Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉత్తర మీమాంస

వికీసోర్స్ నుండి

ఉత్తర మీమాంస :

ఉత్తర మీమాంస సముద్రతుల్యమైన గొప్పశాస్త్రము. మీమాంస అనగా చర్చ, విమర్శనము. మీమాంసాశాస్త్రము వేదముయొక్క చర్చ. వేదము సాధారణముగా నాలుగు భాగములుగ విభజింపబడినది. అవి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనునవై యున్నవి. సంహితలు దేవతాదిప్రార్థనలు, పొగడ్తలు. బ్రాహ్మణములు యాగాది కర్మానుష్ఠాన విధులను నిర్వచించును. ఆరణ్యకములు అరణ్యవాసులైన మునులు మొదలగువారి జ్ఞానానుభవములను బోధించును. ఉపనిషత్తులు పరతత్త్వమైన బ్రహ్మస్వరూప స్వభావములను బోధించును. వేదములు అపౌరుషేయములని మీమాంసకుల వాదము. పౌరుషేయములని నైయాయికుల వాదము, తొలుదొలుత మీమాంసకులు ఈశ్వరసత్తను గురించి ఉదాసీనత చూపిరి. అందుచే కొంతమంది నవీన విమర్శకుల అభిప్రాయము మీమాంసకులు ఈశ్వరసత్తను నిరాకరించిరనియే. ప్రపంచము మానవకర్మ బద్ధమనియు, ఈశ్వరతత్త్వమును అంగీకరించుట అవసరమనియు, ధర్మయుతమైన కర్మమే ప్రపంచ నియామకమనియు, అపౌరుషేయమైన వేదమే ధర్మస్వభావమును తెలియ జేయుననియు వారి వాదము. ఈవాదము ననుసరించియే.


యం శైవాః సముపాసతే శివ ఇతి
       బ్రహ్మేతి వేదాంతినః;
బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణ సచివః
       కర్తేతి నైయాయికాః
అర్హన్ని త్యథ జైన శాసనరతాః
       కర్మేతి మీమాంస కాః;
సో౽యం వై విదధాతు వాంఛితఫలం
       త్రైలోక్యనాథో హరిః॥

- సుమంగళ స్తోత్రము

అను శ్లోకము ప్రచారితమైనది. ఇందు మీమాంసకులు కర్మనే ఈశ్వరునిగా భావించినట్లు చూపబడినది. ధర్మ ప్రధానత బ్రాహ్మణముల ముఖ్యాభిప్రాయము. బ్రహ్మ ప్రధానత ఆరణ్యకములయొక్క, ఉపనిషత్తులయొక్క ముఖ్యోద్దేశము. ధర్మముకొరకు కర్మ ముఖ్యము. బ్రహ్మకొరకు కర్మను విడచుట అవసరము. అందుచే పరస్పర విరుద్దములుగ కనిపించు ఈ రెండు వాదములకు ఏకమని ఒప్పుకొనిన వేదమే కారణమయ్యెను. వేదోద్దేశము స్పష్టీకరించుటకు రెండు మీమాంసలు ప్రారంభమయ్యెను. ఈ రెంటికి పూర్వమీమాంసయని, ఉత్తరమీమాంస యని పేర్లు. పూర్వమీమాంసకు ప్రధానమైనవి బ్రాహ్మణములు. తదితర వేదభాగములు గౌణములు. ముఖ్యోద్దేశము ధర్మజిజ్ఞాస. ఉత్తర మీమాంసకు ప్రధానమైనవి ఉపనిషత్తులు. తదితర వేదభాగములు గౌణములు. ముఖ్యోద్దేశము బ్రహ్మజిజ్ఞాస.

