Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా

వికీసోర్స్ నుండి

ఆసియా : ప్రపంచములోని ఖండము లన్నింటిలోను ఆసియా ఖండము చాల పెద్దది. ఇది భూభాగపు మొత్తములో మూడు వంతులు ఆక్రమించి యున్నది. దీని విస్తీర్ణము 1,67,93,000 చ. మైళ్ళు. జనాభా సుమారు 130 కోట్లు, ఈ ఖండపు తూర్పు - పడమరల కొలత 5,400 మైళ్ళు. ఉత్తర - దక్షిణముల కొలత 5,300 మైళ్ళు.

ఆసియాఖండము తూర్పుపడమరలుగా సుమారు 25° తూర్పు రేఖాంశమునుండి 170° తూర్పు రేఖాంశమువరకును, ఉత్తర దక్షిణములుగా సుమారు 1° ఉత్తర అక్షాంశము నుండి 75° ఉత్తర అక్షాంశమువరకును వ్యాపించి యున్నది. తూర్పు ఇండియా దీవులతో (ఇండోనీషియా) సహా 10° ద. అక్షాంశమువరకును వ్యాపించియున్నది. తూర్పు ఇండియా దీవులు మొదలగు పరిసరప్రాంతపు దీవులను మినహాయించినచో ఈ ఖండము ఉత్తరార్ధగోళములోనే ఉన్నదని చెప్పవలసి యుండును. నిరంతరము మంచుచే కప్పబడిన ఆర్కిటిక్ తీరమునుండి అన్ని కాలములలోను ఇంచు మించు ఒకే ఉష్ణోగ్రత కలిగిన భూమధ్యరేఖవరకు వ్యాపించి ఉన్నది. అందువలననే వివిధములయిన శీతోష్ణస్థితులు ఈ ఖండమునందు గలవు. ఇది అధిక వైశాల్యము కలదగుటచే ఖండాంతరమందలి పెక్కు దేశములు సముద్రమునకు 1,500 మైళ్ళకంటె ఎక్కువ దూరములో నున్నవి.

ఆసియా ఖండములో ఈ క్రింద పేర్కొన్న 29 దేశములు చేరియున్నవి.

Caption text
క్రమ సంఖ్య దేశము రాజధాని
1. సైబీరియా ఇర్క్ టస్కు
2. మంచురియా మ్యూక్డెన్
3. మంగొలియా ఉర్గా
4. కొరియా (ఉ) పొగ్యాంగు
4. కొరియా (ద) సియొలు
5. జపాన్ టొకియో
6. చైనా పికింగు
7. టిబెట్టు లాసా
8. ఇండో చైనా హానాయి
9. సయాం (తై లాండు) సరబూరి
10. మలయా సింగపూరు
11. ఇండోనీషియా జకార్తా
12. ఫిలిప్పైను దీవులు మనిల్లా
13. సింహళము కొలంబో
14. బర్మా రంగూన్
15. పాకిస్థాన్ కరాచి
16. ఇండియా డిల్లీ
17. ఆఫ్ ఘనిస్థానము కాబూల్
18. బెలుచిస్థానము క్వెట్టా
19. ఇరాన్ టెహరాన్
20. ఇరాఖ్ (మెసపొ టేమియా) బగ్దాదు
21. సౌదీఅరేబియా మెక్కా
22. జోర్డాన్ అమ్మాన్
23. ఇజ్రాయిల్ టెల్ అవీన్
24. సిరియా డమాస్కసు
25. లెబనాన్ బీరట్
26. టర్కీ అంగొరా
27. నేపాల్ ఖాట్మాండు
28. భూటాన్ పునఖా
29. సిక్కిం గాంగ్ తక్

బ్రహ్మాండముగా విస్తరించియున్న యీ ఖండము పెక్కు వైపరీత్యములకు నెలవైయున్నది. ఉదాహరణమునకు ప్రపంచములో అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన వెర్కోయన్ స్కు (−85° ఫా), అత్యధిక వర్షపాతము కలిగిన చిరపుంజి (458”), ఎత్తయిన పర్వతములగు హిమాలయములు, ఎత్తయిన పర్వత శిఖరము - మౌంటు ఎవరెస్టు (గౌరీశంకర శిఖరము 29,141 అడుగులు), ఎత్తయిన పీఠభూమి - టిబెట్ , లోతయిన సరస్సు - బైకల్ (2,300 అ.), అధికమైన జనాభా కలిగిన దేశములు-చైనా (4,750లక్షలు) ఇండియా (3,670 లక్షలు) మున్నగునవి; అత్యధిక జనసాంద్రత కలిగిన జావా (817 చ. మైలుకు), ఎత్తయిన దేశము - టిబెట్టు (15,000 అడుగులు), పొడవైన రైలు మార్గము - ట్రాన్సు నై బీరియన్ రైల్వే (5,400 మైళ్ళు) మొదలయినవన్నియు ఈఖండములోనే కలవు. ప్రపంచములోని మొత్తము జనాభాలో సగము మంది యీ ఖండము నందే ఉన్నారు. ఈ ఖండము అనేక జాతులకు, మతములకు పుట్టినిల్లు. బౌద్ధ, క్రైస్తవ, హిందూ, మహమ్మదీయ, కన్ ఫ్యూసియస్ మున్నగు మతములకు ఉనికిపట్టయినట్టిది ఇది.

ఎల్లలు : : ఆసియాకు ఉత్తరమున ఆర్కిటిక్ మహా సముద్రము, దక్షిణమున హిందూ మహాసముద్రము, పశ్చిమ మున యూరపుఖండము, తూర్పున శాంత (పసిఫిక్) మహా సముద్రము ఉన్నవి. ఈ ఖండము అమెరికానుండి బేరింగు జలసంధి చేతను, నైరృతి దిశ యందు ఆఫ్రికా నుండి సూయజ్ కాలువ చేతను వేరుచేయబడుచున్నది.

