సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈజిప్టు (భూగోళము)
ఈజిప్టు (భూగోళము) : ఈజిప్టు మధ్యధరాసముద్ర ప్రాంతమున ఈశాన్య ఆఫ్రికాయందు 22° నుండి, 31° - 35', ఉత్తర అక్షాంశముల వరకు వ్యాపించియున్న రాజ్యము. ఈ రాజ్యమునకు ఉత్తరమున మధ్యధరాసముద్రము, దక్షిణమున సుడాను, ఈశాన్యమున పాలస్తీనా, తూర్పున ఎఱ్ఱ సముద్రము, పడమట ట్రిపోలి, మరియు సహారా ఎడారియును గలవు.
ఈజిప్టు వైశాల్యము 3,86,000 చ. మైళ్ళు. ఇది పరిమాణమున బ్రిటిషు దీవులకు మూడు రెట్లుండును. ఈ వైశాల్యములో 14/15 వంతు ఎడారియై యున్నది. కాలువలు, రస్తాలు, ఖర్జూరపు తోపులు ఉండు ప్రదేశము 1900 చ. మైళ్ళవరకు విస్తరించియున్నది. నైలునది ప్రవహించు ప్రదేశమును, చిత్తడినేల (బురద నేల) యును, సరస్సులును గల ప్రదేశపు వైశాల్యము 2,850 చ.మైళ్లు. 12,000 చ. మైళ్ళ ప్రదేశము మాత్రము వ్యవసాయ యోగ్యమైనది. కెయిరో పట్టణమునకు దక్షిణ దిశగా గీయబడిన రేఖ ఈ దేశమును దిగువ ఈజిప్టుగా, ఎగువ ఈజిప్టుగా విభజించును. ఎగువ భాగమును డెల్లా భాగముగను లేక నైల్ నదీ లోయ భాగముగను పేర్కొనవచ్చును.
నైలునదియును, ఎడారుల ఉనికియును ఈజిప్టుకు ఒక ప్రత్యేకతను సంపాదించుచున్నవి. నైలునదియే లేకపోయినచో ఈజిప్టు దేశమంతయు సహారా ఎడారి యొక్క ఇతర భాగములతో కలిసిపోయి ఏర్పరుపరాక ఉండెడిది. నైలునది, ఎడారిలోనికి చొచ్చుకొనిపోవుచు, అబిసీనియా గుట్టలనుండి సారవంతమైన వండ మట్టిని తీసికొనివచ్చుచు, డెల్టా ప్రదేశమును, ఎగువ ఈజిప్టునందు సారవంతమైన భూభాగమును తయారుచేయుచున్నది. నైలునది లోయకావల తూర్పు పడమరలుగా వ్యాపించియుండు పెద్ద ఎడారులు గలవు. వానిలో అచ్చటచ్చట “ఒయాసిస్సు” లని పిలువబడు సారవంతమైన ప్రదేశములున్నవి. పురాతన పట్టణ శిథిలములకు చెంది, ముదురు గోధుమ వర్ణముకలిగిన, ఎత్తైన మట్టి దిబ్బలు అక్కడక్కడ కనబడుచుండును. ఇవి తక్క తక్కిన డెల్టా అంతయు చదునైన మైదానముగా నున్నది. ఇందు వ్యవసాయము ముమ్మరముగా నున్నది. ఎగువ ఈజిప్టునందలి నైలు లోయ ఎక్కువ విశాలమైనదిగారు. లోయ కిరు ప్రక్కలను ఎక్కువ ఎత్తులేని పర్వతములు గలవు. ఈ కొండలు లోయ కిరు ప్రక్కలనుండుటచే, ఎడారి ప్రదేశమునకు ఇవి హద్దుగా నేర్పడి యున్నవి.
