సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈరాన్ (చరిత్ర)
ఈరాను (చ) : భూగోళశాస్త్ర దృష్ట్యా పారసీకము లేక ఈరాను దేశమునకు చాల ప్రాముఖ్యము కలదు. ఇది ఒక వంక దూరప్రాచ్య దేశములకును, మరొకపంక మధ్యధరా సముద్రతీర దేశములతో బాటు ఐరోపాఖండము నందలి పశ్చిమ దేశములకును నడుమ నెలకొని, ఈ రెంటిని కలుపు నట్టి ఒక వారధిగా ఉన్నది. ప్రాక్పశ్చిమ దేశముల మధ్య సాగెడి వ్యాపారము చిరకాలమువరకును ఉత్తర ఈరాను నుండి సాగెడిది. సముద్రయానము వృద్ధిచెందిన తరువాత పారసీక గుడము ద్వారా వ్యాపారముచేయువారు ఈ దేశమందలి వర్తక కేంద్రములకు వచ్చుచు పోవుచునుండేడి వారు. 19వ శతాబ్దియందు సూయజు కాలువ నిర్మాణము .జరిగిన తరువాత ఈరాను దేశము యొక్క భౌగోళిక ప్రాముఖ్యము చాలవరకు తగ్గినది. ప్రస్తుతపు ఈరాను దేశము యొక్క సరిహద్దులు 19వశతాబ్దియందు ఏర్పడినవి. ఈ దేశము కాస్పియను సముద్రము, పారసీక గుడముల నడుమ నెలకొనియున్నది. నేటి ఈరామ ఎల్లలు ఈరాకు, టర్కీ, సోవియట్ రష్యా, ఆఫ్ఘనిస్థానము, పాకిస్థానము అనువాటి సరిహద్దులను తాకుచున్నవి. ఈ దేశపు వైశాల్యము 628,000 చదరపు మైళ్లు.
అత్యంత ప్రాచీన కాలమున ఈరాను దేశమందు నివసించిన ప్రజలకు కాస్పియనులు లేక కాకేషియనులు అను నామమును చారిత్రికు లొసంగిరి. వీరు నేటికి సుమారు ఏడు వేల సంవత్సరములకు పూర్వమే వ్యవసాయమును సాగించుచుండిరి. సుమారు అయిదువేల సంవత్సరములకు పూర్వమే ఈరాను దేశవాసులు కంచుతో ఆయుధము లను, ఇతర పనిముట్లను తయారుచేయుచుండెడివారు. ఈ ప్రాచీన ప్రజలు వివసించుచుండిన గ్రామాదులు కాలక్రమ మున నశించిపోయినవి. ప్రదేశములందు ఎత్తైన మట్టి దిబ్బలు ఏర్పడినవి. వాటిని త్రవ్వుట వలన ప్రాచీనులైన ఈరాను ప్రజలచే వాడబడెడి అనేక వస్తువులు బయల్పడినవి. అందు చిన్న బిడ్డల ఆటవస్తువుల నుండి వ్యవసాయపు పనిముట్లు, బట్టల నేత పనిముట్లు మున్నగు వివిధ వస్తువులు కానవచ్చినవి. ఇచ్చట లభ్యమైన పాత్రలు మున్నగు వాటి పై అతిసుందరమగు చిత్రములు వ్రాయబడియున్నవి. ఆకాలపు ప్రజలు ప్రకృతి దేవతారాధకులుగ నుండినట్లు నిదర్శనములు కానవచ్చుచున్నవి. సుదీర్ఘమగు ఈశాను దేశపు చరిత్రలో కానైటులు, ఎలా మైటులు అను జాతులకు చెందిన ప్రజల నామములు వినవచ్చుచున్నవి. క్రీ.పూ. 1500 సంవత్సరముల ప్రాంతమున ఈ దేశములోనికి ఆర్య జాతులవారు వచ్చిరి. మరి ఆరు శతాబ్దులు గడచినతరువాత ఈరానియనులు అను ప్రజలీ దేశమునందు ప్రవేశించిరి. అందు పెక్కు తెగలు కలవు. ఆ తెగలలో మీడులు అను తెగవా రొకరు. వారు బలవంతులై వివిధజాతులు జయించి, ఎగ్బటానా అను అద్భుతమైన ప్రాచీననగరమును నిర్మించిరి. అయ్యది వారి రాజధాని. పైని పేర్కొనబడిన ప్రజలు చక్కని భవనముల నిర్మించుకొని, జీవితానందమున కావశ్యకమగు అన్నీ వస్తువులను సిద్ధము కావించుకొని, సుఖముగ కాలముగడ పెడివారు. మీడుల యాధిక్యమును తొలగించి, అషామెనిద్ (Achaemenid) తెగవారు క్రీ. పూ. ఆరవ శతాబ్ది యందు 'ఈరాను దేశమున ప్రాబల్యము నొందిరి. ఈ వంశములోని మొదటి రాజు సైరస్ అను నాతడు. ఈతడు మహా పరాక్రమశాలియై పెద్ద సామ్రాజ్యమును నెలకొల్పెను. ఈ రాజు క్రీ. పూ. 