Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్యసమాజము

వికీసోర్స్ నుండి

బడెను. మరియు ఆర్యభటునికి భూభ్రమణమే అభిమతమై యున్నచో ఇతర గ్రహములకువలె భూమికికూడ మధ్య స్ఫుటగతులను, వాటికి హేతుభూతము లగు మందోచ్చ శీఘ్రచ్చ మున్నగు విషయములను అతడు నిరూపణ పూర్వకముగ చెప్పియుండెడివాడు. ఆట్లు చెప్పియుండక పోవుటచే ఆర్యభటునకు భూభ్రమణ సిద్ధాంతమునందు విశ్వాసములే దని గ్రహించవలసి వచ్చుచున్నది.

పు. ప. శా

ఆర్యసమాజము  :: ఇది యొక ధార్మిక సంస్థ. మతసంస్థ కాదు. సాంప్రదాయికము కాదు. వైదిక సిద్ధాంతము లను విశ్వమున నలుగడల వ్యాపింప జేయుటకై యీ ధర్మసంస్థ స్థాపింపబడినది. జగద్గురు శ్రీమద్దయానంద సరస్వతీ స్వామి యీ సమాజసంస్థాపకుడు. ఇయ్యది విక్రమశకము 1932 చైత్రశుద్ధ పంచమి (క్రీ. శ. 1875 ఏప్రిల్ 10 వ తేది) నాడు బొంబాయి నగరమున ప్రారంభింపబడినది.

శ్రీ దయానంద సరస్వతీస్వామి క్రీ. శ. 1824వ సం. న మౌర్వీ రాజ్యములోని టంకారా గ్రామమున జన్మించిరి. వీరి పూర్వాశ్రమ నామము మూలశంకర్; తండ్రియగు కర్షన్ జీ వైదిక సంపన్నులు, శివభక్తులు. మూలశంకరుడు తన చిన్నతనమందే వేదాధ్యయన మొనరించి జననమరణ క్లేశములతో కూడిన యీ సంసారమునుండి ముక్తి మార్గము నన్వే షించుటకై ఇల్లువిడిచి సన్న్యసించెను. ఇది మొదలు ఆతడు దయానంద సరస్వతి యని వ్యవహరింపబడుచుండెను. దయానంద సరస్వతి వైదిక సత్య సందేశమును విశ్వమంతటను వ్యాపింపజేయ సమకట్టి ఆర్యసమాజ మను పేరనొక సంస్థను స్థాపించెను. ' ఈ సంస్థకు దయానంద కృతములగు యజుర్వేద భాష్యము, ఋగ్వేదములోని ఏడు మండలముల భాష్యము, సత్యార్థ ప్రకాశము మున్నగునవి ప్రమాణ గ్రంథములు.

ఆర్యసమాజమునందలి మొదటి రెండు నియమములు పరమేశ్వరునకును, అతని గుణములకును చెందినవి. మూడవ నియమము వేదము సత్యజ్ఞానములకు చెందిన గ్రంథ మనియు, దాని నెల్లరు పఠింపదగుననియు తెలుపును. వేదాధ్యయనమున స్త్రీ పురుష భేదముకాని, మానవుని రంగుభేదము కాని, జాతిభేదముకాని పాటింప బడరాదనియు ఇయ్యది తెలుపును. నాలుగవనియమము అసత్యమును విడిచి సత్యమును గ్రహించుట ప్రతివానికి కర్తవ్యమనును. ఐదవ నియమము ఎల్లరు చెడుగును వదలి మంచిని గ్రహింపవలయుననును. ఆరు, ఏడు, తొమ్మిది నియమములు మానవులెల్లరు సర్వమానవ శ్రేయస్సునకై పాటుపడుటయే తమజీవితమునకు లక్ష్యముగా నుంచు కొన వలెనని బోధించును. ఎనిమిదవనియమము అందరి యజ్ఞానము బోనాడి జ్ఞానము కల్గించుటకు యత్నింప బోధించును. పదియవ నియమము వ్యక్తి తనకు మాత్రము సంబంధించిన కార్యములలో స్వతంత్రుడై యితర కార్యములందు సమాజ హితము కొరకు ప్రయత్నింప బోధించును.

