సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోనేషియా (చరిత్ర)
ఇండోనేషియా (చరిత్ర) ఇండోనేషియా ద్వీపసమూహము గల ఒక స్వతంత్ర రాజ్యము. చరిత్రకు పూర్వయుగములోనే ఈ ద్వీపములలో జనులు నివసించుచుండెడివారు. వారు పొట్టివారు,నల్లనివారు. కాలక్రమమున ఆసియాఖండమునుండి
అనేక జాతులవారు వలసవచ్చి ఇండోనేషియాలో స్థిరనివాసము ఏర్పరచుకొనిరి. నేటికి రెండువేల ఏండ్లకు పూర్వమే భారతీయు లీద్వీపములలో ప్రవేశించిరి. భారతీయుల రాక ఇండోనేషియా చరిత్రలో గొప్ప ఘట్టము. వారిచటి జనుల జీవితమును చాల ప్రభావితము చేసిరి. తండోపతండములుగా వలసపోయిన భారతీయవర్తకులు తమతోపాటు తమ ఉన్నతమైన నాగరికతను ఈ ద్వీపములకు తీసికొనివచ్చిరి. హిందూమతము, సంస్కృతి ఇచ్చట విస్తరింపచేసిరి. అక్కడి జనులలో చాలమంది హిందూమతమును స్వీకరించిరి. క్రీ.శ. మొదటి శతాబ్దములో భరతఖండ దక్షిణాపథమున శాతవాహనాంధ్ర సామ్రాజ్యము వెలసియుండెను. శాతవాహనుల కాలములో ఈ దీవులతో సముద్ర వర్తకము చాలా విరివిగా సాగుచుండెడిది. రెండవ శతాబ్దము నాటికే ఇండో నేషియాలో హిందూ సామ్రాజ్యము నెలకొనియుండినది. కాని దానికి భారతదేశముతో ఎట్టి సంబంధమును లేదు. ఐదవ శతాబ్దము నాటికి జావా, సుమిత్రా దీవులలో హిందూ సామ్రాజ్యము లుండెను. ఇవి భారతదేశపు వలసలు కావు. స్వతంత్రరాజ్యములు. భారతీయుల వలస యొక్క విశిష్టత ఇందు చూడనగును.
భారతీయ నాగరికతా విస్తరణముతో పాటు బౌద్ధమతము కూడ ఇండో నేషియా దీవులలో బాగుగ వ్యాపించినది. అంతే కాక, బౌద్ధమత సంస్కృతులముద్ర అచట శాశ్వతముగా నిలిచిపోయినది. భారతీయు లీదీవులను ‘సువర్ణ భూమి' యనియు 'సువర్ణ ద్వీప'మనియు వర్ణించు చుండెడివారు. ఆ పేరును బట్టి వారచటి ధనధాన్య సంపదలచే ఆకర్షింపబడిరనుట స్పష్టము. సుమత్రాద్వీపము భారతీయవిద్యాపీఠముగా ఉండెడిది. భారతదేశమునకు పోవుచు చీనా యాత్రికులు అరుమాసముల కాలము ఇచ్చట ఆగి సంస్కృతము నేర్చుకొనెడివారట. ఈ ద్వీపములలొ అనేక శాసనములు సంస్కృత భాషలో, సంస్కృతమునకు సంబంధించిన మరొక భాషలో, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడి ఉన్నవి. తక్కోలము, కర్పూరద్వీపము, సువర్ణ ద్వీపము, నారికేళ ద్వీపము, యవద్వీపము మున్నగు పేర్లను బట్టి అవి భారతీయుల వలసలని తెలియవచ్చు చున్నది.
