Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈనాటి యుద్ధ సాధనములు

వికీసోర్స్ నుండి

ఈనాటి యుద్ధసాధనములు :

సాధ్యమైనంత తక్కువ యత్నముతో ఆయుధములను, వాటిని ఉపయోగించువారిని తయారుచేసి సాధ్యమైనంత అధిక నష్టమును శత్రువులకు కలిగించుటయే ఆయుధముల ప్రయోగము యొక్క ఉద్దేశము. సాధారణముగా యుద్ధ పరిస్థితులలో ఆయుధ ప్రయోగమువలన సిద్దించు లక్ష్యశుద్ధి శాంతికాలమునందలి లక్ష్యశుద్ధి ప్రయత్నములలో అయిదింట రెండువంతులుగా నుండును. కొన్ని ఆయుధములను గూర్చి యిచట చెప్పబడును.

రాడార్ ' : శాంతికాలములో అభివృద్ధిచెందిన ముఖ్యములైన యుద్దోపకరణములు రెండు. వాటిలో రాడార్ అనునది యొకటి. రాడార్ లొ అమర్చబడిన రేడియో యంత్రసహాయమున- దూరముననున్న లక్ష్యములను కను గొనుటకు వీలగును. సోనార్ అనునది రెండవది. సోనార్ లోతునీటిలోనున్న కంపనధ్వనిని (pulse sound) ఉపయో గించుకొనును. ఒకానొక స్థావరముయొక్క దూరమును కనుగొనుటకు రెండు పద్ధతులు ప్రయోగములో నున్నవి.

(1) నిర్విరామముగా వచ్చు రేడియో తరంగముల ఆటంకములను పరిశీలించుట. (కొద్దిదూరములు - Short distances).

(2) ధ్వని ప్రసారము యొక్క హ్రస్వకంపనమును పంపి ప్రతిధ్వనులను పరీక్షించుట. (నావికోపయోగము Naval Use).

రాడార్ యొక్క సూక్ష్మగ్రాహిత్వము. (Sensitivity) నియతత్వము (Precision), అసాధారణములై నవి. రెండు వందల మైళ్ళ దూరములోనున్న విమానమునుండి ధ్వని ప్రసార పరావర్తమునుగూడ రాడారు సులభముగా కనిపెట్టగలదు. దీని వ్యాప్తికి దిఙ్మండలము (horizon) మితియైయుండును. పొగమంచు వ్యాపించియున్నప్పుడు గాని, రాత్రులందుగాని మేఘమండలముపై ప్రయాణించుచున్న విమానమునుండి రాడార్ సహాయమున భూమిని చూడగలుగుదుము. రాడారుచేత నిర్మితమయిన తెరమీది చుక్క యొక్క సహాయముతో మిక్కిలి దూరమునగల లక్ష్యమునుగూడ గురి పెట్టి కాల్చుటకు సాధ్యమగును. ఇట్టి సాధనమువలన యుద్ధతంత్రమునకు సంబంధించిన అనేక శాఖలలో తప్పక గొప్ప మార్పులు కలుగ గలవు. ఈ ఈ రాడారువలన ముఖ్యముగా సముద్రయుద్ధమందు ప్రధానమైన పరిణామములు కలిగినవి.

రక్షణయందు రాడార్ నిర్వహింపగల పాత్ర అమోఘమైనది. రక్షణ విషయమున రాడార్ ఈక్రింది నాలుగు ప్రయోజనము లను సాధింపకలుగుచున్నది. (1) రెండు వందల మైళ్ళ దూరమునగల శత్రు విమానములనుగూర్చి ముందుగా హెచ్చరించును. (2) ప్రతిరోధక రాడారు ప్రతిరోధక విమానముల చలనములను హద్దులలో నుంచుటయే గాక శత్రు విమానములు ఎంతదూరమున, ఎంత ఎత్తున ఎగురు చున్నవో, శత్రు విమానము లేవో, మిత్రవిమానములేవో గుర్తు పట్టును. (3) విమానములలో రాడారును నెలకొల్పినచో ఎంతో పయోజనకరము. అది అంత్య యుద్ధమునందును, శతఘ్నులను పేల్చుటయందును సమర్థవంతముగా పనిచేయును. (4) సేనలను భూమిమీది యుద్ధరంగములలో దింపుటకును రాడారు ఉపయోగించును. రక్షణార్థమై ఉపయోగింపబడు రాడారు బారి నుండి తప్పించుకొనుట భయంకరమైన కార్యము, శత్రు మధ్యమున ప్రవేశించుటకు మూడు పద్ధతులు గలవు. (1) సైనికులను తగ్గించుట (2) శత్రువుల పై ఒత్తిడిచేయుట (3) చాటుమాటుగా శత్రువులపై దాడులు సలుపుట.

