Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆపస్తంబుడు

​ఆపస్తంబుడు :-

    ఏతద్దేశ ప్రమాతన్య సకాశాదగ్ర జన్మనః
    స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః'
    వ్యవస్థితార్య మర్యాదః కృతవర్ణాశ్రమ స్థితిః
    త్రయ్యాహి రక్షితో దేశః ప్రసీదతి నసీదతి.
    (మనుస్మృతి)

​ 'ఈ భారత దేశమున పుట్టిన బ్రాహ్మణుని సమక్షమున భూమియందలి సర్వమానవులు తమ తమ ఆచారములను అభ్యసించవలయును. నిర్ణీతార్య మర్యాదలు గలదై, ఆచరిత వర్ణాశ్రమ స్థితిగలదై వేదత్రయ రక్షితమగు ధర్మముచే రక్షింపబడు దేశము ఉపద్రవ రహితమై శాంతి యుతముగా మనగలదు' అని మనువు వచించెను. ఇట్టి మర్యాదలను (వ్యవస్థలను) ప్రతిపాదించిన మహర్షులలో ఆపస్తంబ మహర్షి అగ్రగణ్యుడు.

ఆపస్తంబుని సూత్రములు విశేషముగా పాటించువారు ఆంధ్రులై యున్నారు. ఆంధ్ర కవులలో పెక్కురు ఆపస్తంబ సూత్రులు కలరు. కాబట్టి ఆపస్తంబుడు ఆంధ్ర జాతీయుడని తోచుచున్నది. ఇయ్యంశమును గార్బు, బహ్లరు, పండితులు మున్నగు విమర్శకులును బలపరచిరి. ఈ విషయమును మరియొక విధముగా గూడ స్థాపింప వచ్చును. విశ్వామిత్రుని సంతతివారై అతనిచే శప్తులయిన వారలలో ఆంధ్రులుకూడ నున్నారు. శునశ్శేపుని కథ జరుగునప్పటికి విశ్వామిత్రుడు పుష్కర క్షేత్ర సామీప్యమున తపస్సు చేయుచుండినట్లు శ్రీమద్రామాయణ గ్రంథమువలన విదితమగు చున్నది. పుష్కర క్షేత్రమునకు సమీపముననే సాల్వదేశముకలదు. ఆపస్తంబుడు సీమంతో న్నయన విధియందు సాల్వదేశమును, యమునా నదిని, యౌగంధరి యను ఆ దేశపు రాజును గూర్చి గానము చేయదగు నని ప్రత్యేకముగ చెప్పియుండుటచే అతనికి సాల్వ దేశము నందును తత్రత్యు లయిన జనుల యందునుగల ప్రత్యేకాభిమానము తేటపడుచున్నది. ఆంధ్రగణమువారు ఇక్కాలమున సాల్వదేశ ప్రాంతమున నుండుటచే ఆపస్తంబుడు ఆంధ్రజాతీయుడై నట్లు ఊహించుట సమంజసము.

ఆపస్తంబుడు ప్రాచీన మహర్షియై యున్నట్లు నిరూపించుటకు పెక్కు సాధనములు కలవు. బోధాయన సూత్ర గ్రంథములో ఆపస్తంబుడు గోత్ర ప్రవర్తకులలో నొకడుగా పేర్కొనబడెను. పరాశర యాజ్ఞవల్క్యులు తమ ధర్మశాస్త్రములలో ఆపస్తంబుని ధర్మశాస్త్ర ప్రవర్తకునిగా పరిగణించిరి. పాణిన్యాచార్యుడు 'అనృష్యానన్తరే బిదాదిభ్యో ౽జన్ (4.1.104) అను సూత్రమున బిదాది గణములో ఆపస్తంబ శబ్దమును పఠించెను. అందుచే ఆపస్తంబుడు పాణినికి పూర్వుడని నిరూపితమగుచున్నది.

