Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్రికా ఖండపు భాషలు

​వచ్చిన తెల్లవారు భూమి నాక్రమించుకొనుట మిక్కిలి తీవ్రమైన సమస్యగా పరిణమించినది. (బ్రిటిషు) ఉగాండా ఆఫ్రికా యొక్క పరిపాలన విషయమున ముందంజవైచినది. అచ్చట దేశీయ న్యాయస్థానములకు ఎన్నదగినంత న్యాయాధికారము (legal power) కలదు. టాంగనీకాలో బ్రిటిషువారు ఒక శాసనముద్వారా దేశీయ ప్రజా సమూహమునకు తగినంత ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రము నొసంగియుండిరి. 46 వేల మంది ఆసియావాసులు (ముఖ్యముగా భారతీయులు) వచ్చి స్థిరపడుట టాంగనీకాలోని సాంఘిక పరిస్థితిని కొంతవరకు క్లిష్టము కావించినది. ఉత్తర ప్రదేశములతో పోల్చినచో ఉత్తర రొడీషియాలో తెల్ల వారి సంఖ్య చాల తక్కువే. వారు గని పరిశ్రమలందు మగ్నులై యుందురు. దక్షిణ రొడీషియాలో తెల్ల వారి సంఖ్యకంటే దేశీయుల సంఖ్య 20 రెట్లెక్కువ. బసుటోలాండు, బెచునాలాండు, స్వాజిలాండు అను ప్రదేశములం దొక్కొక్కచోట ఒక్కొక్క కమీషనరు కలడు. అతడు దక్షిణాఫ్రికా హైకమీషనరు ద్వారా బ్రిటిషు ప్రభుత్వమునకు బాధ్యత వహించి యుండును.

మధ్య కాంగో ప్రదేశమున బెల్జియనుకు విస్తృతమైన భూభాగము కలదు. అందు ఖనిజ జంతు సంపద విస్తారముగా కలదు. అచ్చట పామ్ నూనె, కాఫీ, కోకో, పంచదార, రబ్బరు, కోపలీ మున్నగునవి కూడ లభ్యములగును.

ఉత్తర ఆఫ్రికా యందలి ఫ్రెంచి రక్షిత స్థలములు మిక్కిలి సంపన్నములై నవి. ఆల్జీరియాలోని ఖనిజ వృక్ష సంపదలు ముఖ్యముగా ఫ్రాన్సున కెగుమతి చేయబడు చున్నవి. ప్రతి సంవత్సరమును రెండు మిలియనుల టన్నుల ఇనుప యినుక ఫ్రాన్ సునకు ఎగుమతి కావలయుట ఆల్జీరియాపై ఫ్రాన్స్ సునకు గల గొప్ప ఆకర్షణకు కారణము,

ఆఫ్రికాలో పోర్చుగీసువారికి మూడు ప్రదేశములు కలవు. అవి దూర పశ్చిమాఫ్రికాలోని పోర్చుగీసుగినియా వాయవ్య భాగము నందలి అంగోలా, తూర్పు ఆఫ్రికా యందలి మొజాంబిక్. అంగోలాలో యూరోపియనుల స్థిరనివాసమునకు తగిన శీతోష్ణ స్థితిగల ఉన్నత ప్రదేశము కలదు.

జి.స

ఆఫ్రికా ఖండపు భాషలు  :- ప్రధాన భాషలు - వర్గీకరణము : ఇటీవలి కాలమున వలస వచ్చిన ఐరోపావారిని వదలి పెట్టినచో ఆఫ్రికా ఖండములోని ప్రజలను నాలుగు ప్రధాన జాతులుగా విభజింపవచ్చును.

1. పిగ్మీ - బుష్ మన్ 2. నీగ్రో 3. హెమిటిక్ 4. సెమిటిక్. వీరికి సంబంధించి ఆఫ్రికా ఖండపు భాషలను కూడ నాలుగు వర్గములుగా విభజింపనగును. కాని యిందలి నీగ్రో వర్గము 1. సూడానిక్ 2. బంటు అని తిరిగి రెండు అంతర్వి భాగములుగా తరువాత విడివడినది,

ఇట్లు ఆఫ్రికా ఖండ భాషలు ఐదు వర్గములుగా విభజింపవచ్చును :- 1, బుష్ మన్ 2. సూడానిక్ 3. బంటు 4. హెమిటిక్ 5. సెమిటిక్.

స్ట్రక్ (struck) యొక్క వివరణ ననుసరించి, ఆఫ్రికా భాషల సంఖ్య ఈ విధముగా నున్నది :—

(1) బుష్ మన్ వర్గము: 11 భాషలు (2) సూడానిక్ వర్గము: 264 భాషలు (3) బంటువర్గము: 182 భాషలు (4) హెమిటిక్ వర్గము : 47 భాషలు (5) సెమిటిక్ వర్గము : 10 భాషలు.