ఆర్యసమాజ మంతవ్యములు : ఆర్యసమాజము వేదమూలకములగు 'సార్వభౌమ ధర్మములను ప్రబోధింప నేర్పడిన సంస్థ కాబట్టి యిది ఆస్తిక సంఘమని వేరుగని చెప్పవలసిన పనియుండదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వవేదము ననెడి నాలుగు సంహితలు ఈ సంఘ దృష్టిలో ఈశ్వరీయములు. అందువలన అవి స్వతః ప్రమాణములు, మిగిలిన గ్రంథజాల మంతయు పరతః ప్రమాణము - వేదముల కనుకూలముగ నున్నంతవరకే యవి ప్రామాణికములు. I ఈ దృశ్యమాన ప్రపంచమునకు మూల కారణములు మూడని యీ సంఘసిద్ధాంతము. (1) ఈశ్వరుడు, (2) జీవులు, (3) ప్రకృతి. ఇందు మొదటి రెండు పదార్థములు చేతనములు. మూడవదైన ప్రకృతి జడము.

(1) ఈశ్వరుడు :- సచ్చిదానంద స్వరూపుడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్తస్వభావుడు. సృష్టి, స్థితి, లయములకు కారణభూతుడు. ఆద్యంతములు లేక నిర్వికారుడై, నిరంతరము సర్వాంతర్యామియై, జీవులకు కర్మఫలముల నొసంగుచుండును. అతడే విశ్వమున కధిష్ఠాత. శివుడు, విష్ణువు, మహాదేవుడు, బ్రహ్మము, పరమాత్మ, ఇంద్రుడు, అగ్ని, వాయువు మున్నగు అనేక నామములచే వేద శాస్త్రములందు పేర్కొనబడి యున్నాడు.

“ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అగ్నిం మిత్రం వరుణ మాహు రథో దివ్యః స సుపర్ణ"

ఓంకార మతనికి ముఖ్యనామము. ఓంకారమే ప్రణవ మనియు చెప్పబడును. సృష్టి ప్రారంభమునుండి ఋషులీ నామముతోనే యీశ్వరుని స్మరించిరి.

“తస్య వాచకః ప్రణవః" - యోగశాస్త్రము.

ఈశ్వరుడొక్కడే. అతనికి సమానుడుకానీ, అధికుడు కానీ మరియొకడు లేడు.

"అణో రణీయాన్ మహతో మహీయాన్" అనున దీతనియం దన్వర్థము. • ఈశ్వరుడు నిరాకారుడు. కావున నతడు శరీరధారి కాడు. రాముడు, కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు మున్నగువారు మహాపురుషులేకాని ఈశ్వరుని యవతార పురుషులు కారు. వీరెల్లరు జీవకోటిలోనివారే. ఇట్టి ఈశ్వరు నుపాసించి జీవులు పరమపదము నందగలరు. జీవులు ముక్తులగుటకు జీవేశ్వరులకు మధ్య అవతార పురుషులను కానీ, సందేశహరులను కానీ, దేవుని ప్రియ పుత్రులను కానీ అంగీకరించవలసిన యవసరము లేదని ఆర్యసమాజము చాటి చెప్పెను.

ఈశ్వరుడు సృష్టి ప్రారంభమునందే మానవులకు వలయు జ్ఞానము, మహర్షుల పవిత్రాంతఃకరణములందు ప్రకాశింప జేసియున్నాడు. ఆ జ్ఞానమే వేదములనబడును,

ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నిరాకారుడు కావున నతనికొక ప్రతికృతి (బొమ్మ) కానీ, ప్రతిమ (విగ్రహము) కానీ యేర్పరుపజాలము. అందువలన విగ్రహారాధనము ఈశ్వరారాధనము కాదనియు, నది యవై దికమగుటచే త్యాజ్యమనియు నార్యసమాజము బోధించును.

ఆర్యసమాజము సగుణ నిర్గుణోపాసనముల నంగీకరించును. 'భగవంతుడాయా గుణములు (ఆనందాదులు) కలవాడనిభావించుట సగుణోపాసనము. ఆయాగుణములు (రాగద్వేషాదులు) లేనివాడని భావించుట నిర్గుణోపాసన మని ఈ సమాజము చెప్పును. ఈశ్వరుడు సగుణుడయ్యు సాకారుడు కాడు. అందువలన సాకారోపాసన ఈశ్వరో పాసనము కాజాలదని సమాజ మభిప్రాయపడుచున్నది.

