సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోనేషియా (భూగోళము)
ఇండోనేషియా (భూగోళము) ఉనికి, వైశాల్యము : ఆగ్నేయ ఆసియాలో పసిఫిక్ హిందూమహాసముద్రములచే నావరింకబడి ఇండోనేషియా రిపబ్లిక్ ద్వీపములు కలవు. పూర్వమిదీవులు నెదర్లాండ్స్, ఈస్ట్ ఇండీస్ ద్వీపములనియు వ్యవహరింపబడు చుండెడివి. ఈ ఈస్టిండీస్ ద్వీపముల వర్గమంతయును బ్రిటిష్, డచ్, పోర్చుగీసులచే శతాబ్దముల తరబడి పరిపాలింపబడి యుండెను. ఈ ద్వీప సముదాయము భూమధ్య రేఖకు ఇరువైపుల 3,100 మైళ్ళు వ్యాపించి భూపరిధిలో ఎనిమిదవ భాగము ఆక్రమించియున్నది. ఉత్తర, దక్షిణముల దూరము ఆ సంఖ్యలో మూడవ భాగమును మించి యున్నది. ఇండోనేషియాకు చెందిన ఈ దీవుల వైశాల్యము 7,53,267 చదరపు మైళ్ళు. ఇందు సుమత్రా 162,268 చ. మైళ్ళు, పశ్చిమ న్యూగినీ 1,53,321 చ. మైళ్ళు, సెలబెస్ (Celebes) 71,763 చ. మైళ్ళు వైశాల్యమును కలిగి యున్నవి. ఈ భూఖండ విభాగము మూడు విధములు. 1. ఆసియా ఖండాంతర్గతముగా జావా, సుమత్రా, బోర్నియో, సెలబెస్ లకు సంబంధించినవియు, దాని పరిసరములనున్న విశాల సుండా (Greater Sunda) ద్వీపములు.
2. బలి (Bali) మొదలుకొని టైమర్ (Timor) ఆవలదాక నున్న అల్ప సుండా (Lesser Sunda) ద్వీపములు.
3. ఆస్ట్రేలియా ఖండముననున్న మొల్యూ కస్ (Mollucas), పశ్చిమ న్యూగినీలు.
భూగర్భశాస్త్ర విషయములు : ఈ ద్వీపములకు పరసరములలో నున్న సముద్రము తక్కువలోతుగా నున్నది. ఇటీవలి భూగర్భకాలము (Geological times) వరకు ఈ దీవులు ఆసియా, ఆస్ట్రేలియా ఖండములతో కలిసి యుండెడివి. జావా, సుమత్రాల యొక్క ఉత్తర తీరము లందువలె ఇటీవల పెల్లుబికిన సాగర సంబంధ పరిణామముల వలనను, తీరములందలి వండుమట్టి మైదానముల వల్లను విస్తీర్ణ భూభాగము మునిగిపోయినది, అల్పసుండా ద్వీప సముదాయపు పరిసర సముద్రము ఎక్కువ లోతుగా నున్నది. ఇందు నిట్రపు తీరముగల ద్వీపములున్నవి. ఇచట పర్వత నిర్మాణము (Mountain building) అత్యధికముగా సాగుచున్నది. అప్పుడప్పుడు భూకంపములు అగ్నిపర్వత ముల ఉత్ క్షేపములును సంభవించుచుండును. ఒక యగ్ని పర్వత పంక్తి, జావా, సుమత్రా, బోర్నియో ద్వీప శ్రేణికి సరిహద్దుగా నుండి, న్యూగినీ (New Guinea) ద్వీప శ్రేణిని వలయాకారముగా నాక్రమించి ఫిలిపైన్ (Phillippine) ద్వీపమును చేరుచున్నది. కేవలము జావా ద్వీపముననే ఒక వంద అగ్ని పర్వతములున్నవి. వీనిలో చాలవరకు ఒక మైలు ఔన్నత్యము కలవియు, చైతన్యవంతములునునై యున్నవి. ఇట్లు ఆరు ద్వీపములంటే 10,000 అడుగులకు పైగా ఎత్తుగల పర్వతములు కలవు.