దాదాపు వంద మైళ్ళ పొడవుగల ఒక గొప్ప కాలువతో, సూయజు భూసంధిచే ఈజిప్టుదేశము ఆసియా ఖండముతో కలుపబడి యున్నది. నైలునదీ లోయ, డెల్టా - ఈ రెండును కలిసి ఈజిప్టు దేశములో ముఖ్యమైన భాగముగానున్నది. ఈ భాగమున మిక్కిలి ఎక్కువ వెడల్పుగా నున్న భాగముకూడ 120 మైళ్ళకు మించి యుండదు. పెక్కుచోట్ల ఈ లోయ 3 మైళ్ళ నుండి 15 మైళ్ళ వెడల్పు మాత్రమే కలిగినదై యున్నది. ఈజిప్టు యొక్క దక్షిణపు హద్దునందలి లోయ వెడల్పు రెండు మైళ్ళు మాత్రమే ఉన్నది. నైలునదికి పడమరగా అనేక “ఒయాసిస్సు" లు కలవు. డెల్టా ప్రదేశమందు
శాఖోపశాఖలుగా, పెద్ద కాలువలు, చిన్న కాలువలు ప్రవహించుచుండును. సముద్రతీరప్రాంతమున, మెంజలే సరస్సు, ఎడ్ కర్, బర్లోసు, మార్కొటిసు, మున్నగు ఎక్కువ లోతులేక వెడల్పయిన మడుగులు విస్తరించి యున్నవి.
ఎగువ ఈజిప్టునందు కొంతభాగము ఉష్ణమండలములో నున్నవి. కాని దేశమునందు ఎక్కువ భాగము కర్కటక రేఖకు ఉత్తరముగా నున్నది. ఇచ్చటి వాతావరణము మిక్కిలి స్వచ్ఛముగాను, పొడిగాను ఉండును. ఉష్ణోగ్రత క్రమబద్ధముగను, వేడిగను ఉండును. సంవత్సర మందు సుమారు ఏడు, ఎనిమిది మాసములవరకు ఉత్తరమునుండి వీచెడి విసురుగాలి పగటి సమయమందు వాతావరణమునకు సౌమ్యతను కలిగించును. ఈ విసురుగాలి, ఓడలు నదీ ప్రవాహమునకు ఎగువగా ప్రయాణము చేయుటకు సహాయపడును. చల్లటి గాలులు వీచుటచే చలికాలవు నెలలు చాల ఆహ్లాదకరముగా నుండును.జనవరి అన్నిటికంటే మిక్కిలి శీతలమైన నెల. అప్పుడు నైలునది లోయలోను ఎడారిలోను ఉష్ణోగ్రత 32° డిగ్రీలుగాని,అంతకంటె ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా గాని ఉండుట కద్దు. అలెగ్జాండ్రియా, కైరో పట్టణముల గరిష్ఠ ఉష్ణోగ్రత సగటున, వరుసగా 99° F, 110° F (ఫారసు హైటు) ఉండును. దక్షిణమునకు పోయిన కొలది ఎడారి వాతావరణము సమీపించుచు ఉష్ణోగ్రతా వ్యత్యాసము ఎక్కువగుచుండును.
ఈజిప్టునందు అరణ్యములుగాని, అడవిమొక్కలు గాని లేవు. ఈ దేశమందున్న కొలది వృక్షజాతులలో ముప్పది రకముల ఖర్జూరము, టామరిస్క్, కారబ్, మున్నగునవి చేరియున్నవి. హాల్ఫా అను ఒక రకపు గడ్డియు, పేము మున్నగు చువ్వలును వృక్షసంపరగా నున్నవి. తామర పువ్వులు, నీటికలువలు మున్నగునవి పుష్పములలో ముఖ్యమైన రకములు.
అడవులు లేకపోవుటవలన అడజాతి ఫలములు తక్కువ, అడవి జంతువులతో గుంటనక్కలు, నక్కలు, సివంగులు, అడవి గాడిదలు, రకరకముల జింకలు ముఖ్యమైనవి, ఒంటెలు, గుఱ్ఱములు,గాడిదలు,కొమ్ములు గలిగిన పశు సముదాయములు, గొజ్జెలు ముఖ్యమైన పెంపుడు జంతువులు.
