సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జములు (అంగభేద రహితములు)
ఉద్భిజ్జములు - అంగభేదరహితములు (థాలోఫైటా): పుష్పరహిత ఉద్భిజ్జములలో అంగభేద రహితమైన ఉద్భిజ్జములు (థాలోఫైటా) ఎక్కువభాగమును ఆక్రమించి యున్నవి. వీనిలో మిక్కిలి సామాన్యమై ఏకకణ శరీరముగల అల్పజాతి ఉద్భిజ్జములుకూడ చేరియున్నవి. ఇవి తమ ఆకార పరిమితినిబట్టి భేదమును కలిగియుండును. కొన్నిటిలో కణములు అడ్డముగా విభజింపబడి పంక్తులుగా ఏర్పడును. ఇట్టి పంక్తులలో నుండు కణములు శాశ్వతముగా కలిసియుండును. లేక విడివిడిగానయి ప్రతికణము ఒక ప్రాణిగా ప్రవర్తించును. మరికొన్నిటిలో కణములు అడ్డముగను పొడవుగను అన్ని దిశలలో విభజింపబడి పళ్లెములవలె నుండు కణములగుంపులను ఉత్పత్తి చేయును. ఈ విధముగా కొన్ని చాలకణములు కలిగి వాని బాహ్యరూపములలో కొద్ది భేదములను కలిగియుండును. కాని వీనిలో దేనియందైనను వేర్లు, కాండములు, ఆకులు అనబడు భాగములుండవు.
సామాన్య ఆకారముగల వెన్నియో తమ యాహారమును శరీరముయొక్క ఉపరిభాగములో గ్రహించును. కొన్నిటిలో వేర్ల వంటి భాగములుండును. కాని అవి ఇతర చెట్లు, రాళ్ళు మొదలగు వాని కంటుకొని యుండుటకు మాత్రమే ఉపయోగపడును. ఇవి నిజమైన వేర్లుగావు. వీనిని "రై జాయిడ్సు (Rhizoids)" అని అందురు. ఉచ్చజాతికి చెందిన ఉద్భిజ్జములలో అంతర్నిర్మాణమునందు భేదము కనబడును. కాని వీనిలో పుష్పించుచెట్లలో కనబడు కణసమూహముల భేదము కానరాదు. సాధారణముగా మనకు కనబడు నీటిలో దారములవలెనుండు శైవలములు, బూజులు, కుక్కగొడుగులు మొదలగునవి థాలోఫైటాకు చెందినవే.
మొదటిరకపు అంగభేదరహిత ఉద్భిజ్జములలో ఆకుపచ్చని పత్రహరిత ముండును. దీని సహాయముచే ఈ ఉద్భిజ్జములు నీటిలోనుండు కర్బన ద్విఆమ్లజనిదమును గ్రహించి సూర్యరశ్మితో తమ యాహారమును తయారుచేసికొనును. ఉ॥ స్పాయిలోగై రా మొదలగునవి. వీనిని శైవలములని (algac). యందురు. శైవలములు వెలుతురు లేనిదే జీవించలేవు.