ధర్మస్వరూపమును తెలుపుటకై జైమిని (క్రీస్తు పూర్వము 4 వ శతాబ్దము) మీమాంసా సూత్రములని అపరనామముతో పిలువబడు ధర్మసూత్రములనువ్రాసెను. బ్రహ్మస్వరూపమును నిర్వచించుటకు బాదరాయణుడు వేదాంతసూత్రములను అపరనామముగల బ్రహ్మసూత్రములను లిఖించెను. బాదరాయణుని కాలము విషయమై విమర్శకులు భిన్న భిన్నమైన అభిప్రాయములను తెలిపియున్నారు. కొందరు బాదరాయణుడు క్రీ. పూ. 500 సం. లకు చెందియుండుననియు, కొందరు క్రీస్తుతర్వాత 200 సం.లకు చెందియుండుననియు, మరికొందరు తన్మధ్యశతాబ్ద ములకు చెందియుండుననియు నుడువుదురు. ఏది అయినను వేదాంతసిద్ధాంతము బాదరాయణునితో కాక అతనికి పూర్వమే ప్రారంభమయియున్నట్లు తెలియును. బాదరాయణుడే కాశకృత్స్నుడు, ఔడులోమి, బాదరి మున్నగు ఋషుల పేర్లు పేర్కొనియున్నాడు, కాని వారి ప్రత్యేక సిద్ధాంతములేవో తెలిసికొనుట అంత సులభమైన పనిగాదు. ఒకే ఋషికి భాష్యకారులు భిన్న భిన్న సిద్ధాంతములను ఆరోపించియున్నారు.

బ్రాహ్మణములు గాని ఉపనిషత్తులు గాని ఒకే గ్రంథకర్తచే రచింపబడినవి కావు. అవి వేరువేరు ఋషుల అనుభవ వాక్యములై సంప్రదాయానుసారముగా సంపుటి కృతములైయున్నవి. అందుచేత నవి పరస్పర విరుద్ధముగ ఒక్కొక్కచోట కనిపించును. ఈ విరోధములను తొలగించి ఉపనిషదర్థములన్నియు సమన్వయించుచు బ్రహ్మస్వరూపమును, స్వభావమును నిర్వచించుట బ్రహ్మసూత్రముల ముఖ్యోద్దేశము.

వేదాంతము అనగా వేదము యొక్క అంతిమభాగమనియు వేదము యొక్క సారమనియు రెండర్థములు చెప్పుటకలదు. ఏ అర్థమైనను ఉపనిషత్పరమే. ఉపనిషత్తులు ప్రస్తుతము నూటఎనిమిది అని లేక నూటపండ్రెండు అని అందురు. ఇంకను అవి అధికసంఖ్యకలవై ఉండవచ్చును. కాని వాటిలో ముఖ్యమైనవి పది అని, పదకొండు అని, పండ్రెండు అని, ఇట్లు అభిప్రాయ వైవిధ్యము కలదు. ఇవియే ప్రాచీనములనియు తక్కినవి తర్వాత కల్పింపబడినవనియు విమర్శకు లనుచున్నారు. సామాన్యాభిప్రాయమునుబట్టి యవి పదకొండని తెలియుచున్నది. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక, కైవల్యోపనిషత్తులు అనునవై యున్నవి.

వేదము ప్రమాణమగు అర్హమతమగుటచేత వేరు వేరు మతములవారు తమ మతములు ఆర్షమతములని నిరూపించుటకు, ఉపనిషత్తులు తమమతమునే స్థాపించుచున్నవని చూపుటకు ప్రయత్నించిరి. తదుద్దేశములో వారందరు బ్రహ్మసూత్రములపై భాష్యములు వ్రాసి బ్రహ్మసూత్రములు కూడ తమ తమ సిద్ధాంతములనే స్వీకరించినట్లు నుడివిరి. ప్రస్తుతము లభించు ప్రసిద్ధ భాష్యములలో శంకరాచార్యులవారిది మొదటిది.

ఇప్పటివరకు ముద్రితమైన భాష్యములు పది మతములకు చెందియున్నవి. భాష్యకారులలో శంకరాచార్యులు (రమారమి క్రీస్తు తర్వాత 8 వ శతాబ్దము), భాస్కరాచార్యులు (9 వ శతాబ్దము), రామానుజాచార్యులు (11 వ శతాబ్దము), మధ్వాచార్యులు (13 వ శతాబ్దము), శ్రీకంఠాచార్యులు (13-14 వ శతాబ్దము), నింబార్కాచార్యులు (13 వ శతాబ్దము), వల్లభాచార్యులు (15 వ శతాబ్దము), విజ్ఞానభిక్షు (15 వ శతాబ్దము), బలదేవాచార్యులు (15–16 వ శతాబ్దము), శ్రీపతి (16వ శతాబ్దము), ముఖ్యులు. శ్రీశుకభాష్యమని ఒకటి ఉన్నట్లు హయవదనరావుగారు వ్రాసినారు. కాని అది ఇంకను అచ్చుపడలేదు. ఈ పదిమందిలోను నింబార్కుడు, వల్లభుడు, శ్రీపతి, యనువారు ముగ్గురును ఆంధ్రులని వాడుక. కాని వారి మతము ఆంధ్రదేశమున ఎక్కడను కనిపించకపోవుట విచారణీయము.

