Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జ పరిణామము

వికీసోర్స్ నుండి

ఉద్భిజ్జ పరిణామము :

ఏ తెగకు చెందిన జీవినై నను కొన్ని తరములవరకు జాగ్రత్తగాగా పరిశీలించి చూచినచో దాని శరీరమున కొన్ని క్రోత్త మార్పులు వరుసగా కలుగుచుండుట, అమార్పులు తరువాతి తరములకు సంక్రమించుచుండుట మనకు కనబడును. దీనినిబట్టి ప్రాణుల లక్షణములు స్థిరమైనవి కావనియు, కొన్నితరములు గడచునప్పటికి వానిలో శాశ్వతమైన మార్పులు కలుగవచ్చుననియు మనము గ్రహింపవచ్చును. మానవునికృషి ప్రారంభమైనది మొదలు అతనికి ఉపయోగపడుచున్న ప్రాణుల అభివృద్ధిని చూచినచో వానిలో మార్పుకలుగుట కెన్ని అవకాశములున్నవో మనకు తెలియును. నేడు చాలరుచితో పెద్దవిగా నున్న రకరకముల ఆపిల్ పండ్లకు మూలభూతమయిన పండు కొంతకాలము క్రిందట పుల్లగా చిన్నదిగా నుండెనన్నచో అందు కొంతమార్పు కలిగియుండవచ్చునని తెలియును. ఇట్లే సేద్యములోనున్న మొక్కలలో చాల భాగము వాని ఆటవిక వంశకర్త లేవియో చెప్పుటకు వీలులేనంతమార్పు చెందినవి.

అత్యంత ప్రాచీన కాలము నుండియు జీవప్రపంచమంతయు మొదట నిరింద్రియపదార్థమునుండి క్రమముగా చిన్న చిన్న జీవరూపముగా బయలుదేరి, దానినుండి క్రమ పరిణామమూలమున ప్రస్తుతము మన కగపడుచున్న జీవరూపము వచ్చియుండవచ్చునని తత్త్వవేత్తలు పలుమారు ఊహించిరి. కేవలము అట్లు ఊహింపబడుటయే గాక, గత శతాబ్దము నుండియే శాస్త్రదృష్టితో జీవ పరిణామవిషయము పరిశీలింపబడుచున్నది. నేటి జీవరూపములు గతయుగములలోని పూర్వజీవుల రూపముల నుండి క్రమక్రమముగా పొందిన మార్పులవలన పూర్తిగా మారి పురోవృద్ధి చెందినవనుటకును, కొన్నిరూపములు కాలగర్భమున అంతర్ధాన మొందిన వనుటకును తగిన నిదర్శనములు సేకరింపబడుచున్నవి. జీవపరిణామము యథార్థమని జీవ శాస్త్రజ్ఞులందరును ఒప్పుకొందురు. కాని పరిణామవిధానవిషయమున అందరికిని ఏకాభిప్రాయమింకను కుదుర లేదు.

జీవపరిణామము యథార్థమని నమ్ముటకు ఈ క్రింది నిదర్శనములు ఆధారములు :

భూగర్భ నిదర్శనములు  : పాషాణముల మధ్య శిలారూపము చెందిన ఉద్భిజ్జములు, వాని భాగములు, ఈ విషయమున చాల ముఖ్యమైనవి. సమకాలికములయిన పాషాణముల పొరలలో తుల్యములైన రూపములు కనబడు చుండుట వలన భూగర్భశాస్త్రజ్ఞులు ఆయా పాషాణముల కాలము, వానియందున్న శిలారూప వృక్షముల కాలము లెక్క వేయగలిగిరి. వీనినిబట్టి చూచినచో పూర్వ కాలమునుండి ఇప్పటివరకును శిలారూప జీవములలో అభ్యుదయ సూచకమగు మార్పులుండుట, ప్రాత రూపములు నశించుచు క్రొత్త రూపములు పుట్టుచుండుట కాననగును. శిలారూప వృక్షములకును నేటి సజీవ వృక్షములకును గల సన్నిహిత బాంధవ్యము కూడ మనకు అగపడును. భూగర్భ చరిత్రలో మొదటి ఆది కల్పము (Archeozoic Era), ప్రాదికల్పము (Proterozoic Era) అనబడు 140 కోట్ల సంవత్సరముల కాలము వరకు బహుశః ఏకకణ జీవులు, శిలారూప శైవలములు మాత్రమే ఉండియుండవచ్చును.

సుమారు 4750 లక్షల సంవత్సరముల కాలము క్రిందటి నుండి భూగర్భ చరిత్రను పరిశీలించి చూచినచో 'పురాకల్పము' (Paleozoic Era) అనబడు 2750 లక్షల సంవత్సరముల కాలమున, మొదట సముద్రపు శైవలములు, తరువాత భూమిపై నివసించు ఉద్భిజ్జముల శిలారూపములు, దారువాహికలు గల ఉద్భిజ్జములు, గింజలుగల వర్ణములు (ఫెరనులు), నగ్న బీజములుగల ఉద్భిజ్జములు, దేవదారు తెగకు చెందిన వృక్షములు, క్రమముగా భూమిపై అగపడినట్లు విదితము కాగలదు. అటుపిమ్మట 'మధ్య కల్పము (Mesozoic Era) అనబడు 1300 లక్షల సంవత్సరముల కాలములో సుమారు 400 లక్షల సంవత్సరములు గడచిన తరువాత సంవృత బీజవంతములగు వృక్ష ములు అవతరించినవి. కాని దేవదారుజాతివృక్షములే ఎక్కువ వ్యాప్తిలో నున్నవి. క్రమముగా సంవృత బీజవృతముల సంఖ్య ఎక్కువ కాజొచ్చెను. తరువాత 750 లక్షల mసంవత్సరముల కాలము గల 'నూతనకల్పము (Cenozoic Era)' లో సంవృత బీజవృక్షములతో దట్టమగు అరణ్యములు ధ్రువముల దగ్గరకూడ పెరిగినవి. తరువాత పెరుగుటకు ఉష్ణము అవసరమగు ఉద్భిజ్జములన్నియు ధ్రువ ప్రాంతములందు అదృశ్యమైనవి. గుల్మములు, ఓషధులు పిమ్మట అధికము కాజొచ్చెను. ఇంతలో మానవ వికాసమగుటతో ఉద్భిజ్జములలో చాల తెగలు నశించిపోయినవి. మానవ నాగరికతాభివృద్ధితో పాటు పైరులు, కలుపు మొక్కలు అవతరించినవి.

