Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోచైనా (చరిత్ర)

వికీసోర్స్ నుండి

ఇండోచైనా (చరిత్ర) పేరునుబట్టియే ఇండోచైనా, ఇండియా-చైనా దేశాల సంస్కృతుల సంగమ ప్రదేశమని తెలియుచున్నది. ఈ రెండు పొరుగు దేశాలనుండి ఇండో చైనా చాల ప్రాచీన కాలములోనే కళలు, పరిశ్రమలు, సంస్కృతి గ్రహించినది. చైనీస్ పగోడాలు, హిందువుల దేవాలయాలు తరచుగా ఒకేచోట ఈ దేశములో కనిపించును. వియత్ నాం రిపబ్లిక్, కంబోడియా, లావోస్ అనెడు రాజ్యాలకూటమి ఇండోచైనా,

క్రీ.పూ. 214లో చైనావారు అన్నాం రాజ్యమును జయించినారు. అన్నాం ఈనాడు వియత్నాం రిపబ్లిక్ లో ఒక భాగము. ఇది ఉత్తరాన చైనా సరిహద్దున ఉన్నది. క్రీ. శ. 10వ శతాబ్దమువరకు చైనావారి అధీనములోనే ఉండెను. అన్నా మీయుల భాష, ఆచార సంప్రదాయాలు, భవన నిర్మాణకళ, రాజలాంఛనాలు అన్నియు చైనావారి భాషవలన, ఆచారాదులవలన ప్రభావితములైనవి. 10 వ శతాబ్దములో 'లే' వంశపువారు అన్నాం రాజ్యములో ఒక భాగమును జయించి స్వతంత్ర రాజ్యస్థాపన చేసినారు. 15 వ శతాబ్దము అన్నాం చరిత్రలో ముఖ్యఘట్టము. అప్పుడు దేశము అన్ని విధముల అభివృద్ధి చెందినది. 1542 లో 'లే' వంశమువారి రాజ్యము విభక్తమైపోయినది. దక్షిణ అన్నాం, కోచిన్ చైనాలలో వేరురాజ్యాలు ఏర్పడినవి. 1789 లో గై లాంగ్ అనునతడు 'లే' వంశమును అంత మొందించి‘హ్యూ' అను పట్టణము రాజధానిగా అన్నాం అంతటిని పరిపాలించ ప్రారంభించినాడు. గైలాంగ్ చక్రవర్తి మనుమడు “టక్ డక్ " అనునతడు.

కంబోడియా దేశముకూడ చాల ఉన్నతమైన నాగరికత గలది. ఈనాటికిని శిథిలాలుగా నిలచి ఉన్న అక్కడి భవనాలు కంబోడియావారి ప్రాచీన ఉన్నతిని చాటు చున్నవి. 'అంకోర్ ' అను పట్టణములోని దేవాలయ శిల్పాలు విశ్వవిఖ్యాతములు. సుమారు వేయిసంవత్సరాల క్రితము ఈ దేవాలయ నిర్మాణము జరిగినది. అక్కడి శిల్పాలు భారతీయ శిల్పాలతో చాల దగ్గరి పోలిక కలిగి ఉన్నవి. అవి‘భ్మేరు జాతి అను పేరుగల ఒక జాతి మత, చరిత్ర లకు సంబంధించినవి. ఈ 'ఖ్మేరు' జాతి ఒకప్పుడీ దేశమును పరిపాలించి పటిష్ఠ సామ్రాజ్యము నెలకొల్పినది. సయాం రాజులుకూడ కంబోడియా రాజులకు కప్పము కట్టెడి వారట. 18వ శతాబ్దము చివరిభాగములో సయామీయులు కంబోడియాలో కొంతభాగము ఆక్రమించుకొన్నారు.