పెక్కు భావలు కొలది వైశాల్యముగల ప్రదేశములో మాత్రమే మాట్లాడబడుచున్నవి. సుమారు 12 భాషలు మాత్రము 10 లక్షల కంటే ఎక్కువ మందిచే మాట్లాడ బడుచున్నవి.

ప్రత్యక్షోపయోగము ననుసరించి, ఈ క్రింది ఆఫ్రికా భాషలు తక్కినవాని కంటే ఎక్కువ ముఖ్యమైనవిగా ఉన్నవి :- - 1. సెమిటిక్ భాషలు : అమ్ హరిక్ అరబిక్ 2. హెమిటిక్ భాషలు: హౌసా 3. బంటు భాషలు: గండా, కికు యూ, కాంగో, లుబా-లులువా, మ్యుండు (Mbundu), న్గాలా (Ngala), న్యాన్జా, సుకుమాన్యాంవెజీ, రుఆన్డా రున్డీ, సోథో- పెడిఛ్వానా, స్వాహాలీ, స్వీనా- కారన్గా న్హా ఓ (Swina - Karanga - Ndao), జులూ - క్సో సా 4. సూడానిక్ భాషలు : ఆకాన్, డిన్కా - నూయర్, ఎఫిక్ - ఇబిబియో. యు - ఏన్ హోదహోం, ఇబో, కనూరీ, క్పెల్ - మెండ్, మాలిన్కే డ్జురా - బంబారా, మోసీ - డాగోమ్బా, నూ పేగ్యారీ, టెంనె (Temne), వోలోఫ్, యోరుబా, జన్డే. - ​ వర్గములు పరిశీలన : పై నుదాహరింపబడిన ఐదు ప్రధాన వర్గముల వివరములను ఇప్పుడు సంక్షిప్తముగా పరిశీలింతము :

I బుష్ మన్ వర్గము : ఈ భాషలను తిరిగి మూడు అంతర్విభాగములుగా చేయనగును :

(i) దాక్షిణాత్యము. (ii) మాధ్యమికము, (iii) ఉత్తర దేశీయము.

1. ధ్వనివిషయములో ఈ భాషలు టర్కీ కోళ్ళ 'కటుక్కు” మను ధ్వనుల (Clicks లేక Clucks) ఎక్కువగా కలిగియుండును.

2. స్వరభేదము (Intonation) : ఈ భాషలకు మరొక లక్షణము.

ఈ లక్షణము 'హాటెస్టాట్', 'సూడానిక్' బంటు భాషలలోకూడ సామాన్యముగా కనిపించుచున్నది. ఒక మారుచ్చరింపదగిన అక్షర సముదాయము (Syllable) ను, ఒక్కొక్కప్పుడు ఒకే ధ్వనిగల హల్లును గూడ స్వర భేదమును కలిగియుండును. పదమునకు ధ్వని యెంత ముఖ్యమో ఈ స్వర భేదముకూడ అంత ముఖ్యమైయుండును, ధ్వనులు ఒకేవిధముగానున్న పదము స్వరభేదములు కలిగియుండుటచే ఒక దానితో నొకటి వ్యుత్పత్తి బాంధవ్యము లేమాత్రమును కల్గియుండని క్రొత్తపదములుగా మారును.

బుష్ మన్ భాషల యొక్క అనేక లక్షణములు సూడానిక్ భాషలకు కూడ సామాన్యములై కనబడుచున్నవి. ఇవి : (1) స్వరభేదము (2) ఏకోచ్చారణ వర్ణత్వము (Mono-syllabism) (3) క్రియకును, నామవాచకమునకును రూపభేదము లేకుండుట (4) షష్ఠీ విభక్తి ప్రత్యయము యొక్క స్థానము (5) “వారు" ఉపయోగించి బహువచన రూపము నేర్పరుచుట.

అయినను వ్యుత్పత్తి సంబంధములగు బాంధవ్యము లింతవరకును కల్గొనబడకపోవుటచే బుష్ మన్, సూడాన్ భాష లొకే కుటుంబమునకు చెందినవని చెప్పుట కింకను మనకు తగిన ఆధారము లభింపలేదు.

పిగ్మీభాషలనుగూర్చి మనకు తగిన పరిజ్ఞానము లేదు. అందుచే వీనిని గూర్చి చెప్పుటకు మనకు వివరములు లేవు. అన్నిచోట్లను వారు పొరుగుననున్న నీగ్రో భాషను స్వీకరించి యున్నారు.

II సూడానిక్ వర్గము  :- అట్లాంటిక్ మహాసముద్ర తీరమున ఉన్న 'సెనగాంబియా కేమరూన్సు' నుండి అబి సీనియా పడమటి పీఠభూముల వరకును ఈ భాషలు మాట్లాడబడుచున్నవి.