ఆప స్తంబుని గృహ్య సూత్రములలో పాణినీయ వ్యాకరణమునకు విరోధముగల ప్రయోగములు కలవు. ఉదా :-ఆరోహతీం (5 -24); తరతీం (6-2); పుం స్వాః (6-4); గృముష్టిః (20-11); అభ్యానాయన్ (12-7); త్రిస్సైప్త ః (9-5) ; ప్రష్పం (11-2); కుప్త్వాం (23-7) మున్నగునవి. కొన్ని విభక్తి వ్యత్యయములుకూడ కనవచ్చు చున్నవి. ఉదా :- తస్యైవపా (22-4) ; అధ్యా౽ స్యై దక్షిణేన (1-5): ఇయ్యంశములు కూడ అపస్తంబుడు పాణినికి పూర్వుడను విషయమును బలపరచు చున్నవి. ఆపస్తంబుడు నిరుక్త కారుడయిన యాస్కుని, జ్యౌతిషకర్త యగు లగదుని తన ధర్మసూత్రములో పేర్కొనియున్నాడు. అందుచే ఇతడు యాస్కలగదులు కనంత రీయుడని ఊహింపవచ్చును. పాణిని క్రీ. పూ. 600-300 సం. ల కాలమునకు చెందిన వాడనియు, యాస్కుడు క్రీ. పూ. 800-500 ల కాలమునకు చెందిన వాడనియు పి. వి కాణేమున్నగు పండితులు వ్రాసిరి. అందుచే ఆపస్తంబుడు క్రీ.పూ. 800-600 లకు మధ్యనున్న వాడనుట సమంజసము.

మహర్షులచే ప్రతిపాదితములైన మర్యాదలు విధి. నియమ - నిషేధ రూపములచే మూడు విధములు. అందు ప్రవృత్తి ప్రయోజనకము విధి. నిషేధ, నియమములు నివృత్తి ప్రయోజనకములు. (1) విధి - 'సంధ్యోశ్చ బహిర్గామాదాసనం వాగ్యతశ్చ (1 ప్రశ్న 30 పటల, 8 సూ అను నాప స్తంబ ధర్మసూత్రమునుబట్టి సంధ్యోపాసనా కాలమున గ్రామమునకు వెలుపల నుండుట, వాజ్నియ మము కలిగియుండుట అనునవి విధులు. ఇచట ప్రవృత్తి ప్రయోజనము వివక్షితమైనది (2) ప్రాఙ్ముఖో ౽ న్నాని భుంజీత (1.31.1) అను సూత్రముచే ప్రాఙ్ముఖుడయి భోజనము చేయవలయు నని చెప్పుట వే అన్యదిగా! ముఖ్యము నిషిద్ధమైనది. ఇది నిషేధ ప్రయోజనక విధియై యున్నది. (3) "యాజనాధ్యావన ప్రతిగ్రసై రేవ బ్రాహ్మణో ద్రవ్య మార్జయేత్" యజ్జము చేయించుట, వేదమును చదివించుట, ప్రతిగ్రహణము- అనువాటిచేతనే బ్రాహ్మణుడు ద్రవ్యము నార్జింపవలయును అనునది నియమము. ఇట్టి నియమమున వృత్త్యంతరములచే య థేష్టముగా బ్రాహ్మణునకు ద్రవ్యార్జనము నిషిద్ధమగుచున్నది. ఇట్లు పూర్వోక్తము లయి ​ మర్యాదలను, వర్ణాశ్రమ ధర్మములను, బోధించు సూత్రములు ధర్మసూత్రము లనబడును. శ్రుతిచోదితము అయిన యజ్ఞములను ఆచరించు పద్ధతిని బోధించునవి శ్రౌత సూత్రములు. ప్రత్యక్ష శ్రుతి ప్రామాణ్యము లేనిచో ఆచార గ్రాహ్యములగు వివాహాది విధులను బోధించునవి గృహ్య సూత్రములు. ఇట్లు ధర్మములను, గృహ్యములను, శ్రౌత ధర్మములను సూత్రరూపమున రచించిన మహర్షులలో ఆపస్తంబుడు అగ్రగణ్యుడు. ఈ మహర్షి రచించిన శ్రౌత సూత్రము వేదాంగకల్ప మని ప్రసిద్ధి పొందినది. ఆ శ్రౌత సూత్రమునందు “అథాతో దర్శ పూర్ణిమాసౌ వ్యాఖ్యాస్యామః' అనునది ఆద్య సూత్రమై యున్నది. దీనిని బ్రహ్మయజ్ఞములో కల్ప స్థానములో బ్రాహ్మణులు పఠించుచున్నారు. ఆపస్తంబుని శ్రౌత సూత్రము త్రింశద ధ్యాయాత్మకము. ఆదియందలి 23 అధ్యాయములలో దర్శ పూర్ణిమాసేప్టి మొదలుకొని సహస్ర సంవత్సర పర్యంతములైన యజ్ఞకర్మలు చెప్పబడినవి. ఇరువది నాల్గవ ప్రశ్నలో పరిభాషా సూత్రములు, ప్రవరఖండ. హౌత్రమంత్రములు వచింపబడినవి. 25, 26 వ ప్రశ్న లలొ గృహ్య కర్మల ఉపయోగించు సూత్రములును, 27 వ ప్రశ్నలో గృహ్య కర్మల నొనర్చు విధానమును బోధితములైనవి. 28, 29 ప్రశ్నలు సామయాచారిక ధర్మప్రతిపాదకములు. 30 వ ప్రశ్న శుల్బ సూత్రము; ఇది వేదినిర్మాణ విధిని ఇష్టి కాచయన ప్రమాణములను వివరించును. ఈ శ్రౌత సూత్రము తైత్తిరీయ శాఖకు ఉపయోగించునదియై యున్నది. ఆపస్తంబ శ్రౌత సూత్రములపై వ్యాఖ్యలు పెక్కులు కలవు. ఈ వ్యాఖ్యలు అసమగ్రములై కానవచ్చుచున్నవి. రుద్రదత్త - సూత్ర దీపిక అను వ్యాఖ్య ఈ శ్రౌత సూత్రము నందలి 15 ప్రశ్నలకే లభించుచున్నది అని గార్బు పండితుడు వ్రాసెను. ధూర్తస్వామి కృతమైన భాష్యము. శ్రౌత సూత్రము నందున్న కేవల పరిభాషా సూత్రములకే లభించుచున్నది. కవర్దిస్వామి రచించిన భాష్యము శుల్బ సూత్రాధ్యాయమున కే కనబడుచున్నది. గురుదేవస్వామి, కరవిందస్వామి, చౌండపాచార్యుడు, అహోబలసూరి, సుందరరాజు అను ఐదుగురు, శ్రౌత సూత్ర వ్యాఖ్యాతలలో పేర్కొనదగిన వారు. చౌండపాచార్యుని ప్రయోగ రత్నమాల శ్రౌత సూత్ర మూలమునకు సక్రమమైన వ్యాఖ్యగా పరిగణింపబడుచున్నది.

