Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్ట్రియా (హంగేరి)

​ఆస్ట్రియా - (హంగేరి) :

ఆస్ట్రియా అనుమాట 'ఆస్టరిఖ్ ' అను పదమునుండి వచ్చినది. ఈ పదమునకు "తూర్పు రాజ్యము" అని అర్థము.

క్రీ. శ. 9వ శతాబ్దారంభమున ఫ్రాంకుల చక్రవర్తియగు ​


చార్లి మేను కాలమున ఈ పేరు వాడుకలోనికి వచ్చినది. ఐరోపాలో డాన్యూబునది కిరువైపుల యుగోస్లేవియా, స్విట్జర్లాండు, ఇటలీ జర్మనీల మధ్య 32,375 చ. మై. విస్తీర్ణము, సుమారు 68,18,593 జనాభా గల చిన్న రాజ్యమే ఆస్ట్రియా, వియన్నా ఈ ఆస్ట్రియాకు ముఖ్య పట్టణము.

ప్రాచీన చరిత్ర  : ఐరోపాలో అనేక జాతులకును, నాగరకతలకును కూడలియై చరిత్రలో ఆస్ట్రియా పెక్కు రాజకీయ పరిణామములను గాంచినది. ఈ ప్రాంతమును క్రీ. పూ. 15 సం. న రోమనులు కెల్టులను జయించి, ఆక్రమించి క్రైస్తవమతమును ప్రవేశ పెట్టిరి. రోమనుల పాలనములో విండోబోనా (వియన్నా) నగర మభివృద్ధి చెందేను. క్రీ. శ. 5 వ. శతాబ్దమున హూణులు, లొంబార్డులు, శ్లావులు, ఆవారులు దండెత్తి రోమను పరిపాలనము నంతమొందించిరి.

ఆస్ట్రియా నిర్మాణము  : క్రీ. శ. 805 లో ఫ్రాంకుల చక్రవర్తియగు చార్లె మేన్ ఆస్ట్రియాను జయించేను. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీలను కలిపి పవిత్ర రోమక సామ్రాజ్యమును స్థాపించినది ఇతడే (క్రీ. శ. 800). ఇతడు తన సామ్రాజ్య ప్రాగ్భాగరక్షణార్థము ఆస్ట్రియా యను రాష్ట్రము నేర్పరచి అందు పటిష్ఠమగు ప్రభుత్వము నేర్పరచెను. నాటినుండి చరిత్రలో ఆస్ట్రియా పేరు వెలసినది.

బాబెన్ బర్గులు  : 10వ శతాబ్దారంభమున మొరేవియన్లు హంగేరియనులు ( మాగియారులు) అను తెగలవారు ఆస్ట్రియా నాక్రమించిరి. వీరినుండి జర్మను చక్రవర్తియగు ఆటో, ఆస్ట్రియాను జయించి 976 లో బాబెన్ బర్గు వంశీయుడగు లియో పాల్గున కొసగెను. ఆస్ట్రియా చరిత్రలో ఇది ప్రసిద్ధమగు సంఘటన, బాజెన్ బర్గుల పాలనములో ఆస్ట్రియా దినదినాభివృద్ధి చెందినది. స్టిలియా, (1192) కరోలినా (1229) ప్రాంతములు ఆస్ట్రియాలో చేరినవి, పవిత్ర రోమక సామ్రాజ్యమున ఆస్ట్రియా ప్రధాన రాష్ట్రములలో డచి (Duchy) ఒకటి అయ్యెను. వియన్నా ఆస్ట్రియాకు ముఖ్య పట్టణమై మత, భాషా, సాంస్కృతిక కేంద్రమయ్యెను.

హాప్సు బర్గులు : 1246 లో బాబెన్ బర్గు రాజవంశ మంతరించుటచే ఆస్ట్రియనులు ట్రూజెన్సీకడ సమావేశమై బొహిమియా రాజగు ఆటో కారును రాజుగా నెన్నుకొనిరి (1251). ఆస్ట్రియాతోబాటు హంగేరిని గూడ నాక్రమించి (1261) ఆటో కారు జర్శను సార్వభౌమత్వమునకు అఱ్ఱులు జాచసాగెను. జర్మనీలోని భూస్వాములు ఆటోకారు చక్రవర్తి యైనచో తమ ఆటలు సాగవని గ్రహించి నాటికి అనామకుడై యుండిన పోప్సు బగ్గు వంశీయుడగు రుడోల్ఫును చక్రవర్తిగా నెన్నుకొనిరి. చక్రవర్తియైన తరువాత రుడోల్ఫు ఆటో కారును జయించి, ఆస్ట్రియా నాక్రమించెను. ఈ సంఘటనములతో ఆస్ట్రియాతో బాటు హావ్సుబర్గులు బలపడి ఐరోపా రాజకీయ రంగమున స్థిరపడిరి.