ఉత్తరమున 'నూబా' (Nuba), 'కునామా' యును, తూర్పు ఆఫ్రికాలో గయా, నీఫా కవిరాన్డో (Nyifwa-Kavirondo) యును పై ప్రదేశములో ఈ భాషలు మాటాడబడని తావులు.

బంటువర్గమువలె ఈ వర్గపు భాషలు అన్యోన్యము, దగ్గరసంబంధము గలవిగా లేవు. ఇందలి కొన్ని భాషలు మిక్కిలి భేదభావమును ప్రదర్శించుచున్నవి.

సూడాన్ అత్యంత ప్రాచీనకాలము నుండియు ఉత్తరము, తూర్పు దిక్కులనుండి దండయాత్రలకు గురియై యుండెను. అందుచే నేటి భాషా పరిస్థితులు ఎడ తెగని యీ కదలిక, మార్పుల యొక్క ఫలితమై యున్నవి. ఈ మార్పులలో పాత భాష లంతరించి, క్రొత్త భాష లేర్పడినవి. క్రొత్తగావచ్చిన భాషల స్వభావమును బట్టి ఈ మార్పులు తరుచు తీవ్రములై ఆదిమలక్షణములను ఎక్కువగా మార్చి వేయుచున్నవి. కనూరీ, ఒలఫ్ (wolof) ఇట్టి తీవ్రములగు మార్పులకు గురియైన భాషల కుదాహరణములు.

సర్వసామాన్య లక్షణములు :- 1. ధ్వని విశేషము. 2. నిర్మాణము. 3. వ్యుత్పత్తి విషయములలో ఈ వర్గ భాషలకు సామాన్య లక్షణములు కనబడుచున్నవి. నీగ్రో ప్రజ లెక్కువగాగల తావులలో ఈ సామ్యము ప్రబల తరముగా నున్నది.

ఈ క్రింది సామాన్య లక్షణము లీభాషలలో కనబడు చున్నవి : (1) స్వరభేదముచే అర్థభేధము : ఉ॥ యు (Ewe) భాషలో : 'దో' (ఉచ్ఛస్వరము )= చెప్పుట; 'దో" (నీచస్వరము) = విచారముగా నుండుట; 'దో'(సమాన స్వరము)= నిద్రపోవుట.

2. ఏకవర్ణ ధాతువులు :- 'యు' (Ewe) భాషలో 'కు' = చావు; 'నుబా' (Nuba) భాషలో': 'టు'=కాలిక,

3. క్రియలనుండి నామవాచకములు సంబోధన (Vocative) ప్రథమావిభక్తి ప్రత్యయము, లేక అనునానికి ప్రత్య యము ముందు చేర్చుటచే ఏర్పడుట :- యోరుబా' భాష: ​ “ర*=కొనుట; “ఓ-ర"=కొనువాడు. 'షిల్లక్' (Shilluk) భాష: 'బుగో' =గాలి తిత్తులను ఒత్తుట. 'ఓ-బుక్'= గాలి తిత్తులు.

4. బహువచన నామవాచకమును లేక సర్వనామమును చేర్చుటచే నామవాచకముల బహువచనము లేర్పడుట :— 'యు' (Ewe) భాష: 'అటి' = చెట్టు, 'అటి ఓ' = చెట్లు; 'న్యుయర్' (Nuer) భాష: 'చాక్'='టిక్ ' అను ధ్వని; 'కే-చాక్ '= 'టిక్ ' అను ధ్వనులు.

5. నామవాచకములు బహువచనము 'ఇ' లేక 'ఆ' చేర్చుటచే ఏర్పడుట ఇబో (Ibo) భాష' 'ఓ-య' = మనుష్యుడు. 'ఆ-య'= మనుష్యులు; 'ఓ రు' = బానిస ' ఇ-రు' = బానిసలు.

6. నిర్జీవ వస్తువులకు సజీవ వ్యక్తులకు భేదము : సజీవుల విషయములో 'ఓ' అను ఉపసర్గ తరుచు చేర్పబడు చుండును. 'టుయి' (Tui) భాష' 'ఓ-నిపా'=మనుష్యుడు; 'పిల్లక్' భాష: 'ఓ' అనునది ఇతరుల సంతతివారని సూచించును: 'నాయో' = మేనమామ'; 'ఓ-నాయో' = మేనమామ బిడ్డ. వ్యాకరణ రీత్యా స్త్రీ పురుష భేదము లేదు.

