సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/అర్ష శిల్పము
ఆర్షశిల్పము : భారతదేశమందలి ప్రజలకు వేదము ప్రమాణము. మానవుడు ధర్మార్థ కామమోక్షము లనేది నాలుగు పురుషార్థములను సాధింపవలయును. ఈ పురుషార్థములను సాధించుటకు భగవదుపాసనమే సాధనము. ఈ యుపాసనము అవ్యక్తోపాసనము, వ్యక్తోపాసనము, వ్యక్తావ్యక్తో పాసనము అని మూడు విధములుగ చెప్పబడినది, ఈ యర్ధమునే 'మానసీ హోమ పూజాచ బేరపూజేతి సాత్రిధా'అని ఆగమములు ఉపాసనాత్రయ స్వరూపమును వివరించినవి. అవ్యక్తోపాసనము చేయుట కష్టసాధ్యము. దీనిని సాధించుటకు అష్టాంగయోగసిద్ధిని పొందిన వారలే అర్హులు. ఈ యుపాసనమునే హృద్యాగము, మానసా రాధనము, అమూ ర్తపూజ యని కూడ చెప్పుదురు. కరచర ణాదులతో నిర్మింపబడిన భగవద్విగ్రహమును అర్ఘ్యము, పాద్యము మున్నగు నుపచారములతో పూజించుట వ్యక్తోపాసనము. వేదప్రామాణ్యము నంగీకరింపని వారు కూడ కేవల యుక్తి వాదముచే విగ్రహారాధనము చితైకాగ్రతను సాధించుటకు అవలంబము కాగలదని విశ్వసించి విగ్రహారాధనమును ఆదరించుచున్నారు. మంత్రపూర్వకముగ అగ్నియందు చేయబడెడి హవిస్యమర్పణము వ్యక్తా వ్యక్తోపాసనము. అది అగమశాస్త్ర సిద్ధాంతము.
'శిల్పం కర్మకలాదికమ్' అను కోశమునుబట్టియు, "తత్కర్మ యన్న, బంధాయ సావిద్యా యా విముక్తయే ఆయా సాయా పరం కర్మ విద్యాన్యా శిల్పనై పుణమ్." అను శ్రీ విష్ణుపురాణమునుబట్టియు, శిల్పశబ్దము వృత్తి విద్యలుగా చెప్పబడిన అరువదినాలుగు కళలకు సాధారణముగ వాచకమైనను, ఈ శబ్దము ఆలయనిర్మాణమును, విగ్రహ నిర్మాణమును చెప్పెడి శాస్త్రమందు రూఢమై వ్యవహరింపబడుచున్నది.
మానవునకు సహజమగు సౌందర్యపిపాస శిల్పకర్మకు నివాస మయ్యె ననియు సౌందర్యోపాసనము నిత్య సత్యముతో మిళితమై విగ్రహముల ద్వారమున పరబ్రహ్మో పాసనమునకు త్రోవ చూపినదనియు చారిత్రక విమర్శకులు విశ్వసించు చున్నారు. ఇదియు కొంతవరకు సత్యము కావచ్చును. పూర్వకాలపు శిల్పము శాస్త్ర నియమములకు కట్టుపడక తన్ని ర్మాతల యొక్క సహజ కౌశలమునకు తగినట్లు ఉత్తమోత్తమముగ సృజింపబడెననియు, కాలక్రమమున అట్టి సహజ శక్తి సంపన్నులు క్షీణింపగా ఆనాటి శిల్పమును ముందుంచుకొని, తరువాతివారలు లక్షణములను కల్పించి వాటిని శిల్ప శాస్త్రములందు పొందుపరచి రనియు, శాస్త్ర నియమములకు బద్ధుడగు ఆధునిక శిల్పి తన సహజశక్తిని వినియోగించుటకు శక్తి లేనివాడై చక్కని శిల్పమును సృష్టించలేకపోవుచున్నాడనియు విమర్శకులు అభిప్రాయపడుట కలదు. ఇందలి తత్త్వము నింకను పరామర్శింపదగును.
