Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇటలీ భాషావాజ్మయములు

వికీసోర్స్ నుండి


ఇటలీ భాషావాఙ్మయములు  : ఇటలీ భాషయొక్క పుట్టుక : రోమను సామ్రాజ్యము పతనమయి ముక్కలు ముక్కలుగా చెదరిపోయినతరువాత స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను భాషలు ప్రచారము లోనికి వచ్చేను, రోమనుసామ్రాజ్య ప్రాభవదినములలోను తరువాత క్రైస్తవ మతబోధకుల దినములలోను రోము నగరమునందు లాటిను భాష రాజకీయముగాను, మత విషయికముగాను ప్రధాన భాష యయి యుండెను. గోథులు, గాలులు దండయాత్రలు చేసి దేశమును, జయించి నప్పుడు ఇటాలియనులు తమ లాటిను భాషతో పాటు నూతన పరిపాలకుల భాషలను కూడ నేర్చుకొనవలసి వచ్చెను.

ఇట్లు ఫ్రెంచి మాండలిక భాష యొక్కయు, లాటినుభాష యొక్కయు కలయికచే నేర్పడిన భాషయే ఇటాలియనుభాష యైనది. మొట్టమొదట ఇటలీయందలి ఉత్తర రాష్ట్రములలో ముట్టడిజాతులతో సంబంధ మేర్పడుటచే సహజముగా టస్కనీయందును, ఉత్తర భాగము లందలి ఇతర పట్టణములయందును తొలిసారిగా ఇటాలియను భాషను మాట్లాడుటయు, అర్థము చేసికొనుటయు సంభవించెను. ఇటాలియను భాష తొలుత పామరజనులలో వ్యాప్తిగాంచెను. అందుచే ఇది పామర భాషగా ఎన్నబడు చుండెను. పిదప విద్వాంసుల యొక్కయు, ప్రధానముగా రోమను కాథలిక్ చర్చికి చెందిన ఉన్నత మతాధికారులు యొక్కయు ఆదరమును పొందినది ఈ భాష.ఇది మొదట మాండలికులకును, కవులకును, అనాగరికముగా కనిపించెను. ఫ్రాన్సు యొక్క దక్షిణ, నైరృతి భాగములకు చెందిన సాహసికులు తమ ప్రేమపాత్రలైన అవివాహిత స్త్రీలకు అర్థమగునట్లు తాము నేర్చిన లాటిను భాషా పదములను తమభాషతో మేళవించి ఆశురచనాగీతములను వ్రాయదొడగిరి. పిదప ఫ్రాన్సిషియన్లు, డామినికన్లు; బెనిడిక్లివులు మున్నగు వివిధవర్గములకు చెందిన గురువులు తమ ప్రార్థనాగీతములను, ధర్మప్రవచనములను రచించు నిమి త్తమై ఈ క్రొత్తగా పుట్టిన భాషను వాడుచు తమ గీతాదులను నిర్దుష్టములను చేయ నిరంతరముగా. కృషి చేసిరి.