వర్గీకరణ సంబంధమగు నిదర్శనము  : జంతువుల వలెనే నేటి ఉద్భిజ్జములు కూడ క్రమముగా అవతరించినవని ఉద్భిజ్జ వర్గీకరణము రుజువుచేయును. వాటి నిర్మాణమును పరిశీలించినచో వాటి లక్షణములు ఆకస్మికముగ సంభవించి నవి కావనియు, వాటిని పోలియుండు మరికొన్నిటితో కలిసి అవి ప్రత్యేకమగు సమూహములుగా ఏర్పడుచున్నవనియు తెలియును. ఈ విషయములను బట్టి ఒక కుటుంబమునకు చెందిన ఉద్భిజ్జములన్నియు ప్రాయశః ఏదో యొక వంశకర్త నుండి బయలుదేరినవని ఊహింపబడినది.

రూప నిర్మాణ శాస్త్రనిదర్శనము  : ఒక కుటుంబము లోని వివిధజాతులు ఉద్భిజ్జములలో పత్రశిరల కూర్పు, పుష్పభాగముల పరస్పరసంబంధము మొదలగు లక్షణముల పోలికలు చూచినచో అవి అన్నియు ఒకే వంశకర్తయగు ఉద్భిజ్జము నుండి పుట్టినవని చెప్పవచ్చును. ఉదా : సెనగ కుటుంబములో నున్న మొక్కల పుష్పాకారము మొదలగు లక్షణములు. జంతువుల కున్నట్లే మొక్కలకు కూడ ప్రయోజనశూన్యములగు అవయవములు కొన్ని కలవు. ఉదా : అవ శేషకములగు కేసరములు, అవశేషకములగు ఆకర్షణ పత్రములు మొదలగునవి. అవి ఒకప్పుడు బాగుగ అభివృద్ధిచెంది పరిణామక్రమమున నిష్ప్రయోజనములై క్షీణించినవని తెలియుచున్నది.

పిండ సంబంధమగు విదర్శనము : పిండవృద్ధిలో కనబడు పరిణామ నిదర్శనములు జంతువులలో అధికముగా, నున్నవి. ఉద్భిజ్జములలో అవి బహుస్వల్పముగా కనబడును. ఏదైన నొక ప్రాణి యొక్క పిండవృద్ధి క్రమమును పరిశీ లించినచో దాని వంశావళిలో తక్కువ శ్రేణికి చెందిన పూర్వుల లక్షణములను అది మరల కనబరచుచుండును. ఈ విషయమును 'ప్రత్యావర్తనము (Re-capitulation)' అందురు. ముండ్ల జెముడు మొక్క యొక్క మొలక దశ యందు పత్రములుండును. తుమ్మ తెగకు చెందిన మొక్కలకు భిన్నపత్రము లుండును. ఆ తెగకు చెందిన కొన్ని జాతుల మొక్కల యొక్క ఆకు, కాడ పలుచగా వెడల్పుగా నుండి ఆకుపచ్చ రంగు కలిగియుండును. నిజమైన పత్ర భాగము స్వల్పముగా నుండును. ఈ మొక్కల యొక్క అంకురములకు బయలుదేరు మొదటి ఆకులు సాధారణ పత్రములవలె నుండును. ఈ లక్షణము ప్రాయశః వాటి పూర్వ షంక్యుల లక్షణమైయుండును. ఇట్టి విషయములను పరిణామ సిద్ధాంత ప్రకారము కాక వేరొక విధముగా సమర్థించుట కష్టము.

భౌగోళిక వ్యాప్తి విషయక నిదర్శనము : ఉద్భిజ్జముల భౌగోళిక వ్యాప్తిని గూడ పరిశీలించినచో, పరిణామమును బలపరచు నిదర్శనములు కనపడును. ఆటవిక స్థితియందున్న పెక్కు జాతుల మొక్కలు భూమిపై ఎక్కువ భాగము వ్యాప్తిచెందవు. ఉదా : యూకలిప్టసు మొక్కలు ఆస్ట్రేలియా యందును, పొగాకు పశ్చిమ భూగోళము నందును మాత్రమే పెరుగుచుండెడివి. పలు రకములగు అవరోధముల వలన అవి విస్తరింపలేకపోయినవి. వాటి నుండి కాలక్రమమున బయలుదేరిన రకములకు వంశకర్త యొక్క పోలికలు కూడ అదృశ్యములైనవి.

ప్రయోగాత్మక నిదర్శనములు  : ప్రకృతిని జాగ్రత్తతో పరిశీలించినచో క్రొత్త రకముల ప్రాణులు బయలు దేరు చుండుట కనబడును. ఇది పరిణామ సంబంధమగు మార్పుల వలననే చాల నెమ్మదిగా జరుగుచున్నది. ప్రయోగ పరిశీలనముల వలన ప్రాణులలో కనబడు మార్పులు, ఆమార్పులు అనువంశికముగా తరువాతి తరములకు సంక్రమించుచుండుట అను విషయములు పరిణామ సిద్ధాంతమును గట్టిగా బలపరచుచున్నవి.

