సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్రికా
పండ్లు, కూరగాయలు, తిండిగింజలు, పండింపబడు చున్నవి. ప్రత్తి, ఇంగువ చెట్లు ఎక్కువగా పెరుగుచున్నవి. ఊలు, చర్మములు, ముఖ్యముగా కరాకులీస్ అను గొజ్జె చర్మములు ఎగుమతి చేయుచున్నారు. దేశములో కొన్ని ఖనిజములుకూడ ఉన్నవి. రాగి, ఇనుము, సీసము ఎక్కువగా దొరకునని తెలియుచున్నది. కాబూలు పట్టణములో అగ్గిపెట్టెలు, గుండీలు, చర్మము, చెప్పులు, రాళ్ళు, కుర్చీలు చేయు చిన్న చిన్న కర్మాగారాలు ఉన్నవి. కాందహారులో ఊలు ఫ్యాక్టరీ ఉన్నది. ప్రత్తి కర్మాగారాలు ఉన్నవి. ఆఫ్ఘన్ జాతీయ బ్యాంకు ఆధ్వర్యము క్రింద దేశములో జల విద్యుచ్ఛక్తి, గుడ్డలు, పంచదార, సిమెంటు, ప్రత్తి, కర్మాగారాలు నిర్మించుటకు కృషి జరుగుచున్నది. దిగుమతి సరకులలో పెక్కింటికి ప్రభుత్వానికి గుత్త హక్కు (Monopoly) ఉన్నది. వీటి పర్యవేక్షణ నిమిత్తము రియాసత్ - ఇ - ఇన్హి సారాత్ -ఇ-దౌలతీ అను పేరుగల ప్రభుత్వ గుత్త హక్కుల అభివృద్ధి సంఘమును స్థాపించి, మోటారు కారులు, పంచదార, సిగరెట్లు మొదలైనవాటిని దిగుమతి చేసికొనుచున్నారు. ఎగుమతుల విషయములో పనిచేయుటకు అనేక కంపెనీలు ప్రత్యేకముగా ఒక్కొక్క వస్తువును సేకరించి ఇతర దేశాలకు పంపుచున్నవి. నూటికి 80 వంతుల వ్యాపారము పాకిస్థానుగుండా పోవలసి ఉండును. ఆఫ్ఘను జాతీయ బ్యాంకునకు లండనులో ఒక శాఖ ఉన్నది. భారత దేశముతో వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉన్నవి. ఆఫ్ఘని స్థానములో రైళ్ళులేవు. నౌకాయానమునకు పనికివచ్చు నదులును లేవు. బరువులు మోయుటకు ఒంటెలను, గుఱ్ఱములను దేశీయులు ఇప్పటికిని ఉపయోగించుచున్నారు. మోటారు రవాణా విధానము క్రమముగా వృద్ధిచెందుచున్నది. సుమారు 6,000 మైళ్ళ రోడ్లుం మోటారు రవాణాకు తగినవిగా నున్నవి.
డి. వి. కె.
ఆఫ్రికా :- సరిహద్దులు: ఆఫ్రికాఖండము 37½° ఉత్తర అక్షాంశమునుండి 35° దక్షిణ అక్షాంశము వరకును, 17॰ పశ్చిమ రేఖాంశమునుండి, 50½° తూర్పు రేఖాంశమువరకును వ్యాపించియున్నది. దీని వైశాల్యము 1,12,62,000 చ.మై. ఇది కాక 2,39,000 చ.మైళ్ళు వైశాల్యముకల ద్వీపము ఒకటి ఈ ఖండములోనున్నది. వైశాల్యమునందు ఈ ఖండము హిందూదేశమునకు సుమారు ఆరు రెట్లున్నది. ట్యునీసియాలోని కేప్ బాన్ నుండి కేవ్ అగలస్ వరకు ఉత్తర, దక్షిణములుగా దీని పొడవు 5000 మైళ్ళు. అదేవిధముగా పడమరనున్న కేవ్ వెర్ట్ నుండి తూర్పున నున్న గార్డిఫ్యూ వరకు దీని పొడవు 4600 మైళ్లు. ముఖ్యమైన విషయమేమన, ఈ ఖండము భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణములందు సమముగా వ్యాపించియుండుట. అందువలన ఉత్తర దక్షిణ ఆఫ్రికాల శీతోష్ణమండలములందు, మరియు అనేక ఇతర విషయములయందు చాల పోలికలు కానవచ్చును. ఈ ఖండము యొక్క విశేషభాగము కర్కాటక మకర రేఖల మధ్యనుండుట గమనింపదగినది.
మధ్యధరా సముద్ర ముత్తరమునను, ఎఱ్ఱ సముద్ర మీశాన్యమునను, హిందూమహాసముద్రము తూర్పుదక్షిణములను, అట్లాంటిక్ మహాసముద్రము పడమరను కలిగియుండుటచే నీ ఖండము ద్వీపఖండమనవచ్చును,
ఫ్రెంచి భూమధ్య రేఖాగత ఆఫ్రికావంటి గినీసింధు శాఖయు, అంగోలా రాష్ట్రమునంటి లోబిటో అఖాతమును, డెలగోవా అఖాతమును ఈ ఖండమునందు పేర్కొనదగిన సముద్ర వ్యాపనములు. ఈ ఖండపు సముద్రతీరము సరళమై 19,000 మై. పొడవు కలిగి యున్నది.
మెడగాస్కరు ద్వీపము మొజాంబిక్ విస్తృత జల సంధిచే భూఖండమునుండి వేరుచేయబడినది. హిందూ మహా సముద్రము లోనికి చొచ్చుకొనివచ్చి కొమ్మువలె కనపడు భాగమును ఆఫ్రికా శృంగము అని అందురు.
నైసర్గికస్వరూపము :- ఆఫ్రికాఖండము 2000 అ. సరాసరి యెత్తుగల పీఠభూమి. దీనిని రెండు ముఖ్యమైన భాగములుగా విభజింపవచ్చును. 1. పీఠభూమి 2 తీరపు మైదానము. పర్వతము అని పిలువబడునవి పీఠభూమి యొక్క నిట్రమైన అంచులే. కాని వీనియందు ముఖ్యమయిన పర్వత శిఖరము లున్నవి. ఈ పీఠభూమి పడమరగా వాలి యున్నది.
