సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆనందవర్ధనాచార్యుడు
ఆనందవర్ధనాచార్యుడు :- కాలము సమకాలికులు :- భారతీయ సాహిత్యశాస్త్రము శాఖోపశాఖలుగా విస్తరిల్లినది. సుప్రసిద్ధులైన సాహిత్య శాస్త్రకారులల శ్రీ ఆనందవర్ధనాచార్యుడు పేరెన్నికగన్న వాడు. ఈతడు కాశ్మీర దేశీయుడు. 855-884 క్రీ. శ. లో కాశ్మీరదేశము నేలిన యవంతివర్మ యాస్థానము నీ విద్వన్మణి యలంకరించి యుండెను. ఆనాడు ప్రఖ్యాత పండిత కవులకు కాశ్మీరము కాణాచియై యుండెను. సుప్రసిద్ధులయిన విద్వాంసులలో ముక్తాకణుడు, శివస్వామి, రత్నాకరుడు మున్నగువా రానంద వర్ధనునితో పాటుగా అవంతివర్మ సభను భూషించియుండిరని రాజ తరంగిణి చెప్పుచున్నది. సమకాలిక మహాకవులలో నాయకమణి యనదగు ఆనందవర్ధనుడు క్రీ. శ. 800 ప్రాంతమందున్న ఉద్భటుని పేర్కొనెను. క్రీ. శ. 900 ప్రాంతమందుండిన రాజ శేఖరునిచే తాను ప్రశంసింపబడెను. కావున నీతడు తొమ్మిది పది శతాబ్దముల నడిమి వాడై యుండు ననియు, ఈతని కావ్యరచనా కాలము క్రీ. శ. 840-870 వరకును అయియుండు ననియు చారిత్రకులు తలంచుచున్నారు.
వంశము :- ఆనంద వర్ధనాచార్యునిది రాజానక వంశము. కాశ్మీర పండిత వంశములలో రాజానక వంశము మిక్కిలి ప్రతిష్ఠ గన్నది. మహా విద్వాంసులు, రచయితలు ఎందఱెందరో ఈ వంశమున నుద్భవించిరి. రుయ్యక మమ్మటాదులగు నాలంకారిక శ్రేష్ఠులి కోవలోనివారే. mఆనందవర్ధమని తండ్రి నోణపండితుడైనట్లు దేవీ శతకము వలన తెలియుచున్నది.
ఆనందవర్ధనుని కృతులు :- ఈ మహాకవి రచించి గ్రంథములలో దేవీశతకము, విషమబాణలీల, అర్జున చరితము, ధర్మో త్తమ వివృతి, ధ్వన్యాలోకము ముఖ్యములు. విషమబాణలీల, అర్జున చరితములు ప్రాకృత కావ్యములు. దేవీశతకము యమకాది శబ్దాలం కారములతోను, గోమూత్రికాది చిత్రబంధములతోను విలసిల్లుచు 'ఆనందవర్ధనుడు మహితధ్వని కర్తయేకాదు, చిత్రకవితా ధురీణుడు' నగునని యా కవీంద్రుని సవ్యసాచిత్వమును వెల్లడించుచున్నది. దీనికి కయ్యటుడను కాశ్మీరపండితు డొక వ్యాఖ్యను వ్రాసెను. ధర్మకీర్తి రచించిన ప్రమాణ నిశ్చయమను గ్రంథమునకు వ్యాఖ్య ధర్మోత్తమ యనునది. దానికి ఆనందవర్ధనుడు రచించిన వివరణ మే ధర్మోత్తమ వివృతి.
ధ్వన్యాలోకము :- ఆనందవర్ధనుని విస్తార యశస్సు నకు మూలకారణమయినది యాతని ధ్వన్యాలోకము.
