Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈత

వికీసోర్స్ నుండి

ఈత : మానవుడు తన బాహుబలము సహాయముతో జలావతరణము చేయగలుగు సాధనము ఈదుట యొక్కటియే అయి యున్నది.

ఈత గొట్టిన మొదటిమానవు డెవ్వడో ఎవరికిని తెలియదు మానవులు ఈతను ఎట్లు ప్రారంభించిరో తెలుపు ఆధారములును దొరుకుటలేదు.

జంతువులు ఈదుచుండుట గమనించి మానవుడు ఈదుట నేర్చుకొనెనేమోయని తోచుచున్నది. జంతువులకు ఎవరును ఈదుట నేర్పనక్కరలేదుగదా! నీటిస్పర్శకలుగ గనే జంతువులు అప్రయత్నముగ ఈదులాడుచు పోవుచుండును. కాని మానవుడు నేర్చుకొనవలసివచ్చినది. ఏలయనగా, మానవసోదరు లెందరో నీటిలోపడి, ఉక్కిరిబిక్కిరియై ఏమియు చేయలేక కొట్టుకొనుచుండుట మానవుడు చూచినాడు.

మానవులలో ఈత విద్య ఎంతకాలము క్రిందట ప్రారంభమయినదో తెలియదు. అయితే, ప్రాచీనులకు ఈ కళను గూర్చి బాగుగ పరిచయమున్నదని చెప్పుటకు సాక్ష్యబలము కలదు. పాంపేపట్టణ శిథిలాలను త్రవ్వినప్పుడు బయట పడిన వర్ణచిత్రములు మానవులు స్వబలసహాయమున జలయానము చేయుచున్నట్లు (ఈదుచున్నట్లు తెలుపుచున్నవి.

"ఈత" శబ్దము ఈదు అను ధాతువునుండి పుట్టిన నామవాచకము. దీనిని ఇంగ్లీషులో "స్విమ్మింగ్ " అందురు. ఈ పదము "స్విమ్మిన్" అను పురాతన ఇంగ్లీషుపదము నుండి పుట్టినది, కాళ్ళతో, చేతులతో, జలయాన వినోద క్రీడ సలుపుటలో ఇంగ్లీషువారే ప్రాథమికులని తెలియుచున్నది. మొట్టమొదటి ఇంగ్లీషు ఈతగాండ్రు రొమ్ము విక్షేపముతో ఈదుటయే ప్రయోగించుచుండిరి. లేదా మార్చి మార్చి ప్రక్కల నుపయోగించుచుండిరి. జె. ఆర్థరుట్రడ్జెన్ అనునాతడు మార్చువరకు ఆ విధానమును వారు మార్చనేలేదు. జె. ఆర్థరుట్రజ్జెన్ ఈత విద్యాధ్యాపకుడయి "చారలుకొట్టు విధానము" అను నూతన పద్ధతిని ప్రవేశ పెట్టెను. ఇతడి క్రొత్తవిధమును దక్షిణ అమెరికా యందు సంచారము చేయుచున్న సమయమున నేర్చుకొనెను.

“గై లావకం - హారోల్డు ఎస్, ఉలెన్" (Guy Lavcom and Harold S. Ulen) రచించిన "పరిపూర్ణమైన ఈతగాడు" (Complete swimmer) అను గ్రంథము 1837 సంవత్సరము ప్రాంతమునాటికే లండనులో ఈతపోటీలు ఉన్నట్లు తెలుపుచున్నది. అప్పుడు లండనులో ఆరు ఈత కొలకులుండెను. ఇంగ్లండులోని "జాతీయ ఈత విద్యా సంఘము" వారు పోటీలు జరుపుచుండిరి. ఆ పుస్తకములోని వర్ణనప్రకారము 1844లో “ఫ్లైయింగుగల్"(Flying gull) అను ఉత్తర అమెరికా ఇండియను లండనులో ఈత పోటీయందు "టుబాకో" (Tobacco) అను వాని నోడించెను. ఫ్లైయింగుగల్ 30 సెకనులలో 130 అడుగుల పొడవు గల కొలనును ఈదెను. విజయుడయిన ఫ్లెయింగుగల్ కు జాతీయ ఈత విద్యా సంఘమువారు ఒక రజత పతకమును బహూకరించిరి.

