Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉత్కళదేశ చరిత్ర

వికీసోర్స్ నుండి

ఉత్కళదేశ చరిత్ర :

ఋగ్వేదకాలమున నుత్కలనామ ముండినట్లు తెలియదు. కాని రఘువంశ కావ్యకాలమునకు (క్రీస్తు తర్వాత 4 వ శతాబ్దాంతమని కొందరి వాదము) ఉత్కలదేశ మేర్పడి యుండెను. మహానది, గోదావరి నదుల మధ్య దేశము కళింగమనియు, గంగా, మహానదుల మధ్యదేశ ముత్కలమనియు పిలువబడెను. ఉత్కలములోని పశ్చిమభాగమున ఓడ్రజాతి ప్రథమమున నివసించెను. వారు పతిత క్షత్రియులుగను, అనార్యులుగను, ప్రాచీన వాఙ్మయమున వర్ణింపబడిరి. వారి భాషయు సవరభాషవలె అనాదిగాను, కేవల వాగ్రూపముగను ఉండెను. ఉత్కళులు, ఓడ్రులు, కళింగులు, వేరువేరుజాతులు. కపిశానది కుత్తరభాగమున ఉత్కళదేశమును, దక్షిణభాగమున కళింగదేశమును ఉండెనని రఘువంశమునుబట్టి తెలియును. యూవన్ చంగ్ వ్రాతలనుబట్టి, దాని (ఉత్కళ లేక ఓడ్ర) రాజధాని జాజిపుర సమీపమందుండెననియు, అందు నూరు బౌద్ధమఠములును, 50 దేవాలయములును ఉండెననియు, అందలి ప్రజ లనాగరకులై, మధ్యదేశపువారి భాష, లిపి, ఆచారములకు భిన్నమగునట్టివాని నవలంబించు చుండిరనియు, దానికి నైరృతిమూలగ చిలుకసముద్ర ప్రాంతమువరకు కన్యోధదేశ ముండెననియు, అందలి ప్రజలు ఓడ్రజాతివారనియు, వారిలో చాలమంది హిందూ మతస్థులనియు, ఆదేశమునకు నైరృతిభాగమున కళింగదేశ ముండెననియు తెలియుచున్నది, కన్యోధ, ఉత్కళ, ఓడ్రదేశములు కలసి ఒరిస్సాదేశమైనది. ప్రజలు ఉత్కళులనియు, ఓడ్రులనియు పిలువబడుచుండిరి. దానికి ఆగ్నేయభాగమున అనగా గంజాంజిల్లా మొదలు, గోదావరినదివరకు గల ప్రదేశమున కాళింగులు, ఆంధ్రులు నివసించిరి. ఉత్కళ లేక ఓడ్రదేశము పదివేల చదరపుమైళ్ళ విస్తీర్ణము కల్గి ఎక్కువ పర్వతారణ్యమయమై, బ్రాహ్మణి, వైతరణి మహానదులను గల్గి, జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, తాంత్రిక మతముల కాటపట్టయి ఖోండులు, గోండులు, సవరలు మొదలగు అడవిజాతులకు నివాసస్థానమై యుండెను.

మహాభారత యుద్ధకాలమున, ఉత్కళులు పాండవులకు సహాయ మొనర్చిరి. కళింగులు కౌరవులకు సహాయ మొనర్చిరి. వీరిదేశములు ఆ తరువాత మగధరాజ్యము నేలిన శైశునాగ, నంద, మౌర్య, ఆంధ్ర, గుప్తరాజుల స్వాధీనమున నుండెను. సముద్రగుప్తుని అలహాబాదు శాసనమునుబట్టి అతడు ఉత్కళ, కళింగ, ఆంధ్ర, పల్లవరాజుల నోడించెనని తెలియును. గుప్తరాజ్యానంతరము ఉత్తరకళింగము లేక ఉత్కళము కర లేక కేసరి వంశీయుల పాలయ్యెను. ఆ కాలమున కళింగదేశము ఆంధ్ర భృత్యవంశపు రాజులచేతను, వారి తరువాత తూర్పు గాంగవంశీయుల చేతను పాలింపబడెను.