భారత భూమియందు లోకతంత్రముల నిర్వాహమందు అన్ని సమస్యలతో పాటుగ శిల్ప కల్పనము కూడ మతముతొ సర్వాంగీణమగు సంబంధమును కలిగి సజీవముగ నిలచి యున్నది. వేదకాలము నుండియు శిల, దారువు, లోహము, మృత్తు మొదలగు ద్రవ్యములచే పని చేయునట్టి స్థపతి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి మొదలగు జాతులవారు ఆ యా సమయములందు సంఘముచే గౌరవమర్యాదలతొ ఆదరింపబడుటయేగాక సంఘముపై ఆధారపడి జీవించుటయు కలదు. ఇట్టి వృత్తి విద్యలను సర్వారంభముగ లోకమందు ప్రవర్తింపజేసిన మహాపురుషుడు విశ్వకర్మ. ఈతడు అష్టవసువులలో కనిష్ఠుడగు ప్రభాసవసుపునకు బృహస్పతి సోదరియందు జన్మించినట్లు మహాభారతమందు కలదు. మానసారగ్రంథము ననుసరించి బ్రహ్మకు విశ్వరూపుడను కుమారుడు కలడనియు, విశ్వరూపుని సంతతిలో ఆరవ పురుషుడగు చాక్షుషమునికి పురుపు, పురుషుడు, సుద్యుమ్నుడు, విశ్వుడు, సాధ్యుడు అను ఏవురు పుత్రులు కలిగిరనియు, వీరలు వాస్తుశాస్త్రమును ప్రవర్తింపచేసి
రనియు తెలియుచున్నది. శివ పురాణమందలి ధర్మసంహిత ననుసరించి అత్రిగోత్రజుడగు ప్రచేతసుని అల్లుడు సోము నకు దక్షుడు జన్మించెననియు, దక్షునకు అరువదిమంది కుమార్తెలు కలిగిరనియు, వారిలో ధర్మదేవున కిచ్చిన పది మంది పుత్రికలలో ఒక్కతె యగు వసువునకు ధరు డాదిగాగల అష్టవసువులు జన్మించి రనియు ఆ వసువులలో కనిష్ఠుడగు ప్రభాసునకు విశ్వకర్మ పుట్టె ననియు కలదు. మ్విశ్వకర్మ ఉత్పత్తిని గురించి ఆయా గ్రంథములలో వేరు వేరు రీతులు చెప్పబడినవి. అన్నిటియందును అతడు దేవశిల్పి యని నిర్వివాదముగ చెప్పబడినది.
విశ్వకర్మచే నిర్మింపబడినట్లు చెప్పబడెడి గ్రంథములు పెక్కు కలవు. ఈ గ్రంథము లన్నిటియందును వాస్తు ప్రకరణము, శిల్ప ప్రకరణము, చిత్రకర్మ అను నీ మూడు విషయములును ఉపన్యసింపబడినవి. ఈ మూడు ప్రకరణ ములును పరస్పర సహకార సహకారి భావసంబంధము కలిగియుండుటచే పరస్పరము సంకీర్ణములుగనే ఉపపాదింప బడుట ఆంతరీయకముగ తటస్థించుచున్నది.
వెనుక చెప్పినరీతిగా విగ్రహారాధన సిద్ధాంతమును ప్రవచించు శైవ వైష్ణవాగమ శాస్త్రములను ప్రవర్తింప జేసిన మహర్షులు తమ రచనలలో ప్రాకరణికముగ ఆలయ శిల్పమును, విగ్రహ శిల్పమును చెప్పవలసిన సందర్భములలో సర్వసాధారణ విషయములలో శిల్పశాస్త్రమును ఉపాధేయముగ తీసికొనుట కలదు. ఐనను ఆలయ శిల్పము, విగ్రహ శిల్పము, రూపధ్యానము మొదలగు విశేష విషయములను చెప్పుట యందు ఆగమశాస్త్రములకు ఒక ప్రత్యేకత నిర్వివాదముగ సిద్ధమైయున్నది.