(2) జీవులు:- రెండవ చేతన తత్త్వము జీవుడనబడును. సుఖము, దుఃఖము, ఇచ్ఛ, రాగము, ద్వేషము, జ్ఞానము, ప్రయత్నము మున్నగు గుణములు జీవుని లక్షణము. జీవతత్త్వము, ఈశ్వర తత్త్వమువలె సర్వ వ్యాపకము కాక, అణుపరిమాణము కలదియై యుండును. కాని యిదియు పుట్టుక, నాశము లేనిదై యుండును. సర్వజ్ఞము కాక యల్పజ్ఞము, సర్వశక్తిమంతము కాక యల్పశక్తిమంతమై యుండును. ఇట్టిజీవులు ప్రతి శరీరమున కొక్కటి చొప్పున నసంఖ్యాకము లని యార్య సమాజ మంగీకరించును. ఇదియే శాస్త్ర సమ్మతము.

జీవులు కర్మచేయుటలో స్వతంత్రులుగా నుందుర ఫలము ననుభవించుటలో వారికి పారతంత్య్రము తప్పదు అందువలన నిష్టమువచ్చినట్లు శుభాశుభ కర్మల నొనరించి వానికి తగిన ఫలముల నీశ్వరు డొసంగగా తప్పనిసరిగా వారనుభవింతురు. ఆయా కర్మల ఫలముల ననుభవించటకు జీవు లొక శరీరమును విడిచి మరియొక శరీరమున బొందుచుందురు. అందువలన క్రిమికీటాది బ్రహ్మ పర్యంతము గల శరీరములు జీవులు కర్మానుగుణ ఫలముల ననుభవింప ననువగు యోనులు, జీవులకు శరీరముతో సంబంధము కలుగుటను జన్మమనియు, శరీరముతో సంబంధము విడిపోవుటను మరణ మనియు నందురు జీవునకు స్వరూపతః జనన మరణములు లేవు.

"న హన్యతే హన్యమానే శరీరే"

"జీవులు జన్మింతురుకాని, వారికి నాశములేదు. అను సిద్ధాంతము బుద్ధి విరుద్ధమని యార్యసమా మెంచును. జీవులు వేదవిహిత ధర్మములను కర్తవ్య బుద్ధితో నాచరించి నిస్సంగులైననాడు జన్మమరణ పరంపరనుండి ముక్తులగుదురు. ముక్తులైనవారు ప్రకృతి సంపర్కములేని పరమాత్ముని నిరవధికానంద స్వరూపమున యథేచ్ఛముగ విహరించుచు ముక్తి సుఖము ననుభవింతురు. పరాంతకాలము వరకు ముక్తిసుఖము ననుభవించి జీవులు మరల జన్మబద్ధులగుదురు, జీవుల సావధిక ప్రయత్న ఫలమయిన ముక్తి నిరవధికము కాజాలదని యార్యసమాజ మంతవ్యము.

(3) ప్రకృతి -- దృశ్యమాన ప్రపంచమున స్థూలముగ గనబడు జడపదార్థముల కన్నిటికి నుపాదాన కారణము ప్రకృతి యనబడును. ఇది యచేతనమును, అత్యంత సూక్ష్మమును, పరమాణు రూపమును, పరిచ్ఛిన్నమునై యున్నది. పరమాణు రూపమగు నీ ప్రకృతి యుత్పత్తి వినాశములు లేక సదా యునికిగలదై యుండును. పరమాణువులు ఈశ్వర సంయోగముచే క్రియావంతములై పరస్పర సంయుక్తములై స్థూలతను బొందును. క్రమముగా పృథివ్యాది పంచ భూతములు నిర్మితములగును.

ఈ ప్రకృతి సత్వరజస్తమోగుణాత్మికమై యింద్రియ గోచరముకాక యవ్యక్తము, అలింగము అనబడును. వ్యాపక పరమాత్మయం దిది యేక దేశముననుండి వ్యావ్య మనబడును.

పరమాణువులు సంయోగముచే స్థూలతను బొందుట సృష్టియనబడును. అవి వియోగమువలన సూక్ష్మతను బొందుట ప్రళయ మనబడును. ప్రకృతిలో నిట్లు సంయోగ వియోగాత్మక పరిణామము కలిగించువాడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు తన సామర్థ్యముచే కారణరూపమున నున్న ప్రకృతిని కార్యరూపగత వికృతిగా మార్చును. ఇదియే సృష్టి. అట్లే ఈశ్వరుడు కార్యరూపమున నున్న వికృతిని కారణరూపమున మార్చును. దీనిని ప్రళయ మందురు.

