సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆనెగొంది
ఆనెగొంది :- తుంగభద్రానదికి ఉత్తర తీరమున నున్న ఇప్పటి శిథిలమగు ఆనెగొంది ఒకప్పు డొక ఆంధ్ర సంస్థానమునకు రాజధానిగా నుండి ఆంధ్ర చరిత్రమున ప్రముఖపాత్రను వహించి యుండెను. కన్నడభాషలో 'ఆనె' యనగ ఏనుగని యర్థము. ఆనెగొంది యనగా ఏనుగులకోన. దీనివలన నా ప్రదేశ మొకప్పుడు కాకులు దూరని కారడవిగా నుండె నని తెలియు చున్నది. ఆనెగొందియే కిష్కింధ యనెడు ఐతిహ్యము కలదు. ఋశ్యమూకము, పంపా సరోవరము, చక్రతీర్థము మున్నగు రామాయణ ప్రసిద్ధ స్థలములు ఆ పరిసరముల నుండుటచేతను, సీతాన్వేషణమున, లంకకు పోవుటకు శ్రీరాముడవలంబించిన మార్గ మదే యగుటచేతను ఆ యైతిహ్యము సమంజనమే కాగలదు.
ఆనెగొంది పూర్వ చరిత్రము అగాధ కాలగర్భమున నిగూఢముగ నున్నది. బౌద్ధమతావలంబకులగు ఓడ్ర యవనులీ ప్రాంతము నాక్రమించుకొని సముద్రతీరముల దనుక నాలుగు శతాబ్దముల వరకు పాలించిరను విషయము యథార్థమని చెప్పుట కవసరమగు చారిత్రక సంపద యింకను దొరక లేదు. క్రీ. శ. ౧౧ వ శతాబ్దము నుండి కొంత చరిత్రము కనుపించును.
క్రీ. శ. 1323 వ సంవత్సరమున ఓరుగల్లు పతనానంతరము అట రాజ ధనాగారాధ్యక్షులుగ పనిచేయు చుండిన హరిహర, బుక్క అను సోదరులు ఆనెగొంది నేలుచున్న జంబు కేశ్వరుని కొలువులో ప్రవేశించిరి. తమ ప్రతిభచే వారచిర కాలముననే మంత్రి, కోశాధ్యక్ష పదవులను సంపాదించుకొనిరి.
జంబుకేశ్వరుడు ముప్పదేడేడులు (క్రీ.శ. 1297-1334) సర్వజనరంజకముగా రాజ్యమేలెను. అతడు సాహసి. విక్రమో పేతుడు, త్యాగి, శరణాగత రక్షణ బద్ధకంకణుడు. 'కంపిలి' నగర మతని రాజధాని, కంపిలికి పడమట రమారమి ఎనిమిది మైళ్ళ దూరమున దుర్గమ పర్వత పంక్తుల మధ్య, శత్రుదుర్భేద్యముగ నిర్మింపబడి యున్నదీ ఆనెగొంది కోట. ఆపత్సమయములందు కంపిలి రాజులు అందు ప్రవేశించి ఆత్మరక్షణము చేసికొనుచుండిరి.
బహాపుద్దీన్ ఘప్తావ్ అనునతడు ఢిల్లీ చక్రవర్తియగు మహమ్మదు తుగ్లకునకు మేనల్లుడు. ఆతడు తన మామపై తిరుగుబాటు చేసెను. ఆతనికి ఉత్తర హిందూస్థానమందు తలదాచుకొనుటకు వీలుకలుగలేదు. కనుక అతడు తురకల కందుబాటులో లేని కంపిలి నగరమున కేతెంచి జంబుకేశ్వరుని శరణు చొచ్చెను. కాని అతనిని తరుముచు మహాసేన లతో చక్రవర్తియు కంపిలిని సమీపించెను.
జంబు కేశ్వరుడు. మెరికలవంటి ఐదువేల జోదులతో ఆనెగొంది దుర్గమున ప్రవేశించెను. ఆ కోటను మొగలులు ముట్టడించిరి. శరణాగతుడగు బహావుద్దీనును జంబుకేశ్వరుడు ద్వారసముద్రపు హోయసల రాజగు వీరబల్లాలుని కడకు 'తానూరు' కు సురక్షితముగ పంపివై చెను. చక్రవర్తి యొక్క సామదాన భేదములు జంబుకేశ్వరుని ప్రలోభ పరచజాలకుం డెను. జంబుకేశ్వరుడు తనకు జయము దుర్లభమని తెలిసికొని కోటలో గొప్ప చితి వేర్పాటు చేయించెను. అందు అంతఃపుర స్త్రీలును, ఇతర సాధ్వీమణులును ఆహుతియైరి. అసంఖ్యాకులగు స్త్రీలు, శిశువులు, తురకలకు చిక్కకుండుటకుగాను తమ ఖడ్గములకు తామే బలియైరి. కోటలోని వస్తుసామగ్రి కొలది దినములలో వ్యయమై పోయినది. తన ఐదువేల సైనికులతో జంబుకేశ్వరుడు యుద్ధరంగమున ప్రవేశించి శత్రు నాశన మొనర్చుచు వీరస్వర్గ మందెను.