చక్రవర్తి పదవియందున్న హాప్సుబర్గులు ప్రత్యేకాభిమానముతో తమ మాతృభూమి యగు ఆస్ట్రియా అభివృద్ధికి పాటుపడిరి. రాజకుమారులు ఆస్ట్రియాపాలకులుగా నియమింపబడుచుండిరి. వీరి పాలనములో ఆస్ట్రియా సర్వతోముఖాభివృద్ధి నందెను, 4 వ రుడోల్పు 1356 లో వియన్నా విశ్వ విద్యాలయమును స్థాపించెను. అతని తమ్ముని పౌత్రుడగు 5 వ ఆల్బర్టు హంగేరీరా జైన సిగి ​ స్మండ్ కుమార్తె ఎలిజబెత్తును వివాహమాడి సిగిస్మండ్ మరణానంతరము హంగేరీని వశపరచుకొనెను.

హంగేరి ఆక్రమణ  : ఆస్ట్రియా, హంగేరీ దేశములకు ఉనికియందేగాక చరిత్రలోగూడ సన్నిహిత సంబంధము గలదు. రెండును, రోమను, మొరోనియను దండయాత్రలకు గురియైనవి. కాని హంగేరియనులు మాగియారు జాతులకు చెందినవారు. ఆస్ట్రియనులు జర్మను తెగలకు చెందిన వారు. అందుచే వీరిమధ్య జాతి వైషమ్యముండుట సహజము. ఐనను చాలకాలము హంగేరీ ఆస్ట్రియా సామ్రాజ్య భాగమై యుండెను.

అంతఃకలహములు  : 1438 లో 5 వ ఆల్బర్టు చక్రవర్తిగా ఎన్నుకొనబడెను. నాటినుండి హాప్సుబర్థులే చక్రవర్తి. పదవి నధిష్ఠింపసాగిరి. ఆల్బర్టు మరణానంతర మాతని కుమారుడగు లాడిస్లాస్ బాలుడగుటచే చక్రవర్తి యగు 3 వ ఫ్రెడరిక్ ఆస్ట్రియా హంగేరీలను స్వయముగ పాలింపసాగెను. 1453 లో ఆస్ట్రియా హోదా పెరిగి సామ్రాజ్యమున ప్రధాన రాష్ట్రమైనది (Archduchy), కాని చక్రవర్తి పాలనము ప్రజలకు సమ్మతము కాలేదు. దేశమున తిరుగుబాటులు చెలరేగెను. ఇది యిట్లుండ 1457 లో లాడిస్లాస్ మరణించెను. స్టిరియా, కరింధియా రాష్ట్రము లందలి హాప్సుబర్లు రాజవంశశాఖలవారు ఆస్ట్రియా సింహాసనమునకై పోరాడసాగిరి. ఈ అంతర్యుద్ధ మవకాశముగా గ్రహించి హంగేరియనులు బలవంతులై మెధియస్ కార్నివస్ నాయకత్వమున స్వతంత్రులగుటయే గాక .ఆస్ట్రియాను గూడ జయించి ఆక్రమించిరి. ఆస్ట్రియాలో హావ్సుబర్గుల అధికార భాను డస్తమించెనా యనుభయము గలిగెను.