ఆర్యసమాజమిట్లు దృశ్యమాన జడ చేతనాత్మక ప్రపంచమునకు మూలకారణము మువ్విధములుగా నంగీకరించును. ఆ మూడు కారణములు సంక్షిప్తముగా జీవేశ్వర ప్రకృతు లనబడును. వేదములం దిట్లే వర్ణింపబడినది.

ద్వా సువర్ణా సయుజా సఖాయౌ
సమానం వృక్షం పరిషస్వజాతే,
తయో రన్యః పిప్పలం స్వాద్వత్తి
అసశ్న న్నన్యో ౽భిచాక శీతి. "

అందువలన ఆర్యసమాజము శంకర, రామానుజాది సంప్రదాయములం బోలి అద్వైతమో, విశిష్టాద్వైతమో, ద్వైతమో, ద్వైతాద్వైతమో బోధింపక వైదిక సిద్ధాంతమగు త్రైతమును బోధించును. చార్వాకుడు, కార్లాయిల్, మార్క్సు మున్నగువారు చెప్పునట్లు కేవల భౌతిక వాదమును కానీ, క్రైస్తవ మహమ్మదీయాది మత సంస్థ అంగీకరించునట్లు కేవల చేతన వాదనమును కానీ యార్యసమాజము ప్రబోధింపదు. భారతీయ వేదాంతులు బోధించునట్లు ఈ ప్రపంచము మిథ్య, మాయ, ఉనికి లేనిది యని యార్యసమాజ మంగీకరింపదు. గీతయందు చెప్పినట్లు 'నాసతో విద్యతే భావః, నాభావో విద్యతే సతః" అసత్తునకు భావము కానీ సత్తున కభావము కాని యుండదనుట బుద్ధిసంగతము, యదార్థము నగును. ఇతర మతవాదులు “మతమునందు విశ్వాసముంచవలసినదే కానీ హేతువాదమునకు, తర్కమునకు తావులేదు" అని చెప్పుదురు. ఆర్యసమాజము "య స్తర్కేణానుసంధత్తే స ధర్మో నేతరః" తర్క సిద్ధము ధర్మమగును. మతాంతరుల దృష్టిలో మతము, విజ్ఞానము (Religion & Science) పరస్పర విరుద్ధములు. ఆర్యసమాజ దృష్టిలో ధార్మిక సిద్ధాంతములు విజ్ఞాన విరుద్ధములు కావు. ఇయ్యది ఆర్యసమాజ మంగీకరించు తత్త్వనిర్ణయములకు సంబంధించిన సామాన్యస్వరూపము,

II కర్మపునర్జన్మసిద్ధాంతము  :- ఆర్యసమాజము వైదిక కర్మసిద్ధాంతము నంగీకరించును. మానవులు మనోవాక్యా యముల ద్వారమున చేయు చేష్టలు కర్మ అనబడును. అందు శుభకర్మలకు సుఖరూపమునను, అశుభకర్మలకు దుఃఖరూపమునను మానవులకు ఫలము చేకూరుచుండును. జీవులు తాము చేయు కర్మలకు ఫలము ననుభ వించియే తీరవలయును. స్థూలరూపమునందే జీవులు సుఖదుఃఖ రూప కర్మఫలముల ననుభవింతురు.అందువలననే "భోగాయతనం శరీరమ్" అని చెప్పబడినది. ఒకరు చేసిన కర్మలకు ఫలము మరియొకరికి చెందదు. కర్తయే కర్మ ఫలముల ననుభవింపవలెను. జీవులకు వారు చేయు కర్మలకు తగిన ఫలముల నీశ్వరు డొసగును. అతడు పాపము లను క్షమింపడు. జీవు లొనరించు కర్మలకు ఉద్దిష్టఫలము వెంటనే లభించునను నియమము లేదు. కావున కొన్ని కర్మల ఫలము జీవులకు జన్మాంతరమున ననుభవింపవలసి వచ్చును. పూర్వజన్మకృత కర్మలలో నెయ్యవి ప్రస్తుత శరీరమున ననుభవింపనగునో యవి ప్రారబ్ధము లనియు, శేషించిన కర్మలు సంచితము లనియు, రాబోవు జన్మములలో ననుభవింప ననువుగ ప్రస్తుత జన్మమున జేయు కర్మలు ఆగామి కర్మ లనియు పేర్కొనబడును. మనుష్య జన్మమందు జీవుడు కర్మల నాచరింప స్వాతంత్య్రముగలిగి యుండును. అన్యజన్మలు భోగజన్మలు. పశుపక్ష్యాది జన్మలందు జీవులు కర్మల నాచరించుటలో స్వతంత్రులు కారు. కావున పుణ్య పాప విభజనము మానవుల కేకాని అన్యప్రాణుల కుండదు. అందువలన ధర్మాధర్మ ప్రవృత్తి నివృత్తులను బోధించి శాసించు శాస్త్రములు మానవుల కొరకే నిర్మింపబడినవి. ఈ విషయమును గుర్తించి ఫలాపేక్ష లేక శుభకర్మల నాచరించి యంతఃకరణమును పరిపూత మొనర్చుకొని ముక్తిసుఖమును బడయువారు, జన్మమరణ బంధనము పరాంత కాలముదనుక తప్పించు కొనువారు ధన్యులు.