7. షష్ఠీ విభక్తిలో ఒక వస్తువును కలిగియున్నవాడు కలిగి యుండబడినదానికి ముందువచ్చును :- 'ట్వి' (Twi) భాష : 'నిపొ=దు ఆ'=ఒక మనుష్యుని బొమ్మ; 'కునామా' భాష: 'ఇలా మాసా = ఇలా యొక్క బల్లెము .

8. విభక్తి భేదము లేదు :- చతుర్థీ విభక్తి (Dative) రూపము 'ఇచ్చుట' అనుక్రియచే పరివృతమై యుండును. 'యు' (Ewe) భాష: 'ఎది గా నో ఫో ఫో 'తండ్రికిచ్చు ధనము కోరెను' = అతడు తండ్రికొరకు ధనము కోరెను.

9. తర్వాతచేర్పబడు ప్రత్యయములు (Post Positions) అనగా స్థలమును సూచించు నామవాచకములు విభక్తి ప్రత్య యములకు బదులుగా వాడబడును; 'యు' (Eve) భాష: 'అటిటా'= చెట్టుతల= తలమీద; 'నూబా' (Nuba) భాష: 'కాటు'= ఇంటి గర్భము = ఇంటిలో

10. క్రియాసంయోగములు తరుచుగా వాడబడును; 'యు' (Ēwe) భాష: ట్సో నా'=తీసికొని వచ్చి ఇచ్చుట.

11. క్రియ కాలభేదమునుబట్టి మారదు: కాలములు వ్యాకరణ ప్రత్యయములు చేర్చుటచే ఏర్పడును. ప్రత్యయములు చాలవరకు నామవాచకములకు గాని, క్రియలకుగాని సంబంధించియుండును. 'ట్వి' (Twi) భాష: 'బా' ('బయా' నుండి) వచ్చుట చేర్చుటచే ఏర్పడును; 'నూబా' (Nuba) భాష: 'బై' = వచ్చుట; చేర్చుట చే భవిష్యత్తు ఏర్పడును.

12. ఓష్ఠ్యకంఠ్యములు (Labia Velar) అగు 'క్ప' 'గ్స్' అనుధ్వనులు సూడానిక్ భాషలలో తరుచు వినవచ్చు చుండును.

13. పెక్కు పదధాతువులు సమానముగా నుండును; విభాగములు :- భూగోళ స్థితిననుసరించి సూడానిక్ వర్గమును మూడు అంతర్విభాగములు చేయవచ్చును: 1. తూర్పు శాఖ 2. మధ్యశాఖ 3. పడమటిశాఖ.

తూర్పుశాఖ :- వీనిలో అధిక సంఖ్యాకములు నిలోటొ, సూడానిక్ భాషలుగా ఉన్నవి. షిల్లక్, డిన్కా, నూయర్ (Nuer), నూభా (Nuba) వీనిలో కొన్ని భాషలు.

2. మధ్యశాఖ : 30° తూ. రేఖాంశమునుండి 10° తూ, రేఖాంశము మధ్య ఈ భాషలు మాటాడబడు చున్నవి. డెలఫోస్ (Delefosse) వీనిని ఆరు అంతర్విభాగములుగా చేసియున్నాడు. (1) నైల్-కాంగో వర్గము (2) ఉబంగి (Ubangi) వర్గము. (8) పరీ. వడ్డే వర్గము. (Shariwadai) (4) షరీవర్గము (Shari) (5) నైగర్ ట్షాడ్ వర్గము (Niger-Tshad) (6) నైగర్. కేమరూన్స్ వర్గము. (Niger-comeroons)

3. పడమటి సూడానిక్ శాఖ  :- వీనిని గూర్చిన వివరములు మనకు బాగుగా తెలియును. ఇవి ఈ క్రింది అంతర్విభాగములుగా చేయబడినవి. (1) క్వా' (Kwa) భాషలు; వీనిలో చాల పదధాతువులు ఒక హల్లును. ఒక అచ్చును కల్గియున్నవి. ఉ॥ ఆకాన్ (Akan) భాష 'క' = ఉండుట; 'వు' = మరణించుట, సంబోధ ప్రథమా విభక్తి ప్రత్యయములను (Vocative) మరియు అనునాసికములగు ప్రత్యయములను ముందు చేర్చుట ఇందు క్రియలనుండి నామవాచకము లేర్పడును.

2 బెనూక్రాస్ నదీభాషలు  : సూడానిక్ బంటూ సరిహద్దులలో నుండి, వీనిలో కొన్ని ఈ వర్గముల రెండింటి ​ లోను ఒక దానినుండి మరొకదానిలోనికి మార్పును సూచించుచున్నవి.

మధ్యటోగో (Middle Togo) వర్గము: ఇవి చాల వరకును 7°-8° అక్షాంశముల మధ్య ఉన్నవి. వీనిలో కొన్ని అంతరించీ 'యు' (Ewe) 'ఆ కాన్' (Akan) భాషలలో లీనమగుచున్నవి. ఇవి (1), (4) వర్గముల మధ్యనుండి వానితో సుస్పష్ట సంబంధములు కల్గియున్నవి.