సుమత్రాలో క్రీ. శ. 4 వ శతాబ్దములో శ్రీ విజయ రాజ్యము అను స్వతంత్ర హిందూరాజ్యము స్థాపింపబడెను. 7వ శతాబ్దాంతము నాటికి ఆ రాజ్యము చాల పేరు ప్రతిష్ఠలు పొందినది. శ్రీ విజయ విశ్వవిద్యాలయము ప్రఖ్యాతమైనది. ఇతర ఆసియాదేశములనుండి విద్యార్థులు విద్యాభ్యాసమునకై వచ్చి ఇచట ఉండెడివారు. యవద్వీప (జావా) సంస్కృతి అధికాంశము భారతీయమైనది, జావ నుల భాష - కవి భాష - లోని శబ్దజాలము సంస్కృత మూలమైనది. జావనుకవులు రామాయణ, మహాభారతములను ఇతర పురాణ గాథలను ఇతివృత్తములుగా గ్రహించి, కావ్యములుగా వ్రాసిరి. వారు సంస్కృత సంప్రదాయములను విరివిగా పాటించిరి. జావను భాషలోనికి అనువదింపబడిన మహాభారతము ఇటీవల జరుపబడుచున్న మహాభారత విమర్శనమునకు చాలా తోడ్పడు చున్నది. ఒకవైపు హిందూ మతము, విష్ణు పూజ వ్యాప్తిలో నుండినవి. రామాయణ గాథలు నాట్య నాటకములలో ప్రదర్శింపబడినవి. మరి యొక వైపు బౌద్ధ స్తూపములు నెలసినవి. మధ్య జావాలో 'బారోబుదూరు' బౌద్ధస్తూపము చాల ప్రసిద్ధమైనది, సుందరమైనది. సుమారు 8వ శతా ప్రాంతమున ఇది నిర్మింపబడినది. నేటికిని ఇది ప్రాచీన బౌద్ధకళకు చిహ్నముగా నిలిచియున్నది. తూర్పు బోర్ని యోలో క్రీ.శ. 400 నాటి సంస్కృత శిలా శాసనములు లభించినవి.వాటిని బట్టి హిందూ సంస్కృతి అచ్చట బాగుగ వ్యాపించినదని తెలియుచున్నది.
13 వ శతాబ్దము నాటికి ఇండోనేషియా దీవులన్నియు 'మజా పాహిత్ సామ్రాజ్యము' అని ప్రసిద్ధిచెందిన హిందూ సామ్రాజ్యాధికారములోనికి వచ్చినవి. ఈ సామ్రాజ్య చక్రవర్తులలో ఒకడైన 'హాజావురుక్' పరిపాలనా కాలము ఇండోనేషియా చరిత్రలో స్వర్ణయుగముగా పరిగణింపబడుచున్నది. 15వ శతాబ్దాంతమువరకే ఈ సామ్రాజ్యము అచ్చట అధికారములో ఉండినది. నాటికి అచ్చట అనేక ప్రదేశములలో దేవాలయములు, స్తూపములే కాక, జనుల ఆచార సంప్రదాయములు, కళలు, వినోధములు, ప్రాచీన హిందూ బౌద్ధనంస్కృతుల చిహ్నములుగా నిలిచియున్నవి.
అరేబియా, పర్షియా దేశములనుండియు, పశ్చిమ భారతతీరప్రాంతమునుండియు వచ్చి న మహమ్మదీయ వర్తకులీ ద్వీపములలో ఇస్లాము మతమును ప్రవేశ పెట్టిరి. త్వరలో ఈ మతమును జనసామాన్యము స్వీకరించెను. మొదట తీరప్రదేశములందలియు, తరువాత ఇతర భాగములందలియు ప్రజలు ముసల్మానులైరి. పదునైదవ శతాబ్దము తుదివరకే మధ్యజావాలో మొదటి ముస్లిము రాజ్యము స్థాపింపబడినది. మజాపాహినరాజులు క్రమక్రమముగా బలహీను లగుచు, అంతఃకలహములకు గురియై ముస్లిముల రాజ్యవ్యాప్తిని అరికట్టలేక, దానికి లొంగిపోయిరి. మజాపాహిత రాజ్యపతనముతో ఇండొనేషియాలో హిందూ మహాయుగము అంతమైనది.
ఇస్లాము మతమును స్వీకరించుట కిష్టములేని హిందువు లందరును బలిద్వీపము వైపుకునకు పారిపోయి, అచట స్థిరపడిపోయిరి. నేటికిని ఒక్క బలిద్వీనములోనే హిందువు లధిక సంఖ్యాకులై ఉన్నారు.
1613-47 వరకు మధ్య జావాలో రాజ్యపాలన చేసిన సుల్తాను హంతొ క్రోకుసుయో అను నతడు ముస్లిం రాజులలో ప్రసిద్ధుడు.