ప్రొక్సునరుజ్జీవన యుగము (The Pre-Renaissance Period) : రెండవ ఫిలిప్పు రాజు 1220 లో సిసిలీ రాజ్యమున పట్టాభిషిక్తుడగుటతో, ఇటాలియను కవిత్వము నాటుకొని నార్మనుజాతికి చెందిన వాడును, ఫ్రెంచి మాతృభాషగా గలవాడును అగు ఈ రాజు యొక్క పోషణములో అభివృద్ధి గాంచెను. తన గొప్ప ఆస్థానములో పెక్కుమంది ఇటాలియను కవులకు ఇతడు ఆశ్రయ మొసగెను. అన్ని భాషల యందును మొదట పద్యకవితయు, పిదప వచనకవితయు ఉత్పత్తియగుట, పద్యకవిత వచనకవితకంటే విశేషతరమయిన ప్రాముఖ్యమును కలిగియుండుట కననగును, ఇటాలియను భాషావిషయమున గూడ ఇట్లే జరిగియుండెను. భాషలు తొలుత మతముచేతను, మతారాధకుల చేతను, ఆశీర్వదింపబడి, పోషింపబడుచు వచ్చెను. ఇటాలియను భాష, ఎస్సిసీకి చెందిన సెయింటు ఫ్రాన్సిస్ వంటి పుణ్య పురుషునిచే ఆశీర్వదింపబడెను (1226). ప్రప్రథమమున ఇటాలియను భాషలో వ్రాయబడి పదిలము చేయబడిన గ్రంథములలో ఇతడు వ్రాసిన 'లాండెస్ క్రిటరమ్' లేక 'సూర్యసోదరుని ప్రార్థనాగీతము' అను గ్రంథ మొకటి. నీతికథలు, మతబోధనములు, గద్యపద్యరూపములయిన మహోపన్యాసములు మున్నగు వానిని ఇటాలియను భాష యందు ప్రప్రథమమున రచించినవారు మాంటె కాసినో మతబోధకులే. మిలాను, సిసిలీ, సయన్నా, వెనిస్ మున్నగు పట్టణములవలె సుందరమయిన ఫ్లారెన్సు నగరము, ఎల్లప్పుడును ఇటాలియను భాషావాఙ్మయములను, కళలను పెంపొందించుటలో అత్యంత ప్రముఖ పాత్రను వహించి యున్నది. బ్రునెట్టో లాటినో (1262) అను నాతడు ఫ్లారెన్సు నివాసి. రాజనీతిజ్ఞుడు. ఇటాలియను భాషలో ప్రప్రథమమున నీతిబోధకమును, రూప కాత్మకమును అగు కావ్యమును వ్రాసిన గౌరవము ఇతనికి దక్కినది. ఈ కావ్యము పేరు "ఇటెస రెట్టో ” ఇది డాంటీ ఎలిజియెట్రిసు అను నాతడు రచించిన “డివై నా కామెడియా” అను కావ్యమునకు అసన్నపురోగామిగా భావింపబడుచున్నది. ఎందుచేతననగా ఈ రెండు కావ్యములు రచనకును కవుల ఆధ్యాత్మిక సంక్షోభమే కారణమైయుండెను, లాటినో, డాంటీ - అను నిరువురును తమ జన్మస్థానమగు ఫ్లారెన్సు నగరమునుండి ప్రవాస శిక్ష ననుభవించియుండిరి. ఇట్లు ఈ క్రొత్త భాషలో పద్యము, వచనము ఎడతెగక మెల్లగా అభివృద్ధిపొందుచు వచ్చెను. కాలక్రమమున పెక్కురు విద్వాంసులు ఇటాలియను భాషను తమ భావప్రకటనమునకు సాధనముగా గ్రహించుచువచ్చిరి. అందుచేత ఈ భాష క్రమక్రమముగా అభివృద్ధియయ్యెను. "ట్రెసెంట్" లేక 14 వ శతాబ్ది మధ్యకాలము వచ్చునప్పటికి ఇటాలియను కవిత్వ కళా వికాసము ప్రధానముగా భావకవితారంగములో గొప్ప ప్రమాణమును అందుకొనేను. వచన రచనయందు మాత్రము మిక్కిలి మందముగా అభివృద్ధి ఘటిల్లెను.

1265 లో ఇటలీ యొక్క వాఙ్మయాకాశముస అత్యంతోజ్జ్వలమైన నక్షత్రమోయన డాంటి ఎలిమియరి అను నాతడు ఉదయించెను. ఇతడు ప్రపంచ వాఙ్మయము నందలి మహాకవులలో ఎన్నదగినవాడు. డాంటీ ఇటాలియనులకు ముఖ్యప్రతినిధిగా భాసిల్లెను. జాతీయ వాజ్మయ చరిత్రలను బట్టిచూడగా, ఏ దేశమునకును ఇట్టి ఘనుడు ప్రతినిధిగా లభించియుండ లేదనుట సత్యము. డాంటీ వ్రాసిన “డివైన్ కామెడీ" సాటిలేని కావ్యము. ఇతడు మానవుని “నవోదయము" అనదగు పునరుజ్జీవనమును ముందుగా ఊహించి ఆ నూతన కాలముకొరకు అచంచలమైన అభినివేశముతో ఎదురుచూచుచుండెను. ఇదియే ఇతని మహ త్త్వమునకు కారణము. “వై టానవ" అను ఇతని రచన నూతనతేజమునకును, భావనలోని క్రొత్త రీతికిని గద్యరచనయందలి నవ్యశై లికిని పురస్సూచకము. ఇది స్వచ్ఛము, పావనము, అత్యంత హృదయాకర్షకము. ఇది యూరపు ఖండమునందలి భాషలలో నెల్ల నిర్దుష్టముగా వ్రాయబడిన వీరరసాత్మక గేయము.