రెండవరకపు అంగభేదరహిత ఉద్భిజ్జములలో పత్రహరిత ముండదు. అందుచే అవి తమ ఆహారమును స్వయముగా తయారుచేసికొనజాలక ఇతర ప్రాణులపై ఆధారపడియుండును. లేక చచ్చి మురుగుచున్న సేంద్రియ పదార్థములపై జీవించుచుండును. ఇట్టి వానిని 'శిలీంధ్రము' అని (Fungi) యందురు. శిలీంధ్రములు చీకటిలోకూడ జీవించగలవు. ఉ॥ బూజులు, పుట్టగొడుగులు మొ॥
(i) శైవలములు (algac): ఇవి తడిగల అన్ని ప్రదేశములలో నివసించును. నీటి వసతులు గల అన్ని ప్రదేశ ములలోకూడ ఇవి జీవించుచుండును. కొన్ని శైవలములు నిలచియున్న నీళ్లపై ఆకుపచ్చని తెట్టెలుగట్టి తేలుచుండును. మరికొన్ని నీటి అడుగున చేరిన చెట్ల ఆకులకు, రాళ్లకు అంటుకొనియుండును. సముద్రములో ఎఱ్ఱరంగు గల శైవలములును, నారింజ రంగుగల శైవలములు రాళ్లకు అంటుకొని గాని నీటిపై నీదుచుగాని ఒక్కొక్కప్పుడు కొన్ని మైళ్ల వరకు వ్యాపించియుండును.—— నారింజ రంగుగల 'సాల్గోసం' అనబడు శైవలము పసిఫిక్ మహాసముద్రములో ఎన్నియో మైళ్లవరకు వ్యాపించియున్నది. కనుక ఈ సముద్రమునకు 'సాల్గోసం సముద్ర' మని పేరు వచ్చినది. ఎఱ్ఱ సముద్రములో గూడ టై కో డెస్మియం (Trichodesmium). ఎరిత్రియం (Erythraeum) అను ఏకకణపు శైవలము నీటిలో ఎక్కువగా కలిసియుండుట వలన నీరు ఎఱ్ఱగా కనపడును. కనుక ఈ సముద్రమునకు 'ఎఱ్ఱసముద్ర'మని పేరువచ్చెను. శైవలములు సాధారణముగా 30°C- 40°C ఉష్ణ పరిమితిలో జీవించును. కాని 75°C ఉష్ణములో, మంచుగడ్డలలో కూడ కొన్ని శైవలములు నివసించును. మంచుగడ్డలలో శై వలములు ఎఱ్ఱని మచ్చలు మచ్చలుగా కనబడును. ఉ॥ క్లామిడోమోనాస్ నివాలిస్ (Chlamydomonas Nivales). నీలిరంగుగల శైవలములు భూమిలో 18 అం॥ లోతునకూడ దొరకును. కొన్ని ఇతర ఉద్భిజ్జముల శరీరములో కూడ జీవించును. ఉ౹౹ అన్ ధాసిరాస్ (Anthoceros) అను ఉద్భిజ్జములలో నివసించు 'నాస్టాక్' (Nostoc) అను శైవలము. అజొల్లా (Azolla) యనుపర్ణము (fern) యొక్క ఆకులలో అనబీనా (Anabaena) యును, సైకాస్ (Cycas) వేర్లలో నాస్టాక్ని వసించును. కొన్ని శై వలములు అల్పజంతువుల శరీరములలో నివసించుమ. ఉ. జూక్లొ రెల్లా (Zoochiloర్ella) అను శైవలము హైడ్రా(Hydra) మొదలగువాని శరీరములలో పెరుగును. కొన్ని విధములగు శైవలములు శిలీంధ్రములతో కలిసి జీవించుచుండును. శిలీంధ్రములను విడిచి అవి జీవించజాలవు. శైవలము, శిలీంధ్రము కలిసియుండు ఇట్టి ఉద్భిజ్జములను లైకెన్స్ (Lichens) అని అందురు.
శైవలములలో ఎక్కువభాగము సూక్ష్మమైన శరీరమును కలిగియుండును. సముద్రములో తేట నీటిపై నీదునట్టి అతి సూక్ష్మమైన ఏకకణ శైవలములను 'ప్లాంక్టాన్' (Plankton) అని అందురు. ఇవి నీటిలో నుండు చిన్న చిన్న జంతువులకు ఆహారముగా నుపయోగపడును. సముద్రములోనుండు తిమింగిలములు ముఖ్యముగా వీనిని తిని జీవించును. తిమింగిలము ఒక్కొక్కటి 7,000 వరకు ఈ శైవలములను ఒకేసారి ఆహారముగా గ్రహించును.
శైవలములు ఆకారమునుబట్టి అనేక విధములుగా నుండును.అల్పజాతికి చెందిన ఏకకణ ఉద్భిజ్జములు.