మొట్టమొదటి డచ్చి వర్తకులు 16వ శతాబ్దాంతము నాటికి ఇండొనేషియాకు వచ్చిరి. వారు తీరప్రాంతములలో ఉండిపోయి కోటలు కట్టుకొనిరి.తమ కంటే పూర్వము వచ్చిన పోర్చుగీసువారిని, తమ తర్వాత వచ్చిన ఆంగ్లేయులను కూడ తరిమివేసి, డచ్చివారు తూర్పు ఇండియా దీవులకు ఏకైక నాయకులైరి. డచ్చి ఈస్టు ఇండియా కంపెనీ యాజమాన్యము కొంతకాలము సాగిన తరువాత 1799 సం. డిసెంబరు 31 వ తేదీ నాడు ఇండొనేషియా, నెదర్లాండ్సు ప్రభుత్వాధీనమై ఆ దేశమునకు వలసయైపోయినది. డచ్చి ప్రభుత్వము ఇండో నేషియా దీవుల సంపదలను స్వదేశ సౌభాగ్యముకొరకు వినియోగించుకొనుట తప్ప ఇచ్చటి జనుల అవసరములను ఎన్నడును గమనించలేదు. జనులు బీదలై పోయిరి. వలసతత్త్వమును నిరసించిరి. అసంతృప్తి ప్రబలినది. డచ్చి ప్రభుత్వమునకు వ్యతిరేకముగా తిరుగుబాట్లు జరగినవి. త్రునాజాజా సురపతి, ఇమాంచొంజోల్, ఉమర్ , దీపో, నెగో అను వారలు ఈ స్వాతంత్య్ర సమరమును నడపిన నాయకులలొ ప్రసిద్దులు. కాని భేదోపాయముచేత డచ్చివారు నిర్దాక్షిణ్యముగా - ఈ తిరుగుబాట్లను అణచివేసిరి. 20వ శతాబ్దారంభముతొ స్వాతంత్య్ర ఉద్యమము క్రొత్తమార్గము పట్టినది. సక్రమమైన ఆందోళనము, ప్రతిఘటనము ప్రారంభమైనవి. ప్రజా నాయకులు ఇండో నేషియాలో జాతీయభావమును రేకెత్తించిరి. ఎన్నియో రాజకీయ సంస్థలు నిర్ణీత కార్యక్రమానుసారము పనిచేయ మొదలు పెట్టినవి. డచ్చివారు జాతీయాందోళనమును నిర్లక్ష్యము చేసిరి. దాని ఫలితముగా 1926 లో జాతీయ విప్లవము జరిగెను. ఈ విప్లవము అణగద్రొక్కబడెను. డచ్చి ప్రభుత్వము ప్రజా నాయకులను బంధించి అనారోగ్యకరమైన పశ్చిమ ఈర్యన్ ద్వీపములో బందీలనుగా ఉంచిరి.
1927 లో ఇండో నేషియా నేషనలిస్టు పార్టీ (P.N.I.) స్థాపింపబడెను. ఈ సంస్థ నేటి అధ్యక్షుడైన డా. సోకర్నో నాయకత్వమున డచ్చి ప్రభుత్వముతో సహకార నిరాకరణము మొదలు పెట్టినది. జను లీ విప్లవనాయకుని, ఆయన సంస్థను సంపూర్ణముగ బలపరిచిరి.
1930 లో సోకర్నో దేశపు శాంతిభద్రతలను భంగము చేయుచున్నాడను నేరముపై బంధింపబడెను. రెండేండ్ల తరువాత అతడు విడుదల చేయబడెను. మరల నిర్బంధింప బడెను. 1933 లో అతనిని ప్లోర్సు దీవులలోను తరువాత సుమత్రాలోను చెఱయందుంచిరి.
ఇంతలో పసిఫిక్ యుద్ధమును, జపాను ఆక్రమణయు వచ్చెను. అవి ఇండోనేషియాకు దుర్దినములు. మూడున్నర సంవత్సరములు జపానువారు దేశమును ఇష్టము వచ్చినట్లు దోపిడిచేసిరి. జనులను నిర్భంధముగా సైన్యములో చేర్చిరి. ధనధాన్యములను బలవంతముగా లాగుకొనిరి. 1944 లో వారికి విరుద్ధముగా తిరుగుబాటు జరిగెను. కాని అది అణచి వేయబడెను.తిరుగుబాటు దారుల నాయకులు క్రూరముగా చంపబడిరి.
1945 వ సం. ఆగస్టు 17 వ తేదీన - జపాను పతనమునకు రెండునాళ్ల తరువాత - ఇండోనేషియా ప్రజల పక్షమున డా. సోకర్నో స్వాతంత్య్రమును ప్రకటించెను. దానితో వారి స్వాతంత్య్ర సమరములో ఒక నూతన ఘట్టము ప్రారంభమైనది.