మాక్సిమిలియను  : ఈ పరిస్థితులలో స్టిరియా హాప్సు బర్గు శాఖకు చెందిన మాక్సిమిలియను విజృభించి తన వంశ కీర్తి పతాకను నిలుపజాలెను. 1490 లో మాక్సిమిలియను హంగేరీయనులను పారద్రోలి, ఆస్ట్రియా నాక్రమించి, అందు వోప్సుబర్గు ప్రభుత్వమును పునరుద్ధరించెను. 1498లో ఇతడు చక్రవర్తిగా ఎన్నుకొనబడెను. ఇతని కాలమునందు ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమము విజృంభించుచుండెను. జాతీయ భావవికాసము, జాతీయ రాజ్య స్థాపనము ఈ యుగ లక్షణములు. స్పెయిను, ఫ్రాన్సు, ఇంగ్లండు రాజ్యములందు బలవత్తరముగు రాచరికము లేర్పడినవి. మాక్సిమిలియను ఆస్ట్రియా జర్మనీలయందు తన అధికారము బలపడునట్లొనరించెను. బర్గండి రాకుమార్తెయగు మేరీని వివాహమాడి నెదర్ లాండ్స్ ను (బెల్జియం - హాలెండు) సంపాదించెను. తన కుమారుడైన ఫిలిప్ నకును స్పెయిను రాకుమార్తె జోనాకును వివాహా మొనర్చెను. జోనాకు సోదరులు లేక పోవుటచే ఆమెయే స్పెయిను సింహాసనమునకు వారసురాలు. ఆమె ద్వారాస్పెయినులో హాప్సుబర్లు వంశ స్థాపనకు మాక్సిమిలియన్ మార్గము కల్పించెను. 1519 లో మాక్సిమిలియన్ మరణించునాటికి స్టిరియా, కరింధియా, కార్ని యోలా, టైరోలు ప్రాంతములు ఆస్ట్రియాలో చేర్చబడెను. ఐరోపాలో హాప్సు బర్గుల కత్తి కెదురుకత్తి లేకుండెను,

ఫెర్డినాండ్ : మాక్సిమిలియన్ పౌత్రుడగు (5. వ.) ఛార్లెసు జర్మను చక్రవర్తి అయ్యెను. ఛార్లెస్ సోదరుడు ఫెర్డినాండ్ ఆస్ట్రియాను పాలింపసాగెను. ఫెర్డినాండు హంగేరి రాకుమార్తెయగు ఆనీని వివాహమాడెను. వీరి కాలమున తురుష్కులు విజృంభించి బాల్కను రాజ్యముల నాక్రమించి హంగేరిపై దండెత్తిరి. హంగేరి రాజగు లూయీ మోక్సు యుద్ధమున తురుష్కులచే హతుడయ్యేను. అతని బావమరదియైన ఫెర్డినాండు హంగేరికి వారసుడాయెను. ఫెర్డినాండ్, ఛార్లెసులు తురుష్కులను వెనుకకు మరలించుటకు ప్రయత్నించిరి గాని లాభము లేకపోయెను, హంగేరి పాలకుడుగా ఫెర్డినాండ్ తురుష్కులకు కప్పము చెల్లింప సమ్మతించెను.

30 సంవత్సరముల యుద్ధము : ఫెర్డినాండు సంతతి వారు జర్మను సార్వభౌమపదము నధిష్ఠింపజొచ్చిరి. వారి కాలమున లూధరన్ మతము రోనుక సామ్రాజ్యమున బహుళ ప్రచారమునకు వచ్చెను. నూతనమతము నరికట్టి కాథలిక్ మతమును రక్షించుబాధ్యత చక్రవర్తులది. అందుచే ప్రజాభిప్రాయమునకు వ్యతిరేకముగ చక్రవర్తులు లూధరన్ లేక ప్రొటెస్టెంటు మతము ననుసరించువారిని హింసింపసాగిరి. సామ్రాజ్యమున తిరుగుబాటులు బయలుదేరెను. 1618లో బొహిమియా ప్రజలు కాథలిక్ మతాభిమానియైన హాప్సుబర్లు ప్రభువును ధిక్కరించి ప్రొటెస్టెంటును రాజుగా నెన్నుకొనిరి. ఈ సంఘటనముతో ​ సామ్రాజ్యమున మత ప్రాతిపదికపై అంతర్యుద్ధము ప్రారంభమై 1648 వరకు జరిగినది. దీనినే ముప్పదిసంవత్సరముల యుద్ధమందురు. ఈ అంతఃకలహము క్రమముగా అంతర్జాతీయ యుద్ధముగా పరిణమించినది. హాప్సు బర్గుల వైభవమును జూచి సహింపలేని డెన్మార్కు, స్వీడను, ప్రాన్సు దేశములు జర్మను ప్రొటెస్టెంటులకు సహాయముగ యుద్ధమునందు ప్రవేశించినవి. చివరకు చక్రవర్తి 3 వ ఫెర్డినాండు యుద్ధమున నోడి, వెస్టు ఫేలియా సంధికి (1648) సమ్మతించెను. ఈ సంధిప్రకారము జర్మనీపై హాప్సు బర్గుల అధికారమునకు స్వస్తిచెప్పబడెను. పవిత్ర రోనుక సామ్రాజ్యము నామమాత్రా వశిష్టమైనది. ఇది ఆస్ట్రియాకు కీడులో మేలై నది. హాప్సుబర్గులు తమదృష్టిని ఆస్ట్రియాపై కేంద్రీకరించుటకు అవకాశము గలిగెను.

