Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆర్ష వ్యవసాయ పద్ధతి

వికీసోర్స్ నుండి


ఆర్ష వ్యవసాయ పద్ధతి  :

శ్రీ విద్యారణ్య యతీంద్రులవారు కృష్ణయజుర్వేద ప్రథమ కాండ సంహితా భాష్యములో “ఋషి మార్షేయం” (కృ. య. సం. 14. 432) ఋషి శబ్దమునకు "ఋషిః వేదార్థజ్ఞః" అని వ్రాసియుండిరి. కావున ఋషీ శబ్దమునకు వేదార్థమును తెలిసినవారు అని యర్థము. వారి సంబంధ మయినది ఆర్షము. అట్టి వ్యవసాయపద్ధతి అర్థవ్యవసాయ పద్ధతి. అనగా ఆర్షవ్యవసాయపద్ధతి అను పదమునకు శ్రుతి, స్మృతుల ననుసరించిన వ్యవసాయపద్ధతి అని ఫలితము.

ఆర్ష వ్యవసాయ పద్ధతులను ముఖ్యముగ వివరించుచు ప్రసంగాను ప్రసంగముగ(కృషి వివరము, ఎరువులు) పంటలు ధాన్యపుకోత, మున్నగువాటికి సంబంధించిన ప్రకృతోప యోగకరములును, అపూర్వములును, అగు అనేక విషయములు శ్రుతి, స్మృతి, శిష్టాచార ప్రమాణ ప్రదర్శనపూర్వకముగా వివరింపబడును.

ఈ కృష్యాదులలో కేవలము దృష్టములగు (మన దృష్టికి గోచరములగు కార్యములేగాక అలౌకికములగు (శ్రుత్యాదుల వలననే తెలిసికొనదగిన) విశేషములు కూడ వీటిలో నున్నవి. పూర్వకాలములో బ్రాహ్మణునకు జీవనార్థము వృత్తులను చెప్పు సందర్భములో మనుస్మృతిలో గల "ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేనవా" అనుదాని యందలి ఋతశబ్దమునకు "ఋత ముంఛ శీలం జ్ఞేయం" అను నిర్వచనానుసారము కోసిన చేలలో వెన్నులను, గింజలను ఏరుకొని వాటిచే జీవించుట అని అర్ధము. "అయాచితం స్యాదమృతం" అను వాక్యానుసారము అమృత శబ్దమునకు ఇతరులను యాచింపకుండ తనకు సంప్రాప్తమయిన దానిచే జీవనము చేయుట అని యర్థము. “మృతంతు యాచితం జ్ఞేయం" అను నీ నిర్వచనాను సారము మృతశబ్దమునకు యాచనావృత్తిచే జీవించుట అని యర్థము. ప్రమృత శబ్దమునకు" ప్రమృతం కర్షణంస్కృతం" అను నిర్వచనానుసారము వ్యవసాయవృత్తిచే జీవించుట యర్ధమని నిరూపింపబడినది. ప్రకృతములో ప్రభువులు గూడ ఈ కృషివృత్తియెడలనే ప్రాధాన్యమును చూపుటచే దీని ప్రాచీన విశేషములను తెలిసికొనవలసిన ప్రసక్తియు, ఆధునిక, ప్రాచీనపద్ధతుల యొక్క అంతరమును గమనింపవలసిన ప్రసక్తియు గలిగినవి.

ప్రకృతకాలములో వ్యవసాయశాస్త్రజ్ఞులు దున్నుటకు లోహమయమయిన అపూర్వయంత్రములను (ట్రాక్టర్లను) తయారు చేసి వాటికి భూమిని దున్నుటకు "ఇనుపకోలలను (కఱ్ఱుకోలలు) 8, 9, 10 వరకు అమర్చిరి. అట్టి యంత్రములచే ఒకసారి దున్నినచో ప్రకృతములో కర్షకులు ఉపయోగించుచున్న కట్టుకోల గల చారుమయ మగు నాగలిచే 10 సార్లు దున్నిన పని శీఘ్రముగా జరుగుట, యంత్రములతో దున్నుటచే ఎడ్లకు శ్రమ లేకుండుట, లోతుగ దున్నుట మున్నగు సౌకర్యములు ఉండునని వీరి యాశయము.

ఇక అర్ఘ వ్యవసాయ సంప్రదాయమును గమనింతము, పూర్వకాలములో నాగలికి ఇప్పటివలె ఒక కాడి, దానికి రెండు ఎడ్లను కట్టుటగాక ఒకే నాగలికి 3, 6, 12 కాండ్లను కట్టి, కాడి 1కి 2 ఎడ్ల చొ.న 6, 12, 24 ఎడ్లను కట్టి దున్నెడి సంప్రదాయము ఒకటి కన్పట్టుచున్నది. మహాగ్నిచయన మనెడి యజ్ఞ క్రతువులో భూమిని దున్ని ఓషధులను చల్ల వలెను. అచ్చట దున్నెడి నాగలికి యుగములను (కాండ్లను) గట్టుటకు రెండు మంత్రములును, వాటికి వినియోగ సూత్రమును కలవు.

1. మం॥ "సీరా యుంజంతి కవయో యుగావితన్వతే పృథక్ | ధీరా దేవేషు సుమ్నయా.”

2. “యునక్త సీరావియు గాతనోత కృతే యోనౌవ పతేహ బీజం | గిరాచ శ్రుష్టిస్సభరా అసన్నో న్నేదీయ ఇత్సృణ్యాప క్వమాయత్." (కృ. య. సం. 4.2.5)

సూ. “ద్వాభ్యాం సీరం యువక్తి షడ్గవం, ద్వాదశ గవం చతుర్విగ్ం శతి గవంవా" (ఆ. శ్రౌ. సూ.)

పై రెండు మంత్రములను ఉచ్చరించి దున్న బోవు నాగలికి 6 లేక 12 లేక 24 ఎడ్లను కట్టుటకు అనుకూలమగు నటుల 3 లేక 6 లేక 12 కాండ్లను అమర్చవలెను అని పై సూత్రమునకు తాత్పర్యము.....

పై మంత్రములకు అర్థము.