భారతదర్శన శాస్త్రమున శబ్దమును ప్రమాణముగ గ్రహించునవి ముఖ్యముగ వేదములు, ఆగమములునై యున్నవి. అందరు స్మృతులను పురాణములను కూడ ప్రమాణములుగ గ్రహించిరి. అయినను స్మృతులకంటె వేదములకును, ఆగమములకును ఎక్కుడు ప్రాముఖ్యము కలదు. భాష్యకారులలో శంకరుడు, భాస్కరుడు ఒకవేదమునే ఆధారముగా గ్రహించిరి. తక్కినవారు ఆగమములను గూడ ప్రమాణముగా గ్రహించిరి. ఈ ఆగమములు, పాంచరాత్రాగమములు, పాశుపతాగమములు, శాక్తాగమములు అని మువ్విధముల నున్నవి. మొదటివి వైష్ణవులవి, రెండవని శైవులవి, మూడవవిశాక్తేయులవి. అందులో శాక్తమతానుసారము లిఖించిన బ్రహ్మసూత్రభాష్యము పేరొందినది. అది ఇంతవరకును ముద్రితమైనట్లు కనిపించదు. ఎక్కువగా తెలిసినవి పై సుదహరించిన పదిమాత్రమే. ఈ భాష్యకారులలో రామానుజుడు, మధ్వుడు, నింబార్కుడు, వల్లభుడు, విజ్ఞానభిక్షు, బలదేవుడు అనువారు వైష్ణవులు. శ్రీకంఠుడు, శ్రీపతి యను నుభయులును శైవులు. శ్రీ శుకుడు కూడ వైష్ణవుడను ప్రతీతి కలదు. భాస్కరభాష్యము ముద్రితమైనను భాస్కరమతానుయాయులు పెక్కురు కనిపించరు.

వేదాంతసూత్రములకే ఉత్తరమీమాంస అని పేరు. దాని ముఖ్యోద్దేశము జీవబ్రహ్మ, జడప్రపంచముల స్వభావము, స్వరూపము, తత్పరస్పరసంబంధము తెలుపుటయై యున్నది. ఈ పదిమంది ఆచార్యులు పది భిన్నమతములను ప్రకటించియున్నారు.

శంకరుడు జీవబ్రహ్మైక్య వాదమును ప్రతిపాదించెను. జీవుడు నిజముగా పరబ్రహ్మయే యనియు, జీవునకు బ్రహ్మభిన్న తాజ్ఞానము అజ్ఞానకృతమనియు ఆతనిమతము. జడప్రపంచము మిథ్య. బ్రహ్మమొక్కటే సత్యమైనది. ప్రపంచము మాయాకృతము. స్వరూపమునను, స్వభావమునను జీవుడు బ్రహ్మకంటె అభిన్నుడే. ప్రపంచముయొక్క సత్యత వ్యావహారికము గాని, పారమార్థికముగాదు. ప్రపంచము, జీవుని సంకుచితభావము, కేవలము అవభాసలు. మాయ యొక్క స్వభావము సత్తగాదు, అసత్తగాదు. అది అనిర్వచనీయము. రజ్జువును చూచి సర్పమని భ్రాంతిచెందినటుల పరబ్రహ్మమునే చూచి ప్రపంచమని భ్రాంతిచెందుచున్నాము. మాయను ఉపాధిగాజేసికొని బ్రహ్మ జీవస్వరూపమును దాల్చును. అపరిమితమైన బ్రహ్మము పరిమితమగును. అట్లు బ్రహ్మము పరిమితమై, బహిర్ముఖమై, బాహ్యప్రపంచము లేకపోయినను ఉన్నట్లు భావించును. సర్వము బ్రహ్మా౽భిన్నము, స్వా౽భిన్నము. అయినను, జీవుడు భేదబుద్ధి పొందును. తత్కారణముగా భయావిష్టుడై, తన మహత్తును తాను తెలిసికొనలేక, జరామరణాది దుఃఖములను పొందును. ఈ విపత్తునుండి తప్పించుకొనుటకు బ్రహ్మజ్ఞానమే దివ్యమైనమార్గము, కర్మ ద్వైతాధారము, అద్వైతమున కర్మకు తావులేదు, బ్రహ్మజ్ఞానము కర్మబంధములనుండి విముక్తిచేయును. కనుక కర్మసన్యాసము, జ్ఞానప్రాప్తియు అత్యావశ్యకములు.