మొరాకో, ఆల్జీరియా, ట్యునీసియా రాష్ట్రములలో 1500 మై. వ్యాపించి సరాసరిని 11,000 అ. ఎత్తుగల
అట్లాసు పర్వతములు ఉత్తరాఫ్రికాలో ముఖ్యమయిన పర్వతపంక్తులు. ఉత్తరమునుండి దక్షిణముగా నీ పర్వతశ్రేణులకు టెల్ అట్లాసు, గ్రేట్ అట్లాసు, సహారన్ అట్లాసు అను పేర్లు కలవు. అట్లాంటిక్ తీరమునుండి నైలునదివరకు పల్లపు పీఠభూమి వ్యాపించియున్నది. దీని మధ్యభాగమున టిబెస్టి పర్వత పంక్తులు కలవు,
ఉన్నత పీఠభూమి పూర్తిగా దక్షిణ ఆఫ్రికాలోనే కలదు. పడమరనుండి తూర్పునకు దీని ఎత్తు క్రమముగా నెక్కు వగును. హై వెల్దు, లోవెల్డు అను రెండు మెట్లుగా. ఈ పీఠభూమి తూర్పు అంచు తీరపు మైదానమునకు దిగుచున్నది. వీనినే కేవ్ కాలనీలో గ్రేట్ కారూ, లిటిల్ కారూ అని పిలిచెదరు. ఈ పీఠభూమియొక్క ఎత్తైన అంచులనే నేటాలు రాష్ట్రములో డ్రాకెన్సు బర్గు అని అందురు.
ముఖ్యమయిన పర్వత శిఖరములన్నియు ఆఫ్రికా తూర్పుననే యున్నవి.——మనెన్ జోలి (16,800 అ.); కెన్యా (17.040 అ.); నిరంతరము మంచుతోనుండు కిలిమంజారో (19,321 అ.). సముద్రతీరమున మాత్రమే పల్లపు మైదానము లున్నవి.
ఎడారులు :- ఉత్తర ఆఫ్రికాలో 35,00,000 చ.మై వ్యాపించిన సహారా ఎడారి కలదు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రములకన్నను కొద్దిగా పెద్దది. తూర్పు పడమరలుగా దీని పొడవు 3,200 మై. ఉత్తర దక్షిణములుగా దీని వెడల్పు 800 మై. నుండి 1,400 మై. వరకు కలదు. సామాన్యముగా మనము భావించునట్లు సహారా ఎడారి యంతయు పనికి రాని ఇనుకబీడు కాదు. పశ్చిమ సహారా యొక్క మధ్యభాగములో 6,000 అడుగుల ఎత్తుగల శిఖరములతో నిండిన ఆయిర్, హాగర్' పర్వతములు గలవు. టిబెస్టి పర్వతపంక్తిలో 9,000 అ, ఎత్తు. గల ఉడిగిన అగ్ని పర్వతములు కలవు. మరియు బిల్నా వంటి సహజ సరస్సులు ఈ ఎడారిలో కలవు. ఈ సరస్సుల చుట్టును వృక్షజాలమును, జంతు జాలమును కాననగును. ఫలవృక్షములు పెంచబడును. బావుల నుండి నీటిని పారించి వ్యవసాయముకూడ చేయుదురు.
ఆఫ్రికా నైరుతి భాగముననున్న కల్ హరి ఎడారి సహారా అంత పెద్దదికాకపోయినను పేర్కొనతగినది.
సరస్సులు :- తూర్పుననున్న పర్వత శ్రేణులయందలి చీలికలోయ (Rift valley) అని పిలువబడు పల్లపు ప్రాంతమున గొప్ప సరస్సులు ఉత్తర దక్షిణములుగా వ్యాపించియున్నవి. ఈ క్రింద పేర్కొనబడినవి ముఖ్యమైన సరస్సులు.
(క) విక్టోరియా న్యాంజా: వైశాల్యము 26,000 చ. మై, పొడవు 250 మై.,వెడల్పు 200 మై. లోతు 270 అ,
(ఖ) టాంగనీకా సరస్సు: వైశాల్యము 12,700 చ. మై., పొడవు 450 మై.. వెడల్పు 40 మై., లోతు 4,708 అ.
(గ) న్యాసా సరస్సు : వైశాల్యము 11,000 చ.మై. పొడవు 350 మై., వెడల్పు 45 మై.,
(ఘ) కిపూ సరస్సు: వైశాల్యము ---చ. మై.. పొడవు 50 మై., వెడల్పు 30 మై..
(చ) టానా సరస్సు : ఇది 5,690 అ. ఎత్తున అబిసీనియా పీఠభూమి యొక్క ఉత్తరభాగమునకలదు. నైలునదికి ఈ సరస్సు మూలజలములుగా నుపయోగపడుచున్నది.
(ఛ) రుడాల్ఫు సరస్సు : వైశాల్యము 3, 475చ. మై, పొడవు 185 మై. వెడల్పు 37 మై.
(జ) షాడ్, బంగ్ వలూ సరస్సులు : ఇవి మధ్య ఆఫ్రికా యొక్క ఈశాన్య నైరుతి భాగములయందు గలవు. వీటి నీరు ఋతువుల ననుసరించి సంకోచ వ్యాకోచములను చెందుచుండును.
నదులు : ఆఫ్రికా ఖండమునందలి నదులు పెద్దవై నను జలపాతములవలనను అచ్చటి ప్రజల అనాగరికత వలనను అంతగా నుపయోగము లేనివిగానున్నవి. ఈ నదులవలన కొన్ని ప్రాంతములకు వాహన సౌకర్యములు కలుగు చున్నవి. నైలునదికి నాలుగు పెద్ద జలపాతములుకలవు, నైగరునదికి వేగముగల బూసా ఝరులు, కాంగో జాంబెసీ నదులకు ఎల్లాలా, విక్టోరియా జలపాతములు కలవు. వీనిలో కొన్ని 420. అ. ఎత్తుకూడ కలిగి యున్నవి. ముఖ్యమైనవి 5 నదులు :
1. నైలునది : (4,000 మైళ్ళు): ఇది ఉత్తరముగా ప్రవహించి, మధ్యధరాసముద్రములో కలియుచున్నది. ఇది చాల ప్రాముఖ్యమైనది. ఏలయన, ఈజిప్టులో కెల్ల పురాతన నాగరకత గల ప్రాంతముగుండా ప్రవహించు చున్నది.
2. కాంగో (3,000 మై.) :- ఇది దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రములో కలియుచున్నది. దీనికి నదీ పరీవాహ ప్రదేశము చాల ఎక్కువ. దీనియందు నైల్ నదిలో కంటే ఎక్కువ పరిమాణముకల నీరు కలదు. ఉపనదులతో సహా యిది మధ్య ఆఫ్రికా కంతకును వాహన సౌకర్యములను కలిగించుచున్నది.
3. నైజర్ (2,600 మై.) :- ఇది చెన్వీ యను ఉప నదితో సహా దక్షిణముగా ప్రవహించి గినీ సింధుశాఖలో పడుచున్నది.
4. జాంబేజీ (1,600 మై.) :- ఇది తూర్పు దిశగా ప్రవహించి మొజంబక్ చానలులో కలియు చున్నది. తూర్పుదిశగా ప్రవహించి డిలాగో అఖాతములో కలియు లింపునదియు, ఈ నదియు కూడ ఎక్కువభాగము ఆఫ్రికా ఈ శాన్య భాగమున ప్రవహించుచున్నవి.
5. ఆరెంజ్ (1,300 మై.) :- ఇది పడమరగా ప్రవహించి ఆఫ్రికా ఆగ్నేయ భాగమున అట్లాంటిక్ మహా సముద్రములో కలియుచున్నది.
