్రుతులకు నిరోధముగాని, వికల్పముగాని లేదనియు ఈ మూడును ఆవశ్యకములనియు స్థిరమగుచున్నది.

ఫలిశ మేమన : బ్రహ్మజ్ఞానమునకు ముఖ్యప్రమాణము ఉపనిషత్తులనియు, ఈశ్వరాచార్యానుగ్రహములు సహకారులనియు, మొత్తము మూడును ఆవశ్యకములనియు సిద్ధమైనది. కాన విరోధము లేదు.

బ్రహ్మమునకు స్థాననిర్ణయము : ఈ విధముగా తెలిసికొనదగిన లక్ష్యమగు బ్రహ్మమునకు లక్షణ ప్రమాణము లను చెప్పిన పిదప ఆ బ్రహ్మమునకు అభివ్యక్తిస్థాన నిర్ణయము ఉపనిషత్తులలో "యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్న్" "పరేణ నాకం నిహితం గుహాయాం" (తై. ఉ. నా. 12.) ఇత్యాద్యనేక శ్రుతులు గుహయందు ఆత్మదర్శనము లభించునని నిర్విశేషముగ చెప్పుచున్నవి. అనగా సర్వజగదాధారమగు బ్రహ్మమునకు గుహయందు కూర్చుండుట సంభవించదుగాన ఆధారాధేయ భావరూపముగ బ్రహ్మము అక్కడ కూర్చున్నది అని తాత్పర్యము కాదు. ఇక మన సూర్యరశ్మి అంతట వ్యాపించినను అద్దమునందే ప్రతిఫలించునుగాని కఱ్ఱలు, శిలలు మున్నగు వాటియందు ఎట్లు ప్రతిఫలించదో, అటులనే, ఆత్మ అంతట వ్యాపించియున్నను గుహయందు గోచరించును గాని ఇతరత్ర దృశ్యము కాదని తాత్పర్యము.

గుహాశబ్దార్థము : వ్యాకరణశాస్త్ర ప్రక్రియానుసారము "గుహూసంవరణే" అను ధాతువు వలన నిష్పన్నమయిన గుహాశబ్దమునకు సంవృతమైన దేశమని అర్థము కావుననే పర్వతగుహ అను పదమునకు సంవృతమైన పర్వతబిల పరముగ వ్యవహారము కలదు. ప్రకృతములో శ్రీ విద్యారణ్య యతీంద్రులవారు.

“దేహాదభ్యంతరః ప్రాణః, ప్రాణాదభ్యంతరం మనః
తతః కర్తా తతో భోక్తా, గుహోసేయం పరంపరా."

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు అయిదు. వీటి యొక్క పరం పరయే ఇక్కడ గుహాశబ్దమునకు అర్ధము అని సెలవిచ్చిరి. దీనిచే మనుష్య దేహములో సంవృతములయిన అన్నమయాది పంచకోశములకు లోపల ఆత్మ అభివ్య క్తమగునని స్పష్టమగుచున్నది. కావున కోశముల స్వరూప మిట్లు సంకుచితముగ వివరింపబడినది.

అన్నమయ కోశము : స్థూలదేహమునకే అన్నమయ కోశము అను వ్యవహారము సుప్రసిద్ధము. ఇది పంచీకృత మహాభూతములచే నిర్మితమయినది. కాన దృష్టికి గోచరించును. ఇక సత్వ, రజ, స్తమోగుణాత్మకమగు మాయ యొక్క తమోగుణ భాగము చేతనే ఈ స్థూలదేహము సృజించబడినది గాన ఇందు తమోగుణ ధర్మమగు జాడ్యమే కన్పట్టు చున్నది కాని క్రియాశక్తి గాని, జ్ఞానశక్తి గాని లేదు. దీనినిగూర్చి ఛాందోగ్యోపనిషత్తు(ఛా. 6-5-1) నందు “అన్న మశితం త్రేధా విధీయతే, తస్య యస్స్థవిష్ఠాధాతు స్తత్పురీషం, యో మధ్యమ స్తన్మాంసం, యోఽణిష్ణస్త న్మనః"అని చెప్పబడినది. తా. మనచే భుజింపబడిన అన్నము శరీరములో మూడు విధములుగా విభజింపబడును. (స్థూలము, మధ్యమము, సూక్ష్మము). వాటిలో స్థూల భాగము పురీషము (మలము) గను, మధ్యభాగము మాంసముగను, సూక్ష్మభాగము మనస్సుగను మారును.అనగా మనస్సుకు బలము నిచ్చును. ఇవ్విధముగా ఇతరత్ర బహు విపులముగా స్థూలదేహమునకు అన్నమయ కోశమను వ్యవహారమును స్థిరపరచిరి.

