సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈజిప్టు (చరిత్ర)
ఈజిప్టు (చరిత్ర) : ప్రాచీనయుగము : ప్రపంచమంచలి అతిప్రాచీన నాగరిక దేశములలో ఈజిప్టుదేశ మొకటి. సుమారు పండ్రెండు వేల సంవత్సరములకు పూర్వమే ఈ దేశము నాగరక దశయందుండెను. ఈ దేశమును ముప్పదియొక్క రాజవంశములు పాలించెనట. ఆ పైన క్రీ. పూ. 332 వ సంవత్సరమున యవనవీరుడగు అలెగ్జాండరు ఈజిప్టుదేశమును జయించి తన సామ్రాజ్యములో చేర్చుకొనెను. వీరుడగు అలెగ్జాండరు కాలమువరకును గడచిన దీర్ఘకాలమును మనము సౌలభ్యముకొరకై ప్రాచీనయుగముని వర్ణింతము. ప్రాచీన యుగమున ఈజిప్టు దేశమందు రాజ్యపరిపాలనము కావించిన ప్రభువులకు ఫొరోలు అని పేరు. రాజు భగవదంశ సంభూతుడని విశ్వసించి ఈజిప్టు ప్రజలు తమ ఏలికలను గౌరవించుచుండెడివారు. నేటికి సుమారుఏబది యైదు శతాబ్దులకు పూర్వము ఈజిప్టు దేశమును మీనెస్ (Menes) అను రాజు పాలించెను. ఈ దేశమును మొట్టమొదట పాలించిన రాజవంశములో మొట్టమొదటి రాజు ఇతడే, ఈ ప్రభువు ఈజిప్టు రాజ్యమును ఏకచ్ఛత్రాధిపతిగ పాలించెను. ఈ మీనెస్ రాజు గొప్పవీరుడు. ఈజిప్టుదేశపు చరిత్రయందు చాలకాలము వరకును ప్రత్యేకముగ వర్ణింప దగిన యంశములు లేవు. ఈ దేశ చరిత్రలోని పదునొకండవ రాజవంశమును, పదునెనిమిదవ రాజవంశమును, ప్రత్యేకముగ స్మరింపదగినవి. పదునొకండవ రాజ కుటుంబమువారు మిక్కిలి శూరులై, దేశ మందలి అల్లకల్లోలముల నణచివైచి శాంతిని నెలకొల్పిరి. వీరికడ బలమైన నౌకా సైన్యముండెడిది. పదునొకండవ రాజవంశమువారును, వారి తరువాతి రాజులును నై లునదిని, ఎఱ్ఱసముద్రమును కలుపు నొక కాలువను నిర్మించిరి. దీనిని నేటి సూయజు కాలువతో పోల్చవచ్చును. పదునెనిమిదవ రాజవంశములోని నాల్గవ అమెన్ హోటప్ అనునాతడు ప్రత్యేకముగ ప్రశంసింపదగినవాడు. ఈ వంశమువారికడ బలవత్తరములగు సేనలుండెను. కాని పై అమెన్ హోటప్ రాజు (క్రీ. పూ. 1375-1358) శాంతిప్రియుడు. ఈ రాజునకు పూర్వము ఈజిప్టు ప్రజలు బహుదేవతారాధకులుగ నుండిరి. అమెన్ హోటవ్ రాజు ఈ భావములను తొలగించి, భగవంతు డొక్కడే యనియు, ఆతడు దయామయు డనియు, ప్రజలకు విశ్వాసమును కల్గించుటకై చాల ప్రయత్నించెను. ఈతడు సూర్యదేవతారాధనమును ప్రోత్సహించెను. యూదులు, బాబిలోనియనులు, అస్సీరియనులు, పొరసీకులు అను ప్రాచీనజాతులతో ఈజిప్టు ప్రజలకు సంబంధములుండెను. వీరొకప్పుడు మిత్రత్వమును, మరొకప్పుడు శత్రుత్వమును పాటించుచుండెడి వారు.