ఐరోపియనులు ఇండోచైనాలో ప్రవేశించువరకు ఈ ప్రకారము వివిధప్రాంతాలలో రాజ్యాలు వెలసి ఉండేడివి.కంబోడియాలో 'ఖ్మేరు' సామ్రాజ్యము, చంపారాజ్యము, అన్నాంరాజ్యము ఉన్నతి, పతనాలు చెందినవి. 16 వ. శతాబ్దములో ఐరోపియను లిక్కడ ప్రవేశించినారు. 19 వ. శతాబ్దములో వలస రాజ్యస్థాపనకై జరిగిన పరుగు పందెములలో ఇండోచై నా ఫ్రాన్సుకు దక్కినది. ఫ్రెంచి వారు మొట్టమొదట కోచిన్ చైనాను వలసప్రాంతముగా జయించినారు. కోచిన్ చైనా సముద్రతీర రాజ్యము. ఆ తరువాత కంబోడియా, అన్నాం, టాంకింగ్ రాజ్యాలపై అధికారమును సంపాదించినారు. అన్నాం రాజైన గై లాంగ్ కాలములో కోచిన్ చైనా మతాధికారి ఒకడు ఫ్రాన్సురాజైన 14వ లూయీతో స్నేహముచేసికొని చైనా వారి ప్రమాదమునుండి తప్పించుకొనుట మంచిదని సలహా ఇచ్చినాడు. 1687 లో 14 వ లూయీకిని, గై లాంగ్కో మారునకును వర్సైల్సు సంధి జరిగినది. ఫ్రాన్సుకు టొ రేన్ అఖాతప్రాంతము, మరికొన్ని ద్వీపాలు లభించినవి. అన్నాం రాజధానియైన హ్యూలో ఫ్రెంచి సైన్యాలు నిలచినవి. గై లాంగ్ మనుమడు 'టక్ డక్' అనువాడు 'ఫ్రెంచివారి యేడ ద్వేషముపూని వారిని తరిమి వేయవలెనని చూచినాడు. 1847 నుండి ఉభయులకు ఘర్షణ ప్రారంభమైనది, టక్ డక్ ఓడిపోయినాడు. మెకాంగ్ నది డెల్టాలోని నాల్గు రాష్ట్రాలు ఫ్రెంచివారి అధీనమైనవి. 1873 లో ఫ్రెంచివారు “హానోయ్" ని జయించినారు. త్వరలో ఎఱ్ఱనది డెల్టా అంతయు ఆక్రమించుకొన్నారు. 1885 లో చైనాలో సంధిచేసికొని దక్షిణ చైనాతో వ్యాపారము చేసెడు హక్కు పొందినారు. ఈలోగా అన్నామీయులు తిరుగుబాటులు జరుపుచునే వచ్చినారు. ఫ్రెంచివారికి నిరంతరము ఈ తిరుగుబాట్లను అణచవలసి వచ్చుచుండెను.

ఫ్రెంచివారు ఇండో చైనాను క్రమముగా జయించి స్వాధీనపరచుకొనుట అంత సులభముగా జరుగలేదు. ఇండో చైనా ఒక పెద్ద దేశము. దానికి ఇరుగు పొరుగుల స్వజాతి, వేషభాషలలో పోలికగలిగి, వారియెడ సానుభూతి కలిగిన సయాం, చైనీయులవంటి దేశీయులున్నారు. వారందరు ఫ్రెంచివారిని ఏవగించుకొనెడువారే. అంతేకాక కోట్లకొలది జనసంఖ్యగల చైనావంటి ఒక గొప్ప దేశపు సహాయసానుభూతులు ఇండో చైనాకు ఉన్నవి. ఉభయదేశాల సరిహద్దులు కలిసి ఉన్నవి. ఇట్టి పరిస్థితులలో ఫ్రెంచివారు ఈ దేశమును వశపరచుకోదలచుట జరిగినది. 1887 లో నాల్గు రాజ్యములను (అన్నాం, టాంకింగ్, కంబోడియా, కోచిన్ చైనా) కలిపి ఇండో చైనా సంయుక్త రాజ్యము ఏర్పరిచినారు. ఒక గవర్నర్ జనరల్ నియమింప బడినాడు. 1893లో లావోస్ చేరికతో ఇండోచైనా పై ఫ్రెంచి అధికారము సంపూర్ణమైనది.

