Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్ట్రేలియా (చరిత్ర)

​ఆస్ట్రేలియా (చరిత్ర)  : పాశ్చాత్యులు కనుగొనక పూర్వము ఆస్ట్రేలియాకు చరిత్రలేదు. అనగా ఆస్ట్రేలియా నిర్జనమై యుండెనని అర్థముగాదు. అందలి ఆదిమనివాసులు చాల అనాగరకులు. వారికి చరిత్రలేదు. వారి ప్రమేయము లేకుండగనే ఆంగ్లేయులు ఆస్ట్రేలియా నాక్రమించిరి. వారి జనసంఖ్య నానాటికి క్షీణించుచున్నది.

తూర్పు దేశములందు ప్రవేశించినప్పటినుండియు ఐరోపావారు “బెఱ్ఱ ఆస్ట్రలిస్" అనగా దక్షిణ భూభాగమొకటి కలదని ఊహించిరి. 1804 లో కాప్టెన్ ప్లిండర్సు అనునతడు మొట్టమొదట ఆస్ట్రేలియా అను పదము వాడెను. ఖండము లైదింటిలో ఆస్ట్రేలియా చిన్నది, ప్రపంచమందలి దీవులన్నింటిలో నిది పెద్దది. టాస్మేనియా దీవితో గలిసి దీని విస్తీర్ణము 29,74,581 చ. మై. ప్రస్తుత జనాభా (పాశ్చాత్యులు మాత్రమే) సుమారు 89,88,239. ఒకే రాజ్యముగా నుండుట ఆస్ట్రేలియా ఖండములోని మరియొక విశిష్టత.

ప్రథమ పరిశోధకులు  : ఆస్ట్రేలియా ఎప్పుడు కనుగొనబడినదియు స్పష్టముగ చెప్పుట కష్టము. క్రీ. శ. 1531- 1542 ల మధ్య పోర్చుగీసు వారు ఆస్ట్రేలియా యునికిని పసికట్టి ‘గొప్ప జావా' యని పేరిడిరి. 1528 నుండి డచ్చి వారి పరిశోధనలు ప్రారంభమైనవి. వారు ఆస్ట్రేలియాను 'న్యూ హాలెండ్' అనిరి. 1642 లో టాస్మన్ అను నావికుడు టాస్మేనియా దీవిని కనుగొనెను. ఆంగ్ల నావికుడగు డాంపియర్ 1688 లో ఆస్ట్రేలియా పశ్చిమోత్తర తీరమును పరిశోధించి మరలిపోయెను.

జేమ్సు కుక్  : ఆస్ట్రేలియా పాశ్చాత్యులకు నివాస యోగ్యమైనదని ప్రపంచమునకు వెల్లడించినవాడు జేమ్సు కుక్. ఇతడు రాయల్ నౌకాదళమునకు చెందిన ప్రఖ్యాతాంగ్ల పరిశోధకుడు. టాహిట్ దీవులలో ఖగోళ పరిశోధనలు ముగించుకొని స్వదేశమున కేగుచు జేమ్సు కుక్ ఆస్ట్రేలియా ప్రాద్దక్షిణ తీరమును చేరెను. అచటి సహజ వృక్షజాలమున కచ్చెరువంది తాను దిగిన అఖాతమునకు "బాటనీ బే" యనియు, తీరప్రాంతమునకు "న్యూసౌత్ వేల్సు"అనియు పేరిడి 1770 ఆగష్టు 28 వ తేదీన ఆస్ట్రేలియాలో ఆంగ్ల పతాకను ప్రతిష్ఠించెను. ఆస్ట్రేలియా ఆంగ్ల సామ్రాజ్యములో నొక భాగమైనది.

వలసస్థాపన - న్యూసౌత్ వేల్సు  : ఇంగ్లండులో నాడు వ్యావసాయిక, పారిశ్రామిక విప్లవములు జరిగి వేలకొలది జనులు నిరుద్యోగులైరి. దారిద్య్రముతోబాటు దేశమున నేరస్థుల సంఖ్య పెరిగెను. ఇదే సమయమున అమెరికాలోని వలసలను ఇంగ్లండు గోల్పోయెను. అందువలన ఆస్ట్రేలియా పరిశోధన ఆంగ్లసామ్రాజ్యమునకు వరప్రసాదమైనది. ఆంగ్లప్రధానియగు పిట్టును, ఆతని ఆంతరంగిక కార్యదర్శియగు సిడ్నీప్రభువును నేరస్థులను ఆస్ట్రేలియాకు బంప తీర్మానించిరి.