లియోపాల్డు  : 30 సంవత్సరముల యుద్ధమునుండి ఆస్ట్రియా త్వరలో కోలుకొనగలిగెను. 1657లో ఆస్ట్రియా సింహాసన మెక్కిన లియోపాల్డు ఆస్ట్రియా గౌరవప్రతిష్ఠలను ఇనుమడింప జేసెను. తురుష్కులను అనేక యుద్ధము లందోడించి కార్లోవిట్జు సంధి (1699) ప్రకారము స్లవోనియా, ట్రాన్సిల్వేనియా, హంగేరీలను లియోపాల్డు ఆక్రమించెను. 1699 నుండి 1867 వరకును ఆస్ట్రియా సామ్రాజ్యమునందు హంగేరీ లీనమైయుండెను, ఇన్స్ బ్రక్, ఆల్మజ్ విశ్వవిద్యా లయములను స్థాపించి లియోపాల్డు ఆస్ట్రియాలో ఉన్నత విద్యాభివృద్ధికి అపారమగు సేవచేసెను.

6వ ఛార్లెసు  : లియోపాల్డు అనంతరము 6 వ ఛార్లెసు ఆస్ట్రియా సింహాసనమెక్కెను. ఇతడును అంతర్జాతీయ రాజకీయములందు పాల్గొనినాడు. ఫ్రెంచి చక్రవర్తియగు 14 వ లూయీ స్పెయిను సామ్రాజ్యము నాక్రమింప దలచుటచే స్పానిషు వారసత్వ యుద్ధము సంభవించెను. అందు ఇంగ్లండుతో చేరి ఛార్లెసు లూయీ నోడించి యుటెక్టు సంధి ప్రకారము నెదర్ లాండ్స్ను (బెల్జియమును) బడసెను (1713). 1716 లో తురుష్కుల నోడించి సెర్వియా నాక్రమించెను. ఛార్లెను తరువాత అతని ఏకైక పుత్రిక మేరియా థెరెస్సా సింహాసన మెక్కెను (1740)

మేరియాథెరెస్సా  : ఆస్ట్రియాలో స్త్రీ రాజ్యము చేయుట తమ కవమానముగా ఇతర ఐరోపా రాజులు భావించిరి. మేరియాథెరెస్సాను ఆస్ట్రియా ప్రభ్వణిగా గుర్తింతుమని తాము 6వ ఛార్లెసునకు చేసిన వాగ్దానమును (ప్రాగ్మాటిక్ శాక్షన్ ) త్రోసిపుచ్చి, మేరియా థెరెస్సాపై వారు కత్తిగట్టిరి. ప్రష్యా రాజగు ఫ్రెడరిక్ ఒక కూటమి నేర్పరచి మేరియాపై యుద్దమును ప్రకటించెను. దీనినే ఆస్ట్రియా వారసత్వ యుద్ధ మందురు. ఇందు మేరియా ఓడి, సైలీషియాను ఫ్రెడరిక్ నకు సమ ర్పించెను. సైలీషియాను తిరిగి సాధించు నాశయముతో సప్త సంవత్సర యుద్ధమున (1757-1763) మేరియా ఫ్రాన్సుతో చేరి ఫ్రెడరిక్ తొ యుద్ధము చేసెను. కాని లాభము లేకపోయెను. 1772 లో రష్యా చక్రవర్తిని యగు కాథరిన్, ప్రష్యా రాజగు ఫ్రెడరిక్ తొ చేరి పోలెండ్ విభజనలో పాల్గొని మేరియాథెరెస్సా గాబ్షీయా యను ప్రాంతమును బడ సెను.