ఇవికాక సెనిగల్ అను పేరుగల నది ఫ్రెంచి వెస్టు ఆఫ్రికాగుండా ప్రవహించుచున్నది. కాని యిది అంత ప్రాముఖ్యమైనది కాదు.
శీతోష్ణస్థితి :- ఆఫ్రికాలో ఉష్ణోగ్రతా వ్యాపనము సాధారణ విషయముగా కనబడును. ఋతువుల ననుసరించి సమోష్ణ రేఖలు ఉత్తరమునకును, దక్షిణమునకును సూర్యునిగతి క్రమము ననుసరించి చలించుచుండును, వేసవిలోను, శీతాకాలమందును సమోష్ణరేఖలు తూర్పు పడమరలుగా వ్యాపించి, ఉత్తర దక్షిణము వైపున క్రమక్రమముగా ఉష్ణోగ్రతలో మార్పు సూచించుచుండును మన శీత కాలములో మధ్యధరా సముద్రపు ఉత్తర ప్రాంతపు ఉష్ణోగ్రత 50° ఫా. నుండి 60° ఫా. మధ్య నుండును. కాని దక్షిణతీర ప్రాంతపు ఉష్ణోగ్రత దీనికంటే కొంత అధికముగా నుండును. దక్షిణాఫ్రికా పీఠభూమి యొక్క మధ్యభాగములో అత్యధిక ఉష్ణోగ్రత ఉండును. ఔన్నత్యము ననుసరించియు, సముద్ర సామీప్యమును బట్టియు ఉష్ణోగ్రత మార్పుచెందు చుండును. ఈ విధముగా దక్షిణాఫ్రికాలో చాలదగ్గరలోనే ఉష్ణోగ్రతలందు ఎక్కువ మార్పు కనబడుచుండును,
వేసవిలో ఉత్తరాఫ్రికా శీతోష్ణస్థితి దీనికి విరుద్ధముగా నుండును. అత్యధిక ఉష్ణతా మండలములు సహారా ఎడారి వైపునకు కదలును. దక్షిణతీర ప్రాంతములందు 50°-60° ఫా. ఉండుటవలన సుఖముగా నుండును. మధ్యధరా తీర ప్రాంత మందు అధిక ఉష్ణోగ్రత ఉండును.
పవనములు :-సూర్యగమనముతోపాటు ఉత్తరదక్షిణ దిక్కులకు చరించు భూమధ్య రేఖ యందలి అల్పపీడన మండలముల యొక్కయు, కర్కట మకర రేఖల దాటి యుండు అధిక పీడన మండలముల యొక్కయు, ప్రాబల్యము ఈ భూఖండముపై ఎక్కువగా నుండును. అట్లాంటిక్ సముద్రమందలి అధిక పీడన ప్రదేశము లన్నియు శీతకాలములో ఉత్తర దిశయందును, అజోర్స్ యొక్క అధిక పీడన ప్రదేశము సహారా శీతల ప్రాంతమందును ఉండును. కాని భూమధ్య రేఖమీది అల్పపీడన ప్రాంతము దక్షిణదిశగా కదలును.
ఉత్తరార్ధగోళపు వేసవిలో అల్పపీడనముకల ప్రదేశములు ఉష్ణముగానున్న సహారా ఎడారి యంతయ వ్యాపించును. ఇప్పుడు ఉత్తరదిశకు మారెడు మకర రేఖా అధిక పీడన మండలము యొక్క ప్రాబల్యము దక్షిణ ఆఫ్రికాకు ఎక్కువగా నుండును. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమునకంతకును హిందూ మహాసముద్రము యొక్క సుగ్రాహ్యముకాని ఋతుపవనముల ప్రాబల్యము ఎక్కువగా నుండును. ఈ క్రింద నుదహరించిన వాయు ప్రవాహములు ఖండమంతటను వ్యాపించి యుండును.
1. అజోర్సు అధికపీడన మండలమునుండి వెడలు అట్లాంటిక్ ఈశాన్య పవనములు నైరృతి దిశగా వీచును
2. సహారా ఎడారియందలి అధిక పీడన మండలముల నుండి హర్మట్టన్ అనబడు గాలులు సూడాన్ మీదుగా పశ్చిమ ఆఫ్రికా వైపునకు వీచును.
8. ఈజిప్టుదేశపు వాయు ప్రవాహములు నైలులోయ వరకు వీచి, భూఖండములో చాలదూరము పోవును.
4. నైరృతి ఆసియా అధికపీడన మండలమునుండి హిందూస్థానపు ఈశాన్య వ్యాపార పవనములు వీచును 5. మధ్యధరా సముద్రమందు మహా చక్రవాత నిర్మితమగు అల్పపీడనములును, ఉన్నత పీడనములును కలుగు చుండును.
6. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రపు అధిక పీడన ప్రాంతముల నుండి భూమధ్య రేఖ వైపు అట్లాంటిక్ ఆగ్నేయ వ్యాపార పవనములు వీచును.
7. ఉత్త రార్ధపు గోళపు వేసవిలో “గర్జించు నలు బదులు" (వాయువ్య ప్రతికూల వ్యాపార పవనములు) ఆఫ్రికాలో దక్షిణ భాగములందు వీచును.
8. హిందూ మహాసముద్రమునుండి బయలుదేరు ఆగ్నేయ వ్యాపార పవనములు ఈ భూఖండము యొక్క ఆగ్నేయ ప్రాంతమున వీచును.
9. ఉత్తర ఖండపు వేసవిలో అట్లాంటిక్ ఆగ్నేయ వ్యాపార పవనములు భూమధ్యరేఖను దాటిన తరువాత ఆఫ్రికా పడమటి భాగపు వైపునకు వంగి నైరృతి ఋతపవనములుగా వీచును.
ఆఫ్రికా శీతోష్ణస్థితిలో ముఖ్యముగా గమనించవలసిన విషయములు:- 1. భూఖండమునకు మార్పులు తెచ్చెడు శీతల వాయురాసులు లేవు. 2. మహాసముద్ర ప్రవాహముల వలన తీరప్రాంతములందు శీతోష్ణస్థితి మార్పుచెంది అధికముగ ప్రభావితమై ఉండును.
వర్షపాఠము :- ఈ భూఖండమందు మంచి వర్షపాతముగల ప్రాంతములు మూడు కలవు. 1. ఆగ్నేయ ప్రాంతము. 2. అట్లాస్ మండలము. 3. బెల్జియం కాంగో అనునవి ఆప్రాంతములు.