ఆగమశిల్పమందు ఈ క్రింది ప్రధానవిషయములు చెప్పబడినవి. అవి భూపరీక్ష, ప్రాచీసాధనము, ఆయాది విచారము, వాస్తుపదకల్పనము, గ్రామాగ్రహారాది లక్షణము, నిర్మాణవిధి, ఆలయ విమాన మండప గోపుర ప్రాకారతటా కారామాది నిర్మాణము, శిలాపరీక్ష, దారుపరీక్ష, దళతాలాదిమాన లక్షణము, బింబనిర్మాణము, ప్రతిమారూపలక్షణము, పీఠసంఘాతము, నేత్రోన్మీలనము, బింబ ప్రతిష్ఠ మొదలగునవి.
భరత భూమి యందు ప్రచారములగు విగ్రహములను స్థూలమున వైష్ణవ విగ్రహములు, శైవ విగ్రహములు అని రెండు విధములుగ విభజింపవచ్చును. త్రిమూర్తులని ప్రసిద్ధిగల బ్రహ్మ విష్ణు రుద్రులను, దేవి, గణపతి, సూర్యుడు మొదలగు దేవతలను పై రెండు విభాగములలో ఏదో యొక దాని యందు గ్రహింపనగును. ఈ విగ్రహములు చలములు, అచలములు అని రెండు విధములుగ నున్నవి. ఇది యొక విభాగము. అట్లే ధ్రువ, కౌతుక, స్నాపన, ఔత్సవ, బలి, లౌకిక బేరము లని ఆరు విధములుగ నున్నవని మరియొక విభాగము కలదు. వైష్ణవాలయములందు విగ్రహములను ప్రాయికముగ శిల, దారువు, మృత్తిక అను ద్రవ్యములలో నొక దానితో చేయబడును. శైవాలయము లలో ధ్రువమూర్తి లింగాకారము గల శిలయైయుండును. చలమూర్తులు బంగారు, వెండి, తామ్రము మొదలగు లోహములతో నిర్మింపబడును. ఈ ధ్రువమూర్తి చిత్రము ఆర్షము, చిత్రము, చిత్రాభాసము అని మూడు విధములుగ నుండును. ఆర్ష చిత్రము సగము భాగము తెలియునది. చిత్రము షణ్మాన సహితముగ సకలావయవస్ఫూర్తి కలిగి యుండునది. చిత్రాభాసము ఖి త్తియందును, పటమందును వర్ణములతో వ్రాయునది. మరియు ఈ విగ్రహములు స్థానక ములు, ఆసీనములు, శయానములు అని మూడు సంస్థాన భేదములు కలిగియున్నవి. స్థానకమనగా నిలచియుండుట, ఆసీనము కూర్చుండియుండుట, శయానము పరుండియుండుట యని లక్షణము చెప్పవచ్చును. శయనమూర్తులు వైష్ణవ విగ్రహములందు మాత్రమే కానవచ్చుచున్నవి. తిరిగి ఈ మూడు విధములలో నొక్కొక్కటి యోగము, భోగము, వీరము, అభిచారికము నని ప్రత్యేకముగ నాల్గు విధములుగ విభజింపబడినవి. వానిని యోగస్థానకము, భోగస్థానకము, వీరస్థానకము, అభిచారిక స్థానకము అనియు యోగాసనము, భోగాసనము, వీరాసనము, ఆభిచారికాసనము అనియు, యోగశయనము, భోగశయనము, వీరశయనము, అభిచారికళయనము అనియు చెప్పుదురు. ఇందు యోగమూర్తిని మోక్షార్థులును, భోగమూర్తిని ఐహికాముష్మికోభయ ఫలకాములును, వీరమూర్తిని విజయకాంక్షులును, అభిచారికమూర్తిని శత్రుసంహార కాములును పూజింపదగు ననియు చెప్పుదురు. ప్రాయికముగ భోగమూర్తిని మాత్రమే ఇరు పార్శ్వములందు భార్యలతో