Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా కళ

వికీసోర్స్ నుండి

ఆసియా కళ : ఆసియా భిన్నజాతులకు చెందిన ప్రజలతోడను, విశేష భేదములతో గూడిన శీతోష్ణమండలముల తోడను, మిక్కిలి వ్యత్యాసములు గల సంప్రదాయములతోడను, ఆచారములతోడను, మతములతోడను గూడిన మహాఖండము. జాతులు అత్యంత భిన్నస్వరూపములు కలిగియున్నవి ; అందుచే మనుష్యవర్ణన శాస్త్రములో విశేషానుభవము లేనివారు కూడ ఒక వ్యక్తి ఏ దేశమునకు చెందిన వాడో నిర్దేశించుటలో పొరపాటుపడరు. దక్షిణభారత దేశములోని ద్రావిడజాతిని గాని, ఉత్తర చైనాలోని మంగోల్ జూతిని గాని, బిడూయిన్ జాతికి చెందినవారని పొరపాటు పడుట కవకాశములేదు. “మార్పుచెందని తూర్పు" అని చెప్పుట ఒక పురుషాంతరమునకు పూర్వము పరిపాటిగా ఉండెడిది. కాని ఇది ఇప్పుడు కేవలము పొరపాటు; ఏమన, “మార్పు చెందనిది" అన్న పదము యూరపుఖండ దేశములకు ఎట్లు అన్వయింపదో తూర్పుఖండములందలి మహాజాతులకును అట్లే అన్వయింపదు. చైనాను ఉదాహరణముగా తీసికొందము; ఒక దానితో నొకటి సంబంధము కలిగియుండని అనేక వంశముల యొక్క పరంపర ఈ దేశమును పాలించియుండెను; ప్రతి క్రొత్త వంశమును ఆచార వ్యవహారములలో ప్రాతిపదికములగు మార్పులను ప్రవేశ పెట్టుచుండెను. ఉదాహరణమునకు; ఇంతకుపూర్వ మందున్న మంచు రాజవంశము పిలకలను పెంచుకొనుట ప్రవేశ పెట్టగా, ప్రజాప్రభుత్వము దానిని తొలగించెను. “

"శాశ్వతత్వము” ను, సహజమైన సారూప్యము నష్టము కాకుండ, రక్షించిన అంతరంగిక శక్తిని కలిగియున్నారని కొన్ని తూర్పు జాతుల యొక్క ప్రజలను గూర్చి మనము నిస్సంశయముగా చెప్పవచ్చును. జపాన్ ఒక్కటే కొన్ని ప్రత్యేక పరిస్థితులను కలిగియున్న దేశము; ఇంచుమించు ఖండమునుండి పూర్తిగా విడిపడియుండుట; నివాస యోగ్యమగు ఆసియాలో ఎక్కడో మారుమూలగా ఉన్న దాని ఉనికి, ఒకే రాజవంశము నెడల భక్తి కలిగి యుండుటచే పొరుగుదేశముల దురాక్రమణము నుండియు, శాశ్వతములగు ఆంతరంగిక కల్లోలముల నుండియు, సంరంక్షింపబడుట ; ఇవి ఈ దేశమునకు ప్రత్యేక పరిస్థితులు. ఆసియాయందలి గొప్పవగు ఇతర జాతు లేవియును ఇట్టి సంరక్షణమునుగాని, వ్యక్తి పరిజ్ఞానముతో గూడిన అస్తిత్వమును పొందు అవకాశములను గాని, కలిగియుండలేదు.

ఉదాహరణకు పారశీక దేశమును తీసికొందము. ఇది తన జాతీయ వ్యక్తిత్వమును గమనింపదగిన విధముగా నిలబెట్టు కొన్నది; కాని భూగోళ సంబంధమగు ఉనికి దానిని అన్ని కాలములందును విజేతలకు బలి చేసినది. పదవ శతాబ్ధమున, ప్రాచీనులచే స్థిరత్వము పొందించి బడిన భాషయు; మహమ్మదీయులకు పూర్వమందుండిన రాజవంశముల స్థిర సంప్రదాయములును లేనిచో నీ జాతి బ్రతికియుండెడిదా యని అనిపించును. భారతదేశము ప్రత్యేకముగా ఒక అధ్యాయములో వివరింపబడుటచేత, ఆసియాలోని ఇతర ముఖ్య దేశములగు అరేబియా, పర్ష్యా, చైనా దేశముల యొక్క కళ యొక్క ప్రధానలక్షణములు మాత్రము ఇచ్చట పరిశీలింపబడును.

