Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇటలీ (భూగోళము)

వికీసోర్స్ నుండి


ఇటలీ (భూగోళము) : పూర్వకాలమున రోమను సామ్రాజ్యమునకు ఇటలీ దేశము ఆయువుపట్టుగా నుండెను. ఆ సామ్రాజ్యపతనమునకు తరువాత పెక్కు శతాబ్దములవరకు ఇటలీద్వీప కల్పము అనేక చిన్న రాష్ట్రములుగా విచ్ఛిన్నమై యుండి, తిరిగి 19 వ శతాబ్దపు ద్వితీయభాగమున ఒకే దేశముగా రూపొందినది. ఇటలీ మధ్యధరా సముద్రములో మధ్య స్థానములో నుండుట భూగోళ విషయకముగా మిక్కిలి గమనింపదగిన విశేషము, పశ్చిమమున టైరీనియన్ సముద్రము, దక్షిణమున ఐయోనియను సముద్రము, తూర్పున అడ్రియాటిక్ సముద్రము అను మధ్యధరాసముద్రపు శాఖలు వ్యాపించి యున్నవి.

36°38′ ఉ. అక్షాంశమునుండి 47° 7' ఉ. అక్షాంశము వరకును, 6° 37' తూ రేఖాంశమునుండి 18° 32' తూర్పు రేఖాంశము వరకును ఇటలీ దేశము వ్యాపించి యున్నది. వాయవ్యమునుండి ఆగ్నేయముగా మధ్యధరాసముద్ర ములోనికి చొచ్చుకొని, 720 మై. పొడవును 80 నుండి 150 మై. వెడల్పును కలిగియున్నది. ఇటలీ కేంద్ర స్థానమం దుండుటచే మధ్యధరా సముద్రదేశముల చరిత్రలో ప్రధాన పాత్రను నిర్వహించుచు వచ్చినది.

1953 సం 30 జూన్ నాటికి ఈ దేశపు వైశాల్యము 301,272 చ. కిలోమీటర్లు. ఇందులో 277,861 చ. కిలోమీటర్లు వ్యవసాయమునకును, అడవులకును ఉపయోగింపబడుచున్నది. 23,410 చ. కిలోమీటర్లు బంజరుగా నున్నది. ఇటలీ దేశమును 3 నైసర్గిక ప్రాంతములుగా విభజించవచ్చును.

1. ఉత్తర మైదానములు, వాటిచుట్టు నున్న పర్వతములు :- ఈ మైదానములు ఎడ్రియాటిక్ సముద్రతీరమువరకును వ్యాపించి యున్నవి. ఇవి పో నది యొక్కయు, దాని ఉపనదుల యొక్కయు వండలి మట్టిచే నిర్మింపబడినవి.

2. సన్నముగా పొడవుగా మధ్యధరాసముద్రములోనికి వ్యాపించియున్న ద్వీపకల్పము :- ఆల్ప్సుపర్వతముల శాఖయైన అపినైను పర్వత పంక్తులు ఈ ద్వీపకల్పమునకు వెన్నెముక వంటివి.

3. పశ్చిమ దక్షిణముల నున్న సార్జీనియా, సిసిలీ ద్వీపములతో గూడిన ఇటలీ ద్వీపభాగము : ఇటలీలో మిక్కిలి జనసమ్మర్దముగల రాష్ట్రములలో సిసిలీ ద్వీప మొకటి. ఇందలి పంటలు ద్వీపకల్పములోని పంటలను పోలియుండును. సార్డీనియాద్వీపము పర్వతమయమై తక్కువ జనసమ్మర్దమును కలిగియున్నది. ఫ్రెంచి ద్వీపమైన కార్సికా నుండి, బోనిఫాషియో జలసంధిచే వేరుచేయబడుచున్నది. ఇందు చాలభాగము చిన్న అడవులచేతను, పొదల చేతను, ఆవరింపబడి యున్నది.

పైన పేర్కొన్న వాటిలో చివరి రెండు విభాగముల యందును, మధ్యధరా దేశములకు సహజమైన వాతావరణము, శీతోష్ణస్థితులు కన్పట్టును. వేడిగా నుండు వేసవి కాలము, వెచ్చగా నుండు శీతకాలము, నిర్మలమైన ఆకాశము, సామాన్యపు వర్షపాతము, శీతకాలపు వర్షములు, ఉండును. వేసవిలో వర్షము లేక పొడిగా నుండును.