ఇటలీయందలి ప్రొక్పునరుజ్జీవన యుగము యొక్క మరియొక లక్షణము "పేగాన్ యుగము" నకు చెందిన (గ్రీకు రోమను కవులచే వ్రాయబడిన) వాఙ్మయమునందలి అత్యంతమైన వై చిత్య్రమై యున్నది. అన్ని వృత్తులకు చెందిన వారు, ప్రధానముగా తత్త్వవేత్తలు గ్రంథపఠనమునందు ఆసక్తులయిరి. ఈ గ్రంథ పఠనాసక్తి "పునరుజ్జీవనము", లేక “రినేని మెంటొ" అని ఇటాలియను భాషలో వ్యవహరింపబడిన యుగము వచ్చువరకును కొనసాగెను.

ఫ్రాన్సెస్కో పెట్రార్కా (1304-1374) అను కవి ప్రథమ నవ్యయుగరచయితగా, ప్రాచీన వాఙ్మయ పునరుజ్జీవన ఉద్ధారకుడుగా ప్రసిద్ధినంచెను. గ్రీకు, రోమను భాషలయందును, సర్వసారస్వత ప్రక్రియలందును, ఇతడు కావించిన బహుగ్రంథ నిర్మాణము అసదృశము. ఇతని ఇటాలియను గేయ గుచ్ఛము ఈతని కీర్తికి జయ పతాక గా వరలెను. "రైమ్ లేక కాంజోనీర్" అను గేయ కావ్యములకు ఇతడు “రేరమ్ వల్గేరియమ్ ఫ్రాగ్ మెంటా" అని పేరిడెను.

డాంటీ పెట్రార్కాలకు పిమ్మట “బొకేషియో (1313-1335) అనునాతడు “టస్కన్ మానపత్రయము" నందలి మూడవ మహావ్యక్తి. ఇతడు డాంటీని విశేషముగా ప్రశంసించి యున్నట్లు ఈతని జీవిత చరితమువలన విశద మగుచున్నది. ఇతడు పెట్రార్కా యొక్క సన్నిహిత మిత్రుడు. ఇతడు లాటిను భాషయందుకంటె ఇటాలియను భాషలోనే అధిక సంఖ్యగల కావ్యములను రచించి యున్నాడు. తన ఇటాలియను రచనల మూలమున మహాకవుల కొరకు ఉద్దిష్టమయిన “విశ్వదేవాలయము"న ఇతనికి ఒక విశిష్టస్థానము లభించియున్నది. "నవలా" రచనకు ఇతడు జనకుడుగా ప్రసిద్ధినందెను. “డేకా మెరన్” అను నీతని రచన బహుళముగా "పునరుజ్జీవనము" యొక్క ఆరంభమునకు అత్యంత సన్నిహితమైన కారణమై యున్నది. డాంటీ వ్రాసిన "డివైను కామెడీ" తో పోల్చి దీనిని "హ్యూమను కామెడీ" యని సముచితముగా పేర్కొనియున్నారు. ఈ రచయిత యొక్క ప్రతిభను ఇంతకంటే గొప్పగా ప్రశంసించుట యెవరికిని తరముకాదు. ఇతని మిత్రుడును సమకాలికుడును అగు పెట్రార్కా ఒనర్చిన అనువాదములవలె బొకేషియో కావించిన గ్రీకు, రోమను గ్రంథముల అనువాదములు ఇటాలియను భాషా వాఙ్మయములో అత్యున్నత మైన సారస్వత ప్రాముఖ్య మును పొందియున్నవి.

