Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోచైనా (భూగోళము)

వికీసోర్స్ నుండి

ఇండోచై నా (భూగోళము) 19 వ. శతాబ్దపు ద్వితీయభాగమున ఫ్రెంచి రాజకీయ సైనిక చర్యలవల్ల ఇండియా చైనాల సాంస్కృతిక ప్రభావముగల ప్రదేశముల భిన్న ప్రాంతములను, సంస్కృతులను గలిపి కృత్రిమముగా నేర్పరుపబడిన దేశము ఇండో చైనా. 1950 సం. తరువాతి ఈ దేశపు చరిత్రవలన నిట్టి కృత్రిమ సంయోజనము నందలి నిష్ప్రయోజనత వెల్లడియగును. ఈదేశము భౌగోళికముగా విభిన్నములైన మండలముల యొక్కయు, పోలికలులేని ఆర్థికవ్యవస్థల యొక్కయు, సంపుటి. రాజకీయ సైనిక పదజాలమునందు మాత్రమే అది ఏక దేశముగా గ్రహింపబడును. భౌగోళికముగా నీ దేశము బర్మా - మలయా ద్వీపకల్పము యొక్క చివరి ప్రాంతమని చెప్పదగును.

అన్నాం. కాంబోడియా, లావోస్, టాంగ్ కింగ్, ఫ్రెంచి వలస రాజ్యమయిన కొచ్చిను - చైనా, మరియు ఫ్రెంచి రక్షిత రాజ్యములు కలిసి ఫ్రెంచి ఇండో చైనా లేక ఇండోచైనా ఐక్యరాజ్యసమితి 1899 సం. లో రూపొందినవి. రాజకీయముగా నిది ఫ్రెంచి వలసరాజ్యము. కాని ఈ రాష్ట్రములలో నాలుగు, ఫ్రెంచివారి రక్షణలో నుండినవి. ఈ సమితి 1949 సం. లో అంతమొందినది. వీనిలో కాంబోడియా, లావోస్, వియత్నాం (అనగా కొచ్చిను చైనా, అన్నాం, టాంగ్ కింగ్)లు స్వపరిపాలనాధికారము గలిగి ఫ్రెంచి ఐక్యరాజ్యసమితిలోని అంతర్భాగములుగా గుర్తింపబడినవి. 1950 సం. నుండి ఇవి సంబద్ధ రాష్ట్రములు (Associate States) గా నున్నవి.

ఈ దేశము 8° -30', 23'-25' ఉత్తర అక్షాంశముల మధ్యను; 100°; 109°-20' తూర్పు రేఖాంశముల మధ్యను వ్యాపించియున్నది. ఉత్తరమున చైనా దేశము, తూర్పు ఆగ్నేయముల క్రమముగా టాంగ్ కింగ్ సింధు శాఖయు, చైనా సముద్రమును, పశ్చిమమున సయాము సింధుశాఖయు, థాయిలాండ్ దేశమును, వాయవ్యమున బర్మాదేశమును దీనికి సరిహద్దులు. ఇది దాదాపు 2,85,794 చ. మై. వైశాల్యముకలిగి 2,75, 80,000 జనాభా కలిగియున్నది. దీనిలో 70 -80 శాతము అన్నాం దేశస్థులు కలరు.