III యజ్ఞములు :- ఆర్యసమాజము వేదవిహితములైన అగ్నిహోత్రము మొదలు అశ్వమేధ పర్యంతముగల యజ్ఞ ములు మానవులకు అనుషేయములుగ నెంచును. బ్రహ్మ యజ్ఞము (సంధ్యోపాసనాదులు). దైవయజ్ఞము (అగ్ని హోత్రము), పితృయజ్ఞము (మాతాపితరుల సేవ), మనుష్య యజ్ఞము (అతిథి సత్కారము), బలివైశ్వ దేవము (ఆశ్రిత ప్రాణుల కాహారాదుల నొసంగుట) అను పంచమహాయజ్ఞములు ఎల్లరకు కర్తవ్యములు.

వేదోక్తయజ్ఞములు హింసారహితములు. యజ్ఞము లందు పశు విశసనాదులను ఆర్యసమాజ మంగీకరింపదు, ఉవ్వట, సాయణ, మహీధరాదులచే రచియింపబడిన వేద భాష్యములు యజ్ఞములందు పశు హింసాదులను అంగీక రించును. అందువలన భాష్యము లార్షములు కావు. తాంత్రికుల ఆచారములచే ప్రభావితులై భాష్యకారులు వేదముల నట్లు వ్యాఖ్యానించిరని యీసమాజ మెంచును.

యజ్ఞ శబ్దము ధాత్వర్థమును పురస్కరించుకొని దేవ పూజనమును, సంగతిక రణముమ, దానమును బోధించును. అట్లే మేధశబ్దము పవిత్ర వాచక మేకాని హింసా వాచకము కాదు. అధ్వరము హింసావాచకము కాకపోగా హింసను నిషేధించుచున్నది. (ధ్వరతి హింసాకర్మ నధ్వ రతీ త్యధ్వరః) ధ్వరమనగా హింస. అదిలేనిది అధ్వరము. అనగా అహింసాత్మకమని భావము.


వేదములందు సర్వత్ర సర్వభూతహితమే కర్తవ్యముగా బోధింపబడినది. (మా హిగ్ ంసీ సర్వభూతాని.) ఏ భూతమును హింసింపకుము. "అఘ్న్యా గావః' గోవులు హింసింపదగినవి కావు." అను నిట్టి వేద విధులు లెక్కకు మిక్కిలిగా వేదములందు ఉపలబ్ధములగుచుండ యజ్ఞ వ్యాజమున పశువిశసనాది హింసలు వేదముల పేర జరుపుట బుద్ధి సంగతముకాదు. (వైదికీ హింసా హింసా న భవతి) ‘వై దిక హింస హింస కాదు.' అను నిట్టి వాక్యములు వేద విరుద్ధములగుటచే అప్రమాణములు. కావున గో మేధమునకు ఇంద్రియములను పవిత్రము చేసికొనుట, అశ్వ మేధమునకు రాష్ట్రమును పవిత్రముచేయుట మున్నగు నర్థములను గ్రహించుట యుక్తము, గావః . ఇంద్రియములు. అశ్వః - రాష్ట్రము. ఇట్టి శబ్దార్థములు బ్రాహ్మణ గ్రంథములందు జూడనగును.