ఈ విధముగా క్రీ.శ. 1334 లో ఆనెగొంది ముసల్మానులకు వశమయ్యెను. కోటలో ప్రవేశించిన చక్రవర్తికి ఆర్గురు అధికారులును, పదునొకండుగురు రాజకుమారులును, సజీవముగ చేజిక్కిరి, చక్రవర్తి యనుమతిని జంబుకేశ్వరుని భౌతిక దేహమునకు వైభవోపేతముగ దహన సంస్కారము జరిగెను. జనసామాన్యము నేటికిని అతని దేవతాంశునిగ నెంచి పూజింతురు. చక్రవర్తి జంబుకేశ్వరుని శీలమునకు సంతసించి, ఆతని కుమారులను గౌరవమర్యాదలతో చూచెను. చక్రవర్తి అనెగొందిలో మల్లిక్ నాయబును తన ప్రతినిధిగ నిల్పి రాజకుమారులను మంత్రి మున్నగు నితర బందీలను తోడ్కొని ఢిల్లీ నగరమునకు తిరిగిపోయెను.
చక్రవర్తి తిరిగిపోయిన తరువాత స్వాతంత్య్ర పిపాసువులగు ఆనెగొంది ప్రజలు తిరుగుబాటు చేసిరి. వారి నణచుటకు నాయబునకు సాధ్యము కాలేదు. ఢిల్లీ చక్రవర్తి సాయ మొనర్పజాలక పోయెను. తన మంత్రుల హితోపదేశము ననుసరించి ఢిల్లీ చక్రవర్తి తన బందీ యందున్న ఆనెగొంది మంత్రియగు హరిహరుని ఆనెగొంది రాజుగను, అతని సోదరుడగు బుక్కని మంత్రిగను నియమించి, వారు తనకు లోబడి యుండునట్లొడబరచి, తగు బలముతో వారిని ఆనెగొందికి పంపించెను. ఆ సోదరు లట శాంతి నెలకొల్పిరి.
జంబు కేశ్వరుని కుమారులు ఇస్లాము మతము నవలంబించుటచే వారు ఆనెగొంది రాజ్యార్హతను గోల్పోయిరి. సుప్రసిద్ధ యాత్రికుడగు ఇబెన్ బతోతా, మతాంతరులైన ఈ రాజకుమారులకు అత్యంత సన్నిహితుడగు స్నేహితుడుగ నుండెను. వీరి సద్గుణములను గురించియు, చక్రవర్తికి వీరియెడగల గౌరవ ప్రేమలను గురించియు, అతడు తన గ్రంథములో వర్ణించినాడు. ' కీ. శ. 1336 లో విజయనగరము స్థాపిత మైనది. హరిహరుని రాజధాని ఆనెగొందినుండి విజయనగరమునకు మారినది. అప్పటినుండి క్రీ. శ. 1565 వ సంవత్సరమువరకు ఆనెగొంది విజయనగరపు దండనాయకుల పాలనమున నుండెను. తాళికోట పరాజయము తరువాత కొంతకాలమునకు మరల నిచ్చట ఒక చిన్న రాజ్య మేర్పడెను. ఆ రాజులు విజయనగర సమ్రాట్టుల వంశీకులని తెలియుచున్నది.
తాళికోట యుద్ధము తరువాత ముసల్మాను సుల్తానులు విజయనగర సామ్రాజ్యాంతర్భాగములు పంచుకొన్నప్పుడు ఈ యానెగొంది గోల్కొండ నవాబులకు భుక్తమైనట్లగుపడుచున్నది. క్రీ. శ. 1686 లో గోల్కొండతో పాటు ఆనెగొందియు మొగలులకు వశమైనది. క్రీ. శ. 1776 లో టిప్పుసుల్తాను ఆనెగొంది తిమ్మప్పరాజును సింహాసన భ్రష్టునిజేసి పట్టణమును ధ్వంసమొనర్చెను. క్రీ. శ. 1799 లో శ్రీరంగపట్టణపు యుద్ధమందు ఇంగ్లీషువారు టిప్పును చంపి ఆనెగొంది రాజును మరల ప్రతిష్ఠించి, అతనికి 1300 రూప్యముల మాసభృతి నేర్పాటు చేసిరి. మైసూరు రాజ్యభాగముల పంపిణి సందర్భమున ఆనెగొంది మరల గోల్కొండ నవాబుల భాగమునకు వచ్చెను. అప్పటినుండి క్రీ. శ. 1950 వరకు అది ఆసష్టాహీలకు సామంతరాజ్యముగనుండెను. ఇతర mసంస్థానములవలె, జాగీరులవలె ఆనెగొందియు ఆ సంవత్సరము హైద్రాబాదు రాష్ట్రములో లీనమై పోయినది. ఆనెగొంది పట్టణము ఆనెగొంది సంస్థానమునకు రాజధానిగా తనరారుచుండెను.
కొ. భూ.
