Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆహారము - విహారము

వికీసోర్స్ నుండి

ఆహారము - విహారము  : అహ్రియత ఇత్యాహారః - సేవింపబడుచున్నది గాన ఆహారము అని చెప్పబడును. అనగా అన్నము అని ముఖ్యార్థము. పానములను, వాయుభక్షణమును గూడ ఈ పదముచే గ్రహించుట కవకాశముండును 'వాతాంబుపర్ణాశ నాః' అనిగూడ ప్రతీతి యున్నది. కనుక ఆహార శబ్దముచే అన్నము - పానము - వాయు సేవనము మొదలగునని విమర్శింపబడును.

అన్నమును గూర్చి ఉపనిషత్తులు చాలా యెక్కువగ కీర్తించినవి. బ్రహ్మపదార్థము గూడ నిదియగునా యను నంతవరకు విమర్శనము జరిగినది. 'అన్నం బ్రహ్మేతి వ్యజానాత్' ప్రాణులకు ప్రాణరక్షణ నిమిత్తము అన్నమే ముఖ్యమని 'అన్నగ్ంహి భూతానాం శ్రేష్ఠం' అను వాక్యము చెప్పుచున్నది. అన్నములో నుండియే జీవులు పుట్టుచున్నారని ‘అన్నాద్భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్థ స్తే! అద్య తేఽత్తిచభూతాని - తస్మాదన్నం తదుచ్యత ఇతి' అను వాక్యముల వలనను 'పురుషోన్నర సమయః ' అను వాక్యమువలనను, 'ఓషధీ భ్యోన్నం - అన్నాత్పురుషః' అను వాక్యముల వలనను తెలియుచున్నది. వీటి నన్నిటిని పురస్కరించుకొనియే శ్రీచరకముని 'రసజం పురుషం విద్యాత్ రసం రక్షేత్ప్రయత్నతః' యని పురుషుడు ఆహార రసమువల్ల కలుగుచున్నాడనియును కనుక ఆహార రసమును జాగ్రత్తగాకాపాడవలయుననియు చెప్పియుండెను.

ఆహారమును సేవించు విధానముగూడ చాల పవిత్రమైన కార్యమని వేదములు చెప్పుచు, దీనిని ప్రాణాగ్ని హోత్రమని నుడివియున్నవి. అగ్నిహోత్రమును ఉదయ సాయంకాలములయందు మాత్రమే ఆహుతులిచ్చి ఉపానించినట్లు ఆహారమును రెండు పర్యాయములే సేవింప వలయును. ఆహారముననుగూడ నియమము 'సాయం ప్రాతర్మనుష్యాణాం, అశనం విధినిర్మితం అంతరానై వ బొక్తవ్యం, అగ్నిహోత్ర సమోవిధిః' అను వాక్యము చెప్పుచున్నది.

ఆహార విహారముల మీదనే ఆరోగ్యము ఆధారపడి యున్నందున ఆహారమును సేవించునపుడు దానికి కొన్ని నియమము లుపదేశింపబడినవి. యథాకాలముగ, యథా సాత్మ్యముగ, మాత్రాపూర్వకముగ, శుచిగ, సంతుష్టుడే, ఇష్టజనులతో గూడి, ఏకాంతస్థలమున, తనయందు భక్తి గలవారిచే తేబడిన, భగవన్ని వేదితమైన, యాహారమును, పరిమాణమును గుర్తెరిగి భుజించవలెను. ఇది ఆరోగ్యమునకు మూలమగును.