539 వ సంవత్సరమున జగత్ప్రసిద్ధి చెందిన బాబిలోను నగరమును వశపరచుకొనెను. సైరస్ అను రాజు 24 సంవత్సరములు రాజ్యాధి కారము నెరపి క్రీ. పూ. 529 వ సంవత్సరమున మరణించెను. ఈరాను ( పారసీకము) దేశ మందలి మొదటి గొప్ప సామ్రాజ్య మిదియే. ఈ అషామెనిద్ సామ్రాజ్యము చాల చారిత్రిక ప్రశ స్తిగాంచినది. దీనిని డేరియస్, జర్జస్ అను గొప్ప చక్రవర్తులు పాలించిరి. వీరు గ్రీకులతో చిరకాలము పోరాడిరి. తుట్టతుదకు యవన వీరుడైన అలెగ్జాండరు క్రీ. పూ. 336 వ సంవత్సరమున ఈ సామ్రాజ్యమును కూలద్రోసెను. అషామెనిద్ వంశపు చక్రవర్తులు బలవత్తరమగు సేనలను, నౌకా సైన్యమును ఏర్పాటు చేసికొని సుమారు రెండు శతాబ్దుల కాలము మహా వైభవముతో రాజ్యపాలనము చేసిరి. వీరి పరిపాలనా విధానము చక్కగ వ్యవస్థీకరింపబడియుండెను. ఈ పారసీక సామ్రాట్టులు విశాల భావముల తోడను, సహనబుద్ధి తోడను రాజ్యాంగమును నడిపిరి. వీరి కాలమునందే జరతుష్టుడను మతకర్త ఒక నూతన మతమును స్థాపించెను. దీనిని ప్రాచీన పొరసీకులు అవలంబించిరి. అషామెనిద్ చక్రవర్తుల కాలమున సూసా, ఎకృటానా, పెర్సిపోలిస్ మున్నగు గొప్ప పట్టణములు నెలకొనియుండెను. అవి అద్భుతమగు భవనములతో నిండియుండెనని మనకు నిదర్శన పూర్వకముగ తెలియవచ్చు చున్నది. అలెగ్జాండరు వీరుడు క్రీ.పూ. 323 వ సంవత్సరమున మరణించెను.
ఈ యవన ప్రముఖుడు, కేవల రాజ్యకాంక్షా ప్రేరితుడైన యోధుడుమాత్రమే కాదు. ఈతనికి విజ్ఞాన కాంక్ష మెండు. అత్యుత్తమమైన గ్రీకు సభ్యతను ప్రపంచమందంతటను వ్యాపింప జేయవలయునని అతని కోర్కె. ఈ యుద్దేశముతో అలెగ్జాండరు తాను జయించిన దేశములందు నూతన నగరములను స్థాపించెను. ఈజిప్టు దేశమునందలి అలెగ్జాండ్రియా పట్టణ మిట్టివాటిలో నొకటి. ఈ నగరములు గ్రీకు సభ్యతకు నిలయములుగ నుండి క్రమక్రమముగ ఆ సభ్యత నెల్లెడల వ్యాపింపజేయగలవని అలెగ్జాండరు 'తలచెను. గ్రీకులను ఇతర జాతులను సమ్మేళనము కావింపవలెనను లక్ష్యముతో ఆతడు ఒక బాక్టీయను అమీరు కుమార్తెను వివాహమాడెను. అలెగ్జాండరు సైనికులలో పది వేలమంది, పారసీక కన్యలను వివాహము చేసికొనిరి. అలెగ్జాండరు మరణించిన వెనుక ఈరాను దేశము అతని సేనాధీశులలో నొకడగు సెల్యూకస్ అను నాతని అధికారము క్రిందికి పోయెను. కాని ఈ గ్రీకు వంశమువారి అధికారము త్వరలోనే నశించెను.
పిమ్మట పార్ధియనులు అను తెగవారు పారసీకము నాక్రమించిరి (క్రీ. పూ. 246). ఈ నూతన వంశమువారు సుమారు నాల్గు శతాబ్దులకాలము రాజ్యపాలనము కావించిరి. పార్థియనుల కాలమందు టేసిఫాన్ (Ctesiphon) అను పట్టణము రాజధానిగ నుండెను. వీరి కాలమున సంభవించిన విశేషములలో రెండు అంశములు ముఖ్యముగ పేర్కొనదగి యున్నవి. జరతుష్టుడు స్థాపించిన మజ్దామతము పారసీకమున సర్వత్ర వ్యాపించేను. ఈ మతధర్మములు గ్రంథస్థములు కావింపబడెను, కాని పారసీక ప్రభువులు నూతనముగ నెలకొల్పబడిన క్రైస్తవ మతమును బాధింపలేదు. పహ్లవీ అను నూతనలిపి ఈ కాలముననే వృద్ధిచెందెను. ఈ కాలమునాటి శాసనములు నేటికిని లభ్యమగుచున్నవి. ఇవి పహ్లవీ లిపిలో వ్రాయబడి యున్నవి. పార్థియనుల భవన నిర్మాణమునందును, శిల్పకళ యందును గ్రీకు, బౌద్ధ ప్రభావములు చక్కగా కాననగును.