'అథ కర్మా ణ్యాచారా ద్యాని గృహ్యంతే' అనునది ఆపస్తంబ గృహ్య సూత్రము అనుగ్రంథమునందలి ఆద్య సూత్రము. ఆపస్తంబుడు స్వకృతములయిన గృహ్య సూత్రములలో జాతకర్మాది సంస్కారములకు ఉపయోగించునట్టి బుగ్యజుర్వేద మంత్రములను ఒకచో ప్రశ్నద్వయ రూపమునకూర్చి దీనికి 'ఏకాగ్ని కాండము' అని పేరు పెట్టెను. ఈ గృహ్య సూత్రములలో మంత్ర ప్రతీకము (స్వరూపోచ్చారణము) 'ఉత్తరయా, ఉత్త రేణ, ఉత్తరాభిః' అను అల్పపదములచే సులభముగా కర్మలను బోధించియున్న ఆపస్తంబుని వైశిష్ట్యము ఎన్నదగినది. ఆషాడ - మాఘ - ఫాల్గుణ మాసములు తప్ప వివాహములకు శేషించిన మానములు ప్రశస్తములని “సర్వర్తవో వివాహస్య శైశిరేమాసౌ పరిహార్యోత్తమంతునై దాఘం" అను ఆపస్తంబ గృహ్యసూత్రముచే విదితమగుచున్నది. కన్యావరణ సమయమున - శుభాశుభ పరీక్షకై వరబంధు వులు, మట్టిముద్దలో నానావిధములయిన బీజములను' యజ్ఞ వేదిగతములయిన పాంసువులను, కృషి క్షేత్రమందలి లోష్టములను (మట్టి వెల్లలను) శ్మశాన భూమి యందలి లోష్టములను కలిపి, వాటిలో నొకదానిని స్పృశింపుమని కన్యనడుగగా, ఆమె బీజస్పర్శ మొనర్చినచో సంతానముచే సమృద్ధి కలుగుననియు, వేది పాంసువులను తాకినచో యజ్ఞముచే సమృద్ధి కలుగుననియు, క్షేత్ర లోష్టములను తాకినచో ధనధాన్యములచే సమృద్ధి యేర్పడుననియు, శ్మశాన లోష్టములను స్పృశించినచో అశుభము వాటిల్లు ననియు భావింపవలెనని ఆపస్తంబుని (11 ప్రశ్న - 8 వ పటలము, 3, 15,16,17,18) వలన గృహ్యసూత్రములచే విశదీకృతమైనది. వరునకు వధూ విషయమున ఆనుకూల్యమును సంపాదించు నిమిత్తమై చేయదగినవిధి, సపత్నీ బాధన విధి; రాజయక్ష్మ యను రోగము యొక్క శాంతికై చేయదగిన విధి; మావిపడుటకై చేయదగినవిధి; శ్వగ్రహ గృహీతుడైన బాలుని యొక్క గ్రహశాంతికై చేయదగువిధి; ఇత్యాది విధులు ఆప స్తంబుని లోకజ్ఞానమును తేటపరచుచున్నవి. ఆపవ స్తంబ గృహ్యమాత్రము తైత్తిరీయ శాఖాను సారులకు మిక్కిలి ​ ఉపయోగించును. సింగాభట్టీయము, ఆండపిళ్ల, అనాకుల, తాత్పర్యదీపిక అనునవి ఆపస్తంబ గృహ్యసూత్రముల పై వెలసిన వ్యాఖ్యానములు. సింగాభట్టు, అణిపిళ్ల హరదత్తుడు, సుదర్శనాచార్యుడు అనువారు క్రమముగా పైని పేర్కొనబడిన వ్యాఖ్యలను వ్రాసినవారు. ఆంధ్రదేశమున తైత్తిరీయులు తరచుగా అవస్తంబ సూత్రానుసారులుగా నున్నారు.