ఈ ఖండము ఉత్తరతీరము యొక్క పొడవు సుమారు 3,500 మైళ్ళు. అరేబియా యొక్క నైరృతి దిక్కున నుండెడు బాబల్ మాండల్ జలసంధి నుండి ఈశాన్య దిశ చిట్టచివరనున్న డెజ్నీ వా అనబడేడు తూర్పు అగ్రమువరకు ఆసియా పొడవు 6,900 మైళ్ళు. ఈశాన్యదిశ చిట్టచివర నున్న బెల్యూస్కిన్ అగ్రము నుండి దక్షిణమున మలయా ద్వీపకల్పపు కొసన నుండెడు రొమేనియా అగ్రము వరకు ఆసియా వెడల్పు 5,300 మైళ్ళు.

ద్వీపములు - ద్వీపకల్పములు  : ఆసియా ఖండపు ప్రాక్- ఆగ్నేయ దిశలందు వేలకొలది ద్వీపములుకలవు. ఇవన్నియు పసిఫిక్ , హిందూమహా సముద్రములలో నున్నవి. ఇవి వివిధ పరిమాణములు కలిగియున్నవి. ముఖ్యముగా, ఆగ్నేయదిశయందు ఆసియా, ఆస్ట్రేలియా ఖండములమధ్య అనేక ద్వీపములు కలవు. ఈశాన్యదిశ నుండి మొదలు పెట్టి చూచినచో వరుసగా బేరింగు, సాల్వెన్, కురైల్, జపాన్, ర్యూక్యూ, ఫార్మోజా, ఫిలిప్పయిన్, హెయినాన్, అండమాన్, నికోబార్, జావా, సుమిత్రా, బోర్నియో మొదలయిన దీవులు కనబడగలవు. అవికాక, పశ్చిమ దిక్కున మధ్యధరా ప్రాంతమున సైప్రెస్, ఈశాన్యమున రోడ్సు దీవులు, హిందూమహాసముద్రమున లక్కదీవులు, మాల దీవులు, ఉత్తరమున లియాషోవు ద్వీప సమూహము మొదలగునవి చెప్పతగినవి. తూర్పున కమాచట్కా, కొరియా ద్వీపకల్పములు, దక్షిణమున ఇండియా, ఇండో చైనా, అరేబియా, మలయా ద్వీపకల్పములు గలవు. నైసర్గికస్థితి-స్వాభావిక విభాగములు : ఆసియాఖండము అనేక పర్వతములతో, పీఠభూములతో నిండి సగటున సముద్ర మట్టమునకు 2,000 అడుగుల ఎత్తున నున్నది. పెక్కు మైదానములుసు గలవు. నైసర్గిక స్థితిదృష్ట్యా ఆసియా ఖండము నాలుగు స్వాభావిక విభాగములుగా విభజింపవచ్చును.

1. ఉత్తర పల్లపు భూములు.
2. మధ్యస్థ త్రిభుజాకారపు ముడత పర్వతశ్రేణుల సమూహము.
3. దక్షిణ పీఠభూములు,
4. మహానదుల లోయలు, లేక మైదానములు.

పల్లపుభూము లనబడు ఈ సమతల భూభాగము సైబీరియాను, యూరపులో కొంతభాగమును ఆక్రమించి యున్నది. యూరల్ పర్వతములు ఈ మైదానమును విభజించుచున్నవి. ఆసియాలో మైదానములు ముఖ్యముగా “ఓబి, యన్నిసి, లీనా, ఆమూ గేరియా, సిర్ డేరియా నదులు ప్రవహించుటవలన నేర్పడినవి. ఈ మైదానములో నైరృతి భాగము టురాన్ మైదానముగాను, తక్కినది సై బీరియా మైదానముగాను పేర్కొనబడును.

పర్వతములు - పీఠభూములు : ఆసియా ఖండము మధ్య భాగమునుండి పర్వతపంక్తులు వివిధ దిశలకు వ్యాపించి ఉన్నవి. వీటి మధ్య ఎత్తయిన పీఠభూములు కలవు. ఇవి యూరపునుండి పసిఫిక్ మహాసముద్రమువరకు వ్యాపించి వాయవ్య, ఆగ్నేయ ఆసియాల మధ్య అడ్డుగా ఉండి మార్గసౌకర్యములకు నిరోధము కల్గించుచున్నవి. ఇవి అడ్డుగా ఉండుటవలన ఈ రెండు ప్రాంతములలోను శీతోష్ణస్థితులలో అధిక వ్యత్యాసము కనపడగలదు. ఈ పర్వత పంక్తులు ముఖ్యముగా పామీర్ నాడ్, ఆర్మీనియన్ నాడ్ అనబడు రెండు ఎత్తైన పీఠభూములనుండి వివిధ దిశలకు వ్యాపించి ఉన్నవి. వివిధ దిశలకు విస్తరించియుండిన పర్వతపంక్తుల నడుమ ఎత్తయిన పీఠభూములు కలవు. ఈ పర్వతపంక్తులలో పొండియాన్, లూరస్, ఎల్బజ్, జాగ్రాస్, సలేమాన్, కిర్తార్, కుర్దిస్థాన్, హిందూకుష్, కున్లిస్, ఆల్టిన్, ఓన్ షాన్ మొదలగునవి పేర్కొనదగినవి. ఓన్ షాన్ పర్వత శ్రేణి పెక్కు చిన్న చిన్న పర్వతపంక్తుల సమూహము. వీటిలో చాల ముఖ్యమయినది అల్టాయి. పర్వతశ్రేణి. ఇవికాక హిమాలయ పర్వతముల తూర్పు కొననుండి ఆర్ కాన్ యోమా, పెగుయోమా అను రెండు పర్వతపంక్తులు క్రమముగా బర్మా, అండమాన్, నికోబారు, జావా, సుమిత్రా దీవులలోనికి వ్యాపించి, చివరన మలయాలోనికి ప్రవేశించుటవలన మలయాపర్వత శ్రేణులని పిలువబడుచున్నవి. ఈ విధముగా పెక్కు ఎత్తయిన పర్వతపంక్తుల కేంద్రస్థానము గనుక నే పామీరు పీఠభూమిని "భూమిపై కప్పు" అందురు.