1787 లో సర్ ఆర్థర్ ఫిలివ్ న్యూసౌత్ వేల్సు గవర్నరుగా నియమింపబడెను. మొదటి నేరస్థుల జట్టుతో నతడు మే 13 వ తారీఖున ఆస్ట్రేలియా చేరెను. న్యూసౌత్ వేల్సులో స్థావరములేర్పడినవి. కాని వలసవచ్చిన వారిలో అధిక సంఖ్యాకులు నేరస్థు లగుటచేతను, దేశపరిస్థితులు క్రొత్తయగుటచేతను న్యూసౌత్ వేల్సు ఆర్థికముగ చాల కాలము మాతృదేశముపై నాధారపడవలసివచ్చెను. ఇంగ్లండున కాశాభంగము కలిగెను.

మెక్ ఆర్థర్ - ఉన్ని పరిశ్రమ  : 1797- 1805 మధ్య మెక్ ఆర్థర్ అను పోలీసు ఉద్యోగి దక్షిణాఫ్రికానుండి

​
​

మెరీనా గొజ్జెలను గొని తెచ్చి న్యూసౌత్ వేల్పులో ప్రవేశపెట్టెను. న్యూసౌత్ వేల్సు శీతోష్ణస్థితులు బాగుగా సరిపడుటచేత గొజ్జె లభివృద్ధిచెందెను. వాని ఉన్ని ఇంగ్లండు మున్నగు దేశములందు ప్రశంసింపబడెను. 1805 నాటికి ఆంగ్ల ప్రభుత్వము ఉన్ని పరిశ్రమకు ప్రోత్సాహము ఒసగసాగెను. ఇట్లుండ 1813 లో అనావృష్టి సంభవించి న్యూసౌత్ వేల్సులోని పచ్చికబీడులు మాడిపోయెను. అందుచే 'బ్లు' పర్వతములను దాటి గొజ్జెల కాపరులు బాధుర్ట్సు మైదానములను పరిశోధించిరి. ఇవి ప్రపంచములో నెల్ల సుప్రసిద్ధమగు గడ్డిబీడులు. న్యూసౌత్ వేల్సుగవర్నరయిన లాకాస్ మక్వారీ క్రొత్తగా పరిశోధింపబడిన ప్రదేశములకు రోడ్లు వేయించి అందు స్థావరము లేర్పరచుకొనుట కవకాశములు కల్పించెను. ఈ పరిణామముల ఫలితముగ ఉన్ని పరిశ్రమ ఇతోధికముగ నభివృద్ధి చెందెను.

ఉన్ని పరిశ్రమతో బాటు ఆస్ట్రేలియా జనసంఖ్య పెరిగెను. 1815 లో ఐరోపాఖండమున నెపోలియను యుద్ధములు ముగిసి వేలకొలది ఆంగ్లసైనికులు నిరుద్యోగులైరి. వారిలో అనేకు లాస్ట్రేలియాకు వలసరాసాగిరి. 1821 లో ఆంగ్ల ప్రభుత్వము ఆస్ట్రేలియాకు వలస వచ్చువారి పై నిర్బంధము తొలగించుటయే గాక నేరస్థులను నార్ ఫక్ దీవికి పంపుటకు నిర్ణయించుట చేత సాధారణ పౌరులు విశేషముగ ఆస్ట్రేలియాకు వలసరాసాగిరి. ఈ మార్పులు సర్ థామస్ బ్రిస్ బేన్ గవర్నరుగా నున్నపుడు (1821-25) జరిగెను.

ఇతర పరిశోధనలు  : బాధుర్సు (Bathurst) మైదాన పరిశోధన ఆంగ్లేయుల కాశాజ్యోతియైనది. నాటి నుండియు సాహసికులగు యువకులు ఆస్ట్రేలియా అంతర్భాగ పరిశోధనకు పూనుకొనిరి. 1828లో కెప్టెన్ ఛార్లెస్ స్టక్టి అనునతడు ముఱ్ఱంబ్రిడ్జి, ముట్టే, డార్లింగ్ నదుల ప్రాంతములను పరిశోధించెను. జాన్ ఎడ్వర్డు ఐర్ దక్షిణా స్ట్రేలియాలోని అడిలాయిడ్ నగరమున బయలు దేరి టారెన్సు (Torrens), గ్రెగొరి, (Gregory) ఐర్ (Eyre) సరస్సుల ప్రదేశమును పరిశోధించెను (1840). కెప్టెన్ జేమ్సు స్టర్లింగ్ పశ్చిమాస్ట్రేలియాలోని స్వాన్ నదీ లోయలో స్థావరము లేర్పరచెను.