హిందూ మహాసముద్రమునుండి బయలుదేరు పవనములు పీఠభూమియొక్క అత్యున్నతమైన అంచునుండి పైకెగయును. ఈవిధముగా భూమధ్యరేఖకు దక్షిణవైపు నున్న తూర్పుతీర ప్రాంతమందు వర్ష మెక్కువగా నుండును. కాని ఖండాంతర్భాగమున పొడిగానుండును. మధ్యధరా చక్రవాతములు అట్లాస్ పర్వతశ్రేణి వలన ఆపుచేయబడినపుడు వాయవ్యతీర ప్రాంతమునకు శీతకాలములో వర్షమునిచ్చును. అదేవిధముగా “గర్జించు నలు బదులు" (వాయువ్య ప్రతికూల వ్యాపార వవనములు) వలన శీతకాలములో కేప్ కాలనీకి వర్షము కలుగును. గినీ సింధుశాఖలోనికి ప్రవహించు భూమధ్య ప్రతిసముద్ర ప్రవాహము మంచుతోకూడిన తీర వాయువులకు సహాయ పడును. తత్ఫలితముగా బెల్జియన్ కాంగో ప్రాంతమందును, ఫ్రెంచివారి భూమధ్యరేఖా ప్రాంత మందును, పశ్చిమతీర ప్రాంతమందును వర్ష మెక్కువగా కురియును. దక్షిణముగా ప్రవహించి "డిలాగో" అఖాతములో పడు మొజంబక్ ప్రవాహముల వలన చల్లని, వెచ్చని తీరువాయువులు ఉద్భవించును. ఈ వాయువుచే భూమధ్యరేఖకు దక్షిణమువైపుననున్న తూర్పు తీర ప్రాంతమునకు వర్షము లభింపచేయును.
ఉత్తరాఫ్రికా పశ్చిమతీరమందలి కేనరీస్ (Canaries) ప్రవాహములు తరచుగా సంభవించు పొగమంచులకు తీర వాయువులకు కారణములు, దీని మూలకముగా ఇచ్చట తీరప్రాంతములు పొడిగా నుండును. ఉత్తరముగా ప్రవహించు బెంగూలా (Benguela) శీతలజల ప్రవాహములవలన ఆఫ్రికా నైరృతి ప్రాంతమందు కూడ ఈ విధమైన వాతావరణ పరిస్థితులే యుండును. భూమధ్య రేఖకు ఉత్తరపువైపున నున్న తూర్పుతీరము పొడవునను ఈశాన్య నైరృతి ఋతుపవనములును, సముద్ర ప్రవాహములును ప్రభావము కలిగినవై యున్నవి. ఇవి ఆయా ఋతువుల యందు వాటి కనుకూలముగా నుండును. ఈశాన్య ఋతుపవనములు. చల్లని పొడిగాలిని తెచ్చును. ఇక నైరృతి ఋతువవనములు తీరవాయువులను కలిగించును. కాబట్టి భూమధ్యరేఖ కుత్తరవు వైపుననున్న తూర్పుతీర ప్రాంత మంతయు పొడిగా నుండును.
మొత్తముమీద ఆఫ్రికాలో వర్షపాతము నిలుకడగా నుండదు. ప్రతి సంవత్సరము భేదించుచుండును. క్రమ పరిమాణముతో వేర్వేరు విధములగు శీతోష్ణస్థితు లేర్పడును, అయితే పొడిగానుండు ఉత్తర యీశాన్యముల మధ్యభాగము లందును, తడిగానుండు ఆగ్నేయ, ఆఫ్రికా ఉష్ణమండల మధ్యభాగముల యందును ఈ విభేదములు అత్యధికముగ గనపడుచుండును. ఉష్ణాత్మకమగు శీతోష్ణస్థితి కలిగియుండుటయే ఆఫ్రికా యొక్క ప్రత్యేక విలక్షణత్వము.
నేలలు :- 1. భూమధ్య రేఖా ప్రాంతపు నేలలు, ఉష్ణమండల ప్రాంతపు నేలలు, ఆఫ్రికాలో భూమధ్య రేఖ పొడవునను, ఉష్ణమండలములోని తేమప్రాంతము లందును కలవు. ఇచటి నేలలు ఎఱ్ఱగ నుండును.
2. మధ్యధరా శీతోష్ణస్థితియున్న ప్రాంతమందు మధ్యధరా ప్రాంతమునకు సహజమైన నేలలు కనబడును. అగ్ర (cape) ప్రాంతమందును, అట్లాస్ ప్రాంతములోని తేమప్రదేశములందును గోధుమ రంగుగల నేలలు కనబడును. కాని దక్షిణముగా వీని నానుకొనియున్న ప్రాంతము లందును, మొరాకో మైదానములందును బాదముకాయ రంగుగల నేలలు కలవు.
3. నేటాలులోని నేలలు తేమగానుండు సమశీతోష్ణ మండల సముద్రతీర ప్రాంతముల నేలలలో ప్రత్యేకత కలిగినవి.
4. దక్షిణ ట్రాన్సువాల్ రాష్ట్రమందు ఆరెంజి. ఫ్రీస్టేటులోని హైవెల్డు ప్రాంతమందును గడ్డిమైదానపు పీఠభూములకు సంబంధించిన నల్లరేగడి నేలలు కలవు. ఛెర్నోజమ్సు (Cheraozems) సమూహమునకు సంబంధించిన లేతవర్ణపు నేలలు ఆఫ్రికా పీఠభూమియందలి ఎత్తైన ప్రాంతములందు కానబడును.
స్వాభావిక వృక్షములు :- అరణ్యములు, ఉష్ణమండల గడ్డిమైదానములు లేక సెవన్నాలు, ఎడారులు అను మూడు భాగములుగా ఆఫ్రికాఖండపు సహజ ఉద్భిజ్జజాలమును విభజించవచ్చును. ఇవి వరుసగా ఆఫ్రికా ఖండములో 1/5, 2/5, 2/5 భాగములు ఆక్రమించియున్నవి. కాని సెవన్నాలను ఆఫ్రి కాఉద్భిజ్జజాలమునకు మచ్చుగా భావింప వచ్చును. మిగిలిన విభాగములు ఈ క్రింద నీయబడుచున్నవి:-
1. భూమధ్యరేఖా ప్రాంతమందలి వర్షపుటడవులు- ఇవి బెల్జియం కాంగో రాష్ట్రమందును, ఫ్రెంచి, ఆఫ్రికా అక్షరేఖా రాష్ట్రమందును, ఆఫ్రికాలో ఎక్కువగా వర్షముపడు పశ్చిమ ప్రాంతమందును కలవు.
2. సమశీతోష్ణ వర్షపుటడవులు :-ఇథియోపియా పీఠభూమి యందును, సర్వతశ్రేణుల యొక్క తూర్పు మధ్యభాగము లందును కలవు.
3. ఓక్-కోనిఫర్ వనములు :- మొరాకో, అల్జీరియా ట్యునీసియా రాష్ట్రములందు కలవు.
4. పొడివనములు :- ఉష్ణమండల కాలమానము గల ప్రాంతములందు కలవు.
5. కంటకారణ్యములు :- ఉష్ణమండల కాలమానము గల ప్రాంతముల యొక్క పొడి ప్రదేశములందు కలవు.
6. సమశీతోష్ణపు చిట్టడవులు :- అగ్ర (Cape) రాష్ట్రమునందును, ఉత్తరాఫ్రికా మధ్యధరా ప్రాంతమందును కలవు.