క్రీ. శ. 211వ సంవత్సరమున పార్థియను రాజుల అధికార మంతరించేను. ససానియా (Sasanian) వంశము వారి పరిపాలన ప్రారంభమయ్యెను. ఈ వంశమున సుమారు నలుబదిమంది రాజులు కలరు. వీరు 430 సంవత్సరముల కాలము ఈరాను దేశమును పాలించిరి. ఈ పారసీక ప్రభువులకును, రోమను చక్రవర్తులకును తరచు యుద్ధములు జరుగుచుండెడివి. వీరికాలమున మజ్దామత మింకను దృఢపడెను. కాని ఇతరమతస్థు లేవిధముగను బాధింపబడలేదు. మజ్దామతమునకు సంబంధించిన అనేక దేవాలయములు దేశమం దెల్లెడల నెలకొనెను. ఇందు అగ్నిపూజ సాగు చుండెడిది. ప్రతి గ్రామమునందున ఒక పురోహితుడుండెడివాడు. ఈతడు మతవిధులను సక్రమముగా నిర్వర్తించు చుండెను. చక్రవర్తి, దేవదేవుడగు "అహుర్ మజ్దా" యొక్క ప్రతినిధి కావున అతడు మానవాతీతుడైన ఒక వ్యక్తియను భావము సర్వత్ర వ్యాపించెను. సంఘమునందు ఉన్నత వర్గములు, హీన వర్గములు అను విభేదము లేర్పడెను. పారసీక ప్రభువులు సమర్ధులైన అధికారుల సహాయమున రాజ్యపాలన చక్కగ సాగించిరి. ససానియా యుగమునందు పారసీకమున జాతీయభావము బాగుగా బలపడెను. ఆ కారణమున మతమునందును, భాషయందును, శిల్పకళ యందును పౌరసీకుల జాతీయతయు, స్వతంత్ర భావములును ద్యోతక మగుచున్నవి. ఈ యుగమునందు అనేక నూతన గ్రంథ ములు వ్రాయబడెను. ఇతర భాషల నుండి పుస్తకములు అనువాదము కావింపబడెను. ఇవియన్నియు క్లిష్టమైన పహ్లవీలిపిలో వ్రాయబడినవి. . ఈ కాలమునాటికి ఈరానీ భాష సులభతరమై ఆధునికమగు పారసీభాషకు సమీపముగ రాసాగెను. ఈ యుగమందు సజ్దామతమునకు మూలమైన "అవేస్తా" గ్రంథమునకు అనేక ప్రతులు వ్రాయబడెను. ఇందు వాడబడిన లిపి "అవేస్తా" అనబడు ప్రత్యేక లిపి. ససానియా చక్రవర్తుల కాలమున పారసీక సామ్రాజ్యమునకు షాపూరు అనునది ముఖ్యపట్టణము.
క్రీస్తుశకము ఏడవ శతాబ్దియందు ససానియావంశ మంతరించెను. రోమక సామ్రాజ్యమునకును, పారసీక సామ్రాజ్యము నకును నడుమ తరచు యుద్ధములు సాగు చుండినట్లు విదితము. ఈ యుద్ధములవలన రెండు సామ్రాజ్యములును చాల క్షీణదశకు వచ్చెను. ఈరాను దేశమున సాంఘిక వైషమ్యములు హెచ్చెను. ఉన్నతవర్గముల వారికిని తక్కిన ప్రజలకును తీవ్రమగు మనస్పర్ధలు బయలుదేరెను. ఇదే సమయమున ఇస్లాము మతమును నూతనముగ స్వీకరించిన అరబ్బులు మతావేశముతో వివిధ దేశముల జయించుచు పారసీక దేశముపై పడిరి. క్రీ. శ. 641 వ సంవత్సరమున నిహావంద్ అను ప్రదేశము ససానియా ప్రభువుల సేనలు సంపూర్ణముగ ఓడిపోయెను. వారి రాజ్య మంతరించి మహమ్మదీయులగు అరబ్బుల యుగము ప్రారంభమయ్యెను.
క్రమక్రమముగా ఈరాను దేశమంతయు అరబ్బులకు వశమయ్యెను. ఇస్లాము మతముకూడా పారసీక ప్రజలలో వ్యాపింపసాగెను. సుమారు ఒక శతాబ్ది కాలము పారసీక దేశమును అరబ్బులగు “ఒమయ్యద్ ఖలీఫాలు" పరిపాలించిరి. ఈ యుగమునందు పారసీకమున రాజుల నిరంకుశత్వ మంతరించెను. సర్వమానవులు సమానులు అను భావము వ్యాపించెను. ఈ కాలమున రాజకీయముగ అరబ్బులదే పైచేయి అయినను, సాంస్కృతిక విషయములలో ఈరానీ ప్రజల ప్రాముఖ్యము నశింపలేదు. క్రమక్రమముగా పౌరసీకులకు విదేశీయుల పరిపాలన యెడల విసువు జనించెను. క్రీ. శ. 763 వ సంవత్సరమున అబ్బాసీ వంశపు ఖలీఫాలు "ఒమయ్యద్ ఖలీఫాల"ను ఓడించి నూతన రాజ్యమును నెలకొల్పిరి.