ప్రత్యేక వలసల ఏర్పాటు : 1828 వరకును న్యూ సౌత్ వేల్సు గవర్నరే ఆస్ట్రేలియాలోని స్థావరము లన్నిటిపై అధికారము వహించియుండెను. క్రొత్త స్థావరముల సంఖ్య పెరగిన కొలది ప్రత్యేక ప్రభుత్వముల అవసర మేర్పడెను. 1823లో న్యూ సౌత్ వేల్సునుండి విడదీసి టాస్మేనియాకు ప్రత్యేక ప్రభుత్వము నెలకొల్పిరి. న్యూ సౌత్ వేల్సునకు దక్షిణమున 1834 నుండి నివాసము లేర్పడెను. అచట మెల్బోరన్ నగరము పారిశ్రామిక కేంద్రమయ్యెను. ప్రజలు ప్రత్యేక ప్రభుత్వమునకై చేసిన ఆందోళన ఫలితముగ 1857 లో విక్టోరియా రాష్ట్రము ప్రత్యేకింపబడినది. ఉత్తరమున మోరెటన్ అఖాతము చుట్టును 1824 నుండి నివాసము లేర్పడెను. బ్రిస్ బేన్ నగరము నిర్మింపబడెను. “డార్లింగ్ డేన్సు” కనుగొనబడినంతనే “స్వాటర్లు” అనబడు పశుపాలకులు తండోపతండములుగా నచటికివచ్చిరి. ఇదియే క్రమముగ 1859 నాటికి "క్విన్సులాండ్ "అను ప్రత్యేక వలసయైనది. న్యూ సౌత్ వేల్సు గవర్నర్ సర్ రాల్ఫు డార్లింగ్ ప్రోత్సాహముచే పశ్చిమా స్ట్రేలియాను పరిశోధించుటకై జేమ్సు స్టర్లింగ్ పూనుకొనెను. ప్రథమమున వలస స్థాపన చురుకుగా సాగెను. స్టర్లింగ్ గవర్నరయ్యెను. కాని భూమి నిస్సారమైనదగుటచేతను, కార్మికుల కొరత వలనను పశ్చిమాస్ట్రేలియా వలస క్షీణించెను. 1849 లో ప్రజల కోరికపై మాతృదేశము నేరస్థులను పంపుటకు సమ్మతించెను. వారి రాకతో కార్మిక సమస్య తీరి పశ్చిమా స్ట్రేలియా కోలుకొనేను. ఇచట జరిగిన పరిణామములను మనసునందుంచుకొని గిబ్బన్ వేక్ ఫీల్డు దక్షిణా స్ట్రేలియా సంఘమును స్థాపించి దక్షిణా స్ట్రేలియా వలసకు కారకుడయ్యెను, వేక్ ఫీల్డు విధానము ప్రభుత్వామోదమును బడసెను. అడిలాయిడ్ నగరము నిర్మింపబడిన తరువాత దక్షిణ ఆస్ట్రేలియాలో అసంఖ్యాకముగ ప్రజలు స్థావరములను నిర్మించుకొనిరి. ఇంతటితో ఆస్ట్రేలియాఖండమున 6 ప్రత్యేక వలన లేర్పడెను. న్యూసౌత్ వేల్సు, టాస్మేనియా, విక్టోరియా, క్వీన్స్ లాండ్, పశ్చిమ ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియా.

రాజ్యాంగాభివృద్ధి  : న్యూసౌత్ వేలు గవర్నరు 1823 వరకును నిరంకుశ పాలన సాగించెను. 1823 లో బ్రిటిషు పార్ల మెంటు ఒక శాసనము చేసి, న్యూసౌత్ వేల్సులో 5 లేక 7 గురు సభ్యులుగల సలహాసంఘము నేర్పరచెను. ఇదియే శాసనసభకు బీజము. 1842 లో ఇందలి సభ్యుల ​ సంఖ్య 36కు పెంచబడెను. ఇందు 12 గురు మాత్రము నియమింపబడినవారు. మిగిలినవారు ప్రజాప్రతినిధులు. ఈ సభకు గల అధికారములు గూడ 'పెంపుచేయబడెను. 1839 లో కెనడా విషయమున డర్హంప్రభువు వలసలకు స్వయం నిర్ణయాధికార మొసగుట శ్రేయస్కరమని సూచించుటచే మాతృదేశము వలసలయెడ తన దృక్పథమును మార్చుకొనెను. క్రమముగా 1850 నాటికి విక్టోరియా, టాస్మేనియా, దక్షిణ ఆస్ట్రేలియాలలో ప్రాతినిధ్య ప్రభుత్వమేర్పడెను. కాని ప్రజలకది తృప్తినీయలేదు.

