సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్దేశాత్మక మనస్తత్వవాదము
ఉద్దేశాత్మక మనస్తత్వ వాదము -(Hormic Psychology): మన స్తత్వ శాస్త్రము (Psychology) బహు విధములైన పరిణామములను పొందినది. ఇందులకు ప్రధాన హేతువు, అదియొక నిర్దిష్ట శాస్త్రము (Exact Science) కాకపోవుటయే. ప్లేటో కాలమునుండియు యూరపులో మన స్తత్వశాస్త్రము వేదాంతశాస్త్రములో ఒక భాగముగా నుండెను. కాని 19 వ శతాబ్దములో అది వేదాంత శాస్త్రమునుండి చీలిపోయెను. పిదప ప్రకృతిశాస్త్రముగా అది పరిణమించి గొప్ప అభివృద్ధిని పొందినది. ప్రయోగాత్మక మన స్తత్వ శాస్త్రము (Experimental -Psychology), విద్యావిషయక మన స్తత్వ శాస్త్రము (Educational Psychology), సాంఘిక మనస్తత్వ శాస్త్రము (Social Psychology), క్రియాత్మక మనస్తత్వశాస్త్రము (Behaviourism) మొదలయినవి మనస్తత్వ శాస్త్రము పొందిన బహువిధములైన పరిణామములకు ఉదాహరణములు. అందు ఉద్దేశాత్మక మన స్తత్వ వాదము (Hormic Psychology) కూడ ఒక ప్రత్యేకతను సంపాదించు కొన్నది.
ఇరువదవ శతాబ్ది ఆరంభమున నిలచియున్న మనస్తత్వ శాస్త్రపు పోకడలు కొంతమందికి నచ్చలేదు. కేవలము మనస్సునకే ప్రాధాన్య మిచ్చుటకాని, కేవలము బాహ్య చర్యల పైననే ఆధారపడి వ్యక్తిలోని ఆంతర చైతన్యమును గుర్తింపకుండుటగాని, వీరికి సంతృప్తికరము కాకపోయెను. బాహ్యచర్యకును, అంతర చైతన్యమునకునుగల సంబంధమును చర్చించుట ముఖ్యమని వీరి వాదము. ఇట్టి వారిలో ప్రథముడు మాగ్డూగల్ అనునతడు. ఇతడు 1912 లో తన ఉద్దేశాత్మక మనస్తత్వ వాదమును చర్చించి, ప్రతిపాదించి యుండెను.
మన స్తత్వ శాస్త్రములో కారణములు, ప్రోద్బలములు, ఉద్దేశములు (motives, urges, purposes) ప్రధానములని మాగ్డూగల్ వర్గమువారు వాదించిరి. ప్రతి బాహ్యకార్యమునకును అంతరకారణము ముఖ్యము కాక తప్పదని వీరి వాదము. వీరి ఈ సిద్ధాంతమునకు ముఖ్య కారణము ఉద్దేశము. కనుక ఇది ఉద్దేశాత్మక మన స్తత్వ వాదము (purposive psychology) అని వ్యవహరింప బడినది. Hormic అనగా- గ్రీకుభాషలో “ప్రోద్బలము (urge)". ఈ పదమును బట్టి ఈ వాదమునకు ఆంగ్లమున Hormic Psychology అను పేరు పెట్టబడెను.
ఈ సిద్ధాంతములో ఉద్దేశము (purpose) ప్రధానాంశము. మానవ చర్యలన్నియు ఉద్దేశ పూర్వకములే. ఇంతకుముందు మానవ చర్యలలో ఇచ్ఛ (will) ఒక ముఖ్యాంశముగా గైకొనబడియుండెను. మానసిక చలనము (sensory stimulation) కండరములలో మార్పును తెచ్చి ఇచ్ఛను కలిగించును. కాని ఈ ఇచ్ఛను కార్యరూపములోనీకి మార్చుటకు మరొక శక్తి ఆవశ్యకము. అదియే ఉద్దేశము, క్రియాత్మక సిద్ధాంత (Behaviourism) వాదియగు వాట్సన్ (Watson) అంతర చైతన్యమును అంగీకరింప లేదు. అందుచే ఇతడు ఉద్దేశమును నిరాకరించెను. అతని దృష్టిలో బాహిర చైతన్యము, పరిసర ప్రభావజనితమే కాని ఆలోచనాధీనము కాదు. ఇతడు ప్రాణికోటినెల్ల, తన దృష్టిలో నుంచుకొని ఈ నిర్ణయమునకు వచ్చినట్లు కనబడును. జంతువుల చర్యలు కేవలము పరిసర ప్రభావ జనితములై నవుడు మానవులచర్యలు మాత్రము ఏల అట్టివి కారాదు?