ప్రాచీనకాలపు ఈజిప్టు ప్రజలు గొప్ప నాగరకతను పెంపొందించుకొనిరని ముందే తెలుపబడినది. వీరు జంతువులను మచ్చిక చేసికొను విధానమును వ్యవసాయమును బాగుగా నెరిగియుండిరి. నైలు నదీ జలములను కాలువలద్వారమున దేశములోనికి ప్రవహింపజేసి, వారు వివిధములగు పంటలను పండించుచుండెడివారు. ప్రాచీన కాలమునుండియు ఈ దేశములో ప్రత్తి బాగుగా పండెడిది. ఈ దేశపు ప్రజలు వివిధ వృత్తులను అవలంబించి వివిధ పరిశ్రమలలో నిపుణులై యుండిరి. కమ్మరులు, కుమ్మరులు, కంపాలులు, వడ్రంగులు, నేతగాండ్రు మున్నగు వివిధ పరిశ్రమల నవలంబించిన వారు ప్రాచీన ఈజిప్టుదేశమున నుండిరి. ఈ ప్రజలు వ్రాతకోతల కొరకై బొమ్మలతో కూడిన ఒకలిపిని సృష్టించుకొనిరి. ప్రపంచ మందలి ఉత్తమ నిర్మాణములలో చేర్చదగిన “పిరమిడ్లు" అను సమాధులను, వివిధదేవాలయములను ఈ ప్రాచీన ప్రజలు నిర్మించిరి. ఈ కట్టడములందలి గోడలపై మిక్కిలి సుందరమగు చిత్రములనేకములు చిత్రింపబడి యున్నవి. ప్రాచీన ఈజిప్టు ప్రజలు ఖగోళశాస్త్రమునందు చాల అభిరుచి కల్గియుండిరి. వీరొక పంచాంగమును సృష్టించి, సంవత్సరమును 12 మాసములుగను, 365 దినములు గను విభజించి, ఆ పంచాంగము ప్రకారము తమ కార్య కలాపములను నిర్వహించుకొనుచుండిరి. ప్రాచీన కాలమునందలి ఈజిప్టు ప్రజలు మెట్టమార్గముపై, ఓడలపై ఇతర దేశములతో వ్యాపారము సాగించుచుండిరి. ఈజిప్టు దేశపు ప్రభువులు గొప్ప నౌకాదళములను సంసిద్ధము చేసి యుంచుకొనెడివారు.
'గ్రీకు, రోమను యుగములూ : యవన వీరుడగు అలెగ్జాండరు ప్రపంచ దిగ్విజయమునకై బయలు వెడలి క్రీ.పూ. 332-వ సంవత్సరమున ఈజిప్టు దేశమును జయించెను. అప్పటికా రాజ్యము పారసీకుల వశమందుండెను. కాని పారసీకుల సేనలు నిర్వీర్యములై యున్నందున అలెగ్జాండరును ఎదిరించు వారెవ్వరును లేరైరి. స్థానికులగు ఈజిప్టు ప్రజలు అలెగ్జాండరును స గౌరపముగ ఆహ్వానించిరి. ఆతడు కూడ వారితో సౌజన్యముతో మెలగెను. అలెగ్జాండరు సుప్రసిద్ధమగు అమ్మాన్ దేవాలయమును సందర్శించి, అచ్చటి దేవుని వలన ఆశీర్వచనమును పొందెను. ఈతడు ప్రాచీనమగు మెంఫిస్ పట్టణమును సందర్శించుటయేగాక, తన పేరిట అలెగ్జాండ్రియా యను జగత్ప్రసిద్ధమగు నగరమును నెలకొల్పెను. ఈ రాజ్యమును పరిపాలించుటకై తన అధికారులను కొందరిని నియమించి క్రీ.పూ.331. వ సంవత్సరమున అతడు ముందునకు సాగిపోయెను. అలెగ్జాండరు మరణానంతరము, క్రీ. పూ. 323 వ సంవత్సరమున, అతని సామ్రాజ్యము విచ్ఛిన్నమయ్యెను. ఈజిప్టు రాజ్యమును టాలమీ వంశమువారు పాలింప దొడగిరి. వీరి కాలమున అనేకులు గ్రీకులు ఈజిప్టుదేశమునకు వలస వచ్చి ఇచ్చట శాశ్వతముగ నివాస మేర్పరచుకొనిరి. గ్రీకులును, ఈజిప్టుప్రజలును అంతర్వివాహములు కావించుకొని మత విషయములలో కూడ సామరస్యము నేర్పరచుకొనిరి. టాలమీ ప్రభువుల కాలములో స్థానిక దైవతముల గౌరవార్ధము అనేక దేవాలయములు కూడ నిర్మింపబడెను.క్రీ. పూ. 204 వ సంవత్సరమున స్థానిక ప్రజలొక గొప్ప తిరుగుబాటును కావించిరి. ఈ తిరుగుబాటు పెక్కు సంవత్సరములవరకును బలవత్తరముగ నుండెను. కాని మొత్తముమీద గ్రీకులపరిపాలనలో ఈజిప్టుదేశము అభివృద్ధిదశలో నున్నట్లే తెలుపవచ్చుచు.