ఈ నిదర్శనములన్నిటిని బట్టి జీవకోటిలో పరిణామ సంబంధమగుమార్పులు జరిగినవనియు, జరుగుచున్న వనియు జీవశాస్త్రజ్ఞులకు దృఢపడినది. ప్రస్తుతము మనకు అగపడు ఉద్భిజ్జములుగాని, జంతువులుగాని ఎన్నియో మిలియనులు సంవత్సరములకు పూర్వమునుండియు రూపు మాసిన ఎన్నియో వంశకర్తలనుండియు, ఎన్నియో శాఖల ద్వారమున అవతరించిన రూపములని మనకు తెలియుచున్నది.

ఈ సందర్భమున 'సర్వప్రాణులకును ప్రప్రథమ వంశకర్తయైన ప్రాణి ఎచటినుండి ఎట్లుద్భవించినది ? చిరకాలము నుండియు స్థిరముగా జరుగుచున్న పరిణామాభివృద్ధికి కారణమేమి ?' అను ప్రశ్నలు బయలు దేరుట సహజము. మొదటి ప్రశ్నకు సమాధానము జీవశాస్త్రజ్ఞుల కింకను తెలియదనియే చెప్పవలయును. రెండవ ప్రశ్న పరిణామ కారణము. దాని విధానమును గూర్చి గడచిన ఒక శతాబ్దము పైనుండి తీవ్రమగు కృషి జరుగుచున్నది. ముఖ్యముగ లామార్క్, డార్విన్, డీక్రిస్ అను ముగ్గురు శాస్త్రవేత్తలు పరిణామ విధానమునుగూర్చి వారివారి సిద్ధాంతములను ప్రతిపాదించిరి.

సుమారు క్రీ. శ. 1809 వ సంవత్సర ప్రాంతమున ఫ్రెంచి జీవశాస్త్రజ్ఞుడగు లామార్క్ అను నతడు ఉద్భిజ్జములను, జంతువులను వాటి పరిసరములను పరిశీలించుట వలన తనకు కలిగిన అనుభవములను పురస్కరించుకొని పరిణామ విధానమును మొదట స్పష్టీకరించెను. ప్రాణిపై పరిసర ప్రదేశములకుగల ప్రభావము అతని దృష్టి 'నాకర్షించినది. సారవంతమగు నేలలో పెరుగు ఉద్భిజ్జములకును, సారహీనమగు నేలలో పెరుగువాటికిని కల వ్యత్యాసములను, కొంత భాగము నీటియందును, మరికొంత భాగము నీటిపైనను పెరుగు కొన్ని ఉద్భిజ్జములలో కల పత్రభేదములను, కొన్ని జంతువుల అవయవ నిర్మాణము నందు కల మార్పులను, అతడు పరిశీలించి పరిసర ప్రదేశముల యొక్క శక్తులచే ప్రాణులలో భేదములు ఏర్పడి పరిణామము జరుగుచున్నదని గట్టిగా విశ్వసించెను. కాని జీవశాస్త్రజ్ఞులలో బహుసంఖ్యాకు లాతని సిద్ధాంతమును ఆమోదించలేదు. పరిసర ప్రదేశ ప్రభావమువలన కలిగిన భేదములు తరువాతి తరములకు సంక్రమించునట్లు వారికి గోచరించలేదు. నేడు జీవశాస్త్రజ్ఞులు కొందరు కొన్ని విషయములలో లామార్కు సిద్ధాంతమును ఆమోదించుచున్నారు.

క్రీ. శ. 1859 వ సంవత్సరమున ఛార్లెస్ డార్విన్ అను నాంగ్లేయ జీవశాస్త్రజ్ఞుడు తాను వ్రాసిన 'జాత్యుత్పత్తి' అను గ్రంథమునందు పరిణామ సమస్యను పరిష్కరించుచు 'ప్రాకృతికవరణము' (Natural Selection) అను సిద్ధాంతమును ప్రతిపాదించేను. ఆ గ్రంథ ప్రభావము సమస్తమానవుల ఉద్దేశములపై పడినది. అతడు శాస్త్ర సమ్మతముగ శాస్త్రజ్ఞుల కందరికిని జీవపరిణామ విధానమునుగూర్చి నమ్మకము కలిగించెను. అతని సిద్ధాంతము మూడు ముఖ్యమైన విషయములపై ఆధారపడి వున్నది. (1) ప్రాణులలో నిరంతరము మార్పులు కలుగుచున్నవి. ఆమార్పులు సంతా నమునకు సంక్రమించుచున్నవి. (2) పెరిగి పెద్దవగు వాటి సంఖ్యకంటే ఎంతో ఎక్కువ సంతానమును ప్రాణులు ఉత్పత్తి చేయుచున్నవి.బ్రతుకుకొరకు తీవ్రమగు పోరాటమువానిలో పరస్పరముగ ఉండి తీరవలెను. (3) పరిస్థితు లకు అనుకూలమగు మార్పులు ఏ ప్రాణులకు కలవో, వాని మూలమున ఏ ప్రాణులు ఈ పోరాటమున నెగ్గునో అవి బ్రతికి ఆ మార్పులను సంతానమునకు సంక్రమింప జేయును. ప్రకృతి ఈ విధముగా ప్రాణులను ఎంచుకొనును. ఈ ఎన్నికవలన ప్రాణులలో మార్పులు కలుగుచుండును. ఉద్భిజ్జములును, జంతువులును, అనంఖ్యాకములగు మార్పులను పొందుచుండును. ఆ మార్పులు సూక్ష్మములుగా నుండును. వానిలో కొన్ని ప్రాణికి ప్రయోజన కారులుగను, కొన్ని హానికరములు గను ఉండును. అదృష్టవశమున ఆ మార్పులు ఏ ప్రాణికి సరియైన మార్గమునకలుగునో ఆ ప్రాణి బ్రతికి వానిని సంతానమునకు అంద జేయును. తక్కిన ప్రాణులు నశించి సంతానరహితములగును. ఈ పద్దతి ప్రకారము ఒకజాతి స్థిరముగా మార్పు జెందుచు, పరిసర ప్రదేశములకు పూర్వముకంటెఎక్కువ తగియున్న రూపములతో అభివృద్ధి చెందుచు, క్రొత్త పరిసరములలో నెగ్గగల రూపములను ఉత్పత్తిచేయుచుండును. ఈ విధానమునకు డార్విన్ "ప్రాకృతిక వరణము" అని పేరు పెట్టెను. డార్విన్ సిద్ధాంతమునుకూడ అంగీకరించని శాస్త్రజ్జులు కొందరు కలరు.