అలంకార శాస్త్రమునకెల్ల శిరోభూషణమన నొప్పిన దీ గ్రంథరాజము. కావుననే వేదాంతశాస్త్రమునకు వ్యాస మహర్షి బ్రహ్మసూత్రము లెట్లో, వ్యాకరణమునకు పాణిన్యాచార్యుని యష్టాధ్యాయియెట్లో సాహిత్య శాస్త్రమునకు శ్రీమదానందవర్ధనుని ధ్వన్యాలోక మళ్లే యని విమర్శకు లుగ్గడించినారు. లలితమైన కావ్యతత్వమును
నిరూపించు నీ ధ్వన్యాలోకమును రచించి యానంద వర్ధనుడు సకల సహృదయ హృదయానంద వర్ధనుడుగా
నన్వర్థుడైనా డని రసిక శేఖరులు ప్రశంసించినారు. ధ్వన్యా లోకమున ప్రతిపాదింపబడిన మార్గమునే శిరసావహించి
యానంతరికాలంకారికులు పలువురు సాహితీ విమర్శములు సాగించి గ్రంథములను వెలయించినారు.
ధ్వన్యాలోకము నే సహృదయాలోక మనియు, కావ్యాలోక మనియు వ్యవహరించుట గలదు. ఇది కారి కా రూపమున నున్న ధ్వని యను మూలగ్రంథము-దాని పై ఆలోకమను వృత్తియు చేరి ధ్వన్యాలోక మైనది. ఇది నాలుగు భాగములుగ విభజింపబడినది. దీనిలోని భాగములకు ఉద్యోతము లని పేరు.
కారికాకర్తయు ఆనందవర్ధనుడును భిన్నులు కారు: ధ్వన్యాలోకములో కారికలను సహృదయు డను నతడు రచించె ననియు, ఆ కారికలకు ఆలోక మను వృత్తిని మాత్రము ఆనందవర్ధనుడు నిబంధించెననియు కొందరు విమర్శకు లొక వాదమును లేవదీసిరి. ఈ గ్రంథములో సహృదయ శబ్దము తరుచుగా వచ్చుటయు, లోచన వ్యాఖ్యానమును రచించిన యభినవగుప్తు డచటచట 'కారికాకారుని మత మిది, వృత్తి కారుని మత మిది'యని వేరుచేసి చెప్పుటయు ఈ వాదము నకు దారితీసినవి. కాని చక్కగా పరిశీలించిన విద్వాంసులు కారికావృత్తి రూపమైన సంపూర్ణ ధ్వన్యాలోక గ్రంథమునకు కర్తయానందవర్ధనుడే యని నిశ్చయించినారు. ఆలంకారిక సంప్రదాయమున ఆనందవర్ధనుడే ధ్వన్యాలోక రచయిత యని ప్రసిద్ధి గలదు. రాజ శేఖరుడు, కుంతకుడు, మహిమభట్టు, క్షేమేంద్రుడు, హేమచంద్రుడు, ప్రతీ హారేందు రాజు మొదలగు పెక్కురు సాహిత్యశాస్త్రకారులు కూడ ఆనందవర్ధనుడే కారికావృత్తులు రెండింటికిని రచయిత యైనట్లు తెలిపియున్నారు. ధ్వని ప్రస్థానము (గ్రంథరూపము బొంది నట్టిది) స్వోపజ్ఞ మైనట్లు ఆనందవర్ధనుడే రచించెను. ఈ గ్రంథమున గన్పట్టు సహృదయ శబ్దము కారికా కర్త నామధేయ మనుటకు తగిన ప్రబల ప్రమాణములు లేవు. కావ్యత త్త్వజ్ఞుడగు రసికు డనియే దాని కర్థము చెప్పుట యుక్తము. అభినవగుప్తుడు కారికాక ర్తను - వృత్తికర్తను వేరుచేసి చెప్పియుండుట పాఠక సౌకర్యారమే యనియు, వస్తుతః అతనికి కూడ ఆనందవర్ధనుడే ధ్వన్యాలోకకర్త యనునదియే యభిమత మనియు, నాతని భరతనాట్య శాస్త్ర వ్యాఖ్య యగు అభినవ భారతిని పరిశీలించినవారికి తెలియకపోదు.