భౌతిక స్వరూప వర్ణన : ఇండోనేషియా ద్వీపము లన్నియు భూమధ్య రేఖామండలముననే యున్నను, ఇచటి శీతోష్ణస్థితి మిక్కిలి వేడిగా నుండక, సామాన్యముగా నుండును. ఇట్టి శీతోష్ణస్థితికి పరిసరములందున్న సముద్రమే కారణము. అయినను ఇచటి వేడిరాత్రులు, గాలిలోని అధికమైన తేమ, రెండును ఏకమగుటచే పల్లపు భూముల లోని శీతోష్ణస్థితి యూరోపియనులను నిర్వీర్యులను జేయు చున్నది. ఇచటి పర్వతప్రాంతములందు, ప్రతి సంవత్సరము కొంతకాలము గడుపుట జరుగుబాటు గలవా రందరికిని అలవాటు. ఇచటి శీతోష్ణ పరిస్థితులు ఋతువులపై కంటె నెక్కువ ఆయా ప్రదేశముల యౌన్నత్యముపై నాధారపడియుండును. కారణము ఇచటి దీర్ఘదినములకును, హ్రస్వదినములకును భేదము కేవలము 48 నిమిషములు మాత్రమే అయియుండుటయే. సముద్రమట్టమున నున్న జకార్తాలో సంవత్సరపు సరాసరి ఉష్ణోగ్రత 79°ఫా. ఇచట అధికతమ, అల్పతమ ఉష్ణోగ్రతలకు భేదము సరాసరి 1° ఫా. మాత్రమే. దీనితోపోల్చి చూచుకొనుటకు మన మితర ప్రదేశముల ఉష్ణోగ్రతను గమనించిన ఈ విధముగా నుండును :
సముద్రపు మట్టమునకు 2,395 అడుగుల యెత్తున నున్న బాండుంగ్ లో సరాసరి ఉష్ణోగ్రత 71° ఫా.
సముద్రపు మట్టమునకు 5,588 అడుగుల యెత్తుననున్న టసారి (Tasari) సరాసరి ఉష్ణోగ్రత 61° ఫా.
సముద్రపు మట్టమునకు 9,914 అడుగుల యెత్తుననున్న గేడ్ (Gede) సరాసరి ఉష్ణోగ్రత 48° ఫా. చాల ఎత్తుగా నుండి, పవనములకు చాటుగానుండు పీఠభూమి ప్రదేశము లందు మాత్రమే పొగమంచు ఏర్పడును.
ఇండో నేషియాలో వర్షపాతము ఋతుపవనముల వలననే యధికముగా కలుగుచున్నది. దీనికి కారణము ఈ దీవులు ఆసియా, ఆస్ట్రేలియాల మధ్యనుండుట. ఈ ఖండములలో అధిక పీడనము, అల్పపీడనమును ఏకాంతరము (alternating) లగుటయును, ఈశాన్య, ఆగ్నేయ వ్యాపారపవన మండలములు మారుటయును లక్షణములుగా నున్నవి. ఈ ద్వీపములు భూమధ్యరేఖకు ఇరువైపులకు విస్తరించుటచేత వర్షపాతము, ఉత్తర, దక్షిణ ప్రాంతములందు భిన్నముగానుండును. జనవరి మాసమువ ఆసియానుండి బయలు వెడలి వీచెడి పవనములును, వ్యాపార పవనములును భూమధ్యరేఖకు ఉత్తరభాగమున ఈశాన్యముగా వ్యాపించును, సముద్రపు మట్టపు ప్రాంతములందీ పవనముల వలన ఎక్కువగా వర్షము కురియకున్నను, ఏటవాలుగానున్న పర్వత ప్రాంతములందు భారీవర్షములు కురియును. భూమధ్య రేఖను అధిగమించిన తదుపరి ఈ పవనములు వాయవ్యమునుండివీచుట మొదలిడి, జావా మొదలైన యితర పూర్వద్వీపములందు వర్షము కలుగ జేయును. జూలై మాసమున పరిస్థితు లింతకు వ్యతిరేకముగా నుండును. ఈ కాలమున పొడిగా నుండు వ్యాపార పవనములు ఆస్ట్రేలియా ప్రాంతము నుండి వచ్చును. వీటి వలన ఉన్నత ప్రాంతములందును, అవి బయలు వెడలెడి ఎడారి ప్రదేశమునకు దూరము పోవుకొలదియు తప్ప తక్కిన ప్రాంతములందు వర్షపాతము స్వల్పము. ఈ పవనములు భూమధ్య రేఖను దాటి దక్షిణ దిశనుండి వీచునపుడు అధిక వర్షమునకు కారణమగును. భూమధ్య రేఖా పరిసరములందు గర్జనములతో గూడిన తుపానులు అధికము. జకార్తాకు దక్షిణమున సున్న బ్యూలెన్జర్గ్ (Builenzerg) లో సంవత్సరమునకు 322 దినములు, ఉరుములతోను, తుపానులతోను కూడినవే. ఇది ప్రపంచమున అత్యధికము.
