సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా)
ముఖ్య ఆహారమనియు, సహకారి (subsidiary) ఆహారమనియు ఆహారము రెండువిధములు, గోధుమ, వరి, జొన్నలు, సజ్జలు, రాగులు మున్నగు ధాన్యముల ఉత్పత్తి, వాటి ఖర్చు మున్నగు విషయములు ముఖ్యాహారమునకు చెందినవి. పప్పుదినుసులు, చక్కెర, ఫలములు, కూరగాయలు మున్నగునవి సహకారి ఆహారమునకు చెందినవి. పై రెండు కాక మూడవ విభాగము క్రింద వచ్చునవి. తేనీరు, కాఫీ, కోకో, ఓవలటీను మున్నగు పానీయములు.
ప్రత్తి, జనుము, నార. పొగాకు, రబ్బరు, అవిసేనార మున్నగునవి ముఖ్యమైన ముడిపదార్ధములు. ఈ పంటలు పండుటకు అనువగు పరిస్థితులను గూర్చి విమర్శించుట కూడ ముఖ్యమైన విషయము.
ఖనిజపదార్ధములును మూడు రకములు - (1) ఇనుముతో సంబంధము గల లోహములు. ఉదా :- ఇనుము, మాంగనము, (2) ఇనుముతో సంబంధము లేని లోహములు, ఉదా :- సీసము, యశదము, రాగి, అల్యూమినియము.. తగరము, (3) మిక్కిలి విలువగల లోహము లగు బంగారము, వెండి, ప్లాటినము. ఇవిగాక పెట్రోలు, బొగ్గు మున్నగు పారిశ్రామిక ఇంధనములు, రాతి ఉప్పు, కాల్షియగంధకితము, రాతినార, అభ్రకము మున్నగు అనేక లోహేతర ఖనిజములు కూడ ఖనిజసంబత్తియందలి అంతర్విభాగములే. స్థూలదృష్టిచే పరిశ్రమలు కుటీరపరిశ్రమ లనియు కర్మాగారపరిశ్రమ అనియు, యంత్ర పరిశ్రమ లనియు మూడు తెరగులు, యంత్రములను నడుపుటకు వలసిన శక్త్యుత్పత్త్యాధారముల సాధనములను గూర్చిన పరిశీలనముకూడ ఆర్థిక భూగోళశాస్త్రము యొక్క ముఖ్య విషయములలో నొకటి. * అట్టి ఆధారములలో మానవ కృషి, జంతు సాహాయ్యము, బొగ్గు, పెట్రోలు, విద్యుత్తు, సూర్యశ క్తి, అణుశక్తి మున్నగునవి లెక్కింపదగినవి. రవాణా సౌకర్యములలో రహదారులు, రైలుమార్గములు, జల వాయుమార్గములును చేరును. ఆర్థిక భూగోళశాస్త్రములో, వాణిజ్య మొక ప్రధానాంశమై యున్నది. వివిధప్రాంతముల మధ్య జరుగు ఎగుమతి దిగుమతి వస్తువులనుగూర్చి తెల్పు విషయమే వాణిజ్యము.
వివిధ దేశములమధ్య జరుగు ఎగుమతులనుగూర్చి ఇందు చర్చింపబడును. వ్యాపారము కొంత విలువగలదైనను
ఆర్థిక భూగోళశాస్త్రమున దానికి ప్రాముఖ్యము లేదు.
ఆధునిక ఆర్థిక శాస్త్రపఠనములో మానవుని వృత్తులు ఆధారముగా కనుపడినవి. ఆ వృత్తులు పురాతన వృత్తు లనియు, ప్రథాన వృత్తులనియు, సహకారి వృత్తులనియు మూడు తెరగులు.
కాయలు, దుంపలు ఏరుట, చేపలు పట్టుట, వేటాడుట ఇవి పురాతన వృత్తులు. వీటిని ఆధారముగా గొనియే పురాతన కాలములో మానవుడు జీవిత సమరమును సాగించుచుండెను.
మానవుడు తన పరిసరములకు అలవాటుపడిన కొలది. ప్రకృతి కనుగుణముగా ప్రవర్తింపనేర్చిన కొలదియు, ప్రధానవృత్తులను స్వీకరించెను. పశువులను పెంచుట, కాలక్రమమున గనులు త్రవ్వుట మున్నగునవి ప్రధాన వృత్తుల కుదాహరణము,
ప్రధానవృత్తు లాధారముగా ఏర్పడి పారిశ్రామిక విప్లవానంతరము అభివృద్ధిలోనికి వచ్చిన వృత్తులు సహకారివృత్తు లనబడును. ఉదా : రవాణాలు, వాణిజ్యము మున్నగునవి.