1. మం. అ. దేవతలకు హవిస్సంపాదన ద్వారమున సుఖమును చేకూర్చవలెనని ఇచ్ఛయించెడి అనలనులగు ఓ కర్షకులారా ! నాగలికి 3, 6, 12 కక్ష్యావిశేషము లందు. ఎడ్లను కట్టుటకు కాండ్లను వేరువేరుగా విస్తరింపజేయుడి. 2. మం. అ. ఓ కర్షకులారా! దున్నుటకు నాగలిని కూర్చుడి. ఆ నాగలికి యుగములను (కాండ్లను) 3, 6, 12 ఇక్ష్యా విశేషములందు విస్తరింపజేసి 6, లేక 12 లేక 24 ఎడ్లను కట్టి, ఆట్టి నాగలిచే దున్నిన భూమి యందు ఓషధులను చల్లుడి; పెద్దల ఆశీర్వాదముచే వాటి అంకురములు స్తంభములై (దుబ్బు కట్టి) పండిన పిదప కొడవళ్ళచే కోయవడిన ఫలము దేవతాహవిర్భాగము కొరకు మన సమీపమునకు వచ్చుగాక !

పై శ్రుతి సూత్రముల వలన ఒకే నాగలికి 12 కాండ్లను అమర్చి, 24 ఎడ్లను కట్టి ఒకేసారి దున్నెడి సౌకర్యములు ఉన్నట్టును, ఒకసారికే 12 సీతలు (నాగలి చాళ్ళు) ఏర్పడు ననియు స్పష్టమగుచున్నది.

మరియు ఆ చయన ప్రకరణములోనే వెనుకటి మంత్రములచే కట్టిన నాగలిచే దున్నుటకు ఇంకొక రెండు మంత్ర ములును వాటికి వినియోగ సూత్రమును కలవు.

1. మం."లాంగలం పవీరగ్ం సుశేవగ్ం సుమతిత్సరు। ఉదిత్కృవతిగామవిం ప్ర ఫర్వ్యంచ పీవరీం | ప్రస్థావద్రథ వాహనం"

2. "శునం సః ఫాలావితుదంతు భూమిగ్ం శునం కీనాశా అభియంతు వాహాన్ ! శునం పర్జన్యో మధునా పయోభిశ్శు నాసీరాశునమస్మాసుధ త్తం" (కృ. య. కా, 4.2-5.)

సూ, “ద్వాభ్యాం కృషతి" (ఆ. శ్రౌ. సూ).

1. అర్థ. వజ్రమువలె తీక్షణ మగు ఈ నాగలి బాగుగా దున్ను గాక. ఈ దున్ను టవలన సంభవించెడి ఫలాధిక్యము చేత గోవులు, అశ్వములు మున్నగువాటిని యజమానుడు పొందుగాక.

2. అర్థ. నాగళ్ళ యొక్క అగ్రభాగములు సుఖముగా భూమిని విశేషించి దున్నుగాక, కర్షకులు ఎడ్లకు శ్రమ లేకుండునట్లు తోలుచు నడిచెదరుగాక, మేఘుడు మధుర రసో పేతమగు జలముచే సుఖముగా నుండునట్లు వర్షించు గాక, ఓ వాయ్వాదిత్యులారా! మాకు సుఖమును చేకూర్పుడు. ఇట్టి అర్థమును బోధించెడి 2 మంత్రములచేతను పూర్వోక్తమైన నాగలిచే అనగా 12 కాండ్లు, 12 కఱ్ఱు కోలలు, 24 ఎడ్లతో గూడిన నాగలిచే భూమిని దున్న వలసినదిగా వేదము బోధించుచున్నది.

ఈవిధముగ మహాగ్ని చయనాదులందు ప్రాచీన మానవ కర్షకులు పూర్వోక్తమైన నాగలిచే దున్ను చున్నట్లు స్పష్టపడుటయే గాక ఇంద్రాది దేవతలు గూడ వ్యవసాయము చేసినట్లు దేవతలలో వైశ్యులగు మరుద్గణములచే దున్నించి నట్లు వేదములో కన్పట్టుచున్నది.

"ఏతముత్యం మధునా సంయుతం యవం : సరస్వత్యా అధిమనావచర్ కృషుః ॥ ఇంద్ర ఆసీత్చీరపతిశ్శతక్రతుః ! కీనాశా ఆసన్మరుతస్సు దానవః” ॥ (కృ. య. బ్రా. కాం. 2.4 అను 8). పూర్వము ప్రజాపతిరాజుగా నుండి పరిపాలిం చెడి కాలములో 100 అశ్వ మేధక్రతువులను చేసిన ఇంద్రుడు వ్యవసాయము చేయుచు, మరుద్గణములచే దున్నించి యవధాన్యమును చల్లించి మధురమగు సరస్వతీ నదీజలముచే తడిపించినట్లు ఈ శ్రుతి భొధించుచున్నది.

మరియు అథర్వవేదములో "ఏతముత్యం” అను ఈ పూర్వమంత్రమే కొంచెము భేదముతొ నున్నది.

"అధీమనావచర్ కృషుః (అ. వే.) పూర్వమంత్రములో 'అధిమనౌ' అనుపదమునకు 'ప్రజాపతి' అని అర్థము వ్రాసిరి. ఇక్కడ 'మనౌ' 'మనుష్యజాతి విషయ' అని వ్రాసిరి.

భావము. పూర్వము ఇంద్రుడు వ్యవసాయముచే యుచు, కాశీప్రాంతములోనున్న సరస్వతీ నదీ తీరమందు మరు ద్గణములచే దున్నించి మనుష్యజాతికొరకు యవధాన్యమును చల్లించి మధురమగు సరస్వతీనదీజలముచే తడిపించినట్లు పై రెండు వేద మంత్రములచే స్పష్టముగ జెప్పబడుచున్నది. దీనికి తార్కాణముగ యవలు కాశీ ప్రాంతములోనే నేటివరకు లభించుటయు, అచ్చటనే పండుటయు అనుభవసిద్ధ విషయములు.

మరియు, యజ్ఞకర్మలలో ఉపర వాదిసంస్కారములలొ “యవమవాస్య" (ఆ. శ్రౌ. సూ.) అనియు పిత్య్ర కర్మలలో "యవాన్ వికీర్య" అనియు తద్దిన మంత్రములో “యవోపి ధాన్యరాజోవా వారుణో మధు సంయుతః నిర్ణొధ స్సర్వపాపానాం పవిత్ర మృషిభిస్సృతం" అనియుగలదు. అర్థము: యవలు సర్వధాన్యములలో శ్రేష్ఠమయినవి.సరస్వతీ నదీ సంబంధమయిన మధుర జలముచేత తడుపుటచే మాధుర్యయుక్తములు. సర్వపాపములను పారదోలునవి. ఋషులచే పవిత్రము లయినవిగ పరిగణింపబడినవి. ఈ వచనానుసారము అవి సర్వవిధముల శ్లాఘ్య మయినవి కనుకనే, సర్వకర్మలందు యవల కే వినియోగము కనిపించు చున్నది. ఇంకను ప్రథమములో యవధాన్యము, అనంత రము ఇతరధాన్యములు సంప్రాప్తమయినట్లు కూడ కనిపించుచున్నది.