ఎత్తయిన పీఠభూములలో ఎక్కువ ఎత్తయినటు వంటిది టిబెట్టు పీఠభూమి. ఇది సముద్ర మట్టమునకు 15,000 అడుగుల ఎత్తున నున్నది. ఆసియా దక్షిణ, ఆగ్నేయ ప్రాంతములలో ప్రవహించెడు కొన్ని మహానదులు ఈ పీఠభూమియందే పుట్టినవి. ముఖ్యముగా సింధు, బ్రహ్మాపుత్ర, యాంగ్ సికియాంగ్, హోయాంగుహొ నదులకు ఈ పీఠభూమి జన్మస్థానము.

ఎడారులు : ఎడారులలో టరీమ్ ఎడారి, గోబీ ఎడారి ప్రసిద్ధి కెక్కినవి. టరీమ్ ఎడారి ఓన్ షాన్, ఆల్టిన్ పర్వత పంక్తుల మధ్య గలదు. గోబీ ఎడారి మంగోలియా దేశమును చాలభాగము ఆవరించియున్నది.

పీఠభూములు  : ఇరాన్ పీఠభూమి పొండియాన్, లూరస్ పర్వతపంక్తుల మధ్య ఉన్నది. ఈ పీఠభూమినయి ఆఫ్ ఘనిస్థాన్, బెలూచిస్థాన్, ఇరాన్, టర్కీ, మున్నగు దేశములు కలవు. దీని ఎత్తు 2,000 నుండి 8,000 అడుగుల వరకు నుండును.

అరేబియా, ఇండియా, యున్నాన్, ఇండోచైనా పీఠభూములు మిగుల ప్రాచీనమయినవి. ఎక్కువ కాఠిన్యము, కలిగిన శిలలచే నిండియున్నవి.

సరస్సులు : ఆసియాయందు వివిధ పరిమాణములలో పెక్కు సరస్సులు కలవు. వీటిలో కొన్ని ఖండాంతర సముద్రములు. ఈ సరస్సులు చాలభాగము సముద్ర మట్టమునకు చాల ఎత్తున నున్నవి. విక్టోరియా సరస్సు సముద్రమట్టమునకు 13,400 అడుగుల ఎత్తున ఉన్నది. ఇది అన్ని సరస్సులకంటే చాల ఎత్తున ఉన్నది. లవ్ నార్, హాల్ మండు సరస్సులు తరువాత చెప్పతగినవి. వీటి పరిమాణము, ఆకృతి, ఋతువులనుబట్టి మారుచుండును. ఇవి అనేక లవణములను కలిగి యున్నవి. ఆసియాలో కెల్ల పెద్ద సరస్సు కాస్పియన్ సముద్రము. దీని విస్తీర్ణము 169,300 చ. మై. ఎరల్ సముద్రము (27,000 చ. మై.) బాక్ కాష్ సరస్సు ( 84,000 చ.మై) బైకల్ సరస్సు (13, 180 చ. మై.) లాస్ నార్ సరస్సు, టుంగాయామ్, నోర్ జంగ్రీ, మానస సరోవరములు ఎన్నదగిన సరస్సులు. ఈ సరస్సులలోనికి పెద్దనదులు ప్రవ హించుచుండును.

'నదులూ : ప్రపంచములోని కొన్ని పెద్దనదులు ఆసియాలో కలవు, ఈఖండమందు పెక్కు నదులు ఉన్నప్పటికీ సుమారు 50 మైళ్ళ ప్రదేశము నిర్జలమయమై యున్నది. ఈ ఖండమందు ప్రవహించెడు నదులను 1. ఆర్కిటిక్ మహాసముద్రములో కలిసెడు నదులు, 2. పసిఫిక్ మహా సముద్రములో కలిసెడు నదులు, 3. హిందూ మహా సముద్రములో కలిసెడు నదులు, 4. ఖండాంతరపు సరస్సులలొ కలిసెడు నదులు అని నాలుగు తెగలుగా విభజింప వచ్చును.

ఓబి (2,700 మై.), యన్నిసి (3,300 మై.), లీనా (2,800 మై.) అనునవి చాల పెద్దనదులు, ఆర్కిటిక్ మహా సముద్రములో కలియును. ఈ నదులన్నియు సంవత్సరములో తొమ్మిది నెలలు గడ్డకట్టి యుండును. అప్పుడు అవి రాకపోకలకు ఉపయోగ పడవు.

ఆమూ గేరియా, సిర్ డేరియా, హొ యాంగ్ హో యాంగ్ హో, సీకియాంగు నదులు పసిఫిక్ సముద్రములో కలియును. అమూరు (2,600 మై.), హొ యాంగ్ హో (2,700 మై.), యాంగ్ సికియాంగ్ (3,400 మై.), సికియాంగ్ (1,650 మై.), మీ కాంగ్ (2,500 మై.), మీనాంగ్ మొదలగునవి పసిఫిక్ మహాసముద్రములోనికి ప్రవహించుచుండును. హొయాంగ్ హో నది అతి వేగముగా ప్రవహించుచు, విపరీతమైన వరదలకు లోనై, తీరని భీభత్సము గావించు చుండును. కావున దీనిని చైనా “దుఃఖదాయిని " అందురు. సిరియాంగు ముఖద్వారము నొద్దనే "కేంటన్" అను రేవు పట్టణము కలదు.

సోల్విన్ (1,750 మై.), ఐరావతి (1,250 మై.), బ్రహ్మపుత్ర (1,680 మై.), సింధు (1,700 మై.), టైగ్రెస్, యూప్ర టీస్, మహానది, తపతి, నర్మద, గోదావరి (900 మై.), గంగ (1,540 మై.) మొదలయిన నదులు హిందూమహా సముద్రములో సంగమించును. వీటిలో గంగ, సింధు, బ్రహ్మపుత్ర అను నదులు చాల పెద్దవి. యూఫ్రటీస్, టైగ్రెస్ అను నదులు ఆసియా మైనరు ప్రాంతములో విడివిడిగా పుట్టి, జంటగా ప్రవహించి, చివరకు రెండును కలిసి "పాటెల్ అరబ్" అని పిలువబడుచు పర్షియన్ సింధు శాఖలో పడును.