ప్రాణమయ కోశము : ప్రాణాపానాదివృత్తి సమూహ రూపమయినది ప్రాణమయ కోశము. ఈ కోశము మొదలు కొని అపంచీకృత భూతములచేతనే సృష్టి జరుగును. కావుననే స్థూల దేహమువలె ఇది దృష్టికి గోచరముగాదు. ఈకోశము కేవలము రజోగుణభాగముచే నిర్మింపబడినది కావున దీనియందు చలనాత్మకమగు క్రియ కనబడుచున్నది. దీనిని గూర్చి ఛాందోగ్యములో "ఆపః పీతాస్త్రేధా విధియంతే, తత్ర యస్థవిష్ఠాధాతు స్త న్మూత్రం, యో మధ్యమ స్త ల్లోహితం, యోఽణిష్ఠన్న ప్రాణః"అనిచెప్పబడినది. మనము త్రాగిన ఉదకములో స్థూలభాగము మూత్రముగను, మధ్యమ భాగము రక్తముగను, అతి సూక్ష్మభాగము ప్రాణముగను మారును. అనగా ప్రాణమునకు వృద్ధి నిచ్చును అని తెలియుచున్నది.

మనోమయకోశము: అవశిష్ట (మాయ యొక్క) సత్త్వ గుణభాగమే మనోమయాది కోశములు మూడింటికిని కారణముగాన ఆమూడు కోశములందును జ్ఞానశక్తి ఉప లభ్యమానమగుచున్నది. సంకల్ప వికల్పాది సమూహాత్మకమగు మనోమయ కోశము తమోగుణమిశ్రమయిన సత్త్వ గుణాంశముచే నిర్మింపబడినది కాన, దీనికి రాగద్వేషాది తామస ధర్మములే కానవచ్చును. ఈకోశములో సర్వ

జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు, అంతర్భావ మున్నను అందు మనస్సునకుగల ప్రాధాన్యముచే దానికి మనోమయశబ్దముచేతనే వ్యవహారము కలదు.

విజ్ఞానమయకోశము : రజోగుణ మిశ్రమగు సత్త్వ గుణము విజ్ఞానమయ కోశమునకు కారణము. ఈకోశము నందు యజ్ఞాది వైదిక కర్మలకును, కృష్యాది లౌకిక కర్మలకును, కర్తృత్వము కనిపించుచున్నది. ఇది 'అహం కర్తా' అని అనుభూయమాన మగుచున్నది. ఈవిషయమే బ్రహ్మ వల్లీలో “విజ్ఞానం యజ్ఞం తమతే కర్మాణి తను తేపిచ" (తై. ఉ. బ్ర.) అని చెప్పబడుచున్నది. సత్త్వగుణ కార్యమగు జ్ఞానశక్తియందు రజోగుణముతో కలిసిన భాగము రాజసమగు కర్తృత్వాది ధర్మముతో కూడినదై విజ్ఞాన మయమయినది. విద్యారణ్య భాష్యమునందు "సర్వవ్యవహారగోచర జ్ఞాన, క్రియా, శక్తియుక్తో విజ్ఞానమయ ఇతి సిద్ధం" అని కలదు. సర్వ వ్యవహారగోచరమగు జ్ఞాన క్రియాశక్తులతో కూడు కొనినది విజ్ఞానమయ కోశము అని దీని తాత్పర్యము.

వృత్తి మాత్రరూపములగు మనోమయ, విజ్ఞానమయ కోశములకు అన్నమయ ప్రాణమయములవలెనే పృథక్తత్వ రూపత్వము (భిన్నరూపత్వము) లేకపోవుటవలనను, వృత్తి రూపములు కాన (అనేక వృత్తులు ఏక కాలమునందు పుట్టవు కావున) భిన్న కాలికములు (వేరు వేరు కాలములందు జనించునవి) అగుటవలనను, ఈగుహలో అంతర్బహిర్భావము మనోమయ, విజ్ఞానమయ కోశములకు ఎట్లు యుక్తమగును అన్నచో సమాధానము : రెండుకోశములు వృత్తిరూపము లయినను మనోమయ కోశమును కరణరూపముగను, విజ్ఞానమయ కోశమును కర్తృరూపముగను నిరూపించుటచే, కరణత్వ కర్తృత్వధర్మములు ఒక వస్తువునందుండవు కావునను, భిన్ననిష్ఠములు కావునను, ఈ రెండింటికిని వేరు వేరు తత్త్వములుగ వ్యవహారము, అంతదృహిర్భావము సిద్ధించుటలో విరోధము లేదు.

