Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆరణ్యకములు

వికీసోర్స్ నుండి

ఇవి యిట్లుంచి యింకను తెలియచేయ వలసిన ధర్మముల సంఖ్య 1180 మిగిలి యున్నవి. అవి యివ్వి :

1. స్వస్థవృత్తమునందు (ఆరోగ్యవంతుడు నిత్య జీవనమునందు) రాత్రిందివములయం దనుస రించవలసిన ధర్మములు ...40

2. షడృతువులందును అనుసరించవలసిన విశేష ధర్మములు. ...24

3. వేగధారణము, త్రివర్గసాధనము, మున్నుగా దృఢసత్వ సంపన్నమగు శరీరములో దీర్ఘ జీవితమును సుఖమయముగా గడపి, వేదోదితమగు మనుష్యానందమును సంపూర్ణముగ ననుభవింపగల సమర్ధతను ఇహఫల సాధనముగా భోధించు ధర్మములు ...950

4. స్వర్గసుఖ సాధన ధర్మములు ...34

5. అపవర్గానుభూతి హేతువులగు ధర్మములు ...56

6. శాశ్వత అజరామరానంద సందోహ దివ్య తనుత్వ సంసాధక ధర్మములు ..76

మొత్తము ...1180
పూర్వోక్తములు 331
వెరశి మొత్తము...1511

ఇట్లు పదునై దువందల పదునొకండు ఆయుర్వేద ధర్మములు కలవు. ఇవన్నియు చరకము ప్రమాణముగా గలవి. ఈ ధర్మములను చరక సంహిత యందలి సూత్ర విమాన, శారీర, ఇంద్రియ స్థానములందును, చికిత్సా స్థానమునగల మొదటి యధ్యాయమునందును చూడనగును, చరక సంహితయందులేని ఆరోగ్య ధర్మములు మరెచ్చటను లేవు. పురాణములు మొదలగు ఇతరము లందు గల ఆయుర్ధర్మములు ఈ సూత్రముల ననుసరించియే సమకూర్పబడినవి.

“చికిత్సా వహ్ని వేశస్య స్వస్థాతురహితం ప్రతి.”
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్."

(చ. స.10.88)

స్వస్థ, ఆతుర, హితముగోరి అగ్ని వేశునిచే రచింపబడిన ఈ సంహితయందు ఏది చెప్పబడినదో అది అన్నింటను చెప్పబడి యుండును. ఇందు చెప్పబడని విషయము మరియెచ్చటను లభింపదు, అని యిట్లు ప్రతిజ్ఞ చేసి శ్రీ అగ్ని వేశుడి చరక సంహితను ముగించెను. అగ్ని వేశునిచే సమకూర్పబడిన యీ సంహితయే, చరక సంస్కృతమై చరకసంహిత యనబడుచున్నది. చరకసంహిత యను ఆయుర్వేద ధర్మ సర్వస్వము.

సాహిత్య సమాలోచనమునకును, విశేష విజ్ఞాన సముపార్జనమునకును, ప్రజ్ఞాన్వితులగు జిజ్ఞాసువులు సావధానులై అమూలాగ్ర మొక పర్యాయము చరకసంహితను పఠించి ఉభయలో కార్థ ఫలసిద్ధు లగుదురుగాత.

'ఆయుర్వేదో ఒమృతానామ్”