7. సముద్ర తీరపుటడవులు: ఇవి సముద్రపు నీటి పాటుపోటులు కలిగిన ప్రాంతములందు ముఖ్యముగా నదీముఖ ప్రాంతములందు కలవు.
8. ఉష్ణమండల గడ్డిమైదానములు లేక సెవన్నాలు :- ఉష్ణమండల ప్రాంతారణ్యముల సరిహద్దులందలి 35 అం. నుండి 60 అంగుళముల వర్షము కురియుచోట్ల యందు గలవు.
9. పర్వతపు పచ్చికమైదానములు, లేక ఆల్ పైన్ మైదానములు :- మధ్య ఆఫ్రికాలోని కెన్యా రాష్ట్ర మందలి ఎత్తైన పర్వత ప్రాంతమందును, ఇథియోపియా పీఠభూమియందును కలవు.
10. చిత్తడి నేలల గడ్డిమైదానములు :- తూర్పు ఆఫ్రికా ప్రాంతములందును, నైలునది ఎగువ ప్రాంతము లందున కలవు.
11. ఉప - ఎడారులు:- ఇవి సెవన్నానుండి ఎడారి రూపమునకు మార్పు చెందుటలో ఒక పరిణామదశ వెల్దుల యొక్క మెరక భాగములయందు కలవు.
12. ఎడారి :- నిరర్థకమైన ఇసుకతలము, శిలాతలము. బురదతలము కలిగి మృగపక్షి వృక్ష విరహితమైన అచ్చపు ఎడారి ఈ ఖండమునందు 8 శాతము మేర ఆక్రమించియున్నది.
ఖనిజములు :- బెల్జియం కాంగో నుండి ఉత్తరరోషియాలోనికి నైరృతి దిక్కు నుండి ఈ శాన్యముగా వ్యాపించుచు, సుమారు 200 మైళ్ళ పొడవున అత్యధిముగ రాగి ఉత్పత్తిగల ప్రదేశమున్నది. ఈ ప్రాంతమందు రేడియం, కోబాల్టు, లోహములు గూడ ప్రపంచములో కెల్ల ఎక్కువగా గనులనుండి లభించుచున్నవి. ప్రపంచములో లభించు మాంగనీసులో ఐదవవంతు గోల్డుకో రాష్ట్రములో దొరకును, మొరాకో, అల్జీరియా, టు సియా రాష్ట్రములందు ఇనుము లభించుచున్నది. ప్రపంచములో నుత్పత్తియగు రాగిలో ఆరవ భాగము ఆఫ్రికానుండియే లభించును. ట్రాన్స్ వాల్ రాష్ట్రమందును, జోహంస్ బర్గ్ దగ్గరనున్న రాండ్ అను ప్రాంతములోను కేవ్ రాష్ట్రమునందలి కింబర్లీ ప్రాంతమందును వజ్రపు గనులు పనిచేయుచున్నవి. డ్రాకెన్స్బర్గ్ యొక్క తూర్పు, పడమర తట్టులయందు బొగ్గు లభించును. ఇవిగాక ఆఫ్రికా ఖండమందు స్ఫురితములు, రేడియం పదార్థము, క్రోమియం, ప్లాటినమ్, తగరము, పుష్కలముగా లభించును కాని యీ ఖండమందు బొగ్గు, పెట్రోల్, సీసము, తుత్తునాగమును సరిపడునంతగా లేవు.
7. జనాభా- ఆదిమవాసులు :- ఆఫ్రికాలోని జనుల నిరక్షరాస్యత వలనను, అనాగరికతవలనను ఇందలి జనాభా సంఖ్యనుగూర్చి మదింపు చేయుట కష్టము. కాని 1950లో ఈ ఖండమునందు 15 కోట్ల జనాభా యుండి యుండవచ్చును. జనసాంద్రతలో ప్రదేశములను బట్టి చాల తేడాలు కలవు; ఉదాహరణమునకు ఈజిప్టు నందలి కొన్ని ప్రాంతములందు చదరపు మైలునకు 1750 జనాభా కలదు. ఎడారులలో కొన్ని ప్రాంతములందు ఒక్కరునూ లేరు.
ఆదిమవాసుల తెగలు యీ క్రింద నీయబడినవి.
1. ఇథియోపియా, సోమలీలేండ్, సూడాన్, కెన్యా రాష్ట్రములందలి తూర్పు భాగములలోను, పశ్చిమ ఆఫ్రికా యందలి కొన్ని ప్రాంతము లందును, హె మైటిస్ అను ఆదిమవాసులు కలరు.
2. సెమైటిస్ అను తెగవారు ఉత్తరాఫ్రికా, తూర్పు ఆఫ్రికాలలో కలరు,
3. భూమధ్యరేఖ కుత్తరమున పశ్చిమ తీరమునుండి సూడాన్ దేశమువరకును గల మధ్య ఆఫ్రికాలో సూడాన్ భాష మాట్లాడు నీగ్రో జాతి ప్రజలు కలరు.
4. దక్షిణ ఆఫ్రికా యందంతటను, మెడగాస్కర్ ద్వీపమునందలి పశ్చిమ ప్రాంతమందును బంటూ భాష మాట్లాడు నీగ్రోలు కలరు.
5. నైరృతి ఆఫ్రికాయందు “బుష్మెన్" హాటెన్ టాట్ అను తెగలవారు నివసించుచున్నారు.
6. బెల్జియన్ కాంగో యొక్క ఈశాన్య ప్రాంత మందు "పిగ్మీన్" అను తెగవారు అక్కడక్కడ కలరు.
8. ఆఫ్రికా జనుల సంస్కృతి :- పరిసరములలో ప్రతిఫలించు సాంఘి కార్థికాభివృద్ధి అవకాశముల విషయమున ఆఫ్రికాలో ప్రదేశమునుండి ప్రదేశమునకు ముఖ్యములైన వ్యత్యాసములు కనిపించుచున్నవి. మిక్కిలి వేగముగా నభివృద్ధిచెందిన సాంస్కృతిక ప్రదేశములు కొన్నియు, ఎట్టిమార్పునులేక స్థిరముగా ఉండి పోయిన ప్రదేశములు కొన్నియు గోచరించును.
నైలునది లోయ నీగ్రో ప్రభావమేమియును లేక ప్రత్యేక ఔన్నత్యమును చెందిన హెమిటిక్ సెమిటిక్ సంస్కృతినందిన ప్రదేశము. ఈ సంస్కృతి 6,000 సంవత్సరములనుండి వ్యాపించియున్నది. ఆదినుండియు పారసీక, గ్రీకు, రోమను, అరబ్బుల దండయాత్రల సారాంశమును గ్రహించి పెక్కు మార్పులతో రూపొందినది ఈజిప్టు సంస్కృతి.
ఇప్పుడు 'బెర్బరులు'అని పిలువబడు ఉత్తర హై మైట్సు ప్రదేశము ప్రత్యేక మైన సంస్కృతికి నెలవైనట్టిది. అచ్చట ఫోనీషి యనులయు, ఈజిప్టు దేశీయులయు, అరబ్ మహమ్మదీయులయు ప్రభావము కనబడుచున్నది.