ఈ సిద్ధాంతమును భాస్కరుడు అంగీకరించలేదు. బ్రహ్మమునకును, జడ ప్రపంచమునకును ఐక్యము సంభవించదు. జడము బ్రహ్మభిన్నము. జీవుడుమాత్రమే బ్రహ్మాభిన్నుడు కాగలడు. బ్రహ్మాభిన్నమైన జడము ఉపాధియై బ్రహ్మమును జీవరూప విశిష్టముగా జేయును. జ్ఞానోదయమైన తర్వాత జీవుడు తన పరిమితభావమును విడిచి, దేహతాదాత్మ్యము వదలి, ఉపాధిని విసర్జించి, తన అంత స్స్వరూపమైన బ్రహ్మభావమును పొందును.

జడము సత్యము. శంకరుడు చెప్పినట్లు మాయకాదు. సత్యమైనను బ్రహ్మముకంటె అత్యంతభిన్నము కూడ కాదు. అభిన్నముకూడ అయియున్నది. బ్రహ్మవినాభూతము జడము. శంకరునివాదమునకు ఆద్వైతవాదమని పేరు. భాస్కరుని వాదమునకు భేదాభేద వాదమని నామము.

రామానుజుడు అద్వైతవాదమును భేదాభేదవాదమునుకూడ అంగీకరింపలేదు. భేదాభేదములు పరస్పర విరుద్ధములు. రెండువ్యక్తులు భిన్నమైనచో అభిన్నములు కానేరవు. అభిన్నములైనచో భిన్నములు కానేరవు. అందుచే భేదాభేదములు రెండు ఒక్కచోటనే వర్తింపజాలవు. అదియునుగాక పరబ్రహ్మమును ఉపాధి ఆక్రమింపజాలదు. ఆ బ్రహ్మము స్వయం అపరిమిత స్వరూపము కలది. అది తేజోబలములకు రాశి. జడము బ్రహ్మాధారముగాని, బ్రహ్మము జడాధారముగాదు. పరతంత్రమైన జడము స్వతంత్రమైన బ్రహ్మమును ఉపహితము చేయజాలదు. అందుచేత బ్రహ్మము జడోపహితము కాగలదని చెప్పుటకు వీలులేదు. ఆ కారణముచేత జీవుని ఆత్మ మొట్టమొదటినుండియు బ్రహ్మమునకు భిన్నమనియే ఒప్పుకొనవలయును. జడమునకు జీవుడు ఎట్లు ఆత్మయో, జీవునికి తనఆత్మ ఎట్లున్నదో, అట్లే జీవాత్మకు పరబ్రహ్మము ఆత్మ. పరబ్రహ్మమునకు శరీరము జీవుడు. జీవునికి శరీరము జడము. అన్నింటికిని అవినాభావసంబంధము'. ఇట్లు జీవజడ విశిష్టమైన బ్రహ్మమే అద్వైతమని ఉపనిషత్తులు చెప్పును. ఇట్లు విశిష్టమైన అద్వైతమును బోధించుటచే రామానుజుని మతమునకు విశిష్టాద్వైతమని పేరు. రామానుజుడు, శంకరుడు ప్రతిపాదించిన మాయను అంగీకరింపలేదు. ప్రపంచము బ్రహ్మమునకు విశేషణమైనప్పుడు మాయ కాజాలదు. అందుచేత ప్రపంచము సత్యమే. అదియునుగాక, మాయకు స్థానము బ్రహ్మమా లేక జీవుడా అను విషయము విమర్శించతగినది. బ్రహ్మమయినచో, శుద్ధస్వరూప, జ్ఞానస్వరూప విశిష్టమైన బ్రహ్మము, అశుద్ధస్వరూప, అజ్ఞాన స్వరూపములతో విశిష్టమైన మాయకు ఆశ్రయము కాజాలదు. జీవుడే అయినచో, జీవుడు పూర్వము ఉన్నగదా మాయకు ఆశ్రయము కాగలడు? కాని జీవుడే మాయాకార్యమని శంకరుడు బోధించును. అయినచో కారణము కార్యముకంటె పూర్వమున ఉండవలెను. మాయ జీవునికి కారణము, కార్యము కూడ కాజాలదు. అందుచేత, మాయ అసంభవము. కనుక శంకరుని అద్వైతమును స్వీకరింపజాలమని రామానుజాచార్యులవారి వాదమైయున్నది.

