Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆయుర్వేద గ్రంథములు

వికీసోర్స్ నుండి

ఆయిలర్ చే 1736 లో రచింపబడిన “మెకానికా సివె న్మోటస్ సైన్షియా ఎనలిటిక్ ఎక్స్ పొజీటా" (Mechanica sive Motus scientia analytic exposita) అనునది న్యూటను సిద్ధాంతముపై విశ్లేషణ పద్ధతులలో వ్రాయబడిన మొదటి యంత్రశాస్త్రగ్రంథము. 1770 లో ఆతడు “వోల్ స్టాన్డిగె ఆలీటంగ్ జుర్ అల్ జెబ్రా (Vollstandige Aleitung Zur Algebra) అను గ్రంథమును జర్మను భాషలో రచించి తన సేవకునిచే లిఖింప జేసెను. బీజగణితముపై తరువాత వచ్చిన పాఠ్యగ్రంథముల కిదియే నమూనా. 1744 లో ఆయిలర్ రచించినమ్"మెథడస్" ఇన్వీనియండి లైనియాస్ కర్వాన్ మాగ్జిమి మినిమివే ప్రొప్రయిటేట్ గాండెం టెస్" (Methodus inveneindi lineas curvas maximi minimeve proprie- tate gandentes" అను గ్రంథము వైశేషిక కలనమున (calculus of variations) మొదటి గ్రంథము. దీనిలో ఆయిలర్ సమీకరణములు, వాని బహుళ ప్రయోజనములు చర్చింపబడినవి.

ఆయిలర్ కనుగొనిన అనేక విషయములు ఆతని చిన్న వ్యాసములలో అనర్ఘ రత్నములవలె విరజిమ్మబడియున్నవి. అట్టి రత్నములలో నొకటి ఆయిలర్ సంఖ్య అనబడునది. lim (1+1+++... = -logn) =-577216. ఒక అంకశాస్త్రమున అతడొనరించిన పరిశోధనలే అతనికి శాశ్వత కీర్తి సంపాదించి పెట్టుటకు చాలును. ఆయిలర్ తన బుద్ధిని ఖగోళశాస్త్రాభివృద్ధికై అధికముగా వినియోగించెను. ముఖ్యముగా చాంద్రవాదము, త్రివస్తుసమస్య (Problem of three bodies) ఆతని నాకర్షించెను. 1739 లో ఆతడు ఒక సంగీతశాస్త్ర గ్రంథము రచించెను. దానిలోని గణితము సంగీతజ్ఞులకును, సంగీతము గణితజ్ఞులకును బోధపడక అది వ్యర్థమైనది.

ఆయిలర్ మేధాశక్తి యాతని గ్రంథముల జదివిన ప్రతివారిని చకితుల జేయును. ఐనను అతనిలో కొన్ని లోపములు లేకపోలేదు. అపరిమిత శ్రేఢుల విషయమై అతడు తగు జాగ్రత వహించక, వానిని తన ఇష్టము వచ్చినట్లు విరివిగా వాడు కొనెను. వాని సంభిన్నత పై (Convergence) అతని దృష్టి పోలేదు. అసలు ఆ కాలము నాటికి, గణిత శాస్త్రములోని సంభిన్నత, విశీర్ణత (divergence) మొదలగు అపరిమిత కల్పములు (infinite processes) సరియైన పునాదులపై నిర్మింపబడి యుండ లేదు. ఆ పని 19 వ. శతాబ్దములో జరిగినది. అందుచే 18వ. శతాబ్దిలోని గణితజ్ఞు లందరును అపరిమిత శ్రేఢులు, అపరిమిత గుణకార లబ్ధములు మొదలగువాటి విషయమున తమ ఇష్టమువచ్చినట్లు ప్రయోగములను గావించిరి. ఉదా : ఆయిలర్ ఈ క్రింది విధముగా వాదించెను.

ఐనను విశీర్ణ శ్రేఢుల విషయమున ఆయిలర్ చేసిన వన్నియును తప్పులని చెప్పరాదు. నేటికాలపు సంభిన్నతా పరీక్షలు మాత్ర మాతడు చేయనిమాట నిజమే. ఐనను ఆతడు నిరూపించిన అనేక విషయములను నేటికాలపు గణితజ్ఞులు మార్గాంతర పద్ధతులచే బోధించియున్నారు. ఇట్లే కలన గణితవిషయమునను ఆయిలర్ త్రొక్కిన మార్గము, ఆధునికులకు మిగుల సంతృప్తికలిగింపక పోయినను, ఆధునిక గణితశాస్త్రమునకు ఆయిలర్ మూల స్తంభ మని చెప్పుటకు ఎవరికిని ఆక్షేపణము ఉండదు.

బే. వి.

ఆయుర్వేద గ్రంథములు :- "ఆయుర్విద్యతే ౽స్మిన్నితి, ఆయుర్వేదయతీతివా ఆయుర్వేదః" అను వ్యుత్పత్తినే ఆయువును గూర్చి బోధించు ఉప వేదము ఆయుర్వేద మని తెలియుచున్నది. ఆయుర్వేదము వైద్య శాస్త్రమనియు వ్యవహరింపబడును. కాయ - బాల - గ్రహ - ఊర్ధ్వాంగ - శల్య - విష రసాయన -వాజీకరణ చికిత్సా భేదములచే ఇయ్యది అష్టాంగ చికిత్సయని చెప్ప బడుచున్నది. ఇది ఋగ్వేదమున కువ వేదమని కొందరును, అధర్వణ వేదమునకు ఉపవేదమని కొందరును చెప్పుదురు. మొత్తముమీద ఈ విజ్ఞానభాగము వేదచతుష్టయము నందును కన్పట్టుచున్నది. ఉదా :- ఆయుర్వేదమును గూర్చి బోధించు కొన్ని వేదభాగములు.

గర్భమును గూర్చి తెలియవలసిన యంశములు గర్భోపనిషత్తునందు వర్ణింపబడినవి. ఋగ్వేదములో 10. వ. మండలము, 184. వ. సూక్తములోను, ఐతరేయ బ్రాహ్మణములోను, ఈ విషయము వర్ణింపబడియున్నది.

శరీరమునకు పంచభూతములు కారణములని ఋగ్వేదము 10 మం - 16 సూ 3 - 7 ఋక్కులలోను, తైత్తరీయోపనిషత్తు నందు గల బ్రహ్మవల్లియందును, కానవచ్చును.

శరీరమునకు మూలమైన వాతపిత్త శ్లేష్మములను గూర్చి ఋగ్వేదము 1 మం - 34 సూ - 6వ ఋక్కు నందు "త్రిధాతు శర్మ యచ్ఛతం" అని యున్నది. ఇచ్చట 'త్రిధాతు' శబ్దమునకు వాతపిత్త శ్లేష్మములని శ్రీ విద్యారణ్యస్వామి భాష్యమును రచించిరి. శరీరాంగ ప్రత్యంగములనుగూర్చి ఋ గ్వేదములోను, ఐతరేయ బ్రాహ్మణములోను వర్ణనలు కన్పట్టును. శరీరశాస్త్రమును గూర్చియు ఋగ్వేదము 10 మం - 97 సూ - 6వ ఋక్కులో వ్రాయబడి యున్నది. రోగములను గూర్చియు, వాటి చికిత్సలను గూర్చియు ఋగ్వేదము 10 మం - 168 సూ లోను, ఐతరేయ బ్రాహ్మణము లోను, యజుర్వేద సంహిత - 2 అ 3 పన్నం. 5 అను నందును గాన వచ్చును.

