సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్షభూగోళము
లంబకోణ త్రిభుజములు పై నుదాహరించిన రెండు రకములే కాన్పించును. తరువాత బ్రహ్మగుప్తుడు, మహావీరుడు, భాస్కరాచార్యుడు మొదలగువారు మరికొన్ని లంబకోణ త్రిభుజములను చెప్పిరి.
శుల్బకర్తలకు రేఖాగణితము, బీజగణితము తెలిసినను వారు వాటిని సోపపత్తికముగా సూత్రీకరింపకపోయిరి. వా రుపయోగించిన నిర్మాణములను మనము నవీన గణితముతో ఉపపక్తీకరించుకొనవలసి వచ్చేను. ఉపపత్తి కుపకరించు సిద్ధాంతములను వారేమియు చెప్ప లేదన వచ్చును. దానికితోడు వంటి సాంకేతిక సంజ్ఞలను కూడ వారు వాడలేదు. అందుచే వారి సూత్రములు గణితమున కంతగా తోడ్పడకపోయెను.
జ్యోతిషము (Astronomy) : నక్షత్రవిద్య ప్రత్యేక విద్యగా చెప్పబడెను. గ్రహములసంఖ్య, గమనము, నక్షత్రములు, రాశివిభాగము, అయనములు, ఋతువులు మొదలగు ప్రాథమిక విషయములే గాక గ్రహణములు, అధికమాసములు మొదలగువాని వివరములుకూడ వేదములలో కలవు. ఋ. సం. V. 40. 5–9 ఋక్కులలో అత్రిమహామునికి సూర్యగ్రహణమును గూర్చిన విషయము 'పూర్తిగా తెలియుననియు, వారి సంతతికికూడ పూర్తిగా తెలియుననియు ఉన్నది. అధికమాసమునుగూర్చి ఋ. సం. I. 25, 8 లో కలదు. వేదాంగ జ్యోతిషమునుబట్టి 1830 దినములలో సూర్యుడు ఆకాశవీధిని 5 చుట్లును, చంద్రుడు 67 చుట్లును తిరుగుదురు. 5 సంవత్సరములు గల ఒక యుగములో ఈ 67 చుట్లు నాక్షత్రమానము లనబడును. ఇట్టి మాసమునకు 27 29/67దినములు. కాని సావనమాసములు 5 సంవత్సరములలో 62 మాత్రమే ఉండును. సావనమాసమునకు దినములు 29½. ప్రతి 5 సం. లకు రెండు అధికమాసములు వచ్చును. అట్లే ప్రతి 62 దినములకు ఒక తిథి లోపించును. ఈవిధముగా 5 సంవత్సరముల కాలములో సూర్యచంద్రుల గమనమునుగూర్చిన విషయములు వేదాంగ జ్యోతిషమందు చెప్పబడెను. ఖగోళమునకు సంబంధించిన సూక్ష్మగణిత మేమియు దానియందు లేదనవచ్చును. పై చెప్పిన విషయములుకూడ స్థూలముగనే యుండుననియు, అవి అన్ని కాలములకు తగినట్టి పద్ధతులలో లేవనియు లోకమాన్య బాలగంగాధరతిలక్ తన వ్యాఖ్యానములో వ్రాసెను. అగ్రంథము నేటి సిద్ధాంతముల కేమియు ఉపయుక్తముగా లేదు. కేవలము యజ్ఞ యాగాదులు కాలనిర్ణయమునకే ఉపయోగించును.
భూమి గుండ్రముగా, నుండుననియు అది గాలిలో నిరాధారముగా సూర్యునిశక్తిచే నున్నదనియు (ఋ. iv. 53. 3; i. 33. 8) కొందరి వ్యాఖ్యాతల సమ్మతము. సూర్యు డుదయించుట కాని అస్తమించుట కాని లేక కొంతభాగమునకు రాత్రి, కొంతభాగమునకు పగలు ఏర్పరచుచు తిరుగుచుండును అని ఐతరేయ బ్రాహ్మణము (iii. 44) ను బట్టి తెలియును.