ఈమంత్రములవలన దున్నువాడు గాక దున్నించువాడే “వ్యవసాయకుడు" అనెడు బిరుదమునకు తగినవాడని స్పష్టమగుచున్నది. దున్నించుచుండెడి ఇంద్రుడు సీరపతి, వ్యవసాయకుడు. దున్నుచుండెడి మరుద్గణము కూలి వాండ్రు మాత్రమే అగుదురు. వ్యవసాయకులు గారు.

ఇదేవిధముగ లోకములో కూడ "పంచభిః హలైః గ్రామణీః గ్రామం కర్షతి" అనగా, గ్రామాధికారి అయిదు నాగళ్ళచే గ్రామమును దున్నుచున్నాడు అను వ్యవహారము కలదు. అచ్చటకూడ ఒక మనుష్యుడు 5 నాగళ్ళచే ఒకేసారి దున్నుట శక్యముకాదు. కావున అయిదుగురిచే దున్నించు చున్నాడు అని అర్థమును గ్రహింపక తీరదు. అయిదుగురు దున్నినను, (గ్రామణిః-కర్షతి) గ్రామాధికారియే దున్ను చున్నాడు అనగా వ్యవసాయమును చేయుచున్నాడు, అను వ్యవహారముచే దున్ను వాండ్రు కూలివాండ్రే గాని వ్యవసాయకులు కారు అని స్పష్టముగ తెలియుచున్నది.

ప్రదర్శితశ్రుతిసూత్రములవలన 12 కాండ్లు గల ఒక నాగలిచేతనే, 24 ఎడ్లతో ఒకేసారి దున్నెడి సౌకర్యమున్నట్టు తెలియవచ్చుటచే ఆధునిక వ్యవసాయ శాస్త్రజ్ఞుల నవీన యంత్రములు అభూత పూర్వవి శేషములను బోధించునవి కావని బోధపడుచున్నది.

“ఇంక ఈ శాస్త్రజ్ఞుల రెండవ సౌకర్యము (ఎడ్లకు శ్రమ లేకపోవుట) ను గూర్చి విచారింతము.

ప్రకృత వ్యవసాయ శాస్త్రజ్ఞుల దృష్టికోణానుసారము ఈ ఎడ్లవలన పొందదగిన ఉపయోగము మన దృష్టికి గోచరించెడి భూమిని దున్నుట ఒక్కటియే అయినచో వాటికి శ్రమ కలుగకుండ ఆ పనిని యంత్రసహాయముచే చేయించుట యుక్తము. కాని, దీనినే గాక మన దృష్టికిని, మన ఊహలకుమ అతీతము లయినట్టియు, వేదైక సమధిగమ్యము లయినట్టియు అనేకములగు ఉపయోగములను అథర్వ వేదము ఉద్ఘొషించుచున్నది. అధర్వ వేదములో కృషి ప్రకరణములో ఈ ఎడ్లు చేయు పనిని గూర్చి అచ్చటి మంత్ర మిట్లు చెప్పుచున్నది. “పద్భిస్సేది నువక్రామ న్ని రాం జంఘాభిత్ఖిదన్ !క్రమేణా నడ్వాన్ కీలాలం కీనాశస్యాభిగచ్ఛతః" (అ.కా. 4 అను 3 ; మం. 10.)

దీని భావము : అథర్వ వేదములో పూర్వమంత్ర ద్వయములో 'ప్రజాపతి' ఎద్దు యొక్క శరీరమందు ప్రవేశించి, దానికి సామర్థ్యము నిచ్చి దృఢముగా చేయు చున్నాడు. కాన అనడ్వాహము (ఎద్దు) ప్రజాపతి రూపమయినది. దీనివలన వ్రీహియవాది ధాన్యములు నిష్పన్నములగుచున్నవి అని చెప్పి, ప్రకృత మంత్రములో 'ప్రజాపతి రూపమగు ఎద్దు దున్నునపుడు తన నాల్గు పాదముల చేతను నాశ హేతువగు అలక్ష్మిని అధోముఖముగ అణచి, దున్నుచున్న భూమిని పిక్కల చేత కర్షణముచే చీల్చుచు వ్యవసాయకునకు అన్నము నిచ్చుచున్నది' అని చెప్పబడు చున్నది.

ఇవ్విధముగ 'దున్నెడి ఎద్దు నాల్గు పాదములచే దారిద్య్ర హేతువగు అలక్ష్మిని అణగద్రొక్కుచు ప్రజాపతి లబ్ధమగు సామర్థ్యముతో పిక్కబలముచే భూమిని దున్ని కర్షకునకు అన్నమును ఇచ్చుచున్నట్లు అథర్వవేదీయ మంత్రము బోధించుచున్నది.

ఇంకొక గొప్ప ఆశ్చర్యజనకమగు అపూర్వ విషయము ఎడ్లతో గూడుకొనిన నాగలికి సంబంధించినది అధర్వవేదములో బోధింపబడుచున్నది.


“నమస్తే లాంగలేభ్యో నమ ఈషాయు గేభ్యః" (అ. వే. కా, 2, సూ, 5. 4. మం.) దీనికి విద్యారణ్యభాష్యము : "హేరుణ్ణవే త్వద్రోగోప శమనాయ లాంగలేభ్యః, వృషభ యుక్త సీ రేభ్యః నమః | ఈషాయు గేభ్యః ఈషాశ్చ యుగాని చతేథ్యశ్చ హలావయవేభ్యః నమః | ఉభయత్రాపి పూజా యాం బహువచనం వీడాక రరోగ నివర్తక త్వేన పూజ్యత్వం ఆరోప్య నమస్కారః కృతః | యద్వా హలాదీనాం అచేతన శ్వేపి తదభిమాని దేవతాభిప్రాయేణ నమస్కారః కృతః"

ఈ మంత్రముచే చేయవలసిన ప్రక్రియ ఏమన వంశాను క్రమముగ వచ్చెడి క్షయ, కుష్ఠము మున్నగు ఉగ్రవ్యాధు లచే పీడితుడగు రోగికి అట్టి రోగోపశమనమునకై పై అథర్వమంత్రముచే ఉదకుంభమును అభిమంత్రణము చేసి, ఎడ్లతోగూడిన నాగలి క్రింద ఆరోగిని కూర్చుండ బెట్టి అయ్య భీమంత్రితోదకముచే స్నానము చేయించవలెను. మంత్రార్థము : ఓరుగ్ధుడా, నీ రోగోపశమనమునకై ఎడ్లతో గూడుకొనిన నాగళ్ళకోరకు నమస్కారము. ఆ నాగలికి అవయవములగు (నాగలి భాగములగు) ఈషా, యుగములకొరకు అనగా ఏడేకఱ్ఱ, కాండ్ల కొరకు నమస్కారము. (ఇట్టి మంత్రముచే అభిమంత్రణము చేయవలెను.)