“పునరుజ్జీవనము" ( Renaissance ) :- "పునరుజ్జీవనము" అని వ్యవహరింపబడు కాలమును గూర్చి సంగ్రహముగా చెప్పవలెనన్నచో, దీనిని "దీప్తి విజయము” అని చెప్పవచ్చును. మధ్యయుగముల అంధకారము పై హేతువు అను వెలుతురు విజయమును సాధించిన కాలమును ఇది సూచించును. స్వపక్ష దురభిమానము, వెట్టి భక్తి, మూఢవిశ్వాసము అను అజ్ఞానలక్షణముల యొక్క గట్టిపట్టునుండి హేతువు తుదకు విముక్తి పొందిన యుగమిది. ఇటాలియను వాఙ్మయములో ఈ కాలము “క్వాట్రో సెంటో" లేక 15 వ శతాబ్ది అని వ్యవహరింపబడుచున్నది. టర్కీ వారిచే కాన్ స్టాంటి నోపుల్ జయింపబడుట, అమూల్యములైన గ్రీకు పుస్తకములను, వ్రాతప్రతులను తీసికొని కాందిశీకులు అధిక సంఖ్యాకులుగా తూర్పు సామ్రాజ్యమునుండి ఇటలీ లోప్రవేశించుట, ఈ కాందిశీకులలో కొందరు ప్రముఖులు ఇటాలియను విశ్వవిద్యాలయములలో ఆచార్యులుగా నియమింపబడుట అనునవి గ్రీకు, రొమను సంస్కృతి యొక్క పునరుజ్జీవన భావనయందు నూతనాభిరుచిని కల్పించెను. లారెంజోడి మెడిసీ యొక్క ప్రత్యక్షపోషణ క్రింద ఫ్లోరెన్సులో 1450 లో ప్లేటోనిక్ పరిషత్తు ఒకటి స్థాపింపబడెను. ఇదియొక ప్రసిద్ధమైన కార్యసాధనము. నూతనమైన ప్లేటోత త్వమునకును, క్రైస్తవమతమునకును మధ్య సామరస్యమును కల్పించుటకై ఫిసినో అనునాతడు (1483-99) ప్లేటో యొక్కయు, ఫ్లాటినస్ యొక్కయు, సంపూర్ణ గ్రంథములను అనువదించెను. కాని, ఈ పునరుజ్జీవనోద్యమములో ప్రసిద్ధుడైనవాడు పీకో-డిలా- మిరాండోల అనువాడు. ఆతడు ఈ పునరుజ్జీవనోద్యమమునందు అత్యాశ్చర్యమును కొలుపు సాహసికుడుగా వర్ణింపబడినాడు. ప్లేటో తత్త్వము గూఢమైన ప్రేమతత్త్వము కారణముగా సౌందర్యాన్వేషణమును గొప్పగా ప్రకాశింపచేసెను. 15వ శతాబ్ది యందలి మహోన్నత భావములకెల్ల వన్నె దిద్ది, స్పెన్సరు మూలమున ఇంగ్లీషు కవితలో ప్రవేశించి, షెల్లీని తన కడపటి వారసునిగా చేసికొన్న దీ ప్లేటో తత్త్వము. ప్లేటో నూతన తత్త్వముతోపాటు మెడిసీ వంశజుడైన లారెంజొ యొక్క పరిపోషణము క్రింద 'చౌసన్స్ గెస్టె' (ఫ్రెంచి కవితా భేదము) యొక్క అనుకరణము మున్నగు ఇతర కవితాప్రక్రియలలో ఇటాలియను కవిత విస్తరింప దొడగెను. ఈ మెడిసీ వంశజులలో పెక్కుమంది రాజనీతివేత్తలుగా, కవులుగా, రోమను కాథలిక్ మతస్థులకు ప్రధానగురువులుగా, యుద్ధ వీరులుగా, పేరుగాంచి యున్నారు. కాసిమో, లారెంజోల యొక్క మహత్త్వము స్వీయ దేశీయ సారస్వత చరిత్ర పత్రముల యందు ముద్రిత మయ్యెను.