- సంజ్ఞావివరణము
- తై. సం—తైత్తిరీయసంహిత
- ఋ. సం——ఋగ్వేద సంహిత
- ఆ. శు—ఆపస్తంబ శుల్బ సూత్రములు.
- కా. శు.—కాత్యాయన శుల్బ సూత్రములు.
- శత.బ్రా——శతపథ బ్రాహ్మణము.
- బో. శు—బోధాయనశుల్బ సూత్రములు,
పు. ప. శా
ఆర్షభూగోళము :- భూగోళస్వరూపము :- భూమి సూర్యచంద్రులవలె ఆకాశములో నున్నది. భూమి మిగుల పెద్దదగుటవలన బల్లపరపుగా గనబడును. మరియు దీని మీది జనులందరును, తాము పైనున్నటులును, కొందరు క్రిందనున్నటులును తలంతురు. ఆకసమునకు మధ్యనున్న గోళమునకు క్రిందుమీదులేమి? (భూమి విశాలము. జనులో అల్పకాయులు). అది ఎటు చూచినను చదునుగనే కన్పించును. మరియు ఆకసము భూమినంటినట్లు కన బడును. కాని యిది వెలగపండువలె గోళాకారము. ఈ గోళమునడుమ మేరువు దండాకారముగ దక్షిణోత్తరముల వెలికుబికినది. దీని ఉత్తరాగ్రము పేరు సుమేరువు. దక్షిణాగ్రము పేరు కుమేరువు. ఉత్తర మేరువునకు పైగా ఆకాశము నందు ఉత్తర ధ్రువతారయు, దక్షిణ మేరువునకు పైగా ఆకాశమునందు దక్షిణ ధ్రువతారము, గలవు.
యామ్యగోళము - సౌమ్యగోళము :- ఉత్తరాయణ దక్షిణాయ నారంభములందు సూర్యుడు సూటిగా భూమధ్య రేఖమీదుగా పోవును. ఈ రేఖకు ఉత్తరమున నున్న భాగమునకు సౌమ్యగోళమని పేరు. దక్షిణమున నున్న భాగమునకు యామ్యగోళమని పేరు. సౌమ్యగోళ మంతయు జంబూ ద్వీపము.
భూమధ్య వలయ రేఖకు విషువన్మండల రేఖయని పేరు. ఈ రేఖమీద లంక కలదు. ఇది నేటి సింహళము కాదు. ఏనాడో లవణ సముద్రములో మునిగిపోయినదీ లంక. ఉజ్జయిని నుండి ఒక లంబరేఖ గీచినచో అది నిరక్షరేఖ నంటి యున్న యీ లంకనుతాకును. ఈ రేఖ మీదనే లంకకు తూర్పున యమ(వ)కోటియను పత్తనము గలదు. లంక కును యమ (వ) కోటికిని 1265 యోజనముల దవ్వు (వృ. వ. సిద్ధాంతము). ఇది భూమి యడ్డు కొలతలో నాలుగవ వంతు. యమ (వ) కోటికి తూర్పుగా 1265 యోజనముల దూరమున ఆ రేఖమీదనే సిద్ధ పురి యున్నది. అటనుండి ఆరేఖ మీదనే రోమకము అను ప త్త న ము గలదు. ఈ నాలుగుపత్తనములకును సుమేరు 'కుమేరువులు 1265 యోజనముల దూరముననే యున్నవి. నిరక్ష దేశముననుండు వారికి రెండు మేరువులును, రెండు ధ్రువములును క్షితిజమున కనిపించును.