ఇటలీ దేశపు జనసంఖ్య 4 కోట్ల 10 లక్షల పరిమితి కలది. 70 శాతము వ్యవసాయముచే జీవనముచేయువారు. వివిధ ప్రాంతము లందలి వ్యవసాయదారులలోను, దృక్పథములలోను, ఆచారములలోను, జీవన పరిస్థితులలోను చాల తేడాలు గోచరించును. చిన్ని చిన్ని పొలములను తయారు చేయుటకే రాళ్లను సయితము పగులగొట్ట వలసిన పర్వతవాసులు, సాగుచేసి పంటలు పండించుకొను అబ్రూజి ప్రజలు. వీరిలో పల్లెల జీవితములోని వైవిధ్యము ప్రతిఫలించుచున్నది. మరియు ఇచట వేలకొలది సంవత్సరములుగా వచ్చుచున్న పౌరనాగరికతకూడ కలదు.

ప్రజల నడవడికలలో కూడ పెక్కులు ప్రాంతీయ భేదాలు కలవు. వాయవ్య ప్రాంతపు ప్రజలు వర్తక వ్యాపారములకు ఎక్కువగా అలవాటుపడి యుండుటచే ఉదాసీనులుగా నుందురు. మధ్య రాష్ట్రములగు టస్కనీ, అంబ్రియాలలోని ప్రజలు ఉదారులును కపటము లేని వారును ఐ ఉన్నారు. దక్షిణ రాష్ట్రములందలి వారు అత్యంత మైన భావనా బలము కలవారు.

ఉత్తరమున నున్న ఆల్ప్సు పర్వతములు, రైలుమార్గములకు బాటలకు గొప్ప అడ్డంకులు. కాని వీటి యందలి జల పాతములును, సహజసరస్సులును విద్యుచ్ఛ క్తిని తయారు చేయుటకు మిక్కిలి ఉపయోగపడు చున్నవి. పర్వత కనుమల గుండాను, సొరంగముల గుండాను రైళ్ళను నడుపుటకు ఈవిద్యుచ్ఛక్తి చాలా ఉపయోగపడు చున్నది. సెంటు గోథర్డు, సెనిస్, సింప్లాను వంటి సొరంగముల గుండా ఉత్తర దేశములకు రైలుమార్గములు కలవు. తూర్పు పర్వతములలో, బ్రెన్నరు కనుమగుండా ఆస్ట్రియా దేశమునకు రైలుమార్గమున్నది. మరియొకటి క్లాగన్ఫర్టు కనుమగుండా యుగోస్లోవియాను కలుపుచున్నది. ఆల్ప్స్ పర్వతములకు దక్షిణముననున్న పో నదీమైదానములు మిక్కిలి సారవంతమైనవి. విస్తారముగా పంటలు పండునవి. ఈ మండలములో కొన్ని ప్రాంతముల అలీవ్ తోపులక్రింద ద్రాక్షపంట కలదు. వాటికి క్రిందుగా ధాన్యమును పండించు మూడంతరములు వ్యవసాయము కలదు. ఈ మండలము లలో వ్యవసాయమునకు ఉపయోగించు నీటిపారుదల యేర్పాట్లు కలవు. ఉదా. ప్రసిద్ధమైన కపూర్ కాలువసాయమున పెక్కు చిత్తడి నేలలు సాగుబడిక్రిందికి తీసుకొని రాబడినవి.

వ్యవసాయము అధిక ఫలవంతములైన ఆధునిక పద్దతులమీద జరుగుచున్నది. ఇచట ఎరువుల నుపయోగించు పద్ధతులను గూర్చియు, పంటలను మార్చి సాగుచేయు విధానములను గూర్చియు రైతులకు శిక్షణ ఒసగబడు చున్నది. పో నదీ మైదానములో అధికఫల ప్రదాయకమగునట్లు భారీగా వ్యవసాయము జరుగుచున్నది. సారవంత మైన చదును నేలలు, నీటి సౌకర్యములు కారణములుగా ఈ మండలము విశేష ఫలము నిచ్చుచున్నది. ఇది కాక పరిశ్రమలలో కూడ పోనదీ మండలము దేశమునందు ముఖ్యమగు ప్రాంతము. దేశమునందలి వరిపంటను సమగ్రముగను, సగము జనుపనార ను, మూడు వంతుల పట్టును, మూడువంతులు మొక్కజొన్నను, సగ భాగము గోదుమను, ద్రాక్షను ఈ మండలము ఉత్పత్తి చేయుచున్నది. ఇట్టి సమృద్ధియే, విదేశముల కెగుమతి చేయుటకు కూడ కారణమగుచున్నది. అల్పు పర్వతప్రాంతము ముఖ్యముగా ద్రాక్షకు ప్రసిద్ధమైనది. ద్వీపకల్ప భాగములో మధ్యధరా ప్రాంతపు ఫలసంపదకలదు. ఆల్పు పర్వత పాదమండలములో పశుపోషణము ముఖ్యవృత్తి.