ఉ. క్లామిడో మోనాస్ (Chlamydomonas), యుక్తావ్యములు (Diatoms), అసై కజాభి త్తికములు (Desmids) సాధారణముగ గుండ్రముగను, వివిధరూపములుగను ఉండును. వీనిలో పత్రహరితకము (Chloroplast), కేంద్రకము (నూక్లియస్), కన్ను ఒక్కొక్కటియుండును. 'మీసములవలె నుండు రెండు. ఫ్లాగెల్లాలు (flagella) దీనిముందు భాగమున నుండును. కన్నువలన ఇది తన దారిని చూచుకొనుచు మీసములవలన ఈదుచు పోవును. ఇట్టి ఏకకణ ఉద్భిజ్జములు కొన్ని గుణములలో పురుగులవలె ప్రవర్తించును. కాని వీనిలో పత్రహరితముండుటచే తమ యాహారమును తామే
తయారుచేసుకొనును. ఇట్టి ఏకకణ ఉద్భిజ్జములు ఒకేచోట కూర్చబడి గుండ్రని ఆకారము కలవిగాను, లేక గుంపులు గుంపులుగను నివసించును. వీనిలో ప్రతికణము జీవితవ్యాపారములలో స్వతంత్రముగ నుండును. కొన్ని శైవలములు దారముల వలె పొడవుగా నుండును. ఈ దారములవంటి వానిలో ఎన్ని యో కణములు ఒకదానిలో నొకటి కూర్పబడి యుండును. ఉన్నత శ్రేణికి చెందిన శైవలములలో కొమ్మలు, ఆకులవంటి
భాగములుకూడ ఉండును. ఉదా. కాలర్పా (caulerpa), సార్గానం (Sargassum), మాక్రోసిస్టిస్ (Macrocystis). కొన్ని శైవలములు సుమారు 200 అడుగులవరకు పొడవు
గలిగి యుండుము. ఉదా, మాక్రోసిస్టిస్. నారింజరంగు కలిగినటువంటి పెద్ద సముద్రపు పాచి (kelps) గూడ శైవలములకు చెందినదే.
శైవలములు తమకు వలసిన పదార్థములను మరియు బొగ్గువులుసుగాలిని నీటిలో కరిగియున్న వాటినుండి ద్రవ రూపముగ గ్రహించి తమలోనున్న పత్రహరిత సహాయముతో సూర్యరశ్మిలో తమ యాహారమును తయారు చేసికొనును. శుక్ల పక్షమున చంద్రరశ్మివలస కూడ శైవలములు తమ యాహారమును తయారుచేసికొనును.వీనిలో సర్వసాధారణముగా ఆహారము పిండిగా తయారగును. కానీ కొన్ని శైవలములు నూనె (కొవ్వురూపముగ కూడ) ఆహారమును తయారు చేసికొనగలవు. ఉదా. వాచీరియా (Vaucheria).
శైవలముల శరీరమున ప్రతికణకవచము (కఱ్ఱనార Cellulose), పెక్లోస్ (Peclose) అను పదార్థములను కలిగి యుండును. ప్రతికణములో జీవరసము కవచమున కంటుకోని యుండును. మధ్య అవకాశము (Vacuole) ఉండును. ఆ జీవరసములో కేంద్రక ముండును. ప్రతికణములో కూడ పత్రహరితకము ఒకటి యుండును. కాని దారములవంటి వానిలో అడుగుననున్న కణము వర్ణరహితముగను, వేర్లవలెను ఉండును. దాని సహాయముననే వలములు రాళ్ళకును, ఇతర చెట్లకును అంటుకొనియుండును.
పెద్ద పెద్ద కేల్పులు (Kelps) పొడవుగా ఆకులవలె నుండును. ఇవి బహు కణములతో చేయబడియుండును. దీని కణములలో పత్రహరితముతోపాటు వివిధ రంగులు. (నీలి, నారింజ, ఎరుపు రంగులు) ఉండుటచే శైవలములు ఆయా చాయలతో కనబడును.