చికిత్సలకు ఉపయోగించు ఓషధులను గూర్చి ఋగ్వేదము 9, 10 మండలములలోను, యజుర్వేదమునందు బ్రా - 2 కాం - 4 ప్ర - 4వ అను -నందును, అధర్వణ వేదమునందును వర్ణింపబడెను.

అధర్వణ వేదమునందలి ఆయుర్వేద విషయ సంగ్రహము :- అధర్వ వేదము 1వ కాండ - 2వ సూ- నందును, 6వ కాం - 44వ సూ - నందును ఉదరామయ, అమాశయాది రోగశాంతికి ముంజగడ్డితో బంధనము చేయవలయు ననియు, కోష్ఠబద్ద. ప్రస్రావ నిరోధములకు 1 కాం - 3 సూ - లో ఎనిమావంటి సాధనము ఉపయోగింపవలయు ననియు చెప్పబడెను. అధిక రజస్స్రావ, రక్తస్రావములకు 1 కాం - 17 సూ. - లో జపము చేయవలెనని చెప్పబడినది. 1 కాం - 22వ సూక్తములో హరిద్రా అను మూలిక పాండురోగ నివారకమని చెప్పబడెను. 1 కాం - 23, 24 సూ - లలో శ్వేతకుష్ఠమును, నీలి- హరిద్రా - భృంగరాజ, ఇంద్ర వారుణులు అను ఓషధులు హరించు నని చెప్పబడియున్నది. 1 కాం - 25 సూ - 5 కాం -4-22 సూ-6 కాం- 20, 95, 3, 102, 116, 19, 39 సూ లలో ఏకాహిక, ద్వ్యాహిక, అన్యేద్యుష్క వరేద్యు రుభయద్యురాది వివిధజ్వర లక్షణములు, తక్మణ అను జ్వర లక్షణములు చెప్పి, బలాస అను కాస తక్మణకు అన్నగా రనియు బహు ప్రయాస సాధ్యమనియు చెప్పి, పైసూక్త మంత్ర జపాదులను వివరించెను. "అథ భై షజ్యాని" అని ఆరంభించి "లింగో న్మూలనం భైషజ్యం" అనగా రోగ కారణోన్మూలన మే భై షజ్యమనియు, కారణనాశక మే కార్యనాశక ము కావున కారణాన్వేషణము చేయుట ముఖ్యమనియు నిరూపించుచు 1 కాం - 12 సూక్తములో విద్యుత్తు అను అగ్నికి శిరఃపీడను, కాస-జ్వరాదులను కారణముగా చెప్పుచు కుష్ఠము అను ఓషధి సర్వజ్వర కారణహరముగా తెలియజేయబడెను. 4 కాండలో నష్ట వీర్యోద్ధరణము నకు కపిత్థకమే ఓషధియనియు, 4 కాం- 2 సూ - లో క్షతారోగ్యమునకు అరుంధతి అను లతను, తల్లతా నిష్పత్తి స్థానములుగా అశ్వత్థ - ప్లక్ష - ఖదిర - న్యగ్రోధములను వర్ణించెను. 6 కాం - 109 వ సూక్తములో క్షతారోగ్య సాధకముగా పిప్పలి వర్ణించబడెను. 6 కాం - 19 సూక్తములో అపామార్గయను ఓషధి సమస్త ఓషధులకు రాజుగా వర్ణించబడెను. 6వ కాం 90వ సూక్తమున బలాన అను వ్యాధి నివారణకొరకు జపించవలయుననియు 6వ కాం - 25, 127వ సూ- లలో చోప్రద్రు అను ఓషధి 'సర్వరోగ ప్రశమనము చేయ సమర్థమైనదనియు చెప్ప బడెను. 6వ కాం 136, 137 సూ లలో నితత్ని, శమి అను లతలను కేశవర్ధకములుగా చెప్పుచు, జీర్ణ కేశములను దృఢపరచుట, అజాత కేశ జననము, జాత కేశ దైర్ఘ్య సంపాదనము, దీర్ఘకృత కేశములకు కృష్ణ వర్ణకల్పన మున్నగునవి వర్ణింపబడినవి. 19వ కాం- 35వ సూ నందున, 2వ కాం- 4వ సూ - నందున గుల్గుల మను ఓషధి మధుమేహ నివారకమని చెప్పబడినది. ఇంకను జలోదరము, గండమాల, సంధ్యాత్వము మున్నగువానిని నివారణము చేయు పెక్కు ఓషధులు చెప్పబడెను.

గ్రహములను గూర్చి ఋగ్వేదము 10 మం. 118, 145, 161–166 సూక్తములలోమ వర్ణనలు కనుపించు చున్నవి. మానసరోగ చికిత్సను గూర్చియు, ఆరోగ్యమునకు మనస్సు ముఖ్యకారణమను విషయమును గూర్చియు గోపథ బ్రాహ్మణమున I, 30 వాక్యములో కనిపించు చున్నది. మణి మంత్రౌషధముల ఉపయోగములను గూర్చి తైత్తిరీయ సంహిత 4 వ కాం- 2 ప్ర- 6వ అను-2వ మంత్రములో కలదు. శల్యశాలాక్యములను గూర్చి ' ఋగ్వేదము 1వ మం. 116వ సూ. 15వ ఋక్కులోను ఇంకను అనేక స్థలములలోను వర్ణించబడి యున్నది. రసాయన వాజీకరణములను గూర్చి ఋగ్వేదము 1 మం. 117 సూ. 13వ ఋక్కులో చెప్పబడి యున్నది. ఈరీతిగ త్రిస్కంధాత్మక మగు అష్టాంగాయు ర్వేదమును గూర్చి వేదములందు గల వర్ణనము దిజ్మాత్రముగ సూచింపబడినది. ఆయుర్వేద గ్రంథములను మూడు రకములుగ విభజింపవచ్చును. అవి (1) వైదిక గ్రంథములు, (2) ఆర్షగ్రంథములు, (3) అనార్ష గ్రంథములు.

1. వైదిక గ్రంథములు  : చతుర్ముఖ బ్రహ్మ కల్పాది యందు వేదములను స్మరించినట్లుగనే ఆయుర్వేదమును గూడ స్మరించి పిమ్మట దీనిని లక్షశ్లోకరూపమగు సంహితగ చేసెనని ఇతిహాసమువలన తెలియుచున్నది. దీనికి బ్రహ్మసంహిత యని నామధేయము. ఇయ్యది వైదిక గ్రంథమని నుడువనగును. దీనిని బ్రహ్మ తన పుత్రుడగు దక్షప్రజాపతికి ఉపదేశించెను. దక్షుడును తాను గ్రహించిన యీ విద్యను .అశ్వినీదేవతలకును, వారింద్రునకును బోధించిరి. వైదిక గ్రంథములు పై నుదహరించిన బ్రహ్మ సంహితకన్న మరి వేరుగ కన్పడవు. ఆ బ్రహ్మసంహితయు భూలోకమున ప్రచారము నందలేదు.

2.. అర్షగ్రంథములు : ఇవి ఋషి పుంగవులచే రచింపబడిన తంత్రములు. ఋషులు అతీంద్రియ ద్రష్టలు ‘కావున వారు చెప్పిన విషయములలో సంశయములుండుటకు తావులేదు. కాన అత్యంత ప్రమాణములుగ - వీటిని స్వీక రింపదగ్గును. ఋషులకు వైద్యశాస్త్రము లభించిన విధము చరకసంహితాది గ్రంథములందు ఉదహరింపబడెను.