బాధ్యతాయుత పరిపాలన : 1851 లో బాధర్స్ టు (న్యూసౌత్ వేల్సు) బెల్లారత్ (విక్టోరియా) ల సమీపమున బంగారుగనులు బయల్పడి అవి గొప్ప పారిశ్రామిక కేంద్రములైనవి. ఆ వలసల ప్రజలు చైతన్యవంతులై స్వపరిపాలన కొరకు అందోళన ప్రారంభించిరి. 1854 లో బల్లారట్ (Ballarat) కార్మికులు సాయుధ విప్లవమునకు గూడ సిద్ధపడిరి. అందుచే వలసలకు స్వయంనిర్ణయాధికార మొసగుటకై మాతృదేశము నిర్ణయించెను. 1855 లో జరిగిన శాసనముద్వారా న్యూసౌత్ వేల్సు, విక్టోరియా, టాస్మేనియాలలో బాధ్యతాయుత ప్రభుత్వము లేర్పడెను. క్వీన్సులాండ్ లో 1859 లో సు, పశ్చిమాస్ట్రేలియాలో 1890 లోను పై శాసన మమలు జరిగినది.

సమాఖ్య ప్రభుత్వము - ఆస్ట్రేలియా కామన్వెల్తు  : ఆస్ట్రేలియా అంతటికి ఒకే సమాఖ్య ప్రభుత్వ మేర్పడుట మంచిదని 1847 లోనే గ్రేప్రభువు సూచించెను గాని పార్లమెంటు సమ్మతించలేదు. పరస్పర అసూయాద్వేషములతో వలసలుగూడ ఏకీకరణకు అంగీకరింపలేదు. కాని 19 వ. శతాబ్ది ఉత్తరార్ధమున ఫ్రాన్సు, జర్మనీ, జపాను, అమెరికా (U.S.A.) లు పసిఫిక్ సముద్రద్వీపముల నాక్రమించుటలో పోటీ ప్రారంభించినంతనే ఆస్ట్రేలియా వాసు లాత్మరక్షణను గురించి ఆందోళన చెందసాగిరి. ఆ రాజ్యముల బారి పడకుండుటకును, రాకపోకల సౌకర్యాభివృద్ధికిని, పారిశ్రామిక వాణిజ్యాభివృద్ధికిని వలసలమధ్య ఐకమత్య మత్యవసరమని గుర్తించిరి. 1884 లో జర్మనులు న్యూగినీ నాక్రమించుటతో ఆస్ట్రేలియాలో సమాఖ్య స్థాపనకై ప్రయత్నములు ప్రారంభమయ్యెను.

పార్లమెంటు 1885 లో నొక ఫెడరల్ కౌన్సిలును స్థాపించెను. కాని న్యూ సౌత్ వేల్సు సమ్మతించక పోవుటచే సమాఖ్య స్థాపన అలస్యమైనది. తుదకు 1889 లో ప్రధాని సర్ హెన్రీ పార్కెన్ కృషి ఫలితముగ న్యూ సౌత్ వేల్సు సమాఖ్యలో చేరుటకు అంగీకరించెను. మెల్బోరన్ (1890) సిడ్నీ (1891) ఆడిలైడ్ (1897) లలో సంప్రదింపులు జరిగినవి. మెల్బోరనులో ఆస్ట్రేలియా సమాఖ్య కొరకై రాజ్యాంగము తయారయ్యెను (1898). రిఫరెండము ద్వారా ప్రజలు సమాఖ్య స్థాననకు తమ సమ్మతిని వెల్లడించిరి. 1900 ఆగష్టు 17న విక్టోరియా మహారాణి ప్రకటన ప్రకారము పార్ల మెంటు ఆస్ట్రేలియన్ కామన్ వెల్తు శాసనము చేసెను. ఆస్ట్రేలియాలో ఆ శాసనము 1-1-1901 నాడు అమలు జరిగి సర్ ఎడ్మంట్ బార్టన్ ప్రధానిగా ప్రథమ సమాఖ్య మంత్రివర్గము ప్రమాణ స్వీకార మొనర్చెను. ప్రథమ సమాఖ్య శాసనసభరు 9-5-1901 న యార్కు ప్రభువు (తరువాతి 5వ జార్జి చక్రవర్తి) ప్రారంభోత్సవము చేసెను.