అబ్బాసీవంశపు ఖలీఫాలు స్థానికులగు పారసీకులు. వీరి ముఖ్యపట్టణము జగత్ప్రసిద్ధిచెందిన బాగ్దాదు నగరము. ఇచ్చట పరిపాలన కావించిన వారిలో హారూన్ అర్ రషీద్
అను ఖలీఫా సర్వశ్రేష్ఠుడు. సుమారు నాలుగు శతాబ్దుల కాలము ఈరాను దేశమున స్థానికులగు ప్రభువులు రాజ్యము చేసిరి. క్రీ.శ. 1000 ప్రాంతమున మహావీరుడగు గజనీ మహమూద్ ఈరాను దేశములో చాల భాగమును ఆక్రమించెను. ఈతని వంశమువారు పారసీకమును కొంతకాలమువరకును పాలించిరి. ఈనాల్గుశతాబ్దులలోను పారసీక భాష చాల వృద్ధి చెందెను. పెక్కురు కవులుద్భవించి తమ రచనలచే పారసీక వాఙ్మయమునకు వన్నె గూర్చిరి. వారిలో "షాహర్ నామా" అను మహాకావ్యమును రచించిన ఫిర్ధౌసీ అగ్రగణ్యుడు. అబూ అలీ ఇబిన్ సీనాయును, అల్బరూనీయును ఈ యుగ మందలి గొప్ప పండితులు. ప్రభువులు కవులను, పండితులను పోషించుట ఈ కాలమున వాడుకగ నుండెను. ఈకాలపు పారసీక పండితులు అరబ్బీ భాషను కూడ నేర్చి అందు గ్రంథరచన సాగించెడివారు. అందువలన పారసీభాషయం దనేక అరబ్బీ పదములు ప్రవేశించి ఆ భాషలో కొంత మార్పు తెచ్చెను. ఈ యుగమునందు ఇస్లాము మతము ఈరాను దేశమున సర్వత్ర వ్యాపించెను. దేశమునం దెల్లెడల మసీదులు నిర్మింపబడెను. ప్రాచీన మందిరము అనేకములు మసీదులుగ మార్చబడెను. ఈ యుగమున మట్టితోడను, వివిధ లోహములతోడను చక్కని పాత్రలు సిద్ధము చేయుట, చిత్రలేఖనము, కట్టెపై నగిషీ పని, బట్టల నేత మున్నగువాటియందు పారసీకులు చాల అభివృద్ధిని ప్రదర్శించిరి.
గజనీ వంశమువారి యాధిక్యము నశించిన వెనుక సెల్జూక్ తురుష్కుల యుగము ప్రారంభమయ్యెను. వీరు మొదట బోఖారా, ఖొరాపాన్ ప్రాంతములలో స్థానిశాధికారులుగ నుండి ఆ పిమ్మట స్వాతంత్య్రము పూనిరి. ఈ తెగకు నాయకుడైన తుఘ్రీల్ బేగ్ అను నాతడు క్రీ.శ. 1055 వ సంవత్సరమున బాగ్దాదు నందలి ఖలీఫాను. ఓడించి, అతనిచే తన స్వాతంత్య్రమును అంగీకరింపజేసెను. ఈతడు గొప్ప వీరుడు. ఈ తురుష్క వంశమువారు ఇస్లాము మతము నంగీకరించి, సున్నీ శాఖయెడ నభిమానము చూపిరి. వీరి కాలమున షియాపంధ నణగద్రొక్కుటకై ప్రయత్నములు సాగేను. ఈ నెల్జూక్ తురుష్కులు రాజ్యాంగవ్యవహారములను స్థానికులగు పారసీక మహమ్మదీయులకు వదలివేసి, తమ దృష్టిని యుద్ధముల మీదను, రాజ్యమును విస్తరించుటమీదను హెచ్చుగ కేంద్రీకరించిరి. పాలకులగు తురుష్కులు పాలితులగు పారసీకుల ఉత్తమ సభ్యతను మన్నించి దాని నంగీకరించిరి. ఒక శతాబ్ది కాలము గడచినతరువాత ఈ సెల్టూక్ తురుష్క వంశము నంతమొందించి మరియొక రాజకుటుంబమువారు సుమారు ఏబది సంవత్సరముల కాలము అధికారము నెరపిరి. పదమూడవ శతాబ్ది ప్రారంభమందు మంగోలుల దండయాత్రలు ప్రారంభ మయ్యెను. దీనితో ఈరాను దేశ చరిత్రయందు మరియొక నూతనాధ్యాయము