ప్రతిష్ఠించుట చెప్పబడినది. దారు విగ్రహములను చేయుటయు, శిలా విగ్రహములను చేయుటయు ఒకేవిధమని చెప్పవచ్చును. మృత్తుతో విగ్రహములు చేయుటకు చాల పరిశ్రమ కావలయును. మృద్బింబమును నిర్మించుటకు ముందు ఆ బింబమున కనువగు కొయ్యనుగాని, శిలనుగాని, చెక్కి ఆయా అవయవములకు తగినట్లు కొన్ని శూలములను చేయవలెను. శూలములను విగ్రహముగ అమర్చి లోహపు తీగలతో బంధించవలేను. దీనిని శూలస్థాపన మందురు. తరువాత గుగ్గిలము, శ్రీ వేష్ట, సిజ్జరసము, బెల్లము మొదలగు ద్రవ్యములను, ఘృతము, తిల తైలములతో సూరి పక్వము చేసి ఆ ద్రవ్యమును శూలములపై పూయవలెను. దీనిని అష్టబంధమందురు. విగ్రహము యొక్క నాడీ స్థానములందు త్రాటితో కట్టుట తరువాతి కార్యము. దీనిని రజ్జుబంధ మందురు. ఆవల శుభ క్షేత్రములందుండి తేబడిన మృదువగు మన్నును కొన్ని కషాయద్రవ్యములచే వాసితము చేసి దానిని విగ్రహముపై పూయుట. దీనిని మృత్సంస్కారమందురు. ఆవెనుక కషాయ ద్రవ్యములతో వాసితమగు గులక రాతిపొడిని పక్వముచేసి విగ్రహముపై పూయుట. దీనిని శర్కరా లేపన మందురు. దానికై తెల్లని నూలు వస్త్రమును నిశ్చిద్రమున పరచుట. దీనిని పటాచ్ఛాదన మందురు. విగ్రహములకు నియతము లగు ఆయా రంగులతో బింబమును అలంకరించుట ఏడవ దగు వర్ణ సంస్కారము. రంగులను సిద్ధము చేయు ప్రకారము వాని నుపయోగించు ప్రకారము వివరములతో శాస్త్రములందు చెప్పబడినది. ఇట్లు చేయబడిన సంస్కారములు క్రమముగ నా విగ్రహమునకు అస్థి, మేదస్సు, సిర, మాంసము, రక్తము, త్వక్కు, జీవములను సృజియించు నని సిద్ధాంతము. అనేక శతాబ్దములకు పూర్వము కావింపబడిన వర్ణకలాపముచే పరిష్కరింపబడిన చిత్రములు చెక్కు చెదరక అదే వర్ణములతో నుండుట నేటికిని కుంభకోణమందలి బృహదీశ్వరాలయమందు చూడనగును.
చలమూర్తులను నిర్మించుటకు మధూచ్ఛిష్టక్రియ చెప్పబడినది. తేనెమైనమును శుద్ధిచేసి, దానితో విగ్రహమును ముందుగా నిర్మించవలెను. దానికి మృదువగు మట్టితో కవచము చేయవలెను; తరువాత దానిని ఎండించవలెను. ఆ మూసను లోహపు తీగలతో కట్టి, తిరిగి మృత్కవచము నిచ్చి, యెండించి, యెండిన వెనుక మూసకు రంధ్రముచేసి నిప్పుపై కాచవలెను; ఆవిధముగా లోని మైనమును కరగించి, తీసివేయవలెను. అప్పుడు మూసలో విగ్రహాకారమగు అవకాశము ఏర్పడును. దానిలో రంధ్రమార్గమునుండి ఇష్టమైన లోహమును కరిగించి, పోసి, ఆరనిచ్చి మూసను పగులగొట్టినచో విగ్రహము నిర్మితమగును. దానిని శిల్పకారుడు సున్నితములగు పనిముట్లతో పనిచేసి అందచందములను తీర్చిదిద్దును.