సమాఖ్య స్థాపింపబడిన తరువాత ఆస్ట్రేలియాలో పరిశ్రమలు, రాకపోకల సౌకర్యములు పెంపొందెను. కార్మికులు రాజకీయముగ చైతన్యమును బడసిరి, కార్మిక పక్షము బలపడి రాజకీయములందు ప్రముఖపాత్ర నిర్వహింప సాగెను. 1902 లో స్త్రీలకు గూడ “వోటు” హక్కీయబడెను. ఆస్ట్రేలియాలో ఇంగ్లండు అధికారము క్రమముగా క్షీణించెను.

మొదటి ప్రపంచ యుద్ధము  : మొదటి ప్రపంచ యుద్ధమున ఇంగ్లండుతో పాటు ఆస్ట్రేలియా మిత్రమండలి పక్షమున పోరాడెను. ఆస్ట్రేలియా యోధులు 33,000 మంది గెలి పోలీ యుద్ధమునందును, హిండెన్ బర్గు దక్షిణ శ్రేణిని భేదించుటలోను కీర్తిప్రతిష్ఠ లార్జించిరి. కార్మిక పక్ష ప్రధానియగు హ్యూగెన్ సామ్రాజ్యయుద్ధ నిర్వాహక సభ లందును, శాంతి సమావేశములందును పొల్గొనేను.జర్మనీకి చెందిన పాలొమన్ దీవులు, బిస్మార్కు ద్వీపకల్పము, న్యూగినీలపై ఆస్ట్రేలియాకు వర్సేయిల్సు సంధి మూలముగ ధర్మకర్తృత్వాధికారములు లభించెను.

యుద్ధానంతరము ఆస్ట్రేలియాలో వర్తక వ్యాపారము లభివృద్ధి చెందెను. 1927 లో కామన్ వెల్తు ముఖ్యపట్టణ ​మగు కాన్ బెజ్జూ నిర్మింపబడెను. 1926 బాల్ఫరు ప్రకటన వలనను, 1931 వెస్టుమినిస్టర్' శాసనమువలనను ఆస్ట్రేలి యాకు ఇతర అధినివేశ రాజ్యములతోబాటు ఎక్కువ స్వేచ్ఛ లభించెను.

రెండవ ప్రపంచయుద్ధము : రెండవ ప్రపంచయుద్ధమున ఆస్ట్రేలియా మిత్రమండలి పక్షమున పోరాడెను. 1941 లో జపాను యుద్ధమున ప్రవేశించి మలయా, ఫిలిప్పైను దీవులు, బర్మా, ఆక్రమించుటతో ఆస్ట్రేలియాకు జపాను దండయాత్ర భయమెక్కువైనది. కాని కోరల్ (Coral) సముద్ర యుద్ధముతో జపాను వెనుకంజవేసెను.

యుద్ధానంతర మేర్పడిన ఐక్యరాజ్యసమితిలో ఆస్ట్రేలియాకు సభ్యత్వము లభించినది. ఆస్ట్రేలియా ప్రతినిధి యైన డాక్టర్ ఇవాట్ సమితిలో ప్రముఖపాత్రను నిర్వహించెను. 1948 లో అతడు సాధారణసభ కధ్యక్షుడై నాడు. ఇండోనీషియా స్వాతంత్య్రము సందర్భమున ఆస్ట్రేలియా ఇండియాతో కలిసి పనిచేసెను.

ఉమ్మడి భద్రత చర్యలు  : పసిఫిక్ సముద్ర రాజకీయములలో ఆస్ట్రేలియా కీలకస్థాన మాక్రమించియున్నది. ఆస్ట్రేలియాకు జపానుభయ మెక్కువైనది. అందుచే ఆత్మ రక్షణకై 1951 లో న్యూజీలాండు, అమెరికా (U.S.A.) లతో కలిసి ఆస్ట్రేలియా ఒక కూటమి నేర్పరచెను (Anzus). 1954 లో నేర్పడిన ఆగ్నేయ ఆసియా రాజ్యకూటమి యందలి (Seato) ప్రధాన రాజ్యములలో ఆస్ట్రేలియా యొకటి.

వి. యస్. యల్.హా.రా.