ప్రారంభమయ్యెను. సెల్టూక్ తురుష్కుల యుగమందు ఈరాను దేశమున మిక్కిలి ప్రశంసా పాత్రమగు అభివృద్ధి సాగెను. ఈ యుగమున అనేకులు కవులును, తత్త్వ వేత్తలును ఉద్భవించిరి. అల్ ఘజాలి అను కవి తన రచనలందు నూతనమగు సూఫీ వేదాంత భావములను ప్రవేశ పెట్టెను. ఫరీదుద్దీన్ అధర్' అనుకవి అనేకములయిన ఇతర రచనలతో బాటు అనేకులగు పారసీక భక్తుల యొక్కయు, వేదాంతుల యొక్కయు జీవితముల రచించెను. ఈ కాలమునాటి గొప్ప రచయితలలో నిజామీ అను నాతడు ఒకడు. ఈతడు రచించిన గొప్ప పద్య కావ్యములతో లైలా మజ్నూ, షిరీన్ ఫర్హాద్ మున్నగు గాథలు ఎన్నియో కలవు. తురుష్క ప్రభువులకు' మంత్రిగ నుండిన నిజామ్ ఉల్ ముల్క్ అను గొప్ప రాజనీతివేత్త రాజనీతిని గూర్చి ఒక ఉత్తమ గ్రంథమును వ్రాసెను. ఈతడు బాగ్దాదు, నిషాపూర్, హీరట్, బాఖ్ మున్నగు ప్రదేశములలో పాఠశాలలను (నిజామియా) కళాశాలలను నెలకొల్పెను. మలిక్ అనురాజు వేదాంత, గణిత, ఖగోళ శాస్త్రము లందు మిక్కిలి అభిని వేశము కలవాడు. ఈత డొక నక్షత్రశాలను నిర్మించుటయే కాక, తన ముఖ్యపట్టణమగు ఇస్ఫహాన్ నగరమును అనేక భవనములచే, ఆరామములచే అలంకృత మొనర్చెను. సెల్జూకు తురుష్కుల కాలమున అనేక గొప్ప మసీదులును, ఇతర భవనములునుకూడ వెలసెను. వీనిలో ఇస్ఫహాను నగరము లోని మసీదు ప్రత్యేకముగ పేర్కొనదగినది. పదమూడవ శతాబ్ది ప్రారంభమున మంగోలుజాతివారు ఆసియా ఖండమున ప్రాబల్యము వహించి, అనేక దేశముల జయించి, ప్రజా సంక్షోభము కల్గించిరి. వీరి నాయకులగు చెంగీజుఖాను, హులాగు అనువారు మహా క్రూరులు. చెంగీజుఖాను కాలమందే ఈరాను దేశ మంతయు మంగోలుల వశమయ్యెను. హులాగు అనువాడు బాగ్దాదు నగరమునందలి అజ్బానీఖలీఫాల వంశమును తుదముట్టించెను. ఈమంగోలు విజేత యొక్క వంశీయులు ఈరాను దేశమున నిలకడగ ఉండిపోయి, మహమ్మదీయ మతమును స్వీకరించి, రాజ్య పరిపాలనము సాగించిరి. హులాగువంశ మునకు 'ఇల్ ఖాన్' వంశము అను పేరు కూడ కలదు. ఈ రాజవంశములోని ఘాజన్ ఖాను అనునాతడు పారసీక దేశ చరిత్రలో ఒక ఉత్తమ యుగమును ప్రవర్తింపజేసెను. ఈతని ముఖ్యపట్టణము తబ్రీజు నగరము. ఈ రాజు చక్కని పరిపాలనా వ్యవస్థను ఏర్పాటుచేసెను. విద్యలను పోషించెను. ఈరాజునకు ప్రధానామాత్యుడైన రషీదు అనునాతడు గొప్ప సామర్థ్యము కలవాడు. ఈ మంత్రి శ్రేష్ఠుడు ఉత్తమస్థాయికి చెందిన ఒక ప్రపంచ చరిత్రను వ్రాసి ఖ్యాతిగాంచెను. ఈ యుగమున జలాలుద్దీన్ రూమీ, షేఖ్ సాదీ అను ఇరువురు మహాకవులు పారసీక దేశమున జీవించి ఉత్తమ కృతులను రచించిరి. ఈకాలమున ఖగోళశాస్త్రము, వైద్యశాస్త్రము వృక్షశాస్త్రము మున్నగు శాస్త్రములయందు పలువురు విద్వాంసులు కృషి సల్పిరి. మంగోలు రాజుల కాలమున శిల్పకళతోపాటు చిత్రలేఖన కళకూడ బాగుగ వృద్ధిపొందెను.