వే. తి. వేం· రా. స్వా

ఆరణ్యకములు  :- వేదము మంత్రబ్రాహ్మణాత్మకము. ఆ బ్రాహ్మణముల యనుబంధము లారణ్యకములు. అథర్వబ్రాహ్మణమునకు దప్ప తక్కిన మూడు బ్రాహ్మణములకు నారణ్యక గ్రంథము కనబడుచున్నది. సామ బ్రాహ్మణమునకు దాని చివరనున్న శుక్రియ కాండమే ఆరణ్యక మనబడుచున్నది. అట్లే శుక్ల యజుశ్శాఖకు శతపథబ్రాహ్మణ అంతిమ కాండ మే ఆరణ్యకము. కఠ మైత్రాయణీయాది శాఖలకు ఆరణ్యకములేదు కౌషీత కారణ్యక మన్న పేరుమాత్ర మున్నదిగాని, ఆ గ్రంథము మృగ్యము. ఇంక తైత్తిరీయారణ్యకము, ఐతరేయారణ్యకము ననెడి రెంటి విషయము. తైత్తిరీయారణ్యకము తక్కిన అన్నిటి కంటెను ప్రాచీనము. “అరణ్యే ౽ధీయీరన్” అను నిందలి వాక్యమును బట్టి ఇది అరణ్యములో అధ్యయనము చేయదగినదని తెలియుచున్నది. కాని ఇందలి - సావిత్ర - నాచికేత చాతుర్హోత్ర వైశ్యసృజ - భాగములకు ఈ నియమములేదని పూరా చార్యుల మతము. ఇందలి పది ప్రపాఠకములలో కడపటి నారాయణోపనిషత్తు. మొదటి తొమ్మిదియు ప్రాచీనములు. ఈ ఆరణ్యకము యజ్ఞోపయోగిగా కనవచ్చినను జీవేశ్వర తత్త్వబోధకములైన ఉపనిషత్తులును, వివి విజ్ఞానదాయకములైన ఇతర విషయములు నిందు కన వనుట నిజము.

ఇందలి మొదటి ప్రపాఠకము 'ఆరుణ కేతుకము' అనబడును. దీనినే, అరుణమందురు. ఆరోగ్య కాములగు వారు ఇందలి మంత్రములు పఠించుచు సూర్యనమస్కారము లొనర్చెడి యాచారము నేటికిని భరతఖండమంత గలదు. ఈ ప్రపాఠకమునందు పురాతనార్య సంస్కృతి గోచరించుననుటకు ఇందలి మేరుగత సూర్య వర్ణనమే ప్రమాణము. ఉత్తరధ్రువ గోచరమగు సూర్యవిషయక విజ్ఞానము ఆర్యపరంపరా ప్రాప్తమై ఇందు తెలియవచ్చును. ఇందు మేరుగత కశ్యపసూర్యుడు, సప్త సూర్యులు, సూర్య మహత్త్వము, సంవత్సరస్వరూపము మొదలగు బహువిషయములు వర్ణితములు. వసంతాది ఋతువులు అతి మనోహరముగా వర్ణింపబడినవి.

స్వభావసిద్ధమైన ఇందలి ఋతువర్ణనము, సంవత్సర పరివర్తనమును, నాటి సాంఘికజీవనమును ప్రత్యక్షము గావించుచు, తరువాత బయలు వెడలిన ఋతువర్ణనలకు మార్గదర్శకమైన దనవచ్చును.

ద్వితీయ ప్రపాఠకము స్వాధ్యాయ బ్రాహ్మణ మనబడును. ఇది మొదలుగా నైదు ప్రపాఠకములు వైదికకర్మ వరములు. ఆరవది పితృమేధ మనబడును. 7,8,9 ప్రపాఠకములే శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అనబడేడి ఉపనిషత్తులు. ఈ మూడింటికిని వేదాంతము లను ఖ్యాతి కలదు. ఆత్మైకత్వ విజ్ఞానమునకు ఆధారములైన యీ ఉపనిషత్తులు దేశమంతట నేడును వ్యాప్తికెక్కి యున్నవి.

బృహదారణ్యక మునందలి 7-8 అధ్యాయములవలె ఇందలి దశమ ప్రపాఠకము ఖిలమనబడును. కర్మోపాసన బ్రహ్మ కాండములలో జెప్పగా మిగిలిన దానిని పూర్తిగా తెల్పెడి ప్రకీర్ణరూపమైన గ్రంథము 'ఖిల' మనబడును. అట్టి ఈ దశమ ప్రపాఠకమైన నారాయణోపనిషత్తు, పూర్వోక్తమైన వల్లీత్రయమువలె శుద్ధముగా బ్రహ్మ ప్రతిపాదకము కాదు. దీనికి యాజ్ఞ క్యుపనిషత్తని ప్రసిద్ధి గలదు. అయినా, “నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్" ఇత్యాది మంత్రముల సకల జగ దాత్మకుడు వర్ణింపబడుటం బట్టి దీనికి నారాయణోపనిషత్తను పేరు వ్యాప్తమైనది.