ఆస్ట్రేలియా సమీపమున నున్న కొన్ని ద్వీపములందును, జావా, మధుర (Madura) లలో తప్ప తక్తిన దేశమంతటను వ్యవసాయమునకు సరిపోవు వర్షము కురియును. సంవత్సరమునకు 60 అంగుళముల వర్షపాతమున్న ప్రదేశము లందు వరిసాగు అధికముగా చేయబడును. అప్పుడప్పుడు వాన లేనిసమయములో సేద్యమునకు సరిపోవు పారుదల నీరు లభించిన సంవత్సరమున ఈ దేశమున ప్రతివారము పంటకోత, నూర్పిడి జరుగుచునే యుండును.
సుమత్రాలోని బురదప్రాంతమున తప్ప, అడవులను నరకని యితర ఉష్ణ ప్రాంతములందు ఎత్తుగా పెరిగిన అడవు లున్నవి. ఈ యడవులందు చక్కగా పెరిగిన చెట్లు చాల తక్కువ. రాకపోకల సౌకర్యము లేనందున ఈ అడవుల వలన కలుగు లాభములు కూడ చాల తక్కువే. జావాలో టేకు కఱ్ఱ లభించును. కాని మొత్తముమీద వాణిజ్యమున కుపయోగించు కలప మిక్కిలి తక్కువ.
ఇండోనేషియా భూములు, ముఖ్యముగా జావా ద్వీపములోనివి, మిక్కిలి సారవంతములు. ఇచట నున్న అగ్ని పర్వతముల నుండి వ్యాపించు ఎరువువంటి బూడిదయే దీనికి కారణము. ఈ బూడిద ఆమ్ల సంబంధము కాక క్షార సంబంధముగా నుండును. దీర్ఘ వ్యవసాయమువలనను,
"మిక్కుటమైన వ్యవసాయము" (Intensive cultivation) చేతను భూములందు ఎరువులు వేయుట యావశ్యక మైనను, ఇచ్చటి భూము లిప్పటికిని సారవంతములుగా నున్నవి. సుమత్రా, బోర్నియో, సెలసిస్, న్యూగినీలలోని అధిక భాగములందు అగ్ని పర్వతములు లేకున్నను ఇచటి భూములు మిక్కిలి సారవంతములుగా నున్నవి.
వ్యవసాయము : ఇచటి వ్యవసాయము రెండు విధములు :
1. జీవనోపాధికి చేయబడు చిన్న తరహా వ్యవసాయము.
2. పెద్దతరహా వ్యవసాయము, లేక విశాలభూభాగము లందు నాటువేయు వ్యవసాయము.