ఈ నాలుగును నాలుగు విభిన్న సంస్కృతుల రీతులను ప్రదర్శించుచున్నవి. పురాతనమును, ఆధునికమును, అగు చరిత్రలను కలిగియుండుట ఈ దేశములకు సర్వసామాన్య లక్షణము.

ఆసియాకును, తూర్పున కంతకును, సామాన్యమైన ఒక లక్షణ మేమనగా సంప్రదాయము నెడ పూర్వాచార పరాయణత్వముతో కూడిన ప్రేమ; ఇది ప్రతిదేశము యొక్క కళను, కవిత్వమును; వస్తువునందును, రచన యందును, నిర్ణీతము లగు హద్దులలో నుండునట్లు పరిమితము గావించును. గొప్ప సమర్థులును, రచయితలును, తమ శైలి యొక్క ముద్ర జాతుల పై వెల్లడియగునట్లు తమ ప్రభావమును ప్రదర్శించి యుండిరి. కానీ వారు కూడ తమ కాలము యొక్కయు, దేశము యొక్కయు సంప్రదాయమును చాల జాగరూకతతో అనుసరించుచు వచ్చిరి. కేవలము సహజమును, ధారాళమును, కానప్పుడు కళ గతానుగతికమగు సంప్రదాయము ననుసరించునట్టిదగును. గతానుగతిక మగు సంప్రదాయ మనగా సర్వసామాన్యమగు ఒప్పుదల లేక ప్రజా వ్యాప్తమగు అంగీకారము అను దానిమీద ఆధారపడిన ఒక ఆచారము. సంప్రదాయ మని మనము పిలుచుచున్నది, ఒకానొకప్పుడు స్వతంత్రమును సహజమునై ఉండవలేను. గతానుగతిక మగు ఆచార మనగా సహజత్వమును కోలుపోయిన సంప్రదాయమును అనుసరించుట. శాస్త్రము (science) నకు సంబంధించని నూతన కల్పనలు చాలవరకును, సంప్రదాయము నుండి భిన్న మార్గమును త్రొక్కుటను సూచించును. కళలో శైలి - వాఙ్మయములోవలెనే సమకాలిక లోక సంప్రదాయము యొక్క హద్దులకు లోబడి, కళాశాలి రచించిన వ్యక్తిగత రచనా విశేషము. కనుకనే "శైలి అనగా మనుష్యుడు" అను లోకోక్తి ఏర్పడినది.

కళా విషయమైన పూర్వాచార పరాయణత్వమునకు ఈజిప్టు మిక్కిలి పరిచితమైన ఉదాహరణము. అట్టి పూర్వాచార భావములకు మరేజాతియు ఇంత ఎక్కువగా లోబడియుండలేదు. అన్ని కాలములందును మిక్కిలి గొప్పవారగు కళాభిజ్ఞులలో స్థానము వహించుటకు ఈజిప్టు దేశీయులు నిది ఆటంకపరుపలేదు. స్మారక చిహ్నముల నెలకొల్పు శీలమును, శైలిలో ఏకత్వమును అనునవి వారి విశిష్ట లక్షణములు. సుదీర్ఘమైన చరిత్రలో స్వల్పకాలము తప్ప, ఈ దేశపు కళాశీలులు వివిధత్వముకొరకు యత్నింపలేదు. ఆ కాలము - క్రీ.పూ. 14వ శతాబ్దములోని వీరి రచనలు వీరికి మిక్కిలి వాస్తవమైన రచనను గావింపగల శక్తి గలదని రుజువు చేయుచున్నవి. ఒక్కటే ఉదాహరణము చాలును. అమర్ణా చిత్రశాలలో కనుగొనబడిన అనేకములగు సుందరములును, సజీవములును అగు చిత్రములలో నెఫర్టిటీ యొక్క శిరస్సు ఒకటి.