యామ్య గోళము :- భూగోళమధ్య వలయమునకు దక్షిణమున లవణ సముద్ర మున్నది. ఆటనుండి యొక దానికొకటి దక్షిణముగా (1) క్షీర (2) దధి (3) ఘృత, (4) ఇక్షురస (5) మద్య (6) స్వాదునీర సముద్రములు గలవు. ఈ లవణ సముద్రమున కొకదాని కొకటి దక్షిణముగా (1) శాక (2) శాల్మల (3) కుశ (4) క్రౌంచ్ (5) గోమేధ (6) పుష్కరము లను ఆరు ద్వీపములు గలవు. ఈ యారు ద్వీపములును, లవణ సముద్రమునకు ఉత్తరముగా నున్న జంబూ ద్వీపమును గలిసి యేడు ద్వీపములు. కావుననే 'సప్త ద్వీపా వసుంధరా' అను సూక్తి సరియగుచున్నది.
కొన్ని పురాణములలో ప్లక్ష, శాల్మల, కుళ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపము లొకదాని కొకటి దక్షిణముగా నున్నవని కలదు. మరికొన్ని పురాణములలో నివి కొంత వ్యత్యస్తముగా నున్నవి. యోగసూత్ర భాష్యములో శ్రీ వ్యాసులు శాక, కుశ, క్రౌంచ, శాల్మల, మగధ(గోమేధ), పుష్కర ద్వీపములను చెప్పిరి.
యామ్య గోళము నందిపుడు మనకు ఆస్ట్రేలియా యును, ఆఫ్రికాలో కొంత భాగమును, అమెరికాలో సగభాగమును కానిపించు చున్నవి. మలయా మొదలగునవి భరత వర్షమున అనుద్వీపములని పురాణములలో గలదు. ఈ యామ్య గోళము నందు ఈ ద్వీప షట్కము లోని కొంత భూమి మునిగిపోయి యుండును. అట్లే జంబూ ద్వీపమునందును కొంత భూమి మునిగి యచట సముద్రము లేర్పడి యుండును.
కుల పర్వతములు :- భారత వర్షములో మహేంద్రః మలయ, సహ్య, శక్తి మత్, ఋక్ష, వింధ్యః, పారియాత్రము అను ఏడు కులపర్వతము లున్నవని వాయు పురాణము పేర్కొన్నది (57 అధ్యాయము). ఉత్తరమున గంగ పుట్టిన చోటినుండి దక్షిణమున కన్యాకుమారి వరకును వేయి యోజనములు వ్యాపించియున్న భూమినే భారత వర్షము లేక భరత ఖండము అనిరి. అమరసింహుడు ' _హిమవాన్ నిషధో వింధ్యో మాల్యవాన్ పారియాత్రకః గంధమాదన మన్యేచ హేమ కూటాదయో నగాః—' అని జంబూద్వీపములోని కొన్ని పర్వతములను చెప్పినాడు.
- 1. హిమవంతము :- ఇది కింపురుషవర్షమునకు దక్షిణ మందు మేరయై యుండునది.
- 2. నిషధము :- ఇది హరివర్షమనెడు వర్షమునకు ఉత్తరమున బాలసూర్యప్రకాశమై యుండును.
- 3. వింధ్యము :- ఇది భారతవర్ష మందుండు కుల పర్వతము.
- 4. మాల్యవంతము :- ఇదియే క్రౌంచపర్వతము. ఇది మేరు పర్వతమునకు పడమట గంధమాదన సమప్రమా
ణమై యుండును.
- 5. పారియాత్రకము :- ఇది భారతవర్షమం దున్నది.
- 6. గంధమాదనము :- ఇది మేరు పర్వతమునకు తూర్పున నున్నది.
- 7. హేమకూటము :- ఇది కింపురుష వర్షమునకు ఉత్తరముననున్నది, (ఇది లింగాభట్టు చేసిన వివరణము)
జంబూద్వీపములో ఒక్కొక్క వర్షములోనేగాక నిరక్ష రేఖక్రింది ఆరు దీవులలోను దీవికి ఏడేసి కులపర్వతము లున్నవని వాయుపురాణము చెప్పినది.
