సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆధునిక భారతీయ చిత్రకళారీతులు
ఆధునిక భారతీయ చిత్రకళారీతులు :-భారతీయ చిత్రకళా చరిత్రలో ఆధునికయుగము అందును స్వాతంత్య్రప్రాప్తి తరువాత గడచిన కాలము చాల సారవంతమైనది. వ్యక్తిగత ప్రతిభల సవివర పరిశీలనకు పూనుకొనుటకు ముందు ఒక సర్వంకష సమీక్ష చేయుట అవశ్య కర్తవ్యమై యున్నది. అట్లు చేయనిచో కళాప్రచలన విధానమును సరియైన సాంఘిక సందర్భములో మనము గ్రహింపజాలము.
అజంతా ప్రథమ కుడ్య చిత్రములతో రెండు వేల సంవత్సరముల పూర్వమునుండి వచ్చుచున్న భారతీయ చిత్రకళా సంప్రదాయము హిందూ దేశమున క్రీ. శ. 19 వ శతాబ్ది యంతమునకు అవసానదశ పొందినది.
చిత్రకళా సంప్రదాయము యొక్క చరమ వికాసము హిమాచల ప్రదేశమునందలి చారిత్రకమైన త్రిగర్తమున (మూడు లోయలలో) ప్రత్యక్షమైనది. హిమాలయ పాదములందలి మైదానములు నానుకొని రాజపుత్ర వర్గములచే స్థాపింపబడిన ఈ మూడు చిన్న రాజ్యములలో రాజస్థాన చిత్రకళా సంప్రదాయాదర్శము పర్వత వాయు నైర్మల్యము యొక్కయు, కొండ సెలయేరుల స్వచ్ఛతయొక్కయు అంశములను పుణికి పుచ్చుకొనుటచే మరింత సుందరమై ఒప్పారినది. కంగ్రా, బసోహ్లి, సుకేత, మంజి, చంబ మున్నగు ప్రదేశములందలి చిత్రకళ పోషకుల సంఖ్య తగ్గుటచే క్రమముగా సన్నగిల్లెను. 1905 లో కలిగిన ధర్మశాలలోని భూకంపము ఈ మండలము నందలి కళకు స్వరూప ధ్వంసము కావించెను.
పాశ్చాత్య సంప్రదాయ ప్రభావితమును, భూస్వాముల చిత్రించు సంప్రదాయముతో కూడినదియు అగు ఒక సంకీర్ణ చిత్రకళా పద్దతి భారతదేశమునందలి కొన్ని ప్రదేశములలో కొంచెము కొంచెముగా సాగుచుండెను. లక్నో పాట్నాలయందును, దక్షిణమున మైసూరునందును దక్షతతోకూడిన చిత్రకళ నిర్వహింపబడుచుండెను. కాని పహరి చిత్రకళయందలి రసవత్తరమును ఆత్మీయాంశ భూయిష్ఠమునైన పద్ధతి యొక్క జాడకూడ కనిపించుట లేదు.
క్రీ.శ. 1854లో వై దేశిక సంస్కృతి ప్రభావముచే కలకత్తా కళాపాఠశాల (Calcutta School of Arts) ఆరంభమాయెను, ఈ పాఠశాల బ్రిటనును ఆదర్శముగా గ్రహించెను. ఈ యుగమున బ్రిటిష్ వారికళ అనావశ్యక వివరములతో కూడిన భారవత్వమునకును, వైజ్ఞానికమైన ఉదా త్తతకును గల భేదమును వివేచింపలేక మిక్కిలి హీనస్థితిలో ఉండుటచే ఆ పరిస్థితి మిక్కిలి విషాదకరముగా పరిణమించెను. అపవిత్రాదర్శములు ఆంగ్లేయ కళను తద్వారా భారతదేశమునందలి కళాశిక్షణమును మలినీకరించుట సంభవించెను.