ధర్మ సూత్రములలో ఆవ స్తంబ ధర్మసూత్రము కృష్ణ యజుశ్శాఖీయులకు ముఖ్యమైనది. "అధాతస్సామయా చారికాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామః" (ఆ. ధ. 1) అను నీ ప్రథమ సూత్రము ధర్మశాస్త్ర స్థానమున బ్రహ్మ యజ్ఞాదులందు ఉపయోగింపబడుటచేత ఈ గ్రంథము పరమధర్మ శాస్త్రమని తేటబడుచున్నది. ఆపస్తంబ ధర్మ సూత్రములలో పెక్కు ముఖ్య విషయములు కలవు. ఉపనయన కాలమున వటువు పాదోవ సంగ్రహణము, గురుసన్నిధియందు అధ్యయనము, భిక్షాచరణము, మున్నగు ధర్మములను సక్రమముగా ఆచరించినచో, నాతని కర్మలు సఫలము లగును. లేనిచో ఆతని సంతానము బ్రహ్మవర్చసవిహీనమగును. ఆతని సంతతిలో ఋషులు పుట్టరు. పుట్టినను శ్వేత కేతువువలె పూర్వకర్మ భోగార్థమై కొలది మంది జనన మొందుదురు. కావున బ్రహ్మచర్య మవశ్యాచరణీయము అని చెప్పబడినది. విక్రయాన్నము తినకుండుట; రసద్రవ్యములు, పచ్చిమాంసము, మధు- లవణేక్షురసములు, పృథుక- భ్రష్టయవ - సక్తు - శాక మాంస - పిష్ట - క్షీర వికారములు, ఓషధి - వనస్పతి - మూలఫలములు మున్నగు వాటిని తినుటయు: ఆపత్కాలమున అగ్నిసువర్ణములచే స్పృశించి కృతాన్నమును గ్రహించుటయు గృహస్థధర్మములుగా పరిగణింపబడినవి. ఆర్య పోషితులయిన శూద్రులు స్నానాదులచే శుద్ధులయి త్య్రైవర్ణికులగు గృహస్థులు అతిథులు మున్నగు వారి కొరకు పొకము చేయవచ్చును. శూద్రుడు నిత్యము క్షారము చేయించుకొని సచేల స్నానమొర్చినకొని పర్వ కాలమునందును, అష్టమి నాడును క్షౌరము చేయించుకొని గాని, పరోక్షముగా వండి తెచ్చిన అన్నమును అగ్నిలో నుంచి, నీళ్ళతో ప్రోక్షించినచో అది దేవతార్పణమునకు అర్హమగునని చెప్పబడినది. అతిథికి గోమధుపర్క: మిచ్చి

