Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇటలీ (చరిత్ర)

వికీసోర్స్ నుండి


ఇటలీ (చరిత్ర) : ఇటలీకి మహోజ్జ్వలమగు ప్రాచీన చరిత్ర కలదు. ఐరోపా ఖండమున, దక్షిణమున మధ్యధరా సముద్రమునకును, అల్ప్సు పర్వతములకును మధ్యగల ఈ ద్వీపకల్పము, గ్రీసుతోపాటు పాశ్చాత్య నాగరికతా సంస్కృతులకు పుట్టినిల్లయి, ప్రపంచ విఖ్యాతమగు మహాసామ్రాజ్యమునకు కేంద్రమైనది. సార్డీనియా, సిసిలి, ఎల్బా మున్నగు ద్వీపములతో ఇటలీ విస్తీర్ణము 116, 235 చ.మైళ్ళు. జనాభా సుమారు 46,110,000. 2500 సంవత్సరములుగా ఈ దేశ చరిత్ర చిత్రమైన అనేక క్లిష్టపరిణామములకులోనై అత్యద్భుతమును గొల్పుచుండును.

ప్రాచీన చరిత్ర : క్రీ. పూ. 1300 సం. లకు ముందు ఇటలీలో మధ్యధరాసముద్ర జాతులు నివసించుచుండెను. క్రమముగా ఆర్యజాతులు ఇటలీలో ప్రవేశించెను. క్రీ. పూ. 9, 10 శతాబ్దుల నాటికి లిగూరులు, ఉంబ్రియనులు, శమినైటులు, ఇటాలియనులు, లాటీనులు ఇచ్చట స్థావరము లేర్పరచుకొనిరి. దక్షిణ ఇటలీ, సిసిలీలలో గ్రీకు వలస లేర్పడి ఇయ్యది మాగ్న గ్రేషియా యని వ్యవహరింప బడినది. షియోనీషియనులు, కార్థేజియనులు కూడ ఇటలీ తీరములందు వలసలు స్థాపించుకొనిరి. ఈజిప్టు, గ్రీసులనుండి ఇటలీకి నాగరికత ప్రసరింపసాగెను.

ఎట్రూస్కనులు  : క్రీ. పూ. 9 వ శతాబ్దమున పశ్చిమ ఆసియా వాసులగు ఎట్రూస్కనులు దండెత్తి ఇటలీ పశ్చిమ తీరమున నేటి టస్కనీ ప్రాంతమును ఆక్రమించిరి. వీరి కాలమున ఇటలీ నాగరికత కొక రూప మేర్పడెను. వీరు మైసీనియా వాస్తు పద్ధతులపై దుర్భేద్యములగు దుర్గములు నిర్మించిరి. కంచు, రాగి పరిశ్రమలను ప్రోత్సహించిరి. పెక్కు విషయములలో గ్రీసు నాగరికత వీరికి మార్గదర్శకమైనది. వీరు వ్రాయించిన శాసనము లనేకములు నేటికిని అజ్ఞాతములుగనే యున్నవి.

రోమనులు  : ఎట్రూస్కనులు రాజ్యముచేయునపుడే టైబర్ నదీతీరమున పాలటైను పర్వతముపై రోమునగరము గొప్ప వ్యాపార కేంద్రమైనది. క్రీ.పూ. 753 లో రీనుస్, రోములాస్ అను సోదరులు రోమును నిర్మించినట్లు గాధ కలదు. వీరు లాటిన్ జాతికి చెందినవారు. క్రీ. పూ. 510 లో రోమనులు 'టార్క్వీనియను' అను ఎట్రాస్కిన్ రాజును తొలగించి రిపబ్లిక్కును స్థాపించిరి. నాటి నుండి సుమారు క్రీ. శ. 450 వరకును రోము చరిత్రయే ఇటలీ చరిత్ర.

రొమన్' రిపబ్లిక్కు : రోమనులు సమయస్ఫూర్తిగల కార్యశూరులు; మహావీరులు; పరిపాలనాదక్షులు; న్యాయ శాస్త్రమునందు నిష్ణాతులు: క్రీ. పూ. 510 లో తాము స్థాపించిన రిపబ్లిక్కు పరిపాలనా విధానమును క్రీ. పూ. 450లో 12 కంచు రేకులపై వ్రాసియుంచిరి. ఆ రాజ్యాంగము ప్రకారము ప్రభుత్వమొక శిష్టసభ (సెనేటు) చేతులందుండెను. కార్యనిర్వహణమునకై ఇద్దరు ఉద్యోగులు (కాన్సల్స్) నియమింపబడిరి. అత్యవసర పరిస్థితులలో నియంతలను నియమించు నాచారముండెను. మొట్టమొదట ప్రభుత్వము ధనికుల (పాట్రీషియనుల) చేతులందుండెను. కానీ క్రమముగా సామాన్యులు (ప్లెబియనులు) తిరుగుబాటొనరించి, సమ్మెలుజరిపి ధనికులతో సమానమగు హక్కులను బడసిరి. వారి కోరిక ప్రకారము ప్రజా శ్రేయస్సును రక్షించుటకై ప్రజా ప్రతినిధులు (ట్రైబ్యూను) నియమింపబడిరి. ఇటలీలో చక్రవర్తులు అధికారమునకు వచ్చువరకును ఈ పరిపాలనా విధానమే అమలునందుండెను.