ఈ పద్ధతికి చెందిన మధ్యరకపు ప్రతిభగల పలువురు వ్యక్తులలో పరిమిత రంగముననే ఐనను స్థిరమైన సిద్ధి నొందెనని చెప్పుటకు తగినవా డొక్కడున్నాడు. అతడు రవివర్మ. వంగదేశమునందలి పునరుద్ధరణ కాలమునకు చెందిన కళాకారులును, తరువాతి యుగమునకు చెందిన ఆధునికులును పెక్కు కారణములచే అతనిని లాఘవముతో పరికించుచుందురు. కాని రవివర్మ చిత్రలేఖనమునందలి గౌరవమును నిల్పెననుట మాత్రము యథార్థము, ఆధునిక యువకులం దిది ప్రధానలక్షణముగా కనిపింపదు. ఆతడు తన చిత్రముల అమ్మకము దృష్టియం దిడుకొనుటచే కేవల పండితాదరమునకే యధికమైన ప్రాధాన్యమిచ్చి యుండలేదు. ఆతడు పురాణములందలి అసంఖ్యాకములైన కథలకే చిత్రరూపము నొసంగెననుట నిజమే. కాని అవి లేఖన (చిత్రణ) వర్ణనవిషయములందు మిక్కిలి దక్షతతో నిర్వహింపబడినవి. అతని చిత్రములందలి సారస్వతాశ్రయత్వముమాట యెట్లున్నను అందలి పరిపూర్ణమైన నిష్ఠమాత్రము తరువాతి వారికి ఆదర్శము కాదగియున్నది.
భారతదేశమునందలి ఆంగ్లేయులు బలవత్తరమయిన సామ్రాజ్యవర్ధన విధానము నడుమ వైదేశికా క్రమణము వలన దేశీయ సంస్కృతికి కలిగిన హానికి ఇద్దరు ఆంగ్లేయులు పరిహారము చేకూర్చిరనుట మిక్కిలి ఆశ్వాసదాయకముగా ఉండును. వీరు కర్జను ప్రభువు, ఇ. బి.హావెల్ అనువారు. కర్జను ప్రభువు ఈ దేశమునందలి వాస్తుశిల్పముల' గొప్ప సంప్రదాయమునకు అలరి, వాటి రక్షణమునకై చట్టములు కావించెను. భారతీయ కళాకారులకు అమూల్యమును పై విధ్యముతో కూడినదియు అగు సొంత సంప్రదాయము ఉండగా వారిని వై దేశికా దర్శమును అనుకరింప ప్రోత్సహించుట వ్యర్థమును, విషాదకరమును అని కలకత్తా కళా పాఠశాల కధ్యక్షుడైన హావెల్ గుర్తించెను.అందుచే కళావిషయమున పొందబడిన సాంప్రదాయిక సిద్ధుల పరిశీలనము ఒనరింప వలెనని ఆతడు వాదించెను. విదేశము లందు డాక్టరు ఆనంద కుమార స్వామిగారు “పునరుజ్జీవనము" నందలి తాత్త్వికాశయములను వివరించి, అంతర్జాతీయ ప్రజలకు అతి దక్షతతో విశదపరచిరి. ఈ పునరుజ్జీవన దృక్పథమునకు విలువ కట్టునప్పుడు చరిత్రజ్ఞుడు లోతైన దాని సాంఘిక మూలములను విస్మరింపరాదు.
భారతదేశమున డాక్టరు అవనీంద్రనాథ ఠాకూరుగారి నాయకత్వమున యువ కళాకారులు పలువురు అజంతా కళను మొగలాయి రాజపుత్ర కళాఖండములను నిశితముగా పరిశీలింప నుద్యుక్తులై హావెల్ గారి వాదములను సార్థక 'మొనరించిరి. చిత్రకళా పునరుజ్జీవనము ఈ విధముగా ఆరంభింపబడెను సంస్కృతి విజయముగా పరిణమింపనున్న రాజకీయ విజయముచే ప్రతిహతులైన పునరుజ్జీవన యుగమునందలి కళాకారులు భారత చరిత్ర యందలి మహాయుగముల నుండి అనవద్యమైన ఆవేశ మును గ్రహింప అన్వేషించి రనుటలో ఆశ్చర్యములేదు.
పునరుజ్జీవన కాలమునందలి కళాకారులు యథాస్థిత చిత్రణవిధానము, రూపసాదృశ్య నిర్వహణము మున్నగు పాశ్చాత్యుల విలువలను విసర్జించి కాల్పనికమును (Poetic) ప్రబోధాత్మకమును (Evocative) అగు పద్దతిని అవలంబించిరి. రచనా విధానమునకూడ వారు యూరపునందలి తైలవర్ణ చిత్రణమును విడిచి నీటిరంగుల' వైపునకు మరలిరి. ఈ తిరుగుబాటు కేవలము పాశ్చాత్యపద్ధతి కేకాని సర్వవై దేశిక ప్రభావములకును గాదు. ఏలయన చైనా జపానుదేశములందలి చిత్రకళావిధానములు నిశితముగా పరిశీలింపబడెను. పునరుజ్జీవన యుగమునందలి రేఖా విన్యాస లేఖన విధానము కొంతవరకు చైనా చిత్రకళా విధానమునుండి గ్రహింపబడినదనియు, వర్ణవైశిత్యమును సమీకృత సౌందర్యమును సంపాదించుటకై పలుమార్లు క్షాళనముచేయు విధానమున జపాను ప్రభావము గోచరించుచున్నదనియు చెప్పవచ్చును.