నచో ఫలాధిక్యము చేకూరు నను విషయమున బ్రాహ్మణము ప్రమాణమగు చున్నదని ఆపస్తంబుడు వచించెను. అవిధిగా సన్యసించినవారు అభోజ్యాన్నులలో పరిగణింపబడిరి. వ్రాత్యశబ్దము అమరకోశమునందును (వ్రాత్య స్సంస్కారహీనః స్యాత్) 'వ్రాతేన జీవతి' అను పాణీనీయ సూత్రమునందును నిందితపరముగా వ్యాఖ్యాతమైనది. ఆపస్తంబుడు దీనిని పూజ్యపరముగా ప్రయోగించెను. ఇయ్యాశయమునే సమర్ధించుచు ప్రతేఘసాధు ప్రత్యః; స ఏవవ్రాత్యః అను వ్యుత్పత్తిని వ్యాఖ్యాతలు ప్రదర్శించిరి. దంపతుల నియమములను వివరించుచు భార్యాభర్తలు స్వీయ నియమాతిక్రమము చేసి రేని శిక్షార్హులగుదు రని ఆపస్తంబుడు చెప్పెను. అతడు నియోగ పద్ధతిని నిషేధించెను. రాజు. తపో విద్యావంతులగ బ్రాహ్మణులకు తన దేశములో జీవన క్షేత్రము లొన వారిని పోషింపవలయు నని చెప్పబడినది. ఇతర సూత్ర కర్తలు అష్టవిధ వివాహములను చెప్పిరి. ఆపస్తంబుడు ఆరింటినే పేర్కొనెను. ఏకాగ్ని కాండము నందలి కొన్ని మంత్రార్థములచే యువతీ వివాహము ప్రతిపాదిత మగు చున్నను, హరదత్త ప్రభృతి వ్యాఖ్యాతలు అవ్విషయము నంగీకరించి యుండలేదు.

రాజధర్మములలో, రాజు దేశారాధన తత్పరుడగుచు రాష్ట్రమందలి ప్రజలలో ఏరికిని శీతవాతాతపవ్యాధు వలన క్లేశము కలుగకుండ చేయవలయు ననియు; బాల -వృద్ధ - కర్మకార - అంగవికల - శ్రోత్రియులనుండి పన్నులు గ్రహింపకూడ దనియు, నగర గ్రామ రక్షకులుగా కాయస్థులను (కరణాలను) నియమింపవలయుననియ నగర గ్రామములలో దొంగలు అపహరించిన డబ్బును నష్టపడిన యజమానులకు నగర రక్షకు డొసగవలయు ననియు చెప్పబడినది. ఈ ధర్మములు అనుష్ఠించుట కష్ట సాధ్యము. ఐనను అవి శ్రద్ధతో ననుష్ఠించిన వారికి ఆయురారోగ్యములను, చిత్తశుద్ధిని ప్రసాదింప సమర్థములు. హార దత్తస్వామి 'ఉజ్జ్వల' అను సమగ్ర వ్యాఖ్యను ఆపస్తంబ ధర్మసూత్రములపై రచించెను. ఈ ధర్మసూత్రములలొ కొన్ని వేదాంత ప్రతిపాదకములును కలవు. వాటినే శ్రీ శంకర భగవత్పాదులు వ్యాఖ్య వ్రాసిరి.

ఖం.స