Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జ వర్గీకరణము

వికీసోర్స్ నుండి

ఉద్భిజ్జవర్గీకరణము : శ్రీ గిరిజాప్రసన్న ముఖర్జీ 1945 సం॥ నాగపూరులో జరిగిన సైన్స్ కాంగ్రెస్ లో తమ అధ్యక్షోపన్యాసములో సోక్రటీస్, అరిస్టాటిల్ కన్న ఎంతో కాలముముందే భారతీయులు వృక్షశాస్త్రములో నిపుణులుగా నుండిరని చెప్పెను. కాని దురదృష్టవశాత్తు ఐరోపా, అమెరికా చరిత్రకారులు విజ్ఞానశాస్త్రము లన్నియు గ్రీసు, రోము దేశములలోనే ముందు పుట్టినవని అందురు. హిందూ దేశము యొక్క ప్రాచీన గ్రంథములను చదువకపోవుటయే దీనికి కారణమని తెలియు చున్నది. వృక్షశాస్త్ర చరిత్రలో ఒక చోటనైనను భారతీయుల నామము మచ్చుకైనను కనబడదు. కీ॥ శే॥ బీర్బల్ సహాని "పాశ్చాత్యులు కృతజ్ఞతా పూర్వకముగ ఒప్పుకోకున్నను మన శాస్త్రము వారి కెంతయో విజ్ఞానము నిచ్చెదనని చెప్పెను. కాని మన దేశములో ప్రాచీన వృక్షశాస్త్ర చరిత్రలో శ్రీ గిరిజా ప్రసన్న ముఖర్జీ వ్రాసిన 'ఉపవాస వనస్పతి వినోద'మను గ్రంథము తప్ప వేరొకటి లేనందున ఈ శాస్త్రము పశ్చిమ దేశమునందే వెలసినట్లు కనబడుచున్నది.

సోక్రటీస్, ఆరిస్టాటిల్ ఉద్భిజ్జములను ఓషధులు (herbs), వృక్షములు (trees) అను రెండు భాగములుగా విభజించిరి. వీని తరువాత ఈ శాస్త్రము 16 వ. శతాబ్దము వరకు అయోమయస్థితిలో నుండెను. 16 వ శతాబ్దములో పుశ్చియస్, బ్రూమ్ ఫెల్ మొదలగు వైజ్ఞానికులు ఎందరో పుట్టిరి కానీ ఇంతవరకు ఉద్భిజ్జవర్గీకరణము కృత్రిమ పద్ద తుల పైననే ఆధారపడి యుండెను. 16 వ శతాబ్దాంతమున 'ఇటలీ దేశముయొక్క సిశాల్పినో తొలిసారి ఈ వర్గీ కరణములో అండములకు మరియు బీజములకు ప్రాముఖ్యము నిచ్చి శాస్త్రపూర్వకమైన విభజనమును కల్పించెను.

18 వ శతాబ్దములో లిన్నియస్ అను స్కాండి నేవి యను వృక్షశాస్త్రవేత్త వృక్షవిభజనము యొక్క మూలాధారములను పునః పరిశీలనము గావించి ఒకే సంతతికి చెందినవాని నన్నింటిని ఒక జాతిలో చేర్చి 'స్పీషీజ్' (Species) అని పేర్కొనెను. 'స్పీషిజ్'ను ఎ. యస్. దోషువా "జాతిపరంపరగా పుట్టిన వ్యక్తు"లని వర్ణించెను. ఉదా. వివిధములైన మామిడిచెట్లు ఒకే జాతికి (species) చెందినవి. ఈ విధముగానే ఒక పోలిక గల జాతులన్నింటిని ఒక గణము (genus) లో చేర్చెను. ఒక గణములోగల బాతుల ఆకారము ఒకే విధముగా నుండి అక్కడక్కడ పరిస్థితులను బట్టి కొంత మార్పు చెందుచుండును. ఇట్లు లీనియస్ ఉద్భిజ్జవర్గీకరణములో జాతి, గణము అను విభాగములను ప్రవేశ పెట్టెను. ఏదైన ఒక జాతిని గుర్తించుటకు దాని అంగవర్ణనము అవసరము లేకుండా దాని గణము పేరు, జాతి పేరు కలిసి రెండు శబ్దములు గల ఒక నామమును కల్పించెను.