ఈ పూర్వాచార పరాయణ శీలము ఆసియాలో ఎంత బలీయమై ఉన్నదనగా, ఒక జాతి మరొక జాతి నుండి ఒక శైలిని అనుకరించినప్పుడు గూడ స్వీయముద్రను అనుకరణములపై గురించి, వాటికొక క్రొత్త లక్షణము ఇచ్చి యున్నది. ఉదా : చైనా దేశీయులు గ్రీకు దైవములను తమ బౌద్ధ విగ్రహములకు మాదిరులుగా తీసికొన్నప్పుడిట్లు జరిగినదని, చైనాటర్క్ స్థానమున క్రొత్తగా కనిపెట్టబడిన శిల్పములు స్పష్టముగా రుజువు చేయుచున్నవి.

శిల్పములు, భవనములు, ప్రపంచమంతటను అనేక విషయములలో పోలికలను కలిగియున్నవి. శిల్పి యొక్క నమూనాలలో ఉన్న ఏకత్వముచేతను, దేవాలయములు, ఇండ్లు కట్టుటలో గల ప్రత్యక్షమగు ఉద్దేశముచేతను, ఇట్టి పోలిక ఉండుట మిక్కిలి సహజము. అయినను, మానవ రూపమును ప్రదర్శించుటలో నమూనాల నుండియే హిందువులు చిత్రించియుండిరి; కాని వారి దైవములు మానవులకన్న అధికు లని వెల్లడిచేయుటకు వారికి అనేక శిరస్సులు, చేతులు, కందురిగవంటి నడుములు, మరికొన్ని అసాధారణ విషయములు కల్పించియుండిరి. ఇది ఐరోపా

వాసులకు గాని, అమెరికా వారికి గాని వింతగా తోచును. ఇది యిట్లుండ చైనా దేశీయులు మాత్రము మానవ రూపమును చిత్రించుటలో ఎన్నడును సహజత్వమును తప్పలేదు; జంతువులను చిత్రించుటలో మాత్రము వీరు

ఊహ యొక్క స్వేచ్ఛావిహారమునకు తావిచ్చియుండిరి. సుప్రసిద్ధమగు చైనావారి మకరనాగము (dragon) దీనికి ఉదాహరణము.

అన్ని కళలకును, వాఙ్మయములకును వెనుక నున్న సంప్రదాయముల వలననే వాటి నొండొంటినుండి సులభముగా వేరుపరచుట సాధ్యమగుచున్నది. ఈ సంప్రదాయముల పుట్టుకకును, వృద్ధికిని సంబంధించిన నియమముల నిరూపించుట మనకు సాధ్యము కాకపోవచ్చును. మన శారీరక లక్షణములను, కొంతవరకు మన హృదయము లను మలచు వంశాగతమగు వారసత్వము యొక్క ప్రాముఖ్యమును మనము గమనించినను, ఒక చోట నివసించు ప్రజలమాట, చిత్తవృత్తి, కళ, సంస్కృతి అనువాటిపై ఏ శీతోష్ణస్థితి గాని అత్యధిక ప్రభావమును నిస్సందేహముగా కలిగిఉండు నని మనము తెలిసికొనగలము. పరిసరములచే గూడ అత్యద్భుతములగు మార్పులు ఏర్పడుచుండును. ఇట్టి మార్పు ఒక దేశమునుండి మరొక దేశమునకు వలసపోయినవారి విషయమున కొద్ది పురుషాంతరములలోనే కలుగుచుండుట మనము చూచుచున్నాము. ఒక పురుషాంతరమునకు పూర్వము యూరపు ఖండవాసులగు అమెరికనులు నేడు కనీసము పై పై విషయములందైనసు———- కేవలము అమెరికనులుగా మాత్రమే ఉన్నారు.

అందువలన కళలో గాని, వాఙ్మయములో గాని కనబడుచు వివిధములగు ఆసియా జాతులను ఒండింటితో వేరుపరచు ఈ ప్రధాన లక్షణములకు ముఖ్యముగా వారి దేశముల శీతోష్ణస్థితి, భూవిశేషములు కారణము లని చెప్పవచ్చును. ఒక ప్రత్యేక విధానము ననుసరించి బ్రతుకుటకు, సంచరించుటకు, చూచుటకును ఇవి కారణము లగుచున్నవి.