లండన్ ప్రజలు అధికముగా గమనించునది "విక్షేప కొట్టు (Stroke) విధానము.” ఈ విధానము తరువాతి కాలములో "ప్రాకులాడు" (Crawl) విధము అని పిలువబడెను. ఈవిధానము ఉత్తర అమెరికాలో నేగాక దక్షిణ అమెరికాలో, పశ్చిమ ఆఫ్రికాలో, శాంతమహాసముద్రము నందు దక్షిణద్వీపములలో నివసించు ఆదిమజాతులవారు అవలంబించుచుండిరి. సమకాలికులైన ఇంగ్లీషువారు దగ్గరి త్రోవలలో వేగగమనమును గూర్చి అంతగా దృష్టికలవారు గాకుండిరి. ఈ విధముగా చేతులు కొట్టు విధానము (Over hand stroke) వారికి అంతగా నచ్చలేదు. మరి సుమారు నలుబది సంవత్సరముల వరకు వారు తమ స్వవిధానమునే అనుసరించుచు, రొమ్ముతో నెట్టు అభ్యాసమునే ప్రయత్నించుచుండిరి.

ప్రాచీన కాలములోని ఈతవిద్యా చరిత్రయందు ఈత కొరకు ప్రత్యేకముగ నిర్మింపబడిన కొలకులు (సరస్సులు) ఉన్నట్లు చెప్పబడలేదు. 1844 లో జరిగిన పందెపు పోటీలు ఒక చెఱువులో జరెగెను. కాని ఆ తటాక నిర్మాతనుగూర్చిన భోగట్టా కనపడదు. కాబట్టి తటాక నిర్మాణములు ఆ కాలమున కూడ మామూలు విషయములుగా నున్నట్లు అర్థమగుచున్నది. లండన్ పట్టణము కింగ్సుకాసు వీథి లోని జర్మన్ వ్యాయామశాల (German gymnasium)యందు 1862 జనవరి 7 వ తారీఖున 'ఈత సంఘాల సమితి" (Associated Swimming Clubs) ఆధ్వర్యమున (నిర్వహణమున) ఒక ఈతగాండ్ర సమావేశము (a swimming meet) జరిగెను. ఇది "గ్రేటు బ్రిటన్ ఈత కళాభిమానుల సంఘము" (Amateur Swimming Association of great Britain) 1862లో మార్చబడెను. ఇందు 300 సంఘములు సభ్యత్వమును వహించెను. ఇంగ్లండులో వ్యాయామక్రీడగా ఈతను గూర్చిన చరిత్రము 1869-1890 మధ్యకాలములో కొంత అస్పష్టముగానున్నది. అయినను ఇంగ్లండువాడగు కప్తాన్ మాత్యూవెబ్ అనువాడు రొమ్ము విక్షేపము (Breast stroke) నుపయోగించి ఇంగ్లీషు ఛానెల్ ను 1875 ఆగస్టులో ఈదినట్లు ప్రకటింపబడినది. ఇట్టి కష్టసాధ్యమగు కార్యమును నిర్వహించినట్లు చరిత్రకు దెలిసిన మొట్టమొదటి వాడు ఈతడే.