లీనియస్, వృక్ష విభజనములో కేసరముల యొకయు, అండాశయముల యొక్కయు, సంఖ్యలకు ఎక్కువగా ప్రాముఖ్యము నిచ్చేను. కనుక ఈ విభజనము లింగసంబంధమగు వర్గీకరణ మనబడును. 'కేసరముల యొక్కయు అండాశయముల యొక్క యు సంఖ్యలను బట్టి వృక్షములను విభజించుట కృత్రిమ పద్ధతియే యగును. పోలికలను వంశావళినిబట్టి చేసిన వర్గీకరణము స్వాభావికముగా నుండును. లీనియస్ మొట్టమొదట చెట్లను ప్రాకృతికముగా విభజించుటకు ప్రయత్నించెను. ఆయన గణముల (Genera) ను మాత్రమే ఇట్టి విధముగా కూర్చెను. కాని ఆయన చేసిన విభజనములో ఎక్కువ భాగము ప్రాకృతికముగా లేదు. అప్పటినుండియు పోలికలనుబట్టి చెట్లనన్నిటిని కుటుంబములు (Families) గసు, కుటుంబములను సమూహములు (Orders) గను, సమూహములను ప్రసమూహములు (Cohorts) గను, ప్రసమూహములను శ్రేణులు (Series) గను, శ్రేణులను తరగతులు (Classes) గను, తరగతులను భాగములుగను కూర్చుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. ఉద్భిజ్జములు మొదట రెండు పెద్ద భాగములుగా విభజింపబడినవి.

ఉద్భిజ్జములు మొదట రెండు పెద్ద భాగములుగా విభజింపబడినవి.

పుష్పరహితములు (Cryptogams) (వీనిలో లింగసంబంధమగు ఉద్భిజ్జములు ఆవయవములు ఆదృళ్యములు) పుష్పసహితములు (Phanerogams) (వీనిలో పుష్పములద్వారా సంతానోత్పత్తి జరుగును)

పుష్పరహిత ఉద్భిజ్జములు (Cryptogams): ఇవి ఉద్భిజ్జములలో ఎక్కువభాగముగా గలవు. వీనిలో ఏకకణ ఉద్భిజ్జములు మొదలుకొని ఆకారములోను, ఎత్తులోను అంతర్ని ర్మాణములోను పుష్పించు చెట్లను పోలిన ఫెరనులు (Ferns) మొదలగు ఉచ్చజాతి ఉద్భిజ్జములవరకును గలవు.

పుష్పరహిత ఉద్భిజ్జములు మూడు ముఖ్యమైన భాగములుగ విభజింపబడినవి (1) అంగభేదరహిత ఉద్భిజ్జములు (థాలో ఫైటా), (2) నాచులు (బ్రయోఫైటా), (3) పర్ణములు (టెరిడోఫైటా - Ferns).

1. అంగభేదరహిత ఉద్భిజ్జములు (థాలో ఫైటా): ఇందులో ఏకకణ రూపము గలవి మొదలుకొని దారమువలె పొడవుగా లేక గుంపులు గుంపులుగా నుండు (Colonial forms) జాతులవరకు ఉన్నవి. వీనిలో ఆకులు, కాండము, అను అంగభేదములుండవు. బూజులు, జొన్న కంకులకు, గోధుమ పంటలకు పట్టు కాటుకలు, పుట్టగొడుగులు మొద లగునవి థాలోఫైటాకు చెందినవి. దీనిలో కొన్నింటిలో పత్రహరితమను ఆకుపచ్చని పదార్థముండును. దీని సహాయము చేతనే అవి తమ యాహారమును సిద్ధపరచు కొనును. ఇట్టి అంగభేదరహిత ఉద్భిజ్జములను (Algae) శైవలములని యందురు.

2. నాచులు (బ్రయోఫైటా): బూజులలో, కాటుకలలో, పుట్టగొడుగులలో పత్రహరిత ముండదు. ఆవి తమ యాహారమును స్వయముగా తయారు చేసికొనలేవు. కనుక అవి మురుగుచున్న సేంద్రియ పదార్థముల పైన, ఇతర వృక్షములపైన, జంతువులపైన జీవించును. ఇట్టి అంగభేదరహిత ఉద్భిజ్జములను (Fungi) 'శిలీంధ్రములు’ అందురు. వివిధములగు సూక్ష్మజీవులు (Bacteria) కూడ ఈ తరగతికి జెందినవే.

శైవలములు పెక్కు రంగులు గలిగి అనేక విధములుగా నుండును. నీలి-ఆకుకచ్చకలసిన రంగు గలవానిని సైరొ ఫైసీ (cyanophyceae) అనియు, ఆకుపచ్చని రంగుగల వానిని క్లోరోఫైసీ (chlorophyceae) అనియు, నారింజరంగు గలవానిని ఫియోఫై సీ (phaeophyceae) అనియు, ఎఱ్ఱని లేక నేరేడురంగుగలవానిని రోడో ఫైసీ (rhodophyceae) ఆనియు అందురు.

