సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆధునిక వాస్తువాదములు
ఆధునిక వాస్తువాదములు :- ఆధునిక వాస్తుశాస్త్రమున పూర్వమును, నేడును కలిగిన రీతులను బరిశీలించుటకు ముందు, వర్తమానోద్యమము ఐరోపాలో నెట్లు వ్యాపించినదో తెలిసికొనుట అవసరము. ఆధునిక వాస్తువు 19 వ శతాబ్దారంభమున ప్రారంభమైనది. సాంఘిక పరిస్థితులు పూర్తిగా పరివర్తనమునంది సామాజిక జీవిత విధానము మారిపోయిన సమయ మిది. ఇట్టి సమయములోను ఐరోపాఖండమున వాస్తువు పరివర్తనరహితముగా నిలిచినది. వాస్తుశాస్త్ర నిపుణులు ప్రాచీనములై, మృతప్రాయములైన పద్ధతుల పునరుజ్జీవింపజేయు ప్రయత్నమున నుండిరి. వాస్తుశాస్త్రమంతయు సామాజికముగ మరణావస్థయం దుండెనని చెప్పనగును. వాటి నిర్మాణముల బరిశీలించినచో శవసంరక్షణమే చైతన్యచిహ్నమని అప్పటి వాస్తుకారులు భావించినట్లు తోచును. మృతరీతులు మాత్రమే నిర్మాణోపయుక్తములైన రీతులని వారు తలపోయుటయే దీనికి కారణము. కాని కొందరు జిజ్ఞాసువులు వాస్తువునందు రూపకల్పన చేయు సమస్యలను గురించి ఆలోచించ మొదలిడిరి. సంఘమే వాస్తురూపము (Architectural form) నకు మూలమనియు, చైతన్యవంతము, ప్రయోజనకరము అగు సృష్టి జీవ చైతన్యమునుండియే ప్రభవింపగలదనియు వీరు గుర్తించిరి. ఆధునికోద్యమము ప్రథమ ప్రపంచసంగ్రామానంతరము సంపూర్ణముగా రూపొందినది. వాస్తువున బ్రవేశించుటకు బూర్వమీ యుద్యమము కళలలో చేతిపనులలో పొడసూపి వర్ణచిత్రము, అద్దకము, ఘట నిర్మాణము, కఱ్ఱసామానుల తయారులలో నిమగ్నమై యారితేరినది. విలియం మోరిస్, ఫిలివ్ వెబ్ ఈ యుద్యమమునకు మార్గదర్శకులు. . ఫిలిప్ వెబ్ 1851 వ సంవత్సరమున 'అరుణ భవనము' (Red house) ను నిర్మించెను. దీనిలో అలంకారపుజిలుగు లన్నియు పరిహరింపబడి, ముఖ్యాంశములు మాత్రమే గ్రహింపబడెను. అవసరమునకు దగిన వస్తువులు మాత్రమే యుపయో గించుటయందును, సరళములును, యుక్తియుక్తములునగు వివరముల యుపయోగము నందును ఇది ప్రత్యేకతనుగడించినది. ఇదివరలో కీర్తి గడించిన యే రీతులనుండియు వివరముల నీతడిందుప యోగించలేదు. ఈ విధముగా నోక వాసభవనము నిర్మాణ రీతులందు వైలక్షణ్యమునకు మూలమైనది. వాసగృహవాస్తువే నూతన పద్ధతులు ప్రభవించుటకు కారణమైనది. ఇందవలంబింపబడిన సూత్రములు మూలాధారములైనవి. మానవత్వ నిర్మాణమువైపు గొనిపోవు నూతనసమాజ వ్యవస్థయే వీరి యాశయము. ఈ యుద్యమము ఆర్టు నౌవీ (Art Nowveau) అని ఫ్రాన్ సు దేశమునందును జుగండిస్టిల్ (Jugen distil) అని జర్మనీ దేశము నందును వ్యవహరింపబడినది. బెల్జియం దేశమున ఈ యుద్యమము హెన్రీవాన్ డీ వెల్డీయను వానితో నారంభింపబడెనని చెప్పవచ్చును. ఇది ప్రారంభమున జర్మనీలోను, క్రమముగా ఐరోపా ఖండమందంతటను వ్యాపించెను.
ప్రజల యభిరుచులలో క్రొత్త పరిణామము, శాస్త్రియము, సాంకేతికమునైన నిర్మాణాభివృద్ధి, నూతన సందర్శన సిద్ధాంతములు, ఆధునికోద్యమము బయలుదేరుటకు ముఖ్యకారణములు, స్థాపత్య (Engineering) రంగమునందు అభివృద్ధి ప్రదర్శకమైన నిర్మాణములు,ఉక్కు, గాజు, దృఢీకృతమైన కాంక్రీటు (R. C. C)మొదలగువాని ఉపయోగ జ్ఞానము, వీటి సాంకేతిక సౌందర్యావకాశములు మృతరీతుల బంధనములనుండి వాస్తువునకు విముక్తి కలిగింప కృషి చేయుచున్న వాస్తు శాస్త్రజ్ఞులకు చక్కని దోహద మొసగినవి. ఈ కాలమున నిర్మింపబడిన సుందరమైన వంతెనలు, స్ఫటిక ప్రాసాద ముల (Crystal palaces) వంటి కట్టడములు, నూతన పద్ధతిలో ముఖ్యముగా పేర్కొనదగిన పొలిమేర రాళ్ళు, వాస్తు శాస్త్రజ్ఞులు తమ భావములను ప్రయోజన ధర్మము నాధారముగాగొని నిర్మింప మొదలిడిరి. నిర్మాణ రంగమున నూతన పద్ధతుల నవలంబించుటవలన, రూపపరిణామము ప్రయోజ్య వస్తువులపై నాధారపడ జొచ్చెను. ఆధునిక వాస్తువునకు మార్గదర్శకులైనవారిలో అధిక సంఖ్యాకులు స్థాపత్య శాస్త్రజ్ఞులే. ప్రత్యక్షముగనో పరోక్షముగనో ఆధునిక వాస్తుకారులకు గురు ప్రాయులు లికార్ బిజీయర్, గ్రోపియస్ మొదలగువారు. వీరిలో వెన్నీనుకు చెందిన యిద్దరు శిల్పులు, ఆటోవాగ్నరు (1841-1918).- అడాల్ఫ్ లూసు (1870-1933) ఫ్రాన్సు దేశమునకు జెందిన అగస్ట్ పెర్రెటి, జర్మను దేశస్థుడగు పీటర్ బెహరన్సు అనువారు ముఖ్యులు. 1918 సం తరువాత ఆధునిక వాస్తు శాస్త్ర చరిత్ర, వైతాళికులైన వ్యక్తులను బట్టిగాక, ప్రపంచమంతటను వ్యాపించిన యుద్యమమునుబట్టి నడచినది. దీనికి కారణము వాస్తు శాస్త్రజ్ఞులలో ముఖ్యులైన వారి నిరంతర ప్రయత్నములే. ఫ్రెంచి దేశీయుడును, స్విట్జర్లాండులో జన్మించినవాడును, ఆకృతి రచనావేత్తయు, తత్త్వజ్ఞుడును అగు లి-కార్ -బిజీయరు, జర్మనీదేశపు వాస్తు శాస్త్రజ్ఞులైన వాల్టర్ గ్రోపి యస్, మైస్ వెండర్ రోహె, ఎరిక్ మెండల్ సోహన్, డచ్ దేశీయుడగు జె. జె. పి ఔడ్ అనువారు ఈ సందర్భమున పేర్కొనదగినవారు. లి-కార్ బిజీయరు ఈ ఉద్యమ నాయకుడుగా నెన్నబడుచున్నాడు. ఆధునిక వాస్తువు ప్రాథమిక దశయందు చిత్రకళా రంగము నందలి వివిధ మతములచే ప్రభావితమైనది.
