సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈక్వెడార్
ఈక్వెడార్ : ఈక్వెడార్. దేశము దక్షిణఅ మెరికాలో ఏండీ (ఆండీస్) పర్వత శ్రేణుల మధ్య నున్నది. ఈక్వెడార్ అనగా స్పానిష్ భాషలో నిరక్ష రేఖపైనున్న దేశమని యర్థము. ఈ దేశమునకు ఉత్తర, ఈశాన్యదిశ లందు కొలంబియా దేశమును, తూర్పు దక్షిణములందు పెరూ దేశమును, పశ్చిమమున పసిఫిక్ మహాసముద్రమును ఎల్లలుగా నున్నవి. ఇది విస్తీర్ణమున 1,04,510 చ. మైళ్లు కలిగి పసిఫిక్ తీరమునుండి ఏండీ పర్వతముల పైభాగము వరకును విస్తరించి యున్నది. అందుచే ఈ దేశమున తీరమైదానము, పీఠభూమి, పర్వత ప్రాంతము కూడ కలవు.
తీరమైదానమునుండి ఏండి పర్వతములపైకి పోయిన కొలది శీతోష్ణస్థితియు, ఉద్భిజ్జములును మారుచుండును. నిరక్ష రేఖ యొద్దనున్న ఏండిపర్వత పాదముల యొద్ద సెల్వాలను నిరక్షరేఖామండలారణ్యము లున్నవి. ఎత్తునకు పోయినకొలది అరణ్యములు పలుచనై పచ్చిక బీడులు కాననగును. ఇంకను పైకిపోయినచో ఆకురాలు చెట్లును, అంతకు పైభాగములందు కోనిఫర్ అడవులును పెరుగును. పర్వతాగ్రములపై కరుగని హిమముండును. కొండలపై బరువులను మోయుటకు 'లామాలు' అను జంతువుల నుపయోగింతురు. అవి పొట్టి ఒంటెలవలె నుండును. వాటి పాదములు పర్వత ప్రాంతముల నెక్కుట కనువుగ నుండును.
తీరమైదానములలో సెల్వాలను ఉష్ణ మండలారణ్యములు ఉన్నవి. వరి, కాఫీ, ప్రత్తి, అరటి, చెరకు, పొగాకు, రబ్బరు, కేకవో (కోకో), ముఖ్యమయిన పంటలు. పీఠభూమిపై సమశీతోష్ణముగా నుండును. అచట గోధుమ పొలములును, నారింజ తోటలును కానవచ్చును. ఈ దేశములో ప్రధానమగు వ్యాపారపు పంట కోకో. వర్ణోపయుక్తమగు దారువు, కపోక్, సింకోనా చెక్క, వనస్పతి దంతము (Vegetable ivory) - అనునవి యితర ఆరణ్యక ఫలసాయములు.
ఈక్వెడారు దేశమునకు 'క్విటో' (2,09,932 జనాభా) రాజధాని. అది సముద్రమట్టమునకు 9,300 అడుగుల ఎత్తుగా నున్న పీఠభూమి పై నున్నది. దాని చుట్టును గల కొండలపై మంచు దట్టముగా నుండును. క్విటో సరిగా నిరక్ష రేఖపై నున్నను అచటి సరాసరి ఉష్ణోగ్రత 55° ఫా. మాత్రమే. వేసవి కాలపు, శీతకాలపు ఉష్ణోగ్రతలయందు భేదము 1° మాత్రమే ఉండును. అచటికి సమీపముననే కొటో పాక్సీ (12,000 అ.) అను సజీవాగ్ని పర్వత మున్నది. క్విటో నగరము భూకంపముల చేతను, అగ్ని పర్వత ఉత్ క్షేపముచేతను చాల నష్టమైపోయెను. గేక్విల్ (2,58,966 జనాభా) అనునది ఈ క్వెడారునకు ముఖ్యమైన రేవు పట్టణము. అచ్చటి నుండి ఎగుమతియగు వాటిలో కోకో ముఖ్య మైనది. గేక్విల్ నుండి క్విటోవరకును రైలు మార్గమున్నది. కాని దేశమందు రాకపోకలకు తగినన్ని అవకాశములులేవు. క్వెంకా (39,983 జనాభా), అంబటో (31,312 జనాభా)-ఇవి రెండును వర్తక వాణిజ్య కేంద్రములు. సూక్రే (Sucre) అను నాణెము ఇచ్చట చలామణి లోనున్నది.