పుష్పరహిత ఉద్భిజ్జములలో రెండవభాగమునకు నాచులు (బ్రయో ఫైటా) అని పేరు. దీనిలో వెడల్పుగా, పత్రాకారము గలిగిన అవయవములతో నున్న ఉద్భిజ్జములును, మరియు పాతగోడలపై మెత్తని దిండులుగా మొలచుచు ఆకులు, కాండము అనుభేదము గల ఉద్భిజ్జములును చేరియున్నవి. మొదటవానిని లివర్ వోర్టు (Liver worts) అనియు మరియు రెండవ వానిని నాచులు (mosses) అనియు అందురు.

లివర్ వోర్ట్సు : ఇవి ఆకులవంటి ఆకారమును కలిగి యుండును. వీని క్రిందిభాగము నుండి వేర్లవంటి ఏకకణపు దారములు బయలుదేరి, భూమిలోనికి పోయి ఆహారపదార్థములను పీల్చును. వీనిలో కాండమువంటి భాగముండదు.

నాచులు : వీనిలో వేర్లు, కాండములు, ఆకులనుబోలిన భాగము లుండును. వీని లోపలి నిర్మాణములో ఎట్టి భేద ముండదు.

3. ఫెరనులు (టెరిడోఫైటా) : పుష్పరహిత ఉద్భిజ్జములలో మూడవ భాగమునకు టెరిడోఫైటా అను జాతి చెంది యున్నది. ఇది పుష్పరహిత ఉద్భిజ్జములలో ఉన్నతజాతికి చేరినది. ఈ ఉద్భిజ్జములలో వేర్లు, ఆకులు, కాండములు స్పష్టముగా నుండుటయేగాక వాని అంతర్నిర్మాణములో గూడ భేదములు కనబడును. ఈ మొక్కలు పుష్పించకపోయి నను ఇతర లక్షణములలో పుష్పించు వృక్షములను బోలి యుండును, కనుక దీనిని ఉన్నత పుష్పరహిత ఉద్భిజ్జము లనియు, వాహికాపుంజములు గల పుష్పరహిత ఉద్భిజ్జములు (Vascular cryptogams) అనియు అందురు. ఉదా॥ ఫెరనులు (Ferns), Clubmosses, Hone-tails మున్నగునవి.

పుష్పనహిత ఉద్భిజ్జములు : ఇవి పుష్పించి విత్తనములను ఉత్పత్తిచేయును, కనుక ఇవి బీజవంతములు (Sper matophyta) అనికూడా అనబడును. కాని కాలక్రమమున రూపాంతరము చెందిన కొన్ని కొన్ని ఫెరనులు(Ferns) కూడ నిత్తనములను ఉత్పత్తి చేయుచుండెను. అట్టి ఫెరనులనుండే పుష్పసహిత ఉద్భిజ్జములు పుట్టెనని తెలియుచున్నది.

పుష్పించు వృక్షములను వివిధ శాస్త్రజ్ఞులు వివిధ విధములుగా వర్గీకరించిరి. వీనిలో మొదటి విభజనము వృక్షము లలో గల ఆకారమునందలి పోలికలపై ఆధారపడి యున్నది. కాని నవీన సిద్ధాంతముల ప్రకారము వృక్షములను వాని సజాతీయ బాంధవ్యముల ననుసరించి కూర్చుట, ఉత్తమ పద్ధతిగా పరిగణింప బడుచున్నది. డార్విన్ సూత్రములను బట్టియు, శిలలపై కన్పడు వృక్షచిహ్నములను బట్టియు ప్రస్తుతపు జాతులన్నియు ప్రాచీన జాతులనుండే పుట్టినవను అంశము స్పష్టమగుచున్నది. వీని నన్నిటిని జాతియుక్తముగా చేర్చుటలో వీని వృద్ధి క్రమమునకును, నిర్మాణక్లిష్టతకును గల సంబంధము అనుసరింపబడెను. కాని కొన్నిటిలో నున్న సూక్ష్మత ఇదివరలో నున్న భాగములు తగ్గిపోవుటవలన కలిగినదనికూడ వారు గ్రహించిరి. వీరి వర్గీకరణములో చెట్ల జాతులను, శ్రేణులను క్రమముగా చేర్చుటకు ఎక్కువగా పుష్పభాగములలోను, ఫలములలోను, బీజములలోను, కణసంహతులలోను గనబడు అభివృద్ధి చిహ్నములు దృష్టిలో నుంచుకొనబడెను.

ఇట్లు ప్రయత్నించుటలో ఎంగ్లర్ ' అను ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు చెట్లను చాలవరకు పరిణామ క్రమముగా చేర్చగలిగెను. పుష్పించు వృక్షములలో కొన్ని, వాని బీజములను ఆకులవంటి అవయవములపై ఉత్పత్తి జేయును. వీనిలో పండ్లు ఉండవు. బీజములు పైకి కనబడుచుండును. వీనిని వివృతబీజవంతములు (Gymnosperms) అని యందురు. వివృత బీజవంతములను ఎంగ్లర్ నాలుగు తరగతులుగా విభజించెను.