ఈ బాహిరచై తన్యము ఒక ఉద్దేశముతోను (purpose) గమ్యాన్వేషణతోను జరుగుచున్ననని అంగీరించకతప్పదు. అయినను ఈ వాదము నంగీకరింపని క్రియాత్మక వాదము చేసిన ఈ క్రింది ప్రతివాదములు గనునింపదగినవి.
"1912 లో నే క్రియాత్మక వాదులు అంతర చైతన్యమును నిరాకరించి యుండిరి. ప్రకృతి శాస్త్రజ్ఞులు ప్రకృతి విషయములను వాటి నడవడినిబట్టి పరిశీలించినట్లే, మానవుని కూడ. అతని చర్యలను బట్టియే పరిశీలింపవలసి యున్నది." అని వాట్ల ను వ్రాసియుండెను. జణ్. వై. కుడ్ (Z. Y. kuo) లను చైనా మానసిక శాస్త్రవేత్త ఇట్లనెను—“మానవ చర్యకు ఉద్దేశముకలదు అనువాదము నిరర్థకము. శ్రద్ధగా పరిశీలన చేయకుండుటకు ఈ వాదము ఒక సాకుమాత్రమే. నూనవ చర్యలను శ్రద్ధగా పరికించు కొలది, శరీర శాస్త్రవిజ్ఞానము పెంపొంచుకొలది ఉద్దేశవాదము సమసిపోవుననుటలో సందేహములేదు." ఈ అభిప్రాయముపై వుడ్ వర్తు చేసిన విమర్శనము గమనింపదగినది. "ఈ వాక్యములు ఉద్దేశాత్మకమైన వ్యక్తివే ఈ వ్యక్తి యొక్క ఉద్దేశము క్రియాత్మక వాది పదజాలములో ఉద్దేశములేదని నిరూపింపజూచుటయే. క్రియాత్మక వాదుల సిద్ధాంతము సనుసరించి ప్రతి వ్యాపారమును దాని సూక్ష్మభాగములలోనికి విడదీయవలెను. అయినను క్రియలకు వెనుక నున్న ఉద్దేశమును త్రోసివేయజాలము. ఒక వ్యాపారమును సూక్ష్మపరిశీలన చేసినను ఆ విభాగముల యథార్థత నశించదు. రసాయన శాస్త్రజ్ఞుడు వీటిని విభజించి, ప్రాణవాయువు, ఉదజనుల సంయోగముచే కలిగినదని కనుగొనినను నీరు అబద్దమని కాని, దాని వివిధ లక్షణములు మిథ్య అని కాని నిరూపింప జాలడు. ఈ దృష్ట్యా నీరు జగత్తున కెంతముఖ్యమో, ఉద్దేశము వ్యాపారమున కంత ప్రధానమని చెప్పవచ్చును."
ఉద్దేశాత్మక వ్యాపారము, గమ్యాన్వేషణయు ఒకటియే అని స్థూలముగా చెప్పవచ్చును. ప్రతిసంపూర్ణ ఉద్దేశాత్మక వ్యాపారములోను కోరిక (desire), నిరీక్షణ(Foresight) అను రెండు అంశములు కలవు. గమ్యము (goal) ఎదుట కనబడుచునే ఉండును. ఆ గమ్యమును చేరవలెనను కోరిక జనించును. ఒక్కొకప్పుడు ఈ రెంటికిని సమన్వయము లేక పోవచ్చును. ఉద్దేశాత్మకముగా గాని గమ్యాన్వేషణలో సరియైన గమ్యనిరీక్షణలోని కృషిమాత్రము కానవచ్చును. గమ్యాన్వేషణలో అస్పష్టగమ్యముతో కూడిన కృషియుండగా ఉద్దేశాత్మకతలో నిరీక్షణకంటె కృషి యే ప్రధానమైనది.