శంకరుడు తప్ప వేదాంతులెవ్వరు మాయను స్వీకరింపరైరి. మాయను ఈశ్వరశక్తియని ఒప్పుకొన్నను ఆశబ్దము సత్తగాదు; అసత్తగాదు అను నర్థము ఈయజాలదు. అందరు ప్రపంచము సత్యమనియే వాదించిరి. రామానుజుడు బ్రహ్మము ఈశ్వరుడేయనియు, అది పరమపురుషుడనియు, విష్ణువు అనియు బోధించెను. శంకరుడు పరబ్రహ్మము పురుషస్వరూపము కాదనియు, ఈశ్వరుడు పరబ్రహ్మము కాడనియు, అపరబ్రహ్మమనియు చెప్పెను. శంకరుడుతప్ప తక్కినవారందరు పరబ్రహ్మము ఈశ్వరుడే అనియు, సగుణమనియు, అది విష్ణుస్వరూపముగాని శివస్వరూపముగాని యైయున్నదనియు వాదించిరి. అట్లుచేయుట వేదవిరుద్ధమని, ఆ సిద్ధాంతములకు ఆధారములైన పాశుపత పాంచరాత్రాగమములు వేద బాహ్యములని స్మృతులు, పురాణములు, సగుణుడైన ఈశ్వరుని వర్ణించినను, ఆవర్ణనలను శ్రుతిప్రాధాన్యము కలవాటినిగా నిర్వచించవలెనని అతడు వాదించెను. అందుచేత శంకరుడొక్క డే స్మార్తుడని, అనగా శ్రుతిస్మృత్యనుయాయి అని, తక్కినవారు స్మార్తులుకారని సంప్రదాయాభిప్రాయము.

మధ్వాచార్యులు పై ముగ్గురి మతములను స్వీకరించలేదు. ప్రపంచము, జీవుడు సత్యములే. స్వతంత్రులుగాక పరతంత్రులే. అయినను బ్రహ్మమునకును జీవునికిని అత్యంత భేదము కలదు. పరబ్రహ్మమైన ఈశ్వరుడు తన స్వరూపశక్తిచే జీవులను జడమును సృజించును. ఆ శక్తిచేతనే వాటిని నియమించును. ఈ శక్తి పేరు మాయ. అయినను, ఇది శంకరుని మాయవలె అసత్యముకాదు. సత్యమే. పరబ్రహ్మస్వరూపము అసత్యము కాజాలదు. జీవబ్రహ్మములకు శరీర శరీరిభావము అంగీకరించజాలము. శరీరములో బాధకలిగిన శరీరి అనుభవించును. కాని పరబ్రహ్మమునకు దుఃఖముఎన్నడునులేదు. అదినిత్యానందస్వరూపము. జీవుడు తన సుఖదుఃఖములను తానే అనుభవించును. అందుచే జీవబ్రహ్మములకు పూర్ణభేదము అంగీకరించవలెను. ఇట్లు పూర్ణభేదమును బోధించుటచే మధ్వాచార్యులవారి మతమునకు ద్వైతమని పేరుకలిగినది. శ్రీకంఠుడు శైవుడు. అతడు పరబ్రహ్మము శివుడని చెప్పును. అతడు రామానుజునివలె విశిష్టాద్వైతి. పెక్కువిషయములలో ఈతనికిని రామానుజునికిని భేదములేదు. కాని అప్పయ్యదీక్షితులు ఇతడు అద్వైతిఅని పొరపాటుపడెను. ఈ ప్రపంచము ఎట్లు ఉద్భవించినదను ప్రశ్నకు వీరందరు అది ఈశ్వరశక్తి యొక్క పరిణామమని చెప్పుదురు. ఈశ్వరశక్తి ఈశ్వరునివలె సత్యమే. శంకరుడొక్కడుమాత్రము, ఈశ్వరశక్తికి సత్యాసత్యములు ఒప్పుకొననందున, ప్రపంచము బ్రహ్మవివర్తమని చెప్పెను. ఇంకను ఒక్క విశేషముకలదు. ఈశ్వరశక్తి ఈశ్వర స్వరూపమగుటచే, శక్తిపరిణామము ఈశ్వర స్వరూపపరిణామము; అందుచే ఈశ్వర పరిణామము. బ్రహ్మపరిణామమే సృష్టిఅనియు, బ్రహ్మవివర్తమే సృష్టిఅనియు, రెండువాదములు వేదాంతమున గలవు.