ధ్వన్యాలోకము, సాహిత్య శాస్త్రము :- శాస్త్ర మనగా శాసించునది. అనధిగతార్థ జ్ఞాపనమే శాసనము. సకల ప్రమర్థసాధకములగు రసాదులను గుఱించిన జ్ఞానసాధన మగుట సాహిత్యము శాస్త్రము. విశేషముగా ధ్వన్యా లోకము ప్రమాణాంతరమువలన తెలియరాని ధ్వని స్వరూపమును నిరూపించునదగుట దానికి శాస్త్రత్వము సుప్రసిద్ధము. "ఆనందవర్ధనాచార్యులు ఈ శాస్త్రము ద్వార సహృదయ హృదయములయందు దేవాలయాది ధర్మసంస్థా నిర్మాణమున వలె శాశ్వతమైన ప్రతిష్ఠను పొందును గాక" యని నుడివిన యభినవగుప్తాచార్యులు ధ్వన్యా లోకము శాస్త్రమని ముక్తకంఠమున చెప్పనే చెప్పిరి.
గ్రంథ ప్రతిపాద్యము :- ప్రథ మోద్యోతములో ప్రతిపాదింపబడిన విషయము లివి : 1. ధ్వని యనున దొకటి లేనేలేదను ధ్వన్యభావవాదుల వాదముల యనువాదము. వాని ఖండనము. 2. వాచ్యార్థ వ్యంగ్యార్థములు. రస ధ్వనియే కావ్యాత్మ. ధ్వని సహృదయైక వేద్యము. 3. ధ్వని నిర్వచనము. ఆక్షేన సమాసోక్త్యాదు లగు నలంకారములలో ధ్వని యంతర్భూతము కాదు. ధ్వని బుధసమ్మతము. రసధ్వనియే కావ్యాత్మ యను విషయమున అనుభవ ప్రమాణము - ఇతిహాస ప్రమాణము. 4. ధ్వని భేదములు. అవి వక్షిత వాచ్యధ్వని, వివక్షితాస్య పరవాచ్య ధ్వని. 5. భాక్తవాదము. భక్తిధ్వనులు భిన్నములు. భాక్త వాద నిరసనము. 6. రసప్రతీతి. రస ప్రతీతి శబ్దముల వలన గలుగదు. రసము సామాజికనిష్ఠము. ధ్వని నిర్వచింపరాని దనుట యుక్తము కాదు.
ద్వి తీయో ద్యోతము :- 1. అవిపక్షిత వాచ్యధ్వని యర్థాంతర సంక్రమితము అత్యంత తిరస్కృత వాచ్యము నను విధమున రెండు తీరులు, ఉదాహరణములతో తన్ని రూపణము. 2. విపక్షి తాన్యపరవాచ్యము సంలక్ష్య క్రమవ్యంగ్యము- అసంలక్ష్యక్రమ వ్యంగ్యము నని రెండు విధములు. 3. అసంలక్ష్యక్రమ వ్యంగ్యము రసము భావము, రసాభాస భావాభాసములు, భావశమమ మొదలగు రూపముల విలసిల్లు విధము 4. రసపదాద్య లంకారముల స్వరూపము. 5. గుణములకు అలం కారము లకు భేదము 6. శృంగారాది రసముల కనుగుణములైన పరస్పర గుణాదులు, 7. సంలక్ష్య క్రమ వ్యంగ్యములోని యవాంతర భేదములైన శబ్దశక్తి మూలధ్వని, అర్థశక్తి మూలధ్వని, 8. శ్లేషకు, అర్థశక్తి మూల ధ్వనికి నిగల భేదము, 9. అలంకార ధ్వని కుదాహరణములు,