గైడెడ్ మిస్సిల్స్ (Guided Missiles) అను ఆయుధ మొక్కటే బాంబరును పడగొట్టుటకు మిక్కిలి శక్తివంతమైనట్టిది. ఇది స్వల్పదూరమువరకు మాత్రమే ప్రయాణము చేయునట్లుగా నిర్మింపబడి యున్నది. 500 మైళ్ళ దూరమువరకు ప్రయాణించునట్టి గైడెడ్ మిస్సిల్ ను నిర్మించుట సమీప భవిష్యత్తులో సాధ్యపడునట్లు తోచదు. ఇట్టి ఆయుధములను రూపొందించుట సాంకేతికముగా.

1846 లో బికిని (జపాను) వద్ద

అమెరికాచే సముద్రములో ప్రేల్చబడిన అణుబాంబు Page మాడ్యూల్:Message box/pmbox.css has no content.

అమెరికా దేశమునకు చెందిన అణుచోదిత జలాంతర్గామి

సాధ్యమైనను వాటిని ప్రయోగించుట మాత్రము అపరిమితమైన ధనవ్యయముచే మాత్రమే సాధ్యము కాగలదు. సమీప ప్రాంతమునకు గైడెడ్ మిస్సిల్ nu ప్రయోగించుటకు సాధనములు రెండు. (1) రాకెట్ ఇంజను, (2) రాకెట్ తోపిడిచే ప్రయోగింపబడు రామ్ జెట్ (Ram Jet).

లక్ష్యము (target) చేరుకొనుటకై బయలు దేరిన మిస్సిల్ యొక్క గమనము ఆరంభదశలో భూమిపై నుండు యంత్రముచే అదుపులో నుంచబడును. తరువాతి దశలో గైడెడ్ మిస్సిల్ చేయు ప్రయాణమందు అది ఫ్యూజును సమీపించువరకు హోమింగు ఎయిడ్సు (homing aids) చేత అదుపులో నుంచబడును. ఇట్టి గైడెడ్ మిస్సిల్ భూమిమీదినుండి గాని, జెట్ ఫైటర్ విమానమునుండిగాని, ప్రయోగింపబడును. ఇట్టి సాధనములతో 50 మైళ్ళ దూరమునగల శత్రువుల యొక్క బాంబరు విమానములను గూడ ఎదుర్కొన సాధ్యమగును. అణ్వస్త్రముల దాడిని కూడ ప్రతిఘటింపగలిగిన ఏకైక రక్షణాయుధము గైడెడ్ మిస్సిల్ అనునది ఒక్కటే అని చెప్పవచ్చును.

గైడెడ్ లేక హోమింగు బాంబు అను బాంబును విమానమునుండి విడిచినచో ఈ బాంబు భూమిమీద పడు అర నిమిషములోగా దీనిని బాంబరు వలన అదుపులో నుంచుటకు సాధ్యమగును. ఎంత గొప్ప ఎత్తు ప్రదేశముల నుండి యైనను గురితప్పక, కచ్చితముగ దీనిని ప్రయోగింపవచ్చును. ఇట్టి బాంబులు ప్రయోగింపబడినప్పుడు బాంబరుల బారినుండి ఆత్మరక్షణము చేసికొనుటకు సమర్థమైన ఉపాయమేదియైన కలదా? శత్రు బాంబర్లు బాంబులను పడ వేయు స్థానములకు చేరులోపల తరుముడు విమానములు (Pursuit Planes) వాటి నెదుర్కొనుటకు తగినంత వేగముతో నెగురజాలవు. లేనిచో గొప్ప యుద్ధ నౌకలును, విమాన వాహక నౌకలును, యుద్ధపుటోడలును ఉపయోగించు కాలము గతించినదనవచ్చును.