వారి తీవ్ర మనఃప్రవృత్తి దాని చారిత్రక సమర్ధనముతో అంతరించిపోయెను. కాని ఈ పునరుజ్జీవన విధానము నుండియే భారతదేశమునం దంతటను కళను పునరుజ్జీవింపజేయుశక్తి ప్రసరించి యుండెనని కళాచారిత్రకుడు కృతజ్ఞతతో తప్పక స్మరింపవలసి యున్నది. ఈ ఉపఖండ మందలి కళాపాఠశాల లన్నిటికిని ఉపాధ్యాయులను సమకూర్చిన ‘వృద్ధకులపతి' అదియే.
ఆధునిక భారతీయ చిత్రకారులలో ప్రథముడు అవనీంద్రనాథ ఠాకూరు. అదే ఆతని గొప్పతనము నకును కారణము. అతడు నిర్జీవ సంప్రదాయములతో శుష్కించి పోయిన ఢిల్లీ, పాట్నా విధానముల అమితాలంకరణపద్ధతిని విడిచి, చైనా జపాను విధానములందును, పాశ్చాత్యకళయందునుగల లక్షణ పరత్వము, అపరిపక్వ, దృష్టిఅనువానినుండి మరలిపోజాలెను. డా. అవనీంద్ర నాథ ఠాకూరు ప్రాచీన మధ్యకాలములందలి భారతీయ కళా విధానములందలి పద్ధతిని, సిద్ధాంతములను కొనసాగించె ననుట సరియైనది కాకపోవచ్చును. ఒక క్రొత్తసమన్వయ విధానమును కనుగొని నిజ ప్రామాణికత్వమును నిరూపించుట ఆతడు చేసిన ఘనకార్యము. ఆ విధానము ప్రమాణభూతమై భారత దేశమునందలి లఘుచిత్రకళా విధానము (మినియేచరు) లోని మార్దవమును జపానీయుల చిత్రకళా విధానమునకు చెందిన సంపన్న శిల్ప కళా వైభవమును తనలో ఇముడ్చుకొని పాశ్చాత్యలాక్షణిక రచనా విధానమునకు చెందిన నియమములచే సమీకరింపబడి యున్నది. అవనీంద్రనాథ ఠాకూరు కళాచార్య వర్యుడు. అతడు కళాఖండములను సృజించిన మహావ్యక్తి.
అవనీంద్రుడు పలువురు శిష్యులను సుశిక్షితుల నొనరించెను. వారాచార్యుని జ్ఞానజ్యోతిని భారత దేశమందన్ని వైపులను వెలయజేసిరి. వీరిలో నగ్రేసరుడయిన నందలాల్ బోసు శాంతినికేతనములోని కళాభవనమున శిక్షకుడ య్యెను. అసిత కుమార హాల్దారు లక్నో కళాపాఠశాలకు అధ్యక్షుడ య్యెను. సమరేంద్రనాథగుప్త లాహోరు కళాపాఠశాల కరిగెను. వేంకటప్ప మైసూరులో బోధకుడయ్యెను. శైలేంద్రనాథుడే జయపురమునకు వెళ్లెను. సర్దారు ఉకిల్ ఢిల్లీలో నెలకొనెను. ప్రమోద కుమార ఛటర్జీ మచిలీ పట్టణమునందలి జాతీయకళాశాలలో పనిచేసెను. దేవీప్రసాదరాయ చౌధరీ మదరాసు కళాపాఠశాలను నడిపెను. పులిన బేహారి దత్తు బాల్యావస్థయందున్న బొంబాయిలోని కళను పెంపొందించెను. ముకుళ చంద్రుడే కలకత్తా పాఠశాలను నిర్వహించెను. ముకుళ చంద్రుని తరువాత కలకత్తా కళాపాఠశాలను నడపిన రెమేంన్రాథ చక్రవర్తి డా. నందలాల్ బోసుగారి యెద్ద పరిపూర్ణ శిక్షణము పొందుటకు పూర్వము డా. ఠాకూరు గారియొద్ద కళలో ప్రాథమిక శిక్షణము పొంది ఉండెను. ఈ విధముగా సమకాలిక భారతీయ చిత్రకళ మూలము లందే సుశిక్షితము కావింపబడెను. వర్ధిష్ణువయిన అనంతర చిత్రకళాకారసంతతి వంగదేశమునందలి క్రొత్త ఉద్యమమునకు సంబంధించిన సిద్ధాంతములపై ప్రోదిచేయబడినది.