తృతీయోద్యోతము :- 1. వ్యంజకమును బట్టి యేర్పడు ధ్వని భేదములు. 2. వర్ణపద వాక్య సంఘటనా ప్రబంధ రూపకములై న వ్యంజకముల వలన నేర్పడు వివిధ వ్యంగ్యములు. తదుదాహరణములు. 3. అసమాస, మధ్యమ సమాస, దీర్ఘ సమాస రూపమైన సంఘటనా స్వరూపము. 4. రసోత్పత్తి, రసచర్వణము, ఏయలం కారము లేరసముల కనుకూలములను చర్చ. 5. ఇతి వృత్తమునకు రసమునకుగల సంబంధము, సుప్తిజ్ విభక్తులతోను, కృత్తద్ధిత ప్రత్యయములతోను, సమాసాదులతోను అసంలక్ష్య క్రమధ్వని ధ్వనించు విధము, రసవిరోధులు. 6. ఒక కావ్యములో ముఖ్యమైన రస మొకటియే యుండును. తక్కినరసము లప్రధానములు. వాచ్యార్థ గమ్యార్థముల భేదము. గుణవృత్తి వ్యంగ్యములకుగల భేదము. వ్యంగ్య మనుమాన ప్రమాణముతో గతార్థము కాదు. 7. గుణీభూత వ్యంగ్యము. (ఇదియే మధ్యమ కావ్యము. వ్యంగ్యార్థముకంటె వాచ్యార్థము సుందరముగా నున్నట్టిది గుణిభూత వ్యంగ్యము) గుణీభూత వ్యంగ్యమున కుదాహరణములు, 8. చిత్రకావ్యము (దీనినే ముద్ర కావ్యమందురు) శబ్ద చిత్రములు, వాచ్య చిత్రములు, యమకాదులు - ఉత్ప్రేక్షాదులు. 9. రీతులు-వృత్తులు.
చతుర్ధోద్యోతము :- 1. ధ్వని కావ్యములలోను, గుణీ భూత వ్యంగ్యములలోను కవి ప్రతిభ నిత్యనూతన శోభలను వెలయించును. 2. రసభావ తదాభాస తత్ప్రశము నాది బహు ప్రకారములు. 3. కావ్యమున కవి యొక రసమునకే ప్రాధాన్య మిచ్చుటవలన శోభాతిశయము కలుగును. 4. మహాభారతము శాంతరస ప్రధానము, రామాయణము కరుణరస ప్రధానము. 5. దేశ కాలా వ్యవస్థా భేదమువలన వాచ్యార్ధములు కూడ ననంతములు. అవి నవ్యములు. 6. పలువురు కవుల చే పలు విధములుగా ననుభుక్తమయ్యు కావ్య నవ్యత్వ స్థితికి హానిలేదు. 7. కవుల వాక్యములకు పరస్పర సాజాత్యము గన్పట్టినను విషయభేద ముండుటవలన అది దోషము కాదు. 8. వాక్యార్థ సాజాత్యము బింబ ప్రతిబింబ రూపమునను, వస్తుచిత్ర రూపమునను, వ్యక్తి వ్యక్త్యంతర రూపమునను గలుగును. వీనిలో మొదటి రెండును అనుపాధేయములు. పదార్థ సాజాత్యము దోషము కానేకాదు. 9. స్వతంత్రులగు మహాకవులు వాజ్మాహాత్మ్యము,
ధ్వని ప్రస్థానము :- సాహిత్య శాస్త్రకర్తలలో ముఖ్యులు కొందరు కావ్యతత్త్వమును పరిశీలించి కావ్యాత్మను నిర్ణయించిరి. అట్టివారిలో భామహాదులు అలంకారమే కావ్యాత్మ యన్నారు. వామనుడు రీతి కావ్యాత్మయని నిశ్చయించెను. కుంతకుడు వక్రోక్తి కావ్యాత్మ యగునని పల్కెను. క్షేమేంద్రుడు ఔచిత్యము కావ్యాత్మయని భావించెను, ఆనంద వర్ధనాచార్యుడు ధ్వనియే కావ్యాత్మయని సిద్ధాంతీకరించెను. సహృదయ శేఖరుడగు నానందవర్ధనుని హృద్యమగు నీ ధ్వనిప్రస్థానము సాహితీలోకమునకు శిరోధార్యమైనది. భరతమహర్షి నిర్వచించిన రసాభివ్యక్తి మార్గమును గేవలము శ్రవ్యకావ్య విషయకముగ నేగాక కావ్య సామాన్యమునకు సమన్వయించి యీ విద్వద గ్రేసరుడు రసధ్వనియే కావ్యజీవితమని సోదాహరణముగా సయుక్తికముగా నిరూపించినాడు. మహాకవులగు కాళిదాసాదుల కవితలలో కల ధ్వనిమణులను ప్రదర్శించినాడు.