ఖనిజములలో గంధకము ముఖ్యమయినది. ఇది ముఖ్యముగా సిసిలీ ద్వీపములో దొరుకును. ఎగుమతులలో గంధకము రెండవ స్థానమాక్రమించియున్నది. ఎల్బాలో మేలురకపు ఇనుము, సార్డినియాలో సీసము, తుత్తునాగము దొరుకును. ఇస్ట్రియాలోను అబ్రూజిలోను బాక్సయిటు లభించును. పాదరసము, చలువ రాళ్ళు టస్కనీలో విశేషముగా దొరకుచున్నవి. నేల బొగ్గుగనులు ఇటలీ దేశమున చాలా తక్కువగానున్నవి. కొద్దిగా పెట్రోలియం మాత్రము ఎమిలియాలో లభ్యమగుచున్నది. పో నదీ మైదానములో మరికొన్ని పెట్రోలు గనులు కనుగొనబడినవి. ఇటలీ దేశపు నై సర్గిక స్వరూపము, అందలి అసంఖ్యాకములైన ఏరులు, విద్యుత్తును ఉత్పాదించుటకు మిక్కిలి అనువుగానున్నవి. క్రీ. శ. 1953 లో 32,619 మిలియను కిలో వాట్ల విద్యుచ్ఛక్తి తయారు చేయబడినది.

ఇటలీ దేశపు పరిశ్రమాభివృద్ధికూడ మిక్కిలి గమనింపదగినది. దీని ముఖ్యకారణములు :- (1) నైపుణ్యము కలిగి చవుకగా లభించు కార్మిక జనులు (2) సమృద్ధియైన విద్యుచ్ఛక్తి, (3) విస్తృతమైన దేశీయ వ్యాపారము, (4) చాలినంతగా దొరకు ముడిసరకులు.

వ్యవసాయ పరిశ్రమలలో “అధిక ఫలప్రదానము" నకు పేరెన్నికగన్నది పో మైదానము, అది మిక్కిలి అభివృద్ధి చెందియున్నది. అచ్చటి పరిశ్రమలలో నూలు పరిశ్రమ ప్రథమస్థానమును, యంత్రోత్పత్తి ద్వితీయస్థానమును ఆక్రమించియున్నవి. పరిశ్రమలలో 80 శాతము పోనది యొక్క లోయలలోనే కేంద్రీకరింపబడి యున్నది. మిలాను, ట్యూరీను, కోమో, బెర్గామో పట్టణములలో పట్టు పరిశ్రమ ముఖ్యమైనది. రయాను, ఉన్ని, నూలు వస్త్రముల ఉత్పత్తి కూడ వృద్ధి చెందినది. క్రీ. శ. 1953 సంవత్సరములో 1,007 ఫ్యాక్టరీలలో నూలునుత్పత్తి చేయుటకు మొత్తము 5,705,000 కదుళ్లును, 133,565 మగ్గములును, పట్టును తయారుచేయుటకు 1,109,527 కదుళ్లును, 26,143 మగ్గములును ఉపయోగములో నుండెను.

జినోవా, మిలాను, సవోనా, పియాంబినో పట్టణము ఉక్కు కర్మాగారములు కలవు. గాజు, లేసు, పరిశ్రమలలోను, పింగాణి, చలువరాయి పరిశ్రమలలోను, గడ్డితో అల్లు సామానులు, కత్తులు మొదలగు వస్తువులు తయారు చేయుటలోను ఇటలీ ప్రజలు నిపుణులు. ఓడలు స్పెజియాలోను, గంధకికామ్లము, కాల్షియం కార్బైడ్(ఖటిక కర్బనిదము), ఎరుపులు మొదలగు రసాయనిక పదార్థములు పెస్కారాలోను, మోటార్లు విమానములు, మిలాసులోను తయారగును. క్రీ. శ. 1952 సం.లో తయారయిన మోటారు కార్లు 134,784. వీటిలో 26,600 కార్లు విదేశముల కెగుమతి చేయబడినవి. కూరగాయలు, పండ్లు, నూనెలు, సారాయములు, జున్ను, బీటుదుంపనుండి తయారుచేయబడిన పంచదార మొదలగు వాటిని ఉత్పత్తిచేయు పరిశ్రమలు దేశమంతట వ్యాపించి యున్నవి.