IV వర్ణాశ్రమ వ్యవస్థ  : విశ్వమునగల మానవులెల్లరును ఒకేజాతికి చెందినవారు. మానవులలో వివిధజాతులు లేవు. కాని మానవసంఘము సర్వాంగీణాభివృద్ధి నొందుటకు తగినట్లు చతుర్వర్ణములుగ వ్యవహరింపబడుటను ఆర్యసమాజ మంగీకరించును. అనగా వేదమూలక వర్ణాశ్రమ వ్యవస్థను సమాజ మంగీకరించును. బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవహారము మానవసంఘమున జన్మప్రయుక్తము కాక గుణకర్మప్రయుక్తముగా నంగీకరించును. అందువలన బ్రాహ్మణత్వాదులు జాతులుకావు బ్రాహ్మణ, క్షత్రియాది శబ్దములు వర్ణబోధకములు. జాతి వాచకములు కావు.

ప్రస్తుతము భారత దేశము వ్యవహారమందున్న జాతి భేదములు అవిద్యాకల్పితములు. అందువలన నవి వేదవిహి తములనజనదు. మానవులందరు పర మేశ్వరునిబిడ్డలు. సర్వ ప్రాణులు పర మేశ్వరుని ప్రజ. పరమేశ్వరుడు ప్రజాపతి. మానవజీవితము సుఖమయముగావింప ననువగునట్లు జీవిత కాలము బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వాన ప్రస్థము. సన్న్యాసము అనబడు ఆశ్రమములుగా నాలుగు భాగములు చేయబడెను. ఐదేండ్ల తరువాత బాలురు ఇరువదియై దేండ్లవరకును, బాలికలు పదునారు యేండ్లవరకును గురుకులములందుండి బ్రహ్మచర్యము సలుపుచు విద్య నభ్యసించ వలెను.

అటుపై శాస్త్రవిహిత గృహస్థ ధర్మములను నిర్వర్తించి ఏబది యేండ్లకు పైబడినతదువరి వానప్రస్థులగుట మానవుల కుచితము. తదుపరి సాంసారిక జీవనమును గడుపరాదు. వానప్రస్థులు గ్రామమునకు వెలువలనుండి సంఘమున కుపకరించు కర్తవ్యముల నాచరించుచు స్వాధ్యాయాదులను చేయుచుండవ లెను.

క్రమముగా సాంసారిక భోగములనుండి విరక్తులై సన్న్యసించి బ్రహ్మనిష్ఠులై జీవితమును సఫల మొనర్చుకొనుట సన్న్యాసాశ్రమ విధి.

V. సంస్కారములు  :- మానవజీవితమును పరిష్కరించుటకుగాను నిషేకాది శ్మశానాంత షోడశ విధ సంస్కారములను ఆయా కాలమున జరుపుట శ్రేయస్కరమనియును సమాజ మంగీకరించును.

VI శుద్ధి మత పరివర్తనము :- ఏమతమునకు చెందిన వారైనను వైదిక ధర్మమార్గము నవలంబింతు మందు రేని యట్టివారి నార్యసమాజము వైదిక మార్గ మున దీక్షితుల నొనర్చును. వేదధర్మముల ననుసరించుటకు సర్వ మానవులకు నధికారమున్నది. అందు జాతిభేదము కానీ, వర్ణ భేదము కానీ, దేశ భేదము కానీ పాటింపబనిలేదు. వేద ములు సార్వకాలిక సార్వభౌమ ధర్మ ప్రతిపాదకములు. అవి ఈశ్వరీయములు. కాబట్టి ఒకరి సొత్తుగ భావింపజనదు. విశ్వమునంతటిని ఆర్యమొనర్చుటకు ఆర్యసమాజ మనుదినము ప్రయత్నించుచున్నది. "కృణ్వంతో విశ్వమార్యమ్' ఇది దానినినాదము. అందువలన నేడు క్రైస్తవ మహమ్మదీయాది నామములచే వ్యవహరింపబడువారు వేదధర్మ పరులు కానెంతు రేని ఆర్యసమాజము వారికి సదా స్వాగత మిచ్చి వేదమార్గమును ప్రదర్శించును.

ఆర్యసమాజము మానవజీవనమునకు సంబంధించిన ఎల్లవిషయములను వైజ్ఞానిక సూత్రానుకూలముగ పరిష్కరింప యత్నించును. అది విశ్వాసములకును మూఢాచారములకును తావీయదు. అది సర్వతోముఖ మగు మానవాభ్యున్నతికే కాక సర్వప్రాణికోటి హితము నాకాంక్షించి తదను కూలాచరణమునకు గడంగును.