ఆసియాలోని కొన్ని నదులు సముద్రములను చేరక ఖండాంతర మందలి కొన్ని సరస్సులలో కలియుచున్నవి. ఉదా : టరీం, ఆమూడేరియా, సిర్ డేరియా నదులు.

శీతోష్ణస్థితి  : ఆసియా వివిధములయిన విపరీత పరిస్థితులను కలిగి యున్నది. శీతోష్ణస్థితులు రెండు ముఖ్యవిషయములపై ఆధారపడి ఉన్నవి. 1. విపరీత పరిణామము, ఆకృతి. 2. నైసర్గికస్థితి - ముఖ్యముగా పీఠభూములు, పర్వతశ్రేణులు. ఆసియా మధ్యభాగమునం దుండెడి ఏప్రదేశమయినను సముద్రతీరమునకు 1500 మైళ్ళకంటే ఎక్కువ దూరములోనే ఉన్నది. అందువలన శీతోష్ణస్థితిలో చాల భేదముండును,

ఆసియా ఇంచుమించుగా భూమధ్య రేఖనుండి ఉత్తర ధ్రువప్రాంతమువరకు వ్యాపించియుండుటవలన ఉష్ణోగ్రతలు క్రమముగా దక్షిణమునుండి ఉత్తరమునకు పోవు కొలది తగ్గుచుండును. సూర్యుడు భూమధ్య రేఖనుండి దక్షిణార్థ గోళములోనికి పోవుకొలది ఆసియాలో ఉష్ణోగ్రతలు తగ్గుచుండును. ఈ ఉష్ణోగ్రత ఖండాంతర్భాగమున ఎక్కువగాను, తీరమున తక్కువగాను తగ్గుచుండును.

గ్రీష్మ, శీతకాలములందలి ఉష్ణోగ్రతల వ్యత్యాసము భూమధ్య రేఖ సమీపించుకొలదిని, సముద్ర తీరము సమీపించు కొలదిని, తగ్గుచున్నది. ఆసియా దక్షిణ ప్రాంతమున అత్యధిక ఉష్ణోగ్రతలు 110-112° ఫా వరకు పోవును అత్యల్ప ఉష్ణోగ్రతలు హిందూ దేశమున 30° అక్షాంశము దిగువన 32° ఫా. కంటే తక్కువ ఉండవు.

ఆసియాలో విపరీత వ్యత్యాసము వెర్కో యాన్స్కు వద్ద ఉండును. అత్యల్ప ఉష్ణోగ్రత శీతకాలములో 85° వేసవిలో 59° ఫా. ఉండును. వ్యత్యాసము 134° ఫా. డిగ్రీలు.

ఆఫ్ఘనిస్థాన్, పర్ష్యా, మధ్యాసియాలోని పీఠభూములు మొదలయిన ఎత్తయిన ప్రదేశములందు శీతకాలమునందలి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికి, వర్షపాతము చాల తక్కువగా నుండుటవలన వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కు వగానే ఉండును.

పీడనము - పవనములు  : శీతకాలమున ఉష్ణోగ్రతలు ఉత్త రదిశకు పోవుకొలది తగ్గుచుండుటవలన పీడనముకూడ క్రమముగా ఎక్కువ అగుచున్నది. ఖండాంతర్భాగమున ఉష్ణోగ్రతలు ఇంకను తక్కువగా నుండుటవలన ఈ ప్రాంతమున వాయుపీడనము ఎక్కువయి అత్యధిక పీడన గుండములు ఏర్పడును. వీటిని "యాంటీ సై క్లోనులు" అనికూడ అందురు. ఈ అధిక పీడన ప్రాంతములనుండి అతి శీతలమైన పొడిగాలులు తీరము వైపునకు అతి వేగముతో వీచు చుండును. ఇటువంటి అధిక పీడనము గల ప్రాంతము ఇంచుమించు సై బీరియాను ఆవరించి బైకల్ సరస్సు ప్రాంతమున అత్యధిక పీడనమును కలిగి ఉండును. ఇదేకాలములో అత్యల్పపీడన ప్రాంతములు ఉత్తర పసిఫిక్ మహాసముద్రములో కురైల్ దీవుల దగ్గరను, ఆస్ట్రేలియాలోను ఏర్పడును. గాలి ఎల్లప్పుడు ఎక్కువ పీడన ప్రాంతము నుండి తక్కువ పీడన ప్రాంతమునకు వీచును. కనుక తూర్పు, దక్షిణ, ఆగ్నేయ, ఆసియా ప్రాంతములు శీతల ఋతుపవనములకు గురి అగుచున్నవి.

అత్యధిక పీడన ప్రాంతమునుండి వీచెడి శీతలమైన పొడి గాలులు హిందూ దేశమును చేరనివ్వకుండ హిమాలయ పర్వతములు అడ్డుతగులు చున్నవి. అందువలన హిందూ దేశములోని శీతకాలపు ఉష్ణోగ్రతలు అంత స్వల్పముగా ఉండవు. కాని హిందూ దేశములో వీచెడి చలిగాలులు ఈ దేశపు పశ్చిమోత్తర ప్రాంతములో ఏర్పడ్డాడు మరియొక అధిక పీడనగుండము నుండి వీచుచున్నవి. శీతకాలములో వీచెడి పొడిగాలులను ముఖ్యముగా ఆసియా ఈశాన్య ప్రాంతమునం దుండెడి దేశములలో శీతలఋతుపవనము లందురు. సముద్ర ప్రాంతములందు ఏర్పడిన అత్యధిక పీడన ప్రాంతములనుండి వీచెడి గాలులను వర్షఋతుపవనము లందురు. వర్షపాతము చాల భాగము వీటివలన కలుగు చున్నది. ఇండియాలో ఇవి నైరృతి దిశనుండి వీచుచున్నవి.