ప్రతిప్రాంతమునందును ఈ వృత్తులలోగల వైవిధ్యమును, మనుష్యుడు చేయు కృషికి ప్రకృతినుండి కలుగు ఫలితములును పరిశీలింపబడి, మానవుని పరిసరములకును, ఆతడవలంబించు వృత్తికిని సమన్వయము కల్పింపబడు చున్నది.
వివిధ భౌగోళిక ప్రాంతములలో మానవులెట్లు జీవించుచున్నారో, ఎట్లు సంచరించుచున్నారో, ఎట్లు తమ క్షేమమును సాధించుకొనుచున్నారో వివరించు భూగోళశాస్త్ర భాగమును ఆర్థిక భూగోళము అందురు. ఇది ఆర్థికావసరములమీదను, వాటిని సాధించు పద్ధతుల మీదను ప్రాధాన్యమును ప్రసరింప చేయును.
బి. యన్. చ
ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా):- భారతదేశపు ప్రణాళికా విధానము ప్రజాస్వామ్య దృక్పథము కలిగియుండవలె ననువిషయము ఎల్లరిచే ఆమోదింపబడినది. ప్రజల యొక్క ఆర్థిక వసతులను ప్రతివ్యక్తి కివచ్చు స్వల్ప ఆదాయమును మనము పరిగణింప వలసియున్నది. ఉద్యోగావకాశములను పెంపొందించు టతోపాటు, ఉత్పత్తిని అధికముచేయురీతిని వ్యవసాయ ప్రణాళికలను తయారుచేసికొనుట మన ఆశయము కావలసి యున్నది. మనకుగల పెట్టుబడి అవకాశములు బహుపరిమితములు అను విషయము వాస్తవమే. విదేశ నాణెములను మారకముద్వారా సంపాదించుటకుగాను ఎగుమతులను ఎక్కువచేయురీతిని వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించుటకు మనము ప్రయత్నింపవలసియున్నది. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలమున మనము ఉత్పత్తిని పెంపొందించుకొని సామ్యవాద వ్యవస్థా నిర్మాణ మార్గమును సుగమము చేసితిమి. భారతదేశపు ప్రణాళికా రచనా విధానము 36 కోట్లమంది ప్రజల భవిష్యత్తుకు తద్వారా కొంతవరకు ఇతరదేశముల భవిష్యత్తుకు సంబంధించిన మహోజ్వల విషయము. ప్రణాళికా నిర్మాణములో ఒకే దృక్పథమును ఓకేమాదిరి పద్ధతులను అనుసరించుట ఆవశ్యకము. మనము అనుసరించెడు ప్రణాళిక ప్రజల పురోగమనమునకు తోడ్పడవలసి యున్నది. ఆపురోగమనము నిరంతరమైనది. అందులకు పెక్కు ప్రణాళికలు ఆవశ్యకములు. సాంకేతిక విషయములలో చెప్పుకొనదగిన అభివృద్ధిని సాధించనియెడల మనము ఈ 20వ శతాబ్దిలో మన గమ్యస్థానముచేర జాలము. మనకు విశిష్టమైన ఆశయములు నిర్దుష్టమైన సిద్ధాంతములు ఉన్నవి. సాంకేతిక విషయములలో అధికమైన పురోభివృద్ధి కలిగినది. కావున మనము ప్రణాళికా రచనను గురించి యోచించు చున్నాము. మన సాంకేతికాభివృద్ధిని గూర్చి యోచించవలసియున్నది. ప్రథమ పంచవర్ష ప్రణాళిక ఎన్నో సత్ఫలితములను సమకూర్చినది. మన జాతీయాదాయము రు. 10,800 కోట్లు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలము ముగియుసరికి అది రు. 13,480 కోట్లు కాగలదని ఆశింపబడు చున్నది. కావున సగటున వ్యక్తిగత ఆదాయము 281 రూపాయలనుండి 331 రూపాయలకు హెచ్చవలసి యున్నది. తృతీయ పంచవర్ష ప్రణాళిక ద్వార యిది రు. 396 కును, చతుర్థ పంచవర్ష ప్రణాళిక ద్వారా రు. 496 కును హెచ్చవలసి యున్నది. పంచమ ప్రణాళికయందు అనగా 1976 నాటికిది రు 546 కాగలదు.