(1) పైకడేలిస్ (Cycadales): వీనిలో బీజములపై సన్నని వెండ్రుకలుండును. కేసరములు శంకువు ఆకారముగా నమర్చబడియుండును. ఫలదళములు శంకువులుగా నుండవచ్చును; లేకపోవచ్చును.

(2) గింగోపలిస్ (gingoales): వీని బీజములపై సన్నని వెండ్రుకలుండును. కేసరములు కొన్నింటిలో ఒకటి, మరికొన్నింటిలో కొన్ని సూత్రమే యుండును, ఆకులు సామాన్యముగా నుండి పత్రనతములు చీలియుండును.

(3) కోని ఫెరేలిస్ (Coniferales) : వీని బీజములపై సన్నని వెండ్రుకలుండవు. కేసరములు శంకువుల పైననే యుండును. అన్ని భాగములందును సర్జరసనాళము లుండును.

(4) నీటేలిస్ (Gnetales) : వీని బీజములపై వెండ్రుకలుండవు. కేసరములు శంకువులలో నుండును.వీని యందు సర్జరసనాళము లుండవు.

సంవృతబీజవంతములు (Angiosperms): పుష్పించు వృక్షములలో ఇది రెండవ భాగము, సంవృత బీజవంతము లలో బీజములు బహిరంగముగా నుండక, పండ్లలోపల నుండును. సంవృత బీజవంశముల యొక్క గింజలలో కొన్నింటిలో బీజదళములు రెండు ఉండును. వీనిని 'ద్విదళ బీజకములు' (Dicoty ledons) అందురు. ఉదా॥ మామిడి, చింత, వేరుసెనగ మొదలగునవి. మరికొన్నింటిలో బీజదళము ఒక్కటిమాత్రమే యుండును. దీనిని 'ఏకదళ బీజములు' (Monocoty ledons) అందురు.ఉదా౹౹ జొన్న, మొక్కజొన్న, గోధుమ, వరి, మొదలగునవి.

ఏకదళబీజకములను పదునొకండు ప్రసమూహములు (Cohorts) గా భాగించిరి. ప్రతి ప్రసమూహము (Cohort) లోను కొన్ని కుటుంబము లుండును. ఉదా॥ Glumiphlorae (గ్లూమిఫ్లోరె) అనబడు ప్రసమూహములో Graminae (గ్రామినీ) అనబడు ఒక కుటుంబము కలదు. దీనినే గడ్డిజాతి కుటుంబమని యందురు. వరి, జొన్న, మొక్కజొన్న మొదలయినవి ఈ కుటుంబమునకు జెందినవే. గడ్డిజాతి కుటుంబములో ఎన్నియో గణములు గలవు. వీనిలో Oryza ఒకటి. ఈ గణములో Sativa అను ఒక జాతి కలదు. అదియే వరిమొక్క. అందుకే వరి మొక్క ను 'Oryza Sativa' అందురు. వరిలో Oryza Sativa Pusa T-18, Oryza Sativa Co₁ Oryza Sativa, Krishna Katukalu మొ॥ రకములు

అనేకములు గలవు. ఈ రకములను 'Varieties' అని యందురు.

ద్విదళ బీజకములను రెండు తరగతులుగా విభజించిరి. (1) 'Archichlamy deae' (ఆద్యపరిపుష్పితములు) (2) 'Sympetalae' (సంయుక్త దళబీజములు).

ప్రతి తరగతిలో కొన్ని ప్రసమూహములు గలవు. ప్రతి దానినికుటుంబములుగను, ప్రతీకుటుంబమును గణములుగను విభజించిరి. ప్రతి గణములో ఎన్ని యోజాతులు గలవు. ఉ॥ 'Sympetalae' అను తరగతిలో 'Malvales' అనునది ఒక ప్రసమూహము ‘Cohost'. ఈ 'Malvales' లో 'ఎనిమిది కుటుంబములు కలవు. ఆందులో Malvalae అను ప్రత్తి కుటుంబము ఒకటి. Maivalae లో Gossypium (గాసిపియం) అనునది ఒక గణము. ఈ గణములో ‘herbaceum' అనునది మనము సాధారణముగా చూచు ప్రత్తి మొక్క పేరు. ప్రత్తిలో కూడ ఎన్నియో రకములు గలవు. Gossypium herbaceum B.D. వీనిలో నొకటి. ప్రకృతిలో సహజముగా జరుగు సాంకర్యమువలనను, ఉపయోగకరములగు మొక్కలలో మానవుడు కృత్రిమముగా కలిగించు సాంకర్యమువలనను ఏర్పడిన మొక్కలలో గణములు, జాతులవరకు మాత్రమే ఉద్భిజ్జవర్గీకరణము నిలచిపోకరకములు లేక వంగడములవరకుకూడ సాగినది.

ఉ. స.