మాగ్డూగల్ క్రియాత్మక వాదుల సిద్ధాంతము నంగీకరించియు వారివలె అంతర చైతన్యమును నిరాకరింప లేదు. క్రియాత్మక వాదులవలె మానవ చర్యలను కేవలము బాహ్య వ్యాపార దృష్టిలో పరికించినచో ఆచర్యల వెనుకనున్న సృజనాత్మక శక్తిని గ్రహింపజాలము. అపుడు మానవుని యంత్రముకంటె భిన్నునిగా చూడజాలము. మానవునకును, యంత్రమునకును భేదము లేదా? యంత్రము కేవలము బాహ్యశక్తిపై ఆధారపడియుండగామానవుడు స్వభావసిద్ధమైన అంతరశక్తులపై ఆధార పడుటలేదా ! అందుచే గమ్యమును చేరుటకు జరుపబడు మానవ వ్వాపారమునే క్రియ లేక వ్యాపారము (Behaviour) అనవచ్చును.
క్రియ, లేక వ్యాపారము గమ్యాత్మక మైనచో ఏగమ్య సిద్ధికొరకు క్రియ జరుగుచున్నది అను ప్రశ్న జనింపక తప్పదు. ఈ ఆలోచన మాగ్డూగలును కలవర పరచెను. గమ్యములు అనంతములు కావున వాటిని కొన్ని సహజ విభాగములనుగా చేయవచ్చును. భయపడిన పిల్లి చెట్టు మీద కెక్కును. కుందేలు బిలములోనికి పారిపోవును. అవి వాటి రక్షణ స్థానములు. రెంటికిని గమ్యములు వేరైనను వాటి వెనుకనున్న ఉద్దేశము లేక ప్రోద్బలము (urge) ఒక్కటియే. అది ప్రాణరక్షణ. కావున గమ్యములకు ఉద్దేశములు లేక ప్రోద్బలములు ప్రధానములు. వీటిని ప్రాథమిక ప్రోద్బలములు (Instincts) అని మాగ్డూగల్ పేర్కొనెను అతని దృష్టిలో ప్రాథమిక ప్రోద్బలము కేవలము యాంత్రికముకాదు. అది ఉద్దేశాత్మకమై గమ్యా పేక్షాయుతమైన కృషికి మూలమగుచున్నది. దానిలో భావము (emotion) చేరి యుండును. భయము అను భావము వలన సురక్షితస్థానము చేరుట అను గమ్యమును గూర్చి కృషి చేయబడుచున్నది.
ఉద్ధేశాత్మక కృషికి హేతు భూతములైన ప్రాథమిక ప్రోద్బలములను పండ్రెండింటిని మాగ్డూగల్, మొదట 1908 లో పేర్కొనెను. వాటిని ఎక్కువ మార్పులు లేకుండ సవరణచేసెను. చివరకు 1932 నాటికి ఈ క్రింది పదునేడు ప్రాథమిక ప్రోద్బలములను అతడు స్థిరపరచెను.
- (1) ఆహారమునందు కోరిక- ఆకలి (Hunger)
- (2) కొన్నిటిని నిరాక రించుట అసహ్యత (Disgust)
- (3) క్రొత్త వానిని పరిశీలించుట — జిజ్ఞాస (curiosity)
- (4) ప్రమాదమునుండి పారిపోవుట భయము(fear)
- (5) చీకాకు గిలిగిన పోరాడుట (To fight when frustrated) --కోపము (Anger)
- (6) లింగేచ్ఛ కలిగియుండుట (Mating Propensity.