సామ్రాజ్య విస్తరణము  : కొలది కాలములో రోము గొప్ప సామ్రాజ్యమునకు కేంద్రమైనది. క్రీ. పూ. 390 లో గాలులు దండెత్తి రోమునగరమును ధ్వంస మొనరించిరి. కాని రోమనులు అచిరకాలములో కోలుకొని క్రీ. పూ. 260 నాటికి ఇటలీ ద్వీపకల్పమును రాజకీయముగ సమైక్య మొనరించిరి. ఇంతటితో రోము, కార్ధేజీలకు మధ్యధరా సముద్రముపై సంఘర్షము ప్రారంభించెను. కార్ధేజి ఉత్తరాఫ్రికా తీరమున గల రిపబ్లిక్కు రోము, కార్థేజీల మధ్య 3 యుద్ధములు జరిగెను. వీనినే ప్యూనిక్ యుద్ధము లందురు. మొదటి యుద్ధముతో రోమనులు సిసిలీని ఆక్రమించిరి. రెండవ యుద్ధమున కార్టేజి వీరుడను హానిబాల్ ఇటలీపై దండెత్తి (క్రీ. పూ. 218) 7, 8 సంవత్సరములు వీరవిహార మొనరించెను. 'షెబియస్ మాక్సిమస్' అను వీరుడు రోమక రాజ్యమునకు నియంతయై యుద్ధమును నడిపెను. చివరకు 'సివియో' అను రోమను సేనాని హాని బాల్ నోడించి స్పెయినుతోకూడ కార్ధేజి సామ్రాజ్యమును (క్రీ. పూ. 146) జయించెను. 3 వ ప్యూనిక్ యుద్ధముతో కార్థేజి సర్వనాశనమైనది. నల్లసముద్రము నుండి అట్లాంటిక్ మహాసముద్రము వరకును రోమను సామ్రాజ్యము విస్తరించెను.

సాంఘిక పోరాటము  : సామ్రాజ్య విస్తరణము అనేక సాంఘిక రాజకీయ పరిణామములకు కారణమయ్యేను. ఆక్రమిత ప్రాంతములనుండి ధన ధాన్యములు అపారముగ ఇటలీలోనికి ప్రవహించెను. బానిసల సంఖ్య లక్షల కొలది పెరిగెను. నగరములు ఐశ్వర్యముతో విద్యావినోదములతో తులతూగుచు ప్రజల నాకర్షించెను, నాటక ప్రదర్శన శాలలు, భవనములు, ఉద్యానవనములు దేశ మంతట వెలసెను. గ్రీకుగ్రంథములు భాషాంతరీకరింపబడెను. గ్రీకు విద్యా విధానము ఇటలీలో ప్రవేశించెను. కాని గ్రామములందు వ్యవసాయము, పరిశ్రమలు క్షీణించి రైతులు దరిద్రులైరి. బానిసలు తిరుగుబాటులు ప్రారంభించిరి. ధనిక, సామాన్యవర్గముల మధ్య పోరాటము తీవ్రరూపము దాల్చెను. ఈ పరిస్థితులలో 'టిబెరియస్', 'కియస్' అను సోదరులు ట్రైబ్యూనులై సంస్కరణల గావించి శాంతి నెలకొల్ప యత్నించి, (క్రీ. పూ. 133- 122) ప్రాణములు కోల్పోయిరి. సెనేటు సంస్కరణలకు సమ్మతింపలేదు. తాత్కాలికముగ ధనికవర్గమునకే విజయము చేకూరెను.

సేనానుల అధికారము  : ఇది ఇట్లుండ, సామ్రాజ్య విస్తరణమునకును, నిర్వహణమునకును సైన్యమవసరమై నందున సేనానులకు గౌరవము ఇనుమడించినది. ప్రజాభిప్రాయముపై కంటే సైనిక బలముపై ప్రభుత్వ మాధారపడ జొచ్చెను. క్రమముగా ధనిక సామాన్య వర్గ భేదములు సైన్యమున గూడ . ప్రవేశించినవి. సామాన్య వర్గప్రతినిధి 'యైన 'మేరియస్' ధనిక వర్గప్రతినిధియైన 'సల్లా అను సేనాపతులమధ్య స్పర్ధ పెరిగిపోయేను. వీరు సెనేటును నిర్లక్ష్యముచేసి తమలో తాము కలహించుకొనసాగిరి. 'మెత్రిడేట్సు' అను నాతని తిరుగుబాటును అణచుటకై సల్లా, పాంటస్ పై దండెత్తినపుడు అతని పక్షమును మేరియస్ అణచివైచెను. 'సల్లా' తిరిగివచ్చి, మేరియస్ అనుయాయుల నందరిని తుద పుట్టింది (క్రీ. పూ. 81) నియంత యయ్యెను. సైనిక పరిపాలన ఏర్పడుటకీ సంఘటనలు నాంది యైనవి.

పొంపే; సీజరు : ఇట్టి పరిస్థితులలో షాంపే, జూలియస్ సీజరు అను మహావీరులు బయలుదేరిరి. పాంటస్ ప్రభువగు మెత్రి డేట్సును ఓడించుటలొను. స్పార్టారూస్ నాయకత్వమున తిరుగుబా టొనరించిన బానిసలను లొంగదీయుటలోను, స్పెయినులో శాంతి నెలకొల్పుటలోను, ప్రతిభను ప్రదర్శించి పాంపే గోప్ప కీర్తిని సంపాదించెను. పొంపే యందు సెనేటునకు ఆదరాభిమానములు కలిగెను. కాని కార్యవర్గమున అతనికి సహచరుడు జులియస్ సీజరు. పాంపే సీజరుల మద్య అసూయా ద్వేషములు ప్రబలెను, గాలులను బ్రిటనులను జయించుటలో అత్యద్బుత ధైర్య సాహసములు ప్రదర్శించి దైవాంశసంభూతుడని సీజరు ప్రజల మన్ననకు పాత్రుడయ్యెను. పొంపే, సెనేటరులు సీజరు ననుమానించసాగిరి. సీజరు ఇది గ్రహించి సెనేటుపై యుద్ధమును ప్రకటించి పొంపేను ప్రొసలన్ చెంత (క్రీ.పూ. 48) ఓడించెను. పొంపే ఈజిప్టు పారిపోయి అచట వధింపబడెను. అతని వెన్నాడిపోయిన సీజరు ఈజప్టు మహారాణి క్లీ యోపాత్ర యొక్క సౌందర్యమునకు ముగ్ధుడై ఆమెతో కొంతకాలము గడిపి ఇటలీకి తిరిగివచ్చెను.

