Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈరాన్ (భూగోళము)

వికీసోర్స్ నుండి

ఈరాను (భూ.) : పశ్చిమమున టైగ్రీసునదినుండి తూర్పున సింధునదివరకును, ఉత్తరమున కాస్పియను సముద్రము, తురాను ఎడారుల నుండి దక్షిణమున పర్షియా సింధుశాఖ, హిందూ మహాసముద్రము వరకునుగల పీఠభూమిలో కొంతభాగమున ఈరాను దేశము వ్యాపించియున్నది. చుట్టును ఎత్తైన పర్వతములును, మధ్యభాగమున ఉప్పు టెడారియు కలవు. ఈరాను తెగకు చెందిన ఆర్యులు నివసించు ప్రాంతమును సూచించు “ఆర్యానా" అను నామమునుండి ఈనాటి "ఈరాను" అను పేరు ఈదేశమునకు వచ్చినది.

ఎరటాస్థనిసు, స్ట్రాబోమొదలగు ప్రముఖ యాత్రీకులు ఈరాను యొక్క ఆగ్నేయ భాగమునకే ఈ పేరు వాడిరి. పర్షియా ముఖ్యభాగము, మీడియా, బాక్టీయా రాష్ట్రములు వారిచే మినహాయింపబడినవి. కాని వారి తరువాతి చరిత్రకారులు, పర్షియన్లు, మీడులు, బాక్టీయన్లు, సోయీదియన్లు మున్నగు ఒకేభాషను మాట్లాడు జనులు నివసించు ప్రాంతములను కలిపి ఆదేశమునకు "ఈరాను" అని వాడిరి.

ఈ దేశమునందు, పెక్కు ప్రాంతములలో వర్షపాతము మిక్కిలి తక్కువగుటచేత ఎక్కువభాగము నీటివసతులు లేక ఎడారిగానున్నది. ఈరాను ఎడారి, వాయవ్యమునుండి ఆగ్నేయముగా ఎత్తైనపీఠభూమి భాగమునకు అడ్డముగా వ్యాపించియున్నది. ఉత్తరపు సరిహద్దున నున్న ఎల్ బుర్జ్ పర్వతపంక్తుల నుండి దక్షిణతీరమునగల మక్రాను పర్వత పంక్తులవరకును ఈ ఎడారి అవిచ్ఛిన్నముగా వ్యాపించియున్నది. దీని పొడవు 800 మైళ్ళు. కాని వెడల్పునందు మాత్రము ఎక్కువ తక్కువలు కనిపించును. ఎడారిలో చాల భాగము నిర్జనముగా నుండును. పర్వత ప్రాంతములందు మాత్రము గొజ్జెలను, మేకలను కాచు కొను ప్రజలు నివసింతురు. ఈ ప్రాంతమున నిదియే ముఖ్యవృత్తి.

ఈ దేశము 2 కోట్ల ప్రజలను, 6 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యమును కలిగియున్నది. పర్షియా సింధుశాఖా ప్రాంతమున మిక్కిలి ఉష్ణమును, ఎల్ బుర్జ్ పర్వత ప్రాంతమున మిక్కిలి శీతలమును అయి ఈ దేశము అనేక శీతోష్ణస్థితులను కలిగియున్నది. శీతోష్ణ స్థితులనుబట్టి ఈ దేశమును మూడు ప్రాంతములనుగా విభజించవచ్చును.(1) కాస్పియను సముద్రతీరము, (2) మధ్య వ్యాపించిన పీఠభూమి ప్రాంతము, (3) పర్షియా సింధు శాఖాతీరము, శీతకాలమున పీఠ భూమి ప్రాంతము చాలచలికలిగి యుండును. ఈ దేశము నందలి జనసంఖ్య యొక్క వ్యాప్తి నీటి సౌకర్యముపైన, నైసర్గిక పరిస్థితుల పైన ఆధారపడియున్నది. 20 లక్షలమంది పెద్దపట్టణములలో నివసింతురు; మరియొక 20 లక్షలకు కొంచె మెక్కువగా దేశద్రిమ్మరులు. తక్కిన జనులు కొండవాలు లందును, లోయలందును చిన్న చిన్న గ్రామములలోను నివసింతురు. దేశమంతకు మిక్కిలి జన సమ్మర్దము గల జిలాను, మజాన్ డీను రాష్ట్రములందు చతురపు మైలుకు 100 మంది ప్రజలు కలరు. ఈరాను తూర్పుభాగము నిర్జనమైన ఎడారిగా నున్నది. ఇందు ఉత్తరమున దా స్తికారీర్, దక్షిణమున దాస్త్రిలుట్ అను ఎడారులు వ్యాపించియున్నవి. వాయవ్య ప్రాంతములు ఎత్తు కలిగి చల్లగాను, వాస యోగ్యములు గాను ఉండును. ఈ ప్రాంతమున పెద్దపట్టణములు కలవు. ఇందు సెలయేరులు సహాయమున పెద్దతొట లను పెంచుదురు. కొండలపై చాల ఎత్తువరకును గోధుమలను ద్రాక్షా-ఖర్జూరములను పండించెదరు, కాస్పియన్ సముద్రతీరమునకు దక్షిణమందున్న పల్లపు ప్రాంతములలో వరి పండును. పట్టు ఉత్పత్తి కూడ ఇచ్చట జరుగును. పర్వతములలో పశువులను, గొజ్జెలను పెంచేదరు.