4. గుర్-గూర్ భాషలు (Gur-Goor) :- ఇవరీ గోల్డ్ కొస్ట్, టోగో, దహోంల ఉత్తరభాగము నందును; హౌటివోల్టా (Houti Volta) పరిసరములయందును; ఈ భాషలు మాటాడబడుచున్నవి. ఇవి తిరిగి ఎనిమిది అంతర్విభాగములుగా చేయబడినవి.

5. పడమటి అట్లాంటిక్ భాషలు:- సెనిగాల్ - అట్లాంటిక్ లమధ్య కొంత భాగములో ఇవి మాటాడబడుచున్నవి. ఇవి తిరిగి (ఏడు) అంతర్విభాగములుగా చేయనగును.

6. మాడిన్గో, లేక మన్డీ భాషలు : పడమటి సూడాన్ లో నున్న ఈ భాషలు 4,5 వర్గములమధ్య నున్నవి. ఇవి తిరిగి రెండు అంతర్విభాగములుగా చేయబడినవి.

III బంటు భాషలు  :- ఇవి ఆఫ్రికాఖండపు దక్షిణార్ధ భాగమున మాటాడబడుచున్నవి. ఇవి సన్నిహిత బాం ధవ్యములు పరస్పరమును గల కుటుంబమై సుస్పష్ట లక్షణములను కలిగి యున్నవి. ముందు చేర్చబడు ఉపసర్గలచే (Prefixes) నామవాచకములు జాతి భేద మేర్పరుచుట వీనినిర్మాణములో ప్రధాన లక్షణముగా ఉన్నది. సూడాసిక్ భాషలలో ఈ లక్షణము కనబడుచున్నను, బంటు భాషలలో ఇది అధికతర వికాసదశను పొందియున్నది. ఈ ఉపసర్గలు బహువచనములను గూడ ఏర్పరుచును. ఉ॥ స్వాహిల్లీ భాష (Swahilli) లో :- కి - సు. కి హల్లీ కి -మోజా కి -మే పొటియా". (ఒక పదునైన కత్తి పోయినది) 'సు' అనగా కత్తి; 'కి' దానికి వర్గోపసర్గ ఇది ' - సు' తో సంబంధించి యున్న ప్రతి పదమునకు ముందుగా వచ్చుచుండును, 'కి' కి సంబంధించిన బహు వచనోపసర్గ 'వి'. ఇట్లు వెనుక వాక్యము బహువచన రూపములో ఇట్లుండును. “వి - సు వి - కాలీ వి - నానే-వి - మే పొటియా' (= ఎనిమిది పదునైన కత్తులు పోయినవి.) టర్కీ కోళ్ళ 'కటుక్కు' మను కంఠధ్వనులును (Lateral Sounds) కొన్ని దక్షిణ ఆఫ్రికా భాషలలో కనబడు చున్నవి. స్వరభేద మంత ముఖ్యముకాదు. 'ఒత్తుడు' (Stress) సూడానిక్ భాషలలోకంటే అభివృద్ధి చేయబడినది. రెండు వర్ణములుగల ధాతువులు విస్తారముగా ఉన్నవి. వ్యాకరణ `సంబంధమగు లింగములేదు. విభక్తి ప్రత్యయములవలని మార్పులులేవు. క్రియకు అనేకములగు వ్యుత్పత్తి రూపములున్నవి. ఇందుచే ఒక విషయమును వెల్లడించుటలో వైవిధ్యమున కవకాశము కలుగుచున్నది.

హాంబర్గర్ (Homburger) ఈ భాషలను పది వర్గములుగా విడదీసి యున్నాడు:

(1) దక్షిణ లేక గండావర్గము (2) రు ఆన్డా (Ruanda) వర్గము (3) ఈశాన్య లేక కిలిమంజార్ వర్గము (4).తూర్పుతీరపు ఉత్తరవర్గము (5) కాగురుకొండె, యాఓ మొ॥ భాషలు (6) ఆగ్నేయవర్గము (7) జులూవర్గము (8-a) మధ్యవర్గము (8-b) పడమటివర్గము (9) కాంగో వర్గము (10) వాయవ్య వర్గము.