2 వ. జోసెఫ్ : మేరియా కుమారుడగు 2 వ జోసెఫ్ 1780 లో సింహాసన మెక్కెను. ఇతడు ప్రజాహిత నిరంకుశ రాచరికమందు పూర్తి విశ్వాసము గలవాడు. రూసో, వోల్టేరు మున్నగు విజ్ఞానుల బోధనల ప్రకారము సమాజ పునర్నిర్మాణమునకు ఇతడు ప్రయత్నించెను. మతాధికారుల దౌర్జన్యములను తుదముట్టించేను. ప్రభువులపై పన్ను విధించెను; నిర్బంధ విద్యావిధానము అమలు జరిపెను. కాని ప్రజల కి సంస్కరణములు నచ్ఛలేదు. హంగేరీలో తిరుగుబాటు కూడ చెలరేగెను. చివరకు తనకృషి నిష్ఫలమైనదను హృదయవేదనతో జోసెఫ్ 1790 లో మరణించెను.

ఫ్రెంచి విప్లవము  : జోసెఫ్ తమ్ముడు 2వ లియో పాల్డు కాలమున (1790-92) ఫ్రాన్సులో నిరంకుశ రాచరికమును తుదిముట్టించి ప్రజాప్రభుత్వమును స్థాపించుటకై బ్రహ్మాండమగు విప్లవము చెలరేగినది. ఫ్రాన్సు రాజు 16 వ లూయీ యొక్క రాణి యగు మేరియా అంటాయి నెట్ లియోపాల్డు సోదరి. అందుచే ఫ్రెంచి రాజ దంపతులను రక్షించుటకై లియోపాల్డు ప్రష్యా రాజుతో చేరి ఫ్రాన్సుపై యుద్ధమును ప్రకటించెను. కాని కృతకృత్యుడుకాలేకపోయెను. ఇతని కుమారుడు 2 వ ఫ్రాన్సిస్ కూడ (1792-1835) నెపోలియనును ఓడించి ఫ్రాన్సులో నిరంకుశత్వము నెలకొల్ప విశ్వప్రయత్నము లొనరించెను. ​ కాని మాంటువా (1796), మారెంగో (1799), ఆస్టర్లిజ్ (1805) మొదలగు యుద్ధములలో ఓడి లొంబార్డి, బెల్జియములను గోల్పోయెను. 1806 లో నెపోలియను పవిత్రరోమక సామ్రాజ్యమును విచ్ఛిన్న మొనర్చెను. అందుచేత ఆస్ట్రియా - హావ్యు బర్గులకు "ఆస్ట్రియా చక్రవర్తి" యను బిరుదము మాత్రమే నిలిచినది.

ఈ పరాజయముల వలన ఆస్ట్రియాలో జాతీయోద్రేకము హెచ్చిపోయెను. ఇదే సమయమున 'నెపోలియను రష్యాపై దండెత్తి అపార నష్టమునకు గురియయ్యెను. సమయము కనిపెట్టి ఆస్ట్రియా, రష్యా, ప్రష్యా, ఇంగ్లండులు కూటమిగా నేర్పడి, నెపోలియనుపై సైన్యము నంపిరి. ఆ సైన్యమునకు ఆస్ట్రియా సేనాని స్క్వార్జన్ బెర్గు నాయకుడై లీప్జిగ్ యుద్ధమున నెపోలియనును పూర్తిగా ఓడించెను. అచిరకాలముననే నెపోలియను ఖైదీగా పట్టుబడి ఎల్వాదీవికి పంపబడెను.

వియన్నా శాంతిసభ : యుద్ధానంతరము వియన్నాలో శాంతి సమావేశములు జరిగేను. ఇందు ఆస్ట్రియా ప్రధాని యగు మెటర్నిక్ ప్రధాన పాత్ర ధారియై ఆస్ట్రియా ఔన్నత్యమును పునరుద్ధరించెను. లొంబార్డీ, వెనిస్, ఇస్ట్రియా, డాల్మేషియాలు ఆస్ట్రియా కీయబడినవి. జర్మను సమాఖ్యపైనను, ఇటలీ పైనను ఆస్ట్రియాకు యాజమాన్యము లభించెను. తిరిగి మధ్యఐరోపాలో ఆస్ట్రియా ప్రముఖ రాజ్యమయ్యెను.