అయితే నాగళ్ళు, నాగలి భాగములగు ఏడెకఱ్ఱలు, కాండ్లు, అచేతనములు గదా ! వీటికి నమస్కార మెట్లు సంగతమగును? అని శంకింపరాదు. శ్రీ వ్యాసప్రణీతమగు ఉత్తర మీమాంసా శాస్త్రములో "అభిమాని వ్యపదేశస్తు విశేషానుగతిభ్యామ్" (ఉ. మీ. అ. 2-1-5) అను సూత్రముచే అచేతన పదార్థములందు గూడ తదభిమానియగు దేవత ఉండునని సిద్ధాంతీకరింపబడుటచే ప్రకృతములో నాగలి అభిమాని దేవతలకును నాగలి భాగములగు ఈషా, యుగాభిమాని దేవతలకును నమస్కారము గాన, విరోధ ప్రసక్తి లేదు.

మరియు, ఎడ్లు దున్నగా ఫలించిన ధాన్యమును గూర్చి కృష్ణయజుర్వేదములో "ఆగ్నావైష్ణవం ఘృతే చరుం నిర్వ పేచ్చక్షుష్కామః"అను ఉపక్రమణముతో “ధేవ్వైవా ఏతద్రేతో యదాజ్య మనడు హ స్తండులా మిథునా దేవాస్మై చక్షు। ప్రజనయతి" అని కలదు. (కృ. య, 2. కా. 2–9 అను.)

ఇచ్చట నేత్రరోగములు ఉపశాంతములై దృష్టిపాటవము కావలెనని కోరువాడు అగ్ని, విష్ణువు, ఉభయులు దేవతలుగా గల ‘ఆన్నా వైష్ణ వేష్టి' అను కర్మను చేయవలసినదిగా ఈ శ్రుతి విధించుచు, ఆకర్మలో ఎద్దుచే దున్ని పండించిన ధాన్యము దంపగా వచ్చిన బియ్యమును ఆవు నేతితో వండి ఆ అన్నమును ప్రధాన దేవతలకు హోమము చేయవలసిన హోమద్రవ్యముగా విధించి, ఆ అన్న నిష్పత్తికి మూలములగు ఆజ్యమునకు, తండులములకు ఉత్పాదకము లగు గోవును, వృషభమును మిథునముగా వర్ణించి, అట్టి మిథునము వలన నిష్పన్నమయిన ఆజ్యమును, బియ్యమును గోవృషభముల రేతస్సుగా వర్ణించి, ఆ రెండు రేతస్సుల యొక్క సమ్మేళనరూపమగుహోమద్రవ్యము యొక్క హోమ ప్రభావముచే చక్షుస్సులు ఉత్పన్నమగు నని వర్ణించినది.

అనగా లోకములో (స్త్రీ, పురుష రూపనగు మిథునము యొక్క రెండు రేతస్సుల కలియకచే. సంతానము జనించి నట్లు ఇక్కడ గోవృషథరూపమగు మిథునములో ఆజ్య రూపమగు గోరేతస్సునందు (ఎద్దు దున్నుటచే జనించినవి కావున) తండుల రూపముగు వృషభ రేతస్సును ఉంచుటచే ఉభయ రేతస్స మ్మేళనద్వారమున ప్రశ స్తమయిన చక్షుస్సు ఉత్పన్నమగు నని తాత్పర్యము.

దీనివలన చక్షూరోగములను పారద్రోలి మంచి దృష్టిని చేకూర్చెడి శ్రోతకర్మలో ఎద్దుదున్నిన ధాన్యమువలస నై స బియ్యమును ప్రధాన హోమద్రవ్యముగ శ్రుతి చెప్పుటచే ఎద్దు దున్నుటలో విశేషమున్నట్లు స్పష్టమగుచున్నది.

ఎంత లోతుగ దున్నవలెను అను విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది:

"దర్శపూర్ణమా సేష్టులు"అను శ్రౌతకర్మను చేయుటకు వేదిని నిర్మించదలచిన స్థలమందలి ఓషధులను త్రవ్వి, అచ్చట వేదిని ఏర్పరుపవలెననియు, “చతురంగులం ఖేయా । చతు రంగులం ఖనతి | చతురంగులే హ్యోషధయః ప్రతితిష్ఠంతి" (కృ.య. బ్రా. 32-9) (ఓషధులు 4 అంగుళములలో తుస ప్రతిష్ఠితములయి ఉండును గాన 4 అం. ల లోతు త్రవ్వవలెను.) అనియు సహేతుకముగా చెప్పబడినది.

ఫలితము : ఇంతవరకు చూపబడిన శ్రుతి యుక్త్యను భవములచే దున్నుటకే కాక, అలక్ష్మిని తొలగించి, అన్న మిచ్చుటకును, కుల క్రమాగతములయి అనివార్యములగు మహావ్యాధుల యొక్క ఉపశమనమునకును, చక్షూరోగ నివృత్తి ద్వారమున దృష్టి పాటవము మున్నగు అనేక శ్రేయస్సులకును శాస్త్రసిద్ధమయిన ఎడ్లతో కూడిన నాగళ్ళు సాధనము లని వేదములు బోధించుచున్నవి.

పంటలు  :- మహాగ్నిచయనమను క్రతువులో ఉఖ ఆను ఒక చతురస్రమును (అనగా నలుపలుకలు, జానెడు ఎత్తు గల వంటకుండను) మంత్రముల నుచ్చరించుచు సిద్ధము చేసి, మంత్ర పాఠముతోనే కాల్చవలెను. దానిని కాల్చు నపుడు పఠించవలసిన మంత్రములలో “వరూశ్రయస్త్వా. పచంతూఖే - జనయ స్వా దేవీః - పచంతూఖే" (కృ. య. సం. 4-1-4) అను మంత్రమునందు రెండుసార్లు 'పచంతు' అను శబ్ద ముండుటచేతను కృష్ణ యజుర్వేదములో "ద్విః పచంత్విత్యాహ తస్మాద్ద్వి స్సంవత్సరస్య సస్యం వచ్యతే” (5 1-7) అనుదానియందు వఛంతు, అను పదమును రెండు మంత్రములలో రెండుసార్లు ఉచ్చరించుటచేతను లోక ములో ధాన్యము సంవత్సరమునకు రెండుసార్లు పండునని ఈ బ్రాహ్మణమువలన స్పష్టమగుచున్నది.