వర్షపాతము  : ఆసియాలో వర్షపాతమంతయు ఇంచుమించుగా వేసవి ఋతుపవనములవలననే జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలలలో కలుగుచున్నది. ఈ వర్షము ఆసియా ఋతుమండల మనబడు ఆగ్నేయ ఆసియా ప్రాంతమున ఎక్కువగా కురియుచున్నది. సముద్ర తీరములందు వర్షపాతము ఎక్కువగా నున్నది. కేంటన్, బటేవియా, సింగపూరు, కలకత్తా, బొంబాయి -- ఇవన్నియు వర్షఋతు పవనములు వీచెడి మార్గములో ఉండుటచే ఎక్కువ వర్షపాతమును కలిగియున్నవి. హిందూదేశమున అస్సాం రాష్ట్రములోని చిరపుంజీ ప్రపంచములో నెల్ల ఎక్కువ వర్షపాతము కలిగియున్నది. దీని సగటు వర్షపాతము 458". పశ్చిమ సైబీరియాలో 15" - 20" వర్షము మాత్రమే కురియును.

వృక్షజాలము  : ఆసియాలో ఎన్ని విధములైన శీతొష్ణస్థితు లున్నవో ఇంచుమించు అన్ని రములయిన వృక్ష జాతులు కలవు.

(1) ఉష్ణమండలములోని అడవులు భూమధ్య రేఖ 5° ఉత్తర అక్షాంశమునుండి 5° దక్షిణ అక్షాంశమువరకు వ్యాపించి ఉన్నవి. ఈ మండలములోని వృక్షములు చాల దట్టముగ పెరిగి ఎల్లప్పుడు పచ్చని ఆకులను కలిగి ఉండును. కేన్ మొదలగునవి యీ జాతికి చెందినవి. అడవులు దట్టముగా పెరుగును. అందువలన సూర్యరశ్మి చొరబడుట కష్టము. కావున నేలపై గడ్డిమొలవదు. వృక్షములు 200 -- 250 అడుగుల ఎత్తువరకు పెరుగును. ఒకేరకపు చెట్లు గుంపులుగా పెరుగవు.

(2) 5 ఉ. అ, 5° ద, అక్షాంశముల నుండి 20° ఉత్తర, దక్షిణ అక్షాంశములవరకుగల భూమిలో ఉష్ణమండల ఋతు పవనపు అడవులు కలవు. ఋతుపవన దేశములు ఇండియా, ఇండోచైనా, సయాం, జపాన్ మొదలయినవి. ఆగ్నేయ ఆసియా అంతయు ఋతుపవన ప్రాంతముననే ఉన్నదని చెప్పవచ్చును. ఈ దేశములలో మూడు కాలములుండును. ఈ అడవులలోని వృక్షములకు చాల విశాలమైన పత్రములు ఉండును. వేసవిలో ఆకులు రాలును. ఈ అడపులలో ఒకేరకపు వృక్షములు వేలకొలది గుంపులుగా పెరిగి అనేక చదరపు మైళ్ళ ప్రాంతమును ఆక్రమించును. ఈ అడవులలో గల సాల్, బర్మా ఐరన్ వుడ్, టేకువృక్షములు "పేర్కొన దగినవి. వర్షపాతము 40 కంటె తక్కువ ఉన్న ప్రదేశములలో ఈ వృక్షములు కానరావు. ముండ్లు కలిగిన తుమ్మజాతికి చెందిన వృక్షములు కనబడును. వీటికి అంతగా నీరు అవసరము లేదు. సముద్రము యొక్క ఒడ్డున ఇసుక నేలలో సర్విచెట్లు పెరుగును.

(i) ఆసియా తూర్పుభాగమున 30° - 45° ఉత్తర అంశముల మధ్య ఉండెడు ప్రాంతములో సమశీతోష్ణ ఋతుపవన మండలములకు చెందిన అడవులు కలవు. ఇచ్చట శీతోష్ణస్థితి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణస్థితికంటే స్వల్పముగా భిన్నమై యున్నది. ఈ ప్రాంతమునందు అడవులు దట్టముగా పెరుగును. ఇవి ఏకాలములోను ఆకులను రాల్చవు. ఎల్లప్పుడును పలుచని ఆకులను కలిగి యుండును. చెట్ల మ్రానులు లావుగాను, ఆకులు చిన్నవిగాను, బెరడు ఒకమాదిరి మెత్తగాను ఉండును. ఓకు, నేంపర్సు, నుగ్నో లియాస్, కామిల్ల ను, బీచెస్, లారెల్సు అనునవి యీ అడవులలో ముఖ్యమైన వృక్షములు. ఈ అడవులు చైనా, జపాన్ దేశములలో కలవు.

(4) ఆసియా తూర్పు భాగమున 45°-60° ఉత్తర అక్షాంశము మధ్య శీతల సమశీతోష్ణ మండలపు అడవులు కలవు. మంచూరియా, తూర్పు కొరియా, ఉత్తర జపాన్, ఉత్తర చైనాలు ఈ మండలములో నున్నవి. ఈ మండలములో త్రిభుజాకార పత్రపు అడవులు కన్పించును. ఓక్, ఆల్టర్, బీచ్ మొదలగునవి ఈ అడవులలో ముఖ్యమైనవి. వీటి కలప చాల శ్రేష్ఠమైనది.

(5) ఆసియా నైరృతి భాగమున 20° - 30° ఉత్తర' అక్షాంశముల మధ్య ఎడారి ప్రాంతము కలదు. ఈ ఎడారులలో వర్షపాతము చాల తక్కువగా ఉండుటచే ముండ్ల పొదలు విస్తారముగా పెరుగును. కేక్టస్, అగేల్ వృక్షములు ఎడారులలో కలవు. కేక్టస్ మ్రానులోను, అగేల్ ఆకులలోను నీటిని దాచుకొనును. ఖర్జూర వృక్షము అక్కడ చాల ప్రాముఖ్యము కలది. ఈ ఎడారులలో నుండెడు “ఒయాసెస్” ప్రాంతములలో పంటలు పండించేదరు. ఆ ప్రాంతములలో పల్లెలు కన్పడును.