ఈ తత్వము లన్నియు సందర్శన సిద్ధాంతమును (Theory of Vision) గూర్చిన వివిధ వాదములపై ఆధారపడి యున్నవి. వీనిలో కొన్నిమాత్రమే వాస్తువు నందు ప్రతిబింబించినవి. వీటిని క్యూబిజమ్, నియోప్లాస్టీ సిజమ్, ఎక్స్ ప్రెషనిజమ్, ప్యూరిజమ్, కన్ స్ట్రక్టి విజమ్, ఫ్యూచరిజమ్ అందురు. పయిని పేర్కొనిన వాదములు వాస్తుశాస్త్రము నావరించి చాలకాలము నిలువలేదు. ఇవి ఒక నూతనరీతిలో సంయోగము నొంది ఐరోపాలో నందరిచేత నవలంభింవ బడినవి. అమెరికాదేశమున ఫలివన్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ (Sallivan Frank Lloyd Wright) అను వారి మార్గ దర్శకత్వమున ఆధునిక వాస్తువు భిన్నమార్గ మవలంబించినది. కాని ప్రస్తుతము ముఖ్యమైన వాస్తుపద్ధతి యొక్కటే నిలిచియున్నది. ఈ పద్దతి అమెరికా ఐరోపా పద్ధతుల సమ్మేళన రూపమని చెప్పవచ్చును. మనదేశమునందలి ఆధునిక వాస్తుశాస్త్ర పద్ధతులగూర్చి సంక్షిప్తముగా అంత్యభాగమున చర్చింతము.
క్యూబిజం : ఇది వస్తువులను రేఖాగణిత సంబంధము అయిన ఆకారములతో కూర్చి చిత్రించు పద్ధతి. వాస్తు శాస్త్రమును ప్రభావితము గావించిన విభిన్న వాదములలో క్యూబిజమ్ (Cubism) ముఖ్యమయినది. ఈ ప్రభావమొక యుద్యమ రూపమున కలిగినది. యథాదర్శనము (perspective) కనిపెట్టబడిన తరువాత అది నవజీవన (Renaissance) యుగవాస్తువుపై ప్రభావము కలిగించినది. ఆధునిక వాస్తువుపై క్యూబిజమ్ ప్రభావముగూడ నిట్టిదే. యథాదర్శనము కనుగొనుటతో దృక్కు (Vision)త్త్రె పరిమాణకముగా మారినది. ఒకే దృక్కోణము నుండి స్థలాకాశము (Space) లోతునందును. ఇతరము లయిన రెండు పరిమాణములందును గ్రహింపబడుచున్నది. నిరంతరము పరిభ్రమించు ఒక కేంద్రమునుండి స్థలాకాశము యొక్క భౌతిక భావనను గ్రహించుటను క్యూబిజము వాదులు అలవరచుకొనిరి. వీరికి ఒక దృక్కోణమునుండి చూచుట సరిపోదు. ఒకేవస్తువును వివిధ దృక్కోణముల నుండి ఏక కాలమున పరికించి సాధ్యమైనంత సన్నిహితముగ దాని ప్రత్యేక సారమును తెలిసికొనుటకు వీరు ప్రయత్నింతురు. వస్తువు యొక్క బాహ్యరూప సందర్శనముతోనే తృప్తినందక వీరు వస్తువు యొక్క అంతర రూపమునుకూడ ప్రదర్శింతురు. యథాదర్శనము యొక్క మూడు పరిమాణములకు తోడుగా నాలుగవదిగా నెన్నబడు కాలమునుగూడ వీరు చేర్చిరి. దీనిని సాధించుటకై వస్తువును అంగ ప్రత్యంగములుగా విడగొట్టి దానిని సామూహిక చిత్రముగా ప్రదర్శించుటకు క్యూబిజము చిత్రకారులు యత్నించిరి. ఈ పద్ధతి ఆధునిక వాస్తువున చాల నూతన లక్షణములు బయలు దేరుటకు కారణమైనది. గమనాగమనము లొనర్చు సమతలములు, ఒక దానినొకటి అడ్డముగా దాటి వివిధకోణములలో చొచ్చుకొనిపోవు ఉపరితలములు, స్థలా కాశమునందు వ్రేలాడు సమతలములు మొదలగు లక్షణము లిట్టివి. దాని ప్రత్యేక పరిమాణము లలో చూడబడినదై ఒక సామాన్యమైన గోడయు, ఒక రేఖాగణిత ఆకృతియు, విశిష్టస్థాయి నందుకొని మనకు ప్రత్యేక సాంద్రానందము నీయ జాలియున్నది. ఇట్టివానికి అలంకరణపు జిలుగులు అనావశ్యక భారములే యగుచున్నవి. ఇదివరకు వాస్తుకారులు భవన విషయములో పృథుత్వ దృఢత్వములను గూర్చియే యాలోచించువారు. కాని యాధునిక వాస్తుకారులు ఘనపరిమాణమును, "సమతలముచే నియమితమైన స్థలాకాశమును" దృష్టియం దుంచుకొనుచున్నారు.
1925 సం॥న గ్రోపియన్ చే నిర్మింపబడిన డెస్సాలోని బావుహాప్, ప్యారిస్ సమీపమున లి-కార్- లిజీయర్ నిర్మించిన సెవాయ్ భవనము, క్యూలిస్టు వాస్తురీతిని సూచించు రెండు చక్కని నిదర్శనములు. ఆధునిక వాస్తువునకు గురుప్రాయులైన యీ యిద్దరు శాస్త్రజ్ఞులును యుద్ధా నంతర కాలమున క్యూబిజము సిద్ధాంతములను వాస్తువున ప్రవేశ పెట్టుటకు ప్రోత్సహించిరి. బావుహాస్ లోని ప్రయోగశాలా భవనపు గోడలు బ్రహ్మాండ మైన గాజు పలకలతో నిర్మింపబడినవి. దీనివలన కలిగిన పారదర్శకత బాహ్యాంతరములకున్న భేదమును తొలగించినది. ఒక దానిమీద నొకటిగా పేర్చబడిన అంతస్తులన్నియు ఏక కాలమునందే దృష్టికి అనును. గాజుతో నిర్మింపబడిన మూలలు భవన బాహ్యము యొక్క నిరంతర క్రమమును దృష్టికి విచ్ఛేదన మొనర్చుటకు తోడ్పడుచున్నవి. ఇది యొక పెద్ద ద్రవ్యరాశి యను భావమే కలుగదు. భవనాంతర నిర్మాణము లన్నియు బాహ్య ప్రదేశము నుండి కాన్పించును. స్థలా కాశములో వ్రేలాడునట్లు భ్రమకొల్పు వివిధ సమతలము లే ఈ భవన నిర్మాణము నందలి మూలాంగములు. సేవాయ్ ప్రాసాదమునందుకూడ అదే పారదర్శకతయు, బాహ్యాభ్యంతరావకాశముల అన్యోన్య సంక్రమణమును చూడనగును. ఇది పారదర్శకతవలన మాత్రమేకాక, భవనము యొక్క బాహ్యప్రదేశమును లోపలి భాగమునందలి ఘనావరణము (Cube) లోనికి గొనివచ్చుటవలన సాధింపబడినది. ఇష్టము వచ్చినట్లు అమర్చుటకు వీలుగానున్న గాజు గోడలు బాహ్యాంతర్భేదమును తొలగించినవి. ఈ కట్టడము అన్ని వైపులను అభిన్నముగా నుండుట కూడ దీని క్యూబిస్టు తత్త్వమున కొక నిదర్శనము. ఇది స్తంభములపై ఏకాంతముగ నుండుట చేతను, మొదటి అంతస్తును దాదాపు పూర్తిగా కాశీగా వదలుటచేతను కట్టడపు ఘనపరిమాణదృష్టియే యదృశ్యమగుచున్నది.