శైవలములలో పునరుత్పత్తి విధానము పెక్కు విధములుగా నుండును. దారములవలె నుండు శైవలములలో కొన్ని ఆకస్మికముగ విరిగి ముక్కలు ముక్కలుగా నగును. ప్రతిముక్కలో కనీసము ఒక కణము ఉన్నను అది విభజన జెంది ఒక శైవలముగా తయారగును. శైవలములు సర్వసాధారణముగా రెండు విధములుగా పునరుత్పత్తి చేసికొనును.
- (1) లింగరహిత పునరుత్పత్తి.
- (2) లింగసంబంధమగు పునరుత్పత్తి.
లింగరహిత పునరుత్పత్తి : ఏకకణపు ఉద్భిజ్జములు విభజన చెంది, ప్రతిభాగము ఒకజీవిగా పెరుగును. ఆహారము ఎక్కువగా దొరుకునపుడు పరిసరములు అనుకూలముగా నుండినచో ప్రతికణములో నున్న జీవరసము, కేంద్రకముతొ సహితముగా విభజన చెంది 4, 8, 16, 32 లేక 64 ఏకకణములగు సిద్ధబీజము (Spores) లను ఉత్పత్తిచేయును. నీటిలో నివసించు శైవలములో ఈ సిద్ధబీజములు సాధారణముగా చలనము కలిగియుండును. వీనికి కణకవచ ముండదు. ఒక్కొక్కదానికి రెండు మీసము లుండును. దీనిని జూస్పోర్సు (Zoospores) యని అందురు. కాని కొన్ని భూమి పై నుండు శైవలములలో సిద్ధబీజములు ఎన్నియో రకములుగా నుండి గాలిచే వ్యాప్తిచెందును. జూస్పోర్సు (Zoospores) అనుకూల పరిస్థితులలో పెరిగి అ సంబంధమగు ఉద్భిజ్జమును ఉత్పత్తి చేయును.
లింగసంబంధమగు పునరుత్పత్తి : వ్యతిరేక పరిస్థితులలో ఈ ఉద్భిజ్జములు లింగసంబంధమగు పునరుత్పత్తి జరుపును, లింగసంబంధమగు పునరుత్పత్తి సాధారణముగా సాయంకాలములందును రాత్రులందును లేక వేకువ ఝామున జరుగును. ప్రతిజీవి కొన్ని జననకణములను ఉత్పత్తిచేయును. జననకణములు, జూస్పోర్ట్సు (Zoospores) అను బోలియుండును. కాని అవి కొంచెము చిన్నవిగా నుండును, ఈ జననకణములలో కొన్ని పురుష లక్షణములు గలవి, మరికొన్ని స్త్రీలక్షణములు గలవిగా నుండును. ఇవి ఒక దానినొకటి పోలియుండును, ఉచ్చశ్రేణికి చెందిన శైవలములలో పురుష జననకణములు చిన్నవిగ, మీసములు గలిగియుండును. కాని స్త్రీ జనన క్షణములు పెద్దవిగను, చలనములేకను ఉండును. వీనిని ఓవా (Ova) లని యందురు. జననకణములు శైవలము నుండి విడుదలై నీటిలో కొంతకాలమువరకు ఈదు చుండును. ఇట్లు ఈదుచున్న స్త్రీ, పురుష జననకణములు ఒక దానినొకటి కలిసికొని ఒక సంయు క్తబీజము (Zygospore) గా తయారగును. కాని కొన్నిటియందు ఉచ్చశ్రేణికి చెందిన ఉద్భిజ్జములలోవలె అండము ఏర్పడి దాని స్థానమునుండి కదలకయుండును. పురుష జననకణము దానితో కలియగనే సంయుక్తబీజ మేర్పడును. సంయుక్త బీజము తనచుట్టును దట్టమైన కవచమును తయారు చేసికొని నీటి అడుగున జేరి పరిస్థితులు అనుకూలమగు వరకు అచ్చటనే యుండును. పిమ్మట కవచము పగిలి ఒక్కటి లేక నాలుగు సిద్ధబీజములు బయటికి వచ్చును. సిద్ధబీజములు ఆయా శైవలములుగా వృద్ధిపొందును. శైవలములు రంగులనుబట్టి నాలుగు ముఖ్యతరగతులుగా విభజింపబడినవి. (1) సయనోఫైసీ (Cyanophyceae-నీలి శైవలములు), (2) క్లోరోఫైసీ (Chlorophyceae- హరిత శైవలములు), (3) ఫియోఫైసీ (Phaeophyceae-నారింజ శైవలములు), (4) రోడోఫై సీ(Rhodophyceae- ఎఱ్ఱ శైవలములు).