నియంత సీజరు : ఫ్రోసలస్ యుద్ధముతో సెవేటు గౌరవ ప్రతిష్ఠలు అడుగంటి సీజరు నియంతగా చెప్పు కొనబడెను. సీజరు మిత్రుడగు బ్రూటనుకు ప్రఖ్యాత రచయిత యగు సిసిరో మున్నగువారికి నియంతృత్వము సమ్మతము కాకపోయెను. వారి కుట్ర ఫలితముగ (క్రీ.పూ. 44) సీజరు హత్య చేయబడెను. సీజరు హత్యవలన రిపబ్లిక్ బలపడు టకు బదులు విచ్ఛిన్నము కాసాగెను. 'దేశమున అంతర్యుద్ధము ప్రారంభమైనది,

రిపబ్లిక్కు యొక్క అంత్యదశ :సీజరు మరణానంతరము ఆంటోనీ, లెపిడియసు, ఆక్టేవియసు అనువారు పాలకవర్గముగా నేర్పడి సామ్రాజ్యమును విభజించుకొని పాలింవసాగిరి. లెపిడియస్ పర్షియాపై దండెత్తి ప్రాణములను కోల్పోయెను. ఆంటోనీ, జూలియస్ సీజరు భక్తులలో నొకడు. సీజరు యొక్క దత్తపుత్రుడు ఆక్టే వియస్ సీజరు. క్రమముగా ఆంటొనీ, ఆక్టేవియసుల మధ్య స్పర్ధ ప్రారంభమయ్యెను. సామ్రాజ్యమున తూర్పు భాగము నేలు ఆంటోనీ, క్లియోపాత్ర మోహములోబడి పరిపాలనను నిర్లక్ష్యము చేయసాగెను. క్రీ. శ. 31 లో ఆక్టేవియస్ వారిపై దండెత్తి యాక్టియమ్ యుద్ధమున వారి నోడించెను. ఆంటోని, క్లియోపాత్రలు ఆత్మహత్య చేసికొనిరి. ఆక్టేనియసు మార్గము నిష్కంటకమైనది. అక్టేవియసు రోమునకు తిరిగి వచ్చినంతనే, సెనేటు అతనికి చక్రవర్తి (ఇంప రేటర్), అగస్టస్ అను విరుదము లొసంగెను. అనగా ఆక్టేవియన్ సీజరు అగస్టను చక్రవర్తి యైనాడు. ఇంతటితో రోమను రిపబ్లిక్కు చరిత్ర పూర్తియైనది.

సార్వభౌములు  : చక్రవర్తియైన తరువాత అగస్టను సామ్రాజ్య సరిహద్దులను బలపరచి రాష్ట్ర పరిపాలనను దిట్టముచేసెను. ఇతని కుమారుడు 'టిబెరియస్' పరిపాలనలోనే ఏసుక్రీస్తు శిలువ వేయబడెను. సెనేటు అధికారము పూర్తిగా నశించెను. క్లాడియస్ చక్రవర్తి క్రీ.శ. (41-54) బ్రిటనును ఆక్రమించెను. నీరో ఇతని దత్తపుత్రుడు. నీరో తల్లి అగ్రియప క్లాడియస్ ను హత్యచేసెను. అనంతరము సింహాసన మెక్కిన నీరో, పరమదుర్మార్గుడు. ఇతడు తల్లిని భార్యను హత్యచేసెను. క్రిస్టియను లితనిచే దారుణ హింసలకు గురియైరి. క్రీ. శ. 64 లో రోములో సంభవించిన భయంకర అగ్నిప్రమాద మీతని కృత్యమే. ఇట్టి దుశ్చర్యలవలన బ్రిటనులో బోడిషియా తిరుగుబా టొనరించెను. సామ్రాజ్యము నలుమూలల విజృంభించిన తిరుగుబాటుల నణచలేక నీరో ఆత్మహత్య యొనర్చుకొనెను. నీరోతో సీజరువంశ మంతరించినది. ట్రోజాన్ చక్రవర్తి కాలమున, పార్థియా, ఆర్మీనియా, అస్సీరియా, మెసపొటోమియాలు జయింపబడి రోమను సామ్రాజ్య ముచ్చదశ యందుండెను. మార్కస్ అరేలియసు (క్రీ.శ. 161- 180) రోమను చక్రవర్తులందరిలో సహృదయుడు. ఇతడు "మెడిటేషన్సు" అనుగ్రంథమును రచించెను. మల్ల యుద్ధములు మొదలగు క్రూరవినోదముల నీతడు తగ్గించెను. ఇతని కుమారుడగు “కిమోడసు" చక్రవర్తు లందరిలో నీచుడు.

సామ్రాజ్యక్షీణత  : మార్కస్ -అరేబియస్ తరువాత సామ్రాజ్యము క్షీణింపసాగినది. క్రీ.శ. 180-476 ల మధ్య 60 చక్రవర్తులకు పైగా సింహాసనమెక్కిరి. వారిలో పెక్కుమంది విదేశీయులు. వీరి కాలమున సామ్రాజ్యమున ప్రజలందరికి రోమను పౌరసత్వ మీయబడెను. కాన్ స్టన్ టైను చక్రవర్తి క్రీ. శ. (306-307) బైజాంటియములో తన పేరున కాన్ స్టాన్ టినోపుల్ నగరమును నిర్మించి రాజధానిగా చేసికొనెను. థియోడీషియను చక్రవర్తి కాలమున క్రిస్టియన్ మతము రాజాదరమునుపొంది, సామ్రాజ్యమున విశేషముగా ప్రచారమందెను. థియోడీషియస్ సామ్రాజ్యమును రెండుగా విభజించి కాన్ స్టాన్ టినోపుల్ రాజధానిగా తూర్పుభాగమును అర్కేడియనుకును, మిలన్ రాజధానిగా పశ్చిమభాగమును హానోరియసుకును ఇచ్చెను. ఇంతటితో రోము ప్రాధాన్యము నశించెను.