(6) ఆసియా పశ్చిమ భాగమున 30-45° ఉత్తర అక్షాంశముల మధ్య శీతోష్ణమండలారణ్యములు కలవు. ఇది మధ్యధరా ప్రాంతము. ఈ మండలమందలి వృక్షములు ఆకులను రాల్చక సంవత్సరము పొడుగునను పచ్చని ఆకులతో ఒప్పుచుండును. ఆరిన్, అత్తి, మల్బరీ చెట్లు ద్రాక్ష పండ్ల తీగెలు ముఖ్యమైనవి. చెట్ల ఆకులు చాల దళసరి గాను, నునుపుగాను ఉండును. ఆకులు దళసరిగా ఉండుట వలన ఆకులనుండి నీరు త్వరితముగా ఆవిరికాలేదు. కొన్ని రకములయిన చెట్ల ఆకులపయి ఒక రకమైన జిగురుపదార్థము పూతపూయబడినట్లు ఉండును. దీనివలన కూడ నీరు ఆవిరియగుట అరికట్టబడును. ఈ అడవులలో లభ్యమగు పండ్లన్నియు సబ్బు, ద్రాక్ష సారాయి, పట్టు మొదలయిన పరిశ్రమలలో విరివిగా నుపయోగపడుచున్నవి.

(7) ఆసియాఖండపు మధ్య భాగమున 30° 45° ఉత్తర అంశముల నడుమ సమశీతోష్ణ మండలపు గడ్డిభూములు గలవు. ఉష్ణోగ్రతల వ్యత్యాసము అధికముగా నుండును. వర్షపాతము తక్కువగా నుండుటవలన వృక్షములు పెరుగ జాలవు. గడ్డి మాత్రమే పెరుగును. ఈ గడ్డి భూములను "స్టెప్పీ" లందురు. ఇవి సై బీరియా నైరృతి దిశయందును, మంగోలియా యెడారికి సమీపమునందును, మంచూరియా పల్ల పుభూములలోను కనబడును. ఈ గడ్డి వ్రేళ్ళు లోతునకు పోవు. ఆకులు చాల సన్నముగా నుండును. గడ్డి నేలను పూర్తిగా ఆవరించియుండదు. ఉత్తరమునకు పోవుకోలది ఈ మండలమునందు గడ్డి దట్టమగుచుండును. నైరృతి, దక్షిణ ప్రాంతములకు పోవు కొలది గడ్డి పలుచ పలుచగా అక్కడక్కడ కనిపించును. ఈ ప్రాంతములను స్టెప్పీ ఎడారులందురు. ఇచ్చటి జనుల ముఖ్యవృత్తి పశు పోషణము.

(8) ఆసియా ఖండపు 45 - 66° ఉత్తర అక్షాంశముల మధ్యనున్న భాగమున ఖండాంతర శీతల సమశీతోష్ణమండలపు అడవులు కలవు. ఇది సమతల ప్రాంతము. ఉష్ణోగ్రతలు తక్కువగా నుండుటవలన నీరు ఎక్కువగా ఆవిరిగా మారదు. ఈ ప్రాంత మండలమందు ఎల్లప్పుడు పచ్చగా నుండెడి త్రికోణాకారపు అడవులు ఉన్నవి. ఇవి సై బీరియాలో నున్నవి. వర్షపాతము తక్కువగా నున్నప్పటికి ఉష్ణోగ్రత చాల తక్కువగా నుండుటవలన వృక్షములు పెరుగగలుగుచున్నవి. ఇక్కడ సరుగుడు చెట్లు విస్తారము పెరుగును.

(9) ధ్రువములనుండి ఆర్కిటిక్, అంటార్కిటిక్ వర్తులముల మధ్యనుండు ప్రాంతములు అతి శీతల ప్రదేశములు. ఈ ప్రాంతమును ఉత్తర టండ్రాభూము లందురు. ఇది చాల కాలము మంచుచే కప్పబడి యుండును. అడవులు కానరావు. సూర్యుడు కొన్ని రోజులవరకు కానరాడు. ధ్రువము నొద్ద ఆరు నెలలు రాత్రి, ఆరు నెలలు పగలు ఉండును. కొన్ని రోజులవరకు సూర్యాస్తమయము కాదు. వర్ష పాతము 10", 12" ఉండును. ఈ మండలమున వృక్షజాలము కానరాదు. అక్కడక్కడ వూస్, విచెన్, ప్రొట్రికమ్ మొదలగునవి కనబడును. పక్షులు చేపలు ఇక్కడి సహజ సంపద. వేట, చేపలు పట్టుట ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తులు. ప్రజలు ధ్రువపు జింకలను పెంచుదురు. ఈ ప్రాంతమున ధ్రువపుజింక, ధ్రువపు నక్క, పొట్టేలు మొదలయినవి ఉండును. ధ్రువపుజింక మాంసము,పాలు, చేపలు ఇక్కడి ప్రజల ఆహారమునకు పనికివచ్చును,

పంటలు : వడ్లు, గోధుమలు, పొగాకు, సింకోనా, రబ్బరు, మల్బరీ, సోయాచిక్కుడు, ప్రత్తి, చెరకు, నూనె గింజలు, జొన్నలు, తేయాకు మొదలగు పెక్కు పంటలను పండించుటలో ఆసియా చాల ప్రసిద్ధిగాంచినది. ప్రపంచములో నూటికి 95 పాళ్ళ ధాన్యము ఆసియాలోనే పండును. రబ్బరు, తేయాకు, చెరకు పంటలలో ఆసియా ప్రథమ స్థానము గడించినది. ఆగ్నేయ ఆసియా ముఖ్యముగా పంటలకు చాల ప్రాముఖ్యము చెందినది. జపాన్, ఇండియా, తాయిలాండ్, కొరియా, బర్మా, ఫిలిప్పయిన్ దీవులు, మలయా దేశములలో అధిక సంఖ్యాక జనులు వ్యవసాయము ముఖ్య వృత్తిగా కలిగి ఉన్నారు. నైరృతి ఆసియాకు చెందిన ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాఖ్, సౌది అరేబియా, ఎమెన్ దేశములు వ్యవసాయము విషయమున మిక్కిలి ప్రసిద్ధి చెందినవి కావు. ఈ దేశములలో కాఫీ, ప్రత్తి, గోధుమలు, మొక్కజొన్న, ఖర్జూర ఫలములు పండును.