క్రీ. శ. 1380 వ సంవత్సరము ప్రాంతమున తైమూరు అను ప్రసిద్ధ తురుష్క వీరుడు ఈ రాను దేశము నెల్ల జయించి నూతన ప్రభుత్వమును స్థాపించేను. ఈతని ముఖ్యపట్టణము సమర్కండ్ నగరము. తైమూరు మరణించిన తరువాత ఆతని కుమారులు ఈరాను దేశమును రెండు వేరు వేరు రాజ్యములుగ పాలించిరి. వీరిలో షారుఖ్ అను నాతడు ఒకడు. ఈతడును, ఈతని కుమారుడగు ఉలూగ్ బేగును విజ్ఞానవంతులగు ప్రభువులు. వీరు కవిత్వమునందును, ఖగోళశాస్త్రము నందును, నూతన భవనముల నిర్మించుట యందును చాల ప్రీతికలవారు. ఆ కాలమున హీరట్ నగరమునందు అనేకులు ప్రజ్ఞావంతులగు కళానిపుణులు నివసించుచుండిరి. ఈ యుగమందలి కవులలో షముద్దీన్ మహమ్మద్ హాఫీజు, జామీ, అనువారలు సర్వశ్రేష్ఠులు. తైమూరు వంశమువారి కాలమున అనేక ఉత్తమ భవనములు నిర్మింపబడినట్లు చరిత్రలు తెల్పుచున్నవి. ఈకాలపు విజ్ఞానాభివృద్ధిలో సంగీతము, చిత్రలేఖనము, వ్రాయసపు పనితనము (colligraphy) ప్రత్యేకముగ తెలుపదగిన యంశములు. షారుఖ్ సోదరుడగు బేసూంఘర్" అనునాతడు పై కళ లన్నింటియందును ఆరితేరినవాడు. బిహజాద్ అను గొప్ప చిత్రకారుడు క్రీ. శ. 1440 వ సంవత్సరమున జన్మించెను. ఈతడు అత్యుత్తమములగు చిత్రములను వ్రాసి ఖ్యాతిగాంచెను. ఈ చిత్రకారుడు సాదీ, నిజామీ మున్నగు కవులు వ్రాసిన అంశములకు చిత్ర స్వరూపములు కల్పించి వారి కవితకు వన్నెకూర్చెను. ఈతని శిష్యులు జొభారా, హీరటు పట్టణములలో తమ కళామందిరముల స్థాపించి, చిత్రలేఖనమును బాగుగా పెంపు కావించిరి. ఆ కాలమున షాహర్ నామావంటి ఉత్తమ కావ్యములకు పలువురు చక్కని ప్రతులు సిద్ధము కానించుకొనుచుండిరి. చిత్రకళా నిపుణులా గ్రంథములలో అందమగు చిత్రపటముల వ్రాయుట పరిపాటిగ నుండెను.
పదునారవ శతాబ్ది ప్రారంభముఠాగానే (క్రీ.శ. 1500) ఈరాను దేశమును షా ఇస్మాయిల్ అనువీరుడు తన భుజబల ముచే జయించి సథావిద్ అను నూతన వంశమును స్థాపించెను. ఈతడు షియామతము నభిమానించి దానినే ఈరాను దేశవు మతముగ నిర్ణయించెను. ఇందువలన సున్నీ తెగ వారికిని ఈ రాజునకును బద్ధవైరము సంభవించెను. ఇస్మాయిల్ రాజునకు పిమ్మట అధికారము వహించిన షాతోహమాసివ్ (క్రీ. శ. 1524- 1576) కూడ చాల ప్రసిద్ధుడు. ఈ వంశములోని అబ్బాస్ అను రాజు ప్రఖ్యాత పురుషుడు. ఈ రాజ కుటుంబమువారు 'రెండు శతాబ్దుల కాలము ఈరాను దేశమును పరిపాలించిరి. సఫావీదు వంశమువారు ఈరాను దేశ చరిత్రలో జాతీయ ప్రభువులుగ మన్నింపబడుచున్నారు. వీరి కాలమున అన్ని సాంస్కృతిక రంగములందును ఎంతయో అభివృద్ధిసాగెను. షా అబ్బాస్ అను ప్రభువు ఇస్ఫహాన్ నగరమును తన రాజధానిగ "కావించుకొని, అందు పెక్కు సుందర మందిరములను నిర్మింపించెను. ఈ పట్టణమున కనుబంధముగ ఈతడు కొన్ని క్రొత్త పేటలను కట్టించేను. అచ్చటి మసీదులును, సింహద్వారములును, రాజభవనములును ఆరామములును దర్శనీయములైనవి. ఈ పట్టణములో పెక్కు మసీదులును. కళాశాలలును, సత్రములును, స్నాన గృహములును నిర్మితములయ్యెను. ఈ కాలపు భవనములలో నేలపై చిన్న చిన్న గాజుముక్కలతో సప్త వర్ణములు ఏర్పడునట్లు అలంకరణ మొనర్చుట సర్వ సాధారణముగ నుండెడిది. సఫావీద్ రాజుల కాలములో అనేక తత్త్వ గ్రంథములు విరచితములయ్యెను. కాని ఇయ్యవి కేవల వ్యాఖ్యానములే కాని స్వతంత్ర రచనలు కావు. కవిత్వములోకూడ ఈక్షీణదశ ప్రవేశించెను. ఆనాటి కవులు భావ ప్రాశస్త్యము నెడ అశ్రద్ధ వహించి పదాడంబరము కొరకై మిక్కిలి ప్రాకులాడసాగిరి. పద్యములను ముందునకును వెనుకకును కూడ చదువుట కనుకూలముగ రచించుటలో ఆనాటి కవులకు కుతూహలము మెండుగ నుండెను. కవిత్వమున సాము గరిడీలు ఈ యుగమున విస్తారముగ సాగెను. పారసీకమున రత్న కంబళముల నేత చాల ప్రసిద్ధిగాంచినది. 16, 17 శతాబ్దులలో ఈ పరిశ్రమ అత్యుత్తమస్థాయిని పొందెను. ఆ తివాసీలు పనితనమందును, అందమునందును, ప్రపంచమున నెచ్చటను సాటిలేనివి. సిల్కు, మఖమలు వస్త్రములను, జరీ బట్టలను అత్యంత సుందరముగ ఆకాలపు పారసీకపు నేతగాండ్రు సిద్ధముచేయుచుండిరి. పింగాణీ పాత్రలను తయారుచేయుటలో కూడ ఈ యుగమున పారసీకపు పనివాండ్రు ఖ్యాతిని గాంచిరి. చిరకాలము నుండియు చీనావారు ఈ పరిశ్రమకు పెట్టినది పేరు. ఈ పరిశ్రమ యందు తమ దేశపు కార్మికులకు తరిఫీదు నిచ్చుటకై పారసీక ప్రభువులు చీనానుండి అనేక కుటుంబములను ఆహ్వానించిరి.