క్రీ. పూ. 30 వ సంవత్సరమున అగస్టస్ సీజరు అను రోమను చక్రవర్తి ఈజిప్టుదేశమును జయించి తన సామ్రాజ్యములో చేర్చుకొనెను. ఈ దేశము పాడిపంటలకు చాల ప్రసిద్ధమైనది. రోము పట్టణమునకు కావలసిన ధాన్యములు మున్నగునవి ఈజిప్టు దేశము నుండియే లభించుచుండెడివి. ఈ కారణమున అగస్టసు చక్రవర్తి ఈజిప్టుదేశమును పాలించుటకై తనకు మిక్కిలి విశ్వాసపాత్రులైన అధికారులను పంపెడివాడు. ఈయుద్యోగులు ఈజిప్టు ప్రజలను రోమను చక్రవర్తి అధికారము నంగీకరించునట్లు చేసి, దేశమును ఇథియోపియనులు మున్నగు విదేశీయుల దండయాత్రల నుండి కాపాడిరి. పూడిపోయిన నైలునది కాలువలను వీరు మరమ్మతు చేయించిరి. రోమను చక్రవర్తుల ప్రతినిధులు చిరకాలమువరకును ఈజిప్టును పాలించిరి. ఈప్రతినిధులలో కొందరు తమ అధికారపు హద్దుల నతిక్రమించి, స్వతంత్రు లగుటకు ప్రయత్నించుచుండిరి. వీరిని రోమను చక్రవర్తులు తత్ క్షణమే శిక్షించి తమ అధికారమును మరల ప్రతిష్ఠించు కొనెడివారు. రోమను చక్రవర్తుల పరిపాలనము సాగుచున్నప్పుడు ఈజిప్టుదేశములో కూడ క్రైస్తవమత ప్రచారము సాగజొచ్చెను. కాని రోమక చక్రవర్తులు క్రైస్తవేతరులైనందున క్రైస్తవ మతానుయాయులను బాధించెడివారు.
క్రీ. శ. 5వ శతాబ్దమునుండి క్రైస్తవ మతము ఈజిప్టులో వ్యాపించెను. రోమను సామ్రాజ్యమునందు క్రైస్తవమతము అంగీకరింపబడిన తరువాత కూడ ఈ దేశములో శాంతి నెలకొనలేదు. ప్రజలలో తరచు అంతఃకలహములు చెలరేగు చుండెడివి. ఇట్లుండగా ఈజిప్టు దేశమునందు అధికారము నెరపుచున్న రోమను ఉద్యోగులు, ప్రజా క్షేమమును విస్మరించి యథేచ్ఛముగ రాజ్యపాలనము కావించుటకై యత్నించిరి. అలెగ్జాండ్రియా నగరమునందు నెలకొనియున్న గ్రీకులు రోమనులకు చేయూత నొసగు చుండెడివారు. ఈ కారణములచే రోమనుల ప్రభుత్వము ప్రజల విశ్వాసమును కోల్పోయెను. కేవల సైన్యసహాయముతో రోమను ప్రభుత్వము సాగజొచ్చెను. ప్రజానురాగమును కోల్పోయిన రోమను ప్రభుత్వమును అరబ్బులు క్రీ. శ. 641 వ సంవత్సరమున సులభముగ కూలద్రోసిరి. రోమనుల రాజ్యము నశించి నందులకు ఈజిప్టు ప్రజలెవ్వరును విచారపడలేదు.