ఖనిజములు  : ఖనిజ సంపదలో ఆసియా ఖండము ఏ మాత్రము ఇతర ఖండములకు తీసిపోదు. ఇనుము, బొగ్గు, పెట్రోలియం, మాంగనీసు, అభ్రకము, సీసము, వెండి, కిరసనాయిల్, తగరము, రాగి, బంగారము మొదలయిన అనేక ఖనిజములు ఈ ఖండమందు లభ్యమగుచున్నవి.

రవాణా సౌకర్యములు  : పరిశ్రమలు, రవాణా సౌకర్యములు యూరప్, అమెరికా దేశములలో అభివృద్ధిచెంది. నట్లు ఆసియాలో అభివృద్ధి చెందలేదు. దీనికి ఆసియా నైసర్గికస్థితి, పరిమాణము, శీతోష్ణస్థితి ముఖ్యకారణములు. ధ్రువ ప్రాంతములు చాల వెనుకబడియున్నవి. ఆగ్నేయ ఆసియా చాల సారవంతమైన దగుటవలన అందు రవాణా సౌకర్యములు తక్కిన ప్రాంతములందు కంటే ఎక్కువగానే ఉన్నవి. నైరృతి ఆసియాలో, సరకులను, మనుష్యులను, మోయుటకు ఒంటెలను ఉపయోగించెదరు. గాడిదలు, గొట్టెలు, బజ్జెలు, హిమాలయ పర్వతములను దాటుటకు ఉపయోగపడుచున్నవి. కంచర గాడిదలను, గుఱ్ఱములను, ధ్రువపు జింకలను, క్కుక్కలను, ధ్రువపు కుక్కలను "స్లేస్ (Sledges)" అను ఒకరకపు మోటు బండ్లకు కట్టుదురు. యాంగ్ సికియాంగు, సికియాంగ్ అమూరు, గంగ, మున్నగు మహానదులు రహదారులుగా ఉపయోగపడుచున్నవి. వీటిగుండ పెద్ద స్టీమర్లుకూడా లోపలికి రాగలవు.

మొదటి సంగ్రామము తరువాత రైలు మార్గములు విరివిగా అభివృద్ధి చెందినవి. ట్రాన్సు సైబీరియన్ రైలు మార్గము పొడవు 5400 మైళ్ళు. మోటార్లు, లారీలు, వాడుకలోనికి రాగానే ఆసియాలో రోడ్ల అభివృద్ధికూడ ఎక్కువైనది. ఆసియా నుండి అన్ని దేశములకు విమాన సౌకర్యములు కలవు.

రేవు పట్టణములు : ఆసియాలో కరాచీ, బొంబాయి, కొచ్చిన్, మద్రాసు, కలకత్తా, రంగూన్, సింగపూర్, హాంకాంగు, కేంటన్ మొదలగునవి ముఖ్యమయిన రేవు పట్టణములు. ఈ రేవు పట్టణములనుండి ముఖ్యముగా ఆహారధాన్యములు, ప్రత్తి, నూనెగింజలు, జనపనార, తేయాకు, కాఫీ, ఉన్ని, తోళ్ళు, రబ్బరు, కొబ్బరి, నల్ల మందు, బొగ్గు, ఇనుము, మాంగనీసు, తగరము మొదలయినవి ఎగుమతి అగును. యంత్ర సామగ్రి, నూలు, ఉన్ని గుడ్డలు, పంచదార, మోటారులు, యంత్రములు మొదలయినవి దిగుమతి అగును.

ప్రజలు - వృత్తులు  : ఆసియా ఖండమునందు ప్రపంచమునందలి మొత్తము జనాభాలో సగముకంటే ఎక్కువ కలదు. ఈ జనాభా అంతయు, ఆసియాయందు అంతటను ఒకేరీతిగా వ్యాపించి యుండలేదు. ముఖ్యముగా చైనా, హిందూదేశములు ఎక్కువ జనాభాను కలిగి యున్నవి. చైనా జనాభా 47 కోట్లు, ఇండియా జనాభా 36 కోట్లు. సగటున ఒక చదరపు మైలునకు 70 మంది చొప్పున కలరు. టండ్రాభూమి, మధ్యాసియా పీఠభూమి ప్రాంతము, నైరృతి - ఆసియా, అరేబియా, సై బీరియా మొదలయినవి చాలా అల్ప జనాభా కలిగిన దేశములు.

ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. సిల్కు, నూలు, బట్టల నేత, చేపలు పట్టుట, రబ్బరు పెంపకము, ఖనిజము లను త్రవ్వుట మొదలగునవి ఇతర వృత్తులు. మిల్లులలోను, ఫ్యాక్టరీలలోను జనులు పనిచేయుచున్నారు. ఇరాన్, ఇరాఖ్, టర్కీ దేశాలలో తివాచీలు నేయుదురు. జపాన్ లోని ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయమే అయినను, అచ్చట పరిశ్రమలు బాగుగ అభివృద్ధిచెందుటవలన అశేష జనులు ఆయా వ్యాపారములందు కృషి సల్పుచున్నారు.

జాతులు...మతములు_ సంస్కృతులు : ఆసియాఖండము లనేక జాతి, మత, సంస్కృతులకు పుట్టినిల్లు, ఈ ఖండ మందు నూటికి 60 మంది మంగోలియాజాతివారు. వీరు సైబీరియా, జపాన్, కొరియా, మంచూరియా, చైనా, ఇండోచైనా, హిమాలయ పర్వత ప్రాంతము, ఇండోనీషియా, మలయా, ఫార్మోజా మొదలయిన దేశములలో కలరు. వీరు చామనచాయ గలిగిన శరీరము, నల్లటి జుట్టు, చప్పిడిముక్కు కలిగి పొట్టిగానుందురు. శరీరమునందును ముఖములందు వెండ్రుక లుండును.

గంగా సింధు మైదాన ప్రాంతము, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, అరేబియా మొదలగు దేశములలో కాకసస్ జాతివారు కలరు.