(ii) శిలీంధ్రములు (Fungi): ఇవి అంగభేదరహిత ఉద్భిజ్జములు రెండవభాగమునకు చెందినవి. ఊరగాయలు, రొట్టెలు, మురుగుచున్న పండ్లు, పేడకుప్పలపై, చెట్లపై, మనుష్యుల శరీరములపై గూడ ఇవి పెరుగును. వీనిలో పత్రహరిత ముండదు. మానవులకు తామర, బట్టతల, శ్వాసకోశములకును, మూత్రపిండములకును (Blastomycoses of the lungs and Kidneys) సంబంధించిన వ్యాధులు కొన్ని శిలీంధ్రముల మూలమున కలుగును. గోధుమ, జొన్న, వరి, మొక్క జొన్న మొదలగు పైర్లపై వేయు నల్లకాటుక (Black rust) చే మొక్కలు అకస్మాత్తుగా వాడి ఎండిపోవుట మొదలగు ఎన్ని యో మరికొన్ని వ్యాధులు శిలీంధ్రములవలన కలుగుచున్నవి. సూక్ష్మజీవులు
(Bacteria) కూడ అంగ భేదరహిత ఉద్భిజ్జములకు (ధాలో ఫైటా) కు చెందినవే. వర్గీకరణమున వానికి తరచుగా శిలీంధ్రములలో ప్రత్యేకతరగతి నిచ్చుచుందురు. అవి సర్వత్ర వ్యాపించియున్నవి. సూక్ష్మజీవులు మంచుగడ్డల లోను, సుమారు 78° C ఉష్ణోగ్రతగల ప్రదేశములందును కూడ నివసించును. పొలము మట్టిలో కోట్లకొలది సూక్ష్మ జీవులు జీవించుచుండును.
ఆకారమునందు శిలీంధ్రములలో గూడ ఏకకణజీవులు దారములవలె సన్నగను పొడవుగను శాఖలుగను ఉండు బహుకణజీవులుండును. ఈ ఉద్భిజ్జముల యొక్క శాఖా
శరీరమును బూజు (Mycelium) అని అందురు. ప్రతిశాఖను హైఫా (Hypha) అందురు. చారములవలెనుండు
శాఖలలో ప్రతి కణమునందును కేంద్రకము ఒకటిగాని ఒకటికంటే ఎక్కువగాని ఉండును. ఆశాఖలుఒక దానితో నొకటి పేనుకొని భూమి పై కివచ్చును. ఉ॥ పుట్టగొడుగులు.
శిలీంధ్రములు సజీవపదార్థములపైనము, చచ్చి కుళ్లుచున్న పదార్థములపైనను జీవించుచుండును. జీవించుచుండు పదార్థములపై పెరుగునవి 'పరాన్నభుక్కు' లనియు, చచ్చిపడియున్న 'వానిపై జీవించునవి పూతిభుక్కు 'లనియు అనబడును. శిలీంధ్రములలో పత్రహరితము లేనందున తమ యాహారమును తాము తయారు చేసికొనలేవు. కనుక ఇవి ఇతర సజీవపదార్థములపై లేక తడిగానున్న సేంద్రియ పదార్థములపై మొలచి, తమ సూక్ష్మ శాఖలను పదార్ధములోనికి పంపి, దానిని కరిగించి పారమును పీల్చుకొనును, పరాన్న భుక్కులుగా జీవించునవి నూలుపోగులవంటి తమ శాఖలను పోషకజీవి (host) యొక్క కణములలోనికి జొనిపి యాహారమును పీల్చుకొనుచుండును. ఇట్లు ఆహారమును పీల్చుకొనుట కుపయోగపడు శాఖలను 'పరాశ్రయి శొషక మూలములు'(Hanstona) అని అందురు. ఇట్లు పరాన్నభుక్కులగు శిలీంధ్రములు ఆహారమును పోషక జీవులనుండి పీల్చుకొనుటచే, పోషకజీవులు బలహీనత జెంది అనేక వ్యాధులకు గురియగుచుండును.