క్రీ. శ. 1731 వ సంవత్సరమున నాదిర్ అను సర్పారు సఫావీదు వంశపురాజును రాజ్యభ్రష్టుని కావించి తానే అధికారము వశపరచుకొనేను. ఈతడు నాదిర్ షా అను బిరుదును వహించెను. ఈరాజు పారసీకమునంతను పాలిం చుటయేకాక, ఆఫ్ఘనిస్థానము పైనను, భారతదేశము పైనను దండెత్తిపోయెను. నాదిర్ షా ఢిల్లీ పట్టణమును దోచుకొని, అచ్చటి నుండి మొగలు చక్రవర్తుల మయూర సింహాసనమును, అపారమగు ధనమును కొల్లగొట్టుకొని పోయిన విషయము అందరకును విదితమే. ఈతని అనంతరము ఈరాను దేశమందు పలువురు రాజులు పరిపాలన చేసిరి. కాని వారి కాలమున దేశమునం దెట్టి అభివృద్ధి యును సాగలేదు. 18, 19 శతాబ్దులు రెండును ఈరాను దేశ చరిత్రయందు క్షీణయుగములని చెప్పవలెను. ముఖ్యముగ పందొమ్మిదవ శతాబ్ది యందు ఈరాను ప్రభువులు బలము చాలతగ్గిపోయెను. బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా మున్నగు పాశ్చాత్య జాతుల వారు ధనకాంక్ష తోడను, అధికార కాంక్షతోడను, ఈరాను దేశపు రాజ్యాంగములో జోక్యము కల్పించుకొనసాగిరి. ఇందు ముఖ్యముగ బ్రిటను, రష్యా దేశములకు ఈరానును గూర్చి తీవ్రమైన పోటీ ఏర్పడెను. సామ్రాజ్య కాంక్షతో రష్యావారు ఈరానును వశపరచుకొనవలెనని ప్రయత్నములు చేసిరి. బ్రిటిషువారికి కూడ ఇంచుమించుగ ఇట్టి కోరిక యేఉండెను. తమ భారతీయ సామ్రాజ్యమునకు సమీపమున నున్న పారసీకమునందు బలవంతులగు రష్యా ప్రభుత్వము వారు స్థావరము లేర్పరచుకొనుట బ్రిటీషువారికి ఇష్టములేదు. కావున ఇరుపక్షముల వారునుకూడ పారసీక ప్రభుత్వము నుండి వీలైనన్ని ఆర్థిక సౌకర్యములను కల్పించుకొనుటకై యత్నించిరి. బ్యాంకులు స్థాపించుట, అయోమార్గముల నిర్మించుట, గనులు త్రవ్వుకొనుట, పన్నులు లేకుండ పారసీకములో “వ్యాపారముచేయుట, మున్నగు అంశము లీ ఆర్థిక సౌకర్యములలో చేరియున్నవి. ఈయుద్దేశములతో రష్యా, బ్రిటను దేశములవారు పారసీకపు రాజులకు చాల ఒత్తిడి కల్గించసాగిరి. ఇది ఇట్లుండగా పారసీకులలో పలువురు పాశ్చాత్య విద్యలను, విజ్ఞానమును అలవరుచుకొని, దేశమున ప్రజాస్వామిక పరిపాలనము కావలయునని తీవ్రమగు ఆందోళనము జరుపసాగిరి. కాని రాజులు మాత్రము ప్రజల కోరికలను మన్నింపలేదు. అందులకు మారు ప్రజాస్వామ్య సిద్ధాంతముల కనుకూలురగు వారిని అణచి వేయుటకై సర్వవిధములు యత్నించిరి. ఇరువదవ శతాబ్ది యందలి మొదటి ఇరువది సంవత్సరములు కూడ ఇంచుమించు ఇట్లే గడచెను. 1917 వ సంవత్సరమున రష్యా యందు జారు చక్రవర్తుల ప్రభుత్వ మంతరించి, సామ్యవాదుల ప్రభుత్వ మేర్పడిన తరువాత రష్యావారు తమకీవరకు పారసీక మునందేర్పడి యున్న న్యాయ విరుద్ధమగు సమస్త సదుపాయములను తమంత తామే విడచి పెట్టుకొని పారసీక రాజకీయములనుండి వైదొలగిరి. 1921 వ సంవత్సరమున కల్నల్ రజాఖాను అను సైనికోద్యోగి ప్రజాస్వామ్యవాదుల పక్షమున పనిచేసి, ఒక నూతన ప్రభుత్వమును స్థాపింపగల్గెను. రజాఖాను సర్వ సేనాధిపతిగాను, యుద్ధాంగ మంత్రిగను నియమితు డయ్యెను. 1923 వ సంవత్సరమున ఈతడే ప్రధానమంత్రి యయ్యెను. అనతి కాలములో పారసీక దేశపు రాజు దేశమునుండి వెడలిపోయెను. అంతట 1925 వ సంవత్సరమున పారసిక రాజ్యాంగ నిర్మాణ సభవారు రజాఖానును తమ దేశమునకు రాజుగ ఎన్నుకొనిరి. ఈతడు రజాషా పహ్లావీ అను బిరుదుతో 1926 వ సంవత్సరమున పట్టాభిషిక్తుడయ్యెను. ఈతని వంశము పహ్లవీవంశము. పహ్లవీ వంశస్థాపనముతో ఈ రాను దేశమున ఆధునిక యుగము ప్రారంభించుచున్నది. ఈ కుటుంబమువారు నేడు పారసీకమును పాలించుచున్నారు.