పునరుజ్జీవన యుగములో ఇటాలియను వచనరచనాభివృద్ధికి నికోటో మేకియా నేటీ (1469-1527) అను కవి కారకుడయ్యెను. రాజకీయ సిద్ధాంత ప్రతిపాదకుడుగాను ఆధునిక మైన ఇటలీ యొక్క ప్రవక్తగాను ఇతడు ప్రసిద్ధి కెక్కెను. ఇతడు పెక్కు రంగములలో కృషి చేసిన వాడు. ఇతని కీర్తికి జయపతాక ఇల్ ప్రిన్ సిపే అను గ్రంథము నేటి వరకు గూడ ఇది యూరపుఖండ రాజ్యతంత్రమునకు ఒక ప్రమాణ గ్రంథముగా వరలుచున్నది. ఈ కవిశైలి సులభమైనదై, సొంపైనదై యున్నది. ఇతని భాష సుశొ ఖితముగా, సభ్యముగా, రాజ్యతంత్రాత్మక గ్రంథరచనా విధానమునకు ఆదర్శకముగా నున్నది. రాజనీతిని అభ్యసింప గోరువారు నేటికిని ఈ చిన్న గ్రంథమును ప్రమాణముగా గ్రహించుచున్నారు. రాజ్యముల యొక్కయు జాతుల యొక్కయు భవితవ్యతను నిర్మించుటకు గాని నాశన మొనర్చుటకు గాని ఇంత విశేషముగా తోడ్పడు గ్రంథము మరియొకటి లేదనుట అతిశయోక్తి కాజాలదు. "నీతి సూత్రములకును రాజ్యతంత్రములకును ఏపాటి సంబంధములేదు. ఇది యథార్థదృష్టి ఇదియే మానవ చరిత్రయొక్క పరమార్థసారము" అని మాకియ వెల్లి సమర్థించెను.

ఫ్రాన్సిస్కో గ్యూషియార్డిని (1483-1550) మొదటి గొప్ప ఇటాలియను చరిత్రకారుడు. “రికార్డి పొలిటిక్ సివిలీ" అనునది ఇతని కృతి. "స్టోరిడీ ఇటాలియా" అనునది ఇతడు రచించిన మరియొక యుద్గ్రంథము. ఇటాలియను జాతియొక్క జాతీయ చరిత్రను ప్రతిపాదించు ప్రప్రథమ గ్రంథ మిదియే.

లడానికో ఎరియస్టో (1474-1533) అను నాతడు డాంటీ తరువాత పేర్కొనదగిన రచయిత. ఇతడు ఇటాలియను మహాకవులలో రెండవస్థానము నాక్రమించు చున్నాడు. “ఆర్లెండో ఫ్యూరియసో" అనునది ఇతని అత్త్యుత్తమ రచనయై యున్నది. పునరుజ్జీవనకవిత, ఎరియస్ట్రో కవియందు స్వేచ్ఛాయుతమును, అద్భుతకల్పనా విశిష్టమును అగు ప్రాచీన కవితగా పరిణతినొందినది అని ప్రతీతి కలదు. ఈకావ్యమునందు "షెవిలియర్ ఆర్లేండో” యొక్క వీరకృత్యములు వర్ణింపబడినవి. ఈ గ్రంథము రగ్గెరో, బ్రాడ మెన్టీల యొక్క వివాహముతో ముగియు చున్నది.

టర్ క్వాటో టేసో (1554-1595) 16వ శతాబ్ది పర భాగమున, ఇతడు ప్రతిభావంతుడై, సమకాలికులైన కవులను, నాటక రచయితలను, అతిశయించెను, 'జెరూసలం లిబనటా' అను గొప్ప కావ్యము ఈతని కీర్తి సౌధమునకు పునాదియై వరలెను. ఇందు మొదటి క్రైస్తవమత యుద్ధము విపులముగా వర్ణింపబడినది. ఇందు అపరిచిత వస్తువర్ణనాత్మకములైన అంశములు కూడా కలవు. ఈ కావ్యమునకును ఎరియస్ట్రొ వ్రాసిన "ఆర్లెండో ఫ్యూరియసో" అను కావ్యమునకును సన్నిహితమైన సామ్యములు కలవు. ఈ కావ్యమునందలి మతవిషయకమైన ఉద్రేకమును పరిహరించినచో, ఇది పాఠకులకు అత్యంతానందమును ప్రసాదింపగలదు అనుటలో సందేహములేదు.