నియోప్లాస్టిసిజం : ఇది బంకమన్ను, మైనము మొదలగు మృదు పదార్థములతో ఆకృతులను కల్పించు శిల్ప ములో నూతనరీతి, ఇదియు, ఇకముందు పేర్కొనబడు వాదములలో ఎక్స్ ప్రెషనిజము అనునదియు తప్ప, తక్కిన వన్నియును క్యూబిజమునుండి బయలు దేరినవియే. క్యూబిజమును వాస్తవికముగా మార్చుటయను ఈ వాదమును మోండ్రియం (Mondriam) అను చిత్రకారుడు స్థాపించెను. చిత్రము యొక్క సమతలముమీద దీర్ఘచతురస్రములును, సమచతురస్రములును మృదుగతితో నుండు సంబంధముపైననే చిత్రనిర్మాణమంతయు ఆధారపడి యుండునని ఈతనివాదము, మరియు మూలవర్ణములైన నీలి, ఎరుపు, పచ్చ - రంగుల సమసమ్మేళనము, వానికి నలుపుతోను, తెలుపు యొక్క వివిధ చ్ఛాయలతోను ఉండదగిన సంబంధము అతి ప్రాముఖ్యము నొందునని ఈతని భావము. రంగుల సమప్రదేశములు, రేఖాగణిత శాస్త్రానుసారముగా నున్న ఆకృతులు ఒండొంటి సరసను నిల్పుటచే ఆకర్షణ కలుగు చున్నది. మైస్ వాండర్ రోహె అను వాస్తుకారుడే నియోప్లాస్టిక్ వాదియనుటకు అధికార్హత కలిగియున్నాడు. జె. జె. పి. అవుడ్ కూడ ఈ సిద్ధాంతము నుపాసించినవాడే. దీని ప్రభావము బాన్ హౌసేపై గూడ నున్నది. గ్రోపియస్, మైస్ అనువారు శిక్షకులుగానున్న హార్వర్డు శిక్షా స్థానము పై గూడ దీని ప్రభావము లేకపోలేదు.
ఎక్స్ప్రెషనిజము (Expressionism): యుద్ధానంతర కాలమున ప్రారంభమైన ఇంప్రెషనిజము (Impressionism) అనుదానికి ఇది ప్రతికూలముగా చిత్రకళారంగమున బయలు దేరినది. చిత్రకళయందు వ్యంగ్యరీతికి ప్రాధాన్యమిచ్చి వాస్తవికతను అంగముగా చేయుపద్ధతిని ఎక్స్ ప్రెష నిజము అందురు. చిత్రమునందు వివరముల యొక్క సమగ్రాకృతిపై భావనను నిలుపుటణం ప్రెషనిజము అనబడును. వాస్తువునందు ఈ సిద్ధాంతము సమకాలికమైన పిడివాదములకు ప్రతివాదముగా నావిర్భవించినది. ఎక్స్ప్రెషనిజము అను వాదమును సమర్థించిన నిర్మాత, ప్రయోజనవాదమును తిరస్కరించి, భవనాంగములను సాంకేతిక చిహ్నముల ద్వారమున ప్రకటించుటకు యత్నించును. నేత్రవైద్యమున కుపయోగపడు పరికరముల తయారు కర్మాగారము కన్నులవంటి రెండు మహోన్నత ద్వారములచే సూచింపబడినది. ప్రథమ ప్రపంచ సంగ్రామమునుండి 1924 వరకు ఎరిక్ మెండెహసన్ (Eric Mendhe Son) అనునాతడు గొప్ప వ్యంగ్యరీతి ప్రవక్తగా భావింపబడెను. అతని చిత్రములు, సొన్ స్టయిన్ గోపురము, ఈ వాదమునకు చక్కని నిదర్శనములు. జర్మను వాస్తు కారులందరు అల్పముగనో అధికముగనో ఈ యుద్యమముచే ప్రభావితులైనవారే. Purism - నిష్కళంకతావాదము (విశుద్ధతావాదము ) : ఇది క్యూబిజమునకు మిక్కిలి సన్నిహితమైనది. దీనిని లి - కార్ బిజీయరును, ఓజెన్ ఫాంటు అను చిత్రకారుడును ప్రవేశ పెట్టిరి. రేఖాగణితపు రూపములును, సహజ రూపములును గూడ సౌందర్య స్థానములేయనియు సమకోణ చతురస్రము, గ్రుడ్డు, వక్రరేఖ మొదలగు ఆకృతులన్నియు సుందరము లేయనియు ఈ వాదసారము. వాస్తువున ఈ వాదమును ప్రవేశపెట్టినవాడు లి-కార్ బిజీయర్ అనునాతడు.
Constructivism - నిర్మాణత్వవాదము : భిన్న భిన్న కాలములందీ వాదమునకు భిన్న భిన్నార్థములు కల్పింప బడినవి. కాసిమిర్ మాలెవిచ్ (Kasimir Malewitch) అను రష్యా చిత్రకారుడు 1913 ప్రాంతమున దీనిని ప్రారంభించెను. ఈతడు సహజ వస్తువులన్నిటిని త్రోసి పుచ్చి, వంగ్యాత్మకములును, భావములను తెలియ జేయునవియు నగు కొన్ని చిహ్నములను గ్రహించెను. ఇతడు విభిన్న వస్తువులకును, వాటి అన్యోన్య సంక్రమిత దశలకును గల సంబంధమును గుర్తించుటకు యత్నించెను. యుద్ధానంతరము రష్యాలో ప్రచారమైన వాస్తు - ఉద్యమ మంతయు నిర్మాణత్వ వాదము పేర బరగుచున్నది. ఈ నిర్మాణములన్నియు భవనము యొక్క అంతరార్థమును కాల్పనిక స్థాపత్యరీతులలో ధ్వనింప చేయుటకు పూనుకొనును. ఈ ఉద్యమము ఐరోపాఖండమున అంతగా ఆమోదమును బడయలేదు. బ్రిటిషు చిత్రకారుడు గేబో దీనిని గ్రహించినను వాస్తువున నిది ప్రత్యేక కృతులను ప్రసాదించలేదు.