విమాన యుద్ధమున ఉపయోగపడుటకై తయారు చేయబడు టాంకులను ప్రతిఘటించుటకై రాడారుచేతను, రాకెట్టుల చేతను, అదువులోనుంచబడు విమానములను కనిపెట్టుట మారణాయుధములు పొందిన నేటి అభివృద్దులలో ఒకటి.

ఆటంబాంబు  : ఆటంబాంబు భవిష్యద్యుద్ధ విధానమందు మార్పులను కలుగజేయజాలదని చెప్పజాలము. యుద్ధ విధానముపై ఈ బాంబుల ప్రభావము విశేషముగా ప్రసరించగలదు. అంతమాత్రమున ఆటంబాంబు ప్రయోగింపబడి సర్వనాశనము చేయగలదని చెప్పుట న్యాయము కాదు. అట్లు చెప్పినచో రక్షణవిధానమునందు ఇటీవల ఘటిల్లిన అనంతమైన అభివృద్ధిని మనము అలక్ష్యము చేసిన వారమగుదుము. శత్రునగరములను సామూహికముగ బాంబులను ప్రయోగించి ధ్వంసము చేయుటవలన కలుగు ప్రయోజనము సందేహాస్పదము. మరియు ఈ విధ్వంసక కార్యక్రమమునకై ఇంత అధికమైన ద్రవ్యధ్వంసము పనికిరాదు. ఇట్లుగాక శత్రువులకు విపరీతమైన నష్టము కలుగగల కీలకస్థానములను ఏరి వాటిమీద బాంబులు ప్రయోగించుటవలన ఎక్కువ ప్రయోజనమును సాధింప వచ్చును. గొప్ప వేగముగల ఫైటరు విమానముల యొక్కయు, అణుబాంబుల యొక్కయు తోడ్పాటుగల విమానములు, సామూహికముగ శత్రువులకు చెందిన కీలకస్థానములను బాంబులచే నాశనము చేసి శీఘ్రకాలములో విజయము సాధించుటకు తోడ్పడగలవను సంశము సంశయాస్పదము. ఇందులకు కారణములు :

(అ) ఆటంబాంబులనుండి రక్షణమును కల్పించు కొనుటకై భూమిపై అమర్చబడిన రాడార్ యంత్రము శత్రువుల చర్యలనుగూర్చి త్వరితగతిలో హెచ్చరిక చేయుట వలనను, నేలపై నుండి కావింపబడు అదుపు ఆటంకముల వలనను, రక్షణ కార్యములలో ఇది మిక్కిలి సహాయకారికాగలదు. కాగా బాంబరునందును, ఫైటరు విమానము లందును అమర్చబడిన రాడార్ యొక్క వ్యాప్తి పరిమితమైనది. నేలపై జరుపబడు కొలది కాలపరిమితిగల రక్షణాత్మక తంత్రము ఆకసమున సపరివారముగ ఎగురవలసిన విమాన తంత్రమును అతిశయించుచున్నది.