చైనా దేశపు కళ: చైనా దేశీయులు మిక్కిలి కళా సంపన్నులగు ప్రజలు. వారి కళా ప్రతిభ బహు వైవిధ్యము గల రూపములలోను, వ్యక్తీకరణ సాధనములలోను వెల్లడి యగుచున్నది. ఒక విధమగు కంచుతో తయారుచేయబడిన వస్తువులు, ఆక ర్షణీయములగు గిన్నెలు, పాత్రలు, మొదలగునవి వారి అత్యంత ప్రాచీనరచనలు. అవి రూప సౌందర్యము నందును, ఆకృతి రచనయందును ఒక ప్రత్యేతగల మనోహరత్వమును, గౌరవభావమును కలిగియున్నవి. నాజూకుతనముగల అభిరుచికి పరాకాష్ఠ అనదగని దేదికాని రచించుటకు వారు అసమర్థులా అనిపించును. వారి మట్టి పాత్రలును, పింగాణీపనీయు చాలవరకు ఇట్టి విశిష్టతనే కలిగిఉన్నవి. కానీ వాటిని అన్నిటినిగూర్చి ఈ విధముగా చెప్పుటకు వీలు లేదు. ఏమనగా, వారి తొలి మట్టిబొమ్మలు పరమోన్నత ప్రమాణముల నందుకొనుటలేదు; మంచు కాలమునాటి పింగాణీరచన దాని జన్మస్థానముయొక్క ప్రతిష్ఠకు తగినదిగా లేదు. సొగసైన దస్తూరీ వ్రాయుకళ ప్రత్యేక ప్రశంసకు పాత్రమైనది; ఇది సుందరమైన ఆకృతి రచనయందు చైనావారికిగల ఆసక్తికి పూర్తియైన అవకాశమును కల్పించియున్నది.

వాస్తుకళయందు చై నాదేశీయులు బాహ్యప్రభావములకు లోబడని స్వతంత్రతను ప్రదర్శించుచున్నారు; అన్ని చైనా దేశపు ప్రాసాదములును, దేవాలయములును ఒక విధమగు సమభావమును కలిగియున్నను, విసుగుపుట్టించేడి ఏకత్వముసూత్రము వీటియందు కనబడదు. బాహ్య రేఖలు, భాగముల పరస్పర సంబంధములు చూపరులకు తదితర భవనములకంటే భిన్నత్వముగలవను భావమును రేకెత్తించును. చైనా ఆలంకారిక రచనతోగూడిన కిటికీ తలుపులతోడను, కాంతిమంతము లయి ఎఱ్ఱగా కాల్పబడిన పెంకులతోడను గూడి బరువైన యింటి పైకప్పు చైనా భవనము యొక్క ప్రధానలక్షణము. సాధారణముగా స్మారక చిహ్నములుగా కట్టబడిన విలువంపైన సరంబీలు; పెగోడాలు (ఒక విధమగు గుడులు), సొగసైన వంతెనలు తరచుగా కఱ్ఱతోడను, ఇటుకతోడను కట్టబడును. ఒక్కొక్కప్పుడు చలువ రాయికూడ మిక్కిలి సుందరముగా ఉపయోగింపబడును. జపాన్ దేశపు వాస్తుకళకూడ ఇట్లే యున్నది. చైనా కళతో ఇది విశేషమయిన పోలికను కలిగియున్నది. మార్దవముతోగూడిన గౌరవభావమును; సున్నితమై పరిపూర్తితో గూడిన నిరాడంబరత ; వైపరీత్యములు లేని స్వతంత్రశక్తి - ఇవి జపాన్ కళకు లక్షణములు. అలెగ్జాండరుచేతను, అతనికి తరువాత వచ్చిన వారిచేతను, భారత దేశములో తొలుత దిగుమతి చేయబడి, తర్వాత ప్రసిద్ధమైన గాంధారకళగా అభివృద్ధి చేయబడిన ప్రాచీన గ్రీకు ఆదర్శముల అత్యధిక ప్రభావము మధ్య ఆసియా యొక్క కళను, సంస్కృతిని పరిశీలించినకొలది నెమ్మదిగా వెల్లడి యగుచున్నది. బౌద్ధకళకు సంబంధించిన చైనావారి సొగసైన క్వాన్ - యిన్ బొమ్మలు క్రైస్తవ మేడొ నాస్ సుపోలి, ఒక్కొక్కప్పుడు చేతిలో శిశువునుగూడ కలిగి యున్నవి. - (1) క్వాన్ - యిన్ ఒక దేవుడుగా భావింప బడుట. (2) ఇంకను పూర్వమునకు పోయినచో గాంధారము, గ్రీకో - బాక్ట్రియన్ దేశములకు చెందిన బౌద్ధశిల్పము లుండుట అను నీ రెండు సుస్పష్టములైన దశలు కలిగినట్లు తెల్లమగుచున్నది.