నింబార్కునిమతము ద్వైతాద్వైతమని, భేదాభేదమనికూడ పిలువబడును. భాస్కరుడు బ్రహ్మమునకు జడమునకు సర్వదా భేదాభేదసంబంధము కలదనియు, బ్రహ్మమునకును జీవునికిని ముక్తిదశయందు మాత్రము అభేదము సిద్ధించుననియు వాదించెను. నింబార్కుడు బ్రహ్మమునకును జీవునికిని ముక్తిదశయందుకూడ భేదాభేదము కలదని అనును. ఉపనిషత్తులు భేదమును అభేదమునుకూడ ఉద్ఘోషించుచున్నవి. అందువలన రెండునుసత్యమే. నింబార్కుడు ఇంకొక విషయమునుకూడ ముందునకు తెచ్చెను. భాస్కరుని మతానుసారము జీవుడు జడోపహిత బ్రహ్మమేకనుక ఉపాధినుంచి విడుదల అయినప్పుడు సాక్షాత్ బ్రహ్మస్వరూపమును పొందును. సంసారదశయందు జీవునియొక్కయు బ్రహ్మము యొక్కయు స్వభావము ఒక్కటే. స్వరూపము మాత్రము భిన్నము. అందుచేత జీవ బ్రహ్మములకు భేదాభేదము. ముక్తిదశయందు స్వరూపమున స్వభావమున అభేదము మాత్రము చెప్పవలయును. నింబార్కుని మతము ప్రకారము జీవబ్రహ్మములు ముక్తిదశయందు కూడ స్వరూపమున భిన్నత్వము కల్గియుండును. స్వభావమున అభేదము, స్వరూపమున భేదము అంగీకరించుటచే నింబార్కుని మతమునకు భేదాభేదమని ద్వైతాద్వైతమని పేరువచ్చినది.

వల్లభునిమతము శుద్ధాద్వైతమని పిలుపబడును. ఈయన వైష్ణవాద్వైతి. ఈతని అద్వైతమునకు, శంకరుని అద్వైతమునకు భేదమున్నది. శంకరుడు అశుద్ధస్వరూపిణియైన మాయాశ క్తి సహాయమున తన అద్వైతమును సాధించెను. వల్లభుడు శుద్ధస్వరూపుడైన ఈశ్వరునికి అశుద్ధ స్వరూపిణియైన మాయతో సంబంధము కలుగజేయుటకు ఒప్పుకొనలేదు. శంకరుని మతానుసారముగా మాయాశక్తిసహాయము లేనిదే ప్రపంచము పుట్టనేరదు. కాని వల్లభుడు మాయయొక్క అవసరము లేకుండగనే అపరిమిత తేజోరాశియైనందున ఈశ్వరుడు జీవులను ప్రపంచమును సృజింపగలడని చెప్పెను. ఈశ్వరుడు అపరిమితుడు. అందుచేత ఆయన స్వంతసత్తలో ఒకభాగము ప్రపంచముక్రింద ఆవిర్భూతమైనను ఆయన అపరిమితత్వమునకు నష్టముండదు. పూర్ణమునుండి పూర్ణము కొట్టివేసిన పూర్ణమే మిగులునని ఈశావాస్యోపనిషత్తు చెప్పుచునే యున్నది. సృష్టికూడ సత్యమే. జీవుడు సత్యమే. బ్రహ్మము అద్వితీయమయినను పురుషస్వరూపము సగుణము. బ్రహ్మము నిర్గుణమని ఒక్క శంకరుడే వాచించెను.