ఆటంబాంబులు ఎదుర్కొనవలసిన ఇతర సమస్యలు కూడ గలవు. బాంబులు శాంతికాలములో మాత్రమే తయారు చేయబడవలెను. వీటిని తయారుచేయుటకు వలసిన ముడిపదార్థములు పరిమితముగా లభించును. ఈ బాంబులను భద్రపరచి, యుద్ధసమయములలో ప్రయోగించు సాధనములను ప్రతి దేశము సమకూర్చుకొన వలయును. రక్షణ సాధనములు అప్రమత్తతతో నుండవలయును. నిరంతరముగా ప్రతీ విమానము యొక్క గమనము సైనికాధికారుల అనుమతిని (charter) పొంది ఉండవలయును. మరియు రాడార్ యంత్రము ఈ విమానమును వెన్నంటి రావలసి యుండును. శత్రువులకు చెందినవనిగాని, స్వీయములనిగాని గుర్తుపట్టుటకు వీలు కాని విమానములు తమ ప్రాంతము పై ఎగురుచున్నపుడు తరుముడు విమానములు శీఘ్రముగా వలసిన సంఖ్యలో పై కెగిరి, వాటిని వెంటాడవలయును. ఒక వేళ ఇట్టి విమానములు కొలది యెత్తులో చాటు మాటుగా చొచ్చుకొని వచ్చిన యెడల ప్రమాద మేర్పడగలదు. సముద్ర గర్భములో జరుగు జలాంతర్గాముల యుద్ధములో 30 మైళ్ళ దూరమునుండి ఒక జలాంతర్గామిచే ప్రయోగింపబడు బాంబులవలన మిక్కిలి ప్రమాదము సంభవించును. ఇట్టి సందర్భములో బాంబులను ప్రయోగించు పక్షమునకే విజయము చేకూరగలదని భావింపబడుచున్నది. కారణములచే భవిష్యత్తులో ఆటంబాంబుల ప్రాముఖ్యము హెచ్చుగా నుండగలదు. ఆటంబాంబులనుండి ఆత్మరక్షణము చేసికొనుట అసంభవమనిగాని, ఇవి సర్వనాశన కారులని గాని ఎంతమాత్రము భావించరాదు. గతించిన ద్వితీయ ప్రపంచ యుద్ధము త్వరితముగా ముగియుటకు ఆటంబాంబు తోడ్పడిన దనుమాట నిజమే. భవిష్యత్తునందలి దాని ఉపయోగమును గూర్చి ముందుగా చెప్పజాలము.

విమాన యుద్ధము  : బాంబర్ల యొక్క బారినుండి తప్పించుకొను సాధనములు రెండు. (1) ఫైటరు విమానము. (2) విధ్వంసక ఫిరంగి. రక్షణకై నియోగింపబడిన విమానములు బాంబర్లకన్న అధికతరమైన శక్తితో, చురుకుదనముతో ఎగిరి, వాటిని విధ్వంసము చేయవలయును. ఇవి కొలది కాలములో బాంబుల భారముచే భాధితములు కాక ఎగురగలవు. మరియు తమదేశమునందే యుండి భూమిమీదనున్న ఇతర యంత్రముల సహాయముతో పనిచేయును, "ఫైటర్ విమానములు అతి వేగముతో పై కెగిరిపోగల్గును. వాటియొక్క విన్యాస, చలనశక్తులు అధికములు, జెట్ ఫైటర్ విమానములు నేడు ప్రముఖ పాత్రను నిర్వహించుచున్నవి. వాటి వేగము, చలనశక్తి అత్యధికమగుట వలన పూర్వము ఒక విమానమును మరియొక విమానము వలయాకారములో వెంటబడి తరిమెడి (dog fighters) యుద్ధముల ఎత్తుగడలు రద్దయినవి. కాబట్టి రక్షణకై నియోగింపబడిన ఫైటరు విమానముల నుండి తప్పించుకొనుటకు చాంబరు విమానములు చాకచక్యముతో శత్రుమధ్యమునకు చాటుమాటుగా చొచ్చుకొని పోవలయును.

విమాన విధ్వంసక ఫిరంగుల దళము : మిక్కిలి నవీనమైన సూచనాయంత్రముల (computers) సహాయమునను, సమీపించినంతనే ప్రేలెడు షెల్సు (shells) తోడ్పాటుతోను, రాడారుచేత అదుపులో పెట్టబడునట్టి విమాన విధ్వంసకములయిన ఫిరంగి దళములు బాంబర్ల సమూహములను విధ్వంస మొనర్చుటలో శక్తిమంతమైన పాత్రను నిర్వహించుచున్నవి.