'డిగ్రీస్ ' అను డచ్చి వృక్షశాస్త్రజ్ఞుడు పరిణామకారణమును, దాని విధావమును గూర్చి మరియొక సిద్దాంతమును క్రీ.శ.1901 వ సంవత్సరమున ప్రతి పాదించెను. డార్విన్ ముఖ్యమని తలచిన చిన్నచిన్న సూక్ష్మ భేదములు పరిసర ప్రదేశములవలన కలిగినవనియు, అవి ఆనువంశికముగా సంక్రమింపవనియు డిగ్రీస్ నమ్మెను. పరిణామ సంబంధ మగు మార్పులను కలిగించు భేదములకు అతడు ఉత్పరివర్తనములు (Mutations) అని పేరు పెట్టెను. అవి. శాశ్వతమైన వనియు, అవి సంతానమునకు సంక్రమించుననియు, ఒక్కొకప్పుడు అవి స్ఫుటముగా, పెద్దవిగా నుండుననియు ఆతని సిద్ధాంతము. పెద్ద పెద్ద స్ఫుటమైన భేదములు ప్రాణులలో గలుగుటవలన పరిణామము జరుగుచున్నది కాని, సూక్ష్మములై అసంఖ్యాకములగు భేదము లవలన కాదని డీవ్రీసు ప్రతిపాదించెను. ఈ సిద్ధాంతము డార్విన్ సిద్ధాంతము కంటే ఎక్కువ సమంజసముగా అగపడి నది. పరిణామమునకు పట్టుకాలము ఈ సిద్ధాంత రీత్యాచాలవరకు తగ్గినది. ఇప్పుడు ఆనువంశికమగు భేదము పెద్దదైనను, చిన్నదైనను, ఒక్కమారుగా ఏర్పడినచో అది 'ఉత్పరివర్తనము' అనబడుచున్నది. పరిణామమునకు ముఖ్యమగు ఆనువంశిక భేదములకును, పరిసరప్రభావముచే నేర్పడి ఆనువంశికముకాని చిన్న చిన్న భేదములకును గల వ్యత్యాసము డివ్రీస్ సిద్ధాంతమువలన స్పష్టమైనది.

కాని నేడు చాలమంది జీవశాస్త్రజ్ఞులు ప్రాకృతికవరణమే తక్కిన సిద్దాంతములకంటె పరిణామవిధానమును చక్కగా స్పష్టీకరించుచున్నదని అభిప్రాయపడుచున్నారు. ఆ సిద్ధాంతమున స్వల్పములగు మార్పులు మాత్రము జరిగినవి. వివిధ పరిస్థితులకు తగియుండుట, శరీరదార్థ్యము అను విషయములపై బ్రతుకు పోరాటమున చాలవరకు ప్రాణుల విజయము ఆధారపడి యుండునుగాని ప్రత్యేకమగు నిర్మాణముపై లేక ప్రతి క్రియలపై కాదని నేటి శాస్త్రజ్ఞులు గ్రహించిరి.


ప్రకృతిలోనున్న ఉద్భిజ్జములను, జంతువులను, శిలారూపజీవములను ఆధారముగా తీసికొని పరిణామ సిద్ధాంతమును దాని విధానములను గూర్చి మొదట చాల కృషి జరిగినది. ఇటీవల పరిశోధనాలయములందును, బయటను జీవముతో నున్న ఉద్భిజ్జములతో చేసిన ప్రయోగ పరిశీలనములవలన ముఖ్యమగు నిదర్శనములు లభించినవి.ఈ ప్రయోగ పరిశీలనములలో సృజనశాస్త్రము (Genetics)నకు ముఖ్యమగు సంబంధముకలదు. మెండెల్ యొక్క ఆనువంశిక సూత్రములు వెల్లడియైనది మొదలు ఇంతవరకు 'ప్రాణులలో భేదములు ఉత్పత్తియగుట, ఆనువంశికముగ నవి సంక్రమించుచుండుట' అను విషయములను గూర్చి చేకూరిన విజ్ఞానము పరిణామ సమస్యను పరిష్కరించుటకు తగినంత ఎక్కువగా అభివృద్ధి చెందినది. పిత్య్ర సూత్రములు (క్రోమోజోమ్సు) లో నున్న సృజనులు(Genes) ఆనువంశికమునకు మూలమని తేలినది. సహజముగా వానిలో మార్పులు (ఉత్పరివర్తనములు) తరచుగా కలుగు చుండును. కృత్రిమముగ కూడ అట్టి మార్పులను ప్రేరేపించుటకు వీలగును. రెండు మొక్కలను గాని, జంతువులను గాని సంసర్గ మొనరించినపుడు ఏ మార్పులు వాని సంతానములో ఎట్లు కలుగుచుండునో కూడ స్పష్టమైనది. పరిశోధనాలయములందును, వ్యవసాయ కృషి యందును క్రొత్తరకముల మొక్కలు, జంతువులు అనేకములు ఉత్పత్తి చేయబడుచున్నవి. కాని, పరిసరములకు తగిన ప్రాణులు ఎన్నుకొనబడుచున్న విధాన విషయమున జీవశాస్త్రజ్ఞులలో భేదాభిప్రాయములు ఇంకను కలవు.

