Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇస్లాము

వికీసోర్స్ నుండి

ఇస్లాము  : ఇస్లాము ప్రపంచమందలి గొప్ప మతములలో నొకటి; ఈ మతస్థులు ప్రపంచమందలి మొత్తపు జనాభాలో విశేషభాగముగా నున్నారు. క్రైస్తవమతము వలె, యూదుమతమువలె నిదికూడ 'సెమిటిక్ ' అను వర్గమునకు జెందిన మతమై వాటి విశిష్టలక్షణములను కలిగియున్నది. ఇస్లాం మతావలంబకులు తమ మతమును పశ్చిమదేశము లందలి తెల్లవారు వాడుచున్న విధమున మహమ్మదీయమత మను పేరుతో పిలిచినచో రొషపడుదురు. 'ఇస్లాం' అనగా భగవంతునికి సంపూర్ణ సమర్పణయనియు, తమ విశ్వాసము పరిపూర్ణ శాంతియుతమనియు వారి భావన. అందుచే ఇస్లాం అను పదము మాత్రమే తమ మతము యొక్క అంతరార్థమును సరిగా ద్యోతకము చేయును. కావున తమమతమును 'ఇస్లాం' అనుటయే వారి గాఢవాంఛ. అంతేకాక, ఈ మతమును మతప్రవక్త(మహమ్మదు) పేరుతో ముడిపెట్టుట అపార్థములకు దారితీయును. ఏమనగా ముస్లిములకు మతప్రవక్త యగు మహమ్మదు తమ మతస్థాపకుడుకాడు. తన సందేశమును ప్రపంచమునకు వెల్లడించుటకై, భగవంతునిచే ఎన్నబడిన అనేక ప్రవక్తలలో మహమ్మదు ఒక ప్రవక్త మాత్రమే యై యున్నాడు. ఈ ప్రవక్తలద్వారా ప్రతిదేశమును, ప్రతి జాతీయును మార్గదర్శనమును, బోధయును, యుగ యుగములయందును పొందియున్నది. ఈ ప్రవక్తలలో కొందరి పేర్లు ఖురానులో గనుపడుచున్నవి. పేర్కొన బడని ప్రవక్త లింకను ఎందరో ఉన్నారని, ఖురాన్ అసందిగ్ధముగా చెప్పుచున్నది. అట్టి ప్రవక్తలలో మహమ్మదు చివరివాడనియు, వారందరి యొక్కయు 'ముద్ర' (Seal) అనియు భావింపబడుచున్నాడు.