ధ్వనిమార్గము - ఆనందవర్ధనునికి పూర్వమే యుండెననుటలో సందేహములేదు. కాని ధ్వని స్వరూపమును వివరించు గ్రంథ మెద్దియు తొల్లి లేకుండెను. ఛాయా మాత్రముగానున్న ధ్వని భావమునకు రూపుదిద్ది శంకలను పరిహరించి, హేతుపుష్టి నొసగి, సంవాదములను జూపి, శాస్త్రత్వపదవి నధిరోహింపజేసిన మహనీయు డగుట శ్రీమదానంద వర్ధనుడు ధ్వని ప్రస్థానము స్వోవజ్ఞ మని చెప్పుకొనుట కర్హుడై యున్నాడు. 'ధ్వనిధ్వనియని ధ్వని చేయుటయేగాని నిగ్గదీసి ధ్వని స్వరూప మెట్టిది ? యని యడిగిన ఈ జడులేమి చెప్పగలరు ? -' అని పరిహసించినవారి మోములు వెల్లబార ధ్వని గ్రంథము వెలసినది. ధ్వని ప్రస్థానము సిద్ధాంతమై మెరసినది. ఈ ధ్వని భావము తొలుత వైయాకరణుల స్ఫోటవాదము చే స్ఫురింప జేయబడినది. స్ఫోటవాదము మిక్కిలి ప్రాచీనమైనది. పాణిని మహర్షి కంటే ముందే యీ వాదమున్నట్లు తెలియు చున్నది. స్ఫోటాయనుడను నాచార్యుని పాణినియే స్మరించియుండెను. ధ్వన్యాలోక గ్రంథరచనమును గురించి చెప్పుచు ఆనందవర్ధనుడు, 'ఈ గ్రంథము ధ్వని సిద్ధాంతమును నిరూపించుటకు మాత్రమే ప్రవృత్తము కాలేదనియు, కవితా ప్రయోజనమును వివరించుచు సహృదయాస్వాద్యమగు రసనిబంధనమున కవులకు మార్గ దర్శకముగా కూడ నీది యువకరించుననియు నుడివెను. ధ్వన్యాలోకము కవితానౌకకు దీపగృహము.
ఈ ధ్వనివాదమును వ్యక్తి వివేకము, హృదయ దర్పణము మున్నగు గ్రంథములలో మహిమభట్టు, భట్ట నాయకుడు మొదలగువారు నిరసించిరి. కాని యాలంకారికులలో పలువురిచే నాదరింపబడిన ధ్వని ప్రస్థాన గౌరవమున కంతమాత్రమున నా వంతయు లోపము రాలేదు.