కృష్ణ యజుర్వేదారణ్యకములో "యాః ప్రతి తిష్ఠంతి సంవత్సరే తాః ప్రతితిష్ఠంతి | వర్షాభ్య ఇత్యర్థః' (కృ. య.అ. అ.) అనియు విద్యారణ్య భాష్యములో “యాస్తు ప్రజాః తస్మిన్ ఋతౌ క్షేత్రేషు బీజావాపం కృత్వా ప్రతిష్ఠి తా భవంతి, తాః ప్రజాః అన్నస్య సులభత్వాత్ కృత్స్నపి సంవత్సరే ప్రతిష్ఠితా భవంతి." అనియు చెప్పబడినది. (వర్షర్తు ప్రకరణ బలాత్ వర్షర్తుః లభ్యణే) వీటి భావము: ఏ ప్రజలు వర్షర్తువునందు విత్తనములను భూములందు నాటుదురో, వారికి అన్నము సులభము గాన సంవత్సర మంతయు వారు అన్న సమృద్ధిని గలిగియుందురు. ఈ శ్రుతి స్పష్టముగ వర్షర్తువునందు మొదటి పంటకు విత్తనములను నాటుటను బోధించుచున్నది.

యవ, మాషాది ధాన్యములు : కృష్ణ యజుర్వేద సంహితలో "తేస్మి నైచ్ఛంత సరస మహ వసంతాయ ప్రాయఛ్ఛ దృవం గ్రీష్మాయౌషథీ ర్వర్షాభ్యో వ్రీహీన్ శరచే మాషతికా, హేమంత శిశిరాభ్యాం (కా. 7-2 -10) అని కలదు. దీనికి భట్ట భాస్కర భాష్య మీ విధముగ నున్నది. "తత స్తే ఋతవః అస్మిన్ ప్రజాపతౌ ఇచ్ఛంత దక్షిణాం అలిప్సంత సః ప్రజాపతిః అనంతరం రసం మధ్వాది (సర్వమపి భోగ్య వస్తుగతం సారం) వసంతాయ ప్రాయచ్ఛత్, పుష్పాది సంబంధేన మధుమా నభూ ధ్వసంత, ఏవం గ్రీష్మా యేత్యాది".

తా. పూర్వము వసంతాది ఋత్వభిమాని దేవతలు ప్రజాపతిచే "ద్వాదశాహ మను యజ్ఞమును చేయించిన పిదప ప్రజాపతి ఆ వసంతాది ఋతువులకు మధ్వాది భోగ్యవస్తుగతమగు సారమును దక్షిణగా నిచ్చెను. అందుచే వసంత ఋతువు పుష్పాది సంబంధముచే మధురరసోపేతమగు పుష్ప, ఫలములు కలది ఆయెను. కావుననే ఆ ఋతువు నందు సమస్తపుష్పములు, మామిడి, పనస, మున్నగు సమస్త ఫలములు ఉద్భవించుచున్నవి.

ఈ విషయమునే భగవద్గీతలో "శ్రీకృష్ణభగవానుడు ఋతూనాం కుసుమాకరః" (ఋతువులలో సమస్తపుష్ప, ఫలములకు ఆధారమగు వసంతఋతువు నేను అయితిని.) అని వక్కాణించెను.

ఇక ప్రజాపతి గ్రీష్మఋతువునకు యవలను చక్షిణగా ఇచ్చుటచే ఇప్పటికిని గ్రీష్మఋతువునందు యవధాన్యములు ఫలించుచున్నవి. వర్ష ఋతువునకు ఓషధులను దక్షిణనగ నిచ్చుటచే, ఆ ఋతువునందు సమస్త ఓషధులు ఉద్భవించు చున్నవి.

ప్రజాపతి శరదృతువునకు వ్రీహులను అనగా మనము భుజించు ధాన్యములను దక్షిణగ నిచ్చుటచే ఆ ఋతువు నందు అనగా ఆశ్వయుజ, కార్తికమాసములందు ఆ ధాన్యములు ఫలించుచున్నవి. కావుననే శరదృతువునందు క్రొత్త ధాన్యము రాగానే ఆహితాగ్నులు (యజ్ఞములను జేసిన యజమానులు) 'ఆగ్రయణేష్టి' అను శ్రౌతకర్మ యందు ముందుగ దేవతలకు క్రొత్త ధాన్యముచే హవిర్భాగములను ఇచ్చిన పిదప ఆ ధాన్యమును భుజించెడి ఆచారము నేటివరకు అనుష్ఠానములో నున్నది.

దీనినే ఆపస్తంబ శ్రోతసూత్రములో “శరది పౌర్ణ మాస్యా మమావాస్యాయాం - వ్రీహ్యాగ్రయణేన శ్యామా కాగ్రయణగ్ సమాన తంత్రేణ కుర్వ న్నిష్ట్యా యక్ష్యే” అని సంకల్పమును జేసి, పౌర్ణమాసియందుగాని, అమావాస్యయందుగాని, క్రొత్త ధాన్య హవిస్సును దేవతలకు ఇయ్యవలసినదిగ, సూత్రకారులు వక్కాణించిరి. వెనుకటి ఆరణ్యకశ్రుతి “యాః ప్రతితిష్ఠంతి" అనురీతిచే వర్షర్తువు నందు బీజావాపమును (విత్తనముల నాటుటను) చెప్పినది. ఈశ్రుతి "వ్రీహీన్ శరదే" అని శరదృతువునందు పంటను జెప్పినదిగాన పరస్పర విరోధము లేదు.

ప్రజాపతి హేమంత, శిశిర ఋతువులకు మినుములను, నువ్వులను అనగా పైరు ధాన్యములను, దక్షిణగా నిచ్చుటచే ఆ నాలుగు మాసములందును పైరు ధాన్యములు ఫలించుచున్నవి.