Futurism - భవిష్యతావాదము : ఇటలీ దేశీయుడైన ఆంటోనియో సాంగ్ యీలియా అనునతడు (Antonio Sant Elia) 1914 సం॥ లో చేసిన ప్రకటన పత్రిక (Manifesto) తో భవిష్యతావాద మారంభమైనది. కాని త్వరలోనే ఇది ఆచరణము నుండి యంతరించినది. బోక్సి యోని యొక్క శిల్పఖండములు ఈ త త్త్వమునకు నిదర్శనములని చెప్పవచ్చును. వాస్తువునందు ఈతత్త్వము ప్రయోజనతా వాదమును స్థిరపరచినది. ఇదిగాక సమ్యత్వము (Elasticity), తేలికదనము, గమనశీలము (Mobility), నిరంతర పరివర్తనము అను గుణములను గూడ ఈ వాదము సమర్థించినది. సాంత్ ఈలియా యొక్క చోద్యమైన ఊహలేకాని అతడు తన ఊహలకు ఎట్టి రూపమును నొసగజాల డయ్యెను. ఈ ఉద్యమము భవన బాహ్య స్వరూపముతో సంబంధించినది మాత్రముగానేఉండెను. బాహ్య ప్రదేశముననుండి పైకిని, క్రిందకును కదలుచుండు లిఫ్టులును విభిన్న తలములలో మోటార్లు పయనించుటకు వీలగు విశాలమైన వీథులును-భూగర్భమున ప్రయాణముచేయు రైలుబండ్లును ఈ వాదము వారి ప్రధాన విషయములు.
ఆధునిక వాస్తువునకు, ప్రయోజనాత్మకము, వాస్తవికము, అంతర్జాతీయము, అను విశేషణము లుపయోగింపబడుచున్నవి. అంతర్జాతీయమని అమెరికాలో ప్రచార మధికము. ప్రయోజనాత్మకము, వాస్తవికము అను విశేషణముల ముఖ్యసూత్రము లివి. నగరములకు భవనములకు ఏర్పరచిన ఆకృతులకును వాటి నిత్యోపయోగ సూత్రములకును, టెక్నికల్ అవకాశములకును వాస్తుశాస్త్రము విరుద్ధముగా ఉండరాదని వీరి యుద్దేశము. ఆకృతి రచనలు మానవుల నిత్య ప్రయోజనము లకు సంబద్ధములై యుండవలెను. జనుల రాక పోకల అవసరములనుగూడ దృష్టిలో నుంచుకొనవలెను. ఒక దృష్టితో పరికించిన ఆధునిక వాస్తువు ప్రయోజనాత్మక మైనమాట నిజమేకాని, ప్రయోజనాత్మకతయే వాస్తువునకు మూలసూత్రము కారాదు. ఆధునిక వాస్తువు అంతర్జాతీయమని చెప్ప వీలు లేదు. ఇది దీని ప్రాథమికావస్థలో అంతర్జా తీయముగా నుండెను. దీనికి కారణములు : అభిరుచుల పునరుద్ధరణము సాంకేతికముగా క్రొత్తరీతుల కనుగొనుట, మార్పులు, సామాజిక సమస్యలపై నాసక్తి, నిర్మాణ ద్రవ్యములు- ఇవన్నియు అంతర్జాతీయములు. ఇవి యాధునిక వాస్తువునకు అంతర్జాతీయత్వమును సమకూర్చినవి. నిపుణమైన వాస్తువు ఒకేకాలమునందు వివిధ ధర్మములను కలిగియుండునని ఇప్పుడు విజ్ఞులందరును అంగీకరించుచున్నారు. అది అంతర్జాతీయము, జాతీయము, ప్రాంతీయము, వైయక్తికముకూడ ఏకకాలమునందు కావచ్చును.
1923-33 వరకుగల దశాబ్దమున ఐరోపాలో ఆధునిక వాస్తువును ప్రోత్సహించిన కేంద్రములు రెండుగలవు. అవి లి- కార్ –బిజీయరు యొక్క కార్యాలయము, గ్రోపీ యస్ చే నిర్వహింపబడిన బావుహావుస్ విద్యాలయము అనునవి. ఆధునిక నిర్మాణములందు. చక్కని కల్పనల కీదశాబ్ద మెన్నికగన్నది. ఈ దశాబ్దపు చివర నీయుద్యమము సన్నగిల్లెను. ప్రథమమున జర్మనీలోను, క్రమముగా రష్యా, ఫ్రాన్సు దేశములందును, 1938 లో ఇటలీయందును దీనికి పట్టుతప్పినది. జర్మనీ, ఇటలీ, రష్యా దేశములం దిది క్షీణించుట కాయాదేశముల రాజకీయ పరిస్థితులే కారణము. కాని ఫ్రాన్సులో దీని పతనమునకు హేతువులు భిన్నములు. ఇచట ఆధునిక వాస్తువునకు మూలమని యెంచబడిన ప్రయోజనాత్మక వాదము అసమర్థమని నిరూపింపబడినది, వాస్తవిక వాదమును, ఉపయోగతా వాదమును (utilitarianism) ఉపాసించు వారు ఆభాసభావనలచే కొన్ని పనులు చేయుచుండిరి. ఈ సిద్ధాంతములు, క్షీణించిన రీతుల మట్టు పెట్టుట కుప యోగకారులుగనే యున్నను, సంప్రదాయ వాదము పై విజయము సాధింపబడిన తరువాతను, వాస్తుశాస్త్రజ్ఞులు వాస్తు నిజతత్త్వమును గ్రహించిన పిమ్మటను, ఆధునిక వాస్తుశాస్త్ర వ్యాప్తిని సమర్థించుట కీ వాదములు సమర్థములు గాకుండెను. ప్రయోజనాత్మక వాదమునకు మూలభూతుడైన లీ కార్బుజియర్ కూడ కళనుగూర్చి ఐంద్రజాలిక సిద్ధాంతములను ప్రతిపాదించుచు, అకలంక రూపసౌందర్యమునుగూర్చి గేయప్రశంసలు చేయుట చూచి భావుకులు కళవళపడ జొచ్చిరి. (లీ కార్బుజియరు విశుద్ధతా వాదమును సమర్థించినవాడు) వాస్తుశాస్త్రజ్ఞులు ఆధునిక వాస్తువునకు మూలములని చెప్పుచున్న వివిధ దార్శనిక సిద్ధాంతములను ప్రయోజనాత్మక వాదముతో సమన్వయింప మొదలిడిరి. అందుచేతనే 1930 నుండి లికార్ బిజీయరును J. J. P. జౌడును యూరపులో తమ నిర్మాణకృషి నాపి వేసిరి. గ్రోపియస్, మైస్, మెండెల్ సోహారు, జర్మనీ వదలి అమెరికా దేశమునకు వలసపోవలసి వచ్చెను. ఫిన్లాండు వాడగు సారినేను, స్వీడన్ దేశస్థుడగు రోటెన్ బర్గుకూడ అమెరికాలో ప్రవాస మేర్పరచుకొనిరి. ఆధునిక వాస్తువు స్విట్జర్లాండు లోను, స్కాండినేవియన్ దేశములందును జక్కగా అభివృద్ధి నందినది. ఇది కొంత కాలము ఇటలీలోను, జెకోస్లోవేకియా లోను అభ్యుదయము గాంచినది. ఇంగ్లాండునందుదక్క తక్కిన దేశములందు అంతటను ఆధునిక వాస్తువు క్షీణదశ నెదుర్కొనవలసి వచ్చినది. ఇంగ్లాండునందు ఆధునిక వాస్తువు సిద్ధాంతాత్మకముగా గాక, ప్రయోగ దశాత్మకముగా మాత్రమే గ్రహింపబడుటచే కొంత కాలము నిలుచుటకు సాధ్యమైనది.
ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులలో రెండవ తరము వారి నిర్మాణములలో చక్కని యభివృద్ధి గానవచ్చుచున్నది, ఈ తరమునకు చెందినవారు ప్రయోజనతా వాదపు వాతావరణమున జన్మించిరి. దానిని పునాదిగా స్వీకరించి వీరు పురోగమనము సాధించిరి. విశుద్ధరూపమునకును, సాంకేతిక ప్రక్రియకును సమన్వయము కుదుర్చుట వీరికి ముఖ్య సమస్యయైనది. వీరు వాస్తువును సిద్ధాంతముల బారినుండి తప్పించి, దానికి మానవత్వము నాపాదించుటకు ప్రయత్నించిరి. యువక వాస్తుకారుల యుత్తమ నిర్మాణములం దీ యభిప్రాయము చక్కగా వ్యక్తమగుచున్నది. సామాన్య మానవుని జీవితము నకును, ఆతని నిత్య సమస్యలకును వాస్తువును సన్నిహిత పరచుటకు వీరు ప్రయత్నించిరి. మానవ సంక్షేమమును, మన స్తత్త్వ పరిశీలనమును వీరు దృష్టిలో నిడుకొనిరి. వీరి నిర్మాణములు ప్రయోజనతాభిప్రాయములను విపులీకరించినవి వీరి కట్టడములందు నూతనత్వము, ఉల్లాసము, క్రీడా రతియు కనిపించును. వైవిధ్యములేని చదునైన ఇంటి కప్పులకు, నగ్నకుడ్యముల కీరితి భిన్నమైనది. సాంకేతిక దృష్టిననుసరించియు, ముఖ్యముగా నిర్మాణమునకు సంబంధించిన ఆర్థిక సమస్యలను బట్టియు వాస్తువు సామాన్య ప్రయోజనాత్మకమైనది. కాని కేవల మిదియే పరిపూర్ణ వాస్తువు కాజాలదు. వాస్తువు సామాన్యముగా మానవ కృషి క్షేత్రము నంతయు నాక్రమించును. అందుచే ఆధునిక వాస్తుకారుడు హేతువాద సూత్రములను, సాంకేతిక రంగమునుండి మానవతారంగమునకును, మానసిక రంగములకును, వ్యాపింప జేయుటకు ప్రయత్నించును. ప్రథమ దశయందలి సాంకేతిక తత్త్వదృగ్విషయక నూతనకల్పనలను ఇపుడిది తనలో లీనము గావించుకొన్నది. సిద్ధాంతవాదములతో తృప్తిపడక నిర్మాణాత్మక చైతన్యమును చూపుచున్నది. సరిగా ఇటువంటి పరి ణామమే భిన్న రీతులలో అమెరికాలో జరిగినది. ఐరోపా వాస్తువుయొక్క ప్రభావము గ్రోపియస్, బ్రీవర్, లెస్కేజ్, నూటరా అనువారి ద్వారమున అమెరికా యొక్క నిర్మాణ చైతన్య సంప్రదాయముపై పడినది. అమెరికాలోని చైతన్య వాస్తు ప్రభావము గూడ ఐరోపా వాస్తువుపై అధికముగనే ప్రసరించినది.
ప్రఖ్యాత అమెరికన్ వాస్తుకారుడగు ఫ్రాంక్ లాయడ్ రైట్ (Frank Lloyed Wright) అను నాతనిచే చైతన్య వాస్తువు (Organic Architecture) అను పదముపయోగింప బడినది. పెక్కుమంది చారిత్రకులు, విమర్శకులు ఈ పదమును నిర్వచించుటకు ప్రయత్నించిరికాని దీనిని పరిపూర్ణముగా నిర్వచించిన వారెవరును లేరు. పర్యవసన్నమైన వాస్తువు అనిర్వచనీయముగా నుండుటే సహజమేమో! చైతన్య వాస్తువును అనుష్ఠించు వాస్తుకారుల కళను, వారి దృష్టిని, పరిశీలించుట ఎక్కువ ఉపయోగకరముగ నుండగలదు. జీవవాస్తువు వాస్తు సౌందర్య తత్త్వమునగాక దీని నారాధించువారి మనస్తత్త్వమునందును, వారి సామాజిక జ్ఞానమునందును, వారి మానసిక ప్రవృత్తులందును, చక్కని స్థాన మేర్పరచు కొన్నది. అమెరికా, ఐరోపా వాస్తుకారులు వాస్తువు నెడ కలిగియుండు మౌలికదృష్టినిబట్టి చైతన్య వాస్తువననేమో నిరూపింప వచ్చును. ఐరోపా దేశస్థుడైన ఒక రైతు తన ఇంటిని నిర్మింపవలసి వచ్చినపుడు అతడు దానిని ఘనరూపము గనో, లేక మరొక రేఖాగణిత స్వరూపముగనో భావించును. ఈతడు తన యవసరముకన్న పెద్దగా గృహమును నిర్మించును. కొన్ని గదులను తన సంతానము పెరిగినప్పుడు భవిష్యత్తులో వాడుకొనుటకై మూసియుంచును. తన ఇంటి పెరుగుదల ఒక నిర్ణీత క్రమమున ఒక రేఖా గణిత స్వరూపమును కలిగియుండవలెనని ఈతని యభి ప్రాయము. ఇక నొక అమెరికా కార్మికుడు దీనికి భిన్నముగా వ్యవహరించును. ప్రథమమున నాతడొక గదిని మాత్రమే నిర్మించి తన యవసరమును బట్టి కాలము గడచినకొలది దానిని విపులీకరించుచు ఒక గదికి మరొక గదిని చేర్చుచు, పోవును. ముందు పేర్కొనినది సిద్ధాంతితము లేక నిర్జీవవాస్తువు. రెండవది పరిణామ శీలము, సహజ వికాసవంతము, చైతన్య సహితము (Organic) ఆని చెప్పదగును, బాహ్య స్వరూపములన్నియు అంతరములైన ప్రదేశముల కనుగుణముగ ప్రభవించినవియే.