కులపర్వతము అనగా ప్రధాన పర్వతములని భావము. పర్వతమను పదమునకు సర్వత్ర ఉండునది, సంధులుగలది యనియు వ్యుత్ప త్తియున్నది. పర్వములు లేకపోయినచో గిరియగును. అది పర్వతముకాదు. రెండు పర్వతముల నడుమనున్న నేల లోయ లేక కనుమ. సంస్కృతములో ఇదియే ద్రోణి. గిరి పగిలినచో ఆపగులును దరి యందురు.
భారత వర్షములో నున్న మహేంద్ర మలయాది కుల పర్వతములకు లెక్క పెట్టలేనన్ని శాఖలున్నవి. ఇవి శాఖా పర్వతములు. మందరము, వైహారము, దుర్దురము, కోలాహలము, సురసము, మైనాకము, వైద్యుతము, పాతంధమము, పాండురము, కృష్ణము, గంతుప్రస్థము, గోధనము, పుష్పగిరి, శ్రీ జయంతము, రైవతకము, కారువు, కూటశిలము మున్నైనవి శాఖా పర్వతములు. ఈ కొండలలో ఆర్యమ్లేచ్ఛ జనపదము లున్నవని వాయు పురాణము తెలుపుచున్నది.
కులపర్వతముల పుత్తికలు :- త్రిసామ, ఋతుకుల్య, ఇక్షుల, త్రిదివ, లాంగూలిని, వంశధార అను నదులు మహేంద్రమను కులపర్వతము గన్న కూతుండ్రు. వంశధార మన మెఱిగినదే. వీనిలో కొన్ని నదులు నేడు లేవు. కొన్ని నదులు నామరూపములు లేకుండ పోవుట కలదు. త్రివేణిగా ప్రసిద్ధి చెందిన వానిలో సరస్వతి నేడు లేదు. నదులేమి ? అవి పుట్టిన పర్వతములే యొక్కొక యెడ మటుమాయమై పోయినవి. ఉత్తర సముద్రములో కొన్ని కొండలు మునిగిపోయినవని వాయు పురాణము వాకొనుచున్నది.
కృతమాల, తామ్రపర్ణి, పుష్పజాతి, ఉత్పలావతి అనునవి మలయపర్వతమునుండి స్రవించిన యమృత వాహినులు. వీనిలో తామ్రపర్ణి సుపరిచితము. ప్రసిద్ధమైన ఉదకమండలమే మలయపర్వతమని కొందరనుచున్నారు.
సహ్యకుల పర్వత పుత్త్రికలైన గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వంజుల, తుంగభద్ర, సుప్రయోగ, కావేరులు దక్షిణ భారతము నానంద నిలయము గావించినవి.
ఋసీక, సుకుమారి, మందగ, కూసపలాణిని యను వాహినులు శుక్తిమత్కుల పర్వత సంతానము.
ఋక్షకుల పర్వతము గన్న గారాబు బిడ్డలు శోణ, నర్మద, మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, శ్రోణి, కరతోయ, పైశాచిక, నీలోత్పల, విపాశ, జంబుల, శుక్తిమతి, మక్రుణ, త్రిదివ అనునవి.
వింధ్యకులపర్వతము తాపి, పయోష్ఠి, నిర్వింధ్య, మద్ర, నిషధ, వేణ్య, వైతరణి, శితిబాహు, కుముద్వతి, తోయ, మహాగౌరి, దుర్గ, అంతళ్ళిల అను జలకన్యలను గన్నది.
పారియాత్ర కులపర్వతమునుండి వేదస్మృతి, వేదవతి, వృత్రఘ్న, సింధు, వర్ణాస, చందన, సతీర, మహతి, పద, చర్మణ్వతి, విదిశ, వేత్రవతి, శిప్ర, అవంతి, అను స్రవంతి సంతానముద్భవిల్లినది.