రెండవ ప్రపంచ యుద్ధ కాలములో ఇండోచై నాలో 1940 లొ జపాన్ వారు ప్రవేశించినారు. ఫ్రెంచివారికి జపాను ప్రవేశము సహించక తప్పినది కాదు అమెరికా యుద్ధ ప్రకటన చేయుటతో జపొను వారు ఇండో చైనాలో బలాలను "పెంచినారు. ఫ్రెంచి అధికారులందరు తరిమి వేయబడినారు. ఈ యుద్ధకాలములో అన్నామీయులు స్వాతంత్య్రము కోరి నారు. యుద్ధము ముగియక పూర్వమే ఫ్రెంచి ప్రభుత్వము, ఫ్రెంచి యూనియన్ లో ఒక భాగముగా ఇండోచైనా రాజ్యకూటమి ఏర్పాటును ప్రకటించినది. 1945 లో యుద్ధము తరువాత అన్నాం, టాంకిన్ కలసి “వియత్ నామ్" పేరుతో రిపబ్లిక్ అయినది. పార్ల మెంటరీ ఎన్నికలు జరిగినవి. జాతీయసభ ఎన్నుకోబడినది. హోచిమిన్(Hochi Minh) నూతన రిపబ్లిక్ అధ్యక్షుడై నాడు. ఇతడు కమ్యూనిజములో సుశిక్షితుడు - కోచిన్ చైనా 'వియత్ నామ్' రిపబ్లిక్ లో చేరవలెనని పట్టుబట్టినాడు. కాని సముద్రతీర రాజ్యమైన కోచిన్ చైనా ఫ్రెంచివారికి కీలక ప్రదేశము. ఫ్రాన్సు నిరాకరించినది. "వియత్ నామ్” ఫ్రెంచివారిపై యుద్ధము ప్రకటించినది. లావోస్, కంబోడియా రాజ్యాలు పూర్వము ప్రకటింపబడ్డ ఫ్రెంచి యూనియన్ లో చేరుటకు అంగీకరించినవి. కాని వియత్ నామ్ యుద్ధము సాగించినది. హోచిమన్, వియత్ నామ్ జాతీయవాదులకు నాయకుడు.

1948 లో వియత్ నామ్ స్వాతంత్ర్యమును ఫ్రాన్సు ఒక షరతుపై అంగీకరించినది. అన్నాం రాజైన బావుదాయి (Bao dai) ని దేశాధ్యక్షునిగా అంగీకరించవలెనన్నది. హోచీమిన్ పోటీ ప్రభుత్వమును నెలకొల్పినాడు. అతని సైన్యాలు బావురాయి ప్రభుత్వమునకు విరుద్ధముగా గ్వెరిల్లాయుద్ధము సాగించినవి. 1949 లో కోచిన్ చైనా వియత్ నామ్లో చేరుటకు ఫ్రాన్సు అంగీకరించినది. విదేశ వ్యవహారాలు, సైనిక విషయాలలో తప్ప వియత్ నామ్కు స్వపరిపాలనాధికారము ఇచ్చినారు. బావుదాయిని చక్ర వర్తి అన్నారు. 1948 లో ఈనూతన రాజ్యమును రూపొం దించినారు. అతడు ప్రధానమంత్రిని, మంత్రిమండలిని నియమించును. ఎన్నికయైన శాసనసభ ఏదీ ఉండదు. లావోస్, కంబోడియాలు ఫ్రెంచియూనియన్ లో స్వతంత్ర రాజ్యాలుగా ఉండునట్లు ప్రకటించినారు.

ఇండోచైనాలో అంతర్యుద్ధము సాగుచునే వచ్చినది. ఈ యుద్ధము "వియత్ మిస్" సంస్థ పఠన సాగినది. “వియత్ మిన్” విప్లవసంస్థల కూటమి. ఈ సంస్థ జపాన్, ఇండోచైనాను ఆక్రమించిన కాలములోనే ఏర్పడినది. ఇందు సోషలిస్టులు, క్యాథలిక్కులు, స్వతంత్ర జాతీయ వాదులు ఉన్నారు. కాని కమ్యూనిస్టు కార్మిక వర్గమునకే దీనిలో ప్రాబల్యము. 1950 లో హోచిమిన్ ప్రభుత్వమును రష్యా, మరియు ఇతర కమ్యూనిస్టు దేశాలు గుర్తించినవి. అమెరికాయును, పాశ్చాత్య రాజ్యాలును "వియత్ నామ్” "లావోస్” “కంబోడియా" రాజ్యాలను గుర్తించినవి. అమెరికాసంయు క్త రాష్ట్రాలు వీరికి ఆర్థిక, సై నీక సహాయము కూడ చేయుటకు సమ్మతించినది. అంతర్యుద్ధము తీవ్ర రూపము ధరించినది. కొరియా యుద్ధము ముగిసిన తరువాత 1952 నుండి చీనా సహాయము వియత్ మిన్ గ్వెరిల్లాలకు విశేషముగా రహస్యముగా దొరికినది. నియతి మిన్ సైన్యాలకు విజయపరంపర లభించినది. 1954 లో ఎఱ్ఱనదీడెల్టా వారి హస్తగతమైనది. ఆ తరువాత “డియన్ బిజన్ పూ" నగరమును చుట్టు ముట్టినారు. బైటినుండి ఏవిధమైన సహాయము రాకుండ చేసినారు.