చిత్రకళ చైనాలో ఏడవశతాబ్దము నుండియు అభ్యసింపబడుచున్నది. ఇది చైనా యొక్క అత్యంత ప్రముఖమయిన కళయని పేర్కొనదగును. నీరాకాని, నీటిరంగులు కాని వాడబడినవి; రేఖాచిత్రములును, వర్ణచిత్రములును సాధారణముగా సిల్కు (పట్టు) పై వ్రాయబడియున్నవి. చైనా చిత్రకళకు మూలసూత్రము చిత్రకారుని మనో ముద్రికమైన ఆధార్యభావమే. వచనమునందలి వాస్తవికత్వముకంటే పద్యమునందలి వ్యంగ్యమునకై వారెక్కువగా యత్నించుచున్నారు. నీడలెన్నడును చూపబడలేదు. ప్రత్యేకముగా దృష్టిగోచర ప్రదేశ చిత్రములందు చైనా దేశీయుల యీ మనోముద్ర ప్రదర్శింపబడుచున్నది. భౌతిక స్థూలభావమును చిత్రించుట విడువబడుచున్నది. కొండ లును, మేఘములును ప్రత్యేక సాంకేతిక రూపములను కలిగియున్నవి. దూరమం దగపడెడి వస్తువులను యథా తథముగా వ్రాయు చిత్రకళకై ప్రయత్నమే చేయబడ లేదు. దృష్టిగోచరప్రదేశ చిత్రములను కేవలము వాని కొరకే వ్రాయుటలో చైనాదేశీయులే మొదటివారు. వారి అభిమాన రూపములలో ఒకటి పొడవైన “మేకెమొనో”, ఇది ఒక చేతి చుట్టవలె నుండును. దానిపై నల్దిక్కుల కనపడెడి దృష్టి గోచర ప్రదేశము ఒక విధముగా విప్పుటవలన వెల్లడియగు చుండును; ఇది నేటి "సినిమా"కు ప్రాతిపదిక యైయున్నది.

చైనాదేశీయుల జీవన దృక్పథము, మూలసిద్ధాంతములలో హిందువులు వాటినుండి భేదమును కలిగియున్నది. తత్త్వచర్చావిచారము కాని మతవిషయక గూఢత్వము కాని వారి కలవాటులేదు. నీతిశాస్త్రమునందు మాత్రము వారికి అత్యంత గౌరవము కలదు. “కన్ఫ్యూషనిజము" ఒక మతముకాదు. అది ఒక నీతిశాస్త్రవిధానము మాత్రమే అయి ఉన్నది; వారి ప్రభుత్వము కుటుంబజీవనము దానిపై ఆధారపడియున్నది. చైనా దేశీయులచే చాలవరకు సర్వ సామాన్యముగా అవలంబించబడినది. బౌద్ధమతమయి యున్నది. ప్రతిభాశాలులును ఎన్నదగినవారును అగు ఈ ప్రజల శీలములో ఒక విశేషమున్నది. మతవిశ్వాసము కంటె జాతీయాచారమునకే ఎక్కువ స్థానమీయబడు చుండును. చైనా, చైనాదేశీయుల వారసత్వమును, మతమును గూడనై ఉన్నదని చెప్పవచ్చును. చైనా దేశీయుల కళను అర్ధముచేసికొనుటకు ఇది నిజమైన ఆధారసూత్రముగానున్నది.