మనము తయారుచేయు ప్రణాళిక యందు మార్పులకు వీలుండవలెను. మనము ఆశించేడు ప్రమాణములలో మాత్రము అనిర్దిష్టత యుండరాదు. వ్యవసాయమే మన ప్రజల ముఖ్యవృత్తి. కావున వ్యవసాయ ప్రణాళిక యనగా మనమాశించెడు ఆహారోత్పత్తి ప్రమాణమునకై ప్రణాళిక తయారుచేయుటయే కాగలదు. ఆహారోత్పత్తిని మనము నూటికి 30 నుండి 40 వంతులవరకు హెచ్చించుట ఆవశ్యకము, ప్రణాళికా కాలములోనే మన జన సంఖ్యయు పెరుగుచుండును. రాబోవు 20 సంవత్సరములలో మనదేశపు జనసంఖ్య సుమారు 50 కోట్లు కాగలదు. జనసంఖ్య అభివృద్ధి, సంఘములోని నేటి ఆదాయములలో పెట్టుబడికై వెచ్చింపబడిన భాగము. ఆ పెట్టుబడిపై అధికోత్పత్తి రూపమున లభించిన ప్రతిఫలము అను విషయములపై మన ఆర్థికాభివృద్ధి ఆధారపడును. ఎంత నిష్పత్తిలో పెట్టుబడి పెట్టబడినది అనునది చాల ముఖ్యవిషయము, ఆర్థికముగా వెనుకబడియున్న దేశములలో అట్టిది స్వల్పముగా నుండక తప్పదు. వ్యక్తిగతకృషికి మన మెల్లవిషయములు వదలివేయ జాలము. ఆర్థికముగా వెనుకబడియున్న దేశములలో ప్రణాళికానుసరణము ఆవశ్యకము. కేవలము మనకు అధికముగా ఆహారము కావలసియుండుట మాత్రమే మన వ్యవసాయాభివృద్ధికి కారణముగాదు. ఆహారమును ఎగుమతి చేసి, మనకు కావలసిన వస్తు సంచయమును దిగుమతి చేసికొనుటకు గూడ వ్యవసాయాభివృద్ధి ఆవశ్యకము. విదేశీ మారక ద్రవ్యము మన దేశమునకు అత్యావశ్యకము. వస్తువులను ఎగుమతి చేయు శక్తి లేనియెడల మన ఆర్థిక పతనము అనివార్యము కాగలదు. మన వ్యావసాయక పునాదులను గట్టిచేసికొనని యెడల మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరము కాజాలదు. కావున వ్యవసాయోత్పత్తి ఆవశ్యకము. కావున దానిని నూటికి 30-40 పాళ్ళవరకు హెచ్చింపవలెను. నేడు ప్రపంచమున వ్యవసాయ ఉత్పత్తి మిగుల తక్కువలో నున్నది. మన ఉప జలాధారములను వృద్ధిచేసికొని, పెద్ద వానినుండి పూర్తిలాభములను పొందినయెడల అట్టిది. మనకు అసాధ్యము కాజాలదు. నేడు మన జనసంఖ్య 36 కోట్లు. జనసంఖ్య పెరిగిన కొలదియు మనకు ఆవశ్యకము కాగల ఉత్పత్తి ప్రమాణము ఈదిగువను సూచింపబడినది:-
| సంవత్సరము | జనసంఖ్య లక్షలలో | కావలసిన వ్యవసాయోత్పత్తి లక్షలలో | అభివృద్ధి ఆశయ ప్రమాణము లక్షల టన్నులలో |
|---|---|---|---|
| 1961 | 4100 | 850 | 150 |
| 1971 | 4600 | 960 | 260 |
| 1981 | 5200 | 1080 | 380 |
ప్రజల అవసరములు తీర్చుటకై మనము ఉత్పత్తిని 1981 కి నూటికి 30-40 వంతులు హెచ్చింపవలసియున్నది. మన జలాధార ప్రణాళిక లన్నియు పూర్తి యైనపుడు మన వ్యవసాయోత్పత్తి 36 లక్షల టన్నులు మాత్రమే పెరుగగలదు. ఈనాటికొరతలు తీర్చుటకు 150 లక్షల టన్నులు కావలసి యుండును. పెరుగుదలలో నున్న మన జనాభాకుగల ఆహార వసతులు మిగుల తక్కువలో నున్నవి. ఉత్పత్తిశక్తి సామర్థ్యములు తక్కు వయగుటచే వారు జాతీయాదాయాభివృద్ధికి చేదోడు ఇయ్యగల వయస్సులోనే అకాలమరణమునకు గురియగుచున్నారు. వ్యవసాయాభివృద్ధి ప్రణాళిక సామ్యవాద వ్యవస్థను గుణ్యము కావలసియున్నదను విషయము యథార్థము. సహజ సంపదలను భూ వినియోగమును గూర్చి సరియగు రీతిని ప్రణాళికలు వేసికొన వలయునని దీని అర్థము. వ్యవసాయము అందరకు పని కల్పింపజాలదు. ఆర్ధికముగ ఉన్నతస్థితిలోనున్న దేశములలో గూడ అదనపు జనాభాను చేతిపనులలోను, చిన్నపరిశ్రమలలోను నియోగించు చున్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికయందు చిన్న పరిశ్రమలకు, కుటీరపరిశ్రమలకు ప్రాముఖ్యము. ఇచ్చుటకు ఇదియే కారణము, ఉత్పత్తి పెరుగుదల, జాతీయాదాయము హెచ్చుట, ప్రజల జీవన ప్రమాణాభివృద్ధి యిందు మూలమున సాధింపబడగలవు. జనసంఖ్యను పరిమితము చేయనియెడల ఈ దేశము అభివృద్ధి పొందజాలదు.