- (7) బిడ్డలయెడ అనురాగము- (Mothering propensity)
- (8) సంఘములో నుండగోరుట సంఘప్రియత్వము(Gregarious propensity)
- (9) అధికారము చూపజూచుట- స్వీయాధిక్య ప్రకటన (Self assertive propensity)
- (10) హీనత్వము నంగీకరించుట- (Submissive propensity)
- (11) వస్తువులను చేయుట- సృజనశక్తి (Constructive propensity)
- (12) వస్తుసేకరణ—సంగ్రహణ (Acquisity propensity)
మాగ్డూగల్ చే పైని పేర్కొనబడిన ప్రాథమిక ప్రోద్బలములు మానవచర్యకు సహజమైన ఉద్దేశము. ఈ ఉద్దేశ సాధనకొరకే చర్య జరుగుచుండును. వీటిని గూర్చి మాగ్డూగల్ ఇట్లు వ్రాసెను. "ప్రత్యక్షముగా గాని, పరొక్షముగా గాని, ప్రాథమిక ప్రోద్బలములు మానవ చర్యకు ప్రధాన హేతువులు. అవి వారి గమ్యములను నిర్ణయించి, వాటిని చేరుటకు అవసరమైన శక్తిని ఇచ్చుచున్నవి. మనో వ్యాపారములు ఎంతటి క్లిష్టమైనవైనను ఈ ప్రాథమిక ప్రోద్బలముల కృషివలననే గమ్యములను పొందగలుగు చున్నవి”.
ఈ ప్రాథమిక ప్రోద్బలములు కార్యసాధనలో మూల ప్రోత్సాహకములు మాత్రమే. వాటితో మాత్రమే క్రియ పూర్తికాదు. అభ్యాసము (Learning) వలనను, అనుభ వము (experience) వలనను ప్రాథమిక ప్రోద్బలములు పరిణామము చెంది నూతన గమ్యములను చేర్చును. లేదా నూతనమార్గమున గమ్యములను చేర్చును. అంతేకాని మూల ప్రోద్బలములు మారవు. ఎప్పుడు పోరాడుట, ఎట్లు పోరాడుట అనునవి విజ్ఞానమువలన పరిణామము పొందునే కాని కోపము వచ్చినప్పుడు పోరాడుట అను గమ్యము మారిపోక నిలిచియేయుండును.
కాలక్రమమున ఈ ప్రాథమిక ప్రోద్బలములు మిళితములై ఒక్కొక్క పదార్థముపై కేంద్రీకరింపబడి మానవత్వమునకు అత్యవసరమైన అభిమానములు (Sentiments) గా మారుచున్నవి. లింగేచ్ఛయును, మాతృప్రేమలో ఇమిడియున్న పరిరక్షక వాంచయును (Protective tendency) కలిసి ఒక పురుషునికి ఒక స్త్రీపై ప్రేమ అను భావముగా రూపొంది మానవత్వమునకు దోహద మొనర్చుచున్నవి. దేశభక్తి కూడ ఇట్టి భావము అనియే చెప్పవచ్చును, ఇందు కొన్ని ప్రాథమిక ప్రోద్బలములు చేరియున్నవి. దేశము ప్రమాదములో నున్నపుడు భయము కలుగును. ఇతరులు తన దేశముపై దండెత్తునపుడు కోపము కలుగును. తన దేశమును ఇతర దేశములకన్న మిన్నగా చేయవలెనను ఆశయముచే స్వాధి స్థానత (self-assertiveness) జనించును. ఇవన్నియు ఏకమై అతనిలో దేశభక్తి (Patriotism) అను అభిమానమును జనింప జేయుచున్నవి. కావున మాగ్డూగల్ వాదము ననుసరించి సంఘ వ్యాపారములో అభిమానము కేవల మొక ప్రాథమిక ప్రోద్బలముచే కాక వాటి కలయికచే ఏర్పడుచున్నది. అదియే ప్రాముఖ్యమును వహించుచున్నది. ఆ అభిమానము లేనిచో మానవత్వమే లేదని చెప్పవచ్చును. ఉదా॥ మానవులలో సంఘ ప్రియత్వము కలదని మనకు తెలియును. కేవలము ప్రాథమిక ప్రోద్బలముగానే ఉండినచో అది మానవులను గుంపులుగా నుంచగలదేగాని, వారిని కలసిమెలసి ఘనకార్యములు చేయు వారినిగా చేయజాలదు. మరల సంఘజీవితము గూడ ప్రాథమిక ప్రోద్బలములను క్రమపరచి వాటిని సంఘాపయోగకరములనుగా మార్చుచున్నది. ఇది మాగ్డూగల్ చే ప్రతిపాదింపబడిన ఉద్దేశాత్మక మనస్తత్వ సిద్ధాంతము యొక్క స్వరూపము