విదేశ దండయాత్రలు : క్రీ.శ. 2వ శతాబ్దము నుండియు వాండల్, అలన్, విసిగోథ్, ఆస్ట్రోగోథు జాతుల వారు రోమను సామ్రాజ్యముపై దండెత్తనారంభించిరి. తుదకు పశ్చిమమున వాండలులు, తూర్పున గోధులు నివాసము లేర్పరచుకొని, చక్రవర్తుల కొలువులందు చేరిరి. హానోరియస్ చక్రవర్తి, వాండలు నాయకుడగు "స్టిలికో "నును, అర్కేడియన్ చక్రవర్తి, గోథు నాయకుడగు "అలారిక్ " నును, సేనాపతులనుగా నియమించుకొనిరి. చక్రవర్తులను నామమాత్రులనుగా చేసి ఈ సేనాపతులు సామ్రాజ్యాధిపత్యమునకై తమలోతాము యుద్ధము లొనరింపసాగిరి. అలారిక్ 3 మారులు రోముపై దండెత్తెను. అతని బాధను భరింపలేక హానోరియస్ చక్రవర్తి 'రావెన్నా' ను రాజధానిగా చేసికొనెను. 3 వ దండయాత్రలో అలారిక్ రోమును ధ్వంసమొనరించి దక్షిణ ఇటలీని కొల్లగొట్టెను.

సామ్రాజ్య అస్తమయము  : గోథుల ప్రమాదము తగ్గినంతనే హూణ నాయకుడగు అట్టిలా సామ్రాజ్యము పై బడి గాలు పర్యంతము దండయాత్రలొనరించెను, బైజాం టైను చక్రవర్తి అట్టిలాకు కప్పము చెల్లించెను. ఇటలీ పై దండెత్తి అక్విలా, పాడువా నగరములను పరశురామ ప్రీతి చేసి రోమునగర ద్వారములకడ ప్రత్యక్ష మయ్యెనుగాని పోపులియో ప్రార్థనల నంగీకరించి అట్టిలా మరలిపోయెను. రోము రక్షింపబడెను.

అట్టిలా మరలిన తర్వాత వాండలులు క్రీ. శ. 455 లో రోమును కొల్లగొని, 30 వేల రోమనులను బానిసలనుగా కొనిపోయిరి. తుదకు క్రీ. శ. 476 లో ఒడోకర్ అను జర్మను సేనాని చక్రవర్తిని తొలగించి ఇటలీని పాలింప సాగెను. పశ్చిమ రోమను సామ్రాజ్యము అంతరించినది.

లొంబార్డులు  : క్రీ.శ. 493 లో బై జాంటైన్ చక్రవర్తి జినో ఆజ్ఞానుసారము థీయోడోరిక్ అను ఆస్ట్రోగోడు సేనాని ఇటలీని జయించి పాలించెను. తిరిగి జస్టీనియను చక్రవర్తి ఇటలీని క్రీ.శ. 535 లో జయింపవలసి వచ్చెను. కాని బైజాంటైన్ చక్రవర్తుల అధికారము ఇటలీలో ఎక్కువ కాలము నిలువలేదు. లొంబార్డులను జాతివారు ఆల్బాయిన్ నాయకత్వమున రావెన్నా మున్నగు ప్రాంతము లాక్రమించి రాజ్యమును స్థాపించిరి.

లొంబార్డుల బారినుండి రోమును రక్షించి మధ్య ఇటలీలో పోపుల రాజ్యమునకు పునాది వేసినవాడు పోపు గ్రెగరి. పోపును సెంట్ పీటరు ప్రతినిధిగా భగవంతుని ఇహలోక ప్రతినిధిగా క్రిస్టియనులు గౌరవించుటచే అతని అధికార ప్రాబల్యములు ఇనుమడించినవి. అందుచేత సామ్రాజ్యాధిపత్యమును కోల్పోయినను రోము నగరము ఐరోపాకు మత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని యైనది.

ఛార్లి మేను  : క్రీ. శ. 715 లో లొంబార్డులు రోము పై దండెత్తినపుడు పోపు, ఫ్రాంకుల రాజగు పెపిన్ సహాయ మర్థించెను. పెపిన్ లొంబార్డుల నోడించి రావెన్నా, పెంటపోలిస్ మున్నగు వాటిని పోపున కొనగెను. పెపిన్ కుమారుడును మహా విజేతయునగు ఛార్లె మేను పోపగు మూడవ లియో కోరిక పై చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై (క్రీ శ. 800) పవిత్ర రోమక సామ్రాజ్య స్థాపకుడై నాడు. రోము, రావెన్నా, పెంటపోలిస్ పై పోవునకు రాజకీయాధికారము సంక్రమించెను. లొంబార్డుల అధికార మస్తమించెను.

మధ్యయుగ చరిత్ర  : వెర్డూన్ సంధి (క్రీ.శ. 843) ప్రకారము ఛార్లె మేన్ పౌత్రులైన లాభై, రెండవలూయీ ఇటలీని పాలించిరి. వీరి సంతతివారు బలహీనులగుటచే ఇటలీలో అరాజకత ప్రబలి మాగియారుల దండయాత్రలు ప్రారంభమైనవి. సిసిలీ నాక్రమించి అరబ్బులు ఇటలీపై దండెత్త జూచుచుండిరి. వారి బారి పడకుండ రక్షించు టకై పోపు కోరిక ప్రకారము జర్మను రాజగు ఆటో ఇటలీ నాక్రమించి పవిత్ర రోమక చక్రవర్తిగా (క్రీ.శ. 962) అభిషిక్తుడయ్యెను. ఇటలీ పవిత్ర రోమక సామ్రాజ్యము నందు ప్రధాన భాగమైనది.