పశ్చిమ మధ్య ఆఫ్రికాల (నడుమయందలి) అరణ్య ప్రదేశమున మిక్కిలిపరిణితమైన దేశీయసంస్కృతి విలసిల్లు చున్నది. వ్యవసాయము, మతము, గారడీ, వివిధ సాంఘిక ఆచారములు, ఇత్తడి, ఇనుపపరులు, అందమైన కుండలు ఈ ప్రదేశమునకు ప్రత్యేక ప్రాధాన్యము కూర్చుచున్నవి.
సగము ఎడారిగను, సగము అరణ్యముగను ఉన్న ఆఫ్రికా తూర్పుభాగమున నివసించు మనై, నందిజాతులకు పశుపాలనమే ప్రధానవృత్తి. ఈ సంస్కృతికి పార్కులాండు సంస్కృతి అని పేరు.
పై ప్రదేశములందలి సంస్కృతికి భిన్నములై ఈ క్రింది ప్రాచీన సంస్కృతులు కూడ గోచరించుచున్నవి.
ఎడారికిని, అరణ్యమునకును నడుమనున్న బహిరంగ ప్రదేశమున పశువులను, మేకలను, గొట్టెలను, గుఱ్ఱములను కలిగియుండు సంచారజీవులు కనబడుచున్నారు. ఈ సంస్కృతికి "గోపాల సంస్కృతి" (Pastoral culture) అని పేరు.
లిబియా ఓయాసిస్సులలోని టారెగు, టేబు, ఆరబుల సంస్కృతిని సహారాలోని ఒంటెలను మేపువారి సంస్కృతి అని చెప్పనగును. దక్షిణ ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో గుల్మనివాసుల (Bush men) మృగయా సంస్కృతి (Hunting culture) వ్యాపించి ఉన్నది. వీరు వింటితోను, విషబాణములతోను వేటాడుదురు.
ఆఫ్రికా పలు దేశములందు పలువిధము లైన సాంఘిక వర్తనములను అవలంబించు నీగ్రోలకు నివాసము. వారందరును ఉత్తమ మార్దంగికులుగా ఖ్యాతికెక్కి యున్నారు. వారు తంత్రులతో కూడిన సాధనములను, గాలి సాధనములనుకూడ తయారుచేసి వానిపై పాడగలరు. అన్ని కర్మకలాపములందును మృదంగమును, నృత్యమును అపరిహార్యములై యుండును. వారి మానసిక పరిణామములో వెనుక నెవ్వరు నందీయకుండ కొన్ని విషయములకు సంబంధించిన గేయములను పాడజాలుట మిక్కిలి ఎన్నదగిన అంశము. అచ్చటి దేశీయ జనులు అడవులలో సమృద్ధమైన జీవితమును గడుపుదురు. ఆ అడవులలో ఏనుగులు, లేళ్ళు, జిరాఫీలు, హిప్పొపోటమసులు నీటి గుఱ్ఱములు ఖడ్గమృగములు, సింహములు, చిరుతపులులు, హయనాలు, సివంగులు విస్తారముగా ఉండును. అచ్చటి జాతులవారికి ఈమృగములవలన ఆర్థిక ప్రయోజనము కలదు. వారి పురాణ గాథలు, జానపద గేయములు సామెతలు మున్నగునవి సహజముగా వన్యమృగముల జీవితముచే ప్రభావితములై ఉన్నవి.
ఆఫ్రికాలోని భాషలు పెక్కింటికి లిపులులేవు. ఆఫ్రికా భాషలకు చిహ్నములైన అక్షరములను యూరోపియనులు ముఖ్యముగా పండితులును, పరిశోధకులును ప్రవేశ పెట్టి యుండిరి. ఈజిప్టునందును, ఉత్తర ఆఫ్రికాలోని పలు భాగములందును అరబిక్ ఆధికారిక మైన భాష; క్రీ. శ. 1300 నుండి అబిస్సీనియాలో “అమ్ హెరిక్ అధికార భాష, ఈజిప్టు నందలి పద చిత్రములకు (Wood pictures) చారిత్రక ప్రాధాన్య మున్నది. గ్రీకు ఈజిప్టు అక్షరముల కలయికతో కూడిన కాప్టిక్ లిపిలో క్రీ.శ. 200-400 లకు నడుమ పురాతన మత గ్రంథములు వ్రాయబడినవి. టిఫినాగు అనువారు అంత ముఖ్యులు కాకపోయినను ప్రాచీన జనులలో ఎన్నదగినవారు. వారు నైబీరియాలోని ఒకజాతి భాషయైన 'తమాషెకు' ను 160 అక్షరములతో కూడిన లైబీరియాలోని 'వై' అను నీగ్రో లిపిని వ్రాయుచుండిరి.
ఆఫ్రికా పరిశోధనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన తేదీ లీ క్రింద ఈయబడుచున్నవి.
క్రీ. పూ. 500 హన్నో అను కార్తజీనియను కార్తేజీ నుండి ఆఫ్రికా పడమటితీరము చుట్టు తిరిగి నీరాలియోన్ అను ప్రదేశమునకు అరిగెను. . క్రీ.శ. 60 తూర్పు తీరము అరబ్ వర్తకులచే పరిశోధింపబడెను. నీరో శత సేనానులచే నైలునదీ ప్రదేశము పరిశోధింప బడెను.
క్రీ. శ. 1419 గినీ సింధుశాఖలోని చిన్న ద్వీపములను, మరిరాద్వీపములను పోర్చుగీసువారు కనుగొనిరి.
క్రీ. శ. 1487 బార్దలోమియో డయాస్ గుడ్ హోవ్ అగ్రమును చుట్టివచ్చెను. కాని ఇండియా చేరలేక పోయెను.
క్రీ. శ. 1497 వాస్కోడిగామా గుడ్ హోప్ అగ్రమును చుట్టివచ్చి ఇండియాను చేరగలిగెను. క్రీ.శ. 1482 కాంగోనది డయగో కామ్ చే పరిశోధింపబడెను.
క్రీ శ. 1622 ఫాదర్ జెరోని మో, లోబా అబిసీనియాలో చాలభాగము పర్యటనము కావించెను.
క్రీ. శ. 1825 మేజరు అలెగ్జాండరు గార్డను లైంగ్ ఉత్తరము నుండి టింబక్టు వరకు సహారా దాటెను. క్రీ.శ. 1770 జేమ్సుబ్రూసు బ్లూ నైలు నదిని పరిశోధించేను. క్రీ. శ. 1848 జాన్ యల్ క్రాఫ్ మొంబాసా నుండి కిలి మంజారో కెన్యా పర్వతముల వరకు గల ప్రదేశమును పరిశోధించెను.