క్రీ. శ. 1951 సం. లెక్కప్రకారము ఇటలీలో వ్యాపార పరిశ్రమలకు సంబంధించిన 1,475, 385 కంపెనీ లుండెను. వాటిలో 6,474 623 మంది కార్మికులు పనిచేయుచుండిరి. వీరిలో 25.19 శాతము చొప్పున వస్త్రములు, దుస్తులు మొదలగువాటికి సంబంధించిన పరిశ్రమ లందును, 20.63 శాతము చొప్పున ఇంజనీరింగు పరిశ్రమ యందును, 11.43 శాతము చొప్పున ఆహారపదార్థ పరిశ్రమలలోను, 10.44 శాతము చొప్పున గృహనిర్మాణ పరిశ్రమలలోను కార్మికు లుండిరి.

దేశములో అనేక పట్టణములకు సంబంధమును కల్పించునట్టియు, యూరపు దేశములతో రాకపోకలను సమకూర్చు నట్టియు రైలుమార్గములు పెక్కులు అభివృద్ధి, చెందినవి. వీటి మొత్తము పొడవు 21,900 కిలోమీటర్లు. ఇవికాక 170,811 కిలోమీటర్ల రోడ్లు కలవు. పో, టీసినో, అడ్డా, అడిజే మొదలగు నదులు ప్రయాణ సౌకర్యములు కలుగ జేయునవి ఉత్తర మైదానమందు మాత్రమే చాలవరకు కలవు. దక్షిణమున, టైబరు, ఆర్నో నదులు మాత్రమే నౌకాయానమునకు వీలుగా నున్నవి.

ఇటలీలో లక్ష పైగా జనాభాగల పట్టణములు దాదాపు 23 కలవు. టైబరు నదిపై గల రోము పట్టణము రాజధానిగా నున్నది. పో నదీమండలపు పశ్చాద్భాగము పోషక ప్రదేశముగా గల జినోవా రేవుపట్టణము ముఖ్యమైనది. మిలాను పరిశ్రమలకు కూడ ఇది లేవు. ఇటలీ ద్వీపకల్ప భాగమున నైరృతీతీరమున చక్కని సముద్రపు అఖాతము పైనున్న నేపుల్సు మరియొక ప్రముఖపట్టణము. యాత్రికుల నాకర్షించునట్టియు పురాతనపు రేవుపట్టణమునైన వెన్నీసు, అడ్రియాటిక్ తీరముననున్నది. ప్రయాణికులకు బ్రిండిసి ముఖ్యమగు రేవుపట్టణము. ద్రాక్ష పండ్లను, నారింజపండ్లను ఎగుమతిచేయు పలెర్మో పట్టణము సిసిలీ ద్వీపమునకు ముఖ్యపట్టణము.

ఈ దేశమున అనేక వస్తువులలో విదేశవ్యాపారము జరుగును. సామాన్యముగా ఎగుమతులకంటే దిగుమతుల విలువయే ఎక్కువ. అనగా లోటువ్యాపారము. వర్తకపు ఓడలపై వచ్చు రాబడి, విదేశ యాత్రికులు ఈ దేశమున చేయు ఖర్చు, విదేశములందలి ఇటలీ దేశీయులు స్వదేశమునకు పంపు ధనము, మొత్తముమీద ఈ లోటును పూర్తిచేయు సాధనములు, స్విట్జరెండు, ఫ్రాంసు, జర్మనీ, అమెరికాసంయుక్త రాష్ట్రములకు పంపబడు పట్టు; దక్షిణ అమెరికా దేశములకు పంపబడు నూలు వస్త్రములు; అర్థంటై నాకు పంపబడు సారాయములు ఇచ్చటముఖ్యమైన ఎగుమతులుగా నున్నవి. మరియు అనేక దేశములకు కాయగూరలు, పండ్లు, రయోను (నారతో చేసిన కృత్రిమపు పట్టు), కార్లు, ఆహారపదార్థములు, గంధకము, చలువ రాయి మొదలగు ఖనిజములు ఎగుమతిచేయబడుచున్నవి.

అమెరికాసంయుక్త రాష్ట్రములు, ఈజిప్టు, పాకిస్తాను అను దేశములనుండి నూలు, అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండియు, రష్యానుండియు పెట్రోలియము, బ్రిటను, జర్మనీ దేశములనుండి బొగ్గు, అమెరికా సంయుక్త రాష్ట్రములు, కెనడా, అర్జంటీనా దేశముల నుండి దినుసులు పేర్కొనదగిన ఇచ్చటి ముఖ్యములగు దిగుమతులు. ఇవికాక, ముడి ఖనిజములు, ఉన్ని, పంచదార, తేయాకు, కాఫీ, కఱ్ఱపరిశ్రమ కుపయోగించు యంత్రములుకూడ ఈ దేశము దిగుమతి చేసికొనుచున్నది.