ఈ మహాయుగము యొక్క మొదటి భాగమగు కృతయుగ సమాప్తి సమయమున అనగా ఇప్పటికి సుమారు 22 లక్షల సంవత్సరములకు పూర్వము భూలోకము నందలి ప్రజలు రోగపీడితులై ధర్మార్థ కామమోక్షములను సాధించుటకు అసమర్థులై ఉండుటను గని భరద్వాజాది ఋషీశ్వరులు హిమవత్పర్వత ప్రాంతమునందు సభచేసిరి. ఆ సభా సదులందరును ధ్యానయోగముచే సురాధిపతియగు దేవేంద్రుడు మధ్యమలోక వాసుల బాధల తొలగించునని తెలిసికొని ఇంద్రునినుండి వైద్యశాస్త్రమును గొనివచ్చుటకు సమర్థుడు భరద్వాజుండని నిర్ణయించి ఆతని స్వర్గలోకమునకు బంపగా ఆ యుదంతము నంతయు నాకర్ణించి ఇంద్రుడు భరద్వాజునకు తాను అశ్వినీ దేవతల వద్ద నభ్యసించిన వైద్యశాస్త్రము నుపదేశించెను. భరద్వాజుడు తన విద్యను పునర్వసుడను పేరు గల ఆత్రేయుడు మొదలగువారి కుపదేశింప వారు తమ తమ పేర గ్రంథములను రచించిరి. వీటినే ఆర్షగ్రంథములని వ్యవహరించుదురు. ఆయుర్వేదమునందలి అష్టాంగము లనుగూర్చి గ్రంథములను రచించి వీరు లోకమునకు ఉపకారము గావించిరి. ఇందు ప్రధానముగ నేటివరకును పఠనపాఠములలో నున్న (1) చరకమును గూర్చియు, (2) సుశ్రుతమును గూర్చియు, (8) ఆర్షము కాకపోయి నను తత్తుల్యముగనుండు అష్టాంగ హృదయమును గూర్చియు ప్రథమమున వర్ణించబడుచున్నది.

1. అగ్ని వేళతంత్రము : ఇది చరకమహర్షిచే సంస్కరింపబడి చరకసంహితయని ప్రకృతము వ్యవహరింపబడు చున్నది. భరద్వాజుని శిష్యుడగు ఆత్రేయుడు ' కాయ చికిత్సా ప్రధానమైన వైద్యశాస్త్రమును అగ్ని వేళ, భేల, జాతూకర్ణ, పరాశర, హారీత -క్షారపాణి యను నాల్గురు శిష్యుల కుపదేశించెను. వారందరును తమతమ పేర నొక్కొక్క గ్రంథమును రచించిరి. ఇవి అర్ష వైద్యగ్రంథములలో మొదటివి. ఇందు అగ్నివేశతంత్రము మిక్కిలి ప్రధానమైనది. "బుద్ధే ర్విశేష స్తత్రాసీత్ - అగ్ని వేశ: అని చరకమునందు వర్ణితమై యున్నది. మిగిలిన తంత్రములు చాలవరకు లుప్తప్రాయములే. వాగ్భటుని కాలమునకే వీటికి పఠన పాఠనములు లేవని 'భేడాద్యా కిం న : పఠ్యస్తే' ఆనుః వాక్యముచే తెలియుచున్నది అగ్ని వేళతంత్రము కాలక్రమమున పఠనపాఠ నాది ప్రచారమును బొందుచుండ నిప్పటికి సుమారు 7000 సంవత్సరములకు పూర్వము జన్మించిన పతంజలిమహర్షి ' దీనిని సంస్కరించియున్నాడు. పతంజలినే చరకుడని లోకము వ్యవహరించుచున్నది. కనుకనే ఈ తంత్రమునకు చరకమని పేరు వచ్చినది. మరికొంత కాలమునకు పంచనద మందలి దృఢబలు డను నతడు ఈ చరకమునందలి కొన్ని భాగములను (చికిత్సాస్థానమునందలి 17వ అధ్యాయము మొ. సిద్ధిస్థానాంతము) పూర్తి చేసెనని ఈ గ్రంథాంతము నందలి "అగ్ని వేశ కృతే తంత్రే చరక ప్రతి సంస్కృతే - దృఢబలపూరితే" అనువాక్యమువలన తెలియుచున్నది. ఈ గ్రంథము కాయచికిత్సను ప్రధానము చేసికొని అష్టాంగములను బోధించుచున్నది. ఈ తంత్రమునందు. (1) సూత్రస్థానము, (2) నిదానస్థానము (3) విమానస్థానము, (4) శారీరకస్థానము, (5) ఇంద్రియ స్థానము, (6) చికిత్సాస్థానము, (7) కల్పస్థానము, (8) సిద్ధిస్థానము అని ఎనిమిది స్థానములు కలవు.

సూత్రస్థానమునందు 30, నిదాన స్థానమునందు 8, విమాన స్థానమునందు 8, శారీరక స్థానమునందు 8, ఇంద్రియ స్థానమునందు 12, చికిత్సా స్థానమునందు 30, కల్పస్థానమున 12, సిద్ధిస్థానమున 12, అధ్యాయముల చొప్పున మొత్తము 120 అధ్యాయములు కలవు.. ఇది చాల ప్రమాణ గ్రంథముగ కొనియాడ బడుచున్నది.'చరకస్తు చికిత్సితే' అని దీనిని కీర్తించుచున్నారు.

2. సుశ్రుత సంహిత :- శల్య శాలాక్య విషయములను రెంటినిగూడ ప్రధానముగ బోధించుచు, అష్టాంగ వైద్య బోధక మగు సుశ్రుత సంహితకూడ చరకమువలెనే ప్రమాణ గ్రంథముగా గ్రహింపబడుచున్నది.

శల్యతంత్రమనగా స్థూలముగా శస్త్రవైద్యమని చెప్పవచ్చును. దీనిని సర్జరీయని పాశ్చాత్యభాషలో వ్యవహరింతురు. దీనిని ప్రవర్తింపచేసినది ధన్వంతరి. ఇతనికి దివోదాసుడనియు నామధేయము కలదు. ఇతడు కాశీ పట్టణమునకు పరిపాలకుడు. ఈ మహామహుడు సాక్షాత్తుగ నమృత ప్రదాతయగు ధన్వంతరి యవతార మేయని "అహంహి ధన్వం న్తరి రాదిదేవో జరారుజామృత్యు హరో౽ మరాణాం".' అను సుశ్రుతమందలి . వాక్యము వలన తెలియుచున్నది. భరద్వాజాది ఋషులు ఇంద్రుని వద్ద కాయచికిత్సా ప్రధానమైన తంత్రమును గ్రహించి నట్లుగనే, ధన్వంతరిగూడ ఇంద్రునివలన శల్యప్రధానమైన చికిత్సా శాస్త్రమును ఉపదేశము నొంది యీ లోకమున విశ్వామిత్ర సుతుడైన సుశ్రుతుడు మొదలగు నార్వురకీ విద్యను బోధించెను.

ధన్వంతరి సూర్యునివలన వై ద్యశాస్త్రమును గ్రహించెననియు వర్ణనలు గానవచ్చుచున్నవి. ఏది నిజమైనను శల్యతంత్ర ప్రధానమైన యీ శాస్త్రము ధన్వంతరి చేతనే వ్యాప్తి నొందిన దనుట నిర్వివాదము. ధన్వంతరి యను పేరుకూడ “ధనుః ప్రధానస్య శల్యతంత్రస్య పారం ఇయర్తి గచ్ఛతీతి ధన్వంతరి" అను వ్యుత్పత్తిచే శల్య శాస్త్ర పొరగుడను నర్థమును బోధించుచున్నది.