ఇట్టి నదీమతల్లులకు పుట్టినిం డైన యీమహాపర్వతముల వయస్సెంత? ఇవి యెప్పటివి? వీనికి తావైనభూమి వయస్సు రెండువందల కోట్ల యేండ్లని భూతత్త్వవేత్తలు నుడువుచున్నారు. మన పురాణములు వై వస్వతమనువు 300 కోట్ల యేండ్ల వెనుకటి వాడని చెప్పినవి. ఈ వైవస్వత మనువునకు మునిమనుమడే సుప్రసిద్ధ భరతుడు. ఈతని పేరనే మనభూమి భారతవర్షమని ఖ్యాతమైనది. ఈతడును మనువే. కావున ఈ భూమి అంత వయస్సుగలదియని తేలుచున్నది. పర్వతములుకూడ కోట్ల యేండ్ల క్రింద నేర్పడి నవే. కొన్ని కొండలు సుమారు 120 కోట్ల పై చిలుకు ఏండ్లక్రింద పుట్టినవని భూగోళశాస్త్రజ్ఞులు నిరూపించిరి.
భారతవర్షము :- పురాణములన్నింటిలోను కడుంగడు ప్రాచీనములైనవి వాయు, విష్ణు, బ్రహ్మాండ పురాణములు. ఇవి భారతవర్షమును గుఱించి యేమి చెప్పినవి? ఖగోళజ్ఞులు ఏమిచెప్పిరి ? పరిశీలింతము.
మేరుపర్వతము : మేరువు బ్రహ్మాండములో ఈశ్వర మాయ. ఇదియే దేవలోకము, మేరువు భార్య ధారిణి. ఈమె బార్హిషదుల కూతురు. ఈమెకు మందర అను పుత్రుడేకాక మరి ముగ్గురు కూతుండ్రుకలరు. ఇది స్వాయంభువ మన్వంతరములోని ముచ్చట (వా. 30 - 35.)
వెనుకటిరోజులలో మేరు శిఖరము ధగధగలాడుచు ముల్లోకములకు కనబడుచుండెడిది. దానికి సామిత్ర మని పేరు. దాని ఒక ప్రక్క హిమవంతుని కూతురు నివసించెడిది. (వా . 30 – 81.)
మేరువు ఇలావృతవర్షము నడుమ నున్నది. మేరువునకు నాలుగువైపులను భద్రాశ్వ, భారత, కేతుమాల ఉత్తర కురుదేశము లున్నవి. ఇందు నీల, నిషధ, శ్వేత, హేమకూట, హిమవత్, శృంగవత్ పర్వతములును, హిమవత్పర్వతము నాశ్రయించి భరతవర్షమును, హేమ కూటము నాశ్రయించి, కింపురుష వర్షమును, నిషధ హేమకూట పర్వతముల నాశ్రయించి హరివర్షమును, నీలశైలము నాశ్రయించి రమ్యకవర్షమును, శ్వేతపర్వతము నాశ్రయించి హిరణ్మయ వర్షమును, శృంగవత్పర్వతము నాశ్రయించి కురువర్షమును గలవు. ఇలా వృతవర్షముతో నివి మొత్తము ఏడు వర్షములు.