ఉన్నతస్థాయిలో ఎగురు చాంబరు విమానముల సమస్య: (High Altitude Bomber) ఈనాటి భూయుద్ధములో తుపాకి గుండ్లు పోగలుగుదూరము అధికమగుచున్నను, నేడు సామాన్యముగ వాడుకలోనున్న విమాన విధ్వంసకములగు ఫిరంగుల యొక్క ప్రాముఖ్యము తగ్గవచ్చును. గొప్ప ఎత్తునకు ఎగురు తరుముడు విమానములను గూడ చాకచక్యముతో తప్పించు కొనుటకు వీలగు విధమున బాంబరు విమానములను రూపొందించి అభివృద్ధి పరచవచ్చును. ఆకసమునుండి భూమిపై నున్న లక్ష్యములను గురిపెట్టి కాల్చు విషయమున కొన్ని చిక్కులున్నవి. బాంబర్లలో అమర్చబడియున్న రాడార్ల యొక్క దృష్టి సంకుచితము కావచ్చును. ఇంతవరకు ఉపయోగములో నున్న బాంబుల విలువ అంతగా నుండదు. సూటిగా గురి చూచి ప్రయోగింపబడిన బాంబులు కూడ అక్ష్యముతప్పి ఇతర విమానములపై బడవచ్చును.

ఎత్తుగా ఎగురు బాంబరు విమానములనుండి ఏమరుపాటులేని నవీనములైన రక్షణశ్రేణులపై దాడిచేయుట యుక్తమా ? యుద్ద విధానమునందలి రక్షణ సన్నాహము నానాటికి అభివృద్ధికి చేరువలో నున్నదా ? భూయుద్ధములో ప్రతిష్టంభనము ఏర్పడగలదా? గత యుద్ధములలోవలె సామూహికముగా బాంబులను ప్రయోగించుట నిరుపయోగ కరముగా పరిణమింప గలదా? ఇత్యాది సమస్యలు తలఎత్తుచున్నవి. ఎట్లయినను ఆటంబాంబు యొక్క పాటన మును గూర్చియు, సముద్ర గర్భమునందు చరించు జలాంతర్గాముల యొక్క యుద్ధప్రక్రియను గూర్చియు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో గూడిన విచారణ ఆవశ్యకమగుచున్నది.

భూయుద్ధము : ఈనాడు కేవలము భూయుద్ధమనునది లేనేలేదు. ఆంఫిబియస్ (Amphibious) విమాన యుద్ధ ప్రక్రియల కారణముగా భూయుద్ధములు అంతరించినవి. భూమిలో పాతి పెట్టబడిన ప్రేలుడు గనులు ఈనాటి భయంకరమైన రక్షణసాధనములై యున్నవి. వీటిపై లోతుగా అచ్చటచ్చట టాంకులను విధ్వంసముచేయు తుపాకులు కప్పబడి యుండును. అక్కడక్కడ అమర్ప బడిన ఫిరంగుల తోడ్పాటుగల మరతుపాకుల చిక్కములు ఇందుండును. మీట నొక్కగానే ప్రేలెడు ఫ్యూజులు (fuses) కూడ ఇం దమర్పబడియుండును. శత్రువుల ప్రదేశముపై దిగి సన్నద్ధరక్షణశ్రేణులను భేదించి, శత్రు మధ్యములోనికి చొచ్చుకొనిపోవుట కష్టసాధ్యమైన పని. కావున భవిష్యద్యుద్ధము వలన ఎక్కువ భీతి అనవసరము .