17వ శతాబ్ది లేక సంక్రమణ యుగము : స్పెయిను ప్రభుత్వారంభముతోను, అకీర్తికరమైన విచారణతోను, ఇటలీ మరల అంధకారమగ్నమయ్యెను. మతోన్మాదులు చెల రేగి, ధర్మవిరుద్ధము అను వ్యాజమున చిక్కినవారి నెల్ల హత్యగావించిరి. ఈ యుగమున రచయితలు ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపించుచున్నారు. వెలుతురును గాంచి ధీరులైన ప్రజలలో కొందరు అంధకారమువలని అనర్థములను సహింపరైరి. వారిలో గెలిలియో అను మహాపురుషు డొకడు (1564-1642) అయి యున్నాడు. ఈ మహనీయుడు శాస్త్రజ్ఞులలో అగ్రగామి, వచనరచనల యందు అందెవేసిన చేయి. డయోలాగొడే మస్సిమిసిస్టెమి, డయోగెడెల్లే, నౌవెసయింజె అనునవి ఇతని ఉత్తమ వచన రచనలు. ఇవి సుందరమై సులభమైన శైలిలో ప్రజోపయోగార్థమై వ్రాయబడినవి.

ఆర్కేడియా (1690): ఆర్కేడియా కళాపరిషత్తు రోములో 1690లో ఫ్రాన్సెస్కో రెడి, డాఫికి కేయియా, ఎలి సేన్డోగిడి అను ముగ్గురు కవులచే స్థాపింపబడెను. పునరుజ్జీవనము యొక్క చైతన్యమును రక్షించుటయును కవిత యొక్కయు, కళయొక్కయు, తదాదర్శముల యొక్కయు అభిరుచిని సంరక్షించుటయు ఈ కళాపరిషత్తు యొక్క ముఖ్యోద్దేశములు. మెస్టాస్టసియో, గిన్ సెస్పె పెరినీ అనువారు ఆర్కెడియా కళాపరిషత్తునకు చెందిన మహాకవులలో చివరనున్న వారు. పెరినీ అను నాతడు (1729-1799) వివేకధర్మమునందును, వ్యావహారిక జీవితాశయములందును జనులకు ప్రీతిని కల్పించుటకై కావ్య కళ నుపయోగించెను.