ఈ దేశములో 17 రాష్ట్రములు, ఒక సంస్థానము, “గలాపగోసు” అనుద్వీపము గలవు. ఈద్వీప వైశాల్యము 3029 చ. మైళ్లు. 650 మైళ్ళ సముద్రతీరము గలదు. ఈ దేశము యొక్క జనసంఖ్య 1950 నాటి లెక్కలనుబట్టి 32,02,757. జనసాంద్రత చదరపు మైలుకు 30.6. దీనిలో 60% అమెరికను ఇండియనులు. కోకో తోటలు, రబ్బరు తోటలు మొదలగునవి యూరపునుండి వలసవచ్చిన వారి యధీనములో నున్నవి. ఇచటి ప్రజలు రోమను కాథోలిక్ మతమునకు చెందినవారు. వీరు ముఖ్యముగా స్పానిష్, క్వెకువా అను భాషలను మాట్లాడుదురు. పదునెనిమిదేండ్ల వయసురాగానే ప్రతియువకుడు సైనికశాఖలో తప్పక చేరవలసియుండును. 1949-1950లో 3291 ప్రైమరీ పాఠశాలలలో 3,20,931 మంది విద్యార్థులును, 156 సెకండరీ పాఠశాలలలో 27,396 మంది విద్యార్థులుసు విద్య గరచుచుండిరి. గేక్విల్ లో విమానయాన పాఠశాల, సాలిసస్ లో నౌకాయాన పాఠశాల కలవు. లోజాలో న్యాయశాస్త్ర కళాశాల కలదు. క్విటో, గేక్విల్ క్వెంకా పట్టణములలో విశ్వవిద్యాలయములు కలవు. ఇచటవిద్య ఉచితము, నిర్బంధ పఠనీయము అయినను నిరక్షరాస్యత అధికముగనే యున్నది.
ఈక్వెడారు వార్షిక ఆదాయము 46,50,00,000. సూక్రేలు ఆదేశ నాణెము పేరు. ఈ దేశము బంగారు, వెండి, రాగి, సీసపుగనులు గలిగి ప్రసిద్ది చెందియున్నది. పెట్రోలియం ఉత్పత్తిచేయుచు ప్రపంచపు వెలుతురున కాధారభూతముగా నున్నది. ఇచ్చట 'బల్సా' అను కలపగలదు. ఇది చాలగట్టిది. ఇది విదేశములకు ఎగుమతి యగు చుండును.
స్పేనిషు వీరుడైన ఫ్రాంసిస్కొపిజారో అను వాడు ఈక్వెడారును 1532లో జయించెను. 1809లో దేశీయులు స్పెయినుపై తిరుగుబాటు చేసిరి. కాని 1822 మే 24న వారికి సంపూర్ణ విజయము లభించెను. తరువాత ఈ రాష్ట్రము వినిజులా, కొలంబియా అను రాష్ట్రములతో కూటమిగా జేరి సంయుక్త ప్రభుత్వబద్ధ మయ్యెను. 1830 లో ఈక్వెడార్ ఆ కూటమి నుండి ఉపాయముగా తప్పుకొని స్వతంత్రరాజ్యమయ్యెను. 1830 తరువాత ఈ దేశములో ఇంచుమించుగా నియంతృత్వ పరిపాలనము జరుగుచుండెను. 1900 నుండి 1944 వరకు అనేక ప్రభుత్వములు అధికారములోనికి వచ్చుచు తొలగింప బడుచు వచ్చెను. 1944 లో ఎన్నికలుజరిపిరి, 'జోనె వెలాస్కో ఇబర్రా" అనువాడు రాజ్యాధ్యక్షుడుగా నియమితు డయ్యెను. కాని ఇతడు నిరంకుశుడై ప్రత్యర్థుల పీచమడంచుచు ప్రవర్తించుటచే 1947 లో పదవీభ్రష్టతను పొందిన వాడాయెను. నాలుగేండ్ల కొకసారి యెన్నికలు జరుగును. ద్వివిధశాసన సభలు కలవు. 1944 నుండి క్రమపద్ధతిలో ఎన్నికలు జరుగుచు అధ్యక్షులు ఎన్నుకొనబడుచున్నారు. ఈక్వెడారు గణతంత్ర రాజ్యముగా వర్ధిల్లుచున్నది.
ఎం. వి. ఆర్.