నల్ల సీసపురాయి, సున్నపురాయి, ఇసుక రాయి, మున్నగునవి ఇచ్చటి ముఖ్యమగు శిలా సంపద, ముఖ్యముగా నైలునది లోయలో ఇసుక రాయి విరివిగా నుండును. ఈజిస్టు దక్షిణపుకొన యందున్న "అస్వాను” పట్టణమునందు నల్ల రాయి విరివిగానున్నది. దేశములో చాల భాగము కదలికతో గూడిన ఇసుకతో కప్పబడి యున్నది. నైలునది సరిహద్దు లలోని నేల ఇట్టిదే
ఈజిప్టు వ్యవసాయ పరిశ్రమకు ప్రత్యేకముగా అనుకూలముగా నున్నది. ధాన్యములు, ప్రత్తి, మున్నగు వ్యవసాయపు వస్తువులు ఈ దేశమునందు విరివిగా ఉత్పత్తి అగుచున్నవి. అయినను ఈ దేశమునందు వ్యవసాయము చాల ప్రాచీనదశలో నున్నది. కచ్చితముగా చెప్పవలయుననిన ఈజిప్టు దేశము ప్రత్తిపంటకు మాత్రమే ప్రసిద్ధిచెందియున్నది. ఇందు ముతక ప్రత్తి ముఖ్యముగా లాభకరమును, జనసామాన్యము పండించునదియు నై యున్నది. ఇంకను చిక్కుళ్ళు, అవిసె, జనుము, లెట్టూసు, పొగాకు, పుచ్చకాయలు, దోసకాయలుకూడ పండించబడుచున్నవి.
వ్యవసాయపు పనులకు ఈజిప్టుదేశములో గాడిదలు, దున్నపోతులు విశేషముగా ఉపయోగింపబడుచున్నవి.
ఈజిప్టుదేశమునందు ఖనిజసంపదకూడ విస్తారముగా కలదు. పూర్వకాలములో బంగారము, రత్నములు ఎఱ్ఱ సముద్రపు గుట్టల ప్రాంతములనుండి త్రవ్వబడుచుండెడివి. మాంగనీసుకూడ త్రవ్వబడుచుండెను. అది 1926 సం౹౹ నాటికి 1,20,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తివరకు పెంపొందినది. పెట్రోలునూనె త్రవ్వుటకొరకు పరిశోధనము చురుకుగా సాగుచున్నది. “మేరియోటిస్” సరస్సునుండి తయారగు ఉప్పు దేశము మొత్తమునకు సరిపోవుచున్నది. నత్రితములు, ఫాస్ఫేట్లును అక్కడక్కడ ఎడారి ప్రాంతములలో కనుగొనబడుచున్నవి. వీటిని ఎరువులుగా ఉపయోగించుచున్నారు.
పురాతన కాలమునుండియు, ఈజిప్టుదేశస్థులు తోళ్ళ పరిశ్రమకు ప్రసిద్ధికెక్కి యున్నారు. దీనిలో వారొక విలక్షణమైన విధానము నవలంబించుచున్నారు. శుభ్రపరచ బడిన గొట్టే చర్మమును పదనుపరచి, వింతవింత రంగులు వేసి 'మొరాకో లెదరు' (Moracco Leather) ను వీరు తయారుచేయుచున్నారు. ఈజిప్టుదేశమందలి పరిశ్రమలలో మట్టితో వస్తువులను తయారుచేయు పరిశ్రమ పేర్కొనదగినది. ముఖ్యముగా "బార్డక్" నీటి కూజాల పరిశ్రమ మెచ్చుకొనతగినది. ముతకనూలు వస్త్రములును, నూలు, ఉన్ని కలిపి తయారుచేయబడిన వస్త్రములును, ఈ దేశములో నేయబడు చున్నవి. పట్టువస్త్రములుకూడ తయారు చేయబడుచున్నవి. సిగరెట్టు పరిశ్రమ, చక్కెరపరిశ్రమ, రగ్గులపరిశ్రమ, స్పాంజీలు తయారుచేయుట, కట్టె సామాను తయారుచేయుట, చాపలు నేయుట, బుట్టలు, తట్టలు అల్లుట, మున్నగు పరిశ్రమలు ఇచ్చట కలవు. ఇత్తడి, తామ్రము, వెండి మున్నగు లోహపాత్రలు చేయుట, సారాయి మున్నగు పానీయములను ఉత్పత్తిచేయుట, సెంట్లుమున్నగు సుగంధద్రవ్యములను తయారుచేయుట, సిమెంటు ఉత్పత్తి చేయుట, ఈజిప్టుదేశమందలి ఇతర పరిశ్రమలు.