ఉత్కళదేశ చరిత్ర జగన్నాథాలయమందలి మాదలాపంజి వ్రాతప్రతుల వలనను, చీనా యాత్రికుల వ్రాతలవలనను, బౌద్ధ, జైన, హిందూ దేవాలయములు, అందు దొరకిన శిలాశాసనములను బట్టియు, ఆ రాజ్యమేలిన అనేక వంశీయుల తామ్ర శిలాశాసనములను బట్టియు, పురుషోత్తమచంద్రిక, స్టర్లింగ్ పరిశోధన ప్రతులు, హంటర్ ఒరిస్సా చరిత్ర, రాజేంద్రలాల్, గంగూలీ, ముజుందార్ల ఒరిస్సాదేశపు చరిత్ర - వీటివలన, తెలియుచున్నది. సి. వి. వైద్య తన మధ్యయుగమునాటి హిందూదేశచరిత్ర, మొదటి సంపుటము 318 326 పుటలలో, యవనులు (గ్రీకురాజులు) ఉత్కళ లేక ఒరిస్సాలో క్రీ. శ. 320 మొదలు 474 వరకు రాజ్యముచేసిన తరువాత, కేసరిరాజులు 1132 వరకును, ఆ తరువాత గాంగవంశపు రాజులు 1132 నుండి 1434 వరకును రాజ్యమునకువచ్చి దేశము నేలిరని వ్రాసెను.

కాని, శాసనములను బట్టి, ఈ క్రింది సోమవంశపు రాజులు ఉత్తర ఉత్కళదేశ మేలిరని తెలియుచున్నది. వీరు త్రికళింగాధిపతులనియు, కోసలేంద్రులనియు, చంద్రవంశీయులనియు, పరమమాహేశ్వరులనియు, అనేక బ్రాహ్మణాగ్రహార దాతలనియు, తామ్రశాసనములలో పేర్కొనబడినది. వారి రాజధాని కటకమునుండియే చాల దానశాసనము లీయబడెను. మహానదీతీరమందున్న వినీతిపురము, యయాతి నగరములనుండి కూడ కొన్ని దానములీయబడెను. వీరు పరమభట్టారక, మహారాజాధిరాజ పరమేశ్వర యను ఉన్నతబిరుదములను వహించిరి. కొందరు చరిత్రకారులు వీరు గుప్తవంశమునకు చెందినవారని తలంచి, దక్షిణకోసల గుప్తవంశమునకు చెందిన వారనివ్రాసిరి. వీరి శాసనముల లిపి, నాగరి—కుటిలాక్షరములు. భాష సంస్కృతము. వీరి శాసనముల శిఖపైని పద్మాసనముగల గజలక్ష్మి విగ్రహము పోతపోయబడినది. వీరి శాసనముల కాలము క్రీస్తుశకము 800 మొ. 1100 వరకు అని ఫ్లీట్ అభిప్రాయపడెను. వీరి వంశావళి ఈ దిగువ చూపబడినది :

శివగుప్త Ι. తరువాత అతని కుమారుడు జనమేజయమహాభవగుప్త I. అతని తర్వాత అతని కుమారుడు యయాతిమహాశివగుప్త II. ఆ తరువాత అతని తనయుడు భీమరథమహాభవగుప్త IΙ. వీరు ఉత్కళదేశములోని చాల గ్రామములను బ్రాహ్మణులకును, శివాలయములకును దానమిచ్చిరని తెలియుచున్నది.

ఈ కటకపు సోమవంశపురాజులు కోసలేంద్ర, త్రికళింగాధిపతియను బిరుదములు కల్గియుండుటచేత, ఇప్పటి దక్షిణకోసల, లేక విదర్భయును, దానికి దక్షిణముననున్న మహాకాంతారదేశమును, తూర్పుతీరమున కటకమువరకును వీరు పరిపాలించిరని మనము తలంపవచ్చును.