ఆహారమునకు కాలము : మలమూత్రములు విసర్జింపబడి హృదయము నిర్మలముగనుండి, వాత, పిత్త, శ్లేష్మములు తమ మార్గములయందు సంచరించుచు, ఉద్గారము (తేనుపు) దోషరహితముగనుండి, ఆకలి దెలియుచు, అపానవాయువు సమముగ వర్తించుచు, జఠరాగ్ని దీప్తి గలిగి, ఇంద్రియములు ప్రసన్నములై, దేహము చాల చులకనగ నుండునపుడు ఆహారమును సేవింపవలయును. ఇది విధినియమితమైన కాలము. (వాగ్భట సూ-అధ్యాయ 8)

ఆహారసాత్మ్యము  : సాత్మ్యమనగా అభ్యాసము. ఇది రెండు విధములు. దేశసాత్మ్యము - ఓకసాత్మ్యము. దేశసాత్మ్యమనగా దేశము మొత్తముమీదనుండు అభ్యాసము. ఉదా : వరిధాన్యముల నుపయోగించు దేశము, గోదుమల నుపయోగించునది - మొదలగునవి. ఒక సాత్మ్య మనగా నొక్కొక్క శరీరమునకుగల యభ్యాసము. కనుక ఈ సాత్మ్యముల ననుసరించి ఆహారపదార్ధము లుండవలెను. గోదుమలను సేవించువానికి శాలిధాన్యము, శాలి తిను వానికి గోదుమలు అంత ఆరోగ్య హేతుకములు కాజాలవు. కనుక యథాసాత్మ్యముగ నుండవలయును.

మాత్రాపూర్వకముగ భుజించుట : మాత్రయనగ పరిమాణము. పరిమాణము శరీర భేదమునుబట్టియు, వ్యాయా మాది భేదములను బట్టియు మారుచుండును. ఎంత పరిమాణమును సేవించినచో సులభముగా జీర్ణమై రెండవ యాహర కాలమున తిరిగి భుజించుట కవరోధము కలుగదో యది సమమైన మాత్ర. గురుద్రవ్యములను అర్థ తృప్తిగను, లఘుద్రవ్యములను నాతితృప్తిగను భుజింప వలయును.

శుచిగ భుజించుట  : శుచియనగా నిర్మలత్వము. ఇది యేకాలమునందైనను, ఏతెగవారికైనను, ముఖ్యమైన యంశమని నిర్వివాదముగ నందరు నంగీకరించిన విషయము. శౌచము రెండు విధములు. కాయికము, మానసికము. కాయిక శౌచము స్నానముచేతను, దౌత వస్త్రధారణాదులచేతను, అస్పృశ్యన్పర్శనము లేకుండుటచేతను, లభించును. మానసిక శౌచము, సచ్ఛీలము, దైవభక్తి, రజస్తమస్సులచే గలుగు రాగ ద్వేషాది యరిషడ్వర్గములచే కలుగు దోషములకు దూరముగ నుండుటవలన కలుగును. కనుక ఈరీతిగ నుభయవిధముల శుచిత్వము గలవాడై యాహారమును సేవించ వలయును.

సంతుష్టుడుగ - ఇష్టజన పరివృతుడుగ భుజించిన యాహారము ధాతుపోషణకు ఎక్కు వగ సహాయపడును.

వివిక్త స్థలమున భుజించుటచే ఇప్పటి నాగరకతవలన మఱచిపోయినను ప్రాచీనులచే ముఖ్యముగ నంగీకరింపబడిన దృష్టిదోషాదిబాధలు లేకుండును. భగవన్ని వేదితమైన పదార్థము సాత్వికమై సత్త్వమును వృద్ధిచేయును. దీనియం దుండు మహిమనుగూర్చి భారతీయులకు నెక్కుడుగ వర్ణింపనక్కరలేదు.

పరిమాణమును గుర్తెరిగి భుజించుటయన : అన్నముచే కుక్షిలో సగము భాగమును నింపి, జలముతో మూడవ భాగమును పూరించి, నాల్గవభాగమును వాయుసంచారమునకు వదలవలయునని శాస్త్రము చెప్పుచున్నది. కనుక కుక్షి పరిమాణమును గుర్తించి భక్షించ వలయును.