మికాంగ్ సాంగ్ కాయ్ అను ముఖ్యనదులును, చైనా దేశపు యున్నాను పర్వత సమూహమునుండి “S” ఆకారమున వ్యాపించిన పర్వత పంక్తులును ఈ దేశమునకు భౌతిక స్వరూపమును సమకూర్చుచున్నవి. ఈ పర్వతములకు పశ్చిమ, దక్షిణములందున్న ప్రదేశము మికాంగ్ నదీమండలము; ఈశాన్యమున నున్న టాంగ్ కింగ్ రాష్ట్రము ఇంచుమించుగా నంతయు సాంగ్ కాయ్ లేక రెడ్ నదీ మండలముచే నావరింపబడినది.. ఈ ప్రాంతమే దేశమున కంతకు మిక్కిలి సారవంతమై అధికమగు జనసమ్మర్దమును కలిగియున్నది. పర్వతమయమయిన లాగ్ సొ, థాట్ కే కెయోబాంగ్, అను చిన్న రాష్ట్రములు, శాస్త్ర దృష్ట్యా సికియాంగ్ నదీ మండలమునకు చెందినవి. చైనాలోని క్వాంగ్ టుంగ్ రాష్ట్రమును ఆనుకొని తూర్పుననున్న చిన్న రాష్ట్రమగు మాంకే పర్వతములకును, సముద్రమునకును మధ్య వ్యాపించియున్నది. దక్షిణమున థానో హో రాష్ట్రము రెడ్ నది యొక్క డెల్టా ప్రాంతమున వ్యాపించియున్నది. రెడ్ నది యున్నాను రాష్ట్రపు పర్వతములలోని తాలిఫూ దగ్గరగా నుద్భవించి, లోతయి, చొరశక్యముగాని సన్నని పర్వతపు లోయలలో ప్రవహించును. కాని టాంగ్ కింగ్ రాష్ట్రమును ప్రవేశించు నప్పటినుండియు ప్రయాణమున కనువుగా నున్నది. మికాంగ్, రెడ్ నదుల డెల్టాలు, ఈ నదులు తెచ్చు ఒండ్రుమట్టితో నేర్పడినవి. ఈమట్టికి మూలకారణమయిన పర్వతములు నల్ల రాతితో కూడినవి. ఈ నల్లరాతి కొండ లకు 'పిస్టు' అను పలక రాయి ఆధారము. టాంగ్ కింగ్ లో ఉత్తర దక్షిణ ప్రాంతముల నీరాళ్ళపై నీ చలువరాళ్ళును, స్ఫటికత్వము నొందిన తక్కిన సున్నపురాళ్ళును, పొరలుగా వ్యాపించియున్నవి. వీటిపైన కార్బానిఫరసు యుగము నకు చెందిన రాళ్ళదొంతరలు కలవు. రెడ్ నది యొక్క ఎగువలోయలో యెన్, హైడువాంగ్ ల మధ్య శ్రేష్ఠ మైన బొగ్గుగనులున్నవి. మీకాంగ్ నదీలోయలలో సున్నపు రాయి దొరకును. ఈ సున్నపురాళ్ళు కార్బానిఫరను యుగమునకు చెందియుండవచ్చును. లాకోనునకు దక్షిణ మున వ్యాపించిన రాళ్ళు ట్రయాసిక్ యుగమునకు చెందినవి. ఈ ప్రాంతమున కొన్ని జిల్లాలలో బంగారము లభించును.

వేడిని, తేమను కలిగిన ఈ దేశపు శీతోష్ణస్థితి ఉష్ణ మండలమునకు చెందినట్టిది. ఉత్తర దక్షిణ భాగముల మధ్య ఉష్ణోగ్రతలలోను, నాయుమండల స్థితులలోను మిక్కిలి తేడాలు కనిపించును. కొచ్చిను చైనా, కాంబో డియా రాష్ట్రములలో ఋతువులు, ఋతు పవనముల కను గుణముగా నుండును. ఈశాన్య ఋతుపవనములు అక్టోబరు 15 వ తారీఖునుండి ఏప్రిలు 15 వ తారీఖువరకు వీచును. ఉష్ణోగ్రత 80.6° నుండి 84.2° వరకు పెరుగును. ఏప్రిలు మే నెలలు మిక్కిలి వేడిగానుండు మాసములు. ఈ నెలలో ఉష్ణము 86° లకు, 93.2° లకు మధ్యనుండును.

అన్నాం రాష్ట్రపు శీతోష్ణస్థితి అంతగా క్రమబద్ధముగా నుండదు. సెప్టెంబరు నెలలో సముద్రముపైనుండి వీచు ఈశాన్య ఋతుపవనములు వర్షమునిచ్చును. ఇదియే తుఫానులు వీచు నెల. ఇప్పటిగాలులు ఉష్ణోగ్రతను 59° వరకు తగ్గించును. పశ్చిమమున ఎత్తుననున్న లావోస్ రాష్ట్రము చల్లగాను, పొడిగాను ఉండును. లోతైన లోయలు, ఎత్తైన పర్వతములు ఈ రాష్ట్రము యొక్క శీతోష్ణస్థితిలోని మార్పులకు కారణములగుచున్నవి.