ఈదశమప్రపాఠక పాఠ సంప్రదాయము దేశమున బహువిధముగా నున్నది. ద్రావిడ పాఠమున ఇందలి అనువాకములు 64. కర్ణాటక పాఠమున 74. మరికొన్నిచోట్ల 80 అనువాకములు. సాయణాచార్యులు 64 అనువాకముల పాఠమే భాష్యమున గ్రహించిరి. ఈ పాఠ భేదమే దీని అర్వాచీనతను బలపరచుచున్నది.


ఐతరేయ బ్రాహ్మణమునకు అనుబంధమైన ఏకారణ్యకాండమం దైదు భాగములు కలవు. అందు ప్రథమ ద్వితీయారణ్యక భాగములందు ఐదేసి అధ్యాయములును. తృతీయమున రెండును, చతుర్థమున నొకటియు, పంచమమున మూడును, అధ్యాయములు గలవు.

ఇందు ప్రథమారణ్యకభాగమునందు సత్రయాగము, మహావ్రతము మొదలయినవి వర్ణితములు. ద్వితీయ తృతీయారణ్యక భాగములు జ్ఞానబోధకములు. వీటికి ఐతరేయోపనిషత్తని పేరు. నాల్గవదానిలో మహానామ్నీ మంత్రములు చెప్పబడినవి. అయిదవదానిలో మహావ్రత ప్రయోగము వివరింపబడినది. అందుచే నిది యర్వాచీన కాండమని తెలియుచున్నది. ఈ యభిప్రాయము భాష్య కర్తయగు సాయణాచార్యులు తెలిపినట్టు "పంచ మారణ్యక మృషిప్రోక్తం సూత్రమ్, ప్రథమారణ్యకం త్వపౌరుషేయం బ్రాహ్మణమ్ " అను భావము వల్ల ధ్రువ పడుచున్నది.

ప్రతివేదమునకును దానికి సంబంధించిన బ్రాహ్మణ మందో, ఆరణ్యకమునందో కొంచెముగానో, గొప్పగానో, ఉపనిషద్భాగము గూడా చేరియున్నమాట సత్యము. అట్లు చేరిన ఉపనిషద్భాగములు కర్మప్రతిపాదకములు గాకపోయినా, కర్మము జ్ఞానార్థమే కావున కర్మనిష్ఠులగు వారికి, జ్ఞానమార్గము ఉపదేశించుట ఆవశ్యకమను తలంపుతో తాత్కాలిక ఋషులు వాని నందు చేర్చి యుందురు. అది సముచితమే కదా!

మ, నూ, నా, కా.

ఆర్కిమెడీసు ( క్రీ.పూ. 287-212 ) :- క్రీస్తుకు పూర్వము మూడవశతాబ్దియందు సిసిలీ దేశమునకు రాజధాని యగు సైరకూసు అను నగరమును హైరో అను రాజు పరిపాలించుచుండెను. ఆర్కిమెడీసు హైరో అను రాజునకు సమకాలికుడు. అతడు ఉత్తమమైన కుటుంబములో జన్మించెను, ఆతని తండ్రియగు ఫీడిన్ (Pheidis) ఖగోళ శాస్త్రజ్ఞుడు, అతడు హైరో రాజుతో ఎక్కువ పరిచయమును గలిగియుం డెను.

అలెగ్జాండ్రియా నగరమున యుక్లిడు (Euclid) అను గణితశాస్త్రోపాధ్యాయుడు ఉండెను. అతనిదగ్గర ఆర్కిమెడీను విద్యాభ్యాసము చేయుకాలమున ఈజిప్టుదేశ