భూయుద్ధములో రక్షణవిధానపు టెత్తులు నానాటికి అభివృద్ధి చెందుచున్నవి. ఈ యుద్ధములందు ఇటీవల ఘటిల్లిన అభివృద్ధులలో పేర్కొనదగినవి : (1) ప్రాక్సిమిటీ ఫ్యూజు (Proximity fuse): దీనిలో ఒక చిన్న రేడియో సెట్టు అమర్చబడియుండును. ముందుగా నిర్ణయింపబడిన దూరములో భూమి పై భాగమున రేడియో సెట్టు సహాయముతో షెల్లులు (shells) వ్రేలును. ఈ పేలుడు వలన యుద్ధరంగములో నిలబడియున్న సైనికులపై ఫిరంగులదళము యొక్క విధ్వంసక శక్తి పది రెట్లు ఇనుమడించును. (2) బాజూకాలు (Bazookas): ఇవి మిక్కిలి బలమైన ఉక్కును సహితము తూట్లు గావింపగలవు. రాకెట్లు అమర్చబడి కచ్చితముగా లోపల చొచ్చుటకు ప్రసిద్ధములయిన విమానములే అత్యంత శక్తిమంతములైన ఆంటి టాంక్ (Anti-tank) ఆయుధములు. (3) విమానములలో తీసికొనిపోబడు పదాతుల యొక్క ఆధునికపు దాడి: ఉదాహరణము : (1) పారచూటు (గాలిగుమ్మటములు); (2) విమానముల మీద నుండి సైనికులను క్రిందికి జారవిడుచుటకు సాధనములు (towed gliders); (3) రాకెట్టును పేల్చు ఓడలు (4) స్థలజల యుద్ధములకు (amphibious war fare) పనికివచ్చు డక్స్ (Ducks) అను ఓడలు. (5) నీటిలోని ఆటంక ములను తొలగించుటకు తోడ్పడు ఆధునిక పద్ధతులు. టాంకులను విధ్వంసముచేయు ఆయుధములలో అత్యంత శక్తిమంతము లైనవి రాకెట్లు.

సముద్రపు నీటిపై యుద్ధము నావికాదళము నిర్వహించు పాత్ర : (అ) శత్రువుల సముద్ర వ్యాపారమును భగ్న పరచి తమ వ్యాపారములను నిరాఘాటముగా సాగునట్లు చేసికొనుట, (ఆ) శత్రు విమాన దాడులనుండి స్వీయ విమాన దళమును రక్షించుకొనుట, (ఇ) శత్రు విమానదళములను ముఖ్యముగా జలాంతర్గాముల దళమును విధ్వంసము చేయుట, (ఈ) శత్రుతీరములమీద దిగుటకై జరుగు స్థల-జల యుద్ధ కార్యములలో సేనతో సహకరించుట.

ఈనాటి యుద్ధములను నిర్వహించు నౌకాదళములో పెద్ద పెద్ద ఓడలు అనవసరము. బ్రహ్మాండమైన యుద్ధ నావలు, విమాన వాహక నౌకలు ఉపయోగించు రోజులు గతించినవి. అయినను వాటికిని స్థాన మొసగవలసి యున్నది. విమానముల మీదను, నౌకలమీదను తీసికొని పోబడు ఆయుధములతోబాటు నూతన పద్ధతుల సహకారము అవసరమగు చున్నది. ప్రాక్సిమిటీ ఫ్యూజు, రాడార్ అనునవి రెండును కలిసినచో పటిష్ఠమైన ఒక విధ్వంసక శక్తి ఏర్పడగలదు. కాబట్టి సమర్థమైన యంత్రములతోను, ఆయుధములతోను కూడుకొని కట్టుదిట్టమయిన రక్షణ స్థితిగల ఓడలను సామాన్యమైన ఎత్తునుండి అల్ప సైనిక సంఖ్యగల విమానములు దాడిచేయుట ఆత్మ వినాశకరమైన చర్యగా పరిగణింపబడును.