అవల విగ్రహమునకు సరిపడునట్టి పీఠమును చేసి అందు రత్నముల నుంచి విగ్రహమునకు సంధానము చేయుదురు. దీనిని పీఠసంఘాతమందురు. ఈ సంస్కారముల నన్నిటిని మంత్రపూతముగనే చేయవలయును. విగ్రహ లక్షణమును చెప్పునప్పుడు మహాంగములు, అంగములు, ఉపాంగములు, ప్రత్యంగములు అను విభాగమును, వీనిని న్యూనాతిరేక ములు లేక విధ్యుక్తముగ చేయుటకు వలయు తాల మానము మానోన్మానప్రమాణ పరిమాణ లంబ మానోపమానాది మానప్రకారము చెప్పబడినవి.
విగ్రహములలో ప్రధాన దేవత అనియు పరివారము లనియు విభేదము కలదు. వైష్ణవ విగ్రహములలో దశావతారములు, వానిలో అవాంతర భేదములు, కేశవాది చతుర్మూర్తులు ఆదిగాగలవి ప్రధానదేవతలు. వీరిభార్యలు గూడ ప్రధాన దేవతలే యగుదురు. విష్ణువునకు శ్రీదేవి, భూదేవియు, శివునకు పార్వతియు, రామునకు సీతయు, కృష్ణునకు రుక్మిణీ సత్యభామలును భార్యలై ప్రధాన దేవతాగోష్ఠిలో చేరుదురు. గరుత్మంతుడు, గణపతి మొదలగువారు పరివారములు. ఈ విగ్రహములు ధరించెడి ఆయుధములు, భూషణములు, అంబరములు కూడ పరస్పరము భిన్నభిన్నములై యుండుట కలదు. హస్తవిన్యాసములో వరదహస్తము, అభయహస్తము, కటికహస్తము లేక సింహకర్ణహస్తము, సూచీహస్తము, తర్జనీహస్తము, కట్యవలంబిత హస్తము, దండహ స్తము లేక గజహస్తము, విస్మయహస్తము, అంజలిహస్తము మొదలగు భేదములును, అంగులి విన్యాసములో చిన్ముద్ర లేక వ్యాఖ్యానముద్ర, జ్ఞానముద్ర, లింగముద్ర, మొదలగు భేదములును, పాదన్యాసములో ప్రసారిత, కుంచిత, వ్యత్యస్తాది భేదములును, ఆసనములలో సింహాసన, పద్మాసన, ప్రేతాసన, ఆలీఢాసన, ఉత్కటికాసనాది భేదములును, సంస్థానములో అభంగ సమభంగ త్రిభంగాది భేదములును ఇట్లెన్నియో సూక్ష్మాతి సూక్ష్మ విషయములు చెప్పబడినవి. ఆభరణములలో యజ్ఞోపవీతము, కుండలములు, కిరీటము, కంకణములు, కటిబంధము, ఉదర బంధము, కుచ బంధము, శ్రీవత్సము, కౌస్తుభము మొదలగు భేదములు కలవు. ఆయుధములలో శంఖము, చక్రము, గద, ధనుస్సు, ఖేటకము, ఖట్వాంగము, టంకము, పాశము, అంకుశము, ఖడ్గము, ముసలము, బాణము, పరశువు, అస్థి, శూలము, వజ్రము, శక్తి, కపాలము, ఆదిగాగలవియు వీణాదండము, డమరు శంఖము, ఘంట, వేణువు మొదలగునవియు, మృగము, కుక్కుటము, కమండలువు, స్రుక్కు, స్రువము, దర్పణము, ఆజ్యపాత్రము, పుస్తకము, అక్షమాల, పద్మము, ఉత్పలము మొదలగు నవియు కలవు.
ఆయా దేవతా విగ్రహములకు మనుష్యులవలె గాక ఒకటికంటె నెక్కువగు తలలు, రెంటికంటె ఎక్కువ చేతులు కాళ్ళు కలిగిన స్వరూపములు కలవు. వినాయకునకు గజముఖము, గరుడునకు పక్షిముఖము, అనంతునకు సర్పదేహము, రుద్రునకు ఫాలనేత్రము ఇట్లెన్ని యో అతి మానుషాకారములు కలవు. గోవు, వృషభము మొదలగు,జంతువులును, గరుత్మంతుడు మున్నగు పక్షులును అట్లే నదులు, వృక్షములు, పర్వతములు మొదలగు వానిని విగ్రహరూపముగ జేసి పూజించుట కలదు.