పెక్కుమంది విమర్శకులు ప్రకృతికిని, ఫ్రాంక్ లాయన్ రైట్ రచనలకును పోలికలను అన్వేషింతురు. ప్రకృతిపై దృష్టి నుంచుట మంచిదేకాని ప్రకృతిని (Art Nonvean) నవకళారీత్యలంక రణము అనుకరించునట్లు- ఇందు అనుకరణము తగదు. ఇటులే భవనములకును, మనుష్యులకును పోలికలు చూపుదురు. కాని యివి రూపక ప్రాయములు మాత్రమే ; భవనములు భావస్ఫోరకములును, మానసిక స్థితులను, మనోగతిని సూచించునవియు కావలెనను సిద్ధాంతము క్షీణ వాదమునే ప్రదర్శించును. చైతన్య వాస్తువునం దిట్టి ఆత్మేతర విషయ విచారణలేదు. దీనికొక గతి శీలము, చలన భావము కలవు. ఇవి సాధింపబడినవి కూడ. కాని ఈగతిశీలము దుర్భలానుభూతి సూచకమగు రేఖామాత్ర చిత్రాలంకరణ రీతులచే సాధితముకాదు. ఈ భవనములందు నివసించి, వానినుపయోగించు మనుష్యుని వాస్తవికావసరములను మూలముగా జేసికొన్న ఏర్పాటులచే ఇది సాధ్యమైనది. "గదికిగాని, ఇంటికిగాని,నగరమునకుగాని మానవుని సంతోషమును దృష్టియందుంచుకొని ప్రత్యేకపుటేర్పాట్లు గావించిననే యది జీవనాస్తువగును. ఈ సంతోషము మానవుని భౌతిక, మన స్తత్త్వ, ఆధ్యాత్మిక సంబంధములలో నేదైన కలిగినది కావచ్చును. అందుచే నిది ఆలంకారిక కల్పన పైగాక సామాజిక అవసరములపై నాధారపడినది. మానవ కరుణాశీలమగుటకు బూర్వము, నిర్మాణము మానవ స్వభావమును కలిగి యున్నపుడే దానిని మనము జీవ వాస్తు వనగలుగుదుము." భవనము యొక్క అంతర సన్నివేశము మిక్కిలి ముఖ్య మైనది. ఇది వెచ్చదనము కలిగి సొగసయి, గంభీరతగలదియై యుండవలెను. అవసరమునుబట్టి మారుటకు వీలు కలదై, విశ్రాంతికి రావలమై ఉచితాలంకృతమై యుండదగును, వీలున్న యెడల ఉల్లాస ప్రదమై, వలసినట్లు దిద్దుకొనుట కత్యంత ముపయుక్తమై యుండునట్లు ఉండదగును.
ఫ్రాంకు లాయడ్ రైట్ నకు బూర్వము లూయీ సల్లివాన్ (1856-1954) అను నాతడు వాస్తువునకు అకృత్రిమ మైనదియు, సులభగ్రాహ్య మైనదియు, ప్రయోజనాత్మక మైనదియు అగు మార్గ మేర్పరచెను. "రూపము ప్రయోజ్యత ననుసరించును" అనున దీతని సూత్రము. ఒక కట్టడమునందు ఉపయోగించు బుద్ధి కుశలత, భావదీప్తి, భౌతిక, ఆధ్యాత్మిక క్రియాకలాపము వీటిసముచ్చయమే 'ప్రయోజకత' అని అతని మతము. ఈ ఆదర్శమును ఫ్రాంక్ లాయడ్ రైట్ మరింత యభివృద్ధిపరచెను. మనమొక రూపమును కల్పించునపుడు అతిముఖ్య జీవిత సూత్రమైన పరివర్తన సూత్రమును విస్మరించరాదని యీతడు హెచ్చరించెను. ఒక నమూనా లేక ఒరవడి యేర్పరచునప్పు డది స్వతంత్రముగాను, ప్రవృద్ధినొందుట కనుకూలించునది గాను జీవితవికాసమును ప్రోత్సహించి దోహద మొసంగునదిగాను ఉండవలెను. ఈతని తరువాతి పెక్కురు యువక వాస్తుకారు లీతని కృతులనుండి అనేక ముఖ్య సూత్రములను గ్రహించి జీర్ణించుకొనిరి. తమకు నచ్చని విషయములకు బదులుగా కొన్నిటిని క్రొత్తగా కల్పించుకొనిరి.
కిటికీలు వరుసలలో నుపయోగించు పద్ధతిని మొట్టమొదట ప్రవేశ పెట్టినవాడు ఫ్రాంక్ లాయడ్' రైటు.కాని సామాన్యముగా నీతడధిక కాంతిని కాంక్షించు వాడుకాడు. తరువాత వచ్చిన యువక వాస్తుకారులు వాతాయనములను అంతకెక్కువగా వాడిరి. అతడు తరచు అలంకరణముల నుపయోగించువాడు.యువక వాస్తు కారులు దీనిని సంపూర్ణముగ పరిత్యజించిరి. నునుపు తీర్చని రాతిగోడలను, సంస్కార హీనమై యథేచ్ఛముగా పెరిగిన ఆటవిక ప్రకృతిని అత డభిమానించెను. ఇవి పందొమ్మిదవ శతాబ్దపు కాల్పనికోద్యమము యొక్క అవశిష్ట చిహ్నములు. ఐరోపా వాసులకు ప్రకృతిపై గల చిన్నచూపు నాతడా క్షేపించెను. సంస్కార రహితమైన యీ ఆటవిక ప్రకృతికి మారుగా తరువాతి యువక వాస్తుకారులు ఉద్యానవన కళాప్రీతిని ప్రవేశ పెట్టిరి. ఇంటిని నిలువ నీడగా సంభావించు అభిప్రాయమును సూచించుటకు కాబోలు అతడు భవనములు కప్పులు చూరులు సుదూరము చొచ్చుకొని వచ్చునట్లు నిర్మించెను. తరువాతి వాస్తుకారులు ఇట్టి ఫలితమునే సాధించినను పై పద్దతి వల్లగాక వేరు విధములైన యుపాయముల నవలంబించిరి. రైట్ ఎప్పుడును ఆసనములు మొదలగు గృహోవ
కరణములను గూర్చి ఆలోచించినవాడుకాడు. ఆతడు నిర్మించిన భవనములలో వీనికి ప్రసక్తి అత్యల్పము. యువక వాస్తు కారులు ప్రయోజనాత్మక గృహోపకరణములపై అధిక శ్రద్ధను ప్రకటించిరి. అత డొక్కొక్కప్పుడు అలంకరణ ప్రాయమైన యొ కే యొక కృతిని సాధించుటకు పట్టుబట్టి, ఇతర విషయములను దానికి గౌణముగా చేసి, సౌకర్యమువంటి యత్యవసర విషయమును గూడ విస్మరించువాడు. కాలిఫోర్నియాలోని పాల్ హాన్ అను నాతని 'తేనెపట్టు భవనమున' 60°, 120° కోణముల నిర్మాణము, నక్షాలోను (plan) ఆసనోపకరణములలోను కూడ ఒత్తి చూపబడినది. యువక వాస్తుకారులు ఇంత దూరము పోకుండగనే, భవనాకృతి రచనలో పొందికను సాధించిరి. వీరు సాంప్రదాయిక విభాగమును తిరస్కరించి యత్యవసరాంశములను మాత్రము స్వీకరించిరి. గృహాంతర్భాగము విశాలముగా నుండు ఆవశ్యకత, నక్షా గీయుటలో స్వాతంత్య్రము, భవనము ఉద్యానములోనికి చొచ్చియుండుట, ప్రకృతి పై నాధారపడుట, వెచ్చదనము గలిగి, సహజములు,స్థానికముగా లభ్యములు అగు పరికరములనే విస్తారముగా వాడుట ఇవి వారాదరించిన యంశములు, వీరు పూర్వసిద్ధములైన పద్ధతులతో తృప్తిపడక, ప్రయోగాత్మక పరిశోధనచే సమస్యలకు క్రొత్త సమాధానములు కనుగొనుట అన్నిటికన్న ముఖ్యమైన విశేషము. ఇదియంతయు అమెరికాలో నివాస మేర్పరచుకొన్న ఐరోపా వాస్తుకారుల ప్రభావమే. వాస్తు శాస్త్రజ్ఞుల యొక్కయు, విమర్శకుల యొక్కయు విభిన్నాభిప్రాయములు సమకాలిక వాస్తువునందలి ప్రస్తుతాభి ప్రాయమును తెలియజేయును. ఇది యొకవిధముగా అమెరికా చైతన్య వాస్తువును ఐరోపావాస్తు ఆదర్శములతో సమన్వయ పరచుటే యగును.