సముద్రగర్భమునందలి యుద్ధము: ఇటీవలి ప్రపంచ చరిత్రమున దురాక్రమణదారులు రెండు పర్యాయములు జలాంతర్గాముల సహాయముతో ప్రపంచమును విచ్ఛిన్న మొనర్ప ప్రయత్నించిరి. సముద్రముమీద జరుగు వ్యాపారము అంతయు ముఖ్యముగ పెద్ద ఓడల మూలముననే జరుగవలసియున్నది. అందుచేత జలాంతర్గాముల యొక్క శక్తిని అల్పముగా భావించరాదు. సముద్ర గర్భమునందు జరుగు యుద్ధ విధానములో క్రొత్త వ్యూహములను, ఎత్తుగడలను ప్రవేశ పెట్టవలయును. రక్షక నౌకాదళమును ఉపయోగించుటకంటె చిన్న చిన్న సముద్రమార్గములలో కల ఆటంకములను తొలగించి, వాటిని రక్షించుటకు పూనుకొనుటయే యుక్తము. మనము ప్రేలుడు గనులపై ఆథారపడవలయును. జలాంతర్గాములను వాటివాటి నెలవులందే స్తంభింపజేయవలయును. నూతన పద్ధతులను అవలంబించుటకూడ అవసరము. అధికతర వేగముతో జలాంతర్గాములను ఎక్కువ లోతునకు దింపుట; స్క్నార్కల్ (Schnorkal) అను గొట్టములను ఉపయోగించుట; ఎక్కువ దూరము పోవుటార్పెడోను ఉపయోగించుట- ఇవి నేటి జలాంతర్గాముల నిర్మాణములో చేకూరిన అభివృద్ధులు.

జలాంతర్గాములను ఎదుర్కొను సాధనములలో సోనార్, రాడార్ తోను, రాకెట్లతోను, సోనాబాయ్స్ తోను (Sono buoys), మేగ్నెటిక్ డిటెక్టర్లతోను (Magnetic detectors) సన్నద్ధమైన విమానదళములు పేర్కొనదగినవి.

పై కారణములనుబట్టి జలాంతర్గాముల ప్రాముఖ్యము ఎంతమాత్రము తగ్గలేదని తెలియుచున్నది. నేడు అణుశక్తి చోదితములైన జలాంతర్గాములను ముఖ్యముగా ఉపయోగింపవలెనను అభిప్రాయమే బలపడుచున్నది.

అభివృద్ధి దశలోనున్న నేటి మారణాయుధములు : నేటి యుద్ధ విధానమున ఆత్మరక్షణ కొరకును, శత్రువులకు హానిచేయుట కొరకును (offensive) ఉపయోగింపబడు ఈ క్రింది ఆయుధములు అభివృద్ధి దశలో నున్నవి.

రక్షణాయుధములు : (అ) విమాన విధ్వంసక రాకెట్, ఇది చాల యెత్తుగా ఎగిరెడు విమానములను నాశనము చేయుటకు ఉపయోగింపబడును, ఈ రాకెటు ఆకాశములో 12 మైళ్ళ దూరము ప్రయాణము చేయగలదు. (ఆ) టాంకు విధ్వంసక ఆయుధములు. ఇవి తేలికగానుండి శత్రువులపై చాకచక్యముతో ప్రయోగించుటకు అనువుగా నిర్మింపబడును. (ఇ) అణుశక్తి చోదితమైన ఫిరంగిదళము. (ఈ) ఆధునిక (improved) గైడెడ్ మిస్సిల్సు.

ఈ రక్షణాయుధములు కీలకస్థానములమీద బాంబులను ప్రయోగించుటకై ఉపయోగించుటకు బదులుగా యుద్ధ వ్యూహములకు, ఎత్తుగడలకు అవసరమైన సందర్భములో ప్రయోగింపబడుటకు ఉద్దేశింప బడినవి.

అశ్రామిక. ఆయుధములు (విజృంభణాస్త్రములు) (offensive weapons) :(అ) రేడియో ధార్మిక ధూళులు, వాయువులు (Radio active dusts and gases) (ఆ) మానవుల యొక్కయు, ఇతర జీవరాసుల యొక్కయు, వృక్షజాతుల యొక్కయు (పంటల యొక్కయు) వినాశము కల్పించు రోగములను ఉత్పత్తి చేయు క్రిమిరూప ఆయుధములు. (ఇ) నరములను దుర్బల మొనర్చుటకై రాసాయనిక పదార్థములతో విషవాయువులను ఉత్పత్తి చేయుట.

ఎస్. ఎమ్. శ్రీ.