అస్థిరమైన మన ఆర్థిక సాంఘిక వ్యవస్థపై జన సంఖ్య పెరుగుదల ఫలితములు అనునవి మున్ముందు మనల నెదుర్కొనబోవు ముఖ్య సమస్యలలో నొకటి. ప్రణాళికానుబంధ మైన నిర్దుష్ట విధానముతో ఈ సమస్యను అనుబంధించ వలెను. ఇందులో గల సాధక బాధకములు సుస్పష్టములే. కాని మనదేశపు భవిష్యత్తును గూర్చి ధైర్యముగ ప్రణాళికలు వేయవలెను. వ్యవసాయమేగాక యితర వృత్తులనుగూడ వృద్ధిచేయని ఎడల మనము ప్రజల అవసరములను తీర్చుట మిగుల కష్టము కాగలదు. భూవసతులను ఖండోపఖండములుగ విభజించుట, ముక్క చెక్కలు చేయుట, భూయాజమాన్యము; గృహపరిశ్రమల అభివృద్ధి మనము పరిష్కరింపవలసిన ఇతర సమస్యలు. ఖండోపఖండములుగను, ముక్క చెక్కలుగను, భూ విభజనము, భూయాజమాన్యము విషయములలో తీవ్రములగు భూ సంస్కరణము లిదివరకే హైదరాబాదు మున్నగు వివిధ రాష్ట్రములందు ప్రవేశపెట్టబడినవి. రైతుకు సమంజసమైన ప్రతిఫలము లభించురీతిని భూ వసతుల పరిమాణమును నిర్ణయింపవలసి యున్నది. నేటి మన ప్రత్యేక పరిస్థితులను దృష్టియం దుంచుకొని భూ వసతుల గరిష్ఠ ప్రమాణము (Maximum Holding) ను నిర్ణయించవలెను. కాని తన్మూలమున వ్యవసాయోత్పత్తి కెట్టి ఆటంకము కలుగకుండునట్లు చూడవలసియున్నది. ఆ ప్రమాణము అత్యధికము గాని, అత్యల్పము గాని కారాదు. రైతుకు భూమిని దున్నుకొనుటకు రక్షణ యివ్వవలెను. వ్యవసాయ సహకార సంస్థల నిర్మాణము మన అంతిమ ఆశయము కావలెను. జపాన్ పద్ధతిని వరి సాగుచేయుటవంటి నూతన ఉత్పత్తి విధానములను అనుసరించవలెను. భారత వ్యవసాయము ఋతుపవనములతో జూదమాడుటవంటిది. కావున రైతులకు ఉపవృత్తులు కల్పించుటకై గృహవరిశ్రమలను ప్రోత్సహించవలెను.