ఆర్యసమాజ నిర్మాణము  :- సమాజ నిర్మాణము ప్రజాతంత్ర పద్ధతుల ననుసరించి చేయబడినది. పదునెనిమిది సంవత్సరములు దాటిన ప్రతి వ్యక్తియు నీ సమాజమున సదస్యుడు కాదగును. కనీసము పదిమంది సభ్యులతో నొక సమాజము స్థాపింపనగును. సమాజమున సదస్యుడు కాదలచినవ్యక్తి తన యాదాయమునందు శతాంశమునకు తక్కువకాని ద్రవ్యమును చందారూపమున సమాజమున కొసగవలసియుండును. అతడు సమాజముచే సూచింపబడిప సదాచార నియమములను పాటింపవలసి యుండును.

ప్రతి సమాజమును నియమానుకూలముగ నడుపుటకు తగినట్లు సమాజ సదస్యులు తమలో కొందరిని కార్యకర్తలనుగా నెన్నుకొందురు. వారిలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధ్యక్షుడు, పుస్తకాధ్యక్షుడు ముఖ్యులు. వీరితోబాటు మరిముగ్గురిని చేర్చి ప్రతి సమాజమునకు నొక కార్యనిర్వాహక వర్గము (అంతరంగసభ) ఏర్పరుపబడును. సదస్యులు మిక్కిలిగానున్నచో అధికారుల (కార్యకర్తల) సంఖ్య యథోచితముగ బెంచుకొనవచ్చును.

ఇట్టి సమాజము లొక ప్రాంతమున పదికిమించి యేర్పడిన తదుపరి యా సమాజ సదస్యుల ద్వారమున ఎన్నుకొనబడిన ప్రతినిధులతో నొక ప్రాంతీయ ఆర్య ప్రతినిధిసభ యేర్పడును. సమాజములు ప్రతి యిరువది మంది సదస్యుల కొక ప్రతినిధి నెన్నుకొని ప్రాంతీయసభ నేర్పరచుకొనును. సమాజమున నున్నట్లు ప్రతినిధి సభ యందును అధికారు లెన్నుకొనబడుదురు. ప్రతి ఆర్య సమాజము తన యాదాయమునందు పదియవవంతు ద్రవ్యము ప్రతినిధిసభకు చేర్చును.

ఇట్టి ప్రాంతీయ ఆర్యప్రతినిధి సభలనుండి యెన్నుకొనబడిన ప్రతినిధుల మూలమున సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ యొకటి నిర్మింపబడును. ఆసభాకార్యములను నిర్వహించుటకు ప్రాంతీయ ప్రతినిధిసభలు తమ యాదాయమున పంచమాంశము చందారూపమున నిచ్చును. ప్రాంతీయ సభలనుండి యెన్నుకొనబడిన ప్రతినిధులు సార్వదేశిక ఆర్యప్రతినిధిసభకు అధికారుల నెన్నుకొందురు. అందునను ఒక కార్యనిర్వాహక వర్గముండును.

ప్రతి ఆర్యసమాజమును సప్తాహమున కొక పర్యాయము సత్సంగ మను పేరిట సదస్యుల నెల్లరను సమావేశ పరుచును. ఆ సమావేశమున సంధ్య, అగ్నిహోత్రము, భగవద్భజనలు జరుపును. విద్వాంసుల ద్వారమున ధర్మోపదేశము చేయించును. విజ్ఞులమూలమున జ్ఞాన చర్చ జరిపి వైయక్తిక, సామాజిక జీవనౌన్నత్యమునకు పాటు పడుచుండును.

వార్షిక సమావేశముల సాయమున వైదిక ధర్మ ప్రబోధము నొనరింప శక్తి కొలది యత్నించును.

ఇట్టి యార్యసమాజములు భారత దేశమునం దంతటను అనేకము లేర్పడినవి. పంజాబు, ఉత్తరప్రదేశము, బీహారు మధ్యప్రదేశము మున్నగు ప్రాంతములలో ప్రాంతీయ ప్రతినిధిసభ లేర్పడి నిజధర్మమును నిర్వర్తించుచున్నవి.

విదేశములందు ఆఫ్రికా, ఇంగ్లండు, అమెరికా, బర్మా, అస్సాము మున్నగు దేశములందును ఆర్యసమాజములు నెలకొల్పబడినవి.