సాధారణముగా శిలీంధ్రములు ఏకకణముగల సిద్ద బీజములను ఉత్పత్తిచేయును. ఈ సిద్ధబీజములు కొన్నిటిలో చిన్నచిన్న సంచులలోను, మరి కొన్నింటిలో ప్రత్యేక మైన శాఖలపైనను పుట్టును లింగసంబంధమగు పునరుత్పత్తి శిలీంధ్రములలో ఒక్క తరగతిలో మాత్రమే స్పష్టముగా కనుపించును. లింగ సంబంధ పునరుత్పత్తిలో సమరూప జననకణములు (Isogametes) లేక భిన్నరూపజననకణములు (Heterogametes) పుట్టి వాని కలయికచే సంయుక్త బీజము పుట్టును. ఉదా॥ పిథియం (Pythium).ఈ సంయుక్త బీజమునుండి పుట్టు సిద్ధబీజములు ఒక్కొక్కటి శిలీంధ్రముగా పెరుగును. శిలీంధ్రముల యొక్క పునరుత్పత్తి విధానములను బట్టి వానిని సర్వసాధారణముగా నాలుగు తరగతులలో విభజింతురు.
- 1. ఆర్కీ మైసిటిస్ (Archimycetes)
- 2. ఫైకోమైసిటిస్ (Phycomycetes).
- 3. ఆస్కో మైసిటిస్ (Ascomycetes)
- 4. బెసిడియోమైసిటిస్ (Basidiomycetes)
సూక్ష్మజీవులు. (Bacteria): సూక్ష్మజీవులను శిలీంధ్రములలో నొక ప్రత్యేక తరగతిలో వర్గీకరణమున సాధా రణముగా చేర్చెదరు. ఇవి మిక్కిలి అల్పజాతికి చెందినవి. ఇవి ఏకకణపు జీవులు. వీనిలో కేంద్రకముండదు. కాని కేంద్రకమువలెనుండు పదార్థముండును. ఇవి కామా (,)
వలెను, కడ్డీలవంటి చిన్న ముక్కలవలెను (Bacilli), గుండ్రముగను (colli), మెలికలుగను (Spirillum) ఆకారము కలిగియుండును, ఇవి 1/1000 మిల్లీమీటరు మొదలు 1/500 మిల్లీమీటరు వరకు పొడవు కలిగియుండును.
సూక్ష్మజీవుల వలన జంతువులకే గాక వృక్షములకు కూడ ఎన్నియో వ్యాధులు కలుగుచున్నవి. టైఫాయిడ్, టిటానస్ (Titanus), కలరా (Cholera), క్షయ (T.B.), న్యుమోనియా (Pneumonia), గొంతులోని గవదలు (Tonsils) మొదలగు వ్యాధులు సూక్ష్మజీవుల వలననే మనుష్యులకు కలుగుచున్నవి. ఆపిల్, పియర్స్ మొదలగు పండ్లకు, వృక్షములకు ఒక విధమైన తెగుళ్ళు సూక్ష్మజీవుల వలన కలుగును.
సూక్ష్మజీవులు, మూడువిధములుగా తమ యాహారమును తయారుచేసికొనును. కొన్ని రకములగు సూక్ష్మజీవులు చచ్చిపడియున్న పదార్థములపై జీవించును. ఇవి కోన్ని Exothermic reactions గావించి దీనిలో వెడలు శక్తిని ఉపయోగించుకొని తమ యాహారమును తయారుచేసికొనును. అవి ఆహారమును శర్కరగా మార్చుకొని విపాకము (Fermentation) గావించి మద్యసారములను (Alcohols), ఆమ్లములను తయారుచేయును. ఇంతేగాక ఈ క్రియలో ఉత్పత్తియగు శక్తిని తమ యాహారమును తయారుచేసికొనుటకై ఉపయోగించుకొనును.