వెనుకబడియున్న ఆర్థిక వ్యవస్థలో కుటీర పరిశ్రమా ప్రణాళికలు :- ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వంకకు ఉద్య మించుచున్న మనయొక్క భుజములపై గల బాధ్యత అపారమైనది. అది ప్రజలెల్లరి యొక్క సంక్షేమమును పరిగణింపవలసి యుండును. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందని అర్థికవ్యవస్థ. సంపదలు, మనుష్యశక్తి. మనకు అపారముగా గలదు. అయితే అవి ఇంతవరకు సక్రమముగా వినియోగించుకొనబడలేదు. జీవనప్రమాణము • హెచ్చుచేయుటకు ప్రయత్నించుట అవసరము. పౌరులెల్లరు ఆర్థికాభ్యుదయ కార్యక్రమములో ప్రముఖపాత్ర వహింప జాలెడు ఆర్థిక వ్యవస్థానిర్మాణమునకు మనము ప్రయత్నించవలెను. స్వల్ప సగటు ఆదాయము, ప్రాముఖ్యముగా వ్యవసాయాధారమైన ఆర్థికవ్యవస్థ, అధికముగా పెరిగిపోయెడు జనసంఖ్య, అధికమైన దామాషా జననమరణాలు, భారీపరిశ్రమలు లేమి - ఇవి వెనుకబడి యున్న ఆర్థిక వ్యవస్థ యొక్క కొన్ని లక్షణములు. జనసంఖ్య పెరుగుదలను ఆపుచేసెడు చర్యలు, సంపదలను వినియోగించుటకు సాంకేతిక నైపుణ్యము అత్యవసర విషయములు. జలవిద్యుచ్ఛక్తి యంత్రముల స్థాపనకు, జలాధారముల నిర్మాణమునకు, వ్యవసాయములో యంత్ర విధానములు ప్రవేశపెట్టుటకు అభివృద్ధిచెందిన దేశములు వెనుకబడిన దేశములకు తోడ్పాటు నియ్య వలెను. దురదృష్టవశమున హద్దువద్దులు లేక పెరిగి పోయెడు జనసంఖ్య ఆర్థికాభివృద్ధికి ఒక పెద్ద అడ్డంకియైనది. బహుముఖాభివృద్ధిని సాధించుటకు కాలవ్యవధి, పాశ్చాత్య దేశములవారి తోడ్పాటు అవసరము. కావున స్వల్ప కాలములోనే సత్ఫలితముల నీయజాలెడు ఉపాయ ములను మనము అన్వేషించవలసియున్నది. మానవుల అనుదిన జీవితమును సుఖప్రదము చేయుట యనే మహా ప్రయత్నములో మనము నిమగ్నులమై యున్నాము. నిరుద్యోగముకన్నను చాలినంత పనిలేకపోవుట భారతదేశమును, ఆసియాయందలి ఇతరదేశాలను పీడించుచున్న గడ్డువ్యాధి. జీవనప్రమాణాలు బహుతక్కువగా నుండుట కిదియే హేతువు. జనసంఖ్య పెరిగిపోవుటవలన వ్యవసాయములో నిమగ్నులయిన వారిసంఖ్య సాగులో నున్న భూవిస్తీర్ణమునుబట్టి ఉండవలసినదానికంటెను అధికముగా నున్నది. దుష్టములయిన భూయాజమాన్య విధానములు, సామర్థ్యరహితములైన వ్యవసాయపద్ధతులు, మిగుల చిన్నవైన వ్యక్తిగత భూవసతులు జీవితముపట్ల అనాది సిద్ధమైన అవకతవకదృక్పథము- ఈ సమస్యను మిగుల క్లిష్టతరము చేయుచున్నవి. జనసంఖ్య వత్తిడిని తగ్గించుట అవసరము, వ్యవసాయ కూలీలసంఖ్య ఉద్యోగావకాశములను మించి పెరిగిపోవుచున్నది. మన వ్యవసాయము ఋతుపవనములతో: జూదము కావున చాలినంత పనిలేకుండుట మన ఆర్థికవ్యవస్థకు వంటబట్టిన రోగమై పోయినది. పరిశ్రమలు నెలకొల్పుట ద్వార ప్రజలను గ్రామ సీమల నుండి పట్టణములకు మార్పుచేయగలము. కాని పెట్టుబడి నిర్మాణము శీఘ్రముగ వృద్ధిపొందకుండుటచే, అందులకు అత్యావశ్యములైన ఆర్థిక వసతులు సమకూరకున్నవి. భారతదేశమునందు ఇంతవరకు ఆంగ్లవ్యవసాయ విప్లవము వంటి విప్లవముయొక్క ఛాయలైనను పొడచూపుట లేదు. నేటి చేతిపనులలోను, చిన్న పరిశ్రమలలోను నవీన పద్ధతులను ప్రవేశ పెట్టియు, వానిని తద్వారా వృద్ధి చేసి జీవనప్రమాణమును పెంచవచ్చును. అవి గ్రామసీమలందే కలవు. కావున వానిద్వారా రైతులయొక్క పెక్కు అవసరములను తీర్చవచ్చును. అవి నేటికిని పెక్కుమందికి జీవనాధారములుగ నున్నవి. భారతదేశమునందు 2 కోట్ల మంది చిన్న పరిశ్రమలలో, కుటీరపరిశ్రమలలో పనిచేయు చున్నారు. కావున వానిని వృద్ధిచేయుట సమంజసమైన విషయము, చేనేత పరిశ్రమ ద్వార దేశమున తయారగు బట్టలో నాల్గవ వంతు ఉత్పత్తి యగుచున్నది. సింహళములో ఇట్టి పరిశ్రమలు (చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు) మొత్తము జనసంఖ్యలో పదవ వంతుకు పని కల్పించుచున్నవి. దీనినిబట్టి జనసంఖ్యలో పెక్కుమందికి పనికల్పించి, వ్యవసాయముపై నాధారపడిన జనుల జీవన ప్రమాణము యొక్క పెంపుదలకు దోహద మివ్వజాలునను విషయము స్పష్టమైనది. భారీపరిశ్రమల పోటీ వలన పతనమునకు గురియైన ఈ పరిశ్రమలలో నవీన పద్ధతులను ప్రవేశ పెట్టి, వాటికి నూతన శక్తి సౌష్ఠవములను చేకూర్చవలెను.
