సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్లర్ -విలియం
ఆస్లర్ - విలియం (1848-1918): వైద్యశాస్త్ర చరిత్రనుగూర్చి ఇతనికిగల పాండిత్యము అపారము. రోగపరీక్షా బోధకునిగ ఇతనికిగల ప్రఖ్యాతి అంతకన్నను ఎక్కువ. జన్మతః ఇతడు కెనడా దేశస్థుడు. ఇతడు మాంట్రియల్ (1874), ఫిలడెల్ఫియా (1884), బాల్టిమూరు (1889), ఆక్సుఫర్డు (1904) అను నాలుగు విశ్వవిద్యాలయములలో ఆచార్యుడుగా పనిచేసెను. ఈ వైద్య బోధనాలయములపై యితని ప్రాబల్యము స్థిరముగ నిలచిపోయినది. నిజమైన అంతర్జాతీయకీర్తి అతనిని వరించినది. వైద్యవృత్తిలోని వారు 5 ఏండ్ల కాలమున కొకసారి
తమ మెదడు త్రుప్పును వదలించుకొనవలెనని అతని భావన. ఐదేండ్ల కొకమారు వైద్యశాలలకు కాని, ప్రయోగశాలలకు కాని పోయి, వారు తమ మేధస్సులను పునీతము చేసికొనవలెనని ఇతడు వాదించెను. రోగపరీక్షా బోధనలలో ఈయనకు సాటి యెవరును లేరు. వైద్యశాస్త్ర పఠనావశ్యకత నుద్ఘాటించుట ఇతని అభిమానవిషయము. ఏకాలమున పూర్వ ప్రతిభాశాలురు నిర్లక్ష్యము చేయబడుదురో అది ప్రతిభారహితమగు కాలమునకు మచ్చుతునక యని ఆతని అభిప్రాయము. ఇతని దృష్టిలో వైద్యునకు కేవలము వైద్యపాండిత్యమేగాక సంస్కృతికూడ అవసరము. శాస్త్ర ప్రతిభా శాలియైన హార్వే, నైపుణ్యశాలియైన సిడెన్ హోం వంటి వ్యక్తులలో జీవితమునకు కీలకప్రాయములైన గుణములు లోపించవచ్చును. ఆశాభావము, అచంచల దృక్పథము ఆవశ్యకములని అతని అభిప్రాయము. 1892 లో అతడు "వైద్యశాస్త్ర సూచనలు, కృషి" యను పాఠ్య గ్రంథమును ప్రచురించెను. “చారిత్రక వ్యాసములు, పరిచయములు” (1904) "ఆల్బారూ విద్యార్థి" (1904) అనునవి ఇతని యితర గ్రంథములు.
యస్. నెం. రా.