ఆహారమును సేవించునపుడు మధురముగ-స్నిగ్ధముగ-సాంద్రముగ - గురువుగనుండు పదార్థములను ప్రారంభము నను, మధ్యభాగములో ఆమ్ల లవణరస పదార్థములను. అంతమునందు లఘు-రూక్ష-ద్రవపదార్థములను సేవింప వలయునని శాస్త్రము బోధించుచున్నది. సూపొది. తక్రాంతభోజనము శాస్త్రీయముగ గన్పట్టుచున్నది.

సంవత్సరమునందలి శీతోష్ణ భేదములనుబట్టి ఆహారమును మార్చి సేవించవలయును. ఉష్ణప్రధానమయిన కాలములో మధుర-శీత - స్నిగ్ద వస్తువులను, వర్ష ప్రధానమై దుర్దినములుగ నున్నయపుడు వ్యక్తమైన ఆమ్ల- కటుక- స్నేహ పదార్థములను - శీతప్రధానమైన సమయములలో గురు-మేధ్య - మధుర - స్నిగ్ధ - శీత బృంహణ ప్రధానమైన పదా ర్థములను భుజించవలయును.

ఆహారమున కుపయోగించు పదార్థములు ముఖ్యముగ ఘనద్రవ్యములు, ద్రవద్రవ్యములనియును, పక్వపదార్థములు-అపక్వపదార్థములు- అనియును రెండు తెరగులు.

ఘనద్రవ్యములలో కొన్ని పక్వముగను - మరికొన్ని అపక్వముగను సేవింపదగియున్నవి. ద్రవద్రవ్యములలో గూడ నటులనే యున్నవి.

ఘనద్రవ్యములను ధాన్యములు, శాకములు, ఫలములు, మాంసములు అనియును, ద్రవద్రవ్యములను -వీరములు, జలము, స్నేహద్రవ్యములు, సంధానములు అనియును స్థూలముగ విభజింపవచ్చును.

ధాన్యములు : శూక ధాన్యములు, శింబీ ధాన్యములని రెండు విధములు.

శూక ధాన్యములలో : రక్తశాలి - మహాశాలి - కమలక -షష్టికము - వ్రీహి - గోధూమ యవజాతులు మొదలగునవి కలవు.

శింబీధాన్యములలో : ముద్గ - అఢకి - మసూర కులుత్ద -నిష్పవాదిజాతులు కలవు.

శాకములలో: పత్రశాకములు - పుష్పశాకములు ఫలశాకములు - నాళశాకములు - కందశాకములని విభాగములు కలవు. ఫలములు : ద్రాక్ష - ఖర్జూరము - దాడిమీ - ఆమ్రము-జంబీరము మొదలగునవి.

మాంసములు : మృగములు - విష్కిరములు - ప్రతు దములు - పుస్తహిహములు - బిలేశయములు - మహామృగ ములు - అప్చరములు - ఔదకములు (మత్స్యములు) అని యెనిమిది విధములుగా వర్ణింపబడినవి. . క్షీరములు : గో - మహిష - అజ అవి - ఉష్ణ - అశ్వ- ఖర - మానుషీజాతులను భేదములచే అష్టవిధములు. ఇందు దధీ - తక్ర - నవనీత - ఆజ్యాది ద్రవ్యములనుగూర్చి గూడ వర్ణింపబడినది.

జలములు : కూప - సారస- తాటాక, చౌండ్య -ప్రాస్రవణ - నాదేయాంతరిక్షాది విభేదములచే అష్టవిధములుగ వర్ణింపబడినవి.

స్నేహద్రవ్యములు : ఘృతములు - తైలములు.

సంధానములు : అసవ, అరిష్ట, మద్య, సౌవీరాదులు.