మహమ్మదీయ యుగము : మహమ్మదీయ ప్రపంచమునకు రెండవ ఖలీఫాయైన ఉమర్ అను ప్రభువు క్రీ. శ. 641 వ సంవత్సరమున ఈజిప్టు దేశమును జయించుటకై అసుర్ అను నాతని పంపెను. ఈతడు తన్నెదిర్చిన రోమను సేనలను జయించి, అలెగ్జాండ్రియా పట్టణమును వశపరచుకొనెను. ఈతడు నేటి కైరోపట్టణమునకు సమీపమున వేరొక పట్టణమును నెలకొల్పెను. క్రమముగ ఈజిప్టు రాజ్యమంతయు అరబ్బులకు వశపడెను. ఆకాలమున ఈజిప్టుదేశమందలి ప్రజలు క్రైస్తవులై యుండిరి. మహమ్మదీయులగు అరబ్బులు ఈజిప్టు ప్రజల మతధర్మాచరణమును ఏ విధముగను అడ్డగింపక, వారినుండి కొంత పన్నును మాత్రము గ్రహింపసాగిరి. ఈ కారణమువలన అరబ్బు రాజ్యస్థాపనమున కెట్టి యవరోధమును కలుగలేదు. క్రీ. పూ. 641 నుండి క్రీ.శ. 1517 వరకును ఈజిప్టు దేశమును అనేక రాజులు పాలించిరి. వీరు నామమాత్రముగ మహమ్మదీయ మతగురువులగు ఖలిఫాలకు సామంతులుగ నుండెడివారు. కాని నిజమునకు వీరిని స్వతంత్ర ప్రభువులనియే వర్ణింపవలెను. మహమ్మదీయుల పరిపాలనము ప్రారంభమైన తరువాత కొంత కాలము వరకును ఖలీఫాల పక్షమున గవర్నర్లు ఈజిప్టు దేశమును పాలించిరి. క్రీ.శ. 868 వ సంవత్సరమున ఇచట తులునిద్ రాజవంశము నెలకొనెను. ఆపైన మరికొన్ని రాజవంశములును, క్రీ. శ. 1252 నుండి క్రీ.శ. 1517 వరకు మామ్లూకులను వంశముల వారును ఈజిప్టునందు పాలనము సాగించిరి. క్రీ. శ. 1517 వ సంవత్సరము తరువాత ఈజిప్టు రాజ్యము అట్టోమాను సామ్రాజ్యములో చేరెను. ఈతొమ్మిది శతాబ్దుల కాలము మహమ్మదీయ యుగముగ పరిగణింపబడవచ్చును.