IV సెమిటిక్ వర్గము  :- దక్షిణ అరేబియానుండి వచ్చిన వలసప్రభావముచే కాబోలు ఈ భాషలు అబిసీనియాలో మాటాడబడుచున్నవి. అబిసీనియా ప్రాచీన భాషయగు గీజ్ (geez) నశించినది. దీనినుండి ఏర్పడిన 'టైగ్రీ' (Tigre) ఎఱ్ఱసముద్ర రాష్ట్రములో మాటాడబడుచున్నది. 'ఆమ్ హారిక్' గీజ్ యొక్క నేటి కాలమునకు అవశేషముగా నున్న అబిసీనియాలోని ప్రాచీన లిఖిత భాష. ఇందుండి ఏర్పడిన రెండుభాషలు గురాగ్ (Gurague), హరార్ (Harar) అరబిక్ భాష ఈ వర్గ భాషలలో ముఖ్యమైనది. ఉత్తర ఆఫ్రికా, తూర్పు సూడాన్ భాగములందు ఇది ముఖ్యభాష. ఇస్లాం ప్రభావముచే తూర్పు ఆఫ్రికా, సూడాన్ లలో ఇది వాఙ్మయ వ్యక్తీకరణ గల భాషయై యున్నది.

V హెమిటిక్ వర్గము :- సెమిటిక్ భాషలతో తక్కిన ఆఫ్రికాభాషలకంటే ఈ వర్గభాషలు దగ్గర సంబంధమును కలిగియున్నవి. అరబిక్ భాషాజన్యములని ఈ హెమిటిక్, సెమిటిక్ భాషలు భావింపబడుచున్నవి. "హెమిటో- సెమిటిక్" అని ఈ రెండు వర్గముల యొక్కయు మూల భాష పేర్కొనబడుచున్నది. ​ ఈ క్రింది భాషలు హెమిటిక్ వర్గములో ముఖ్యమైనవి:- బెర్బర్ (ఆల్జీరియా+మొరాకో): హౌసా (Housa) (పశ్చిమ ఆఫ్రికా); తమాషెక్ (సహారాలోని టౌరగ్); గల్లా, సోమలి, దనకిల్ (Danakil) (ఉత్తర ఆఫ్రికా); నిలోటిక్. సీగ్రోలు, తూర్పు ఆఫ్రికాలోని పశు పాలకులు మాటాడు భాషలు దిన్కా, షిల్లక్, నూయర్ మొదలైనవి.

ఇవి ఈ క్రింద పేర్కొన బడిన మూడు ప్రధాన విభాగములుగా చేయబడినవి :- (1) తూర్పు హెమిటిక్ భాషలు (తూర్పు ఆఫ్రికా) (2) నిలోటో హెమిటిక్ భాషలు. (3) పశ్చిమ హెమిటిక్ భాషలు.

హెమిటిక్ భాషలు యీ క్రింది విశిష్ట లక్షణములు కలిగియున్నవి :- (1) వ్యాకరణ లింగము కల్గియుండుట ఉ౹౹ స్కిల్ (Schilb) బాష: 'ఓల్-డియా'=మగ కుక్క; 'ఎన్_డియా'= ఆడ కుక్క. నామా (Nama) భాష:'యా'=వాడు; 'టా' = ఆమె.

(2) బహువచన నిర్మాణములో వైవిధ్యము : ఉ॥ హౌసా (Housa) భాష: 'కున్నా' (=వ్రేలిగోరు); బహు వచన రూపములు; 'కున్నోబీ', 'కుమ్బువా', 'కునై బై'.

(3) లోపలి అచ్చులో మార్పు. షీల్డ్స్ (Shilh) భాష :- 'ఇలివి' (= ముల్లు); 'ఇలాన్ - ఆన్' (= ముండ్లు); 'ఆ-ఫులు* (= దారము), 'ఇ- ఫెల్-ఎన్' (= దారములు).

(4) బంటువర్గములో వలెనే షష్ఠీ విభక్తి రూపము నామవాచకమునకు తర్వాత వచ్చును.

బంటు మరియు సుడానిక్ వర్గములకు మిక్కిలి దగ్గర సంబంధము కలదు, వర్గ ప్రత్యయములే కాక, వ్యుత్పత్తి, పద ధాతువులు కూడ చాలవరకు సమానములుగా నున్నవి. రూపభేదముల నేర్పరచు 'మూలములు' ఈ రెండు వర్గములకు చాలవరకు ఒకటిగానే యున్నవి. ఒకే భాష మూలమునుండి ఇవి బయలు దేరినట్లు కనబడు చున్నది. బంటువర్గములోని ఫుల్ ఫ్ఫుల్డ్ (Fulfulde) భాషలోను, కొన్ని సుడానిక్ భాషలలోను గల నామవాచకముల వర్గ విభాగము కూడ ఇవి ఒకేభాష మూలముగా గలవని సూచించు చున్నవి.