కర (కేసరి) వంశము : దక్షిణ ఉత్కళ దేశమున, అనగా మహానదికి దక్షిణభాగమున (ఉత్తర గంజాంజిల్లా సహా) ఈవంశపురాజుల శాసనములు కొన్ని దొరికినవి. శివకరదేవుడు పూరి జిల్లాలోని చౌరాశి గ్రామమును దానమిచ్చెను. దాన శాసనపు ఫలకముపై వికసించిన పద్మము, నంది, శంఖము, అర్ధచంద్రుడు, శివకరదేవుని పేరు పోతపోయబడినవి. శాసనపు లిపినిబట్టి ఈ శాసనము క్రీస్తుశకము 9 10 శతాబ్దపు కాలమునాటిదని భావింపవచ్చును. శాసనపు భాష సంస్కృతము. వీరు శివభక్తులు. వీరి రాజధాని గుహదేవపాటకము. ఈ కరవంశపు రాజులు ప్రాచీన ఉత్కళ దేశమునందలి కొన్ని భాగములను అనగా కన్యోధదేశమునందును (ఉత్తర గంజాంజిల్లా, పశ్చిమకొండ ప్రదేశములు) ఏలిరని తెలియుచున్నది. దండిమహాదేవి శాసనమునుబట్టి, ఉన్మత్తసింహ, గయాడ అనువారు మొదటి కేసరి రాజులుగ కాన్పింతురు. ఈకేసరి లేక కరవంశపు రాజులు చంద్రవంశపు క్షత్రియులని తోచును. శుభకరదేవుని శాసనమునుబట్టి, అతడు ఓడ్రదేశాధిపతియనియు, పరమసౌగతుడనియు, క్షేమంకర దేవుని పౌత్రుడనియు, శివకరదేవుని పుత్రుడనియు, మహాయాన బౌద్ధమతశాఖకు చెందిన వాడనియు, క్రీ. శ. 8 వ శతాబ్దాంతమున ఇతడు ఒక బౌద్ధ గ్రంథమును, ఒక తివాసీయును, ఒక ఉత్తరమును చైనాదేశపు చక్రవర్తియగు చెన్-గ్యు-ఆన్ కు పంపెననియు, అం దీతని బిరుదు నామములలో సింహములేక కేసరి యను పేరు కలదనియు తెలియుచున్నది. అనగా కరవంశపురాజులకు కేసరి బిరుదముండెను. ఈతని మరియొక శాసనమునుబట్టి అతని భార్య త్రిభువనమహాదేవియనియు, ఆమె శైలోద్భవ, లేక నాగోద్భవ యనియు తెలియుచున్నది. ఉత్తర గంజాంజిల్లాలో దొరికిన దండిమహాదేవి రెండు శాసనములను బట్టి, ఆమె శుభకరదేవుని కుమారైయనియు, పరమమహేశ్వరీ పాదభక్తురాలనియు, పరమభట్టారక మహారాజాధిరాజ పరమేశ్వరి యనియు, ఆమె రాజధాని గుహేశ్వరపాటక మనియు, అందుండి 180 వ రాజ్య (వంశశక) సంవత్సరమున వేంగి - పథకవాసియగు బ్రాహ్మణునకు సంక్రాంతి పుణ్యకాలమును దానముచేసిన వరదాఖండ విషయములోని వల్ల గ్రామమును సంరక్షించుటకై కొంగోడమండల మందలి ఉద్యోగులగు మహాసామంతులు, మహారాజులు, రాజపుత్రులు, అంతరంగులు, కుమారామాత్యులు, ఉపరికులు, విషయపతులు, ఆయుక్తకులు, దండపాశకులు, స్థానాంతరికులు, రాజపోషకులు, చాటభటులు మొదలగు వారిని, ఆజ్ఞాపించెను. 7 వ శతాబ్ది ప్రథమార్ధభాగమున, ఉత్తరాపథము నేలినట్టియు, ఉత్కళదేశమును గూడ నేలినట్టియు, హర్షుని మధుబాన్ శాసనమున ఇట్టి ఉద్యోగీయుల పేర్లు గలవు. అనగా, రాజకీయ విషయములును, పరిపాలనాపద్ధతియు, ఉత్తరదేశపు రీతులను పోలియున్నవి. ఈమె శాసనముననున్న 180 వ రాజ్యసంవత్సరము, శాసనపులిపి మున్నగువానిని బట్టి ఈ శాసనము 11 వ శతాబ్ది మధ్యభాగమునకు చెందినదని తోచును. ఇంతవరకు ప్రకటింపబడిన కర, లేక కేసరివంశపు రాజుల శాసనములనుబట్టి, వీరి వంశక్రమ మీ క్రింది విధముగా నున్నది.

ఉన్మత్తసింహ ( కేసరి) —అతని వంశజుడు గయాడ, అతని కుమారుడు లోలభార, అతని కుమారులు కుసుమభార, లలితభారలు లలితభారుని కొడుకు శాంతి (క్షేమ) కరయు, శుభ (శివ) కరయు, ఆ తరువాత ఇతనిభార్య త్రిభువనమహాదేవి, ఆ తరువాత ఆమె కుమార్తె దండిమహాదేవి. వీరి కాలము క్రీస్తు 8.11 శతాబ్దములు.