పెద్దతరహా వ్యవసాయముతొ వచ్చు అదినమైన ఫలసాయములో అధిక భాగము ఎగుమతి చేయబడును, వరి పండించు పొలములను “సావాస్" (Sawahas) అందురు. ఇవి భారతదేశపు వరి పొలములలోవలె పొలముల సంపూర్ణ వినియోగమును సూచించును. జావా దిగువ ప్రాంతములో ఇట్టి వరిపైరులు ప్రశస్తముగా అభివృద్ధి చేయబడి యున్నవి. అయినను, కనువిందుగా మెట్లు మెట్లుగా తీర్చబడిన పరిపొలములు అగ్ని పర్వతపు వాలుల వరకును విస్తరించి యుండును. ఇచట సాగుచేయబడు ఇతర ధాన్యములందు, కాయధాన్యములు, చిలగడదుంపలు, 'కేసవ' దుంపలు (cassava) 'పీనట్స్* (Peanuts) సోయా బీన్లు (Soya beans) చేరియున్నవి. పండ్లతోటలు, పెరటి తోటలు, ప్రతియింటిచుట్టును ఉండును. ఇచట మాగాణి సాగుబడి కుపయోగపడని యొక విధమగు భూమి కనిపించును. ఇచ్చట వరిపంటకంటే మెట్టపైరులను ఎక్కువ ప్రాధాన్యము కలదు. కొబ్బరి, కాపోక్ (Kapok) అను ఒక విధమయిన దూది మిరియాలు మొదలగు సుగంధ ద్రవ్యములు, రబ్బరు, కేసవాదుంప (cassava), కాఫీ మొదలగునవి యిచట దేశీయములగు వాణిజ్యపు పంటలు.
చెరకు పంట యిచట చాల ముఖ్యమైనది. ఇది విదేశీయులకు నివాసస్థానములుగానున్న ప్రదేశము లందు విదేశీయుల చేతనే నిర్వహింపబడుచున్నది. ఈ విదేశీయులు పొలములను నిర్ణీతకాలములకు కౌలుకు తీసికొని సాగు చేయుదురు. ఒక పొలములో మూడు సంవత్సరముల కొక పర్యాయముకూడ పంటతీయుటకు వీరి కవకాశము కల్పింపబడినది.
ఖనిజములు : ఖనిజములు పరిమాణమున తక్కువగా నున్నను వాటి విలువ మిక్కిలి యధికము. సుమత్రాలోని పాలెంబాంగ్ (Palembang) సమీపమున జాంబి (Djambi) లోను, మెదాన్ (Medan) లోను పెట్రోలియం లభించును. బోర్నియోలోని బాలిక్ (Balik), పోపన్(Popan) టారక౯ (Tarakan) ప్రాంతములందు చమురు లభించును. జావాలోని రేమ్బాన్ వద్ద కొంత నూనె దొరకుచున్నది. సేరందీవిలో కూడ నూనెకలదు. పశ్చిమ, మధ్యసుమత్ర, బోర్నియోలలో మామూలు రకపు బొగ్గు తీయబడును. ఇట 1940 సంవత్సరములో 20,00, 422 టన్నుల దొరకినది. బింటన్ (Bintan) ద్వీపమున లభించు బాక్సైటు, జావాలో తీయబడు గంధకము, మాంగనీసు, సెలబెస్ లో దొరుకు నికెలు ఇచ్చటి యితర ఖనిజములు.
రబ్బరు, చమురు, చక్కెర, తగరము, తేయాకు, ఇండొనేషియానుండి యితర దేశములకు ఎగుమతి చేయబడును. జపానునుండి ప్రత్తి సరకులు, అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండియు, నెదర్లాండ్సు నుండియు వచ్చు యంత్రములు, ఇనుము, ఉక్కు, ఆహార పదార్థములు, ఇండో నేషియాలోని ముఖ్యమైన దిగుమతులు.
జనాభా : ఇండో నేషియాలో నివసించు జనాభాలో నధిక భాగము మలయా (Malays) జాతికి చెందిన వారేయని చెప్పవచ్చును. వీరు తెలివి, సంతోషశీలము గల ప్రజలు. అవసరమైనపుడు కష్టించి పనిచేయుదురు. కానీ తమ విరామ కాలమును ఒక ఆస్తి వలె చూచుకొందురు. ఇండోనేషియన్, మలా నేపియన్ (Malanesian) పోలినేషియన్ (Polynesian) వర్గములకు చెందిన 250 భాష లిచట వ్యవహారమున నున్నవి. 13వ శతాబ్దమున అరబ్బులచే ప్రచారము గావింపబడిన ఇస్లాం మతావలంబకుల సంఖ్యయిట హెచ్చు. 1931 సం. న ఇచట నివసించు అరబ్బుల సంఖ్య 71,000 అదే సంవత్సరమున 1,2,34,000 చీనా దేశీయు లిచట నివసించిరి. వీరిలో చాలమంది వ్యాపారము చేయువారే.