ఇట్లు విగ్రహములు నిర్మింపబడి ప్రతిష్ఠింపబడిన వెనుక, వానిని సంరక్షించుటకు అర్హమగు గర్భగృహములు, విమానములు వీనిని నిర్మించుటయు, విమానములలో ఏక తలాది ద్వాదశ తలాన్తభేదమును చెప్పబడినవి. ఆవల ఆ విమానములకు అలంకారమును తెచ్చెడి మండపములు, తటాకములు, కూపములు, ఆరామములు, మొదలగు పరికరముల నిర్మాణము చెప్పబడినది.
శిల్ప శాస్త్రమునకు ఆధారములు : వేదమందునను, యాస్కుని నిరుక్తమందును, పతంజలి వ్యాకరణ మహా భాష్యమందును, వేదాంగములగు కల్ప సూత్రములందును, ఆగమములందును, భారత భాగవత రామాయణము లందును, తదితర పురాణము లందును. మన్వాది ధర్మశాస్త్రము లందును విగ్రహారాధనమును గురించియు దేవాయతనములను గురించియు ప్రశంస కలదు. మాక్సు ముల్లర్ మొదలగు విమర్శకులు వేదకాలమునాటి ఆర్యులకు విగ్రహారాధనము తెలియదని చెప్పుట ఉచితము కాదు. కొంత కాలమునకు ముందు శ్రీ రామ్ రాజ్ అను నొక విమర్శకుడు మొట్టమొదటగా (Essay on Indian Architecture) అను వ్యాసమందు భారతీయ శిల్పమును గురించి చక్కని విమర్శనమును వ్రాసి యుండెను, మరికొంత కాలముకు టి, బి. గోపీనాథరావుగారు తిరువాన్కూరు ప్రభుత్వము వారి ఆదరముక్రింద (Elements of Hindu Iconography) అను నొక గ్రంథమునువ్రాసి అనేక ఛాయాచిత్రములతోను, ప్లానులతోను ముద్రించి ప్రచురించిరి. తరువాత శ్రీ ప్రసన్న కుమారా చార్య అను నొకరు అలహాబాదు యూనివర్సిటీ వారి ఆదరణము క్రింద మానసార శిల్పమును సంస్కృత మూలముతో ఆంగ్ల పరివర్తనమును వ్రాసి విశేషపరిశ్రమతో మాన సార నిఘంటువును రచించి ముద్రించిరి. ఈ విషయమును గురించి Principles of Indian Silpasastra అను నొక చక్కని విమర్శనము మానసార గ్రంథము నాధారము చేసికొని ప్రొఫెసర్ ఫణీన్ద్ర నాథ బోస్, M.A., వ్రాసినది కలదు. Dr. A. N. Tagore, Dr. O. C. Ganguli, Mr. B. K. Sarkar, Sri M. A. Anadalwan, Mr. K. Ananda Kumara swamy మొదలగు వారలు వ్రాసిన విమర్శన గ్రంథములు కూడ కలవు. ఈ విమర్శకుల కాధారములగు నీ క్రింది గ్రంథములు మనకు నేడు ముద్రణమందును, ముద్రితములు కాకను లభ్యము లగుచున్నవి.
మరీచి విమానార్చనాకల్పము, భృగుక్రియాధికారము, భృగుఖిలాధికారము,అత్రిసమూర్ఛనాధికరణము, కాశ్యప జ్ఞాన కాండము, కామికాగమము, కారణాగమము, సుప్రభేదాగమము, అగ్నిపురాణము, మత్స్యపురాణము, వాయుపురాణము, తంత్ర సముచ్చయము, భవిష్యపురాణము, శిల్పరత్నము, మయమతము, అగస్త్య సకలాధికారము, కాశ్యపీయము, అంశుమద్భేదము, అపరాజిత పృచ్ఛ, సమరాంగణ సూత్రధారము, మానసారము, బింబ నిర్మాణము, రూప మంతనము, మయ శిల్పము.
ఆర్. పి. ఐ. యన్.