ఆహారము మండ, వేయ, విలేపి, ఓదనము అని నాలుగు విధములుగా చెప్పబడినది. ఇందు మండము, పేయ, విలేపి, అనునవి శోధనకర్మ చేయించిన పిమ్మటను, జ్వరాది వ్యాధులలోను, ఆహారముగ నుపయోగించును. మండము నందు మెతుకులు కానరావు. కేవలము ద్రవ ప్రాయముగనే యుండును, "పేయ అంతకంటే కొంచెము ఘనముగ నుండును. దీనియందు సిక్ధకములు (ఆహార కణములు) కనుపించును. విలేపియందు ద్రవము తక్కువగా నుండును. ఘనపదార్థ మెక్కువగ నుండును. ఓదనమనగా అన్నము మామూలుగ పచింపబడునట్టిది. ఇది పక్వాహారములలో ప్రధానమైన యాహారము. దీనికి సహాయముగ వ్యంజనములను శాకములను ఉపదేశించి యున్నారు. సామాన్యముగ శాకముల భక్ష్యముచేసి సంస్కరించి వాడుదురు. వ్యంజనములను పశ్వాపక్వ భేదముచే రెండురకముల వాడవచ్చును. బృంహణముగ నుండుటకై ఆహారపదార్థములతో బాటుగ పాలు, నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు వాడుదురు.

ఈ అహారరసము సరిగ సిద్ధమై శరీరమునందు జీవనీయాంశములు (విటమిన్సు) అభివృద్ధి చెందుటకై ఫలములను గూడ వాడుచుందురు. ప్రస్తుత కాలములో విజ్ఞాన విషయముల ప్రచారమెక్కువగ నుండుటచే ఫలముల యొక్క ప్రయోజనమును బహుజనులు గ్రహించి ఫలముల యుపయోగమును బహుళముగ జేయుచున్నారు.

ఆహార ద్రవ్యములలో స్వస్థవృత్తమున కుపయోగించు నవియని కొన్నిటిని గుర్తించి వాటిని ప్రత్యహ సేవనీయములుగ తంత్రకారులు చెప్పియున్నారు. అవి శాలి ధాన్యము, గోదుమలు, యవలు, షష్టికము, ముద్గము (పెసర,) క్షీరము, ఘృతము, ద్రాక్ష, ఉసిరిక, సైంధవ లవణము,

ధాన్యములు గాని, ఫలములు గాని, ఉచితమైన క్షేత్రములలో జనింపకపోయినను, నీటియందు నానిపోయినను, అగ్నిచే 'కాలిపోయినను, అకాలములయందు బుట్టినను, వాటిని సేవింపరాదు.

విషమాశనము, అధ్యశనము, సమశనము అనారోగ్య హేతువులు మాత్రమేగాక, మృత్యుకారణములగు మూడు విధము లయిన వ్యత్యస్థాహారములును కలవు.

కాలాకాల నియమము లేకుండగ పరిమాణ నియమము లేకుండగ హీనముగ గాని, అతిమాత్రముగ గాని సేవింపబడునది విషమాశనము.

భోజనము చేసిన వెంట నే మరల భుజించుట అధ్యశనము. పథ్యాపథ్యపదార్థములను కలిపి సేవించుట సమశనము. హితమైన వస్తువులను క్రొత్తగా అభ్యసింపవలసి యున్నపుడు ఒకటి, రెండు, మూడు అన్న కాలములచే ఆంతరము కలుగునట్లుగా చేసి సేవింపవలయును. అభ్యాసములో నున్న యపథ్యాహారములను నాల్గవ భాగముతోగాని, పదునారవ భాగముతోగాని వదలివేయుచుండవలెను.

వక్వాపక్వాహారములలో ఈ దిగువ నుదహరింపబడిన కారణములచే పక్వాహారములే శ్రేష్ఠములుగతోచుచున్నవి.

(1) పక్వమగుటచే ఆ ద్రవ్యములయందలి గురుత్వమంతరించును. అందుచే సులభముగ జీర్ణమగును.

(2) ఈ పదార్థములయందుండు దృశ్యాదృశ్యము లయిన క్రిమిజాతులున్నచో నశించి ఆరోగ్యమునకు భంగము వాటిల్లకుండును.

(3) భక్షణమునకు సౌకర్యముగ నుండును.

