సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆఫ్ఘనిస్థానము (చరిత్రము)
ఆఫ్ ఘనిస్థానము :- (చరిత్రము) :- ఆఫ్ ఘనిస్థానము ఇరేనియను పీఠభూమిలో ఈశాన్యదిక్కున ఉన్నది. ఈ దేశపు సరిహద్దులు ఉత్తరమున ఆక్సస్, మధ్య ఆసియాలోయలు, తూర్పున ఉత్తర హిందూస్థానము, పడమట పర్షియాదేశము, దక్షిణమున బెలూచి స్థానపు టెడారి. ఆఫ్ ఘనిస్థాన మను పేరు 18 వ శతాబ్దములో అహ్మద్ షా రాజ్యకాలమునుండి స్థిరపడినది. ఈ దేశము నందలి ముఖ్యజాతులు - ఆప్ ఘనులు, పఠానులు, ఘిల్జాయిలు, టర్కోమనులు, ఇత్యాదులు.
చారిత్రకముగ ఆఫ్ఘనిస్థానములో భాగములైన ఖురాసాన్, కాబూలు, బాక్ట్రియా, గజనీ, కాందహారు, హీరట్ - అనునవి. గ్రీకుల, అరబ్బుల రాజ్యములలో రాష్ట్రములుగ నుండెను. క్రీ.శ. 1000 ప్రాంతమున గజనీ రాజులు, తర్వాత ఘోరి రాజులు ఇచట పరిపాలించి హిందూ దేశము పై దండయాత్రలు సాగించిరి. ఢిల్లీలో ముస్లిము రాజ్యము స్థాపించిన బానిసరాజు కుత్బుద్దీన్ ఐబక్ ఆఫ్ ఘని స్థానము వాడే. క్రీ శ.1526 లో బాబరుమొగలు సామ్రాజ్యము స్థాపించు వరకు ఆఫ్ ఘన్ స్థానము నుండి తురకల దండయాత్రలు పరంపరగ హిందూదేశమును బాధించుచుండెను. మొగలుకు సరియైన పేరు. చగతాయి. వీరి స్వదేశమగు ఫెర్గినా ఆప్ ఘనిస్థాన మందే యుండెను.
ఆవ్ ఘను చరిత్రలో కూడ అక్బరు రాజ్యకాలము (క్రీ. శ. 1556 - 1605) గొప్పది. ఆప్ ఘనిస్థానము ఇతని కాలములో ఢిల్లీ సామ్రాజ్యమున నొక భాగముగ స్థిరపడెను. అక్బరు రాజపుత్ర సైన్యములు జస్వంతసింగు సైన్యాధిపత్యమున ఆఫ్ ఘనిస్థానములోని తిరుగబాటులను అణచెను. ఔరంగజేబు తర్వాత ఆఫ్ ఘను సామంతులు స్వతంత్రము ప్రకటించిరి. క్రీ. శ. 1621 లో పర్షియనులు కాందహారును జయించిరి. క్రీ.శ. 1688 ప్రాంతమునుండి కాందహారును పర్షియనులు కాని, ఆఫ్ ఘనులు కాని పాలించుచు వచ్చిరి.
నాదిర్ షా ఆఫ్ ఘనిస్థానమును జయించి హిందూదేశముపై దండెత్తెను. ఇతడు క్రీ. శ. 1747 లో మృతి నొందెను. తర్వాత అహమ్మద్ అబ్దాలి స్థిరమైన ఆఫ్ ఘన్ రాజ్యమును స్థాపించెను. ఇతని రాజ్యము మెషెడ్ (Meshed) నుండి లాహోరువరకు వ్యాపించెను. క్రీ. శ. 1773 లో అహమ్మద్ షా చనిపోయెను. ఆతని పుత్రుడు తైమూర్ షా క్రీ. శ. 1793 వరకు పాలించెను. తైమూరుషా తరువాత అతని తమ్ముడు షాహ జమాను రాజ్య మేలెను. క్రీ.శ.1803 తరువాత షాహ మహమ్మదు, అటుపిమ్మట షాహ షుజా పాలించిరి. క్రీ. శ. 1827 నుండి 1863 వరకు దోస్త్ మహమ్మదు, తర్వాత షేర్ ఆలీ,తర్వాత అబ్దుర్ రహమాను, అతని కొడుకు హబీబుల్లా, మనుమడు అమానుల్లా పాలించిరి. తర్వాత నాదిర్ ఖాను. అతడు క్రీ. శ. 1933 లో చంపబడగా, జాహిర్ షాహ రాజయ్యెను.