వీరు పరిపాలించిన దేశము కొంగోడు లేక కన్యోధమండలము. (దక్షిణ తోసలి, ఉత్తరగంజాం). ఈ తోసలిదేశము ఉత్కళ (ఓడ్ర) దేశములోని ముఖ్యభాగము. పశ్చిమ ఓడ్రదేశముపై యయాతి జనమేజయ కేసరులు, కటకము రాజధానిగా చేసికొని పరిపాలించినట్లే, ఈ కరవంశపురాజులు దక్షిణ ఉత్కళదేశము నేలిరి. వీరిక్రింద సామంతరాజులుగ భంజ, శైలోద్భవ వంశపురాజులు తమ ఏలుబడిని సాగించుకొనిరి.

శైలోద్భవులుకూడ కొంగోడు మండలమును పాలించుచు (సముద్రతీరమువరకు) శైవమతమును దేశమున వ్యాపింపజేసిరి. వీరు అనేక భాగములుగ విడిపోయి కళింగ, కోసల, ఉత్కళ దేశములలోని వేరువేరు భాగములపై రాజ్యమేలిరి. వీరే తూర్పు దీవులను జయించి అందు తమ మతము, భాష, నాగరకతలను వ్యాపింపజేసిరి. ఇట్లే భంజ వంశపురాజులు ఉత్కళ లేక ఒరిస్సాదేశములోని ఉత్తరపశ్చిమ దిశలనున్న కొండలలో వేరువేరు శాఖలుగా ఏర్పడి తమ ఏలుబడిని సాగించిరి. ఇప్పటి మయూరభంజరాజ్యమే (దీనికి బారిపద ముఖ్యపట్టణము) ప్రాచీన భంజరాజ్య జీర్ణ శేషము అయి ఉన్నది. వీరు మయూర, అండజ భంజనులుగ తమ శాసనములలో వర్ణింపబడిరి. క్రీ. శ. 9 వ శతాబ్దమున, వీరభద్రుడనురాజు ఈ వంశమును స్థాపించెను. ఒక శాఖవారు కిజ్జింగ్ రాజధానిగను, మరియొకరు వంజుల్‌వాక (ఉత్తరగంజాం జిల్లాలోనిధి) రాజధానిగను, కరవంశీయులకు సామంతప్రభువులుగా తమతమ రాజ్యములను పాలించుచుండిరి. ఈ రాజులు బ్రాహ్మణు లనేకులను రప్పించి, వారి కగ్రహారములను, భూములను దానమిచ్చి, శివాలయములను కట్టించి, హిందూ బ్రాహ్మణ మతాభిమానులై యుండిరి. వీరిదేశమును క్రీస్తు శ. 1134-35 లో, కళింగ రాజగు అనంతవర్మ చోడగంగదేవు జయించిన తరువాత వీరు గాంగ రాజులకు సామంతులై, తమ ఏలుబడిని సాగించుకొనిరి. ఇదే సమయమున ఉత్తర ఉత్కళ దేశము నేలు కరవంశపు తుదిరాజును ఓడించి, చోడగంగదేవుడు ఆ దేశమును జయించి, ఉత్కళాధిపతియై, తన రాజధానిని ముఖలింగమునుండి మహానదీతీరముకనున్న కటకమునకు మార్చెను. కళింగ, ఉత్కళదేశములు రెండును 1135 నుండి 1435 వరకు గాంగరాజులచే పాలింపబడెను. బెంగాల్‌దేశములోని మిధునపురమువరకును తన రాజ్యమును చోడగంగదేవుడు విస్తరింపజేసెను. ఈతడు, ఇతని సంతతివారు క్రమముగ వైష్ణవ మతాభిమానులై ఉత్కళదేశమం దనేక దేవాలయములను నిర్మించి, బ్రాహ్మణులకు, మంత్రులకు, దేవాలయములకు, అనేక అగ్రహారములు దానముచేసిరి. ఉత్కళదేశముననున్న అంకగణన పద్ధతిని తను శాసనములలోను, రాజకీయ వ్యవహారములలోను అనుమతించిరి. (చూడు. "కళింగదేశచరిత్రము")

రా. సు.