సాగుచేయబడుచున్న ప్రాంతములలో పూర్వము సమృద్ధిగానున్న అడవిజంతువులు ఈనాడు పర్వత ప్రాంతములకు తరలిపోయినవి. ఈ అడవి జంతువులలో ముఖ్యమయినవి గుంపులుగా తిరుగు ఏనుగులు, పెద్ద పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, కోతులు, ఎలుకలు, మస్టు, పామ్ అను ఎలుకలు మెట్టభూములలో కాననగును. పర్వతప్రాంతములలో చిరుతపులులు, ఆడవిపందులు. దుప్పులు నివసించును. అడవి ఎనుములు, లావోస్ రాష్ట్రములో సామాన్యముగా తిరుగుచుండును. పెంపుడు ఎనుములుకూడ ముఖ్యస్థానము వహించియున్నవి. వీటి సంఖ్య సుమారు 14 లక్షలు ఉండును. 'లేబూ' అను ఎద్దులు సరకులు మోయుట కుపయోగించును. అడవికోళ్ళు, నెమిళ్ళు, రకరకముల బాతులు మొదలగు పక్షి సంత తులు చిట్టడవులలోను, బురద నేలలలోను నివసించును. వివిధ సరీసృ సములు కూడ కలవు. ఇవి ఆహారముగా కూడ నుపయోగపడును. జెర్రీ చేపలు టాంగ్ల్కింగ్ రాష్ట్రము నందలి నదులలో పెరుగును. అన్ని రకముల దోమలు, చీమలు, జలగలు సామాన్యముగా కనబడును. టాంగ్ కింగ్ రాష్ట్రమునందు పట్టుపురుగులు సహజముగానే పెంపొం దును. వీటికి కావలసిన మల్బరివృక్షములు వేలకొలది ఎకరములలో పెంచబడుచున్నవి.

ఈ దేశమున ఉష్ణమండలమునకు సహజమగు వృక్ష జాలముకలదు. ఈ మండలమునకు చెందిన అన్ని చెట్లును ఇచ్చట పెరుగును. ఇండ్లు కట్టుటకును, ఇంకను పెక్కు పనులకును, వెదురు చాల ఉపయోగింపబడును, రబ్బరు కూడ దొరకును.

ప్రాచ్యవ్యవసాయమునకు సంప్రదాయ సిద్ధమైన సహాయసస్యములన్నియు ఈ దేశమునం దేదో యొక స్థానిక పరిసరమున కనబడుచునేయుండును. ఇండ్ల ఎదుట దొడ్లలోను, పల్ల పుప్రాంతములం దక్కడక్కడ పొలముల లోను ప్రాచ్యదేశముల కనునగు ఫలవృక్షములను పెంచు దురు. స్థానిక శీతోష్ణప్రమాణముల కనుగుణముగా కొన్ని వృక్షములు అక్కడక్కడ కేంద్రీకృతమైయున్నవి. లిచి వృక్షములు దక్షిణమునకంటే ఉత్తరముననే ఎక్కువగా పెంచబడును. కాని కొబ్బరిచెట్లు మాత్రము అన్నాంలో తురానునకు దక్షిణముగానున్న సముద్రతీరమునకు మధ్య భాగమున పెరుగును. ఇండోచైనా అంతట వరి ముఖ్య మగు పంట.

1952 సం. లో 1 కోటి 26 లక్షల ఎకరములలో పరి పంటయు, 13 లక్షల ఎకరములలో మొక్కజొన్న పంటయు పండినవి. ముఖ్యముగా అరటి, పనస, దబ్బపండ్లు లక్షలకొలది ఎకరములలో పండించేదరు. ఇవికాక పల్లపు భూములయందును, కొలదిగా మెట్టభూములందును చెరకు, పెండలము, మిరియము, తమలపాకు, సుగంధ ద్రవ్యములు, నువ్వులు, ప్రత్తి, మల్బరి వృక్షములు, రకరకముల కూరగాయలు పండింపబడును. మల్బరి వృక్షములు తరచుగా పల్లపుభూములకును, మెట్టభూములకును సరిహద్దులయందు చిన్న చిన్న గుట్టలమీద పెంచబడును.

ఇండోచైనాలో పశుపోషణము అభివృద్ధి చెందలేదు. 40 లక్షల పందులు పెంచబడుచున్నవి. గంగి రెద్దు జాతికి చెందిన ఒక జాతి జంతువును బండ్లు లాగుట కుపయోగింతురు. టాంగ్ కింగ్ డెల్టాయందును, అన్నాంనందును, జంతువులను పెంచుటకు తగినంత స్థలము గాని, పరిస్థితులు గాని లేవు. కానీ కాంబోడియాలో పశుసంపద ఎక్కువగా కనిపించును. ఈ రాష్ట్రమునందు పట్టణములలో బండ్లు లాగుటకును, ఉత్తరమునమన్న పర్వత ప్రాంతములలో బరువులు మోయుటకును, జంతువుల నుపయోగింతురు. పల్లపు వ్యవసాయము జరుగు ప్రాంతములుతప్ప మిగిలిన దేశమందు అటవీసంపద విరివిగానున్నది. వెదురు. కంప, బొగ్గు, అక్క, అడవిపండ్లు మొదలగు అటవీ సంపద లభ్యమగును.