పెట్రోలియం, బొగ్గు, ఇనుము ఈ దేశము నందలి ముఖ్య ఖనిజ సంపద. బొగ్గు యొక్క, ఇనుము యొక్క ఉత్పత్తి చాల తక్కువ. పెట్రోలుగనులు పర్షియా సింధు శాఖాతీరమున నున్నవి. ఇవి ప్రథమమున బ్రిటిష్ వారి అధీనములో నుండి ఈ మధ్యకాలములోనే జాతీయము చేయబడినవి. వీటిని జాతీయము చేసిన వెంటనే ఉత్పత్తి పడిపోయినది. తరువాత జరిగిన అంతర్జాతీయమయిన ఒడంబడిక వల్ల ఈ గనులను ఉత్పత్తి కంపెనీల సంఘము నిర్వహించుచున్నది. ఉత్పత్తి క్రమముగా పెరుగుచున్నది. అబెడాను పట్టణమందు నూనెను శుభ్రముచేయు కర్మా గారములు కలవు. ఇచ్చటినుండి నూనె గొట్టముల ద్వారా ఎగుమతిచేయబడును. ఈరాను ఉత్తర. దక్షిణ సరిహద్దు లలో నూనె ఎక్కువగా లభ్యము కాగల ప్రాంతములు కలవని అంచనా వేయబడినది. 1950 సం. లో 32.3 మిలియను మెట్రికు టన్నుల నూనె ఉత్పత్తిచేయబడినది. కాని ఇది 1952 సం. లో 1.3 మి. మెట వరకు పడిపోయినది. కాని 1954 సం.లో తిరిగి 3.5 మి. మెట వరకు వృద్ధిచెందినది.

ఈరానునందు వివిధములైన ఆధునిక పరిశ్రమలు కలవు. కాని ఈ దేశము మేలిరకపు ఉన్ని తివాసీలకు జగత్తునందు ఖ్యాతి చెందినది. వీటిని చేతితోనే నేయుదురు. ప్రపంచమందంతటను వీటిని అపురూపముగా పరిగణింతురు. వీటిని అనేక దేశములందు ఎక్కువ ధరలకు అమ్ముదురు. వీటిని ఎక్కువగా కొనుదేశము అమెరికా సంయుక్త రాష్ట్రములు. కారజ్, కారిజార్ పట్టణములందు, 'పెద్ద పంచదార ఫ్యాక్టరీలు ; సాహి, టాబ్రిజ్, టెహరాను, ఇస్పహాను పట్టణము లందు, నూలు మిల్లులు, చాలసుపట్టణమునందు సిల్కు ఫ్యాక్టరీలు కలవు. తక్కిన పరిశ్రమలలో చెప్పదగినవి సిగరెట్లు, సబ్బులు, గాజులు చేయుట, డబ్బాలలో పండ్లు నిలువచేయుట, చర్మములు పదును చేయుట అనునవి.

ఈ దేశమున పెక్కు ప్రాంతములలో వేలకొలది గ్రామముల మధ్య సరకుల రవాణాకుగాని, ప్రయాణములకు గాని ఒంటెయే ముఖ్య సాధనముగా నున్నది. రైలుమార్గముల నిర్మాణము మందకొడిగా సాగుచున్నది. పర్షియను సింధుశాఖను కాస్పియను సముద్రతీరముతో కలుపుచు, హమాదాను, టెహరాను పట్టణములద్వారా

పీఠభూమిని దాటు రైలుమార్గ మొక్కటియే కలదు. టాబ్రిజును కాజ్రిముతోను, ఆవుం ను యెజర్ తోను కలుపు రైలు మార్గములు నిర్మాణములో నున్నవి. ప్రయాణ యోగ్యయిన మోటారురొడ్లు 15,000 మైళ్ళు పొడవున నున్నవి. విమాన సర్వీసులు ప్రభుత్వాధీన మందున్నవి. టెహరాను ముఖ్యపట్టణమందు చక్కని విమానాశ్రయములు కలవు.

పెట్రోలియం, తివాసీలు, ఉన్ని, పట్టు, ఎండ బెట్టిన పండ్లు. ముత్యములు ఈ దేశమునుండి ఎగుమతి యగును. టెహరాను షిరాజు నగరములును, బందర్ అబ్బాసు, బషీర్ రేవు పట్టణములును, ఎగుమతులలో పాల్గొను ముఖ్య స్థలములు.

ముఖ్యపట్టణమగు బెహరాను, ఎల్ బుర్జ్ పర్వత పాదమున నున్నది. ఉదక శూన్యమైన బీడు మండలములో నున్నను, ఈ పట్టణము 1788 సం. నుండి రాజకీయ ప్రాముఖ్యము వహించినది. నైపుణ్యముగల బట్టలకు, తివాసీలకు, సారాయములకు ఈ పట్టణము ప్రసిద్ధమైనది. పర్షియా సింధుశాఖనుండి 120 మై. లొపల నున్న షిరాజు పట్టణము సారాయములకు, అత్తరు పన్నీరులకు ప్రసిద్ధమైనది.

వాయవ్యపు సరిహద్దులో సముద్రపు ఘట్టమునకు 5000 అ. ఎత్తున టాబ్రిజ్ పట్టణమున్నది. ఇది ముఖ్యమయిన వ్యాపార కేంద్రము. మిక్కిలి సారవంతమైన దీని పరిసర ప్రాంతములలో ద్రాక్షపండ్లు, పలురకములైన ఇతర ఫలములు విశేషముగా లభించును.

బందరు అబ్బాస్, బషీర్ అనునవి ప్రముఖ రేవు పట్టణములు. ఇవి పర్షియా సింధుశాఖారమున నున్నవి. ఈ రెండు రేవులనుండి పశ్చిమ యూరపుఖండముతోను, అమెరికా, ఇండియాలతోను, అరబ్బు దేశములతోను విదేశ వ్యాపారము జరుగును.

కె.వి.ఆర్.