పరిణామము వివిధ కాలములలో, వివిధ సంఘములలో వివిధ వేగములతో జరిగినదని ఇప్పుడు గ్రహించిరి. పురా కల్పాంతమున కలిగినట్లు గొప్ప మార్పులు భూగర్భ సంబంధముగను, శీతోష్ణసంబంధముగను కలిగినప్పుడు పరి ణామము చాల వేగముగ జరిగియుండవచ్చును. ఉత్పరివర్తనము లేర్పడు వేగము, సంఖ్యాపరిణామము, పరిసరములోని వైవిధ్యములు కూడ పరిణాము వేగమును మార్చును.

భౌగోళికముగను, పరిస్థితులమార్పులవలనను ప్రాణులు స్వజాతినుండి వేరుపడుట వలస కూడ ఆయా జాతుల మధ్య భేదములు కనబడుచుండును. పరపరాగ సంపర్కము కలుగు ఉద్భిజ్జములు చిన్న చిన్న సంఘములుగా విడిపోయి నపుడు పిత్య్ర సూత్రములనుండి కొన్ని సృజనులు విడిపోవుట తటస్థింపవచ్చును. అట్టి ఉద్భిజ్జములు కానీ, జంతు

వులు కాని బ్రతుకు పోరాటమున నిలువబడుట గ్రుడ్డివేటుగనే కాని ప్రకృతి ఎన్నుకొనుటవలన కాదు. ఇట్లు పెక్కు సృజనులు విడిపోవుట తటస్థించినచో క్రొత్త రూపములు బయలుదేరుటకు అవకాశ ముకలదు.ఈ విధముగా ప్రాణులు వేరుచేయబడుట, పరిణామములో క్రోత్తజాతులు ఉత్పత్తి యగుటకుపునాది అగుచున్నది. ఈ జాతులు ఒక దానితోనొకటి సంకరము చెందుట కష్టము. సంకరము చెందినను వాని సంతానము ఫలించుట కష్టము. సృజనులకు సంబంధించిన భేదములున్నంత మాత్రముననే ఉత్పత్తి విషయమున ఇట్టి మార్పులు కలుగుచుండును. పిత్య్రసూత్రముల సంఖ్యలో భేదమున్న చోగూడ ఇట్లగును. క్రొత్తగా ఏర్పడిన పెక్కు

విజ్ఞానకోశము - ౨

ఉద్భిజ్జ పరిణామము

రూపములలో పిత్య్రసూత్రముల సంఖ్య సాధారణసంఖ్యకు రెండు, మూడు, నాలుగు మొదలగు రెట్లు అధికముగా నుండును.

సంఘముల యొక్క ఉత్పాదక పదార్థమును విశ్లేషించుట వలన పరిణామ విధానము చాలవరకు స్పష్టమైనది. ప్రాణియొక్క అభివృద్ధిపై ప్రభావముగల సృజనుల మార్పులు, పిత్య్ర సూత్రముల మార్పులు పరిణామమునకు చాల ముఖ్యమైనవి.

ఉద్భిజ్జములలో పరస్పరముగా ముఖ్యముగా భూమిలోగల పారస్థిక (Ecological) సంబంధములను గూర్చి క్రొత్త విషయములు తెలిసినకొలది 'బ్రతుకు పోరాటము, దానియందు విజయము లభించువిధానము' అను విషయములు మరింత స్పష్టము కాగలవు.

పరిణామమునకు సరియైన కారణముల విషయమున జీవశాస్త్రజ్ఞులలో భేదాభిప్రాయములుండి యుండవచ్చును కాని, ఉద్భిజ్ఞప్రపంచమున పరిణామాత్మకమగు అభివృద్ధి అనేక మిలియనుల సంవత్సరముల నుండి నెమ్మదిగా, స్థిరముగా, జరుగుచున్నదనుట వాస్తవము. ఈ కాలప్రమాణమున మానవయుగము ఒక క్షణమాత్రము. భూమిపై నున్న నేటి ఉద్భిజ్జములను చూచినచో వాని యందు పరిణామఫలితములు అగపడక మానవు.

ప్రపంచమందున్న ఉద్భిజ్జకోటిలో ఇంతవరకు సుమారు 3,50,000 ల జాతులు వర్ణింపబడినవి. క్రొత్తజాతులు నిరంతరము అన్వేషింపబడుచు, వర్ణింపబడుచున్నవి. వీనిలో సుమారు 2,00,000 ల జాతులు బీజవంతములగు ఉద్భిజ్జములు. ఫెరనులు (Ferns), వానికి సంబంధించిన జాతులు సుమారు 7,000ల వరకు తెలిసినవి కలవు. నాచులు(mosses), ప్రహరితములు (Liverworts) సుమారు 28,000ల జాతులున్నవి. అంతకంటే తక్కువ శ్రేణికి చెందిన శిలీంధ్రములు దాదాపు 90,000ల జాతులున్నవి. శైవలములు 20,000ల జాతులు ఉన్నవి.