భావః పూర్వము ఎన్నడో ప్రజాపతి తన క్రతువులో వసంతాది ఋతువులకు పైన ఉదాహరించిన మధు, యవాది ద్రవ్యములను దక్షిణగ నిచ్చుటచే నేటివరకు ఆ యా ఋతువులందు ఆ యా సస్యములు ఫలించుచున్నవి గాని కొంచె మయినను మార్పులేదు. అందువలన ప్రజాపతి ఆ క్రతువులో వాటిని దక్షిణగ నిచ్చుటవలన లోకములో నేటివరకు ఆఫలములు కానవచ్చుటచే (నహిదృష్టే అనుప పన్నం నామ) ‘దృష్టిగోచరమగుచున్న విషయమునుగూర్చి అది ఎట్లు వచ్చెను అని శంకింపరాదు' అను న్యాయానుసారముగా ఆ క్రతువునందు ఇచ్చుటచే, లోకములో నేటి వరకు ఎట్లు వచ్చును అను శంకకు తావులేదు,

ఎరువుల ప్రసక్తి  : సృష్ట్యాదినుండియు ప్రజలకు అన్నము అవసరమని లోకమునందును వేదమునందును సుప్రసిద్ధ విషయమే. కృష్ణ యజుర్వేద బ్రాహ్మణములో "ప్రజాపతిః ప్రజా అసృజత! తా అస్మాత్సృష్టాః పరాచీ రాయన్న్ స ఏతం ప్రజాపతిరోధన ముపశ్యత్ | సోన్నం భూతో తిష్ఠత్ ! తా అన్యత్రాన్నాద్యమవిత్వా | ప్రజాపతిం ప్రజాఉపావర్తంత ! అన్న మేవైనం భూతం పశ్యంతీః ప్రజా ఉపావర్తంతే” అని కలదు. (2-7-8)

తా॥ పూర్వము ప్రజాపతి ప్రజలను సృజించిన పిదప వారలు అన్నార్థులె ప్రజాపతినుండి పరాఙ్ముఖులై వెడలి పోయిరి. అప్పుడు ప్రజాపతి అన్నమును సంపాదించినచో తదర్థమై ప్రజలు తనయొద్దకు ఏతెంచెదరని యోచించి అన్నమును సంపాదించి యుండెను. అంతట ప్రజలును ఇతర స్థలములందు అన్నము లభింపకపోవుటచే తిరిగి అన్నయుక్తు డగు ప్రజాపతి యొద్దకు ఏతెంచిరి. లోకములో గూడ అన్న సమృద్ధిగల మానవునికడకు ప్రజలు ఏ తెంచెదరు. ఈ శ్రుతి స్పష్టముగ అన్న సంపత్తి ఆవశ్యకతను బోధించు చున్నది.

ఇదేవిధముగ తైత్తిరీయకోపనిషత్తులో 'యయా కయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ "అని యున్నది.

దీని భా॥ విహితమయిన వృత్తులలో ఏదో యొక విధముచే సమృద్ధమయిన అన్నమును సంపాదింపవలెను. మరియు “వృద్దౌ చ మాతాపితరౌ సతీసాధ్వీ సుత శ్ళిశు |అవ్యకార్యశతం కృత్వా భర్తవ్యా మను రబ్రవీత్" అని శాస్త్రము గలదు.

తా॥ తల్లిదండ్రులు వృద్ధులై, భార్య పతివ్రతయై (ధన సంపాదన కొరకు వీథికి వెడలని భార్య అని తాత్పర్యము) కుమారుడు బాలుడై యున్న పరిస్థితిలో నిషిద్ధ వృత్తిచేత నైన అన్నమును సంపాదించి వారలను పోషించవలసినదిగ మనువు చెప్పియుం డెను.

పై వాటివలన శక్యమయినచో ముఖ్యవృత్తి చేతను, అశక్యమగుచో గౌణవృత్తిచేతనైన సమృద్ధమగు అన్నమును సంపాదించి కుటుంబపోషణ చేయుట విధిచోదితము గాన తదర్థమై 'లౌకిక సాధనములగు ఎరువులను గూర్చిన విచారణ ప్రసక్తమగుచున్నది.

ఎరువులు  : కృష్ణ యజుర్వేద సంహితలో "యథావై లాంగలేనోర్వరాం ప్రభిందంత్యేవ మృక్సా మేయజ్ఞం ప్రభంతోయనైత్రావరుణీం వశామా లభతే యజ్ఞాయైవ ప్రభిన్నాయ మత్యమన్వ వాస్యతి శాంత్యై" అనియున్నది (6-6-8). దీనికి విద్యారణ్య భాష్య మిట్లు గలదు: సర్వసస్యో నేతా భూమిః ఉర్వరా, తస్యాం కృష్ణాయాం కర్షణమను, తత్రమత్యంక్షిపంవంతి. శక్త్యాదాన సాధనం గోమయాది ద్రవ్యం మత్యం (మతం అభిమతం ఫలం అర్హతీతిమత్యం) తద్వత్ ఋక్సామాభ్యాం కర్షణవత్ యోగ్యతా మాపాదితస్య యజ్ఞస్య వశాలంభేన మత్య ప్రక్షేపవత్ ఫల జననశక్తి ర్భవతి, తేనచ అశక్తి లక్షణస్య దోషస్య శాంతి ర్భవతి.

అర్థము : సర్వసస్యములు ఫలించుటకు యోగ్యమను -భూమిని దున్ని, దానియందు మత్యమును అనగా సంపూర్ణ మయిన ఫలమును ఇచ్చేడి శక్తిని పుట్టించుటకు సాధన మగు గోమయము, మొదలుగాగల ఎరుపులను ఎట్లు చల్లె దరో, వాటిచే ఆ చేలలో అశక్తి లక్షణమగు దోషము శాంతించి, ఫలోత్పాదన శక్తి జనించి సంపూర్ణమగు ఫలము ఎట్లు లభించునో, అటులనే ఋక్సామమంత్రముల అనుష్ఠానముచే, దున్నినటుల ఫత్పాదసయోగ్యతను సంపాదింపబడిన యజ్ఞమునకు, మిత్రావరుణ దేవతార మగు ఈ వశాపశ్వాలంభముచే, దున్నిన భూమిలో బలము. కొరకు ఎరువులను చల్లినటుల ఫలజననశక్తి జనించును. ఆశక్తిచే ఫలజననశక్తికి ప్రతిబంధకమగు దోషము శాంతమైయజ్ఞమువలన సంపూర్ణ ఫలము లభించును.