అంతర్యుద్ధములలో ఆఫ్ మన్ సామంతరాజులు బ్రిటిష్ సాయమును తరుచుగ నపేక్షించుచుండిరి. మొదటి ఆఫ్ ఘను యుద్ధములో దోస్తుమహమ్మదు కాబూలు గద్దె యెక్కి హీరట్, కాందహార్ లను గెల్చెను. ఇతని పుత్రుడు గులామ్ హైదర్ బ్రిటిషువారితో సంధి నెరపెను. క్రీ.శ.1863 లో దోస్తుమహమ్మదు చనిపోగా అతని 16 గురు పుత్రులు సింహాసనమునకై పోరాడు కొనిరి. రెండవ ఆఫ్ఘను యుద్ధములో బ్రిటిషు సైన్యములు 3 వైపులనుండి ఆఫ్ ఘను రాజ్యమున ప్రవేశించెను. కాందహారు యుద్ధ ఫలితముగ క్రీ. శ. 1880 నుండి 30 సం॥ లు ఆఫ్ ఘన్ రాజు బ్రిటిషు మిత్రుడుగ నుండెను. మూడవ ఆఫ్ ఘన్ యుద్ధములో ఆఫ్ ఘనులు ఇండియాపై దండెత్తి యోటమి చెందిరి. 1919 లో హబిబుల్లా హత్యచేయబడెను. అమానుల్లా రాజయ్యెను. సంధి ఫలితముగ ఆఫ్ ఘనిస్థానము స్వతంత్ర రాజ్య మయ్యెను.
అబ్దుర్ రహమాను రోడ్లు వేయించెను. రాజ్యాంగమున సంస్కరణలు తెచ్చెను. అమానుల్లా ఐరోపాలో పర్యటనము చేసివచ్చి దేశములో మార్పులు చేసెను. క్రీ. శ. 1928 లో శాసనసభలు అమలులోనికి వచ్చెను.
వి. య.
ఆఫ్ఘనిస్థానము :- (భూగోళము) :- ఆఫ్ఘనిస్థానము ఆసియాఖండపు దేశాలలో ఒకటి. దీనికి దౌలత్ ఇ-పాద్ షాహీ-యే ఆఫ్ఘనిస్థానము అని పూర్తి పేరు. ఇది 29°-38° 35' ఉత్తర అక్షాంశముల మధ్యను 60°, 50 - 71° 50 తూర్పు రేఖాంశముల మధ్యను ఇమిడియున్నది. దీని వైశాల్యము 2 లక్షల 50 వేల చదరపు మైళ్ళు ఉండును. జనాభా ఒకకోటి ఇరువదిలక్షలు సుమారుగా ఉండును. అందులో ఇరువది లక్షలమంది స్థిరనివాసము లేని చరజాతు లున్నవి. పరిషియన్, పుష్టూ భాషలు మాట్లాడుదురు.