జంబూద్వీపము :- స్వాయంభువుని కొడుకు ప్రియ వ్రతుడు జంబూద్వీపమును తన పెద్దకొడుకుకగు అగ్నిధ్రుని కిచ్చెను. అగ్నీధ్రుడు తన పెద్దకుమారుడైన నాభి యను వానికి జంబూద్వీపములో దక్షిణముననున్న హిమ వర్షము నిచ్చెను. (వా. 33-37-45.) జంబూద్వీపము
నందు సిద్ధచారణ గంధర్వులు నివసించు కొండలు గల తొమ్మిది భువనములున్నవి. లవణ సముద్రము దానిని చుట్టుకొనియున్నది. జంబూద్వీపములో భారతవర్షమునకు దక్షిణమున అంగ, యమ, మలయ, శంఖ, కుశ, వరాహ, బర్హిణము లను నేడు అనుద్వీపము లున్నవి. అంగ ద్వీపములో మ్లేచ్ఛగణములున్నవి. యమద్వీపము బంగారమునకు పుట్టినిల్లు. మలయద్వీపములో మ్లేచ్ఛులున్నారు. ఇక్కడ చందనవృక్షాలెక్కువ. ఇదికూడ బంగారమునకు,ముత్యములకు నిలయము. ఈ ద్వీపములో మందర పర్వత మున్నది. దానిమీద సురాసురపూజితుడు శ్రీ అగస్త్య మహర్షి యుండును. ఇందు త్రికూట పర్వత మున్నది. దానిమీద 3000 యోజనాల లంకాపట్టణ మున్నది. అది రాక్షస నివాసము. దీనికి తూర్పున గోకర్ణ క్షేత్రమున్నది. శంఖ ద్వీపము నూరు యోజనాల పరపు. ఇది మ్లేచ్ఛ నివాసము, కుముద ద్వీపములో మహాదేవుని సోదరియగు కుముదను, మహాద్వీపములో ఆదివరాహస్వామిని పూజింతురు.
ఇట్లు భూమికి నడుమ లవణ సముద్రము మేఖలవలె నున్నది. ఆ సముద్రములో అనుద్వీపాలున్నవి.
వాటిలో పుట్టు మీసాలవారు, మోకాలి బంటివారు, వ్రేళ్ళు వెల్లంకులు, కాయలు గసుళ్ళు తినువారు, 'వావి వరుసలు లేనివారు, 80 ఏండ్లు బ్రతుకువారు గలరట!
వీరు ఊరాంగ్ ఉటాన్ వంశ మూలపురుషులేమో ? ఇందలి మలయము నేటి మలయాఔనా ? బర్హిణ ద్వీపము నేటి బోర్నియో కావచ్చునా?
మేరువునకు దక్షిణముగా హిమవత్పర్వతము, దానికి దక్షిణముగా సముద్రము వరకును భారత వర్షము, దీనికి ఉత్తరమున అనగా హిమాలయమున కెగువ కింపురుష వర్షము, దానికి ఉత్తరముగా హరివర్షము కలవు.
కొందఱు నవ్యపరిశోధకు లిట్లందురు: జంబూ ద్వీపములో దక్షిణపు పెడ భారత ద్వీపము. కావున నిది జంబూ భారత ద్వీపము, దీని దక్షిణపుకొన భారత వర్షము. అది కూడ జంబూ ద్వీపమే. తత్సుచకముగా నేటికిని కాశ్మీరములొ జమ్మూ అని కొంత ప్రదేశ మున్నది. జంబూ పదమునకు తద్భవమే జమ్మూ అనునది.
బ్రహ్మాండ పురాణములోని జంబూద్వీపము వేరుగా నున్నది. దానిలోను నవఖండములున్నవి. వాని పేర్లు : (1) దైవఖండము (2) గభస్త్యఖండము (3) పురుష ఖండము (4) భరతఖండము (5) శరభఖండము (6) గంధర్వ ఖండము (7) తామ్రఖండము (8) శేరుఖండము (9) ఇందు ఖండము, ఈ తొమ్మిది ఖండములలోను వరుసగా (1) దేవ (2) భూత (3) కింపురుష (4) మానవ (5) సిద్ధ (6) గంధర్వ (7) రాక్షస (8) యక్ష (9) పన్నగు లుందురు.