ఈ శ్రుతివలన లోకములో దున్నిన భూమియందు గోమయము మున్నగు ఎరువులను చల్లుచుండుటయును వాటివలన భూమిలోని దోషము దూరీకృతమై ఫల జనన శక్తి జనించి సంపూర్ణమయిన ఫలము లభించుచుండుటయు అనుభవ సిద్ధమైనట్లు విశదమగుచున్నది. ఈ దృష్టాంతముచే యజ్ఞములో మైత్రావరుణీపశ్వాలంభము యజ్ఞమునకు ఎరువు వంటిదనియు, అట్టి విశ్వాలంభనముగల యజ్ఞము వలన సంపూర్ణమయిన ఫలము లభించుననియు చెప్పుటచే ఎరువులు ప్రాచీనకాలము నుండియు ఆర్షవ్యవసాయ ములో శ్రుతా ర ప్రసిద్ధము లయిన వని తేట తెల్ల మగుచున్నది

మరియు కృష్ణ యజుర్వేద బ్రాహ్మణములో "ప్రజా పతిః ప్రజా అసృజత | తాసామన్న ముపాక్షీయత, తాభ్య స్పూదముప ప్రాభినత్ ౹ తతోవై తాసా మన్నం నాక్షీ యతః యస్యసూద స్సం భారో భవతి నాస్య గృహే౽న్నం క్షీయతే " (1-1-3) అని చెప్పబడినది.

అర్థము: పూర్వము ప్రజాపతి ప్రజలను సృజించెను. కొంతకాలమునకు ఆ ప్రజలకు అన్నము భుజ్యమాన మగుచు క్రమక్రమముగా ఉపక్షీణ మాయెను. అనగా భూ ప్రదేశము లందు శక్తి తగ్గిపోయి పండెడి పంట ప్రజలకు సరిపోక పోయెను. అంతట ప్రజాపతి ప్రజలకు అన్న సమృద్ధికొరకు సూదమను ఎరువును (అనగా ఎన్నడును ఎండిపోకుండా ఉండెడి జలప్రదేశమందలి బురదమట్టిని తీసికొనివచ్చి పంటకు యోగ్యమగు భూభాగములందు వేరు వేరుగ ప్రసరింపజేసెను. దాని శక్తి చే ఆ భూభాగములందు సస్యము సమృద్ధిగా ఫలించి ప్రజలకు అన్నము సమృద్ధమాయెను. అందుచే ఆ సూదము యొక్క సంభారముచేత గృహమందు అన్నము అక్షయ మగుచున్నది.

ఈ సందర్భములోనే “ప్రజాపతి సృష్టానాం ప్రజానాం క్షుధోవహ త్యై సువితం నో అస్తు ౹ ఉపప్రభిన్న మిష మూర్ఖం ప్రజాభ్యః| సూదం గృహేభ్యో రస మాభరామి! (కృ. య, బ్రా. 12.1) ఆ. శ్రౌ. సూ. “సూదం”

అను మంత్రముచే సూదమును (బురదమన్ను) ఆహవ నీయాదులందు ఉంచవలెను.

మం. అర్థము : ప్రజాపతిచే సృజింపబడిన ప్రజలకు అన్న సమృద్ధి ద్వారమున క్షున్నివారణకొరకు మా సంబంధ మయిన ఈ కర్దమ రూపమగు సూదము యోగ్యముగ సంప్రాప్తమగు గాక ! వంక రూపమగు ఈ సూదరసము (ప్రజలకు అన్నమును, రసమును అత్యంత సామీప్యముగ సంపాదించుటకు సాధనమైనదిగాన) అన్న, రస, (ఉభయ) సమ్మేళన రూపమయినది. అట్టి ఎరువును ఆహవనీయాది వహ్నుల యొక్క స్థానముకొరకు సంపాదించుచుంటిని.

తా: ఆధాన మను శ్రోత కర్మలో ఆహవనీయము. గార్హపత్యము, దక్షిణాగ్ని, అని మూడు అగ్నులను సంపాదించి వాటి యందు విధ్యనుసారముగ తత్తత్కాలములందు దేవతలకు హోమములు మున్నగు కర్మలను చేయుదురు. అట్టి అగ్నులను ఉంచుటకు ముందుగ వాటికి ఆయతనములను (స్థానములను) నిర్మించు సందర్భములో పైన ఉదాహరించిన "ప్రజాపతి సృష్టానాం" అను మంత్రముచే పంక రూపమగు సూదరసమును ఆయతనములందు ఉంచవలెను. అనగా సూదరసము అన్న సమృద్ధికరమగు ఎరువుగాన అట్టిదానిని ఉంచుటచే ప్రజలకు అన్నసమృద్ధి లభించునని శ్రుతి చెప్పుచున్నది.

ఫలితము : ఉదాహృత మంత్ర బ్రాహ్మణ బోధితమయిన పంకరూపమగు సూదరసమును, పూర్వోక్త శ్రుతిచోదిత మయిన గోమయము మున్నగు ఎరువులను భూభాగము లందు ప్రసరింపచేయుటచే సమృద్ధమయిన సస్యము ఫలించి ఎంత తినినను తరుగక ప్రజలకు అన్నము అక్షయమయినట్లు స్పష్టమగుటచే ఇట్లు వివిధములగు ఎరువుల సహాయముచే పంటలను అధికముగ పండించే అలవాటు, ఆర్ష వ్యవసాయ కాలము నుండియు, సదాచార ప్రాప్తమయినది గాని నూతనమైనది కాదని తెలియుచున్నది. ఆధునికులు బుద్ధి కౌశలముచే మరికొన్ని క్రొత్త ఎరువులను కని పెట్టినచో కనిపెట్టియుండవచ్చును గాని పూర్వతమమైన “మత్యమన్వ వాస్యతి" అను శ్రుతియందలి మత్యం అను పదమునకు అర్థ నిర్వచనముచేయు సందర్భములో అభిమత ఫల సాధనములగు గోమయము ఆదిగా గల ఎరువులు అను వ్యాఖ్యాసముచే ఇంకను అనేకములగు ఎరువులను వారు ఉపయోగించెడివారని బోధపడుచున్నది.

కోత : కృష్ణ యజుర్వేదములో “కువిదం గయవమం తోయవం చిద్యథావాంత్యను పూర్వం వియూయ । ఇహే హైషాం కృణుత భోజనాని యేబర్హిపోనమోవృక్తిం నజగ్ముః" అని కలదు. కృ.య. సం.కా. (1-8-21).