అరేబియా దేశపు కళ : అరేబియానుండి చైనాకు దృష్టి మరల్చునపుడు ఆసియా ప్రజలు నిశ్చితమైన ఒక శైలినుండి భిన్నమైన మరొక శైలికి మనము కదలుచున్నాము. అరేబియా దేశీయుల జీవనము వివిధ పాత్రలను వహించు ఒంటెపై కేంద్రీకరింపబడియున్నది. బ్రతికి ఉన్నపుడు అది గొప్ప ప్రయాణసాధనమై, తన యజమానికి గర్వ సంతోషములకు కారణమై ఉండును. మరణించిన తరువాత అది ఆహారమును, బట్టను, సమకూర్చునదిగా ఉన్నది. ఆరబ్బులలో అత్యున్నతమైన సుగుణము, అతిథిమర్యాద; వారి యందలి ప్రధాన సాంస్కృతిక లక్షణము కవిత్వ మందలి ప్రేమ. అత్యంత సునిశితమును, మిక్కిలి శ్రద్ధతో అనుసరింపబడునదియు అగు ఇస్లాం మతప్రవక్త యొక్క ఆదేశములలో నొకటి. మానవుల యొక్క గాని, జంతువుల యొక్కగాని రూపములను, శిల్పమునందుగాని, చిత్రకళ యందుగాని రచించుట పాపమని తెలుపుచున్నది. దీని ఫలితముగా, నిరాడంబరులగు అరబ్బులు ఎడారిలోని తమ గృహములనుండి వెలువడి, తూర్పునకును, పడమటికిని ఉన్నతమైన సంస్కృతితో గూడిన బై జాంటై నులలోనికిని, పారశీకులలోనికిని విస్తరించినపుడు, వాస్తుకళా ఆకృతి రచనలు తప్ప, తదితరమైన లలితకళల విషయమందు శ్రద్ధాశువులు కాలేకపోయిరి. ఈ రెండుకళలు మాత్రము వారిచే పరిపూర్ణతా సౌందర్యషరాకాష్ఠకు వృద్ధినొందింపబడినవి.

యూరపులో అరబెస్క్ అని పిలువబడు ఆలంకారిక శైలియును, అరబ్బీ వర్ణమాల యొక్క అద్భుతమైన అలంకారి కావకాశములును, ఇట్టి పరిస్థితులలోనే పుట్టుక నందినవి. సొగసైన దస్తూరీ వ్రాయు కళయందును కోరాన్ యొక్క ప్రతులను అందముగా వ్రాయుట యందును, కళాభిజ్ఞుల కాలము వినియోగింపబడెను; హిందువులలోను, క్రైస్తవులలోను చిత్రకారులు, శిల్పులు సంపాదించిన కీర్తిని వారు దస్తూరీ విషయములో పొందియుండిరి. కాని కాలక్రమమున, హిందువుల యొక్కయు, క్రైస్తవుల యొక్కయు, తదితర మహమ్మదీయేతర సంస్కృతి యొక్కయు, ప్రభావమునకు లోబడుటచే వారు మతముతొ సంబంధములేని తమ గ్రంథములతో బొమ్మలు వేయుట ప్రారంభించిరి. వీరు మాదిరి రూపములను క్రైస్తవం వ్రాత ప్రతులలోని బొమ్మలనుండి గ్రహించిరి. గ్రీకు భాషనుండి శాస్త్రమును, ప్రకృతి చరిత్రను, అనువాదములను చేసినపుడు వారు వాటిలో మానవుల యొక్కయు, హృదయముల యొక్కయు, మొక్కల యొక్కము, బొమ్మలను సందర్భానుసారముగా లిఖించియున్నారు. అయినను స్వల్ప ప్రమాణములలో వ్రాయు వర్ణచిత్ర రచనను స్వతంత్ర మార్గములలో మొదట' అభివృద్ధి చేసిన వారు పారశీకులు. అరబ్బుల హస్తకళా విషయములో వారి సుందరములైన మసీదుల చిత్రములు మనకు సుపరిచితములై యున్నవి. ఉన్నతములైన విలువంపు, సరంబీలు, ఉన్నత స్థాయికి చెందిన గుమ్మటపు, శిఖరములు, ప్రధాన భవనముపై నుండి మిక్కిలి ఎత్తుగా లేచు సొగసైన స్తంభాకారములు, మేజిన్ ప్రార్థనకొరకు పిలుచునపుడు, నలువైపుల చాల దూరము వినబడుటకొరకు అగ్రభాగమున నిర్మింపబడు మెట్ల వరుస - ఇవి వీటి లక్షణములై ఉన్నవి.