ఈరాను సభ్యతను గూర్చి ఇచ్చట కొన్ని విషయములు తెలుపవలసియున్నది. ఈ దేశము ప్రాక్పశ్చిమఖండములకు నడుమ నెలకొనియున్న కారణమున, ఇయ్యది వివిధ జాతుల ప్రజలకు సమావేశ రంగముగ పరిణమించినది. ఈరానుపై అనేకజాతులవారు దండెత్తివచ్చి, ఈ భూభాగమున కెంతయో నష్టము కల్గించుచుండేడివారు. కాని ఇందువలన పారసీకజాతివారికి ఎట్టి శాశ్వతమైన హానియు కలుగలేదు. అందులకు మారుగ వారికి మేలే చేకూరినది. ఇతర జాతులయందుగల మంచి లక్షణములను గుర్తించి, వాటిని తమ జీవితములోనికి సంక్రమింపచేసికొను ఉదారత, సమన్వయబుద్ధియు పొరసీకులకు అనాదినుండియు అలపడియుండెను. ఈ విషయమును హెరోడోటస్ అను ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు చిరకాలమునకు పూర్వమే గుర్తించి ఉద్ఘాటించియున్నాడు. ఈ సమన్వయబుద్ధివలన పారసీక నాగరకతయందు గుణసంపదయు, విశాల దృక్పథమును కాననగును. ఇట్లనుటవలన పారసీకులు విదేశీయుల జీవన పద్ధతులను యథాతథముగ అవలంబించి, భావదాస్యమును అంగీకరించిరని మనము తలపరాదు.వారు విషయముల నన్నిటినీ సమగ్రముగ పరిశీలించి, అందు యోగ్యములగు వాటిని తగుమార్పులతో స్వీకరించి, వాటిని తమ సభ్యతలో ఇముడ్చుకొనెడివారు. ఈరాను దేశీయులను తము, సాంఘికాచారములు, కళలు, సాహిత్యము మున్నగు అన్ని రంగములలోను ఈ లక్షణములు కానవచ్చును. ఈరాను దేశీయులలో జాతీయ భావమును, ప్రాచీన సంప్రదాయముల యెడ గౌరవమును మిక్కుటముగ కలవు. పారసీకులు ప్రాచీనమగు తమ మతమును విడనాడి, ఇస్లాము ధర్మమును స్వీకరించిన తరువాత కూడ ఈ యంశములలో నెట్టి మార్పును రాలేదు. పారసీక కవులకు మకుటాయ మానుడగు ఫిర్హౌసీకవి మహమ్మదీయేకరులగు ప్రాచీన పారసీక మహా వ్యక్తుల గుణగానము చేసియున్నాడు. ఆధునికుడగు రజాషా పహ్లవి ప్రాచీననుగు పహ్లవీ వంశము యొక్క నామమును పునరుద్ధరించుట గమనింపదగిన యంశము. మనవిషయము లలో పారసీకులు మొట్టమొదటనుండియు విశాలభావములనే ప్రదర్శించిరి. రాజులు అన్ని మతములను చక్కగ సంరక్షించిరి. పారసీకమున నేడు ముఖ్యముగ షియా సంప్రదాయము వాడుకలో సున్నది. ఈరాను విద్వాంసులలో పలువురు సూఫీమతము అను ఉదాత్త వేదాంతతత్త్వమును అలపరచుకొనినికి విజ్ఞానవంతులు. ప్రాచ్యదేశములలో సర్వవ్యాప్తమై యుండిన విజ్ఞాన కాంక్షయు, భావగరిమయు. ఈరాను దేశము చక్కగ ప్రతిఫలించెను.