దీని భావము : రాజసూయాంతర్గతమగు 'సౌత్రామణి' అను క్రతువులో పై మంత్రముచే ప్రజాపతి దేవతాకమగు గ్రహగ్రహణ సందర్భములో యవాది ధాన్యములను పండించెడి కర్షకులు (వ్యవసాయకులు) పండిన చేలను కోయు సందర్భములో పండిన భాగమును, పండని భాగమును, విడదీసి పండవలసిన భాగమును కోయక, పండిన భాగమును ఎట్లు కోయుదురో, అటులనే ఓ దేవతలారా! యజ్ఞములను చేయు యజమానులలో శ్రద్ధావంతులను, శ్రద్ధారహితులను పృథక్కరించి, నమస్కారపూర్వకముగ హవిస్సులను సమర్పించెడి శ్రద్ధావంతులగు యజమానుల హవిస్సులనే భుజింపుడు—— అని.

దీనిలో దృష్టాంతముగా నీయబడిన ( పండిన భాగమును పండని భాగమును పృథక్కరించి) పండిన భాగమునే కోయుట ఆర్ష వ్యవసాయానుసారము కొడవళ్ళతో కోయునప్పుడే సంభవించును గాన కొడవళ్ళచే కోయు కోతనే ఈ శ్రుతి బోధించినట్లు స్పష్టమగుచున్నది.

ఉ. గ. శా.

ఆర్షశిల్పము  : భారతదేశమందలి ప్రజలకు వేదము ప్రమాణము. మానవుడు ధర్మార్థ కామమోక్షము లనేది నాలుగు పురుషార్థములను సాధింపవలయును. ఈ పురుషార్థములను సాధించుటకు భగవదుపాసనమే సాధనము. ఈ యుపాసనము అవ్యక్తోపాసనము, వ్యక్తోపాసనము, వ్యక్తావ్యక్తో పాసనము అని మూడు విధములుగ చెప్పబడినది, ఈ యర్ధమునే 'మానసీ హోమ పూజాచ బేరపూజేతి సాత్రిధా'అని ఆగమములు ఉపాసనాత్రయ స్వరూపమును వివరించినవి. అవ్యక్తోపాసనము చేయుట కష్టసాధ్యము. దీనిని సాధించుటకు అష్టాంగయోగసిద్ధిని పొందిన వారలే అర్హులు. ఈ యుపాసనమునే హృద్యాగము, మానసా రాధనము, అమూ ర్తపూజ యని కూడ చెప్పుదురు. కరచర ణాదులతో నిర్మింపబడిన భగవద్విగ్రహమును అర్ఘ్యము, పాద్యము మున్నగు నుపచారములతో పూజించుట వ్యక్తోపాసనము. వేదప్రామాణ్యము నంగీకరింపని వారు కూడ కేవల యుక్తి వాదముచే విగ్రహారాధనము చితైకాగ్రతను సాధించుటకు అవలంబము కాగలదని విశ్వసించి విగ్రహారాధనమును ఆదరించుచున్నారు. మంత్రపూర్వకముగ అగ్నియందు చేయబడెడి హవిస్యమర్పణము వ్యక్తా వ్యక్తోపాసనము. అది అగమశాస్త్ర సిద్ధాంతము.

'శిల్పం కర్మకలాదికమ్' అను కోశమునుబట్టియు, "తత్కర్మ యన్న, బంధాయ సావిద్యా యా విముక్తయే ఆయా సాయా పరం కర్మ విద్యాన్యా శిల్పనై పుణమ్." అను శ్రీ విష్ణుపురాణమునుబట్టియు, శిల్పశబ్దము వృత్తి విద్యలుగా చెప్పబడిన అరువదినాలుగు కళలకు సాధారణముగ వాచకమైనను, ఈ శబ్దము ఆలయనిర్మాణమును, విగ్రహ నిర్మాణమును చెప్పెడి శాస్త్రమందు రూఢమై వ్యవహరింపబడుచున్నది.

మానవునకు సహజమగు సౌందర్యపిపాస శిల్పకర్మకు నివాస మయ్యె ననియు సౌందర్యోపాసనము నిత్య సత్యముతో మిళితమై విగ్రహముల ద్వారమున పరబ్రహ్మో పాసనమునకు త్రోవ చూపినదనియు చారిత్రక విమర్శకులు విశ్వసించు చున్నారు. ఇదియు కొంతవరకు సత్యము కావచ్చును. పూర్వకాలపు శిల్పము శాస్త్ర నియమములకు కట్టుపడక తన్ని ర్మాతల యొక్క సహజ కౌశలమునకు తగినట్లు ఉత్తమోత్తమముగ సృజింపబడెననియు, కాలక్రమమున అట్టి సహజ శక్తి సంపన్నులు క్షీణింపగా ఆనాటి శిల్పమును ముందుంచుకొని, తరువాతివారలు లక్షణములను కల్పించి వాటిని శిల్ప శాస్త్రములందు పొందుపరచి రనియు, శాస్త్ర నియమములకు బద్ధుడగు ఆధునిక శిల్పి తన సహజశక్తిని వినియోగించుటకు శక్తి లేనివాడై చక్కని శిల్పమును సృష్టించలేకపోవుచున్నాడనియు విమర్శకులు అభిప్రాయపడుట కలదు. ఇందలి తత్త్వము నింకను పరామర్శింపదగును.

భారత భూమియందు లోకతంత్రముల నిర్వాహమందు అన్ని సమస్యలతో పాటుగ శిల్ప కల్పనము కూడ మతముతొ సర్వాంగీణమగు సంబంధమును కలిగి సజీవముగ నిలచి యున్నది. వేదకాలము నుండియు శిల, దారువు, లోహము, మృత్తు మొదలగు ద్రవ్యములచే పని చేయునట్టి స్థపతి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి మొదలగు జాతులవారు ఆ యా సమయములందు సంఘముచే గౌరవమర్యాదలతొ ఆదరింపబడుటయేగాక సంఘముపై ఆధారపడి జీవించుటయు కలదు. ఇట్టి వృత్తి విద్యలను సర్వారంభముగ లోకమందు ప్రవర్తింపజేసిన మహాపురుషుడు విశ్వకర్మ. ఈతడు అష్టవసువులలో కనిష్ఠుడగు ప్రభాసవసుపునకు బృహస్పతి సోదరియందు జన్మించినట్లు మహాభారతమందు కలదు. మానసారగ్రంథము ననుసరించి బ్రహ్మకు విశ్వరూపుడను కుమారుడు కలడనియు, విశ్వరూపుని సంతతిలో ఆరవ పురుషుడగు చాక్షుషమునికి పురుపు, పురుషుడు, సుద్యుమ్నుడు, విశ్వుడు, సాధ్యుడు అను ఏవురు పుత్రులు కలిగిరనియు, వీరలు వాస్తుశాస్త్రమును ప్రవర్తింపచేసి