ధన్వంతరివద్ద శిష్యులుగ జేరి సుశ్రుత ఔషధేనవ ఔరభ్ర - పౌష్కలావత- కరవీర్య- గోపుర రక్షితు లను నాల్గురును ఈ విద్యను గ్రహించిరి. అందు, సుశ్రుతుడు కడుంగడు బుద్ధిమంతుడు. ఇతడు స్వ గురూపదేశములను గ్రంథరూపముగ రచించెను. ఈ విషయము "యథోవాచ భగవాన్ ధన్వంతరి స్సుశ్రుతాయ" యను వాక్యముచే దృఢమగుచున్నది. మిగిలిన యైదుగురుకూడ తమ పేరిట తంత్రములను రచించిరి. సుశ్రుత తంత్రముదక్క, మిగిలిన తంత్రములు - చక్రపాణి - విజయ రక్షితాది వ్యాఖ్యాతల కాలమునాటికి దొరకుచుండెడి వని - అందు ఉపలభ్యమానములగు తంత్ర వచనములచే తెలియుచున్నది. ప్రస్తుతము సుశ్రుతగ్రంథము మాత్రము పఠన పాఠనములలో నున్నది. · సుమారు 2000 సంవత్సరములకు 'పూర్వముండిన సిద్ధ నాగార్జును డను బౌద్ధ. రససిద్ధుడు సుశ్రుతమును ప్రతి సంస్కరించెనని 'నాగార్జున ప్రతి సంస్కృతే' యను వాక్యమువలన తెలియుచున్నది.

సుశ్రుతుని జీవిత కాలమునుగూర్చి పెక్కు. తర్క వితర్కములు కలవు. ఆంగ్లపండితుడు మాగ్డోనెల్ అను నతడు క్రీ.శ. 4వ శతాబ్దపువాడని చెప్పెను, 'జోన్స్, హావ్ అను వాడు క్రీ. శ. 12వ శతాబ్దపు వాడని చెప్పెను. కాని ' ఇది నిజముగా కన్పట్టదు. జి-హోలెన్ అనునతడు సుశ్రుతుడను తంత్రకర్త. లేనేలేడనియు, ఉన్న యెడల సోక్రెటిస్ అనువానికంటె భిన్నుడు కాడనియు, సాహసముగ వ్రాయజొచ్చెను. ఇది చాలా ఆశ్చర్య జనకము. సుమారు 2000 సంవత్సరములకు పూర్వుడుగు బౌద్ధ నాగార్జునుడు తనచే రచింపబడిన 'ఉపాయ హృదయము' అను గ్రంథములో సుశ్రుతాచార్యులను స్మరించి యుండుటచే ఇతడంతకన్న ప్రాచీనుడని తెలియుచున్నది. శాలిహోత్ర సంహితలో వినబడుచున్న సుశ్రుతుడును, ఇతడును ఒకరు కారని నిరూపించుచున్నారు. కనిష్కుని పౌత్రుడొక సుశ్రుతు డుండెను. తంత్రకర్తయగు సుశ్రుతు డతడేయని కొందరందురు. కాని కనిష్కునికి సమకాలికుడగు నాగార్జునునిచే స్మరింపబడి యంతకుమున్నే తంత్రమును రచించిన సుశ్రుతుడు నాగార్జునునకు పిమ్మట జనించు సుశ్రుతు డగుట యెట్లు పొసగును ? కనుక వీరుభయులును భిన్నులని ధ్రువపరచవలసి యున్నది. వృద్ధ సుశ్రుతుడగు వ్యవహారమున్నది కాని అతని పుట్టుక మొదలగు వివరములు ఎచ్చటను కానరాక పోవుట చేత అతనిని నమ్ముటకు వీలులేదని చెప్పుచున్నారు, ఇది ఆలోచనీయమైన యంశము.

సుశ్రుతసంహితను సంస్కరించినది నాగార్జునుడను విషయము డల్హణుడు వ్రాసినను, సంశయింపవలసిన విషయముగ నున్నదని శ్రీ హేమరాజశర్మగారు తాము కాశ్యప సంహితకు వ్రాసిన యుపోద్ఘాతములో వెల్లడించు చున్నారు. సుశ్రుత సంహిత శకారంభమునకు పూర్వము 1000 సం. కాలమునందు రచింపబడినట్లు శ్రీ శంకర బాలకృష్ణ దీక్షితులు తమ భారతీయ జ్యోతిశ్శాస్త్రేతి హాసమునందు వివరించిరి. దీనియందు సూత్ర, నిదాన, శారీరక చికిత్సా, కల్ప-ఉత్తరము లను వారు స్థానములు కలవు. సూత్రస్థానమున 46, నిదానస్థానమున 16, శారీర స్థానమువ 10, చికిత్సా స్థానమున 40, కల్పస్థానమున 8, ఉత్తరస్థానమున 66, అధ్యాయముల చొప్పున మొత్తము 186 అధ్యాయములు, కలవు.

అష్టాంగ హృదయము:- కాలక్రమమున మనుజుల యల్ప మేధాశక్తులను గమనించి బహుతంత్ర పరిశ్రమ చేయజాల రను అనుకంపచే ఆతి మేధానిధులును, సర్వతంత్ర పారగులును అగు వాగ్భటాది పండితవరేణ్యులు ఆయుర్వేద గ్రంథములను రచించి లోకోపకారము

కావించిరి. ఇవి అనార్షములయ్యు సూక్తి భరితము లగుటచే విద్వజ్జనోపాదేయములై సంప్రదాయా౽ విచ్ఛిన్నముగ పఠన పాఠన ప్రచారము నందుచు, వేనోళ్ళ శ్లాఘింపబడుచున్నవి. ఇట్టి గ్రంథములలో అగ్రస్థానము వహించునది అష్టాంగ సంగ్రహము. దానికంటె సార తరోచ్చయముగ వ్రాయబడిన అష్టాంగ హృదయము గూడ సంగ్రహముకంటె నెక్కువ పండిత వాల్లభ్యము నందుచున్నది. ఈ రెండును సింధుదేశమునందు జన్మించిన సింహగుప్తుడను వైద్యుని కుమారు డగు వాగ్భటునిచే రచింపబడినట్లు తెలియుచున్నది. కాని కొందరు అష్టాంగ సంగ్రహమును హృదయకర్తయగు వాగ్భటుని పితామహుడగు వాగ్భటుడు రచించె నని చెప్పుచున్నారు. ఈ ఉభయమతములకును పండితవరేణ్యుల యండకలదు. శ్రీ కవిరాజు గణనాథ సేనుగారు వీరుభయులు నొకరే యనియు గ్రంథగత శైలి సరిపోవుచున్నదనియును నిర్ణయించి యున్నారు.

వాగ్భటుని జన్మకాలమునుగూర్చి మతభేదములు కలవు. ఇతడు వరాహమిహిరునికి పూర్వకాలికుడని కొందరు (క్రీ. శ. 505 సం. వరాహమిహిరుని కాలము) అంతకు పూర్వము ఒక శతాబ్దమునకాని, సార్ధ శతాబ్దమునగాని వాగ్భటుడుండేనని చెప్పుదురు. గణనాథ సేన్ క్రీ. శ. 5వ శతాబ్దమువాడని నిరూపించుచున్నాడు. యాదవజీత్రికంజీ ఆచార్యగారు క్రీ. శ. 6 వ శతాబ్దములోని వాడని యూహించుచున్నారు. ఇతడు వైదికాచార నిరతుడని చెప్పుటకును, బౌద్ధుడని చెప్పుటకును, గూడ ఈ గ్రంథములో నాధారములు కలవు. ఇతడార్య మతానువర్తియయ్యు రాజశాసన భీతిచే ప్రచ్ఛన్న బౌద్ధుడుగా నుండె నవి కొందరందురు.