అత్యధిక సంఖ్యాకములై యుండుటచే ఈ భాషలలో కొన్ని ముఖ్యభాషలు వర్తకము మొ॥ వాని కొరకు సామాన్య భాషలుగా అంగీకరింపబడియున్నవి. 1. బంటు వర్గములోని ఉంబందు (Umbundu) పోర్చుగీస్ పశ్చిమ ఆఫ్రికాలో (ఆంగోల్ లో) ఉపయోగించుచున్నది.

2. స్వాహిలీ (Swahilli) :- తూర్పు ఆఫ్రికాలో ఉపయోగించుచున్నది. బంటు, అరబిక్ భాషలకలయిక చే ఈ భాష ఏర్పడినది.

3. హౌసా (Housa) :- పశ్చిమాఫ్రికాలో 'సిరాలి యోన్' (Sierraleone) నుండి 'చాడ్' సరస్సువరకును ఉపయోగింప బడుచున్నది.

ఈనాడు ఆఫ్రికాలో విద్యావ్యాప్తికి ఈ దిగువ సమస్యలు పరిష్కరింప బడవలసినవిగా ఉన్నవి :- 1, ఆఫ్రికాభాష లన్నింటిలోను గల ధ్వనులను ప్రదర్శింప గల ఒక ధ్వనిమీద ఆధారపడిన లిపిని సృష్టించుట. 2. అధిక సంఖ్యాకములుగా మాటాడబడెడి భాషలకు బదులుగా కొన్ని ప్రధాన మూలభాషలను స్వీకరించుట.

లిపి  :- లిపి విషయములో ఆఫ్రికా భాషలు వెనుకబడియున్నవి. వానిలో పెక్కింటికి ముఖ్యముగా నీగ్రోభాషలకు - లిపిలేదు. నేటి ధ్వన్యనుకరణ వర్ణములు, లిపి, యూరప్ ఖండ పండితుల సృష్టియై యున్నది.

ప్రాచీనకాలము నాటివియును, ఆధునిక కాలమునాటివి యును అగు ఆఫ్రికా లిపులు ఈ దిగువ విధములుగా నున్నవి:- 1. ఈజిప్టు దేశపు హెయిరో గ్లిఫిక్స్ లేక పద చిత్రములు. 2, కాప్టిక్ (Coptic) లిపి. ఇది గ్రీక్ ఈజిప్టు భాషలలోని వర్ణముల మిశ్రమము. క్రీ. శ. 200. 400 నాటి ప్రాచీన మత గ్రంథములలో ఇది ఉపయోగింపబడెను. 3. లిబియా శాసనలిపి. 4. టిఫినాఫ్ (Tifinagh): టుఆరెగ్ (Tuareg సహారా)లో మాటాడబడు 'తమా షేక్ ' యొక్క లిపి ఇది. (5) ఆమ్హ హారిక్ లిపి ప్రాచీన సెమిటిక్ భాషయగు ఇది మధ్య అబిసీనియాలో ఆమ్ హరావద్ద రాజభాషగా క్రీ. శ. 1300 ప్రాంతము వాడబడుచుం డెడిది. (6) అరబిక్ :- ఈజిప్టులో భాషయై ఇది ఉత్తర ఆఫ్రికాలో చాలచోట్ల వాడ బడ చున్నది. (7) వై (Vai) నై బీరియాలోని ఒక నీగ్రోలియిది. 'డోలుబు కేరీ' (Doalu bukeri) (మరణము 1850) దీనిని సృష్టించెను. ​'ట్టోయా' (Njoya) అను ఒక నీగ్రో నాయకునిచే కేమరూన్స్లో నొక లిపి సృష్టింపబడెను.

జానపద వాఙ్మయము  :- ఆఫ్రికాభాషలలో ఇది సమృద్ధముగా ఉన్నది. బానిసవర్తకముద్వారా ఇది కొంత అమెరికాలోనికి దిగుమతి చేయబడెను. చరిత్రలు, వంశ క్రమవర్ణనలు, నాయకుని కుటుంబములోని ప్రత్యేకోద్యోగులచే పాటలలోని కెక్కినవి. వాద్యభాష బాగుగా అభివృద్ధి చేయబడెను. అనేకములగు మైళ్లు వార్తను పంపుటకు అనుకూలపరిస్థితులలో ఇది సమర్థమై యుండును,

సంగీతము, నాట్యము :- భాషలలోని హృదయ గత వస్తువును సూచించుటచే ఈ విషయము కొలదిగా ప్రస్తా వించుట సముచితమైయున్నది. నీగ్రోలు వాద్యములను వాయించుటలో నిపుణులు. తండ్రులు, గాలిచేమ్రోగు పరికరములు, ధ్వనిచేయు సాధనములు విరివిగా వాడబడుచున్నవి. వాద్యముల మ్రోగించుట, నాట్యము అన్ని ఉత్సవములలోను కనబడును. ఆయాకాల విశేషములను బట్టి మారుచుండు పాటలను రచించుటలో నీగ్రోలు నిపుణులు. తొలుత ఆఫ్రికాఖండపు పరిసరములకు సంబంధించిన అంశములు గేయవస్తువులై యుండెడివి.