9. ఆఫ్రికా యందలి రాజకీయ చారిత్రక వాతావరణము : జగత్ప్రసిద్ధములైన పిరమిడులతో కూడిన ఈజిప్టును, అంతర్జాతీ యోపయుక్తమైన సూయజు కాలువయును, ఆఫ్రికా ఈశాన్య భాగమును మిక్కిలి చరిత్ర ప్రసిద్ధినొందిన ప్రదేశములు, మధ్యధరా సముద్ర ప్రాంతమందును, మధ్య ఆసియా యందును గల జనులు ప్రాచీన కాలమున నే కావించిన దండయాత్రలు ఈజిప్టునకు అతి విస్తృతమైన చరిత్రను, మిక్కిలి పురాతనమైన నాగరకతను ఒసంగినవి, క్రీ.శ. పడమటి శిరమున 1600 నుండి 1830 వరకు పోర్చుగీసువారు పరిశోధనను, బానిసవర్తకమును సాగించిన గినీ సింధుశాఖ ఆధునిక కాలమున ప్రాధాన్యము వహించినది.
ఈజిప్టు యొక్క 6000 ఏండ్ల చరిత్ర చెప్పుటకు ప్రత్యక్ష చరిత్ర సాక్ష్యమున్నది. క్రీ. పూ. 9వ శతాబ్దిలో కార్తజీనియను సంస్కృతి వచ్చినప్పటినుండియు లిఖిత చరిత్రమే లభించుచున్నది. కాని ఆఫ్రికాలో యూరోపియనులు ప్రవేశించినప్పటి నుండియు, క్రీ. శ. 15 వ శతాబ్దిలో పోర్చుగీసువారు పరిశోధించి, ఆక్రమించి స్థిరనివాస మేర్పరుచు కొన్నప్పటి నుండియు ఆఫ్రికా రాజకీయార్థిక నిర్మాణము పూర్తిగా మార్పుచెందినది.
క్రీ. శ. 1500 కును, 1886 కును మధ్యకాలమును అభ్యుదయకాలమని చెప్పవచ్చును. యూరోపియనులు ఆఫ్రికాలో స్థిరపడుటయే ఇందుకు కారణము. ఆది కాలమునందలి సముద్ర పరిశోధనయు, అంతర ప్రవేశమును, ఆ ఖండము నందలి లోహవృక్షాది సంపదను వెలుగునకు తెచ్చెను. ఇది వర్తక సంఘ స్థాపన ము న కు ను, మిషనరీల (మత ప్రచారకుల) ఆగమనమునకును దారచూపెను. పై వర్తక సంఘములు దేశీయ సంపదను కొల్ల గొట్టుటయు, మిషనరీలు ప్రచార కార్యమును చేయుటయు కొనసాగుచుండ, యూరపు నందలి వివిధ దేశముల ప్రభుత్వములు పరస్పర స్పర్ధవహించి ఒండొంటితో యుద్ధముచేయ నారంభించెను. దీనికి ఫలితముగా క్రీ.శ. 1880 -1888 సంవత్సరముల నడుమ ఆఫ్రికా ఖండము పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్చి, ఇంగ్లీషు, జర్మను ప్రభుత్వముల నడుమ విభ క్తమగుట సంభవించెను. ఈజిప్టు, ఎథియోపియా, లైబీరియా అనునవి మాత్రమే యూరోపియనుల చేజిక్కకుండ స్వతంత్రముగా ఉండిపోయెను.
ఈ శతాబ్దిలో ఆఫ్రికావాసులకును యూరోపియనులకును నడుమ ఎక్కువ రాజకీయ సామరస్యము ఏర్పడుటయు, ఆఫ్రికా ప్రజలకు కొంతవరకు స్వయం ప్రభుత్వము పరిణమించుటయు సంభవించెను. ఈ కాలమందంతటను 4 మిలియనుల సంఖ్యగల యూరపు దేశములవారు తమ దేశములన్నియు కలిపిన భూ వైశాల్యముకంటే 30 రెట్లధిక విశాలమైన ప్రదేశమున నివసించు 146 మిలియనులు సంఖ్యగల ఆఫ్రికను ప్రజల రాజకీయ భవితవ్యమును, ప్రకృతి సంపదను నిర్ణయించుచుండిరని చెప్పవచ్చును. వారిట్టి అధికారమును చలాయించుటకు వారికి ప్రకృతి సంపదపై గల ప్రాభవమే కారణము. ఉత్తర రొడీషియాలో రాగి, సీసము, తుత్తునాగము, మాంగనీసు మున్నగునవియు, బెల్జియం అధికారమున నుండిన మధ్య కాంగోలో కోబాల్టు, రాగి, బంగారము, యూరేనియము, మున్నగునవియు మరికొన్ని వాణిజ్యపు పంటలును, ఫ్రెంచి వారి అధీనములోని అల్జీరియాలో ఇనుము, సీసము, ఫాస్ఫేట్లు, తుత్తునాగము, తైలములు, మద్యము, ఊలు, కోకో, ప్రత్తి, కఱ్ఱ మొదలగునవియు పైన చెప్పబడిన ప్రకృతి సంపదలలో ముఖ్యములైనవి. దక్షిణాఫ్రికా యందలి వర్ణనృథక్కరణ సమస్యయందును, అల్జీరియా యందలి ఇటీవలి తిరుగుబాటునందును, దక్షిణాఫ్రికా యందలి పెక్కు దేశములలోని రాజకీయ సంక్షోభము లందును (మౌ, మౌ) సూయజు కాలువను ఈజిప్టు జాతీయకరణ విషయమున పడమటి యూరపు దేశములు పొందిన కలవరమునందును ఈ యైరోపియాధి కారము వలన రాజకీయ ప్రతిక్రియలు ప్రతిఫలించుచున్నవి.
ఆఫ్రికాయందలి చాల భాగము బ్రిటను, ఫ్రాన్సు, బెల్జియము, పోర్చుగలు అను నాలుగు దేశముల అధీనమందున్నది. సంయుక్త రాష్ట్రముల యాజమాన్యము (trusteeship) క్రింద మరికొన్ని యితర భాగములున్నవి. ఆఫ్రికాఖండ మంతటికిని మూడేస్వతంత్ర దేశములున్నవి. అందు ఈజిప్టు పురాతన కాలమునుండియు స్వతంత్రమై యుండెను. అమెరికానుండి విముక్తులైన నీగ్రో బానిసల కొరకు లైబీరియా ప్రజాస్వామ్యము ఏర్పరుపబడెను, ఎతియోపియా (అబిసీనియా) క్రీ. శ. 1941 లో ఇటలీ నుండి స్వాతంత్య్రమును సంపాదించెను.