ఈ యుగమునందు రాజ్యాధి కారమును పూనిన వ్యక్తుల పేర్లు లెక్కకు మించియున్నవి. పరస్పరమగు పోటీలు, రాజ్యకాంక్ష, కుట్రలు మున్నగు కారణములవలన ఏ పాలకుడును చాలకాలము రాజ్యపాలనము చేయుటకాని ఘన కార్యములను సాధించుటకాని జరగలేదు. అపుడపుడు ఏ కొలది శాంతియో ఘటిల్లినను, మొత్తము మీద ఈ కాలమంతయు అంతఃకలహముల తోడనే నిండియున్నట్లు గుర్తింపవచ్చును. అరబ్బులు ఈజిప్టు రాజ్యమును జయించిన కాలమున ఇచ్చట "కాప్టులు" అను ప్రజలు పల్వురు నివసించుచుండిరి. కాలక్రమమున అరబ్బులు బలపడి ఈ ప్రజలను మహమ్మదీయ మతమును స్వీకరింపవలసినదిగా నిర్బంధము చేయసాగిరి. వీరిపై విధింపబడు పన్నుల భారముకూడ హెచ్చుగ నుండెడిది. ఈ కారణమున క్రీ. శ. 725 వ సంవత్సరమున ఈ "కాప్టు" తెగవారు తిరుగుబాటు కావించిరి. కాని ఈ తిరుగుబాటు క్రూర పద్ధతుల సాయమున అణచి వేయబడెను. మహమ్మదీయుల ప్రాబల్యము స్థిరపడెను. ఈజిప్టు 'దేశమును అరబ్బులు జయించిరి. కాని వారి ఆధిక్యము అచట నెలకొనలేదు. ఈ రాజ్య పాలకులు తమకు అంగరక్షకులుగ, తురుష్కులు మున్నగు విదేశీయులు నెల్లప్పుడును, తమవద్ద నుంచుకొని వారి సహాయముతో తమ యాధిక్యమును నిలువబెట్టుకోనెడివారు. తులునిద్ వంశములోని అహమ్మద్ అను నాతడు ఈనాటి కైరోనగరమును క్రీ.శ. 873 సం॥ న స్థాపించెను. ఈ రాజు క్రమక్రమముగ బలపడి ఆ నూతన నగరము నందు అనేక దివ్యభవనములు నిర్మించి దానిని వృద్ధి పరచెను. క్రీ. శ 980 ప్రాంతమున అజీజ్ అను ఈజిప్టు రాజు తనమంత్రి ప్రోత్సాహమున "ఎల్ అఝర్" అను మశీదునకు అనుబంధముగ ఒక విద్యాసంస్థను నెలకొల్పేను. అజీజ్ కుమారుడు మన్సూరు మిక్కిలి క్రూరుడు. కాని ఈతడు కై రోనగరమున ఒక ప్రఖ్యాత గ్రంథాలయ మును నెలకొల్పి ప్రతిష్ఠ కాంచెను. ఈ యుగమున ప్రత్యేకముగ ప్రశంసాపాత్రులగు పాలకులెవ్వరును లేరు.ఈ విధమున శతాబ్దులు గడచిపోయిన వెనుక అట్టోమాను సుల్తాను రెండవ మహమ్మదుకాలమున తురుష్కులు ఈజిప్టుదేశమును పాలించుచున్న మమ్లూకు సుల్తాను నోడించి, ఆ రాజ్యమును తమ సామ్రాజ్యములో (క్రీ. శ. 1517) చేర్చుకొనిరి.
'ఆధునికయుగమూ : అది మొదలు ఇరువదవ శతాబ్ది వరకును ఈదేశము అట్టోమాను చక్రవర్తుల అధీనములోనే యుండెను. ఈజిప్టుపై వీరి అధికారము మొదటినుండియు నామమాత్రముగనే ఉండెను. క్రీ.శ. 16, 17 శతాబ్దులలో ఈజిప్టుదేశమును అట్టోమాను సుల్తానుల ప్రతినిధులగు గవర్నర్లు పాలించిరి. కాని స్థానికులగు అధికారులు తరచు వారి అధికారమును ధిక్కరించి ప్రవర్తించెడివారు. ఈజిప్టు రాజ్యమును జయించిన పిదప అట్టోమాను చక్రవర్తులు అచ్చటి మామ్లూకులను తొల్లింటివలెనే గొప్పపదవులలో నియమించిరి. వీరు రాజ ప్రతినిధులనుకూడ లక్ష్యము చేయక విచ్చలవిడిగా వర్తించెడివారు. ఇందులకుతోడు సైన్యాధికారులుకూడ తరచు ప్రభుత్వమును సరకు చేయక తిరుగుబాటు చేయుచుండెడివారు. దూరముననున్న అట్టోమాను చక్రవర్తి ఈ ఆగడములు నరికట్టజాలక నామమాత్రము నకు తన అధికారము అంగీకరింపబడిన చాలునని సంతసించెడివాడు. క్రీ.