ఈదేశమందలి జనాభాలో 25% పట్టణవాసులు. స్థిర నివాసములేక యుండు ప్రజలతోపాటు, గుడారముల యందు నివసించెడు అరబ్బులుగూడ కలరు. పల్లెలలో నివసించువారు ముఖ్యముగా వ్యవసాయముపట్ల శ్రద్ధ చూపుదురు. మొత్తము జనాభాలో పదిశాతము జనులుమాత్రమే ఇతర వృత్తివ్యాపారములయందు నిమగ్నులైయున్నారు.విదేశీయులలో 50 శాతము జనులు వర్తకముచేయుదురు.
ఆఫ్రికాయందు మిక్కిలి పెద్దనగరమైన కెయిరో పట్టణము ఈజిప్టుదేశమునకు రాజధానిగా నున్నది. ఇచ్చటి జనాభా 13,12.096. అలెగ్జాండ్రియా జనాభా 6,85,736, పోర్టుసయిదు జనాభా 1,24,749.
నవీన పట్టణముల కార్యకలాపముల కంటె, ప్రాచీన ఈజిప్టుదేశపు చిహ్నముల విషయములో యాత్రికులు ఎక్కువగా ఆసక్తి చూపుచుందురు. ఇప్పుడు ఈజిప్టు నందున్న నగరములు, ఆయాస్థలములపై నున్న పురాతన నగరముల శిథిలముల పైననే నిర్మింపబడియున్నవి. అందుచేతనే ఇప్పుడు కట్టబడియున్న కొత్త నగరములయందు'ఫెరోవాలు', గ్రీకులు, రోమనులు - వీరి కాలమునాటి స్మృతి చిహ్నములు, శిథిలములు కనిపించుచుండును, మఠములు, క్రైస్తవాలయములు ఈజిప్టులో ప్రతిభాగమునందు కనిపించును. ముసల్మాను సాధువుల సమాధులును, విరివిగా గలవు. ఈజిప్టునందు ప్రయాణము చేయువారు నై లునదీ లోయలో ఈనాటి కార్యకలాపముతోపాటు, అక్కడ వర్థిల్లి యుండిన ప్రతిజాతి యొక్కయు, నాగరికత యొక్క స్మృతిచిహ్నములను చూడ కుతూహల పడుచుందురు.
ప్రపంచమందలి ముఖ్యమగు వ్యాపారపు రహదారులకు నడిబొడ్డువలెనుండు భౌగోళికపు ఉనికిని ఈజిప్టు కలిగియున్నది. ఐరోపాఖండమునుండి తూర్పుదేశములకు వచ్చు రహదారికి అడ్డముగా నుండుటచే ఇది కీలక స్థానమును వహించి యున్నది. ప్రపంచమందలి గొప్పవ్యాపారమార్గములకు ఇది ఆయువుపట్టుగా నున్నది. సూయజ్ రేవును, పోర్టుసయిదు ను మినహాయించినచో దేశములో సముద్రయానముచేయు ఓడలకు అనుకూలించు రేవులు తక్కువగా నున్నవి. ప్రభుత్వముచే నిర్వహింపబడు ఇనుపదారులు ఈజిప్టుదేశమున విస్తరించి యున్నవి. వ్యవసాయ సంబంధమగు సరకులను ఒకచోటినుండి మరియొక చోటికి కొని పోవుటకు వైయక్తిక సంస్థలచే (Private Companies) నిర్వహింపబడు ఇనుపదారులు కూడ ఈజిప్టులో చాల దూరము వ్యాపించియున్నవి. టెలిగ్రాము, టెలిఫోను సౌకర్యములు ప్రభుత్వ నిర్వహణములో నున్నవి.
ఇటీవల ఈజిప్టులో వర్తకము ఎక్కువగా అభివృద్ధి చెందినది. ముడిపత్తి, పత్తిగింజలు, చక్కెర, సిగరేట్లు, ఉల్లి గడ్డలు, జిగురు, చర్మములు, తోళ్ళు, గోధుమలు, ఇతరధాన్యములు, ఉన్ని, ఖర్జూరములు మున్నగునవి ఇచ్చటి ఎగుమతులు. నూలు వస్త్రములు, బొగ్గు, ఇనుము, ఉక్కు, కలప, పొగాకు, యంత్రములు, పెట్రోలియము. ఫలములు, కాఫీ, జంతువులు మున్నగునవి దిగుమతులు,
కే. వి. ఆర్.