విమానాలద్వారా కూడ ఆహార పదార్థాలందకుండ ఫ్రెంచి విమానాలను పడగొట్టినారు. ఫ్రెంచి సైన్యాలు నశించుట ప్రారంభించినవి. చచ్చిన సైనికుల శవాలను కూడ బై టపారవేయుటకు వీలు లేకపోయినది. చివరకు ఫ్రెంచివారు కోటను వియత్ మిన్ సేనల స్వాధీనము చేసి ఆయుధ విసర్జనచేసినారు.

ఫ్రెంచివారు తమ నిస్సహాయతను గుర్తించినారు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇతర ఆసియా రాజ్యాల ప్రధానులు, యుద్ధము విరమించుటకు విజ్ఞప్తులు పలుమార్లు చేసినారు. కమ్యూనిస్టులు జెనివాలో సంధి కార్యాలోచన జరుపుటకు సమావేళ మేర్పాటు చేయుమని కోరినారు. ఫ్రెంచివారు వెంటనే అంగీకరించినారు. అదియే ప్రసిద్ధమైన జెనివా ఒడంబడిక - 21 జూలై 1954 నా డీ ఒడంబడిక రూపొందినది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సు, వియత్ మిన్, వియత్నామ్, లావోస్, కంబో ఉయాల ప్రతినిధు లిందు పాల్గొన్నారు. ఈ ఒడంబడిక ప్రకారము 17వ ఉత్తర అక్షాంశము యుద్ధవిరమణ హద్దుగా ఏర్పరచినారు. దీనికి ఉత్తరభాగము వియత్ మిన్ వారి చేతిలోను, దక్షిణభాగము వియత్ నావ్వారి అధీన ములోను ఉండగలదు. వీలైనంత త్వరలో ఉభయవర్గాల సై న్యాలు యుద్ధ విరమణ రేఖ (17°)కు దూరముగా తను సైన్యాలను తరలించవలెను. 1956 లో ఇండో చైనా అంతటను జనరల్ ఎన్నికలు జరిపి, ప్రజాభిప్రాయము ప్రకారము వియత్మిన్ పాలిత భాగమో, వియత్ నామ్, కంబోడియా, లావోస్ స్వతంత్ర రాష్ట్రాలో రూపొందింప బడవలెను. ఉభయవర్గాలవారు యుద్ధవిరమణ ఒడంబడి కను పాటించునట్లుచూచుటకై "అంతర్జాతీయ పర్యవేక్షక సంఘము" ఒకటి నియమింపబడెను.

జెనీవా ఒడంబడిక తరువాత 1955 లో చక్రవర్తి బావుదాయిని గద్దె దింపి వియత్ నావ్వారు తమ రాజ్య మును మరల రిపబ్లిక్ గా ప్రకటించినారు. కంబోడియా రాజుకు 1953 లో సంపూర్ణ రాజ్యాధికారము ఇచ్చినారు, లావోస్ సంపూర్ణ స్వాతంత్య్రమునుకూడ అదే సంవత్సరము గుర్తించినారు.

భాష  : ఇండోచైనాలో అనామీ, థై, ఫ్రెంచి భాషలు వాడుకలో ఉన్నవి. అధిక సంఖ్యాకులు అనామీ భాషీయులే. ఈ భాషలన్నియు “ఇండో-చైనీస్" భాషావర్గములోనివే. అనామి భాష ధ్వనిప్రధానమైనది; చైనాభాషనే పోలి ఉండును. 300 ఏండ్ల క్రితము పోర్చుగీసు మతప్రచారకులు ఒక క్రొత్త లిపిని ప్రచారములోనికి తెచ్చినారు. ఇది "లాటిన్" లిపిని పోలి ఉండును. కాని అనామీవారు చాలమట్టుకు చైనాభాషనుండి గ్రహింపబడ్డ సులభమైన అక్షరాల లోనే వ్రానెదరు. ఆ లిపికి "చూ-నే" అని పేరు. ప్రభుత్వ పత్రవ్యవహారాలలో ఈ లిపినే ఉపయోగించెదరు.

థై భాష ఎక్కువగా లావోస్ లో వాడుదురు. ఇది బర్మీసును పోలిఉండును. దానికి "లావ్ పాంగ్ కావ్" అనిపేరు. లిపి సయామీ లిపిని పోలి ఉండును.