ఇతని తంత్రమగు అష్టాంగ హృదయమందును, సంగ్రహమునందును గూడ సూత్ర, శారీర, నిదాన, చికిత్సా, కల్ప, ఉత్తర స్థానము అని యారుస్థానములు కలవు.

అష్టాంగ హృదయమునందు సూత్రస్థానమున 30, శారీర స్థానమున 6, నిదాన స్థానమున 16, చికిత్సా స్థానమున 22, కల్పస్థానమున 6, ఉత్తరస్థానమున 40, అధ్యాయముల చొప్పున "మొత్తము. 120 అధ్యాయ ములు కలవు. ఈ గ్రంథమును పఠించినవో చరక-సుశ్రుతముల యావశ్యకత యుండదని ఇతడు వ్రాసియుండెను. అనుభవములో గూడ ఈ విషయము రుజువగుచున్నది.

అంజననిదానము  :- ఇదియును అగ్ని వేశ కృతమని యే తెలియుచున్నది. శ్లోకరూపముగ నున్నది. వ్యాధుల యొక్క సంఖ్యను, నామధేయములను తెలియబరచును. ఈ గ్రంథము లభ్యమగుచున్నది.

భేడసంహిత  :- ఇది భేడఋషి ప్రణీతము. ప్రస్తుతమిది తంజావూరు ప్రభుత్వ పుస్తక భాండాగారమున ఖండిత ప్రాయముగ నున్నది. దీనిని ఇటీవల ముద్రించి నట్లు తెలియవచ్చినది. ఈ గ్రంథముకూడ ప్రమాణముగ గ్రహింపదగియున్నది. చక్రపాణి వ్యాఖ్యానములో దీని యుద్ధారములు కనిపించును. కొందరీతంత్రమునే బాలుకి తంత్రమని అనుచున్నారు. కాని అది సరికాదు. రెండును భిన్న తంత్రములుగనే యున్నవి.

జతూకర్ణసంహిత  : ఇదియును ప్రమాణ గ్రంథమే చక్రపాణి పెక్కు స్థలములలో విషయ నిర్ధారణకై దీనినుండి వాక్యముల నుదహరించియున్నాడు. ఇది శివదాసుడను వ్యాఖ్యాత కాలమువరకు లభ్యమగుచుండెనని అతని వ్యాఖ్యానముల యందిది యుదహరింపబడుటచే తెలియుచున్నది.

పరాశరసంహిత; క్షారపాణి సంహిత :- ఇవికూడ శివదాసుని నాటికి లభ్యమగుచు నిప్పుడు దొరకుటలేదు.

హరీత సంహిత :- ఇదియును చక్రపాణి, విజయ రక్షిత, శ్రీకంఠ, శివదాసాది వ్యాఖ్యాతలు కాలములో దొరకుచు నిపుడు లుప్త ప్రాయమైనది. ప్రస్తుతము హరీత సంహితయని అచ్చుబడి ప్రచారమునందున్న ప్రతి యథార్థమైన హరిత సంహితకాదు. దీనియందు చాల దోషములు కానవచ్చుచున్నవి.

ఖరనాదసంహిత :- దీనిని అరుణదత్త, చక్రపాణి, విజయ రక్షితాదులు ప్రమాణముగ గ్రహించియుండుటచే ఇది ప్రమాణ గ్రంథమని తెలియుచున్నది. ఇప్పుడిది దుర్లభము.

విశ్వామిత్రసంహిత :- ఇది చాల ప్రాచీనతంత్రము. చరక సుశ్రుత వ్యాఖ్యానములలో చక్రపాణి దీనిని స్మరించెను. ఇప్పుడిది దుర్లభము.

అగస్త్యసంహిత :- ఇది అగస్త్యునిచే రచింపబడినది. ఈ పేరుగల ఒక ఋషి ధన్వంతరి శిష్యుడు కలడని దక్షిణా పథమున నొక ప్రచారము కలదు. అగస్త్యుని యీ గ్రంథమును పురస్కరించుకొని ఒక సంప్రదాయము ఆ దేశమునందు అగస్త్య వైద్యమనుపేర వృద్ధినంది యున్నది. ఇది రసతంత్రౌషధములను గూర్చి బహుళముగ బోధించినను కాయచికిత్సా ప్రధానముగ నుండుటచే నిట నుదహరింపబడెను. ఈ తంత్ర ప్రవర్తకులు 23 మంది అని కొందరు, 33 మంది అని కొందరు, 44 మంది అని కొందరును చెప్పుచున్నారు. వారిలో నొకడగు వంగ సేనాచార్యుడు ఈ తంత్రమును సంస్క రించి తన పేర “వంగసేన" యని ప్రసిద్ధినొందిన యొక గ్రంథమును ప్రకటించెను. ఇది ముఖ్యముగ గ్రహింపబడు చున్నది. హేమాద్రి తన వాగ్భట వ్యాఖ్యానములో దీనిని ఎక్కువగా గ్రహించియున్నాడు.

అత్రిసంహిత :- ఇది మిక్కిలి ప్రాచీన గ్రంథమని కొందరును, ఆధునికమని కొందరును, నుడువుచున్నారు. దీని యందలి వచనములు ఏ వ్యాఖ్యానములలోను కన్పట్టక పోవుటచే, దీని యార్షత్వము సంశయింపబడు ·చున్నది. ఇది లభ్యమగుచున్నది. పంచనదమందు ఇంత కన్న పెద్దదియగు నొక గ్రంథము ఈ పేరుతో ప్రచారము నందున్నదని తెలియుచున్నదిగాని ఆ గ్రంథము హస్తగతము కాలేదని. మహా మహోపాధ్యాయ గణనాథ సేన్ గారు వ్రానీయున్నారు. కాయచికిత్సా గ్రంథములలొ ఆర్షము లనదగినవి యింతకుమించి ప్రచారము నందు లేవని చెప్పవచ్చును.

శల్యతంత్ర గ్రంథములు :- శల్యతంత్రమనగా శరీరము నందు చేరి బాధించెడి శల్యముల నుద్ధరించి చికిత్స చేయు విధానము, శల్యములు బాహ్యములగు బాణములు మొదలగునవిగా నుండవచ్చును. లేదా ప్రణాదుల యందలి పూయము మొదలగు నభ్యంతరములుగ నుండ వచ్చును. కనుక శస్త్రములచే చేయబడు ప్రణాదుల చికిత్సయు, బాహ్యముగ శరీరమునందు చేరిన ములుకులు మొదలగువానిని యంత్రాదులచే నాకర్షించి చికిత్సించుటయు కూడ శల్యతంత్ర మనబడుము, దీనిని బోధించు తంత్రములు శల్యతంత్రములు, ఈ తంత్ర ప్రవర్తకుడు ధన్వంతరి. ఇతని విషయమును గూర్చి లోగడ వర్ణింపబడియున్నది.

సౌశ్రుతతంత్రము :- దీనికి వృద్ధసుశ్రుత సంహిత అని పేరు. ఇది మనకు ఉపలభ్యమానమగు సుశ్రుత సంహితకు మూలమని తెలియుచున్నది. ఇది ప్రస్తుతము దొరకుట లేదు.