1815.48 విప్లవములు  : మెటర్నిక్ నాయకత్వమున ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాలు పవిత్ర కూటమిగా నేర్పడి విప్లవశక్తులు నరికట్ట నిశ్చయించెను. ఆస్ట్రియా, నిరంకుశత్వమునకు పట్టుగొమ్మయై 1815-1848 ల మధ్య జర్మనీ, ఇటలీ, హంగేరీలలో జరిగిన జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమముల నణచివేసెను. హంగేరీలో కోస్సూతు, గోర్గియను వారు స్వాతంత్య్రొద్యమమును సాగించిరి. అది అణచి వేయబడినది. చివరకు 1848 లో వియన్నా పౌరులు తిరుగుబా టొనరించి మెటర్నిక్ ను దేశమునుండి వెళ్ళగొట్టిరి. కాని స్క్వార్జెన్ బెర్గు ప్రధాన మంత్రియై ఆస్ట్రియాలో నిరంకు శత్వమును తిరిగి నెలకొల్పెను.

సామ్రాజ్య విచ్ఛేదము  : ఈ విప్లవపరంపరలతో ఆస్ట్రియా సామ్రాజ్యపు పునాదులు కదలినవి. ఇటాలియనులు, జర్మనులు, హంగేరియనులు, ఇతరజాతులు ఆస్ట్రియా ఆధిపత్యమునుండి విముక్తి పొంది స్వయం నిర్ణయాధికారమును బడయ సంకల్పించిరి. ఇటలీ సమైక్యతకై పాటుబడుచున్న పార్టీనియా, ఫ్రాన్సులసహాయముతో 1859 లో ఆస్ట్రియాపై కయ్యమునకు కాలుదువ్వెను. యుద్ధమునం దాస్ట్రియా ఓడిపోయి విల్లా ఫ్రాంకా సంధి చేసికొని లొంబార్డీని సార్డీనియా కొసగెను. జర్మనీ నాయకత్వమును గురించి ప్రష్యా ఆస్ట్రియాలమధ్య చాల కాలమునుండి స్పర్ధ పెరుగుచుండెను. ప్రష్యా ప్రధాన మంత్రియైన బిస్మార్కు, ప్రష్యా నాయకత్వమున జర్మను జాతీయైక్యమును సాధింపనిర్ణయించెను. జర్మనీ ఉత్తర సీమ లందుగల ప్లెస్విగ్, హల్ స్టీను అను రాష్ట్రముల విషయమున తగవు పెట్టుకొని బిస్మార్కు ఆస్ట్రియాపై యుద్ధ మునకు దిగెము. ఆస్ట్రియా, సెడోవా యుద్ధమున పూర్తిగ నోడెను (1866), ప్రేగుసంధి ప్రకారము ఆస్ట్రియా జర్మనీ నుండి వైదొలగుటయేగాక 'వెనీషియా'ను ఇటలీకిచ్చి వేసెను.

ఆస్ట్రియా - హంగేరీ ద్వంద్వరాచరికము : ఆస్ట్రియా పరాజయములు హంగేరి జాతీయోద్యమమునకు బల మొసగినవి. ఆస్ట్రియా చక్రవర్తి జోసఫ్ దమన నీతివలన లాభములేదని గుర్తించి, హంగేరియనులతో 1867 లో రాజీ చేసికొనెను. ఈ రాజీవలన హంగేరి కించుమించు స్వతంత్ర ప్రతిపత్తి లభించెను. ఆస్ట్రియా- హంగేరి అను ద్వంద్వ రాచరికము స్థాపింపబడెను. ఆస్ట్రియా హంగేరీలకు వేరువేరు శాసనసభలు, రాజ్యాంగము ఒసగబడెను. విదేశ వ్యవహారములు, యుద్ధవిషయములు, ఆర్థిక వ్యవహారములు ముగ్గురు సభ్యులుగల ఉమ్మడి మంత్రివర్గమున కీయబడెను. ఈ మంత్రులు ఆస్ట్రియా - హంగేరీలచే సమముగా ఎన్నుకొనబడిన 120 ప్రతినిధుల సభకు బాధ్యులు. జోసఫ్ ఆస్ట్రియాలో చక్రవర్తియనియు, హంగేరీలో రాజనియు పిలువబడును. హంగేరియనులకు ఈ యొడంబడిక తృప్తి కలిగించినది. కాని ఆస్ట్రియా సామ్రాజ్యములో జెక్కులు, స్లావులు, రుమేనియనులు ఆందోళన మాన లేదు.