రాజకీయ ఆనై క్యము : జర్మనీ, ఆస్ట్రియా రాజకీయము లందు మునిగియుండిన చక్రవర్తుల అధికారము క్రమ ముగా సన్నగిల్లి ఇటలీలో స్వతంత్ర రాజ్యములు వెలసినవి. 11 వ శతాబ్దమున సిసిలీ, దక్షిణ ఇటలీలను నార్మను లాక్రమించిరి. మధ్య ఇటలీలో నగరరాజ్యము లభివృద్ధి జెందెను. తూర్పు - పశ్చిమ దేశములమధ్య వ్యాపారము నకు కేంద్రములై. ఈ నగరములు ఐశ్వర్యవంతము లయ్యెను. ముఖ్యముగా ఫ్లారెన్సు నగరమున వర్తకులైన మెడిసీ వంశమువారు పరిపాలకులై సాహిత్యమును, కళలను పోషించిరి. కొన్ని నగరములు కూటములుగా నేర్పడెను. రోము రాజధానిగా పాపలు రాజ్యము వర్ధిల్లెను. పోపు లాధ్యాత్మిక ధర్మములను మాని దురాశాపరులై విషయలోలురై రాజకీయము లందు పాల్గొని పెద్ద రాజ్యము నిర్మించి పాలింపదొడగిరి. క్రీ. శ. 15 వ శతాబ్దమున ఇటలీలో ఈ క్రింది రాజ్యము లుండెను. దక్షిణమున సిసిలీ, నేపుల్సు రాజ్యములు; మధ్య ఇటలీలో పాపలు రాజ్యము, సియానా, ఫ్లారెన్సు రిపబ్లిక్కులు, బోలోనా, ఫోర్లి, రిమిని, ఫాయెన్ జా నగరరాజ్యములు; ఉత్తరమున ఫెరారా, మొడెనా, మాంటువా, మిలన్, శెవాయి, వెనిస్, జినోవా రాజ్యములు. ఈ రాజ్యము లంతఃకలహములలో మునిగియుండెను.

మానసిక వికాసోద్యమము  : రాజకీయ అనైక్యము, రాజ్యముల మధ్య స్పర్థ ఇటలీలో సాంస్కృతికాభివృద్ధికి సహాయకారులైనవి. కాన్ స్టాన్ టినొపుల్ తో. ఇటలీ నిరంతరము వర్తకము చేయుచుండుటచేత ఇటలీకి ప్రాచీన సాహిత్య ప్రపంచములో సన్నిహిత సంబంధ ముండెను. ఇటాలియనులు గ్రీకు భాషా సాహిత్యములందభిమానము వహించి యుండిరి. క్రీ. శ. 1453 లో కాన్ స్టాన్ టినోపులును తురుష్కు లాక్రమించుటచే అచటి పండితు లనేకులు పశ్చిమ ఐరోపా దేశముల కేగి గ్రీకు భాషను బోధింపసాగిరి. విస్తృత గ్రీకు సాహిత్యమునందొక్కమారుగా విశేషాభిమానము జనించినది. దీనిని సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ మనిరి. ప్రాచీన శిల్ప, వాస్తు, సాహిత్య సంప్రదాయములందు గౌరవము ప్రబలి నూతన కళాసృష్టికి ఇటాలియనులు పూనుకొనిరి. ఇటాలియను నగరములు శిల్పశాస్త్రమునకు, కవిత్వమునకు క్రీడా రంగములైనవి. పెంట్రార్కు డాంటె, బొకాషి యోలవంటి రచయితలు, లీనార్డోడవిన్సీ, రాఫీలు మైకేల్ ఆంజెలో, టిటియనువంటి సుప్రసిద్ధ శిల్ప చిత్రలేఖన కళా నిష్ణాతులు వెలసిరి. ఈ యుద్యమముతోపాటు జాతీయభావముగూడ ఇటలీలో జనించెను. మెరియవెలీ అను నాతడు “ప్రిన్స్” అను గ్రంథమును రచించి ఇటలీకి జాతీయైక్యత అవసరమని చాటెను గాని ప్రయోజనము లేకపోయెను.

ఇటలీ యుద్ధములు  : ఇది యిట్లుండ నేపుల్సు, మిలన్ రాజ్యముల మధ్య పోరాటము తీవ్రరూపమును దాల్చేను. తనకు సహాయముగా ఫ్రెంచి రాజగు 8వ ఛార్లెసును మిలన్ ఆహ్వానించెను. క్రీ.శ. 1494 లో ఛార్లెసు ఇటలీని సులభముగ నాక్రమించెను. కాని సేపుల్సు సిసిలీలపై సార్వభౌముడును, స్పెయినురాజును అగు ఫెర్డినాండు ఇటలీలోనికి ఫ్రెంచివారి రాకను సహింపలేదు. స్పెయిను, ఫ్రాన్సులకు ఇటలీ యుద్ధరంగమైనది. రాజకీయ అనైక్య ఫలమును ఇటాలియనులు పూర్తిగ ననుభవించిరి. తుదకు క్రీ.శ. 1559 లో జరిగిన కాట్యూ కాంబ్రేసిస్ సంధివలన స్పెయిను చక్రవర్తికి ఇటలీపై ఆధిపత్య మొసగబడెను, ఈలోగా జర్మనీలో మార్టిన్ లూథర్ పోపును ధిక్కరించి ప్రొటెస్టెంటు మతమును స్థాపించెను. ఇంగ్లండు, హాలెండు, స్వీడను మున్నగు దేశములు రోముతో సంబంధమును వదలుకొని స్వతంత్ర మతసంస్థలను ( చర్చి) స్థాపించుకొనెను. పోపు ప్రభావమువలన ఇటలీ, కాథలిక్ మతమునకు పట్టుగొమ్మగనే యుండెను.

స్పెయిను చక్రవర్తియగు 2వ చార్లెను మరణానంతరము స్పెయిను వారసత్వపు యుద్ధము జరిగినది (క్రీ. శ. 1701-13). ఈ యుద్ధము యుట్రెక్టు సంధితో ముగిసి, (క్రీ.శ. 1713) ఇటలీలో స్పెయినుకుగల నేవుల్సు సార్డీనియా, సిసిలీ మున్నగు రాష్ట్రములెల్ల ఆస్ట్రియాకీయబడెను.