శిలారూపములలో నున్న ఉద్భిజ్జముల చరిత్రను చూచినచో భూమి పై నున్న ఉద్భిజ్జ సంపద పెక్కు పర్యాయములు మారినట్లు అగపడును.. ఒక సంఘము తరువాత మరియొక సంఘము బయలుదేరి కొంతకాలము అభివృద్ధి చెంది తుదకు అదృశ్యమైనది. ఇట్లు కొన్ని వేలజాతులు బయలుదేరి అంతరించినవి. నేటి ఉద్భిజ్జములు చిరకాల పరిణామ ఫలితములు.

అనాదియందు ఉద్భిజ్జము లెట్లుండియుండెనో వృత శాస్త్రజ్ఞులు దృఢముగా చెప్పజాలరు. ఏవిధముగ నున్నను నిరింద్రియ పదార్థములనుండి వాని ఆహారమును అవి సంశ్లేషించుకోనుచుండి యుండక తప్పదు. అందుచే అవి జంతువులను కంటె ఉద్భిజ్జములనే ఎక్కువ పోలియుండవచ్చును. వాని ఆహార సంశ్లేషణము పత్రహరిత సహాయ మున జరుగకపోవచ్చును. అచిర కాలముననే ఏక కణ శరీరముతో జీవరసమును కలిగి నేడు మనకు కనబడు అత్యల్పములగు ఉద్భిజ్జములను పోలియుండు రూపములు వానినుండి ఉత్పన్న మైయుండవచ్చును. వీనితో ఆరంభించి నేటి ఉద్భిజ్జముల వరకును జరిగిన అభివృద్ధిలో ముఖ్యమగు కక్ష్యలను మనము తెలిసికొనవచ్చును.

ఉద్భిజ్జ పరిణామము ఒకే తిన్నని మార్గమున గాని, ఒకేసారిగా గాని, ఒకే సంఘమున గాని జరిగియుండక పోవచ్చును. పరిణామము సంభవించిన ప్రతీ మార్గమును మరల మరల వివిధరకముల ఉద్భిజ్జములలో బహు సమాంతరముగ జరిగినది. ఉద్భిజ్జ పరిణామమున 7 ముఖ్యమగు కక్ష్యులను మనము గుర్తింపవచ్చును.

కొన్ని యుగముల వరకు నిస్సందేహముగా భూమిపై ఏక కణ శరీరములు గల ప్రాచీన ఉద్భిజ్జములే నిండియుండెను. వాని పునరుత్పత్తి సూక్ష్మ విభజనము వలన జరుగు చుండెడిది. శరీర నిర్మాణ క్లిష్టతగాని, వ్యాపార క్లిష్టత గాని వానికి లేకుండెను. ఒక్కొక్కటి ఒక సమమైన జీవ రసపు ముక్క. ఈ జీవకణములో మొదట కొన్ని భాగములు ప్రత్యేకముగా విభేదము నొందినవి. అట్లు ప్రత్యేకముగా ఏర్పడిన భాగములలో జీవకణ కేంద్రము ముఖ్యమైనది. ఇది జీవకణ వ్యాపారములను నడుపు కేంద్రము. తరువాత జీవరసమున మిగిలిన భాగమం దంతటను జరుగు శరీరధర్మము లిప్పుడు ప్రత్యేక భాగములయందు జరుగుట మొదలు పెట్టెను. క్రమముగా ఆ జీవకణములలో అవకాశ స్థలములు (vacuoles) ఏర్పడినవి.

బహుకణ శరీరములు గల ఉద్భిజ్జములు ఏర్పడుట, తరువాత అభివృద్ధిసూచకమగు గొప్ప మెట్టు. మొదట ఏకకణ జీవులు కొన్ని కలిసి గుంపులుగా నేర్పడినవి. జీవ కణ విభజనములో ఏర్పడిన రెండు పిల్ల జీవకణములు విడిపోక కలిసియుండుట వలన చిన్న చిన్న జీవకణ సమూ హము లేర్పడినవి. ఆ జీవకణములకు క్రమముగా మరింత దృఢమైన కలయిక కలిగినది. ఈ సమూహముల పరిమా ణమునను, ఆకారమునను భేదములు కలిగినవి. ఈ విధముగ నేడు మనము చూచుచున్న అసంఖ్యాక జీవకణ శరీరములు గల పెద్ద పెద్ద ఉద్భిజ్జములు బయలు దేరుటకు మార్గ మేర్పడినది.

బహుకణ శరీరములు గల ఉద్భిజ్జములు ఉత్పత్తియైన తోడనే మానవసంఘ పరిణామమున “శ్రమ విభజనము" ఎట్లు జరిగెనో అట్లే కొన్ని జీవకణ సంహతు లొక వ్యాపారమును, మరికొన్ని జీవకణ సంహతులు మరియొక వ్యాపారమును నిర్వర్తించుచుండుటచే శ్రమ విభజనము జరిగెను. దీనితో బాటు నిర్మాణ ప్రత్యేకత యేర్పడినది. శ్రమ విభజనములో పునరుత్పత్తి వ్యాపారము ముందుగా ఏర్పడియుండవచ్చును. జీవకణ విభజనముచే నేర్పడిన పిల్ల జీవకణములు ఉద్భిజ్జములుగా తయారగుటకు బదులు ‘బీజాణువులు'(Spares) అనబడు ప్రత్యేకమగు పునరుత్పత్తికణములుగ బయలు దేరినవి. ఇట్లు శ్రమవిభజనము సాగుచు పరిణామము జరిగినది. జీవకణములు సంహతులుగను, జీవకణ సంహతులు అవయవములుగను విభేదమునొందినవి.