"మానవునకును, ప్రకృతికిని లేక అతని పరిసరములకును గల సంబంధమును గూర్చిన భావమే భేదకారణము. లూయీసల్లివాన్, ఫ్రాంక్ లాయ్డ్ రైట్ అనువారి సంప్రదాయములలో ఉపకరణ ద్రవ్యములు వాని స్వాభావిక గుణముల ననుసరించి గౌరవింపబడుచున్నవి. "ఇక ఐరోపాలో నన్ననో ద్రవ్యములు అభావమే కనబడు చున్నది. అమెరికా వాస్తువునందు మాన వావసరముల కొరకును, నిర్మాణాత్మకములు ద్రవ్య సంబంధములు అగు భావముల ప్రకటన కొరకును ఆకృతి యుద్దేశింపబడి పెంపొందుచున్నది. ఐరోపా వాస్తువునందది అచంచల విశుద్ధత్వము కలిగినదై, ఆకృతికొరకే ఆకృతి యన్నట్లు నిల్చుచున్నది. మానవ ప్రయోజనములు దీనిలో అలంకార ప్రాయముగా (plan libre) మాత్రమే భాసించినవి. ముఖ్యముగా ఐరోపాలో ఆధునిక వాస్తువు మానవత్వము యొక్క సారమని నా యభి ప్రాయము. ఇక నిచట ప్రకృతి తత్త్వము, చైతన్యవాస్తువు ప్రబలుచున్నవి" అని డబ్ల్యు, ఎఫ్. డెక్ నేటల్ వ్రాసెను. హెచ్, హెచ్ , హారిస్ అను నాత డిట్లు నుడివెను. "ఈ క్రింది లక్షణములను నా నిర్మాణములయందు గుర్తించ వచ్చును, భవనము ప్రధానముగ నీడపట్టు (శీతాతపములనుండి రక్షణము నిచ్చునది). నేల, గోడ, కప్పులయొక్క సమతలములందు అది ద్యోతకము కావలెను. అది మానవ పరిమాణములో నుండును. భవనము, దానియందు నివసించు వారికి సుఖావహమై గౌరవదాయకముగా నుండవలెను. నివసించువాడు స్వేచ్ఛను సుఖమును పొందునపుడు మాత్రమే వాసగృహము జయప్రదమైన నిర్మాణముగా భావింపదగును. అది జీవితావసరములకు వెనుక హంగుగా ఉండ వలెను. నివాసమునకు సమీపమున సుందరమైన యుద్యానవన మున్నపుడే నివసించువానికి తృప్తియు కట్టడము నకు ఉపయోగమును కలుగును. గృహాంతర్భాగము ఉద్యానములోనికి చొచ్చుకొనియుండదగును. భవనము, అందలి ఆసన పరికరములు, గృహోద్యానము - ఇవన్నియు భావ సమైక్యమును కలిగి యుండవలెను. ఈ నిర్మాణము అరలపై నాధారపడి యున్నది. ఒక యరకు మరొకదానిని అసంఖ్యాకముగ చేర్చుచు పోవచ్చును. ఇది పరివర్తనమునకు మిక్కిలి వీలగు కూర్పు. దీనికి చేర్పు కూర్పులసంఖ్యాకములు. దీనికి శాఖలు ఇష్టమునుబట్టియు అవసరమును బట్టియు ఏర్పడవచ్చును. ఎస్, వాలెట్' అనునాతడిట్లనెను : "ఐరోపాలో నాధునిక భవనములు చాలవరకు ధనవంతుల కొరకు నిర్మింపబడినవి. ఇక అమెరికాలో నాధునిక భవనములం దధికభాగము మధ్యతరగతివారి కొరకు కట్టబడినవి. అందుచే అమెరికాలోని యిండ్లు అధిక సంఖ్యాకుల జీవితమునకు సంబంధించినవియై జాతీయతకు చిహ్నములుగా నున్నవి."
అమెరికా యాంత్రిక దేశమైనప్పటికిని, ఆధునిక మానవునకు లూ యీ మంఫర్డు ఉద్దేశించిన లక్ష్యమును సాధించుటలో నది సఫలమైనది, “యంత్రముల నధిగమించుటలో మన సామర్థ్యము యంత్రములను స్వాధీనము చేసికొని స్వోపయోగమునకు భుక్త పరచుకొనుటపై నాధారపడి యుండును. యంత్రజగత్తు యొక్క లక్షణములైన బ హిర్ము ఖత్వము, వ్యక్తి రాహిత్యము, తాటస్థ్యము - అను ధర్మములను మనలో జీర్ణించుకోను వరకును, మనము జీవచైతన్యము వంకకు పురోగమింప లేము. అప్పుడే సర్వసంపూర్ణ మానవత్వము సాధ్యమగు చున్నది" అని మంఫర్డు భావించెను.