శ. 16, 17 శతాబ్దులలో ఈజిప్టు దేశమున సర్వాధికారులుగ వర్తించిన ఉద్యోగులు పాషా అను బిరుద నామముతో వ్యవహరింపబడిరి. పదునెనిమిదవ శతాబ్ది యందు "బే" అను బిరుదముగల ఇతర అధికారులు ప్రాముఖ్యము వహించిరి. వీరు కాక ఈకాలమున షేఖ్, అల్ బలద్, అమీర్, అల్ హజ్ అను ఉన్నతోద్యోగులు కూడ ప్రబలులైరి. క్రీ. శ. 1750 వ సంవత్సరమున అలీబే అనువాడు ప్రాబల్యము వహించి, అట్టోమాను చక్రవర్తి అధికారమునుకూడ అంగీకరింపక స్వతంత్రుడై రాజ్యపాలనము కావించెను. కాని క్రీ.శ.1773వ సంవత్సరమున అలిబే తన ప్రతిపక్షులచే ఓడింపబడి ప్రాణములను కోల్పోయెను. ఈజిప్టునందు అట్టోమాను చక్రవర్తి పరిపాలసము మరియొకమారు స్థిరపడెను. ఇది ఇట్లుండగా క్రీ.శ.1795 వ సంవత్సరమున ప్రసిద్ధ ఫ్రెంచి వీరుడగు నెపోలియను ఈజిప్టుపై దండయాత్ర కావించెను.
ప్రాద్దేశములపై దండయాత్రకావించి వాటిని జయింపవలెనని నెపోలియను వీరుని యుద్దేశము. దాని ననుసరించి అతడు ఈజిప్టు దేశమును వశము చేసికొనెను. కాని ఆంగ్లేయులకు ఈప్రయత్న మెంతమాత్రమును రుచింపలేదు. వారి కడ బలవత్తరమగు నౌకాదళముండెను. దీని సహాయము వలన వారు ఫ్రెంచివారి నౌకాసైన్యమును సంపూర్ణముగ నోడించిరి. మార్గాంతరము లేక క్రీ. శ. 1801 వ సంవత్సరమున ఫ్రెంచివారు ఈజిప్టునుండి తమ సేనలను తరలించుకొని వెడలిపోయిరి. ఈవిధమున ఈజిప్టు దేశమునకు ఫ్రెంచి వారి ఆక్రమణము తప్పెను. కాని ఆదేశమునందు అంతః కలహములు మాత్రము నశించలేదు.
ఫ్రెంచివారు వెడలిపోయిన తరువాత ఈజిప్టు దేశమునందు బలవంతులుగ నున్న తురుష్క పక్షము వారికిని ఆల్బేనియా పక్షమువారికిని తీవ్రమగు పోటీ ఏర్పడెను. ఇరుపక్షముల వారునుకూడ మహమ్మదీయులే. పై ప్రతిస్పర్థులకు నడుమ కొంతకాలము పోరాటము సాగిన తరువాత ఆల్బేనియా పక్షమునకు చెందిన మెహ్మత్ అలీ( మొహమ్మద్ అలీ) అను నాతడు తన శత్రువులనెల్ల మట్టు వెట్టి ఈజిప్టు రాజ్యమునకు (క్రీ.శ.1805) పాషా అయ్యెను. ఈ మెహ్మతలీ మిక్కిలి సమర్థుడు. ఈతడు మాయోపాయ ముచే తన శత్రువులగు “బే” సర్దారులను, మామ్లూకు ఉద్యోగులను చంపించి తన మార్గమును నిష్కంటకముగ కావించుకొనెను. ఆ పైన ఇతడు అరేబియా, సిరియాల యందును, ఇతరప్రాంతములందును తనకు ప్రతికూలురుగ నున్న వారి నెల్ల జయించి తన బలమును పెంపొందించు కొనెను. చక్రవర్తియగు అట్టోమాను సుల్తాను మెహ్మతలీ అధికారమును అంగీకరింపవలసినవాడయ్యెను. ఈ పాలకుడు తన సేనలకు ఆధునిక పద్ధతులపై సైనిక శిక్షణము నొసంగియు, తన నౌకాసైన్యమును వృద్ధి కావించియు మిక్కిలి బలవంతుడయ్యెను. ఈతడు ఈజిప్టుదేశమున వ్యవసాయమును, పరిశ్రమలను పెంపొందించుటకై చాలకృషి సల్పెను. సమర్థుడయిన మెహ్మతలీ ఎసుబ దేండ్ల వయస్సువరకు జీవించి ఈజిప్టురాజ్యమును వృద్ధిపరచి క్రీ. శ. 1849 వ సంవత్సరమున మరణించెను.