ఇటాలియను నాటకము, నాటక రంగము : గ్రీకు -రోమను నాటకానువాదములను, కొన్ని జానపద కావ్యములను, కొన్ని భావప్రధాన నాటకములను, మినహాయించినచో, ఇటాలియను సారస్వతమున గర్వించదగిన నాటకములు లేవనియే చెప్పవచ్చును. పండుగలలోను, క్రైస్తవుల మతోత్సవములలోను, మిలాను, వెనీసు, ఫ్లారెన్సు మున్నగు పెద్దనగరములలోను సుఖాంత నాటకములు ప్రదర్శింపబడుచుండెడివి. అవి మిక్కిలి ప్రాచీనము లును, అపరిణతములును అయియుండెను. వాటికి సారస్వత గౌరవము లేదయ్యె, నాటక క్షేత్రమున, ఇటాలియను వాఙ్మయము యొక్క మహత్త్వమును విక్టోరియో ఎల్ ఫియరీ అను కవి (1749-1803) పునరుద్ధరించెను. ఇతడు ఇటలీ యొక్క వైతాళికుడుగా భావింపదగినవాడు. ఇతడు తన "డెల్ ప్రిన్సి పే ఎడెల్లి లెట్టెరి" అను వచన గ్రంథమునందు భవిష్యత్తునందలి ఇటలీ యొక్క ఏకీకరణమును ప్రతిపాదించి తన దూరదర్శిత్వమును ప్రకటించెను. 'ఫిలిప్టో' మొదలుకొని 'బ్రూటో సెక్కడే' వరకు గల స్వరచితములయిన 19 విషాదాంత నాటకములను భావి కాలమునందలి, ఇటాలియను ప్రజలకు అంకితము చేసి యున్నాడీ మహాకవి. ఈ నాటకములందు ఇతని ఆవేశము, స్వాతంత్య్ర ప్రీతి, ప్రభువుల నిరంకుశ పరిపాలనమునందలి ద్వేషము మూర్తీభవించియున్నవి. షేక్స్పియరుతో సరిరాకున్నను, ఇతడు గెయిటీ, మిల్లరులతోడి సమాన ప్రతిపత్తి గౌరవములకు అర్హుడై ఉన్నాడు. ఆధునికమైన ఇటాలియను నాటకాభివృద్ధిని గూర్చి చెప్పవలసిన విశేష మెద్దియును లేదు. గేబ్రియలు-డి-ఎనంజియో రచన మాత్రము నాటక క్షేత్రమున విశిష్టస్థానము గలదిగా పేర్కొనదగియున్నది. ఇతడు ఆధునికుడగు ఇటాలియను మహాకవియు, నవలా రచయితయు, వ్యాసకర్తయునై యున్నాడు. ఇతడు రచించిన లాఫిగ్లియా-డిలారియో అను సుప్రసిద్ధ నాటకము ఒకటి కలదు.అది ప్రపంచ యుద్ధము (1914-1918) ముగిసిన పిదప మిక్కిలి ప్రజా రంజకమైనదై భాసిల్లెను.

ఆధునిక యుగము  : నెపోలియను బోనపార్టీ నేతృత్వమున ఫ్రెంచి సేనలు ఇటలీని ముట్టడించుటతో (1796-1814) ఇటాలియను వాఙ్మయమునందును, భావము నందును నవయుగము ప్రారంభమయ్యెను. ఈ దండ యాత్ర రాజకీయముగను, సాంఘికముగను, ఆదర్శాత్మకముగను గొప్ప విప్లవమును కల్పించెను. నెపోలియను యొక్క విజయముల వలన ఆసియాదేశపు హెంస్ బర్గ్ సమ్రాట్టుల నిరంకుశ పరిపాలనమునుండి ఇటాలియను, దేశీయులకు విముక్తి చేకూరెను. గారిబాల్దియు, అతని స్వచ్ఛంద సైనికులును దేశస్వాతంత్య్ర సంపాదనమునకై చేసిన సేవ అమూల్యము. రచయితలు కూడ విదేశీయులకు ప్రతికూలముగ పోరాటము తమ లేఖనులతో సాగించుచు వచ్చిరి. కవుల కలములే యోధుల ఆయుధముల కంటే విశేషతరమైన మారణశక్తి కలవై ప్రవర్తిల్లెను.

ఎలి సెండ్రో మేంజోనీ “రొమాంటిసిజమ్" అను సారస్వత కళా విప్లవోద్యమమును ఇటలీలో స్థాపించెను.-రాజకీయముగా ఘటిల్లిన సంక్షోభముచే గ్రస్తులైయున్న సజాతీయులకు సార్వకాలికములైన స్వీయకృతులచే ఇతడు జీవితోత్సాహ చైతన్యములను ప్రసాదించెను. హ్యూగోఫాస్కలో, గిసఫీమేజనీ, గ్యాకా మోలియో పార్టీలను కవులు ఈ నూతనయుగ చైతన్యోత్సాహముల యొక్క ధ్వజ వాహకులుగా భాసిల్లిరి.