గుడ్ హోప్ అగ్రము, ట్రాన్సువాలు, ఆరెంజి ఫ్రీస్టేటు, నేటాలు అనువానితోగూడిన సంయుక్త దక్షిణ ఆఫ్రికా స్వయంపాలిత మైన ప్రదేశము. ఆంగ్లేయులకును, డచ్చివారికిని నడుమగల స్పర్ధచేతను, బహుముఖము లైన దేశీయ సమస్యలచేతను, ప్రాచ్యులైన భారతీయులు వలసవచ్చుటచే నేటాలులో ఏర్పడిన స్థానిక రాజకీయ సంక్షోభము చేతను అచ్చటి రాజకీయ పరిస్థితి మరింత క్లిష్టతరమగుట సంభవించెను. పశ్చిమాఫ్రికా ప్రదేశములలో బ్రిటిషువారు దేశీయనాయకులద్వారా పరోక్ష మైన పాలనపద్ధతిని అభివృద్ధికావించిరి. పశ్చిమాఫ్రికాలో యూరోపియనులు వచ్చి స్థిరపడుట అంత ముఖ్యమైన సమస్య కాదు కాని తూర్పు ఆఫ్రికాలోని, బ్రిటిషుప్రాంతమున, ముఖ్యముగా కెన్యాలో వలస వచ్చిన తెల్లవారు భూమి నాక్రమించుకొనుట మిక్కిలి తీవ్రమైన సమస్యగా పరిణమించినది. (బ్రిటిషు) ఉగాండా ఆఫ్రికా యొక్క పరిపాలన విషయమున ముందంజవైచినది. అచ్చట దేశీయ న్యాయస్థానములకు ఎన్నదగినంత న్యాయాధికారము (legal power) కలదు. టాంగనీకాలో బ్రిటిషువారు ఒక శాసనముద్వారా దేశీయ ప్రజా సమూహమునకు తగినంత ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రము నొసంగియుండిరి. 46 వేల మంది ఆసియావాసులు (ముఖ్యముగా భారతీయులు) వచ్చి స్థిరపడుట టాంగనీకాలోని సాంఘిక పరిస్థితిని కొంతవరకు క్లిష్టము కావించినది. ఉత్తర ప్రదేశములతో పోల్చినచో ఉత్తర రొడీషియాలో తెల్ల వారి సంఖ్య చాల తక్కువే. వారు గని పరిశ్రమలందు మగ్నులై యుందురు. దక్షిణ రొడీషియాలో తెల్ల వారి సంఖ్యకంటే దేశీయుల సంఖ్య 20 రెట్లెక్కువ. బసుటోలాండు, బెచునాలాండు, స్వాజిలాండు అను ప్రదేశములం దొక్కొక్కచోట ఒక్కొక్క కమీషనరు కలడు. అతడు దక్షిణాఫ్రికా హైకమీషనరు ద్వారా బ్రిటిషు ప్రభుత్వమునకు బాధ్యత వహించి యుండును.
మధ్య కాంగో ప్రదేశమున బెల్జియనుకు విస్తృతమైన భూభాగము కలదు. అందు ఖనిజ జంతు సంపద విస్తారముగా కలదు. అచ్చట పామ్ నూనె, కాఫీ, కోకో, పంచదార, రబ్బరు, కోపలీ మున్నగునవి కూడ లభ్యములగును.
ఉత్తర ఆఫ్రికా యందలి ఫ్రెంచి రక్షిత స్థలములు మిక్కిలి సంపన్నములై నవి. ఆల్జీరియాలోని ఖనిజ వృక్ష సంపదలు ముఖ్యముగా ఫ్రాన్సున కెగుమతి చేయబడు చున్నవి. ప్రతి సంవత్సరమును రెండు మిలియనుల టన్నుల ఇనుప యినుక ఫ్రాన్ సునకు ఎగుమతి కావలయుట ఆల్జీరియాపై ఫ్రాన్స్ సునకు గల గొప్ప ఆకర్షణకు కారణము,
ఆఫ్రికాలో పోర్చుగీసువారికి మూడు ప్రదేశములు కలవు. అవి దూర పశ్చిమాఫ్రికాలోని పోర్చుగీసుగినియా వాయవ్య భాగము నందలి అంగోలా, తూర్పు ఆఫ్రికా యందలి మొజాంబిక్. అంగోలాలో యూరోపియనుల స్థిరనివాసమునకు తగిన శీతోష్ణ స్థితిగల ఉన్నత ప్రదేశము కలదు.
జి.స
ఆఫ్రికా ఖండపు భాషలు :- ప్రధాన భాషలు - వర్గీకరణము : ఇటీవలి కాలమున వలస వచ్చిన ఐరోపావారిని వదలి పెట్టినచో ఆఫ్రికా ఖండములోని ప్రజలను నాలుగు ప్రధాన జాతులుగా విభజింపవచ్చును.
1. పిగ్మీ - బుష్ మన్ 2. నీగ్రో 3. హెమిటిక్ 4. సెమిటిక్. వీరికి సంబంధించి ఆఫ్రికా ఖండపు భాషలను కూడ నాలుగు వర్గములుగా విభజింపనగును. కాని యిందలి నీగ్రో వర్గము 1. సూడానిక్ 2. బంటు అని తిరిగి రెండు అంతర్వి భాగములుగా తరువాత విడివడినది,
ఇట్లు ఆఫ్రికా ఖండ భాషలు ఐదు వర్గములుగా విభజింపవచ్చును :- 1, బుష్ మన్ 2. సూడానిక్ 3. బంటు 4. హెమిటిక్ 5. సెమిటిక్.
స్ట్రక్ (struck) యొక్క వివరణ ననుసరించి, ఆఫ్రికా భాషల సంఖ్య ఈ విధముగా నున్నది :—
(1) బుష్ మన్ వర్గము: 11 భాషలు (2) సూడానిక్ వర్గము: 264 భాషలు (3) బంటువర్గము: 182 భాషలు (4) హెమిటిక్ వర్గము : 47 భాషలు (5) సెమిటిక్ వర్గము : 10 భాషలు.
పెక్కు భావలు కొలది వైశాల్యముగల ప్రదేశములో మాత్రమే మాట్లాడబడుచున్నవి. సుమారు 12 భాషలు మాత్రము 10 లక్షల కంటే ఎక్కువ మందిచే మాట్లాడ బడుచున్నవి.
ప్రత్యక్షోపయోగము ననుసరించి, ఈ క్రింది ఆఫ్రికా భాషలు తక్కినవాని కంటే ఎక్కువ ముఖ్యమైనవిగా ఉన్నవి :- - 1. సెమిటిక్ భాషలు : అమ్ హరిక్ అరబిక్ 2. హెమిటిక్ భాషలు: హౌసా 3. బంటు భాషలు: గండా, కికు యూ, కాంగో, లుబా-లులువా, మ్యుండు (Mbundu), న్గాలా (Ngala), న్యాన్జా, సుకుమాన్యాంవెజీ, రుఆన్డా రున్డీ, సోథో- పెడిఛ్వానా, స్వాహాలీ, స్వీనా- కారన్గా న్హా ఓ (Swina - Karanga - Ndao), జులూ - క్సో సా 4. సూడానిక్ భాషలు : ఆకాన్, డిన్కా - నూయర్, ఎఫిక్ - ఇబిబియో. యు - ఏన్ హోదహోం, ఇబో, కనూరీ, క్పెల్ - మెండ్, మాలిన్కే డ్జురా - బంబారా, మోసీ - డాగోమ్బా, నూ పేగ్యారీ, టెంనె (Temne), వోలోఫ్, యోరుబా, జన్డే. -