ప్రొఫెసర్ కె. హట్టి యిట్లు చెప్పుచున్నాడు- ముస్లిం వేదాంతులు తమ మతము యొక్క ప్రధాన సూత్రములను వివరించుటలో ఈ దిగువ వానికిగల భేదమును కనబరచిరి; ' 'ఇమాన్' (మతవిశ్వాసము); 'ఇవాదత్ ' (ఆరాధనా క్రియలు, మతవిధి); ‘ఇహసాన్' (ధర్మాచరణము) - ఇవ న్నియు 'దీన్' (మతము) అను పదములో ఇమిడియున్నవి. ఈశ్వరుని ఏకత్వము నందును, ఆతని సందేశహారు లందరి యందును, వారికి ప్రసాదింపబడిన దివ్యజ్ఞాన విశేషముల (అనగా వారి గ్రంథముల) యందును, ఆతని దివ్యదూతల యందును, ఈ జీవితములో మనము చేసినదాని కంతటికిని సమాధానము చెప్పవలసియుండు అంతిమదినము నందును విశ్వాసము కలిగి యుండవలసినదని ఇస్లాం విధించుచున్నది- "లా ఇలాహ ఇల్లాల్లా", అనగా "అల్లా కంటె వేరు దేవుడు లేడు." అన్నది ఈ మతసిద్ధాంతములలో మిక్కిలి ముఖ్యమైనది. అల్లాయే సర్వ ప్రపంచమునకును సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి; విచారణ దినము (The day of Judgment) నాటి న్యాయాధిపతి; ఆర్తిసమయములలో మన ప్రార్థనలను విని, మనకండయగువాడును, మన కంఠనాళము కంటె అతడు మనకు సన్నిహితుడును ఐ యున్నాడు; "ఆతనినుండియే మనముద్భవించి యుంటిమి, ఆతని వద్దకే మనము తిరిగిపోవుదుము." ఇస్లాం మతము ప్రకారము దేవుడు తన వ్యవహారకాండలో వ్యక్తివరముగా పనిచేయును;— (సగుణుడు); అంతేకాక ఆతడు సత్తయందు అతీతుడుగను, అంతర్యామి గను గూడ నున్నాడు. (Transcendant and immanent). ఇస్లాం లోని సూఫీశాఖవారు భగవంతుని అంతర్యామిత్వధర్మమునకును, పూర్వాచార పరులు భగవంతుని అతీతత్వ ధర్మమునకును అధికతర ప్రాముఖ్యము నొసంగుచున్నారు. దివ్యజ్ఞానముచే తెలిసికొనబడిన అంశముల యందును, దివ్యజ్ఞానముచే వ్రాయబడిన గ్రంథములయందును, ఖురాన్ ఆఖరుసారిగా వ్రాయబడిన దివ్యగ్రంథ మగుటచే దాని యందును, విశ్వాసము గలిగియుండవలెనని ఇస్లాం మతము యొక్క ఆదేశము. ఒకడును, సత్యమైనవాడును అగు దేవునితో ఇతర దైవతములను కలగలుపుట ("షర్క్"). అన్నిటికంటే దుష్టమైన పాతకమనియు, అందుచే అనేక దైవము లున్నారనుట ఖండితముగా నిరాకరింపవలెననియు, ఈ మతము చెప్పుచున్నది. మనమిక్కడ విశ్వసించు దానిమీదను, ఆచరించుదానిమీదను, ఆధారపడి యుండు ఒక ఉన్నతతర జీవనమునెడల విశ్వాసము కలిగియుండుట ఇస్లాం మతసంప్రదాయము నందంతటను సూత్రప్రాయముగా నంతర్గతమై యున్నది. భవిష్యత్కాలములో రాగలదానిని గూర్చి సుస్పష్టవర్ణన లొసంగ బడియున్నవి. ధర్మాచరణమునకును (ఇహాసాన్), అనాధులకు మేలు చేయుటకును, పేదల కన్నదానము చేయుటకును, దాతృత్వమునకును, ఉపకారబుద్ధికిని ఇస్లాం చాల ప్రాముఖ్యము నొసగుచున్నది. ఈశ్వరునకు గల గుణవిశేషములన్నింటిలోను “దయ” అన్నది మిక్కిలి ప్రధాన మైనది. ఖురాన్ యొక్క ప్రతి 'సూరా' (Surah) యును, "దయామయుడును, మంగళప్రదుడును. అగు ఈశ్వరుని నామమును స్మరించి" అను మాటలతో ప్రారంభించుచున్నది. ఇస్లాంమతధర్మములు ఐదు స్తంభముల మీద (అర్కాన్") ఆధారపడియున్నవి.

మొదటి స్తంభము  : "అల్లాకంటె వేరు దేవుడు లేడు, మహమ్మదు అల్లా యొక్క సందేశహరుడు అను విశ్వాసము యొక్క స్వీకరణము. ('షహారత్'.)

రెండవ స్తంభము  : ప్రార్థన, విశ్వాస స్వీకరణ చేసిన వారందరును, మక్కా దిక్కున కభిముఖులై, విధ్యుక్తము ననుసరించి, ప్రార్థన నుచ్చరింపవలసినదని ఆదేశింపబడు చున్నారు. దినమునకు ఐదుమారులు ముస్లిం ఈ ప్రార్థన క్రియాకలాపము ననుసరింపవలసియున్నాడు. ప్రతి ప్రార్థనలోను ఖురాన్ నుండి "ఫాతెహా" అనబడు ఒక చిన్న భాగము పునశ్చరణ చేయబడును. క్రైస్తవుల "ప్రభుప్రార్థన" ("Lord's Prayer") తో తుల్యమైన దానినిగా దీనిని భావించుచున్నారు. “నిన్నే మేము ఆరాధించుచున్నాము; నిన్నే మేము సహాయముకొరకు అర్థించుచున్నాము; నీ వనుగ్రహించినవారి మార్గమగు ఋజుమార్గమును, మాకు చూపుము; నీ వాగ్రహించెడి వారి మార్గమునకాని, తప్పుత్రోవకు చెదరి నడచెడి వారి మార్గమునకాని, మమ్ములను పోనీయవలదు.” అను మాటలతో నిది యంతమగుచున్నది.