దేశములోని యువజనమంతయు క్రొత్తగా వచ్చిన స్వాతంత్య్రమును బలపరచుటకు పూనుకొనిరి. జపాను సైనికులను నిరాయుధులను చేసిరి. సైన్యములో చాల భాగము ప్రతిఘటించినది. జపాను పతనము తరువాత కొంతకాలమునకు బ్రిటిషు సైన్యములు లార్డు మౌంట్ బ్యాటన్ ఆధిపత్యమున ఇండోనేషియాలో దిగెను. అప్పటికే అంతరంగికముగా శాంతిభద్రతలు కాపాడగలిగిన ప్రజాప్రభుత్వమును వారు చూచియుండిరి. బ్రిటిషు సైన్యములతో డచ్చి సైన్యాధికారులు కూడ వచ్చిరి, వారు డచ్చి వలసరాజ్యమును పునః ప్రతిష్ఠ చేయుటకు తోడ్పడిరి. స్వాతంత్య్ర ప్రకటన జరిగిన వెంటనే డచ్చి సైనికాధికారులు కాని, సైన్యములు కాని అనుమతి లేనిదే ఇండోనేషియాలో అడుగు పెట్టుటకు స్వతంత్ర ఇండో నేషియా ప్రభుత్వము ఆక్షేపణ తెలియచేసినది. కాని బ్రిటిషు వారు వినిపించుకొనలేదు. పరిస్థితులు అనుదినము విషమించు చుండెను. దేశమంతయు క్రోధముతో ఉడికిపోయినది. బ్రిటిషు సైనికుల దుస్తులలో ఉన్న డచ్చి సైనికులు ఇండోనేషియా సైన్యములను రెచ్చగొట్టిరి. దానితో యుద్ధము ప్రారంభమయ్యెను.
1946 లో లార్డు కెల్లి యరన్ అను బ్రిటిషు మధ్యవర్తి అధ్యక్షతలో ఉభయపక్షముల వారును రాజీకై సమావేశమైరి. తత్ఫలితముగా 1947 లో లింగోడ్జాటి (Linggadjati) ఒడంబడిక కుదిరెను. డచ్చివారు జావా, సుమత్రా, మధురా దీవులపై ఇండోనేషియా రిపబ్లిక్ ప్రభుత్వము వారి అధికారమును గుర్తించిరి. కాని ఈ ఒడంబడిక చిరకాలము ఉండలేదు. జులై 1947 లో డచ్చివారు పోలీసు చర్య పేరుతో రిపబ్లిక్ భూభాగముపై దురాక్రమణ జరిపిరి. ఇంతలో మిత్రరాజ్య సమితి వారి ఒత్తిడి వలన ఉభయపక్షముల వారును యుద్ధ విరమణ జరిపిరి. మిత్రరాజ్యసమితి పక్షమున ఏర్పడిన మధ్యవర్తి సంఘము ప్రయత్నము వలన జనవరి 1948 లో రెన్విల్ ఒడంబడిక కుదిరినది. సంధి సంభాషణములు 'రెన్విల్' అను పేరు గల అమెరికావారి ఓడపై జరిగినవి కనుక ఆ ఒడంబడిక కా పేరు వచ్చెను. కాని డచ్చివారు ఈ ఒడంబడికను కూడ ఉల్లంఘించిరి. 1948 డిసెంబరులో పెద్దయెత్తున యుద్ధము సాగించిరి.ఇండోనేషియా రాజధాని యైన 'జకార్తాను' వశపరచుకొనిరి. రిపబ్లిక్ అధ్యక్షుడైన డా. సోకర్నోను, ఉపాధ్యకుడు మహమ్మద్ హట్టాను, మంత్రులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఇతర నాయకులను బంధించిరి. అయినను యుద్ధము సాగినది. ఇండోనేషియా ప్రజలు డచ్చివారిపై గోరిల్లా యుద్ధము మొదలు పెట్టిరి. మిత్రరాజ్య సమితియు, ప్రపంచములోని ఇంచుమించు అన్ని దేశములును రెన్విల్ సంధిని పాటింపనందులకు డచ్చివారిని తీవ్రముగా ఖండించెను. 1949 జనవరిలో భారత ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ కృషివల్ల క్రొత్త ఢిల్లీలో సమావేశమైన ఆసియా రాజ్యములు డచ్చివారి చర్యలను నిరసించుచు 1950 జనవరి 1వ తేదీలోగా ఇండో నేషియాకు సంపూర్ణ స్వాతంత్య్రము ఇయ్యవలసినదని కోరుచు తీర్మానించిరి.