సుశ్రుతసంహిత :- దీనినిగూర్చి లోగడ వర్ణింపబడి యున్నది.

ఔపధేనవతంత్రము; ఔరభ్రతంత్రము :- ఇవి రెండును నామమాత్రావశిష్టములు. సుశ్రుత వ్యాఖ్యాతయగు డల్హనుడు తన వాఖ్యానములో నొకటి రెండుచోట్ల వీనిని స్మరించెను.

పౌష్కలావతతంత్రము :- చక్రపాణి యనునాతడు భానుమతి యను తన సుశ్రుత వ్యాఖ్యలో దీని నుదహరించి యున్నాడు. ఇది దుర్లభము.

వైతరణతంత్రము :- ప్రాచీన వ్యాఖ్యలలో దీని యుద్దారములు కానవచ్చుచున్నవి. కాని యిది దుర్లభము.

భోజతంత్రము :- దీనినే భోజ సంహిత యందురు. ఈ సంహితాకారుడగు భోజుడు, సుశ్రుతునికి సమకాలికుడగు ఋషియని డల్హణుడు తన వ్యాఖ్యలో వ్రాసి యున్నాడు. వీనికి వృద్ధభోజుడని గూడ వ్యవహారము కలదు. ఇది చాల ప్రమాణ గ్రంథము. దీని ప్రమాణము ననేక వ్యాఖ్యాతలు ఉల్లేఖించిరి.

కరవీర్యతంత్రము :- దీనిని వాఖ్యాత లరుదుగ వాడి యున్నారు. వారి కాలమునకే యిది లభ్యము కాలేదని తోచుచున్నది.

గోపురరక్షితతంత్రము:- ఇదియు నామమాత్రావ శేషముగనే యున్నది.

భాలుకితంత్రము :- ఇదియును వ్యాఖ్యాతలచే అరుదుగ స్మరింపబడుచున్నది. విజయ రక్షితుడు ఈతంత్రము నుండి జ్వర ప్రకరణములో కొన్ని శ్లోకములను ఉదాహరించియున్నాడు. ఇది దుర్లభము.

కపిలతంత్రము; గౌతమతంత్రము: ఈ రెండుగూడ దుర్లభములే. వీనియందలి వచనము అచ్చటచ్చట వ్యాఖ్యానములలో కానవచ్చుచున్నవి.

శాలాక్య తంత్రములు:- ఊర్ధ్వాంగ చికిత్సలను బోధించు తంత్రమునకు శాలాక్యతంత్రమని పేరు. శలాకలతో నిది నిర్వర్తింప బడునుగాన శాలాక్యమని పేరుకల్గినది. దీనిని నిమిసాంప్రదాయ మనియెదరు. ఈ వైద్యులకు శాలాకిను అని పేరు. ఈ తంత్ర ప్రవర్తకులు కాంకాయన, గార్గ్య, గాలవ ప్రభృతులు.

విదేహతంత్రము :- ఇదియును సుశ్రుతము వలెనే సర్వాంగములతో కూడిన గొప్ప తంత్రము. ఇందు నేత్రము, శ్రోత్రము మొ. ఊర్ధ్వాంగ జనిత రోగ చికిత్స ముఖ్యముగా నున్నది. ఇదియును ప్రస్తుతము దుర్లభము. వ్యాఖ్యాతలచే చాల ప్రమాణ గ్రంథముగా గౌరవింపబడు చుండెను.

నిమితంత్రము :- ఇది మరియొక శాలాక్య తంత్రము ఇదియును దుర్లభము.

కాంకాయనతంత్రము :- ఈ తంత్రకారుడు బాహ్లిక దేశస్థుడని మాత్రము తెలియుచున్నది. ఇదియును దొరకుటలేదు.

గార్ద్యతంత్రము; గాలవతంత్రము :- డల్హణ వ్యాఖ్యలో ఈ తంత్రముల నామములు మాత్రము స్మరింపబడినవి. కాని లభ్యమగుట లేదు.

సాత్యకి తంత్రము :- ఇది అరుదుగా వ్యాఖ్యాతలచే స్మరింపబడినది; దుర్లభము,

శౌనకతంత్రము :- దీని పాఠములు డల్హణ, చక్రపాణి, దత్తులచే బహుప్రదేశములందు గ్రహింపబడినవి. సర్వాంగ పూర్ణమైన గొప్పగ్రంథము. ప్రస్తుతము లభ్యముకాదు.

మద్రశౌనకతంత్రము :- ఇది శాలాక్యతంత్ర భాగము మాత్రము గలిగియున్నది. దీనిని మదశౌనక తంత్ర మనియు వ్యవహరింతురు. దుర్లభము.

కరాళతంత్రము :- ఇది కరాళభట్టుచే రచింపబడినది. ఇది ఆర్షము కాకపోయినను అతిప్రాచీన మగుటచే నిట నుదహరింపబడినది. ఇదియును దుర్లభము.

చక్షుష్యతంత్రము :- దీనిని చక్షు షేణ్య తంత్రమనియు అందురు.

కృష్ణాత్రేయతంత్రము :- కృష్ణాత్రేయుడన్నను, పునర్వసురాత్రేయుడన్నను ఒక వ్యక్తియే యని కొందరు, భిన్నులని కొందరును చెప్పుచున్నారు. ఇదియు దుర్లభము. కౌమారభృత్యతంత్రములు :- శిశువుల సంరక్షణమును బోధించు తంత్రములకు కౌమారభృత్యతంత్రము లని పేరు.

జీవకతంత్రము ; పార్వతకతంత్రము ;బంధక తంత్రము:- ఈ మూడు తంత్రములు పూర్వకాలమున ప్రసిద్ధిగ నుండెనని డల్హణుడు సుశ్రుత సంహిత ఉత్తర స్థానములో నుదహరించి యుండెను. కానీ యివి ఇపుడు నామమాత్రావశిష్టములు.

కుమారతంత్రము :- చక్రపాణిచే భానుమతి యను. సుశ్రుత వ్యాఖ్యలో దీని పాఠములు ఉద్దరింపబడినవి. కాని దీని కర్త యెవరో తెలియదు. ఇది ప్రస్తుతము దుర్లభము.

హిరణ్యాక్షతంత్రము :- మాధవనిదాన వ్యాఖ్యలో శ్రీకంఠుడు దీనిపాఠము సుద్దరించెను. దీనినే కొందరు కుమారతంత్రము అందురు. దుర్లభము.

గ్రహచికిత్స :- భూతవిద్యా తంత్రములు ప్రస్తుతకాలమున లుప్తప్రాయముగ నున్నవి. చరకుని కాలమున వీటిని ఉన్మాదాది మానసికరోగముల చికిత్సలలో కొద్దిగ వర్ణించి యున్నారు. ఈ తంత్రములు ప్రస్తుతము దొరకుట లేదు.

అగదతంత్రములు :- స్థావర, జంగమ, కృత్రిమ విషముల స్వరూప, లక్షణ, చికిత్సలను బోధించునవి అగదతంత్రము లని చెప్పబడును. కాశ్యపాదులు వీని ప్రవర్తకులు.

కాశ్యపసంహిత :- డల్హణ, చక్రపాణి, శ్రీకంఠాది వ్యాఖ్యాతలచే నీ తంత్రవచనములు ప్రమాణముగా నుద్ధరింపబడినవి.

ఆలంబాయనసంహిత:- మాధవనిదాన టికలో విషాధికారమున శ్రీకంఠుడు దీని యుద్ధారము నుదహరించెను. దుర్లభము.