ముస్లిం మసీదులోనే ప్రార్థన చేయవలెనన్న నిర్బంధము లేదు; నిజమునకు ఈశ్వరుని విశాల ప్రపంచమే అతని ప్రార్థనారంగము. కాని సాముదాయకముగ ప్రార్థన చేయుట ప్రశస్తతరము. నిజమునకు, ఇస్లాం సాంఘిక జీవనము నెప్పుడును విస్మరింపదు; ప్రజాజీవనమును భక్తి పరమైన అర్థముతో నింపుటకై ప్రయత్నించును. పంచ ప్రార్ధనలును మానవునకు తన గమ్యస్థానమును సతతము జ్ఞాపకము చేయుచుండుటకై ఉద్దేశింపబడినవి.

మూడవ స్తంభము  : 'జకాత్ ' లేక భిక్షాదానము. మొదటిలో బహుశః ఇది ఐచ్ఛికమై యుండెడిది; కాని తరువాత ఇది ధనము, ధాన్యము, పశువులు, పండ్లు, వర్తకపు సరుకు మొదలగు ఆస్తిపై నిర్బంధముగా వసూలు చేయబడు నొక పన్నుగా పరిణమించినది. సాంఘిక న్యాయమును సమకూర్చుటకును, పెట్టుబడి దారి విధానము పెరుగకుండ నిరోధించుటకును ఇదిఒక ఉపాయమైయున్నది.

నాల్గవ స్తంభము : ఉపవాసము. పెక్కు ఇతర మతములలో నీ యుపవాస పద్దతి లేకపోలేదు. కాని ఇస్లాంలో చాల విశదముగా నిది క్రమబద్ధము గావింపబడి యున్నది. ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్రమగు రంజాన్ చాంద్ర మాసమంతయును ఉపవసింపవ లెనని ఆ మతానుయాయులు ఆదేశింపబడుచున్నారు.

ఐదవ స్తంభము : పుణ్యక్షేత్ర సందర్శనము. జీవితములో ఒకమారు, సమర్ధతగల ప్రతిముస్లిము, స్త్రీయును, పురుషుడును సంవత్సరములో ఒక సముచిశ సమయమున మక్కాయాత్రకు ప్రయాణము చేయుట పవిత్రకర్తవ్యముగా నెంచబడుచున్నది.

ప్రతీ గొప్పమతమునకును ఒక ప్రత్యేక వ్యక్తిత్వము ఉండును. మూలధర్మ సిద్ధాంతములను సంక్షిప్తముగా విచారము చేసినంత మాత్రమున దానిలోని సంపూర్ణ పరమార్థతత్త్వము ఎంతమాత్రమును వ్యక్తము చేయబడదు. ఈ మతమందలి ఆరాధన విషయమునుబట్టి చూచినచో, ఇస్లాం కర్మకాండకు ప్రాధాన్యమిచ్చునది గాను, ధార్మిక జీవితపు టర్థమును, అంతస్సారమును పరిగణింపనిదిగాను కనబడును. కాని నిజమాలోచించినచో మతానుష్ఠానముల ననుసరించుటకు వలసిన సరియగు ఉత్తేజము నొసంగు భక్తి కిని, మతవిజ్ఞానమునకును తగు ప్రాముఖ్యమును ఇస్లాం పరిపూర్ణముగా నిచ్చుచున్నది. ఈ మతానుయాయులు ప్రార్థనసమయమందు, కాబా (Kaaba) దిక్కునకు అభిముఖులు కావలెనని ఆదేశింపబడుచున్నారు. కాని వారి ధర్మనిష్ఠాపరత్వము వారు తిరిగెడి దిక్కుతోనే పరిసమాప్తి కాదనియు, మనస్సులో నెలకొనవలయుననియును ఇస్లాం సుస్పష్టముగా హెచ్చరించుచున్నది. ఆరాధన యొక్క నిర్ణీత విధుల ననుసరించు టతో బాటు రేయింబవళ్ళు భగవంతుని స్మరించుచుండవలెనని మానవుడు ఆదేశింపబడుచున్నాడు. భక్తితత్పరు లానందించు భగవత్సామీప్యము, అట్టివారికి ఉత్తర జన్మలో ప్రసాదింపబడగల అల్లా దివ్యదర్శనము యొక్క అనిర్వచనీయానందము ఇహపరజీవిత సుఖము లన్నింటి కంటెను గొప్పవని అతడు కాలక్రమములో తెలిసికొనునట్లు చేయబడుచున్నాడు.

ష. హి