గృహపరిశ్రమలు, చిన్నపరిశ్రమలు ఆవశ్యకములా ? యని తర్జనభర్జనలు చేయవలసిన కాలము గతించినది. వానికి మన ఆర్థిక వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్య మున్నది. వానివలన తయారగు వస్తునంచయము హెచ్చు కాగలదు. పెట్టుబడి పెట్టుటకు మనకుగల శక్తి స్వల్పమైనది. కాని మనకు అపొర మనుష్యశక్తి సంపద గలదు. భారీ పరిశ్రమలు వృద్ధిపొందరాదని ఎవరి అభిమతమును కాదు. 'కాని నేటి పరిస్థితులలో గృహపరిశ్రమలు, చిన్న పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని పెంచుటలోను, ప్రజావసరములను తీర్చుటలోను స్వల్పకాల సత్ఫలితముల నియ్యగలవు. కర్మకారుల ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేసిన యెడల వారు చేయు వస్తూత్పత్తి యెంత యో అధికము కాగలదు. ఇంతటి శిక్షిత మనుష్యశక్తి విలువ నుపేక్షించుట, వస్తువులను, సంపదలను వ్యర్థముచేయుట మాత్రమే కాగలదు. చిన్న పరిశ్రమలద్వారాను, కుటీర పరిశ్రమలద్వారాను ఉత్పత్తిచేయువారిని అశ్రద్ధచేయుట అవాంఛనీయమైన చర్య కాగలదు. ఈ పరిశ్రమలలో నిమగ్నమైన అధికసంఖ్యలో నున్న జనులను అందుండి తొలగింపజాలము. వ్యవసాయదారులకు ఉపవృత్తుల యొక్క ఆవశ్యకతయు అంతటి ప్రాధాన్యముగల విషయమే. గృహ పరిశ్రమలను, చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యముచేసి కేవలము భారీపరిశ్రమలను మాత్రమే ప్రోత్సహించు విధానమువలన అప్రధానసంఖ్య గల ఒక వర్గము వారి జీవనప్రమాణము పెరుగుటకు దోహదము కలుగుటయు, వ్యవసాయముపై నాధారపడిన తక్కిన వారిని దారిద్య్రముపాలు చేయుటయు కాగలదు. జన సంఖ్యలో నూటికి 70 మంది గ్రామసీమలందు నివసించు చున్నారు. గ్రామసీమలందలి అదనపు జనాభాకు జీవనోపాధి చూపించవలెను. జనసంఖ్యలోని అన్ని వర్గములకు పనిచూపించుటయే భారత దేశార్థికాభ్యుదయ సమస్య యొక్క కీలకము. మనదేశములోని జనులలో అధిక సంఖ్యాకులు గ్రామనివాసులగుట, వారి ప్రధాన జీవనోపాధి వ్యవసాయమే యగుట, వారికి చాలినంతపని లేకుండుట వాస్తవ విషయములు. ఈ పరిస్థితుల నుండియే కుటీర పరిశ్రమల ఆవశ్యకత ఉద్భవించుచున్నది. ఈ పరిస్థితులనుండి సంభవించిన రుగ్మతకే ఈ పరిశ్రమలు దివ్య ఔషధములు.