ఇతర శాస్త్రవేత్తలు దీనిని ఆచరించిన విధము చూడదగినది. ఇది తొలుదొల్త సంఘ శాస్త్ర వేత్తలను (Sociologists) సమ్మొహితులను చేసెను. దీనిచే వ్యక్తి యొక్క స్వేచ్ఛను కాపాడవలసిన ఆవశ్యకము వారికి వ్యక్తమయ్యెను. ప్రాథమిక ప్రోద్బలజనితములైన మానవుల కొర్కెలను గౌరవించుట సంఘము యొక్క విధి అనుభావము ప్రభలమయ్యెను. అవసరమైనచో ఈ ప్రాథమిక ప్రోద్బలములు స్వేచ్ఛ కొరకు మానవ సంఘమును పునర్నిర్మించవలేను అని కూడ భావింపబడినది. కాని ఉద్దేశాత్మక సిద్ధాంతమునకు అనుకూలమైన ఈ తీవ్ర సాంఘిక వాదము ఎక్కువకాలము నిలువ జాలకపోయెను. వ్యక్తి స్వాతంత్య్రము వలన సంఘమునకు ప్రమాదము వాటిల్లును అనుభయము కొందరికి కలిగెను. సంఘము వ్య క్తిని మార్చుచున్నది. కావున వ్యక్తి స్వేచ్ఛను కోరుట తగదు. వ్యక్తి తన భాషను, నడవడిని, ఆచార వ్యవహారములను సంఘము నుండియే అలవరచుకొనుచున్నాడు. అతడు సంఘముచేత తీర్చిదిద్దబడుచున్నాడు. వ్యక్తి ఏ సంఘ సంస్కృతితో జీవించుచు, గర్వపడుచున్నాడో ఆ సంస్కృతి, ఆ సంఘము పెట్టిన భిక్ష గాని అన్యము కాదు. సంఘము ముందు, వ్యక్తి తరువాత. మనము మానవులవలె జీవించుచుండుటకు కారణము సంఘము కాని వ్యక్తి యొక్క ప్రాథమిక ప్రోద్భల ప్రభావముకాదు.
పై విధమున విమర్శించిన వారిలో ముఖ్యుడు ఎల్. ఎల్. బెర్నార్డ్ (L. L. Bernard) అను సంఘశాస్త్రవేత్త. ఆతడు ప్రాథమిక ప్రోద్భల సిద్ధాంతము అనంగికార్యమని దానిని పూర్తిగా నిరాకరించెను. మనస్తత్వశాస్త్ర వేత్తలు అందరును మాగ్దూగల్ ప్రాథమిక ప్రోద్బలసిద్ధాంతమును సమర్థింపలేదు. థారన్ డైక్ (Thorndyke) అనునాతడును క్రియాత్మక సిద్ధాంత వాదమునకు మూలపురుషుడగు వాట్సన్ (Watson) అనునతడును ఈ సిద్ధాంతము అసంపూర్ణమని నిరాకరించిరి. వారి దృష్టిలో మానవజీవిత మందంతటను ఈ ప్రాథమిక ప్రోద్బలములు పనిచేయజాలవు. క్లిష్టమయిన మానవవ్యాపారము అభ్యాసముచే (Learning)సాధింపనగునుగాని ప్రాథమిక ప్రోద్బలముల చర్యవలన కాదు. మరియు పది ప్రాథమిక ప్రోద్బలజన్య మైన చర్యయో, ఏది అభ్యాసము వలన జనించినదో నిర్ణయించుట కష్టము. అందుచే ఎక్కువమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రాథమిక ప్రోద్బలములకంటే అభ్యాసమునకే ఆధిక్యము నొసగిరి.
పై విమర్శనమువలన ఉద్దేశాత్మక సిద్ధాంతమునకుఅపచారము జరుగలేదనియే చెప్పవచ్చును. "పదునైదు సంవత్సరము లకు పూర్వము అమెరికనులు ఆ సిద్ధాంతమును పూర్తిగా నిరాకరించినను, ఇప్పుడు అంతయు మారినది. అమెరికను మనస్తత్వ శాస్త్రము ఉద్దేశాత్మక మయినది” అని 1930 లో మాగ్దూగల్ తన సంతృప్తిని ప్రకటించెను. జి. ఆ. మూ