పారశీక కళ : మానవుల యొక్కయు, జంతువుల యొక్కయు రూపములను శిల్పములోగాని, చిత్రకళలో గాని ప్రదర్శింపరాదన్న మతప్రవక్త యొక్క ఆదేశము శిల్పమునకు సంబంధించినంతవరకు ఎన్నడును అతిక్రమింపబడ లేదు. క్రైస్తవులు, తదితర నాగరకతలకు సంబంధించినవారును దీనిని పాటించియుండ లేదను విషయము మనము గమనించి యున్నాము. ఈ నిషేధము ఒకమారు .ఉల్లంఘించిన పిమ్మట, పారశీకులు స్వల్పప్రమాణములతో వ్రాయు చిత్రరచనలో కృషిచేయ మొదలు పెట్టిరి. మరియు, అంతకు పూర్వమందుండిన దానితో భిన్నమైన ప్రత్యేకతను దాని కోసంగుటకై కూడ వారు యత్నించిరి. 15వ, మరియు 16 వ శతాబ్దములలో పర్ద్యాలోను, టర్క్ స్థానములోను, ఈకళ అత్యంతోన్నతమైన పరిపూర్ణతను పొందినది. ఈ బొమ్మలు వ్రాయుటలో వస్తు విషయములు చాలవరకు చరిత్రనుండియో పురాణకథా కావ్యములనుండియో గ్రహింపబడినవి. కుండలపైని, నేతవస్త్రములపైని వ్రాయబడిన ఆకృతిరచనలకు కూడ ఇట్టి వస్తువులే తీసికొనబడినవి. పారశీకుల తివాచీలపై సుప్రసిద్ధ పురాణ గాథలను వర్ణించు చిత్రములు కనిపించు చున్నవి. వారి ప్రార్థనకొరకైన తివాచీలు మాత్రము మక్కా దెసలో వాటిని పరచుట యెట్లో సూచించు లక్షణమును కలిగి యున్నవి. మిక్కిలి ప్రజారంజకమై పూర్వము ఇస్లాం మతమునకు సంబంధించిన ఒక కథావస్తువు తివాచీల పైని, కుండలపైని, లోహరచనలపైని తరచుగా కసబడుచున్నది. ఇది పారశీక రాజు బహ్రంగుర్ యొక్కయు, అతనికి అభిమానపాత్రమైన బానిస బాలిక ఫిత్నా యొక్కయు కథ : ఈమె తన ప్రాణనష్టముపై నను సరకుచేయక నేర్పరి తనమును అభ్యాసమాత్రముచే సాధింపవచ్చునని రాజునకు రుజువుచేసినది. గ్రంథములలో సందర్భానుసారముగా వేయు బొమ్మలు కాక ఇతరమైన బొమ్మలేవియును పారశీకులు చిత్రించి యుండలేదు; అందుచే అవి క్రియాదృశ్యములను మాత్రమే ఎప్పుడును చిత్రించినట్లు కానబడును. అవి వాస్తుకళకు సంబంధించి నదియును, లేక దృష్టిగోచర ప్రదేశమునకు సంబంధించినది యును, అగు వెనుకనుండు ఆధారభూమికి మిక్కిలి ప్రాధాన్యము నిచ్చుచున్నవి. చైనా దేశీయులవలె వీరును నీడలను పూర్తిగా పాటింపనట్టివారే. కాని వారివలె ఇతర ప్రయోజనము లేకుండ దృష్టిగోచర ప్రదేశములను, వాటికొరకే వాటిని వీరెన్నడును చిత్రించి యుండలేదు.

పు. శ్రీ.