ధ్వన్యాలోకముమీద
ధ్వన్యాలోకము - వ్యాఖ్యలు :- ధ్వన్యాలోకము మీద చంద్రిక యను నొక వ్యాఖ్య పూర్వ మున్నట్లు తెలియు చున్నది. అది యిపుడు లభ్యము కాదు. ప్రసిద్ధమయిన ధ్వన్యాలోక వ్యాఖ్య లోచనము. దీనిని రచియించినది శ్రీమదభినవగుప్తాచార్యులు. వీరు మహాపండితులు, విమర్శకులు, కాశ్మీర శైవాచార్యులు, పాణినీయమునకు మహాభాష్య మెట్లో, అలంకార శాస్త్రమునకు లోచన వ్యాఖ్య యట్లు. లోచన వ్యాఖ్య వలననే ధ్వన్యా లోకమున కంతటి ప్రచార ప్రసిద్ధులు గలిగిన వనుట యతిశయోక్తి కానేరదు. చంద్రికా వ్యాఖ్యాత శ్రీ మదభినవ గుప్తాచార్యుని పూర్వ వంశీయుడే యని తెలియుచున్నది. దానిని సమగ్రముగా అవలోకించియే యభినవ గుప్తులు లోచనమును రచించిరి. అక్కడక్కడ చంద్రికా వ్యాఖ్యను ఖండించుచు 'మా పూర్వ వంశీయునితో నిక కయ్యము చాలును' అనుచు లోచనకర్త వాదము నుపసంహరించు చుండుటయే యిందుకు సాక్షి.
ఆంధ్ర ధ్వన్యాలోకములు ... :- అఖిలభారత ప్రఖ్యాతిని గని పఠన పాఠములలో మిక్కిలి ప్రచారము నొంది యున్న ధ్వన్యాలోకమునకు తెలుగులోను గొన్ని యను వాదములు వెలసినవి. ధ్వనికారికలు కనువాద మగు “ఆంధ్రధ్వని" సుప్రసిద్ధ పండితులయిన శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రచించిరి. పిమ్మట ప్రకటింపబడిన వానిలో శ్రీ విద్వాన్, సాహిత్య శిరోమణి భాగవతుల కుటుంబశాస్త్రి (ఎం. ఏ.) గారి “అభిన వాంధ్ర ధ్వన్యా లోకము ( ప్రథ మోద్యోతము మాత్రమే), శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రులుగారి “ఆంధ్రధ్వని”, న్యాయ శిరోమణి శ్రీమాన్ వేదాల తిరువేంగళాచార్యుల వారి "ఆంధ్ర ధ్వన్యాలోకము" ప్రసిద్ధములు.
చ.రం
ఆనకట్టలు : నిక్షేప జలాశయ నిర్మాణము :-
1. జలాశయ నిర్మాణమునకు గల ముఖ్యోద్దేశములు:- జలాశయములు ఈ క్రింద వివరింపబడిన ఉపయోగముల కొరకై ముఖ్యముగా నిర్మించబడును.
- 1. వర్షములేని ఋతువులలో, లేక వర్షములు తక్కువగా నున్న కాలములో సస్యములకు అనుకూలముగా నీరు
సరఫరా చేయుటకు, బెట్టకాలములో మానవులకు పశుపక్ష్యాదులకు జీవనాధారమునకై నీరు సమకూర్చుటకు.
- 2. పెద్దనదుల వరదలవలన దేశమునకు కలుగు ఉపద్రవములను అరికట్టుటకు,
- 3. దేశములో పారిశ్రామికాభివృద్ధికై అవసరమగు విద్యుచ్ఛక్తిని చౌకగా ఉత్పత్తి చేయుటకు,
- 4. నౌకాయానమునకు వసతులు కల్పించుటకు.
కొన్ని ప్రదేశములలో వర్షములు సంవత్సరములో చాల భాగము విరివిగా కురియుచుండును. ఇవి సామాన్యముగా సస్యానుకూలముగ నుండుటచే పంటలు పండించుటకు వర్షముల ద్వారమున దొరకు నీరు సరిపోవును. కాని యితర ప్రదేశములలో సంవత్సరములో ఏ కొద్ది 'కాలమో వర్షములు కురియును. మిగత కాలములో వర్షము లుండవు. వర్షాకాలములో పైరులకు అవసరమైన దానికంటె అధికముగా నీరు లభించుటయు, ఇతర కాలములో పైర్లు పెరుగుటకు చాలినంత నీరు దొరకక