అపక్వాహారములలో విటమిన్లు ఉండుననియు, పాకముచే నవి నశించుననియు కనుక అపక్వముగనే తినవలయు ననియును, ఆ ద్రవ్యములను ముందుగ నానబెట్టి మొనలు చిట్లి మోసువచ్చునపుడు వాటిని నమిలి మ్రింగినచో చక్కని ఆరోగ్యము కలుగుననియును ఆధునికులు చెప్పుచున్నారు.

ప్రాచీనులగు ఋషీశ్వరులు గూడ అపక్వములగు కంద మూల ఫలాదుల భక్షించి చిరకాలముండిరి అని మన కల్పములు చెప్పుచున్నవి.

కనుక యథాభ్యాసముగ సేవించుట యుచితము. పానీయములుగూడ ఆహార ప్రయోజనమును కలిగించును. కాని అంతకన్న కొంత తక్కువగ బలమును కలిగించుచు, శరీరమునకు లఘుత్వమును కలిగించును.

క్షీరములు సేవించుచు ఆహారాంతరము అవసరము లేకుండువారు గలరు. కేవలము జలమును గ్రోలియుందు వారును గలరు. కానీ యిట్టివారు కేవలము అంతర్ముఖులై తపోనిష్ఠ నుండువారలేగాని ప్రాకృత జనులుగారు.

జనులకు పానీయము చాల ముఖ్యము. "పానీయం ప్రాణినాం ప్రాణాః, విశ్వమే వహితన్మయం" అని యుండుటచే జలములేనిది యే ప్రాణియు జీవింపదు.

ఆరోగ్యమునకు ముఖ్యమైనది గంగాజలము. అది దొరకనిచో దానితో తుల్యమైన గుణములు కలిగినట్టియు, మంచి భూమియందున్న తటాకాదుల యందున్నట్టియు జలమును సేవింపవలయును.

హంసోదకము చాల యోగ్యమైన జలము. పగలు సూర్యకిరణములచే తప్తమై రాత్రులు చంద్రకిరణములచే శీతలముగా చేయబడి అగస్త్య నక్షత్ర ముదయించుటచే నిర్విషముగా జేయబడిన జలము అమృతతుల్యముగనుండి, పానాదులకు శ్రేష్ఠమగును. ఇది రూక్షముగా నుండదు. అభిష్యందమును గలిగింపదు. నిర్మలముగనుండి మలములను పోగొట్టును. ఈ జలమునే అంగూదకమని గూడ జెప్పుదురు. 'రాత్రులయందు క్షీరపానము ఆయుర్వృద్ధి హేతువు. ప్రస్తుతము చాలమందిచే ప్రాతఃకాలాదులయందు సేవింపబడు కాఫీ - టీ మొదలగు పానీయములు అనారోగ్య హేతువులని తెలిసియు, ప్రబలమైన యభ్యాసముచే విడనాడ జాలకున్నారు.

పానకముల సేవించుటవలన తృప్తి, బలము, సంతోషము కలుగుచుండును. ఉష్ణ కాలములయందు వీని యువ యోగము మెండుగనుండును. మన ఆచారములలో వైశాఖపూజ చేయుట యనునదొకటి యున్నది. ఆపూజలో నొక భాగము విప్రునకు పానకమునిచ్చి పూజించుటయే. బ్రాహ్మణునకిచ్చిన పిమ్మట, తాను తన పుత్రకళత్రాదులు ఆ పానక శేషమును ద్రావుదురు. కనుక పానక సేవనము గూడ ముఖ్యమని తెలియుచున్నది.

'తక్రం శక్రస్య దుర్లభం' అను సూక్తి కలదు. ఇది సార్థక మేమో ననిపించును. మన తంత్రములలో తక్రమును గూర్చి విశేషముగ వర్ణించి, అనేక రోగములలో ననేక విధములయిన ప్రయోగకల్పములను దెలియ జేసి యున్నారు. కనుక ఆరోగ్యమును కాపాడుకొనుటకు తక్రపానముగూడ మంచిది.