ఆస్ట్రియా-జర్మనీ మైత్రి  : క్రమముగా ఆస్ట్రియా, జర్మనీలు తమ విరోధమును విస్మరించి మైత్రి వహింపసాగెను. బిస్మార్కు ప్రోద్బలముపై ఆస్ట్రియా త్రిసార్వభౌమ ​ కూటమిలో చేరెను (1872). జర్మనీ, ఇటలీలు జాతీయైక్యతను సాధించుటచేత ఆస్ట్రియా పశ్చిమ రాజ్యములపై ఆశ వదలుకొని తూర్పునందున్న బాల్కసు రాజ్యములపై దృష్టి మరలించెను. ఈ రాజ్యములు తురుష్కుల నిరంకు శత్వమునుండి విముక్తి బడయుటకై ఉద్యమములను సాగించుచుండెను. రష్యాగూడ ఈ రాజ్యములపై కన్ను వైచెను. అందుచేత ఆస్ట్రియా రష్యాలకు బాల్కను రాజ్యములతో సంఘర్షణము ప్రారంభమైనది. ఇట్టి పరిస్థితులలో ఆస్ట్రియాకు జర్మనీసహాయ మత్యవసరమైనది. జర్మనీ కూడ ఆస్ట్రియా యెడల పక్షపాతము వహించి యుండెను. 1878 లో జరిగిన బెర్లిన్ మహాసభలో జర్మనీ ఆస్ట్రియా పదము వహించి బాస్నియా, హెర్జిగోవినా యను బాల్క నురాజ్యములను ఆస్ట్రియాకు సంక్రమింప జేసెను. ఈ సంఘటనముతో జర్మనీ, ఆస్ట్రియాలపై రష్యాకు పగ హెచ్చెను. అందుచే జర్మనీ, ఆస్ట్రియాలు 1879 లో ద్వివర్గ సంధిచేసికొని రష్యా యెత్తుల నెదుర్కొనుటకు సిద్ధపడెను.

1వ ప్రపంచ యుద్ధము  : బాస్నియా హెర్జిగోవినాలను ఆస్ట్రియా ఆక్రమించుట సెర్వియా రాజ్యమున కిష్టము లేదు. అందుచే సెర్వియా ఆస్ట్రియా పై కత్తిగట్టెను. 1914 లో ఆస్ట్రియా యువరాజగు ఫెర్డినాండును సెర్వియనుల ప్రోత్సాహముతో బాస్నియా రాజధానియగు సారాజీహోలో హత్యగావించిరి. ఆస్ట్రియా సెర్వియాపై యుద్ధము ప్రకటించెను. సెర్వియాపక్షమున రష్యా, ఆస్ట్రియా పక్షమున జర్మనీ యుద్ధమునకు దిగెను. క్రమముగా రష్యా మిత్రులగు ఫ్రాంసు, ఇంగ్లండులు కూడ యుద్ధమున దిగుటతో ఇది మొదటి ప్రపంచ యుద్ధము (1914-18) గా పరిణమించెను. ఇందు ఇంగ్లండు, ఫ్రాంసు కూటమి మిత్రమండలియనియు, జర్మనీ, ఆస్ట్రియావర్గము మధ్య రాజ్యమండలి అనియు వ్యవహరింపబడెను.

ఆస్ట్రియా రిపబ్లిక్ : యుద్ధ కాలమున జెక్కులు, పోలులు, హంగేరియనులు ఆస్ట్రియాను ధిక్కరించి స్వతంత్రులైరి. మొదట గెలుపొందినను విట్టొరియో వెనిటోకడ ఓడిపోయి మిత్రమండలికి ఆస్ట్రియా దాసోహమనెను. మొదటి ఛార్లెను సింహాసన త్యాగమొనర్చెను. 12–11–1918 తేదీన ఆస్ట్రియాలో రిపబ్లిక్ స్థాపింపబడెను, ట్రియనాన్, సైంట్ జెర్మెయిన్ సంధుల ప్రకారము పోలెండు, జెకోస్లొవేకియా, హంగేరిల స్వాతంత్య్రమును ఆస్ట్రియా గుర్తించెను. ఆస్ట్రియాపై అనేక సైనిక నిర్బంధములు విధించబడెను. ఆస్ట్రియా రిపబ్లిక్ జర్మన్ రిపబ్లిక్ తో చేర నిర్ణయించెను గాని శాంతిమహాసభ సమ్మతింపలేదు.