ఆనందమయకోశము : శుద్ధ సత్త్వగుణము ఆనందమయ కోశమునకు కారణముగాన ప్రియాది శబ్దములచే వ్యవహరింపబడునట్టి సుఖవిశేషములే కనుపించును. వాస్తవములో మనోమయాది కోశత్రయమునందును జ్ఞానశక్తి ఒక్కటియే కలదు. అయినను అవాంతర భేదములచే అది కరణశక్తి, కర్తృ శక్తి. భోగశక్తి అను మూటి యందు మూడు విధములుగా వ్యవహరింపబడుచున్నది. ఈ విధముగా గుహాశబ్దవాచ్యమగు పంచకోశ వివరణానంతరము శరీరములోని పరమేశ్వరుని ఉపాసనకు స్థాన నిర్దేశము చేయదగినది.

స్థాన విశేషము : తైత్తిరీయోపనిషత్తులో "అనంత మవ్యయం కవిగ్ం సముద్రేస్తం విశ్వశంభువం | పద్మకోస ప్రతీకాశగ్ం హృదయంచా వ్యథోముఖం | అథోవిస్ట్యావి తస్త్యాంతే నాభ్యాము పరితిష్ఠతి 1 జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహత్ | సంతతగ్ం శిలాభిస్తులంబత్యా కోశసన్నిభం ! తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ థ్సర్వం ప్రతిష్ఠితం | తస్యమధ్యే మహానగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః : సోగ్రభు గ్విభజన్ తిష్ఠ న్నాహార మజరః కవిః ! తిర్యగూర్ధ్వ మధశ్శాయీ రశ్మయ స్తన్యనంతతా | సంతాపయతి స్వ౦దేహ మాపాదతలమస్తగః | తస్యమధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయద మధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వరా | నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా ! తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః | స బ్రహ్మ స శివ స్స హరి స్సేంద్ర స్పోక్షరః పరమ సస్వరాట్" అని కలదు. ఇట సహస్ర శీర్ష మిత్యాది - అనంత మవ్యయం కవిగ్ం వరకు గల మంత్రములచే ఉపాసన చేయదగిన పరమేశ్వర స్వరూపమును చెప్పి, 'పద్మకోశ ప్రతీకాశగ్ం' అనునది మొదలు 'పరమాత్మా వ్యవస్థితః' అను దానివరకు గల వానిచే ఉపాసనకు స్థానమును శ్రుతి వర్ణించుచున్నది. భావమేమనగా ఈ శరీరములో కంఠ గ్రంథికి క్రిందుగ నాభికి 12 అంగుళములు (3 బెత్తలు) ఊర్ధ్వభాగమున లౌకిక పద్మకోశ (ముకుళ) సదృశమగు హృదయ పుండరీకము అధోముఖముగ నుండును. అది జ్వాలామాలలచే వ్యాప్తమయి ప్రకాశించుచుండును. అది సమస్త జగత్తునకు స్థానము (అనగా సమస్త జగత్తునకు ఆధారమగు పరమేశ్వరునకు అభివ్యక్తి స్థానము గాన సమస్త జగత్తునకు స్థానము). అది 101 ప్రధాన నాడులచే వ్యాప్తమైనట్లు క్రింది శ్రుతి వర్ణించుచున్నది. "శతంచై కాచ హృదయస్య వాడ్య స్తాసాం మూర్ధాన మభినిస్సృతై కా తయోర్ధ్వమాయ న్నమృతత్వ మేతి" హృదయమునకు సంబంధించిన ప్రధాన నాడులు 101. వాటిలో 1 సుషుమ్న అను నాడి ఊర్ధ్వముగా బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపిం చినది. ఆ నాడీ ద్వారమున (మార్గమున) యోగశక్తిచే ఊర్ధ్వముగ (ప్రాణము) వెడలు మానవునకు అమృతత్వము (మోక్షము) లభించును' అని ఈ శ్రుతి తాత్పర్యము. అట్టి హృదయ సమీపమున సూక్ష్మ రంధ్రము (సుషుమ్న అను నాడీనాళము) కలదు. దీనిని గూర్చి అధర్వవేద భాష్యములో-"మధ్యస్థాయాః సుషుమ్నా యాః పంచ పర్వసు సంస్థితాః| శాఖోపశాఖతాం ప్రాప్తా స్సిరా లక్షత్రయాత్పరం అర్థలక్షమితి ప్రాహు శ్శరీరార్థ విచారకాః" అని కలదు.