ఉద్భిజ్జ చరిత్రలో మరియొక ముఖ్యమైన మెట్టు పునరుత్పత్తి విధానమున కలిగిన మార్పు. అత్యల్పమగు ఉద్భిజ్జములలో జీవకణము రెండు కణములుగ విభజనము చెందుట వలనను, కొంచె మెక్కువ శ్రేణికి చెందిన ఉద్భిజ్జములలో ప్రత్యేకమగు జీవకణములవలనను, పునరుత్పత్తి జరిగినది. వానికంటె ఉత్తమశ్రేణికి చెందిన ఉద్భిజ్జములలో లింగ సంబంధమగు పునరుత్పత్తి జరుగుట ప్రారంభ మైనది. దీనిలో రెండు రకముల జీవకణములు సంయోగము పొంది ఉద్భిజ్జముగ తయారగును. ఇట్లు సంయోగము నొందు జీవకణములు 'సంతానోత్పాదక జీవకణము' లనబడును. ఈ రెంటి కలయికచే ఏర్పడిన జీవకణము 'సంయోగ జీవకణము' (Zygote) అనబడును. ఈ సంతానోత్పాదక జీవకణము లలో (స్త్రీ, పురుష లింగభేదము కూడ ఏర్పడినది. చిన్నవై, చలనము కల పురుష బీజకణములు; పెద్దవై, చలనము లేని స్త్రీ బీజకణములు లేక అండములు అని అవి ప్రత్యేకముగ విభేదము నొందినవి. ఇట్టి లింగసంబంధమగు పునరుత్పత్తి సంభవించుటకు కల కారణములు తెలియవు కాని, ఉద్భిజ్జములయందే గాక జంతుకోటియందును సర్వత అది అగపడుచుండుటచే ఈ విధానమున కేదో ప్రత్యేకమగు ప్రాముఖ్యము ఉండి యుండవచ్చునని మాత్రము చెప్పక తప్పదు.

ఉద్భిజ్జ పరిణామమున కనబడు (1) బహుకణ శరీర మేర్పడుట, (2) వ్యాపారనిర్మాణ సంబంధమగు విభేదము కలుగుట, (3) లింగ సంబంధమగు పునరుత్పత్తి—— అను మూడు మెట్లును జంతు పరిణామమున కూడ కాననగును. కాని 'ఏకాంతర జననములు' (Alternations of generations) అను నాల్గవ మెట్టు ప్రత్యేకముగా ఉద్భిజ్జములకే చెందినది. ఉద్భిజ్జ జీవిత దశయందు రెండు దశలు స్పష్టముగా కనబడును. ఒక దశనుండి రెండవ దశ పుట్టును. ఒక దశలో స్త్రీ పురుషావయవము లుండి సంతానో త్పాదక జీవకణములు ఉత్పత్తి యగును. వాని సంయోగముచే ఫలదీకరణము జరుగును. ఈ దశను 'జన్యుజనకదశ' (gametophyte) అందురు. ఫలదీకరణ మొందిన అండము జంతువులలోవలె మరల సంతానోత్పాదక జీవకణములుగల శరీరముగా అభివృద్ధి చెందదు. అది రెండవదశలో ప్రవేశించి వృద్ధియై అనేక ములగు బీజాణువులను (spores) ఉత్పత్తి చేయును. ఈ దశను 'బీజాణు జనకదశ' (sporophyte) అందురు. లింగ సంబంధమగు సంయోగము లేకుండనే ఒక్కొక్క జీవాణువు జన్యుజనక దశగా వృద్ధిచెందును. లింగ సంబంధ మగు పునరుత్పత్తి కల ప్రాణులన్నిటిలో సంతానోత్పాదక జీవకణము లేర్పడునప్పుడు వానిలో పిత్య్ర సూత్రములు శారీరక జీవకణములలోని పిత్య్ర సూత్రముల సంఖ్యలో సగము మాత్రమే ఉండును. అందుచే జన్యుజనకదశలో అన్ని కణముల యందును పిత్య్రసూత్రముల సంఖ్య సగముగను, బీజాణుజనకదశలో పూర్తిగను ఉండును. ఉద్భిజ్జములలో ఒక్కొక్క సంఘమున ఒక్కొక్క మాదిరిగా ఈ ఏకాంతర జననములు వ్యక్తమగుచుండును.

నీటిలో పెరుగు ఉద్భిజ్జములనుండి గాలిలో పెరుగ నేర్చిన ఉద్భిజ్జములు బయలు దేరుట తరువాతి మెట్టు. దీని నుండి ఉద్భిజ్జములు పొడినేలపైగూడ బయలు దేరుటకును, క్రమముగా భూమి నాక్రమించుటకును అవకాశము దొరకినది. ఉద్భిజ్జ జీవితము మొదట ప్రాయశః సముద్రమున ప్రారంభమై యుండవచ్చును. అచటనే పరిణామమున మొదటి మెట్టు జరిగి యుండవచ్చును. చాల కాలమువరకు భూమి పై ఉద్భిజ్జము లేవియు లేకపోయి యుండవచ్చును. ఉద్భిజ్జములు భూమి పై జీవింపగలుగుటకు జలచోషమునకు అనుకూలమగు వ్రేళ్ళు, ఆహారమును బాగుగా తయారుచేయుటకు ఆకులు, వ్రేళ్ళనుండి ఆకులలోనికి నీటిని పంపు టకును, నిలువుగా నిలిచి ఆకులకు సూర్యరశ్మి తగులునట్లు చేయుటకును కాండము అవసరమగుటచే వాని నిర్మా ణము జరిగినది. అంగభేద రహితములగు ఉద్భిజ్జములకీ అవయవ నిర్మాణము లేకపోవుటచే అవి భూమి నెక్కువగా ఆక్రమింప లేకపోయినవి. దారువాహికా పుంజములుగల ఉద్భిజ్జములే ప్రథమమున విజయముతో భూమి నాక్రమింప గలిగినవి. కాని, జలజీవనముగల అంగ భేదరహితములగు ఉద్భిజ్జములకును, దారువాహికలతో భూజీవనము చేయు ఉద్భిజ్జములకును మధ్య చాల ఎడ మేర్పడినది.