మెహ్మతలీ అనంతరము ఈజిప్టు రాజ్యమును పాలించిన ఆతని వంశీయులు అసమర్థులు. వారు ఆదాయమునకు మించిన ఖర్చును చేయుచు, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ దేశములకు చెందిన కంపెనీలనుండి అప్పులు తెచ్చి వారికి ఆర్థికముగ లొంగిపోయిరి. ఈ ఆర్థిక దాస్యము ఈజిప్టు ప్రజలలో చాల అసంతృప్తి కల్గించి తిరుగుబాట్లకు కారణమయ్యెను. ఈ తిరుగుబాట్లలో ఆంగ్లేయులు పలుపురు మరణించిరి. ఈ అల్లరులను కారణముగ జూపి బ్రిటిషు ప్రభుత్వమువారు క్రీ. శ. 1882 వ సంవత్సరమున ఈజిప్టులో తమ సేనలను దింపి ప్రభుత్వమును వశపరచుకొనిరి. అచ్చటి ప్రభుత్వము బ్రిటిషు సలహాదారులు చెప్పుచేతలలో నుండసాగెను. బ్రిటిషు సలహాదారుడగు సర్ ఎవిలిన్ బేరింగు కాలమున ఈజిప్టు ప్రభుత్వపు స్థితి చాలవరకు చక్కబడెను. ఋణములు తీర్చివేయబడెను. ఆర్థిక పరిస్థితి బాగుపడెను, వ్యవసాయాభివృద్ధియు, ముఖ్యముగ ప్రత్తిపంటయు హెచ్చెను. వర్జీనండ్ డిలెసెప్స్ అను ఫ్రెంచి ఇంజనీరు యాజమాన్యమున సూయజుకాలువ 1869 నాటికి పూర్తి అయ్యెను. ఇది ప్రాచ్య పాశ్చాత్య ఖండములను కలుపు నొక గొప్పదారి. క్రీ. శ. 1875 వ సంవత్సరమున బ్రిటిషు ప్రభుత్వమువారు 40 లక్షల పౌనులను వ్యయపరచి, సుమారు 176 వేల నూయజు కాలువ కంపెనీ వాటాలను ఈజిప్టు పాలకుడగు ఇస్మాయిల్ ఖెడీవునుండి కొనిరి. ఈవిధముగ సూయజు కాలువపై బ్రిటీషువారికి కూడ అధికారము లభించెను.