క. రా. మా

ఆమ్లజని (Oxygen):- ఆమ్లజని రంగు, రుచి లేని వాయువు. ఇది గాలికంటె కొలది ఎక్కువ భారము కలిగియుండును. దీని విశిష్ట గురుత్వము 1.10523. ఇది నీటిలో మితముగా కరుగును. నీట కరిగిన ఈ ఆమ్లజని జలచరముల శ్వాసక్రియయందు తోడ్పడుచున్నది. దీని చిహ్నము “0”; పరమాణు సంఖ్య (atomic number) 8; పరమాణుభారము (atomic weight) 16-0000.

ఆమ్లజని అనుకూల పరిస్థితులలో ఇంచుమించు అన్ని మూలపదార్థములతో సంయోగము చెందును. కానీ పదార్ధములు పూర్తిగా పొడి (dry) గా నున్నప్పుడు ఈ రసాయన క్రియ తరుచు జరుగక పోవుటయు కలదు. ఆమ్లజని ఉదజనితో సంయోగము చెందునప్పుడు రెండు విధములయిన సమ్మేళనములు తయారగును. మొదటిది నీరు. రెండవది ఉదజని పరామ్లజనిదము (హైడ్రోజెన్ పెరాక్సైడ్). ఈ రెండవ సమ్మేళనము బేరియం వరామ్ల జనిదము (Bao,) తో నీ రసగంధకిరామ్లము చర్యవల్లను పెర్ సల్ఫేట్ల విద్యుద్విశ్లేషణమువల్లను కూడ ఏర్పడును. ఇనుము సాధారణముగా తడిగాలిలో ఆమ్లజనీకరణము చెంది తుప్పుపట్టును.

ఘనలోహములయిన (noble metals) బంగారము, ప్లాటినము తప్ప మిగిలిన లోహము లన్నియు ఆమ్లజనిలో వేడిచేయబడినపుడు ఆమ్లజనీకరణము చెందును. కరగి యున్న (molten) రజతము మాత్రము 22 ఘన ప్రమాణములు ఈ వాయువును రాసాయనిక సంయోగము చెందకయే తనలో ఇముడ్చుకొనును. ఈ దృగ్విషయమును ఒక్లూషన్ (occlusion) అందురు. ఈ ఇముడ్చు కొన్న వాయువు తిరిగి ఈ రజతము చల్లారునపుడు వెలువడును.

ఆమ్లజని విరివిగా దొరకు మూలపదార్థము. మిగిలిన మూలపదార్థము లన్నియు కలిసిన ఈ ఆమ్లజని పరిమాణమునకు సరిపోవును. గాలిలో ఆయతనమున నూటికి 21 పాళ్లు ఆమ్లజని యుండును. నీటిలో భారమున దాదాపు 90 శాతము ఆమ్లజని యుండును. భూమిలో అరమైలు లోతువరకు గల శిలాభారములో 50 శాతము ఆమ్లజని యుండును, చెట్లన్నియు కర్బనద్వి ఆమ్లజనిదము (కార్బన్ డై ఆక్సైడ్ )ను పీల్చుకొని దానిలోని కర్బనమును గ్రహించి ఆమ్లజనిని వదలి వేయును. శ్వాసక్రియకు ఈ వాయువు మూలాభారము.

తయారుచేయు విధానము - ధర్మములు : పొటాసియం హరితము ( పొటాసియం క్లోరేటు) దాని భారములో మూడవ వంతు మంగన ద్వి ఆమ్లజనిదము (మేంగనీస్ డై ఆక్సైడు)ను కలిపి వేడిచేయుట వలన ఆమ్లజని తయా రగును. మంగన ద్విఆమ్లజనిదము వియోగ సౌలభ్యమున కుపకరించును. 1886 నుండి 1906 వరకు "బ్రికా" లేక బేరియ ఆమ్లజనిద (బేరియం ఆక్సైడు) విధానముద్వార ఆమ్లజని పెద్ద మొత్తములలో తయారుచేయబడినది. బేరియ ఆమ్లజనిదమును 1000°F వరకు గాలిలో వేడిచేసిన గాలిలోని ఆమ్లజనిని గ్రహించి, ద్వి ఆమ్లజనిదముగా మారును. దీనిని 1600° F వరకు వేడిచేసిన పై గ్రహింప బడిన ఆమ్లజని వెలువడి, బేరియ అమ్లజనిదము తిరిగి ఏర్పడును. ఈ విధానము వలన 94% పరిశుభ్రత గల ఆమ్ల జనిని తయారు చేయవచ్చును.