ఈ దేశమున 19 వ శతాబ్దపు అంత్యదశలో పరిశ్రమలు ప్రారంభింపబడినవి. టాంగ్ కింగ్ డెల్టా కుత్తరముగా సముద్రతీరమున దొరకు ఆంధ్రసైటు బొగ్గును త్రవ్వుట ముఖ్యమయిన పరిశ్రమ. 1950 సం. న త్రవ్వబడిన బొగ్గు 8 లక్షల టన్నులు. తగరము, సీసము, తుత్తునాగము, టంగ్ స్టను, మాంగనీసు, క్రోమియము, ఆంటిమొనీ, ఇనుము, బంగారము, బాక్సయిటు, గ్రాఫయిటు, ఫాస్ఫే టులుకూడ లభించును. ఈ ఖనిజసంపద దేశమందంతట చెదరియున్నను, టాంగ్ కింగ్ పీఠభూములలో ఖనిజములు కేంద్రీకృతములయినవని చెప్పనగును. ఈ ఖనిజముల ఉత్పత్తి అస్థిరమై ప్రతి సంవత్సరము మారుచుండును.

ప్రజల అనాగరికతవలన తక్కిన పరిశ్రమలు నెమ్మదిగా అభివృద్ధి చెందుచున్నవి. 2లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి చేయబడు సిమెంటుపరిశ్రమ ముఖ్యమయినది. చిన్న పడవలు, రసాయన పదార్థములు, గాజు, రంగులు, సబ్బు, అగ్గి పెట్టెలు, కాగితములు, వస్త్రములు, రబ్బరు వస్తువులు తయారుచేయు ఫాక్టరీలు, హనాయ్, హైఫాంగ్, హ్యూ, తురాన్, సై గాను మొదలగు పట్టణములందు కలవు. మొత్తముమీద టాంగ్ కింగ్ నందు వస్తువులలో నెక్కువ భాగము తయారగుచున్నది. బొగ్గు చే నడుపబడు విద్యుత్తు నుత్పత్తిచేయు యంత్రములు పెద్దపెట్టణములలో నెలకొల్పబడినవి. కర్మాగారములు చాలవరకు ఫ్రెంచి యాజమాన్యముక్రింద నున్నవి. స్వదేశస్థులు స్వయముగా కార్ఖానాలు స్థాపించుటకు ఈ మధ్యనే మొదలు పెట్టిరి.

పంచదార, పొగాకు, వనస్పతి నూనెలు, రబ్బరు, లక్క, చర్మములు మొదలగు వాటిని పదునుచేయు ఫాక్టరీలు కలవు. కలప కార్ఖానాలు దేశమందు చెదరి యున్నవి. ఇవి అంత ముఖ్యమయినవి కావు.

ఇండోచైనాలో పరిశ్రమలు ఎక్కువగా ఫ్రెంచి పెట్టుబడిపై నాధారపడియున్నవి. ధనాదాయము కలిగించు వస్తువుల నుత్పత్తి చేయుట దేశీయులయందు నెమ్మదిగా వృద్ధిచెందుచున్నది.

ఇండోచైనాకు అధికమగు నిదేశ వ్యాపారము కలదు. 1953 సం. లో 1,34,267 మిలియను ఫ్రాంకుల విలువ కలిగిన 10,08, 400 టన్నుల సరకులు దిగుమతి చేయబడినవి. దిగుమతులలో ముఖ్యమైనవి పాలడబ్బాలు, గోదుమపిండి, పంచదార, పెట్రోలియంనుండి తయారగు వస్తువులు, కాగితములు, రాసాయనిక పదార్థములు, వ్యవసాయ యంత్రములు, విద్యుత్ పరికరములు, మోటారు కార్లు, వాటి విడిభాగములు. ఆ సంవత్సరములోనే 34,575 మిలియను ఫ్రాంకుల విలువ కలిగిన 7,09,000 టన్నుల సరకుల ఎగుమతి చేయబడినవి.

ఎగుమతులలో ముఖ్యమయినవి ధాన్యము, మొక్కజొన్న, ముడిరబ్బరు, ఎండబెట్టిన కూరగాయలు, చర్మములు, చేపలు, మిరియాలు, సిమెంటు, 'టీ' మొదలైనవి.

కె.వి. రె