భారతదేశమున ఢిల్లీనగరమున నున్న సార్వదేశిక ఆర్యప్రతినిధిసభతో ఎల్ల దేశముల సమాజములకును సంబంధ మున్నది. భారతదేశమునుండి వెళ్ళి విద్వాంసులైన ధర్మప్రచారకులు విదేశములందు వైదిక ధర్మప్రచారము నొనర్చుచున్నారు.

ఆర్యసమాజము నడుపు సంస్థలు :- బాలురు, బాలికలు బ్రహచర్యపూర్వకముగ జాతీయపద్ధతులతో విద్యల సభ్య సింప ననువుగ ననేక సంస్థల నెలకొల్పి విద్యావ్యాప్తికి తోడ్పడుచున్నది. అందు గురుకులములు, దయానంద ఆంగ్ల వైదిక కళాశాలలు (D. A. V. Colleges) అతి ముఖ్యములు.

ఇవికాక అనాథ శరణాలయములు కూడ స్థాపించి వానిని నిర్వహించుచున్నది. దిక్కులేని పిల్లల నందు చేర్చి వారికి హస్తకళలతో పాటు విద్యాప్రదాన మొనర్చి స్వతంత్రులై జీవనోపాధి గడుపుకొనదగిన సామర్థ్యమును కలిగించుచున్నది.

వైదిక సాహిత్యమును ప్రచారముచేయు నుద్దేశముతో ముద్రణాలయములను నెలకొల్పి వేదాదిగ్రంథములను ముద్రించుచున్నది.

దేశ విదేశములందు వైదిక ధర్మముల నుద్బోధించుటకు యోగ్యులయిన ప్రచారకులను సిద్ధముచేయుట కనువగు ఉపదేశక విద్యాలయములను స్థాపించి నిర్వహించుచున్నది.

ఈ సంస్థలన్నియు నాయా ప్రాంతములందు ప్రాంతీయ ఆర్యప్రతినిధి సభల యధీనమున నడుచుచున్నవి. వీని నిర్వహణమునకు వలయు ధనము విశేషభాగము సమాజకోశమునుండియే వెచ్చింపబడును. విద్యాసంస్థల నిర్వ హించుటకు ప్రతి సంవత్సరమునందును సుమారు 25 లక్షల రూపాయలు వెచ్చింపబడు చున్నవి.

పం. గో.

ఆర్షగణితము  :- ఛాందోగ్యోపనిషత్తునందు (vii. 1. 2) నారదముని సనత్కుమారునితో తానదివరకు నేర్చిన విద్యలను చెప్పుచు రాశివిద్యను, నక్షత్ర విద్యను పేర్కొ నెను రాశివిద్యయనగా గణితమనియు, నక్షత్రవిద్యయనగా జ్యోతిషమనియు అర్థము. ఆర్షసంప్రదాయమున తత్త్వజ్ఞానోపయ క్తములగు విద్యలు తక్క మిగిలిన విద్యలన్నియు తత్ప్రతిబంధకములుగా ఉపేక్షింప బడినవి. అయినను శ్రోతస్మార్త క్రియలకు అవసరమగు నంతమటుకు ప్రతి విద్యలోను పరిపూర్ణతను ఆయా శాస్త్రములు పొందియే యున్నవి. అట్టి షడంగములలో జ్యోతిషము మూర్ధన్యమని వేదాంగ జ్యోతిషము చెప్పును. అట్లే యాగములందు ప్రధానమగు అగ్ని వేదియొక్క నిర్మాణమును గూర్చి బ్రాహ్మణము లందును, కల్ప సూత్రములందును చెప్పుచు గణితమును అనేక విధములుగా ఉపయోగించిరి. ఇట్లు వైదిక ఋషులచే ఉపయుక్త మైన గణితమందలి కొన్ని విషయము లిచట పరిశీలింప బడును. ఇచట ఆర్ష గణితమనగా ఋషి ప్రోక్త గణిత మనియే అర్థము.

అంకగణితము (Arithmetic) :- ఒకటి మొదలు పరార్థమువరకుగల సంఖ్యలు వేదములో ననేక చోట్ల వాడ బడుట యేగాక కాఠక సంహితాదులలో * సంఖ్యలుగా


  • . తై. సం. 4. 4. 11; కాఠక సం. 17. 10; మైత్రాయణీ సం. II 1.14; కపిషల సం. 26. 9.