ఇండోనేషియా ప్రజల సంస్కృతి ఆయా ప్రదేశములనుబట్టి భిన్నముగానున్నది. పశ్చిమభాగములందు నివసించు ప్రజలు మలయా (Malay) వర్గమునకును, పూర్వ భాగములలోనివారు పాపువన్ (Papuan) వర్గమునకును చెందిన వారు. సుమత్రా అంతర్భాగములందు కుబు (Kubu) బోర్నియోలో డయక్ (Dayak) ఆదిమ జాతులు వెనుకబడిన మానవ జాతులుగా నున్నవి. ఇతరులు, అందులో ముఖ్యముగా బలి, లోంబక్ లోనివారు జావానాగరికతకు చెందియున్నారు. జావాద్వీప పూర్వభాగమున నివసించు బలి (Bali), లోంబాక్ (Lombak) ప్రజలు వ్యవసాయమే తమ వృత్తిగా జీవించుచున్నారు. బలి వర్గమునకు చెందిన బలిసిస్ (Balinese) నర్తకులు ముఖసౌందర్యమునకును, ఉత్తమ నృత్యమునకును ప్రఖ్యాతి వహించియున్నారు.
జావాలో జనాభా యధికము. వీరు దాదాపు వేయి సం. ల నుండి సంప్రదాయసిద్ధమైన అభివృద్ధిని సాధించు చున్నారు. మలయా మానవజాతికి చెందిన మూడు మానవ జాతివర్గము లిటనున్నవి. పశ్చిమమున సుండావారు (Sundanese), మధ్య భాగమున జావావారు (Javanese) పూర్వ భాగమున మధురవారు (Madurese) నివసించుచున్నారు. 8, 9 శతాబ్దులలో వీరు బౌద్ధమతావలంబకులుగా నుండి తరువాత హైందవులుగా మారినారు. మధ్యజావాలోని బోరోబుడూర్ (Boro Budur) మహోన్నత స్తూపము వీరి శిల్ప చాతుర్యమునకు చిహ్నము. ఇండో చైనాలోని ఆంగ్ కార్ శిల్ప శిథిలములతో ఈ స్తూపపు నాలుగు వేదికల శిల్ప సౌందర్యము పరిపోల్పదగినదని చెప్పవచ్చును. ఇస్లాం మత మిచట వ్యాపించుటతోడనే ఈ మహోన్నత నిర్మాణము అపవిత్రము చేయబడకుండ నుండుటకు మట్టితో కప్పివేయబడినది. తరువాత పరిసరములందు అడవులు పెరిగి ఆ నిర్మాణము వానిచే కప్పబడినది. ఇటీవల ఒక వంద సంవత్సరములకు పూర్వము తిరిగి యిది కనుగొనబడినది. 1891 లో ట్రినిల్ (Trinil) ప్రదేశమునందలి పిథెకన్ త్రోపస్ (Pithecanthropus) అవ శేషములును, 1940 సం.న మనుష్యుల పుర్రెలు నాలుగు లభించిన జావాలోని ప్రదేశమును ప్రసిద్ధినొందినవి. పిథెకన్ త్రోపస్ దాదాపు చైనాలోని సినాన్ త్రోపస్ (Sinanthropus) వలే ప్లీస్ట్రో సీన్ (Pleistocene) కాలమునకు చెందినది. లభ్యములైన మాననావశేషములలో (Fossils) ఇవియే మిక్కిలి ప్రాచీనములైనవి. 1619 సం. జకార్తా నగరము స్థాపింపబడినది. ఇదివరకు దీనిని బటావియా యని వ్యవహరించువారు. ఇది యిపుడు ఇండో నేషియా రాజధాని. రేవుపట్టణము. గొప్ప వాణిజ్య కేంద్రము. 1940 సం. జనాభా 4.70.700. ఇందు 40,100 మంది ఐరోపావారు. పర్వత పరిసరములలోని బాండుంగ్ (Bandung) ద్వితీయ ముఖ్యనగరము.
బి. ఎన్. సి.