కుటీర పరిశ్రమలు పెక్కుమందికి పని కల్పించి, సంపదను సృష్టించుటతోపాటు అది విస్తృతముగా విభజనయగుటకు దోహద మివ్వగలవు. అసమర్థుడగు కార్మికుని సృష్టి స్వల్పమే కావచ్చును. కాని శరీర సౌష్ఠవము కలవారందరికి పనికల్గించుట యనునది మనముందు గల సమస్య. ప్రజలకు స్వగృహములందే పని కల్గించుట చిన్న పరిశ్రమల యందలి విశిష్టమైన సౌకర్యము. చిన్న పరిశ్రమలలోను కుటీర పరిశ్రమలందును కూడ సాంకేతిక విధానములను వృద్ధిచేసి, గ్రామసీమలు కలకలలాడునట్లు చేయవచ్చును. నేడు జనసంఖ్యతో పోల్చిన పెట్టుబడి అవకాశములు తక్కువగా నున్నవను విషయమును మనము విస్మరింపకుందుముగాక. పెట్టుబడి అవకాశములును మిగుల మందముగా వృద్ధియగుచున్నవి. తాత్విక చర్చలవలన ఈ సమస్యలు పరిష్కారము కావు. పెట్టుబడి కొదువగ నున్నప్పుడు ముడి సరకులను సంపదలను సమంజసమగురీతిని వినియోగించుటకు వీలుకాదు. ఒక మొత్తమును చిన్న పరిశ్రమలకు గృహపరిశ్రమలకు పెట్టుబడిగా వినియోగించిన యెడల అందుమూలమున ఎక్కువ పరిశ్రమా విభిన్నత్వము, పరిశ్రమా వికేంద్రీకరణము, మరియు తొందరలో సత్ఫలితముల ప్రాప్తించగలవు.
మన ఆర్థిక సమస్యను గ్రహించినవారికి జనసంఖ్య సమస్యను గూర్చియు, సంతాన నిరోధమును, పద్ధతుల గూర్చియు తాత్త్విక చర్చల వలన నిది పరిష్కరింపబడదను విషయము సుస్పష్టమే. దేశమున బహుళసంఖ్యలో గల ప్రజలకు పని కల్పించనలెనను వాస్తవిక దృష్టితో ప్రణాళికలు తయారు చేయుటయే యిందులకు పరిష్కార మార్గము. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చిన్న పరిశ్రమలకు, గృహపరిశ్రమలకు ప్రాముఖ్యము ఇవ్వబడిన కారణమిదియే. జపాను. స్విట్జర్లండు దేశములందు పరిశ్రమలు అద్భుతముగ వృద్ధియగుటకు కారణము వానికై జాగరూకతతో ప్రణాళిక వేసి, శ్రద్ధతో తదను గుణ్యముగ వృద్ధిచేయుటయే. భారతదేశమున గూడ వానినట్లే వృద్ధిచేసి తద్వారా రైతుల పరిస్థితిలో మారుపు కల్గించుట అసాధ్యమగు విషయముగాదు.
చిన్న పరిశ్రమలను గృహపరిశ్రమలను గురించి ప్రణాళికలు వేయుట ఇటీవలి విషయము. మన ఆర్థిక వేత్తలలో పెక్కుమందికి వీనిలో ఇటీవలి వరకు నమ్మకము లేదు.
గత 5 సంవత్సరములలో కుటీరపరిశ్రమాభివృద్ధి హైద్రాబాదు ప్రభుత్వము మిగుల నిర్దుష్టమైన చర్యలు తీసికొనినది. పారిశ్రామిక సహకార సంఘముల సమాఖ్య వీని ఉత్పత్తికి ధనసహాయము, విక్రయ సదుపాయముల కల్గించుచున్నది. ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమలశాఖ ఉత్పత్తి విధానముల వృద్ధిపొందించుటకు శిక్షణ కేంద్రము నేర్పాటుచేయుటయేగాక సాంకేతిక ప్రవీణ వ్యక్తులలో నిరుద్యోగ నిర్మూలనకై సహకారకృషి కేంద్రముల స్థాపనకు ద్యమించినది, గ్రామసీమలలో పరిశ్రమల నెలకొల్పు ప్రణాళికలో గ్రామీణ కర్మకారుల సహకారము పొందుటకై విద్యుచ్ఛక్తితో నడుపబడు యంత్రముల వినియోగించు గ్రామీణ కర్మకారులకు తరిఫీదు ఇచ్చుచున్నది. అనేక జలప్రణాళికల మూలమున వివిధ ప్రాంతములకు విద్యుచ్ఛక్తి సరఫరా కానున్నది. చిన్న పరిశ్రమలను, గృహపరిశ్రమ లను నవీన పద్ధతులు అవలంబించునట్లు చేయుట కిది అపూర్వతరుణము.
వ్యవసాయాభివృద్ధికి ప్రణాళిక వేయుటలో అనుసరించవలసిన ప్రధానసూత్రములు పైన సూచింపబడినవి. పర స్పర సమన్వయము, ఐక్యతగల ప్రణాళిక మనకు కావలసి యున్నది. మున్ముందు పెక్కు సంవత్సరముల వరకు వ్యవసాయము మనప్రజల ప్రధాన జీవనోపాధియై యుండుట తప్పదు. ఈనాడు అది లాభసాటి కాని పరిశ్రమ. అట్లుగాక అది రైతుకు గిట్టుబాటుగా నుండుటకు చర్యలు తీసికొనవలెను. వ్యవసాయమునుగూడ మనమొక పరిశ్రమగానే పరిగణించిననాడే అది సాధ్యమగును.