తక్కిన వర్షములలో యుగములు లేవు. కాని భారత వర్షములో నాలుగు యుగములున్నవి. భరతునికి పూర్వము దీనికి హిమవర్షము లేక హైమవతవర్షము అని పేరుండెను. నాభి అనువాడు దీనిని పరిపాలించెను. దీనికి నాభివర్షమని కూడ పేరున్నట్లు గనబడుచున్నది. (వెన్నెలగంటి సూరన తెలుగు విష్ణుపురాణము) నాభికొడుకు ఋషభుడు. ఋషభుని కుమారుడు భరతుడు. వానివలననే హిమవర్షమునకు భారతవర్షమని పేరువచ్చినది. అజనాభమనియు దీనికి వ్యవహారముండేను. (భాగవత 5 స్కం.)
సగరుని కుమారులు జంబూద్వీపమును త్రవ్విపోయుట వలన (1) స్వర్ణ ప్రస్థము (2) చంద్ర శుక్లము (3) ఆవర్తనము (4) రవణకము (5) మందేహారుణము (6) పాంచ జన్యము (7) సింహళము (8) లంక అను ఎనిమిది ఉప ద్వీపము లేర్పడినట్లు భాగవత పురాణము తెలుపు చున్నది.
ఆర్యభటుడు తన సిద్ధాంత శిరోమణిలో 'లవణ సముద్రమునకు ఉత్తరముగానున్న భూమిలో సగము జంబూద్వీపము. ఇక మిగిలిన సగములో ఆరుదీవులును, ఏడు సముద్రములును ఉన్నవి.' అని చెప్పెను.
లవణ సముద్రము 2701 యోజనాలు, నిరక్షరేఖ మీద లవణ సముద్రములో లంక యున్నది. నిరక్షరేఖ మీద లంక, రోమకము, సిద్ధపురి, యమ (వ) కోటి అను పట్టణములున్నవి. ఈ నాలుగు పట్టణములకు పరస్పర దూరము భూవృత్తములో నాలుగవ వంతు. అనగా తొంబది యంశలు. లంకలో సూర్యోదయమైనప్పుడు యమ(వ)కోటిలో మట్ట - మధ్యాహ్నము. సిద్ధపురిలో అ సమయము. రోమకములో నడికిరేయి.
దీని తెలివిడి యిది :- ఎనిమిది యినుపచువ్వలు గల యొక గుడ్డగొడుగును తెఱచి నిలువుగా నేలలో నిలుచు నట్లు పెట్టుదము. గొడుగునడుమ ఆధారముగానున్న కఱ్ఱ మేరువు యొక్క పాతు అని యనుకొందము. గొడుగు మీదికి ఉబ్బెత్తుగా వచ్చిన కఱ్ఱకొన మేరువు. దానిచుట్టు నున్న చిన్న గుండ్రని గుడ్డముక్క ఇలావృతము. ఇనుప చువ్వల చివళ్ళచుట్టును గుండ్రముగా ఒక దారమును కట్టుదము. అదియే నిరక్షరేఖ. ఆ దారముతో కలిసి మన కెదురుగానున్న ఒక యినుపచువ్వకు ఒక ముత్యమును కట్టి దానిని లంక యందము. దానికి సమదూరములో మరిమూడు ముత్యములు కట్టి వానిని తక్కిన రోమక, సిద్ధపురి, యమ(వ)కోటి యను పట్టణము అని యందము. దారము క్రిందనున్న ఆకాశము లవణసముద్రము. గొడుగుకఱ్ఱ నలుదెసల నున్న గుడ్డయే జంబూద్వీపము. మన కెదురుగానున్న యినుపచువ్వకు ఈవలి యావలి రెండుచువ్వల నడుమనుండి ఎగువకఱ్ఱ కొసవరకును గల ప్రదేశము భారతద్వీపము. దీనిని మూడుగా విభజించి క్రింది భాగమును, లంకను ఆశ్రయించియున్న దానిని, భారత .వర్షమని గుర్తింతము.
ఈ రీతిగా పురాణములలో చెప్పబడిన జంబూద్వీపము, భారత వర్షము - ఆర్యభటుడు చెప్పిన జంబూద్వీపము, భారతవర్షము సరిగా సరిపోవుచున్నవి.
వే.శి.శా