విజ్ఞానభిక్షు తన బ్రహ్మసూత్ర భాష్యమును సాంఖ్యమతానుసారముగా వ్రాయుటకు తలపెట్టెను. కాని సాంఖ్యమతమున ఈశ్వరుడులేడు. యోగమతమున కలడు. సాంఖ్యయోగములకు పరస్పరసంబంధము కలదు. యోగమతమును కొందరు సేశ్వరసాంఖ్యమని కూడ చెప్పుదురు, అందుచే విజ్ఞానభిక్షు సాంఖ్యయోగములను కలిపి బ్రహ్మసూత్రభాష్యము వ్రాసెను. ఈశ్వరుని ఒప్పుకొననిచో ఉపనిషద్బ్రహ్మమును నిరాకరించవలసివచ్చును. ఒప్పుకొన్నప్పుడు సాంఖ్యప్రకృతిపరిణామమును ఈశ్వరశక్తిపరిణామముక్రింద మార్చవచ్చును. జీవులు అనంతములు. ఈశ్వరభిన్నములు. అయినను కొంత అభేదము కూడ కలదు. భేదము ప్రధానము. అభేదము గౌణము. పురుషప్రకృతిసంయోగమయినప్పుడు ప్రకృతి ప్రపంచరూపముగా పరిణమించును. ముక్తి సాంఖ్యముక్తివలెను, ప్రప్రథమ జీవి, పురుష ప్రకృతులకు సంయోగములు కలిగించును. ప్రపంచము ఈశ్వరశక్తి రూపమైన ప్రకృతి యొక్క పరిణామమైనను తదంతర్గత సుఖదుఃఖములు ఈశ్వరుని చెందవు. ఏలన ఈశ్వరుడు ప్రపంచమునకు ఉపాదానకారణము కాడు. కేవలము ఆధారకారణము. బల్లపై నున్న వస్తువులు కదలినను బల్ల కదలనట్లు ఈశ్వరాశ్రయమైన జీవులకు సుఖదుఃఖములు కలిగినను, అవి ఈశ్వరునికి చెందవు.

బలదేవుడు చైతన్యమత సంప్రదాయానుసారముగా బ్రహ్మసూత్ర భాష్యమును వ్రాసెను. ఈతని మతమునకు అచింత్య భేదాభేదమని అందురు. జీవేశ్వరుల మధ్య భేదము అభేదము కూడ వర్తించును. భేదాభేదములు పరస్పర విరుద్ధము లగుటచే ఎట్లు వర్తించునో అనునది అచింత్యము. ఉపనిషత్తులు రెండుసంబంధములు సత్యములని చెప్పుచున్నవి. ఎట్లు సత్యములో గ్రహించుటకు బుద్ధికి సమర్థతలేదు. పరమేశ్వరునకు మూడుశక్తులున్నవి. మొదటిది పరశక్తి. దీని అధీనమున తక్కిన శక్తులు ఉండును. పరశక్తి ద్వార బ్రహ్మము ప్రపంచమునకు జీవులకు ఉపాదానకారణము. ఇది బ్రహ్మమునకు అంతరీయము. రెండవ శక్తిని మాయ అని పిలుతురు. దీని పరిణామమే జడప్రపంచము. ఇది జీవుని మోహితునిగా జేసి బంధించును. జీవుడు ఆ బంధమునుండి విదళించుకొనినప్పుడే ముక్తిని పొందును. ముక్తి యనునది జీవుని స్వరూప ప్రాప్తి. ఈ శక్తిని ప్రకృతి అని మాయ అనిపిలిచినను, శంకరునిమాయవలెగాక, ఇది సత్యపదార్థమే. ఈ శక్తుల మధ్య మూడవది అపరశక్తి నామకము కలదు. దీని ద్వారమున బ్రహ్మము జీవులను సృజించును. ఇది మాయాశక్తివలెజడముకాదు. జీవబ్రహ్మైక్యము, జూత్యైక్యము మాత్రమే. ఉదాహరణము. మానవులందరు పరస్పర భిన్నులు. అయినను మానవజాతి (universal) అందరియందును ఒకటే. అందుచేత ఒకవ్యక్తియందున్న మానవజాతియు, రెండవవ్యక్తి యందున్న మానవజాతియు ఒక్కటే. అయినను మొదటివాడొక విశేషవ్యక్తి, రెండవవాడు ఇంకొక విశేషవ్యక్తి. ఆలాగుననే బ్రహ్మము జీవులందరియందును జాతిరూపముగా ఒక్కడేయైనను విశేషరూపముచేత మానవులందరు ఖిన్నులు. ఈవిధముగనే మధ్వాచార్యులు బలదేవునకు పూర్వము భేదము సాధించెను.