డచ్చివారు ప్రపంచపు ఒత్తిడివలన విధిలేక 1949 ఆగస్టులో హేగు (హాలెండు) లో ఒక రౌండు టేబిల్ సమావేశమునకు అంగీకరించిరి. ఈ సమావేశ ఉద్దేశము ఇండో నేషియావారికి వారి దేశ పరిపాలనమును అప్పజెప్పు పద్ధతిని చర్చించుటయే. 1949 డిశంబరు 27 వ తేదీన ఇండో నేషియా పరిపాలనాధికారమును హేగ్ లోనే ఇండో నేషియా ప్రతినిధులకు సాధికారికముగా అప్ప జెప్పిరి. ఉపాధ్యక్షుడు డా. హట్టా, ప్రొఫెసరు సుపొమో ఇండోనేషియా ప్రతినిధులుగ ఆ ఉత్సవములో పాల్గొనిరి. ఆనాడే “ఇండో నేషియా సంయుక్త రాష్ట్రముల రిపబ్లిక్ ” అవతరించినది. అదిఒక రాష్ట్రకూటమి (Federation) గా ఏర్పడినది. అందులో ఇదివర కేర్పడిన ఇండో నేషియా రిపబ్లిక్ (జావా, సుమత్రా, మధురా అను ద్వీపములు గలది), మరియు ఇతర ద్వీపములు చేరి ఉండినవి. ఆనాటి నిర్ణయము ప్రకారమే "డచ్చి ఇండొనేషియా సంఘము” ఒకటి ఏర్పడి ఉభయుల స్నేహబంధమునకు చిహ్నముగా హాలెండురాణి ఉండగలదని ఉభయులును అంగీకరించిరి. కాని ఈ "ఫెడరల్ రిపబ్లిక్" చాలకాలము ఉండలేదు. 1950 ఆగస్టు 17 వ తేదీన "ఇండోనేషియా రిపబ్లిక్" ఏక రాజ్యముగా రూపొందినది.
ఇండోనేషియా రాజ్యాంగము (1) భగవంతునియందు విశ్వాసము, (2) జాతీయత, (3) సర్వమానవ సౌభ్రాతృత్వము. (4) సాంఘిక న్యాయము (5) ప్రజాస్వామ్యము అను సూత్రములుగల 'పంచశీల'పై నాధారపడియున్నది. ఈ స్వతంత్ర దేశము మిత్రరాజ్య సమితిలో సభ్యత్వము పొంది ఆసియా రాజ్యములలో పలుకుబడిని సంపాదించు కొనుచున్నది. భారత దేశము, చీనా, బర్మా, మున్నగు ఆసియా రాజ్యములతో మైత్రి సంపాదించుకొన్నది. 1954 ఏప్రిల్ లో జరిగిన కొలంబో సమావేశములో ప్రధాన పాత్ర వహించి వలస రాజ్య విధానమును ఖండించినది. మిత్రరాజ్య సమితిలో పీపుల్స్ చైనా ప్రవేశమును బలపరచినది. ఆ సమావేశములో ఇండో నేషియా ప్రధానియైన ఆలీశాస్త్రో మీ జోజో ఆసియా ఆఫ్రికా రాజ్యముల మహాసభ యొకటి సమావేశపరచవలెనని సూచించెను. ఇండో నేషియాకు రాజధానియైన జకార్తాకు సమీప ములో బాండుంగు అను చోట 29 ఆసియా, ఆఫ్రికా రాజ్యముల మహాసభ 1955 లో జరిగినది. ఆ సమావేశములో ముఖ్య నిర్ణయములు కొన్ని చేయబడినవి.
నూతన రాజ్యాంగము ననుసరించి ఇండో నేషయా 10 రాష్ట్రములుగా విభజింపబడియున్నది. "ప్రతినిధుల సభ" అను పేరు గల ఒకే పార్లమెంటు సభను కలిగియున్నది. కార్యాచరణ శాఖకు సర్వాధికారి అధ్యక్షుడు. ఈ దేశపు రాజ్యాంగ విధానమందు ఒక ఉపాధ్యడుడుకూడ ఉండును. అధ్యక్షుని పేరనే పరిపాలన సాగుచుండును. పార్ల మెంటు సభ్యులచే ఎన్నుకొనబడిన ప్రధానియు, అతని మంత్రిమండలియు పార్లమెంటునకు జవాబుదారీ వహించి పరిపాలనమును జరుపుదురు. ప్రతినిధుల సభలో 225 గురు సభ్యులుందురు.
భాష : ఇండో నేషియా భాష "మరేయో.పోలినేషియన్" భాషా కుటుంబమునకు చెందినది.