వాయుసేవన  : వాయువు సస్తమహాస్కంధములుగను, సప్త ఉపస్కంధములుగను విభజింపబడి యున్నది. భూమిని ఆవరించి యిందలి ప్రాణులకు పకారము చేయునది యొక విధమయిన వాయువు. అంతరిక్షాదులలో కొంత యెత్తు నుంచి మరికొన్ని రకముల వాయువులు సంచరించుచుండును.

నిర్మలమైన వాయువు ప్రాణాధారమైనది. పర్వత ప్రదేశములనుంచి వచ్చు వాయువు చాల ఆరోగ్య హేతువు. మలయ వాతము మూర్ఛను గూడ పోగొట్టును. ప్రొగ్వాతము శరీరమున కపకారము చేయును.

విహారమనగా నడవడి : ప్రతి మనుజుడును తన యొక్కయు, తన సంఘము యొక్కయు సౌభాగ్యమును వృద్ధిచేయు రీతిగ సంచరించవలయును. ఇట్టి రీతిని ధర్మ శాస్త్రములు, వైద్యశాస్త్రములు బోధించుచున్నవి.

'నిత్యం హితాహార విహార సేవీ,
సమీక్ష్యకారీ విషయే వ్వసక్తః
దాతాసమః సత్యపరః క్షమావాన్
ఆప్తోప సేవీచ భవ త్యరోగ॥

ప్రతిదినము హితమైన ఆహార విహారములను సేవించుటయు, ఆలోచించి పనులు చేయుచుండుటయు, (దీనినే 'సహసా విదధీత నక్రియాం' అను వాక్యము గూడ దృఢ పరచుచున్నది. ఇంద్రియలోలు పత్వము లేకుండుటయు, యాచకులకు దానమిచ్చుటయు, సర్వత్ర సమదృష్టిగల్గి యుండుటయు, సర్వదా సత్యమునే పల్కుటయు, ఓరిమి కలిగియుండుటయు, ఆప్తుల యొక్క హితవచనములు వినుచు వారికి సేవ జేయుచుండుటయు ఆరోగ్య హేతువులుగ జెప్పబడియున్నది.

ఆరోగ్య హేతువులగు విహారములు  : ఆరోగ్యవంతుడగు జనుడు బ్రాహ్మముహూర్తమున నిద్రను మేల్కాంచి, కాల కృత్యములను దీర్చుకొని, దంతధావన కాష్ఠముతో దంతములను శుభ్రపరచి, కనులకు సురమాకాటుక పెట్టుచు, ఆ కాలమునకు తన వయస్సునకు తగురీతి వ్యాయామము అభ్యంగనము, ఉద్వర్తనము, స్నానమును చేయవలయును. స్నానము ఉష్ణోదకముతోను, శీతోదకముతోను చేయవచ్చును, శీతోదకము శిరస్సునకు హితము -ఉష్ణోదకము శరీరమునకు హితము. పిమ్మట దైవపూజను చేసి, యుక్తమగు అన్న కాలమున పైనుదహరించిన రీతిగ ఆహారమును సేవింప వలయును. పిమ్మట తాంబూలమును వేసికొనవలయును. రాత్రి ప్రధమ యామమందు రెండవమారు ఆహారమును భుజించి నిద్రాసుఖమును అనుభవించవలెను.

పగటి నిద్ర పనికిరాదు. శూన్యగృహములు, శ్మశానాదులలోనికి ఒంటరిగ పోరాదు. మంచి నడవడిగల స్నేహితులతో కలిసియుండవలెను. దశవిధ పాపములను పరిత్యజింపవలెను. జీవులయందు కారుణ్యము, త్యాగబుద్ధి, మనోవాక్కాయములు నిగ్రహము, ఇతరుల కార్యములయినను స్వకార్యములవలె దలచి స్నేహముతో వారికి సహాయపడుటయును ముఖ్యములు. రాత్రింబవళ్ళు ఎలా గడచుచున్నది విచారణలో ఉంచుకొని కాలమును గడుపవలయును. ఇట్లు చేయుచున్నచో ఇహపరములందు గూడ సుఖమునకు కొదువయుండదు.