దారువాహికలు గల ఉద్భిజ్జములతో బీజజనక దశ చాల శక్తిమంతమైనది. అది భూజీవనమునకు చక్కగా తగియున్నది. నిజమైన వ్రేళ్ళు, పత్రములు, పత్రరంధ్రములు, జీవకణసంహతులలో గొప్పవిభేదముగల కాండములు పరిణామ క్రమమున ఈ ఉద్భిజ్జములలో ఏర్పడుటచే అవి పూర్వకాలమున భూమిని విస్తారముగా ఆక్రమింప గలిగినవి.వీనినుండియే బీజవంతములగు ఉద్భిజ్జములు బయలుదేరినవి. ప్రాచీన శిలారూపములను పరిశీలించినచో మొదట ఈ ఉద్భిజ్జము లెట్లున్నవో తెలియును.

ఉద్భిజ్జ జీవితమున ఉత్తమశ్రేణికి చెందిన పునరుత్పత్తి విధానము క్రమముగా నేర్పడినది. దాని ఫలితముగ బీజములు (గింజలు) ఉత్పత్తియైనవి. ఇది ఉద్భిజ్జపరిణామమున పెద్ద తుది మెట్టు. ఉన్నత శ్రేణికి చెంది, నేడు చాల విజయవంతములుగా నున్న ఉద్భిజ్జములలో బీజముల ద్వారమున పునరుత్పత్తి జరుగుట విశిష్టమైన లక్షణము. వీనిలో సూక్ష్మబీజాణువులు (microspores), స్థూల బీజాణువులు (megaspores) అను రెండు రకముల బీజాణువులు ఏర్పడుచున్నవి. అవి పురుష, స్త్రీ జన్యు జనకదశలను క్రమముగా ఉత్పత్తిచేయును. ఉన్నత శ్రేణికి చెందిన ఉద్భిజ్జములలో స్థూలబీజాణువు ఒకటి మాత్రమే ఉండును. అది తల్లిమొక్కలోపలనే ఉండును. దానిపై రక్షణము కొరకు పొరలేర్పడి అది అంతయు పర్యండము (ovule) గా తయారగును. సూక్ష్మబీజాణువులు (పుప్పొడి కణములు) అనేకములుగా తయారగును. అవి పర్యండములకుదగ్గరగా అండకోశపు కీలాగ్రము పైబడును. ఒక్కొక్క పుప్పొడి కణము నుండి పురుషలింగ సంబంధమగు రెండు సంతానోత్పాదక కణములు ఉత్పత్తియగును. వానిలో నొక కణము పర్యండములో నున్న స్త్రీలింగ సంబంధమగు సంతానోత్పాదక కణమును (అండమును) ఫలదీకరణ మొనర్చును.

ఈ విధముగా బీజవంతములగు ఉద్భిజ్జములలో స్వేచ్ఛా జీవనముగల జన్యు జనక దశలు విసర్జింపబడినవి. ఫలదీరణ మొందిన అండము (egg) వెంటనే పిండముగా తయారగును. దాని అభివృద్ధికొరకు కావలసిన పదార్థముల నన్నిటిని అది తల్లి మొక్క నుండి గ్రహించును. పిండము చుట్టును ఆహారము నిలువచేయబడి యుండును. లేక వేరు ఒకటి, రెండు ప్రథమ పత్రములు, ఏర్పడగానే పిండము యొక్క అభివృద్ధి ఆగిపోవును. పిండము, దాని ఆహారము, పర్యండము యొక్క కవచముతో కప్పబడి యుండును. ఈ నిర్మాణమంతయు బీజము (seed) అనబడును. పూర్తిగా తయారైన తరువాత అది తల్లి మొక్క నుండి వేరుపడి కొంతకాలము అచేతనస్థితి (dormant) యందుండును. కాని అనుకూల పరిస్థితులు దొరకినచో అది మొలకెత్తును. అప్పుడు పిండము వృద్ధియ గుట ప్రారంభమగును. బీజ కవచమును చీల్చుకొని లోపల నిలువయున్న ఆహారమును తీసికొనుచు మొలక బయటికివచ్చును. వ్రేళ్ళు, ఆకులు ఏర్పడి క్రొత్త ఉద్భిజ్జము తయారగును. ఈ విధముగా బీజముల ద్వారమున జరుగు పునరుత్పత్తి, గాలితో తీసికొని పోబడు బీజాణువుల మూలమునను, స్వేచ్ఛగా నుండు జన్యు జనకదశల మూలమునను జరిగిన పునరుత్పత్తికంటే, చాల అను కూల్యములు కలిగియుండును. బీజవంతములగు ఉద్భిజ్జములు ఎక్కువ విజయముతో ప్రబలమై యుండుటకు. ఇదియే కారణము. ప్రస్తుతము మనకు అగపడు ఉద్భిజ్జములలో ఫెరనులనుండి పరిణామము చెందిన సంవృత, వివృత బీజవంతములగు ఉద్భిజ్జములలో మాత్రమే బీజము లేర్పడుచున్నవి.

ఉద్భిజ్జకోటి అనాదినుండి ఇంతవరకు చెందిన పరిణామ చరిత్ర, వాని వంశానుక్రమణము,వివిధములయిన తరగతుల సంబంధము పైవంశవృక్షమువలన సంక్షేపముగ తెలియగలదు.

బి.వి.ర