ఆర్. వి. రా.
ఆర్యభటుడు :- భారతీయ జ్యోతిశ్శాస్త్రములో అర్ష సిద్ధాంతముల తరువాత శాస్త్రీయ సిద్ధాంత గ్రంథములను రచించినవారిలో ఆర్యభటుడు మొదటివాడుగ చెప్పబడుచున్నాడు. ఇతడు క్రీ.శ. 476 లో జన్మించినట్లు తన గ్రంథములోని ఈ శ్లోకమువలన తెలియగలదు.
శ్లో, షష్ట్యబ్దానాం షష్టి ర్యచా
వ్యతీతా స్త్రయ శ్చ యుగపొదాః
త్య్రాధికా వింశతి రబ్దాస్త
దేహ మమ జన్మనో ౽తీతా!
(కాలక్రియాపాదము 10)
అనగా ఈ వైవస్వత మన్వంతరములో మూడు యుగ పాదములగు కృత, త్రేతా, ద్వాపరములును, నాలుగవ పాదమగు కలిలో 60 × 60 ( 3600) సంవత్సరములు తన గ్రంథారంభము నాటికి గడచినవనియు, అప్పటికి తనకు ఇరువది మూడు సంవత్సరములు నిండినవనియు
అర్థము. దీనినిబట్టి అతడు శా. శ. 398 (క్రీ.శ.476) జన్మించి శా.శ. 421 (క్రీ. శ. 499) లో తన గ్రంథమును రచించెనని స్పష్టము, గణితపాదములోని ప్రథమ సూత్రమునందలి 'కుసుమపురే' అను పదమును బట్టి ఈతడు పాటలీపుత్రమునకు సంబంధించిన వాడని విదితము.
ఇతడు రచించిన గ్రంథము "ఆర్యభటీయ" మని వ్యవహరింపబడుచున్నది. ఇది భారతదేశమందలి మొట్టమొదటి అనార్హమగు జ్యోతిశ్శాస్త్రగ్రంథము. తన గ్రంథమునకు మూలభూతమైన ప్రాచీన పరిజ్ఞానమును గూర్చి ఆర్యభటుడిట్లు చెప్పెను.
శ్లో, సదసజ్ జ్ఞాన సముద్రా
త్సముద్ధృతం దేవతా ప్రసాదేన,
సత్ జ్జ్ఞానో త్తమ రత్నం
మయా నిమగ్నం స్వమతినావా.
ఈ శ్లోకమునుబట్టి ఆర్యభటుడు తవనాటికి వాడుకలోనున్న బహుళ జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయములను తన బుద్ధి విశేషముచే పరిశీలించి వాటియందలి దోషములను పరిహరించుచు యథార్థమగు ఖగోళ సిద్ధాంతములను రచించెనని తెలియుచున్నది. జ్యోతిశ్శాస్త్ర నిర్ణయములు ప్రయోగ పూర్వక పరిశోధనములతోనే సాధ్యపడునవి యగుటచే అతడట్టి పరిశోధనలను సలిపియే శాస్త్రీయములగు సిద్ధాంత ఫలితములను పొందగలిగెనని విదితమగు చున్నది. అతడు తన గ్రంథములో పరిశోధన ఫలితములను సూత్రప్రాయముగా చెప్పియున్నను అందుకు ప్రధాన అంగమగు గణితమును ప్రత్యేకించి చెప్పెను. ఈవిషయమతని స్వతంత్ర పరిశోధనముల ప్రాముఖ్యమును వెల్లడించును. పాండురంగస్వామి. లాట దేవుడు, నిశ్శంకుడు, మొదటి భాస్కరుడు మొదలుగాగల శిష్యులు పెక్కురు ఇతని యొద్ద పరిశోధనాత్మక శాస్త్రము నభ్యసించినట్లు ప్రతీతికలదు. ఈ గ్రంథములో చెప్పబడిన ఖగోళ స్థిరాంకముల తులనాత్మక పరిశీలనమును బట్టి ఆర్యభటీయము స్వతంత్రగ్రంథమే అని స్పష్టమగుచున్నది. మరియు భారతీయ జ్యోతిశ్శాస్త్రము గ్రీకు సంప్రదాయము యొక్క అనుకరణమను పాశ్చాత్య విమర్శకుల వాదము అపాప్తమగుచున్నది. ఆర్యభటుడు తన సరి