ఫ్రెంచి విప్లవము  : 1789 లో ఫ్రాన్సు దేశమున గొప్ప విప్లవము జరిగెను. నిరంకుశ రాచరికమును కూలద్రోసి ప్రజాప్రభుత్వమును స్థాపించుటయే ఫ్రెంచి విప్లవము యొక్క ఆశయము. కాని ఆస్ట్రియా, ప్రష్యాలు కలిసి ఫ్రాన్సులో రాచరికము నుద్ధరింపసమకట్టెను. అందుచే ఫ్రెంచి విప్లవ ప్రభుత్వమునకును ఐరోపాలోని నిరంకుశ రాజరికములకును యుద్ధములు జరిగినవి. ఫ్రెంచి విప్లవ సైన్యమునకు నాయకుడైన నెపోలియను ఆస్ట్రియా నోడించి ఉత్తర ఇటలీ నాక్రమించెను. (క్రీ.శ. 1797) రోము, నేపుల్సు గూడ క్రీ.శ.1798 లో ఫ్రెంచివారి వశమయ్యేను. ఇటలీలో సిస్ ఆల్పైన్, లిగూరియన్, రోమన్, పార్థినోపియను రిపబ్లిక్కులు స్థాపింపబడెను. క్రీ. శ. 1804 లో నెపోలియను ఫ్రెంచి చక్రవర్తియై “ఇటలీ రాజు" అను బిరుదము ధరించి, ఉత్తర ఇటలీలో యూజీను బ్యూహర్నే అను నాతనిని, నేపుల్సులో తన తమ్ముడైన జోసఫ్ అను వానిని రాజప్రతినిధులనుగా నియమించెను. రోమను సామ్రాజ్య పతనానంతరము ఇటలీ నెపోలియను పాలనలో మొదటిమారు సమైక్యమైనది.

లీప్జిగ్ యుద్ధమున (క్రీ. శ. 1814) నెపోలియను ఓటమితో అతని సామ్రాజ్యము నిచ్ఛిన్నమైనది. వియన్నా శాంతిసభలో సమావేశమైన నిరంకుశ ప్రభువులు ఫ్రెంచి విప్లవమునకు పూర్వమున్న పరిస్థితులను ఐరోపాలో పునరుద్ధరించిరి. తిరిగి ఇటలీ రాజకీయ ఐక్యమును కోల్పోయేసు, పూర్వపు నిరంకుశ ప్రభుత్వములు స్థాపింపబడినవి. లొంబార్జీ, వెనీషియా మున్నగు ప్రాంతములు ఆస్ట్రియా కీయబడెను. ఆస్ట్రియా సార్వభౌమత్వమును ఇటలీ అంగీకరింపవలసివచ్చెను.

ఏకీకరణోద్యమము : నెపోలియను పాలనలో ఐక్యతను చవిచూచిన ఇటాలియనులకు వియన్నా యేర్పాటు ఆశా భంగమును కలిగించెను. జాతీయైక్యమును సాధించుటకై "కార్బోనరి" అను రహస్య సంఘములను స్థాపించి ఇటాలి యనులు ఉద్యమము ప్రారంభించిరి. సార్డీనియా రాజు మాత్రము ప్రజల ఆశయములందు సానుభూతి వహించి యుండెను. అందుచే ఇటాలియనులకు సార్థీనియా నాయకత్వము సమ్మతమైనది. క్రీ. శ. 1830-48 ల మధ్య

లొంబార్డీ, వెనీషియా, రోము, నేపుల్సుల యందు తిరుగుబాటులు జరిగెను. కాని ఆస్ట్రియా దాని నణచివేసెను. ఆ తిరుగుబాటు దారులకు సాయముచేసిన సార్డీనియాకూడ

ఇటలీ (చరిత్ర)

సంగ్రహ ఆంధ్ర

పరాభవమునొందెను. ఈ పరిస్థితులలో మాజినీ యువ ఇటలిసంఘమును స్థాపించి తన రచనల ద్వారమునను, ఉపన్యాసముల ద్వారమునను ప్రజలలో జాతీయ చైతన్యమును ప్రజ్వలింపజేసెను. ఇటలీ ఐక్యమునకు తాత్త్వికపు పునాదులు వేసినవాడు మాజినీ.

సార్డీనియా రాజగు విక్టర్ ఎమాన్యూలు, ప్రధాన మంత్రి కవూరు ఇటలీని ఐక్యము చేసి, ఆస్ట్రియా నుండి విముక్తి సాధింప సంకల్పించిరి. రాజనీతియందు చాణక్యుని బోలినవాడు కవూరు. ఆస్ట్రియా నోడించుటకు విదేశ సహాయ మవసరమని గ్రహించి కవూరు క్రిమియా యుద్ధమున (క్రీ.శ. 1854) ఫ్రాన్సు, ఇంగ్లండుల పక్షమువహించి పారిస్ "సమావేశములో ఆ దేశముల సానుభూతిని సంపాదించేను. ఫ్రెంచిచక్రవర్తియగు మూడవ నెపోలియను ఇటలీకి సైనిక సహాయము చేయుటకుగూడ సమ్మతించేను. కవూరు చర్యల ననుమానించిన ఆస్ట్రియా, సార్జీనియా పై యుద్ధము ప్రకటించెను. (క్రీ.శ. 1859) ఫ్రాన్సు సహాయముతో కవూరు ఆస్ట్రియా నోడించెను. కాని యుద్ధము పూర్తి కాక పూర్వమే నెపోలియను, ఆస్ట్రియా, సార్డీనియాల మధ్య విల్లా ఫ్రాంకోసంధి నేర్పాటుచేసెను (క్రీ. శ. 1859). ఆ సంధి ప్రకారము సార్డీనియాకు లొంబార్డీ ఒసగబడెను. ఈ యుద్ధానంతరము మధ్య ఇటలీలోని టస్కనీ, మొడేనా, పార్మా, రోమగ్న రాజ్యముల ప్రజలు తమ ప్రభువులను పారద్రోలి, సార్థీనియాతో (క్రీ.శ. 1860) చేరిరి. . క్రీ. శ. 1881 లో సిసిలీలో విప్లవము చెలరేగెను. “గారిబాల్డి” యను మహాయోధుడు తన వేయిమంది ఎఱ్ఱ చొక్కాల దళముతో సిసిలీ, నేపుల్సుల నాక్రమించి విక్టర్ ఎమాన్యూలునకు సమర్పించెను. స్వార్థరహితమగు దేశభక్తి కిది చక్కని నిదర్శనము. రోము, వెనీషియీలు తప్ప తక్కిన ఇటలీ యంతయు ఐక్యమైనది. క్రీ. శ. 1861 లో విక్టర్ ఎమాన్యూలు "ఇటలీ రాజు" అను బిరుదమును ధరించెను.