ఇరువదవ శతాబ్దియందుకూడ బ్రిటిషు ప్రభుత్వము వారు ఈజిప్టు రాజ్యమునందు బలవంతులుగ నుండుచు వచ్చిరి. ఈజిప్టు దేశమును బ్రిటిషువారు శాశ్వతముగ నాక్రమించుకొనుట ఫ్రెంచివారి కెంతమాత్రమును రుచింపదయ్యెను. కాని బ్రిటిషువారు మొరాకో రాష్ట్రముపై ఫ్రెంచివారికి సర్వాధికారములు కలవని అంగీకరించి, వారిని సంతోషపరచిరి. ఈవిధమున ఈజిప్టులో విదేశీయుల అధికారము బలపడెను. కాని ఈజిప్టు దేశవాసులలో మాత్రము అశాంతి చెలరేగెను. తమకు స్వపరిపాలనాధికారము కావలయునని ఈజిప్టు ప్రజలు తీవ్రముగ ఆందోళనము చేయ జొచ్చిరి. ఇది ఇట్లుండ క్రీ.శ. 1914 వ. సంవత్సరమున మొదటి ప్రపంచ మహాసంగ్రామము ప్రారంభమయ్యెను. ఇంతవరకును ఈజిప్టుదేశము నామమాత్రముగ తురుష్క సామ్రాజ్యములో నంతర్భాగముగనుండి, అట్టోమాను సుల్తానుల అధికారము నంగీకరించి యుండెను. కాని మొదటి ప్రపంచ యుద్ధసందర్భములో అట్టోమాను సుల్తాను 'జర్మనీవారి పక్షమును అవలంబించిన కారణమున ఈజిప్టుదేశ మునకును, అట్టోమాను సామ్రాజ్యమునకును కల సంబంధములు సంపూర్ణముగ విచ్ఛిన్న మయ్యెను. ఈజిప్టుదేశము బ్రిటిషువారి సంరక్షకత్వములోనికి కైకొన బడెను, యుద్ధకాలమునందు సైనికశాసనము అమలు కావింపబడెను. పాశ్చాత్య ఖండములనుండి ప్రాదేశములకుపోవుటకు ఈజిప్టుదేశము రాజమార్గము. సూయజు కాలువ గుండా బ్రిటీషు నౌకలు తరచు రాక పోకలు జరుపుచుండును. కావున సూయజు కాలువను రక్షించుటకై బ్రిటిషువారు తమ సేనలను ఆ ప్రాంతమునందు శాశ్వతముగ నిలువయుంచిరి. ప్రపంచ యుద్ధములో బ్రిటిషు వారికి విజయము లభించిన తరువాత ఈజిప్టు దేశమున నూతన సమస్యలు ఉత్పన్నమయ్యేను. ఈజిప్టు దేశమునకు స్వపరిపాలనాధికారము కావలయునని "వఫ్ద్" అను ఈజిప్టు జాతీయవాద పక్షమువారు తీవ్రమగు ఆందోళనమును ప్రారంభించిరి. ఈ పక్షములో కొందరు హింసాత్మక చర్యలకు కూడ పూనుకొనిరి. బ్రిటిషువారు దౌర్జన్యము నణచివైచిరి. కాని జాతీయవాదుల బలమును గుర్తించి వారు ఈజిప్టుదేశమునకు స్వపరిపాలనాధికారము నిచ్చుటకై పథకములను సిద్ధముచేసిరి. ఈజిప్టుదేశపు జాతీయవాదులకు మొదట జగ్గుల్ పాషాయును, అతని అనంతరమునాహస్ పాషాయును నాయకత్వమువహించిరి. ఈజిప్టు దేశమునకు రాజకీయముగ సంపూర్ణ స్వాతంత్య్రము లభింపవలెననియు, ఈజిప్టు దేశమునందు విదేశీయులకు గల ప్రత్యేకాధికారములు రద్దు కావలెననియు, సూయజు కాలువ ప్రాంతమునందు నెలకొల్పబడియున్న బ్రిటిషు సేనలు సంపూర్ణముగ ఉపసంహరింపబడవలయుననియు, సూడాన్ ప్రాంతము కూడ ఈజిప్టుతో సంపూర్ణ స్వపరి పాలనాధికారమును పొందవలయుననియు, జాతీయవాదుల ఆశయము. ఈ లక్ష్యములన్నియు ఈజిప్టు జాతీయవాదులు సాధింపగల్గిరి. క్రీ. శ. 1936 వ సంవత్సరమున ఆంగ్లేయులకును ఈజిప్టు ప్రభుత్వమునకును జరిగిన సంధి వలన ఈ అంశములన్నియు ఈజిప్టు ప్రజలకు సంతృప్తికరమగువిధముగ పరిష్కరింపబడెను. సూడాన్ ప్రాంతముపై ఈజిప్టు ప్రభుత్వమువారికి కూడ అధికారముకలదను అంశము అంగీకరింపబడినది. క్రీ. శ. 1937 వ సంవత్సరమున ఈజిప్టు నానా రాజ్యసమితిలో స్వతంత్ర సభ్యత్వమును పొందినది.
-ఖం. బా. శే.