ఇక మనదేశమందలి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. ఇచట వాస్తుశాస్త్ర చింతన క్రమపరిణామము నందలేదు. పరదేశీయ ప్రభుత్వకాలమం దభివృద్ధికి ఆటంకములు పెక్కు కలిగినవి. కాని యిపుడిపుడే జాగృతి కలుగుచున్నది. యువక వాస్తు కారులు ఆధునిక వాస్తువుయొక్క నిజతత్త్వము నాకళించుకొనుటకు ప్రయత్నించు చున్నారు. సమకాలిక వాస్తుకారులలోను, పట్టణ నిర్మాతలలోను అగ్రేసరుడుగ భావింపబడుచున్న. లి-కార్ బిజీయర్ అను వాస్తుశాస్త్రజ్ఞుని దర్శకత్వమున పంజాబు రాజధానియగు చండీగఢ్ లో ఆధునిక వాస్తురంగమునను నగర నిర్మాణమునను గొప్ప ప్రయోగమని చెప్పబడుచున్న నిర్మాణము సాగుచున్నది. ఇది వాస్తువునందు మనకుగల మహ త్తరమైన వారసత్వముగ గర్వింపదగినదిగా నున్నది. ఈకాలపు మన భవనములలో భారత ప్రాచీన వాస్తువునందలి అలంకరణ చిత్రములను, ఆభరణములను అవలంబించుట విధాయకమని కొందరు నమ్మకముగా చెప్పుచున్నారు. కాని ఈ పద్ధతిని సుదూరము కొనిపోవుటకు వీలులేదు. ఎందుకనగా, వాస్తువుయొక్క సమస్య ముఖ్యముగా భవనముల అంతరస్థలమునకు సంబంధించినది. బాహ్యస్థల ప్రాముఖ్యము దీనితరువాతిది. ఆధునిక వాస్తువు, ద్రవ్య పృథుత్వమును బట్టిగాక ఘనపరిమాణమును బట్టి గణ్యత నొందుచున్నది. ఘనపరిమాణమనగా, సమతలములచే ఆవరణ చేయబడిన అవ కాశమని నిర్వచింపబడుచున్నది. కేవల రీత్యాభిమానమును దాటి చూచినచో, ఆవరణ కల్పించు తలములకు తక్కువ ప్రాముఖ్యమును, ఆవృతస్థలము (అనగా గృహాంతర్భాగము) నకు ఎక్కువ ప్రాధాన్యమును ఈయవలెను. మానవుడు తన జీవితమును గడుపు అంతర్భాగమున కే ప్రాముఖ్య మీయవలెను. మన మెట్లు పరిశీలించినను అభిప్రాయ మొక్కటియే. లక్ష్యమును ఒక్కటియే. 'చైతన్యవంతము' అను పదమును ప్రముఖ వాస్తు కారుడు ఉపయోగించినాడని మనము పయోగించుటలేదు. ఈ లక్షణము విశ్వజనీనము. సమస్తదేశములు ఆధునిక నిర్మాణమున నొకే గమ్యస్థానమునకు పురోగమించు చున్నవి.
డి. డి. బి.
ఆధునిక సంగీతము :- ఆధునిక కాలమున గాన విద్య ముఖ్యముగా ఏడువిధములుగా ప్రదర్శింపబడు చున్నది. అ వెవ్వియన 1. గానసభ, 2. రేడియో, 3. ఉత్సవములు, 4. టాకీలు, 5. నాటకములు, 6. హరికథలు, 7. భజనలు. ప్రజల వేషభాషలు, భావములు, ప్రవర్తనము మున్నగువాటియందు గలుగు ప్రబలమైన మార్పుల ననుసరించి సంగీతము, సాహిత్యము చిత్రరచన మున్నగు లలిత కథలతోగూడ గొప్ప మార్పులు కలిగిన వనుటకును, కలుగగలవనుటకును సందియము ఉండజాలదు.
సంగీతము మార్గమనియు దేశ్యమనియు రెండు విధములు. మార్గ సంగీతము సిద్ధాంతమునకు లోనై స్థిరమై మార్పునొందదు. దేశ్యనంగీతమనగా జనుల అభిరుచి ననుసరించి వాడుకలో మండునట్టి సంగీతము, ప్రతాపరుద్రుని కాలములో పాడబడిన భైరవీ రాగమునకును, కృష్ణదేవరాయల కాలములోని భైరవికిని, ఇప్పుడు వాడుకలోనున్న భైరవికిని భేదముండును. భైరవీ రాగమునకుగల లక్షణములు అనగా స్వరములు, మూర్ఛనలు, ప్రయోగములు, ఇవి స్థిరములు, ప్రజల నాగరకత మారుకొలది, ప్రజలయందలి హావభావములు మారుకొంది, వారానందించు సంగీతపువాణిలో మార్పులు రావచ్చును. ఇందున కాధారము "దేశేదేశే జనానాం యద్రుచ్యా హృదయరంజకం" అని సంగీత శాస్త్రముననేకలదు.
దేశ్య సంగీతము ప్రజాసామాన్యమునకు గలుగు రక్తి భావముపై నాథారపడుచున్నది. కనుకనే తోడి రాగమునకు హిందూస్తానీతోడి యనబడు రూపాంతరము, సురటి రాగమునకు హిందూస్తానీ సురటి అను రూపాంతరము ఇత్యాదులు ఏర్పడుచున్నవి. ఇటులనే కర్ణాటక సంగీతమనియు, హిందూస్తానీ సంగీతమనియు సంగీత శాస్త్రము రెండు విధములైనది. ఇట్టి తారతమ్యమును మన ప్రాచీన సంగీత గ్రంథకర్తలు గ్రహించి రాగములలో శుద్దము, ఛాయాలగము అను భేదములను సూచించియున్నారు.
పరిశుద్ధమై, పవిత్రమై, ప్రాచీన ప్రసిద్ధ వాగ్గేయకారకులచేత నిర్ణీతమైన సంగీతము గానసభలయందు మెండుగా వినదగును. ఈ సంగీతము 'శాస్త్రీయ సంగీతము'— (Classical Music) అని వ్యవహరింపబడుచున్నది. శాస్త్రీయ సంగీతమందు ప్రకృతమున పెక్కు మార్పులు కలిగినవనుట విదితము. అర్ధ శతాబ్దము క్రింద గాయకుల సంఖ్యయు, శ్రోతల సంఖ్యయు ఎక్కువగా నుండినను ప్రయాణ సౌకర్యములు విస్తారము లేమిచే గానసభలు తరచుగా జరుగక అప్పుడప్పుడు జరుగుచుండెడివి. ఈ కారణముచేత సామాన్యముగా ఒక ప్రసిద్ధ గానసభ రమారమి ఐదు గంటలు జరుగుచుండెను. పొడబడు కీర్తనాక్రమము మితముగానుండెడిది. విద్వాంసులు ఒకొక్క కీర్తనను చాలా విలంబముగను, విశ్రాంతిగను పాడుచు పల్లవిమట్టములో విశేషకాలము పనిచేసి విస్తరించి గాన మొనర్చెడివారు. పల్లవి మూడు కాలములలో పాడెడి సంప్రదాయ ముండేడిది. ఇటీవల పల్లవిగానము వాడుక నుండి ఇంచుకతొలగి మరల నిప్పుడిప్పుడే క్రొత్తరూపు దాల్చినది. ప్రస్తుత కాలములో కీర్తనల సంఖ్య ఎక్కువ చేయుటయు, కీ ర్తనలు, రాగాలాపములు అత్యంత వేగముగా పాడుటయు, స్వర కల్పనలు చాల వేగముగా అనగా విశేషభాగము ద్రుతకాలములో నిర్వహించుటయు, రాగాలాపన క్లుప్తముగా జేయుటయు కాననగును. దీనికి కారణము ప్రజాభిరుచి పాటకుల అభిరుచి అయియున్నట్లు విదితము. పూర్వపు విద్వాంసులు స్వాతంత్య్రముతోను, ప్రతిభా వ్యుత్పత్తులతోను గానసభ చేసెడివారు. వర్తమాన కాలమున విశేషముగా దీ