ఆపత్థ్సితి చట్టనిర్మాణము - Emergency Law :- అసాధారణ పరిస్థితులయందు ప్రజలను, రాజ్యమును రక్షింపవలసిన బాధ్యత ప్రతి నవీన రాజ్యాంగ ప్రణాళిక యందును పేర్కొనబడి యున్నది. ఆపత్తునందు భూపాలుడో, రాష్ట్రపతియో, ముఖ్యమంత్రియో, నేనాపతియో మరియే యితర సమర్థుడో రాజ్యమును రక్షింపవలసిన విధియున్నదికదా ! ఆపత్తు ఆ సన్నమయినప్పుడు నిర్ణ యింపబడిన విధానము "ఆపత్ట్సిత న్యాయ" మందురు. ఈ అధికారము భారత రాజ్యాంగ ప్రణాళికలో రాష్ట్రపతియందు నిలుపబడినది.
ఈ సందర్భములో 'ఆపత్తు' అనగా మూడు విధముల స్థితమైన ఆపద :
- 1, దేశాంతర యుద్ధము, లేక దేశములో విప్లవము.
- 2. రాజకీయ కారణములచే రాజధానులందు రాజ్యకార్య స్తంభన.
- 3. ద్రవ్యలోపముచే గలుగు ప్రమాదము.
I బాహ్యాభ్యంతర యుద్ధవిప్లవములచే గలుగు ప్రమాద మాసన్నముకాగా రాష్ట్రపతి ప్రకటన యొకటి (Proclamation) గావించి, యావత్తు రాజ్య నిర్వాహకములను తనయందాపాదించుకొని, యావచ్ఛాసవాధికారమును లోకసభయందు నిలువునట్లుగా ప్రకటన చేయును. అట్టి సమయమందు కేంద్రాధికారమే ప్రమాణముగా వర్తింపగలదు. కేంద్ర ప్రభుత్యోద్యోగులే సర్వాధికారములను నిర్వర్తించుచు రాష్ట్రపతికిని, లోక సభకును బాధ్యులయియుందురు, ఆ సమయమందు లోకసభకు శాసనాధికారము విపులమై, నిరంకుళమై యుండగలదు. ఒక వేళ లోకసభ 'సమా వేశములో ' లేనిచో, రాష్ట్రపతి రెండు మాసములవరకు స్వంతముగా ఆపత్ట్సితస్థితిని నిర్వహించును. కాని వెంటనే లోకసభను సమావేశపరచి లోకసభ యొక్క యంగీకారమును పొంద వలయును.
II రాజ్యాంగ స్తంభన : విశ్వాసరాహిత్య తీర్మానముల వలనను, రాజకీయ వర్గములలో ఒండొరుల వైషమ్యముల వలనను ఏ రాజధాని యందైనను మంత్రివర్గము స్థిరముగా పొసగజాలక యుండెనేని యట్టి పరిస్థితిని 'రాజ్య కార్యస్తంభన యని చెప్పవలయును. (Failure of Constitutional machinery). అట్టి పరిస్థితినోక యాపత్తుగా గ్రహించి రాష్ట్రపతి ప్రకటనగావించి యా రాష్ట్రము యొక్క నిర్వాహ కాధి కారము తనయందును, శాసనాధికారము లోక సభయందును నెలకొల్పవలయును. కాని న్యాయాధి కారములను మాత్రము ఆ రాజధాని యొక్క ఉన్నత న్యాయస్థానము (హైకోర్టు) నుండి తొలగించరాదు. రాష్ట్రపతిచేసిన ఈ ప్ర క ట న ను లోకసభ యంగీకరించినచో ఆరు మాసములవరకు విళంబించవచ్చును. ఈ కాలమం దారాష్ట్రములో నుండిన రాష్ట్ర శాసనసభకు శాసనాధికారములు జాలవు.
III ద్రవ్యావత్తు : ఏ దుష్టకాలమందైనను దేశములో ద్రవ్యలోపముగలిగి భారతమున కన్యదేశములలో పరపతి(Credit) తగ్గినను రాష్ట్రపతి తద్విషయమయిన 'ప్రకటన' నొకటి గావించి ప్రభుత్వోద్యోగులు, న్యాయాధిపతులు మున్నగువారల యొక్క వేతనములను, ఒరుంబడులను (allowances) తగ్గించి ద్రవ్యాపత్తు నుండి దేశమును రక్షించును. మరియు రాష్ట్రపతి స్వతః పరిశీలించి సవరణలు గావించి, ఉచితరీతిగా అంగీకారమిచ్చును.
ఈ పై విధములయిన ప్రాథమిక హక్కులకు బాధ కలిగినదని ఆరోపణలు చేయుచు న్యాయ స్థానములకు విన్నపములు చేయరాదు.
బు. సు
ఆపస్తంబుడు :-
ఏతద్దేశ ప్రమాతన్య సకాశాదగ్ర జన్మనః
స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః'
వ్యవస్థితార్య మర్యాదః కృతవర్ణాశ్రమ స్థితిః
త్రయ్యాహి రక్షితో దేశః ప్రసీదతి నసీదతి.
(మనుస్మృతి)