ఇవి వేదాంతుల పద్ధతులు. రామానుజాచార్యులవలె కొందరు శరీర శరీరి భావముద్వారమున ఉపనిషత్తుల భేదాభేద వాక్యములను సమన్వయించిరి. కొందరు భాస్కరునివలె స్వరూపస్వభావ భేదసహాయమున నిర్వచించిరి. మరికొందరు, ముఖ్యముగా బలదేవ ప్రభృతులు సామాన్య విశేషభావములను సహాయముగా గ్రహించిరి. శంకరుడు భేదవాక్యములను, మధ్వాచార్యులు అభేదవాక్యములను, తద్విరుద్ధ వాక్యపరత్వముచేసిరి.

శ్రీపతి వీరశైవమతావలంబి. ఆగమ ప్రధానుడైనను, వేదమును స్వీకరించి బ్రహ్మసూత్రభాష్యమును వ్రాసెను. ఈతనిమతమును భేదాభేదమని, విశిష్టాద్వైతమనిపిలుతురు. ఆతడు నింబార్కునికంటె ఒకమెట్టు పైకెక్కెను. ఆతడు ముక్తియందు కూడ జీవబ్రహ్మలకు స్వభావైక్యమే కాక స్వరూపైక్యముకూడ ఉన్నదని చెప్పెను. సంసారదశయందు ముక్తిదశయందుకూడ స్వభావాభేదము, స్వభావభేదము, స్వరూపాభేదము, స్వరూపభేదము అను నీ నాలుగు వర్తించును. ఇది ఎట్లు సంభవము అనుప్రశ్నకు అతడు, "మేము కేవలము యుక్తిప్రామాణ్య వాదులముకాము. శ్రుతిప్రామాణ్య వాదులముకూడ, శ్రుతి భేదాభేదములు రెండు ఒప్పుకొని యున్నది. కావున అవి రెండును సంసారదశయందును ముక్తిదశయందును కూడ వర్తించవలెను" అనును. శ్రుతిచెప్పినది అనుభవ వేద్యముగాని, కేవలము యుక్తి నిరూపణీయముగాదు.

శుక్రాచార్యుని మతమునుగురించి మనకు విశేషముగా తెలియదు. ఈతని మతములో శంకర సంప్రదాయములు కొన్ని, భాగవత సంప్రదాయములు కొన్ని మిళితములు అయ్యెనని హయవదనరావుగారి ఆశయము. కొంతమంది శంకరానుయాయులవలె శుకుడు ఏకజీవవాదము అంగీకరించుననిరి. దానినిబట్టి బ్రహ్మవలె జీవుడు కూడ ఒక్కడే. జీవబహుత్వమైనను ఒప్పుకొనుటలేదు. జీవుడు ఒక్కడైనను యోగవిభూతివలన యోగి బహురూపములు దాల్చగలిగినట్లును, స్వప్నావస్థయందు మనస్సు ఒక్కటే అయినను తనరూపమును తన శత్రురూపమును దాల్చి యుద్ధముచేయునట్లును, ఒకేజీవుడు బహుజీవరూపములను దాల్చును.

పి. టి. రాజు