పరిపాలనము :- 1914 లో జన్మించిన మహమ్మద్ జహీర్ షా ఈ రాజ్యమునకు రాజు. ఒక ఉన్నత సభ (Senate) 50 మంది సభ్యులతో కూడి ఉన్నది. ఇదిగాక, 171 మంది సభ్యులుగల జాతీయ సభ (National Assembly) పరిపాలనాధికారము కలిగియున్నది. మే నెలలొను అక్టోబరులోను సమావేశములు అగుచుండును. ఇదిగాక "లోయేజిర్గా" (Loe jirga) అను మహాసభ ఇంకొకటి అప్పుడప్పుడు సమావేశము అగుచుండును. రోజు ఏదైన అతి ప్రాముఖ్యము గల సమస్యను తీర్మానించు నిమిత్తమే దీనిని సమావేశ పరచుచుండును. దీనిలో ఆజాతికి సంబంధించిన పెక్కుమంది నాయకులు సమావేశమునొందుదురు. గడచిన సమా వేశము 1941 లో జరిగినది. ఇటీవల పాకిస్థానముతో ఏర్పడిన సమస్యల మూలముగా ఇప్పుడు మళ్ళీ సమా వేశపరచబడినది. దేశము ఏడు ముఖ్యమైన రాష్ట్రాలుగా విభజింపబడి ఉన్నది. కాబూలు, మజార్, కాందహారు, హీరాట్, కటఘన్, సంత్- ఇ-మష్రికీ, సంత్-ఇ-జునూబి అనునవి పెద్ద రాష్ట్రాలు. బదక్ షాన్, ఫరా, మైమనా, పర్వాన్ అనునవి నాల్గు చిన్న రాష్ట్రాలు. పెద్ద రాష్ట్రాలు నయీరో-ఉల్-హుకు మేఅను పరిపాలకుని చేత ను చిన్న రాష్ట్రాలు హా కేం-ఇ- ఆలా అను పరిపాలకునిచేతను, పాలింపబడుచున్నవి. కొన్ని శాఖలు మంత్రులక్రిందను, కొన్ని అధ్యక్షులక్రిందను ఉండి, వీరిరువురితో కూడిన మంత్రి వర్గము చేతులలో అధికారము కేంద్రీకృతమయి ఉన్నది. కొద్దిమంది పీయాశాఖీయులున్నను అధిక సంఖ్యాకులు సున్నీ శాఖకు చెందిన మహమ్మదీయ మతము ప్రధానముగా గలవారే. కాబట్టి న్యాయశాస్త్రము షరియత్ మీద ఆధారము చేసికొని అభివృద్ధి చెందినది. జిల్లా న్యాయ స్థానాలను మహకమా-ఇ-ఇబ్ తిదాయియాలు అనియు, రాష్ట్ర రాజధాను లలో ఉండువాటిని మహకమా-ఇ-మురాఫాలు అనియు అందురు. మహకమా-ఇ-అలీ తమిజ్ అను న్యాయ స్థానము హైకోర్టువంటిది. ఇది పరిపాలన న్యాయశాఖకు అనుబంధించి ఉండును. ఉన్నత సభకు అనుబంధముగా రారియ్యాసత్-ఇ-తమీజ్-ఇ-అయన్ అను సుప్రీంకోర్టుకూడనున్నది. ఆదాయపుపన్ను, భూమిపన్ను, వ్యాపార సుంకాలు దేశము యొక్క ఆదాయమును 18 కోట్ల 80 లక్షల ఆఫ్ఘనీ నాణెములవరకు పెంచినను, ప్రభుత్వాదాయము చాలుటలేదు. సామాన్యమైన సేనా వాహిని 75000, కలదు. తడవకు 2,000 మంది విద్యార్థులను తయారుచేయు మిలిటరీ శిక్షణాలయము ఒకటి పని చేయుచున్నది. కాబూలు పట్టణము దేశమునకంతకును రాజధాని, ఖ్వాజా రావావ్, షెర్ పూరు విమానాశ్రయాలను పురస్కరించుకొని కొద్ది విమానదళమున్నది. బ్రిటిషువారితో పూర్వము సరిహద్దులను గురించిన సంధులు (Treaties) పెక్కులున్నవి. 1946లో సోవియట్ రష్యాతో ఒక సరిహద్దు నిర్ణయము జరిగినది.
'ఆర్థిక పరిస్థితులూ :- దేశము యావత్తు పర్వత మయము. వర్షరహితమైనది. అయినప్పటికిని చిన్న చిన్న జలా ధారాల మూలమున వ్యవసాయము సాగుచునేయున్నది.