ఉశనస్సంహిత :- దీని రచయిత శుక్రాచార్యులని వృద్ధవైద్యులు చెప్పుదురు. శుక్రాచార్య మతానుయాయి యగు కౌటిల్యుడు, తన యర్థశాస్త్రమున కంటక శోధ నాధికరణమున విషాది ప్రతీకారోపదేశము, ఆశుమృతక పరీక్ష యనువాటిని చూపుటచే ఈ సంహిత యున్నట్లు తర్కింపబడుచున్నది.

సనకసంహిత :- దీనికే శౌనక సంహిత యని పేరు కూడ కలదు. ఇది మిక్కిలి ప్రాచీనమైనది. ఇది అరబ్బీ భాషలోనికి తర్జుమా చేయబడినది. ఈ భాషాంతరీకృత గ్రంథములోనున్న విషయములు చరక, సుశ్రుతాది గ్రంథములలో నున్న విషాధికారమునందలి యంశములకు సరిపోవుచున్నట్లు ప్రపుల్ల చంద్ర రాయ్ గారు తమ భారతీయ రసాయనశా స్త్రేతిహాసమున వ్రాసియున్నారు. దీని అరబ్బీ భాషానువాదము లభ్యము.

లాట్యాయనసంహిత :- సుశ్రుతకల్ప స్థానములో డల్హణుడు దీని పాఠములను ఉద్ధరించెను. దుర్లభము.

రసాయన వాజీకరణతంత్రములు:- రసాయన వాజీకరణ తంత్రములలో రసాయనతంత్ర మనునది శరీరము నందు శ్రేష్ఠమగు సప్తధాతు సముదాయము నభివృద్ధి నందించు నుపాయములను బోధించునది యనియును, వ్యాధులను నశింపచేయు నుపాయములను బోధించునది యనియును వ్యవహరించుచున్నారు. చరకాదులు రసాయన సేవా విధానమును, మూలికా ప్రధానమైన రసాయ నౌషధ యోగములను, ఉపదేశించియున్నారు. ఈ రసాయన తంత్రమునకే రసతంత్రమనికూడ వ్యవహారము. ఈ వైద్యులకు రాసాయనికు లని పేరు. దీని ప్రవర్తకులు మహేశ్వర, నాగార్జు నాదులు, వాజీకరణతంత్ర మనునది శుక్రదోషములను పోగొట్టి సత్సంతానముకల్గు నుపాయములను బోధించును. ఈ వైద్యులకు వాజీకరణికు అని పేరు. దీని ప్రవర్తకులు బాభ్రవ్య, కుచుమార, వాత్స్యాయ నాదులు.

రసాయనతంత్రములు; పాతంజలతంత్రము - శివ దాసాది వ్యాఖ్యాతలచే దీని పాఠములు ఉద్ధృతము లైనవి. ఇది దుర్లభము. . వ్యాడితంత్రము; వాసిష్ఠతంత్రము: మాండవ్యతంత్రము. ఇవి మూడును మిక్కిలి ప్రాచీనములైనవి. ఇపుడు దుర్లభములు.

నాగార్జునతంత్రము :- ఈ గ్రంథకర్త మహర్షి యని కొందరు, బౌద్ధపండితు డని కొందరు చెప్పుచున్నారు. కొందరీ నాగార్జునతంత్రమనగా నాగార్జున ప్రణీతమగు రసరత్నాకరమనుచున్నారు. ఇది దుర్లభము. ఈ నాగార్జునుడే కక్షపుటతంత్రము, ఆరోగ్యమంజరి యను మరి రెండు గ్రంథములను రచించెనని చెప్పుదురు. ఇవి లభ్యములు. ఇతనిచే రచింపబడిన రసేంద్రమంగళ మను గ్రంథమునందు ఎనిమిది అధ్యాయములు కలవు. కాని ప్రస్తుతము 3 అధ్యాయములు మాత్రమే దొరకు చున్నవి. దీనిని ఆంధ్రభాషలోనికి పరివర్తనమొనర్చిరి.

రసహృదయతంత్రము :- దీనిని శంకరాచార్యుల గురువగు గోవింద భగవత్పాదులు రచించిరి. ఇది లభ్యము.

రసార్ణవతంత్రము :- ఇది ఈశ్వరునిచే పార్వతికి ఉపదేశింపబడినది. బహు ప్రాచీనమైనది. ఇది లభ్యము.

వాణీకరణతంత్రములు; కుచుమారతంత్రము :- - ప్రాచీనమైన తంత్రము. లభ్యము కాదు.

నందితంత్రము :-నంది అనువానిచే ప్రథమమున వేయి అధ్యాయములలో నీ సంహిత వ్రాయబడెనని తెలియు చున్నది.

శ్వేతకేతుతంత్రము :- ఉద్దాలకుని పుత్రుడగు శ్వేతకేతునిచే నందిసంహిత ప్రతి సంస్కరింపబడి 5 వందల అధ్యాయములలోనికి సంక్షిప్తము గావింపబడి శ్వేతకేతు తంత్రమని వ్యవహరింపబడిన తంత్రము.

పాంచాళతంత్రము :- బబ్రుకుమారుడగు పాంచాళునిచే శ్వేతకేతు సంస్కృతమగు నందిసంహితావ్రతి సంస్కరింపబడి, మరికొంత సంక్షి ప్తము కావింపబడి 7 భాగములలో రచింపబడినది.

వాత్స్యాయమని కామసూత్రములు:- వాత్స్యాయన కృతము. వాత్స్యాయనునిగూర్చి భిన్నాభిప్రాయములు కలవు. కొందరు ఋషి యనియు, కొందరు చంద్రగుప్తుని మంత్రియగు చాణక్యుడనియు అందురు.

3. అనార్ష వైద్యగ్రంథములు; అష్టాంగ సంగ్రహము:- ఇదియును సూత్ర, శారీర, నిదాన, చికిత్సా కల్ప, ఉత్తరస్థానము లను ఆరు స్థానములను కల్గియున్నది. అందు సూత్రస్థానమున 40, శారీర స్థానమున 12, నిదాన స్థానమున 16, చికిత్సా స్థానమున 24. కల్ప స్థానమున 8, ఉత్తరస్థానమున 50 అధ్యాయముల చొప్పున మొత్తము 150 అధ్యాయములు కలవు. ఈ గ్రంథమును వృద్ధ వాగ్భట మని వ్యవహరింతురు. వృద్ధవాగ్భట మను పదముచే కొందరు పండితులు వాగ్భటు లిరువురుండెడి వారని నిరూపించుచున్నారు. దీనినిగూర్చి లోగడ వివరింపబడి యున్నది.

అష్టాంగహృదయము :- ఈ గ్రంథ ప్రాధాన్యమును బట్టి ఇది మొదటనే వివరింపబడినది.

మాధవనిదానము :- ఇది రోగనిర్ణయమున కుపయోగించు ప్రమాణ గ్రంథము. మహారాష్ట్ర దేశజాతుడును, ఇందుకరుని పుత్రుడు నగు మాధవకరునిచే రచింపబడినది. ఇదికూడ బహు పఠన పాఠన ప్రచారములో నున్నది. ఈ గ్రంథక ర్త క్రీ. శ. 7, 8 శతాబ్దములలో జన్మించెను. ఈ గ్రంథకర్త వేదవ్యాఖ్యాతయగు మాధవాచార్యుడని కొందరు వ్రాసిరి. కాని అది నిరాధారము. మాధవాచార్య ప్రణీతమగు గ్రంథము వేరొండు కలదేమోకాని అది ప్రస్తుతము సులభముగ దొరకుటలేదు. ఈ మాధవ నిదానము ననుసరించి పెక్కు గ్రంథము లుద్భవించినవి.