మరికొన్ని సూక్ష్మజీవులు పరాన్నభుక్కులై పోషకజీవి శరీరమందలి కణములను చంపి కరిగించి ఆ పదార్థమును తమ యాహారముగా నుపయోగించుకొనును. ఇందువలన పోషక జీవిలో వ్యాధులు పుట్టుచుండును.
కొన్ని రకములగు సూక్ష్మజీవులు తమ చుట్టుప్రక్కల నున్న నిరింద్రియ మిశ్ర ద్రవ్యములను (Inorganic Compounds) ఆమ్లజనీకరణము (Oxidation) గాని లఘూకరణము (Reduction) గాని చేయును. ఇట్లు చేయుటవలన వెడలు శక్తిని గ్రహించి, అవి తమ యాహారమును తయారుచేసికొని జీవించును. ఉదా. నత్రజనీకరణముచేయు సూక్ష్మజీవులు (Nitrogen fixing Bacteria), సూడోమోనాస్ రెడిసి కోలా (Pseudomonas Radicicola) మొదలగు సూక్ష్మజీవులు సెనగ, వేరుసెనగ, కంది మొదలగు పప్పులకు సంబంధించిన చెట్ల వేర్లలో నివసించును. ఇవి ఇసుక రేణువుల మధ్యనున్న నత్రజనిని (Nitrogen) తీసికొని మట్టిలోనున్న కొన్ని పదార్థములతో కలిపి నత్రతములుగా (Nitrates) మార్చును. ఇట్లు చేయుటవలన భూమిలో నత్రతములు హెచ్చి, భూసారము ఎక్కువగును. ఇట్టి భూమిలో పంటలు బాగుగాపండును.
సూక్ష్మజీవులలో లింగసంబంధపు పునరుత్పత్తి జరుగదు. కణవిభజనవలననే పునరుత్పత్తి జరుగును. ప్రతికణము 20-30 నిమిషముల కొకసారి విభజన చెందును. ఇట్లు 12 గంటలలో ఒక సూక్ష్మజీవి నుండి 16,00,000 సూక్ష్మజీవులు పుట్టును.
అంగభేదరహిత ఉద్భిజ్జములవలన ఉపయోగములు :
1. క్లోరెల్లా (Chlorella) లో పిండిపదార్థములు ఎక్కువగానుండుటచే దానిని ఆహారముగా నుపయోగించవచ్చును. ఇది ప్రతి మానవునకు 4 పౌనులు చాలును.
2. నీటిలో నుండు శైవలములను చేపలు మొదలగునవి ఆహారముగా నుపయోగించుకొనును,
3. 'ఖేరా'యను శైవలము దోమ గుడ్లను చంపును. కనుక నీటికుండ్లలో దోమలుపుట్టకుండ ఆ మొక్కలను పెంచుదురు.
4. నారింజరంగుగల శైవలములలో కొన్నిటినుండి అదము (Iodine) తీయుదురు.
5. కొందరు పుట్టగొడుగులను వండుకొని తిందురు.
6. కొన్ని శిలీంధ్రములనుండి మిక్కిలి ఉపయోగకరమైన మందులను తీయుదురు.
ఉదా. (Penicillium) నుండి పెనిసిల్లిన్ (Pencillin) అను మందు తీయుదురు. క్లావిసెప్స్ (Claviceps) నుండి (Ergotin) ఎర్గోటిన్ తీయుదురు.
7. మధుశిలీంద్రము (Yeast) సూక్ష్మజీవులు ద్రావకములో విపాకమును గల్గించును. గనుక వీనిని జున్ను, రొట్టెలు, మధుసారము, కొన్ని ఆమ్లములు తయారుచేయుటలో ఉపయోగింతురు.
ఉ. స.