దక్షిణ హిందూదేశము, అండమాన్ దీవులు మొదలగు దేశములలోని కొందరు ప్రజలు మలయా, ఫిలిప్పైన్, సుమిత్ర దీవులలోని జనులు "నిగ్రోయడ్" జాతివారు. వీరికి సల్లటి శరీరము, మెత్తటి జుట్టు, చప్పిడిముక్కు, పొడుచుకొని యున్న పెదిమలు ఉండును.

ఇంకను ఆఫ్రోలోయడ్ జాతివారు కలరు. హిందూ దేశ మధ్యభూభాగమున నున్న కొన్ని కొండజాతులు ఈ జాతికి చెందినవే.

ఆసియాలోని ప్రజలందరు ఆయా ముఖ్యజాతులకు చెందినవారని నిర్ధారణగా చెప్పుట కష్టము. పెక్కు జాతుల సంబంధ బాంధవ్యములచే మిశ్రజాతులు ఏర్పడినవి.

ఆసియాలో జూతులతో పాటు వివిధమతములు, సంస్కృతులు కలవు. ఈ ఖండము జైన, బౌద్ధ, మహమ్మదీయ, క్రైస్తవ, హిందూమతములకు జన్మస్థానము. మొట్టమొదట పేర్కొనదగినది చైనా సంస్కృతి. ఇది చాల ప్రాచీనమైన సంస్కృతి. మంచూరియా, ఉత్తర కొరియా, జపాన్, ఫార్మోజా, మంగోలియా, టిబెట్, ఇండోచైనా, తాయిలాండ్, తూర్పు ఇండియా దీవులు మొదలయిన దేశములలో చైనా సంస్కృతి కన్పడును. ఈ దేశములన్నియు చైనా సంస్కృతి ప్రభావమునకు లోనైనవి. చాలమంది చైనీయులు బౌద్ధులు. మహమ్మదీయ, క్రైస్తవ, టాయిమతములు ఈ దేశములందు వ్యాపించినవి.

ఆసియాలోని రష్యా దేశీయుల సంస్కృతికూడ ప్రశస్తమైనది. ఈ సంస్కృతిగల ప్రాంతమును నాలుగు మండల ములుగా విభజించవచ్చును.

1. యూరపులోని రష్యా తూర్పు భాగము నుండి యూరల్ పర్వతముల చివరవరకు ఉన్న ప్రాంతము. ఈ ప్రాంతము చాల అభివృద్ధి చెందుచున్నది. అనేక పట్టణములు పెరిగినవి. రహదారి సౌకర్యములుకూడ ఎక్కువగుచున్నవి.

2. పర్వతమయమయిన కాకేషియా ప్రాంతము. ఇది నల్లసముద్రమునకును, కాస్పియన్ సముద్రమునకును మధ్య నున్నది. టర్కీ, ఇరాన్ దేశముల సరిహద్దు ప్రాంతములు ఈ మండలములోనివే. ఈ మండలమున సోవియట్లు అను సంపూర్ణ స్వాతంత్య్రము కలిగిన అనేక దేశములు కలవు.

3. కాకేషియానుండి తూర్పుగా చైనావరకు ఉన్న ప్రాంతము. దీని మధ్య ఎడారులు, పర్వతములు, గడ్డి భూములు కలవు. ఈ ప్రాంతమునందలి జనులు అనేక ఉపజాతులకు, సంస్కృతులకు చెందినవారు. వీరి మతములు, భాషలు వేరు వేరుగా నున్నవి. వీరిలో పెక్కుమంది మిశ్రమజాతి సంస్కృతులను కలిగి యున్నారు. ' 4. విశాలమైన మైదానము. ఇది అడవులతో, పర్వతములతో, గుట్టలతో నిండియున్న సైబీరియా ప్రాంతము.

హిందూదేశము ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగి.యున్నది. దీనికి ఆసియాలోని తక్కిన ప్రాంతములతో సంబంధము లేదు. ఇండియా, పాకిస్థాన్ దేశాలను కొంతవరకు చైనాతో సరిపోల్చ వచ్చును. ఈ దేశాలు చైనా వలె భాగ్యవంతమయినవి కావు. ఇండియా, పాకిస్థాన్ దేశాలలో అనేక జాతులవారు, ఉపజాతులవారు కలరు. ఉత్తర హిందూదేశములో నుండెడువారిలో చాలమందికి యూరోపియన్ సాయిడ్ జాతితోను, నైరృతి ఆసియాలోని సెమిటిక్ జాతితోను సంబంధము కలదు. హిందూ దేశములోనికి యూరోపియనులు, చైనీయులు, అనేక మంది వలసవచ్చిరి. హిందూ దేశము బౌద్ధ, మహమ్మదీయ, జొరాస్ట్రియన్, క్రైస్తవ మతముల వ్యాప్తికి దోహద మిచ్చినది. బౌద్ధ, జైన మతములు హిందూమతము నుండియే బయలు దేరినవి.

ఆగ్నేయ ఆసియా, సంస్కృతి : ఆగ్నేయ ఆసియా ఉత్తరభాగమున, బౌద్ధమతము, దక్షిణభాగమున, తూర్పు ఇండియా దీవులు మొదలగు దేశములలో మహమ్మదీయ మతము వ్యాపించియున్నది. కొన్ని దేశములలో ఇతర మతములుకూడ కొన్ని కలవు.

నైరృతి ఆసియాలోని టర్కీ, అరేబియా ఇరాన్, ఇరాక్, ట్రాన్సుజోర్డాన్, ఇజ్రాయిల్ దేశములలో మహమ్మదీయ మతము కలదు. ఈ ప్రాంతము ప్రాచీన కాలమునుండి అనేకజాతుల సంస్కృతుల కలయికకు కేంద్రస్థానముగా నున్నది.

ఈ ప్రాంతమున వర్ధిల్లిన ప్రాచీన సంస్కృతులలో యూఫ్రెటీస్, టై గ్రీస్ నదుల లోయ ప్రాంతమున ఉండెడి బాబిలోనియన్ సంస్కృతి మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది.

వి, వి.