యోగరత్నాకరము :- ఇందును మాధవ నిదానమందలి యనుక్రమము, శ్లోకములు గాన్పించును. ఈ గ్రంథకర్త నామ ధేయము అవిదితము. కాలముకూడ తెలియదు.

శార్ణోధరసంహిత:- ఇదికూడ శారీర నిదాన చికిత్సా విషయములతో విలసిల్లుచు వైద్యులు యాదరమును పొందుచున్నది. ఇందు మూలికౌషధములు, రసౌషధములు కూడ కలవు. పంచకర్మలు వర్ణింపబడినవి. ఇందు మూడు ఖండములు కలవు. అవి పూర్వ, మధ్యమ, ఉత్తర ఖండము లనునవి. దీనిని శార్ణధరాచార్యులు రచించెను.

భావప్రకాశము :- ఇదియు అష్టాంగములను బోధించుట కుద్దేశింపబడినది. ఇది ద్రవ్యగుణ విజ్ఞానమును ప్రధానముగ గల్గించుచు నిదాన చికిత్సలను పరిపూర్ణముగ వివరించు గ్రంథము. ఇది భావమిశ్రకృతము. ఉత్తరదేశము నందు దీనికి విస్తృతమగు ప్రచారము కలదు. ఇందు ఫిరంగరోగమును గూర్చి వర్ణించియున్నాడు. ఫిరంగి చెక్క మొదలగు వస్తువులను గూడ వర్ణించెను. ఇతడు క్రీ. శ. 16వ శతాబ్దపు పూర్వభాగమున జనించెనని నిర్ణయింపబడెను,

పిమ్మట గదనిగ్రహము, సిద్ధయోగము మొదలగు గ్రంథములు రచింపబడినవి. భైషజ్య రత్నావళి, ఆయుర్వేద విజ్ఞానము ఇంకను అర్వాచీనములగు ప్రత్యక్ష శారీరము మొదలగు గ్రంథము లావిష్కరింపబడినవి. ఆంధ్రదేశములో ముఖ్యముగా నభ్యసింపబడునవి “వైద్య చింతామణి” “బసవరాజీయము" అను రెండు పెద్ద గ్రంథములు కలవు. ఇవి స్వతంత్రములు కావు. పూర్వ గ్రంథములలో నుండి యుద్ధరింపబడిన విషయములతో నిండియున్నవి. నాడీజ్ఞానము మొదలగు అష్టస్థాన పరీక్షలు కర్మవిపాకము, జ్యోతిషాభిప్రాయము మొదలగు విశేషములు వీనిలో వర్ణింపబడినవి.

ఇంకను చికిత్సారత్నమను బాలురకు స్త్రీలకు కలుగు రోగముల చికిత్సలను బోధించు గ్రంథమును, చికిత్సా సార మను గోపాలదాసుచే రచింపబడిన గ్రంథమును కలవు.

రసతంత్రమునందును అనార్ష గ్రంథములు కలవు. వానిలో రసరత్న సముచ్చయము (వాగ్భట విరచితము), రసేంద్ర చూడామణి (సోమదేవ విరచితము), రససారము (గోవింద భిక్షు విరచితము) రప రత్నాకరము (నిత్యనాథ విరచితము) అనునవి ముఖ్యమయినవి. ఇంకను ఆయుర్వేద ప్రకాశము, రసేంద్రసార సంగ్రహము, రస సంకేత కలిక, రస కౌముది, లోహమంజరి, మొదలగు బహు గ్రంథములు కలవు.

నొ. రా. శా.

ఆయుర్వేద ధర్మములు :- ధర్మములు శాశ్వతములు. అనగా దేశ కాల వయః ప్రకృతి భేదముల ననుసరించి ఎప్పటికప్పుడు మార్పు చెందించుటకు వీలుచాలనివి. జగద్ధార్యమగు ధర్మపదమునకు ప్రతివ్యక్తియు నియమితమగు నిత్య కర్మాచరణమున వర్తించుటను తెలియచేయునది యని యర్థము. ధర్మములు- మానవ జీవిత సంపత్ప్రభా భాసకములు, చిరాయు రారోగ్య సంపన్నములు, ధర్మము లన్నింటియందును ఆయుఃపాలనము ముఖ్యమగుటను, జీవితకాలమును తెలియజెప్పి యుక్తాచరణమున ధర్మార్థ సుఖసాధన మగు ఆయుఃపాలనము చేయుటయందు నేర్పరితనమును బోధించుటచే ఈ ధర్మములు ఆయుర్వేద ధర్మము లని పేర్కొనబడినవి.

ఆయుర్వేద ధర్మములు కేవల సామాజికములుగా గాని, వర్ణ, వర్గీకరణములుగా గాని రూపొందింపబడి నిర్ణయింపబడినవి కావు. ఇవి సర్వమానవ సౌఖ్యావహములు. ప్రాణిమాత్ర జీవనోజ్జీవనములు. శాశ్వతములు. "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" ధర్మసాధనకు శరీరము మొదటిదిగా చెప్పబడినది. "శరీర రక్షణో ధర్మః" శరీరమును రక్షించుటయే ధర్మమని చెప్పబడినది.

     "ధర్మసాధనంబు తనువు, ధర్మము పరి
      జ్ఞానదాయి, యట్లుగాన తనువు
      నోమవలయు మర్త్యుడేమిట నేమర
      కాత్మహితముగోరి యనఘచరిత"

(మహాభారతము.శాంతి.)

శరీరమనగా నశించునదియని యర్థము. “శీర్యతే రోగాదినా ఇతి శరీరః. శాృ హింసాయాం" అని నిర్వచనము. శరీరము నందు అరువది అవయవములు కలవు. ఇందే యొక్కటి కొదువయైనను లేక పనిచేయకపోయినను సౌందర్య విహీనమై శరీరము యొక్క ఉనికియే కష్టముగ తోచును. శరీరమునం దాత్మ సుస్థిరముగా నుండవలయును. ఆత్మ నిలచి యుండునంతవరకు శరీరము నందన్ని అవయవములు సుసమాహితములై పనిచేయు చుండవలయును.

శరీరము - మనస్సు - ఆత్మ ఇవి ఒకదానినొకటి యెడబాయక కలసియుండునట్టి క్రియాత్మక మగు అవస్థావి శేషమునకు “ఆయువు" అని పేరు. ఆయుర్వేద ధర్మపముచ్చయమునందు మొదటి అధ్యాయము సద్వృత్తోపదేశము.(చ. సూ.1-46-47). ఆయుర్వేదమున చెప్పబడిన ఆ సద్వృత్తము నాచరించుటవలన ఆరోగ్యము, ఇంద్రియ విజయము అను రెండుఫలములు ఒకేసారి పొందనగును. అట్టి సద్వృత్త విశేషములను సమగ్రముగా నిందు పొందుపరచుచున్నాము :

1. "దేవ గో బ్రాహ్మణ గురువృద్ధ సిద్ధాచార్యా నర్చయేత్." దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, తపోయోగ సిద్ధులను, విద్యా మంత్రోపదేశకులను, పూజించవలయును.

2. "అగ్ని మునచరేత్." హోమాది సత్క్రియా కలాపములవలన అగ్ని నారాధించవలయును.

3. "ఓషధీః ప్రశస్తా ధారయేత్." ఆరోగ్యదాయకములు, ఆయుర్వర్ధకములు, పవిత్రములు నగు ఓషధులను ధరింప వలయును.