యుద్ధానంతర ఆస్ట్రియా : హిట్లర్ ఆక్రమణము  : యుద్ధానంతర పునర్నిర్మాణమందు ఆస్ట్రియాకు నానాజాతి సమితి అమూల్యమగు ఆర్థిక సహాయ మొనరించెను. దేశమున కమ్యూనిస్టులు, సోషలిస్టులు బలవడి ప్రచారము సాగించుచుండిరి. ఈలోగా జర్మనీలో హిట్లరు అధికారమునకు వచ్చెను. హిట్లరు జన్మభూమి ఆస్ట్రియా. ఆస్ట్రియాలో కూడ నాజీ పార్టీ స్థాపింపబడెను. నాజీ పార్టీకి (హింనీర్) ఆస్ట్రియా జర్మనీల సమైక్యత ప్రధానాశయము. ఆ ఆస్ట్రియా అధ్యక్షుడగు హెర్ డాల్ఫస్ ఆస్ట్రియా స్వాతంత్య్రమును రక్షించుట కనేక ప్రయత్నము లొనర్చెను. 1934 లో నాజీపక్షము తిరుగుబాటొనరించి డాల్ఫస్ ను హత్య గావించెను. హిట్లర్ ఆస్ట్రియా నాక్రమించుటకు యత్నించేను. కాని ఇటలీ నియంత ముస్సోలిని అడ్డుపడెను. చివరకు 1938 లో అబిసీనియా యుగమునందు ఇటలీ నిమగ్నమైయున్న సమయమున హిట్లర్ ఆస్ట్రియా నాక్రమించెను. 1940 లో ఆస్ట్రియా జర్మను రిహ్ (Reich సామ్రాజ్యము) లో లీనమైనది.

నేటి చరిత్ర : 1939లో హిట్లర్ దురాశఫలితముగ రెండవ ప్రపంచయుద్ధము ప్రారంభమైనది. మిత్రమండలి- రష్యా, ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సులు - హిట్లరు దురాక్రమణకు గురియైన రాజ్యములకు స్వాతంత్య్ర మొసగుటయే ఆదర్శముగ యుద్ధ మొనరించెను. 1943లో స్వతంత్ర ఆస్ట్రియా రాజ్యమును స్థాపించుటకు నిర్ణయము జరిగెను. 1945 లో రష్యా అమెరికా సైన్యములు ఆస్ట్రియా నాక్రమించినవి. కారల్ రెన్నరు నాయకత్వమున నొక తాత్కాలిక ప్రభుత్వము ను రష్యా ఏర్పరచెను. పశ్చిమ రాజ్యములు ఆ ప్రభుత్వముమ గుర్తింపలేదు. ఆస్ట్రియాను 5 భాగములుగా విభజించి మిత్రమండలి సైన్యము లాక్రమించెను (1) వోరాల్ బెర్గు, టైరోలు - ఫ్రెంచిభాగము ; (2) సాల్ట్ బర్గు, ఎగువ ​ఆస్ట్రేలియా - అమెరికా భాగము; (3) బర్గెన్ లాండు, దిగువ ఆస్ట్రేలియా - రష్యాభాగము; (4) కరింధియా, స్టిలియా - ఇంగ్లీషువారి భాగము : (5) వియన్నా - ఇది నాల్గు రాజ్యములు కలిసి ఏర్పరచిన ప్రత్యేక ప్రభుత్వము. 1946 లో పశ్చిమ రాజ్యములు ఆస్ట్రియాను స్వతంత్ర రాజ్యముగా పరిగణించెను. కాని ఆస్ట్రియాలోని జర్మనీ ఆస్తిని గురించి రష్యాకును, పశ్చిమ రాజ్యములకును మధ్య అభిప్రాయభేదము కలుగుటచే ఆక్రమణ సైన్యములు ఉపసంహరించుటకు ఒడంబడిక కుదురలేదు. 1951 లో ఆస్ట్రియాలో ఎన్నికలు జరిగి స్వతంత్ర ప్రభుత్వమేర్పడినది. సోషలిస్టు పక్షమునకు చెందిన డాక్టర్ థియోడోరు కోర్నరు అధ్యకుడయ్యెను. 1953 ఏప్రిల్ 2 వ తేదీన జూలియస్ రాబ్ మంత్రివర్గ మధికారము నకు వచ్చినది. 1955 లో పశ్చిమ రాజ్యములకును రష్యాకును ఆస్ట్రియా విషయమున ఒడంబడిక కుదిరినది.

బి. యస్. యల్. హ. రా.