ఆస్ట్రియా ప్రష్యాలకు క్రీ.శ. 1866 లో యుద్ధము సంభవించెను. అందు ప్రష్యా పక్షమువహించి ఇటలీ ఆస్ట్రియానుండి వెనీషియాను బడసెను. క్రీ. శ. 1870 లో ఫ్రాన్సు ప్రష్యాల మధ్య ఒక యుద్ధము జరిగేను. ఫ్రెంచి చక్రవర్తి 3వ నెపోలియను రోమునందు పోపు రక్షణమునకై యుంచిన సేనను ఉపసంహరించెను. సమయము కనిపెట్టి, ఎమాన్యూలు రోము నాక్రమించెను. ఇంతటితో ఇటలీ ఐక్యము పూర్తియైనది. రోము ఇటలీకి రాజధానియైనది.

ఇటలీ క్రీ. శ. 1870_1914: రాజకీయైక్యము సాధించిన తరువాత ఇటలీ ఆర్థికమున అభివృద్ధిచెందెను. అనేక పరిశ్రమలు నెలకొల్పబడెను. విద్యాసంస్కరణలు జరిగెను. క్రీ. శ. 1900 నాటికి ఆధునిక పారిశ్రామిక రాజ్యములలో నొకటిగా ఇటలీ పరిగణింపబడినది. పరిశ్రమలతో బాటు జనాభా పెరుగుటచేత వలస లేర్పరచుటకై ఇటలీ సంకల్పించెను, ఉత్తరాఫ్రికాలోని ట్యునీషియా నాక్రమింప సంకల్పించి, ఇటలీ ఫ్రాన్సుచే పరాభవింపబడెను. ట్యునీషియాను ఫ్రాన్సు అక్రమించుటచే ఇటలీ, పగ సాధించు నుద్దేశముతో జర్మనీ ఆస్ట్రియాలతో చేరి, త్త్రెరాజ్య కూటమిని (Triple alliance) ఏర్పరచెను. తరువాత ఇరిట్రియా, సోమాలిలాండులను ఇటలీ ఆక్రమించెను. అబిసీనియాను జయించుటకు ప్రయత్నించి (క్రీ.శ. 1896) పరాజయమందెను. ఈలోగా ఇటలీలో ఆస్ట్రియాపై ద్వేషము ప్రబలసాగెను. ఇంకను ఆస్ట్రియా పాలనలో ఇటాలియను ప్రాంతమైన ట్రింటినో ఉండిపోయెను. దాని నాక్రమింపవలెనని జాతీయవాదులు పట్టుబట్టిరి. క్రీ.శ. 1902 లో ఇటలీని ట్రిపోలిని ఆక్రమించుటకు ఫ్రాన్సు సమ్మతించుటచేత ఇటలీ ఫ్రాన్సు దేశములు సన్నిహితములు కాజొచ్చెను. క్రీ. శ. 1911 లో టర్కీ నోడించి, ట్రిపోలిని ఆక్రమించి ఇటలీ దానికి లిబియా అని పేరిడెను.

మొదటి ప్రపంచ యుద్ధము : ఈ యుద్ధమున ఇటలీ కొంతకాలము తాటస్థ్యము వహించి యుండెను. క్రీ.శ. 1915 లో లండను సంధి యనంతరము ఇటలీ, మిత్రమండలి పక్షమున పోరాడెను. మొదట ఓడిపోయినను, చివరకు ఇటాలియనులు ఆస్ట్రియాను నిట్టోరియోవెనిటో యుద్ధమున పూర్తిగా నోడించిరి.

'ట్రిస్పి, ఫ్యూమ్, డాల్మేషియాల నాశించిన ఇటలీకి శాంతిసమావేశమున ఆశాభంగము కలిగెను. డాల్మేషియాలో చాల భాగము యుగోస్లావియాకు ఈయబడెను.

విజ్ఞానకోశము -౨

ఇటలీ (చరిత్ర)

ఫ్యూమ్ ను గూడ యుగోస్లావియా కోరెను. డానుంజో యను ఇటలీ వీరుడు ఫ్యూం ను ఆక్రమించెను. కానీ ఫ్యూమ్ లో యుగోస్లావియాకు కొన్ని హక్కు లీయబడెను.

ముసోలినీ ఫాసిస్టులు  : యుద్ధములో చేరుట వలన ఇటలీకి లాభము కంటె నష్ట మెక్కువ అయ్యెను. దేశమున ఆర్థికమాంద్య మేర్పడి పరిశ్రమలు మూలబడెను; నిరుద్యోగుల సంఖ్య హెచ్చిపోయెను; కార్మికులు సమ్మెలు ప్రారంభించిరి. ప్రభుత్వ మీ పరిస్థితులను చక్కబరచి శాంతి నెలకొల్పలేకపోయెను. కమ్యూనిష్టులు విప్లవ చర్యలకు ఉపక్రమించిరి. కమ్యూనిష్టులకు వ్యతిరేకముగ జాతీయభావములపై ముసోలినీ, ఫాసిస్టు పక్షమును స్థాపించెను. క్రమశిక్షణము, నాయకునియందు అచంచల విశ్వాసము, విధేయత, జాతీయ భావము, సామ్రాజ్యవాదము, ఫాసిస్టు పార్టీ యొక్క ముఖ్య లక్షణములు. నల్లచొక్కాల సైన్యమును తయారుచేసి, క్రీ.శ. 1922 లో ముసోలినీ, రోముపై దండెత్తెను. మూడవ యెమాన్యూలు ముసోలినీని ప్రధానమంత్రిగా నియమించెను. క్రమముగా సంపూర్ణాధికారము వహించి వ్యతిరేకులను తుదముట్టించి ముసోలినీ ఇటలీకి నియంతయైనాడు. అతని పార్టీవారు ముసోలినీని “ఇండ్యూస్" (Induce) అనిపిలిచెడివారు.