ట్రడ్జవ్ తరువాత గావిల్ (Gavill) కుటుంబీకులు ఈత విషయములో చరిత్ర ప్రసిద్ధి చెందినారు. ఇంగ్లండులో పుట్టిన ఫ్రెడ్రిక్ గావిల్ పడుచుతనమున ఈతవిషయమున ఉత్సాహియై యుండెను, 1878 లో గావిల్ ఆస్ట్రేలియాకు వెడలెను. అచ్చట ఇతడు ఈత కొలకును నిర్మించి ఈత నేర్పుచుండెను. ఇతనికి అర్నెస్ట్లు, పెర్సి, సిడ్ని, రిచర్డు, ఆర్థరు, చార్లెసు అను పుత్రులుండిరి. ఈ కుటుంబము వారు దక్షిణ సముద్ర ద్వీపమునకు (South Sea Island) ఒకమారు సంచారార్థము వెడలిరి. గావిల్ పుత్రులు అచ్చట బాలురు ఈదుచుండుట చూచి, కాళ్ళుకొట్టుచు ఈదుటను నేర్చుకొనిరి. కాళ్ళపనితో ఈదుట వారు పరిశీలించిరి. కాలినిజాపి తన్నుట అధికతర వేగమునకు దోహదమిచ్చునని వారు తెలిసికొనిరి. ఈ గావిల్ పుత్రులు ఈ క్రొత్త ఈత కొట్టు విధానమును ఆస్ట్రేలియాలో ప్రవేశ పెట్టుటయే గాక, అంతవరకున్న ఈతస్థాయీ నైపుణ్యమును క్రిందు పరచి మించిరి. జలయాన మెట్లు సాధింపన య్యెనని గావిల్ పుత్రు నొకనిని ప్రశ్నింపగా, నీటిగుండా ప్రాకు లాడుటవంటిదే యని జవాబు చెప్పెను. కాలము గడచిన కొలది అది "ఆస్ట్రేలియా దేశపు ప్రాకు విధానము" అని పేరుపొందెను (Australia Crawl).

వీరిలో జ్యేష్ఠపుత్రుడైన రిచర్డు గావిల్ 1902 లో ఇంగ్లండునకు వెళ్ళెను. అప్పుడు ఈ ప్రాకు (Crawl) పద్దతినే ఉపయోగించి క్రొత్తగా నిర్ణయించిన కాలపరిమితి యందే యీది ట్రడ్జెన్ యొక్క శిష్యులను ఓడించెను. మిగత గావిల్ సోదరులును 'ఈతగాండ్ర నిలయమని' ఆస్ట్రేలియాకు కీర్తి దెచ్చుచుండిరి. సాన్ ఫ్రాన్సిస్కోలోని ఒలింపిక్ సమితి 1903 లో ఆ సమితి సభ్యుల శిక్షణకొక ఉపాధ్యాయుని నిర్ణయించుటకు నిశ్చయించినప్పుడు సిడ్నీ గావిల్ ను ఆ ఉద్యోగమును అంగీకరించునట్లుగా ప్రోత్సహించియుండిరి. అతడా స్థానములో 25 సం. కాలము పనిచేసియుండెను. ఇతని శిష్యులలో నొకడు చార్లెను ఎం. డేనియల్సు. ఇతడు ఆతని కాలములో అమెరికాలోని గజయీతగాడు.

ట్రడ్జన్ ఇంగ్లండులో ఈతకొట్టే విధములో విప్లవకర మయిననూర్పు తెచ్చిననాటినుండి ఏండ్లతరబడిగా కావిల్ ప్రాకుపద్ధతినే ఉపయోగించుచుండెను. డేనియల్సు తన మిశ్రపద్ధతినే ఆరాధించుచుండెను. వీరివల్ల ఈతవిద్యా చరిత్రయందు నూతనఘట్టము లేర్పడెను. ఇప్పటినుండి ఈత" ఒక వినోదక్రీడగా ఇంగ్లండునందును, అమెరికా యందును, ఆస్ట్రేలియా యందును, మరికొన్ని దక్షిణసముద్రపు ద్వీపములందును ప్రసిద్ధికెక్కెను. అప్పుడప్పుడు సమావేశములు కూడ జరుపబడి ఆ సంబంధమయిన రికార్డులు భద్రపరుపబడినవి. ఆధునిక యుగములో ఒలింపిక్ క్రీడలు రంగములోనికి వచ్చిన తరువాత ఆ పందెములలో ఈతకూడ ఒక విషయమైనది. ఈ రంగమున అమెరికనులు, జపానీయులు అరితేరిన మొనగాండ్రుగా నేడు పేరొందియున్నారు. ఈతలో సామాన్యపు పోటీలు —

1. 100 గజములు - స్వేచ్ఛావిధము.
2. రొమ్ము విక్షేపము---
3. వీపు విక్షేపము,
4. మునిగి ఈదుట.
5. దూరపుటీత.
6. అంచెలు.
7. నీటిలో బంతియాట.

-బి. ఎ. ఆర్.