హృదయ పుండరీక మధ్యమున నున్న సుషుమ్న అను నాడికి 5 పర్వములందు శాఖోపశాఖలుగా నాడులు మూడు లక్షలకు పైగా నున్నవనియు, శరీరమందలి పదార్థ విమర్శకులు 50 వేలున్నవని చెప్పుచున్నారనియు ఈభాష్య భావము.

ఈ సుషుమ్నయను నాడీరంధ్రమున మనస్సు ప్రవేశించగనే సర్వజగత్తునకు ఆధారమగు బ్రహ్మము అభివ్యక్తమగును. ఆ నాళము యొక్క మధ్యభాగమందు బహుళ జ్వాలో పేతమై ప్రౌఢమైన అగ్ని సర్వనాడుల యందును సంచరించుటచే బహువిధములైన ముఖములు కలిగి, తనకు పురోభాగమున సంప్రాప్తమయిన అన్నమును భుజించుచు, భుక్తమైన ఆహారమును సర్వావయవములందు విభజించుచు, (ప్రసరింప జేయుచు) నుండును. ఈ అర్థమునే భగవద్గీతలో అహం వై శ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః ! ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం ఛతుర్విధం " అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చెను. ఇట్టి అగ్నిదేహము నెల్ల (పాదతలము మొదలు శిరస్సు పర్యంతము) ఎల్లప్పుడును తపింపజేయుచున్నది. శరీరగతమగు బాహ్య సంతాపమే లోపల అగ్ని కలదనుటకు చిహ్నము. ఈ విధముగా జ్వాలా విశేషములచేత సంపూర్ణ దేహమును వ్యాపించియున్న అగ్ని మధ్యభాగమందు అత్యంత సూక్ష్మమగు ఒక జ్వాల సుషుమ్న యను నాళము ద్వారమున ఊర్ధ్వముగా బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించియున్నది. ఆ అగ్నిజ్వాల నీలమేఘ మధ్యగతమైన మెరుపు తీగవలె ప్రకాశించుచున్నది. మరియు అది నివ్వరిధాన్యము యొక్క అగ్రమువలే బహు సూక్ష్మమై అత్యంత సూక్ష్మవస్తువులకు ఉపమానమగుచు పచ్చగా ప్రకాశించుచున్నది. పూర్వోక్త వహ్ని శిఖ యొక్క మధ్యభాగమందు పరమాత్మ ఉండును (అనగా ఆ స్థానమునందు అభివ్యక్తమగును) అని తెలియనగును.

ఇట్లు సర్వజగత్కారణమగు పరబ్రహ్మము యొక్క ఉపాసనకు అల్పస్థానము చెప్పబడినను, ఆ పరమాత్మ స్వయముగ అల్పుడుకాడు. అతడు సర్వదేవతా స్వరూపుడని శ్రుతి చెప్పుచున్నది. 'సబ్రహ్మ స్వరాట్' ఆ పరమాత్మయే చతుర్ముఖుడగు బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అక్షరుడు (అనగా జగత్కారణమగు మాయతో విశిష్టమైన అంతర్యామి). అతడు పారతంత్య్ర రహితుడు కావున స్వయముగా విరాజమానుడు అని అర్థము. ఈ శ్రుతి వలన అన్న మయాది కోశ పంచకము లోపల గల హృదయ పుండరీకమునందు పరమేశ్వరుడు సాక్షాత్కారమగుననియు, శమాది సాధనసంపన్నుడును అధికారియునైన పురుషునకు పరమాత్మ యొక్క వేదనముచే (సాక్షాత్కారముచే) పునరావృత్తి రహితమగు మోక్షరూప పురుషార్థము సిద్ధించుననియు, దీనికి మూల ప్రమాణము సర్వ ప్రమాణ మూర్థన్యములగు ఉపనిషత్తులనియు సిద్ధమైనది.

ఉ.గ.సా