నియంతయైన కొలది దినములకే ముసోలినీ ఆర్థిక పరిస్థితులను చక్కపరచెను. వ్యవసాయము, పరిశ్రమలు, వర్తకము కోలుకొనెను. యుద్ధ పరిశ్రమల ద్వారమున నిరుద్యోగ సమస్య పరిష్కారమైనది. కార్మిక యజమానుల సంఘములను స్థాపించి, వాని ద్వారమున పారిశ్రామిక రంగమున ముసోలిని శాంతిని నెలకొల్పేను; యువకులకు దేశభక్తి పూరితమగు విద్యను, సైనిక శిక్షణమును ఒసగెను. క్రీ. శ. 1870 నుండి పోపుతో గల తగాదాను శాంతియుతముగ పరిష్కరించి “వాటికను" నగరమున పోపు సర్వాధికారములతో వ్యవహరించుటకు సమ్మతించెను.

దేశ పునర్నిర్మాణమైన తరువాత ముసోలినీ ప్రజలలో సామ్రాజ్య కాంక్షను కలిగించెను. ప్రాచీన రోమను సామ్రాజ్యమును పునరుద్ధరించుటయే ఫాసిస్టుల ఆశయము. నానాజాతి సమితిని ధిక్కరించి, క్రీ. శ. 1935 లో ముస్సోలినీ అబిసీనియా నాక్రమించెను. క్రీ.శ. 1936 లో జర్మనీ, జపానులతో చేరి అతడు అక్షరాజ్య కూటమిని ఏర్పరచెను. క్రీ.శ. 1939 లో అల్బేనియాను ఆక్రమించెను.

రెండవ ప్రపంచయుద్ధము ఈ 1940 లో జర్మనీ పక్షమున రెండవ ప్రపంచ యుద్ధమున ప్రవేశించి, ఈజిప్టు, గ్రీసులపై ముసోలిని దండెత్తి మొదట విజయములు సాధించెను. కాని 1943 నాటికి అన్ని రంగములందును ఇటలీ పరాజయ మందెను. దేశమున ముపోలినీపై తిరుగుబాట్లు ప్రారంభమయ్యేను. రాజు ముసోలినీని తొలగించి బోడోగ్లియోను ప్రధానమంత్రిగా నియమించెను. బొడోగ్లియో ప్రభుత్వము మిత్రమండలితో చేరి జర్మనీపై యుద్ధమును ప్రకటించెను. ఈలోగా జర్మను సైన్యములు ఉత్తర ఇటలీలో ప్రవేశించినవి. ముసోలినీ వాటితో చేరి ఉత్తరమున నొక రిపబ్లిక్ స్థాపించెను. మిత్రమండలి సైన్యములు క్రమక్రమముగా ఉత్తర ఇటలీని ఆక్రమించెను. ముసోలినీని బంధించి మిలన్ సమీపమున (9-4-1945) ప్రజలు కాల్చిచంపిరి. మేనెలలో కాసెర్టా వద్ద జర్మనులు మిత్రమండలికి లొంగిపోయిరి.

యుద్ధానంతర - ఆంతరంగిక వ్యవహారములు  : ఎమాన్యూలు, బొడోగ్లియో ఇరువురు ప్రజాదరమును పొందలేక పోయిరి. ఎమాన్యూలు సింహాసనమును త్యజించి కుమారుడైన రెండవ హంబర్టును పట్టాభిషిక్తుని జేసెను. బొడోగ్లియో రాజీనామా ఇచ్చెను. కాని రాజరికము నందు ప్రజలకు విశ్వాసము నశించినది. మంత్రివర్గములు కూడ ఒక దానివెంట నొకటి పడిపోవ సాగినవి. క్రీ. శ. 1946 లో రాజరికమును గురించి ప్రజాభిప్రాయము సేకరింపబడెను. రాజును తొలగించి రిపబ్లిక్ స్థాపించుటకు ప్రజలు సుముఖులై యుండిరి. రాజ్యాంగము తయారు చేయబడినది. ఈ రాజ్యాంగము ప్రకారము ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్, సెనేట్, అను సభలుగల పార్లమెంటు సభ ఏర్పాటైనది. అధ్యక్షుడు 7 సంవత్సరముల కొకమారు ఎన్నిక అగును. క్రీ.శ. 1948 లో లూయిగి యీనంది అనునతడు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను. క్రీ.శ.1945 నుండి 1953 వరకును క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీ నాయకుడైన ఆలిస్ డగాస్పెరీ ప్రధానిగ నుండెను.మార్షల్ పథకము ద్వారమున అమెరికానుండి ఆర్థిక సహాయమును బడసి ఇటలీ అభివృద్ధికి అతడెంతయు కృషి చేసెను. క్రీ. శ. 1953 లో "పెల్లా ప్రధానమంత్రియైనాడు. క్రీ. శ. 1955 జనవరి నుండి స్కెల్బాయను క్రిస్టియన్ డెమోక్రాట్, మిశ్రను మంత్రివర్గమునకు నాయకత్వము వహించినాడు.

విదేశవ్యవహారములు : క్రీ.శ. 1947 లో ఇటలీశాంతిసంధి చేసికొనెను. ఈ సంధిప్రకారము ఆఫ్రికాలోని వలసలను వీడుటయేకాక, ఇస్ట్రియాను యుగోస్లావియాకును, డొడకనీసును గ్రీసుకును, ఇటలీ ఇచ్చివేసెను. ట్రిస్టినిగూర్చి యుగోస్లేవియా ఇటలీలమధ్య తగాదా వచ్చినది. 1954 అక్టోబరు 4న లండనులో జరిగిన ఒండంబడిక ప్రకారము ట్రిస్ట్ రెండుగా విభజింపబడి, ఒక ప్రాంతముపై యుగోస్లావియాకును, రెండవ ప్రాంతముపై ఇటలీకిని అధికార మీయబడెను. క్రీ. శ. 1949లో ఉత్తర అట్లాంటిక్ కూటమి లోను, ఐరోపా కౌన్సిలులోను ఇటలీ చేరినది. క్రీ. శ. 1956 లో ఇటలీకి ఐక్యరాజ్యసమితి సభ్యత్వ మీయబడెను.

వి. యస్. యల్. హెచ్.