ప్రాచీన గ్రంథముల యొక్కయు, సంప్రదాయముల యొక్కయు ప్రయోజనములు అనపేక్షితములయ్యెను. నూతన పరిస్థితులు సజీవమగు ఒక నూతనోద్యమమును అర్థించుచుండెను. రొమాంటిసిజము కళలకు ప్రోత్సాహకరముగాను, సాంఘిక పరిస్థితులయం దొక విప్లవకల్పనకు సాధనముగాను ఉపయోగింపబడదొడగెను. గిసెపీ మేజనీ ఒక రొమాంటిక్ విప్లవమును కలిగించెను. ఇతడు విశ్వమానవ సౌభ్రాత్రమునకు ముఖ్య ప్రతిపాదకుడయి ప్రజల ఆదరాభిమానములకు పాత్రుడయ్యెను. ఇతడు తన జీవితము యొక్క చరమదశయందు రొమాంటికు ఉద్యమముతో తనకుగల సంబంధమును పరిత్యజించి, 1827 నుండి 1844 వరకు వ్యాసరచనమునందు నిమగ్నుడయ్యెను. ఈతని వ్యాసములు నాగరికత యొక్క ఏకత్వమును, మానవజాతి యొక్క సామూహిక జీవితమునందలి ప్రశస్తిని ఉద్ఘొషించెను.

కార్డుషీ, పేస్కోలీ, పెర్గా, ఫాగజేరొ అనువారు నూతన యుగ చైతన్యధ్వజమును ఇరువదవ శతాబ్దిలో వహించిరి. అన్ని యుగములందును సారస్వతాత్మకము గాను, కళాత్మకముగాను ఇటాలియన్ జాతి తన దివ్యావేశమును యూరపుఖండము నందలి అన్ని దేశములకును ప్రసాదించెను. ఇటాలియను రచయితలు స్వీయ భాషా వాఙ్మయముల కొనర్చిన సేవ తజ్జాతి గౌరవమును పెంపొందించునదై యున్నది. 'గేబ్రియల్లెడి అనన్ జియో', ఇటాలియను కవులలో నెల్ల మహామహుడు. నాటకము, రొమాంటిక్ కవిత, వచనము, నవల, వ్యాసము మున్నగు వివిధ వాఙ్మయ ప్రక్రియల యందు ఇతనికి గల ప్రతిభ అనన్యసామాన్యము. ఇతడు దైవోపహతుడగు మస్సొలినీకి ఆప్తమిత్రుడుగా నుండెను. మస్సోలినీ కూడ కవితాశక్తి సంపన్నుడై యుండెను. ఇతడు రాజకీయశాస్త్రములపై కొన్ని చక్కని కరపత్రములను వ్రాసెను. వీటియందు ఇతని మహా వక్తృత్వశక్తి, సారస్వత లాలిత్యము తేటపడుచున్నవి. వక్తృత్వమున ఇతనిని మించినవారు అల్ప సంఖ్యాకులే కలరు. 'డ్ ఏమిసిస్' అను కవి "ఇల్ కనోర్" (హృదయము) అనుగ్రంథమును రచించెను. ఇది ఆధునిక రచనలలో కడపటి రచనయై యున్నది.

ఇటాలియను రచయితలు తమ దేశమునకు వెలుపల విశేష ఖ్యాతిని గడించిన వారు కారు. ప్రపంచమందంతటను వ్యాప్తిలో నున్న వాఙ్మయోద్యమములందలి సాధారణ ప్రక్రియలనే వీరు అనుసరించియున్నారు. శాస్త్రీయములును, ఆర్థికములును అగు సమస్యలకు వాఙ్మయము, కవిత, క్రమముగ స్థాన మొసగుచున్నవి. పత్ర లేఖన కళ వృద్ధి నొందుచు, ప్రపంచము యొక్క దృష్టి పథము నాకర్షించుచున్నది. వాఙ్మయ పత్రికలు, విద్యావిషయక పత్రికలు, సంకల్పమునందును, భావనయందును, శైలి యందును సంపూర్ణముగా నవ్యమైన ధోరణిలో నున్నవి. ఈనాడు ఇతర స్థలములయందు వలె ఇటలీ యందును జాతీయ - అంతర్జాతీయములగు ప్రయోజనములను సంపాదించుటకు సాధనముగా వాఙ్మయము ఉపయోగపడు చున్నదని సంగ్రహముగా నుడువవచ్చును.

తా. ఆ. భా.