మీద అభ్యాసకులు పలువురు అన్ని పద్ధతులను అవలంబింపకోరుచు ప్రత్యేక సమయములందు తాము గ్రహించు వస్తువులే రచనావిధానమును కూడ నిర్ణయింపవలెనని తలంతురని బొంబాయి పాఠశాల అనుభవము వలన తేలిన విషయము. ఈ విధముగా వారొక కుడ్య చిత్రమును నీటి రంగులతోకాని, తైలవర్ణములతోకాని, మిశ్రముగాకాని చిత్రింపవచ్చును. జీవితమునుండి చిత్రమును చిత్రింప అంగీకరించి, వారు పునరుజ్జీవన పద్ధతిని విడనాడి, పాశ్చాత్య పద్ధతిని అవలంబింప వచ్చును. బొంబాయి కళాసమితి అందుచే పాఠ్య ప్రణాళికలో పాశ్చాత్య రచనా విధానము కూడ చేర్చబడుట ఉపయోగకరముగా ఉండునని భావించెను. 19 వ శతాబ్ది చివరిభాగము నాటికి బొంబాయి కళార్థులకు జీవచిత్రణ తరగతులుకూడ ప్రారంభింపబడినవి.
ఈలోపుగా భారతీయ చిత్రకళా విధానము నందు సంప్రదాయమున కనవసర ప్రాధాన్యము నొసంగు టను, నిర్జీవమైన స్వాభావికతను గూడ నిరసించు ఒక ప్రధాన తత్త్వము బయలుదేరెను.గగనేంద్రనాథ ఠాకూరు, రవీంద్రనాథ ఠాకూరు, జెమినిరాయి, అమృత షెర్ గిల్ అను నలువురును భారతీయ నవీన సంప్రదాయమునకు ప్రవర్తకులు. విశ్వకవి ఠాకూరు సృజనలు పెక్కు అతిసారళ్యముతో తీర్పబడి ఆత్మీయాంశావృతములై అగాథమైన అతీంద్రియ ప్రపంచమునుండి ఉద్ధృతమయిన అంతరార్థముతో నిండియుండును. ఆయన భ్రాతృపుత్రుడైన గగనేంద్ర నాథ ఠాకూరు క్యూబిజమ్ (Cubism) అను కళా విధానమున కృషి చేసెను. అతడు వెలుగునకును చిత్రకళకునుగల సంబంధమునుగూర్చి పఠించి డామీర్ (Doumier) పద్దతి ననుసరించి సాంఘిక వాస్తవికత్వమే తన రచనల సారమని అంగీకరించెను. వంగదేశమునందలి పునరుద్ధారకులు రాజసములైన గత సంప్రదాయములకు విముక్తి కల్పించిరి. సంపన్నము, సుందరము అగు జానపద సంప్రదాయము మరొకటి ఉండెను. జానపద కళాదర్శములలో సారళ్యము, మనోరంజకములైన రంగులు, ప్రత్యక్ష భావోద్రేకము అను గుణములు కానిపించును. జెమినిరాయి ఈ వారసత్వమును గ్రహించి దానికి ఆధునిక వివరణము నొసంగెను. అమృత షెర్ గిల్ తల్లిహంగేరీ వనిత. తండ్రి భారతీయుడు. ఆమె పారిస్ లో విద్య అభ్యసించెను. నవీన భారతీయ చిత్రకళా విధానమున ఆమె కళ ప్రాచ్య పాశ్చాత్య సంప్రదాయములకు చక్కని సమన్వయము కల్పించియున్నది.
బహులక్షణ సమ్మేళనముతోకూడి ఉండుటచే ఆధునిక కళాపరిస్థితికి విలువకట్టుట చాల కష్టము. కాని అది ఒక విధముగా మంచి సూచనయే. నేటి భారతీయ చిత్రకళ పరుల సూచనలను అమోదించు చుండుట యందు విశ్వజనీనమును, స్వాయత్తము చేసికొని వ్యాఖ్యానించుట యందు జాతీయమును అయి కనబడుచున్నది. ఇటీవల చారిత్రక దృక్పథముకూడ పెంపొందింపబడినది. ఆధునిక కళాభిజ్ఞులు గత చారిత్రక యుగములందలి కళాతత్త్వమును లోతుగా పరిశీలింప జాలి ఉన్నారు. ఆల్తమిరాలోని శిలాయుగపు వర్ణములందలి శక్తి సాక్షాత్కారములును, ఈజిప్టు కుడ్య చిత్రములందలి ఉదాత్తమయిన ఆంగిక చిత్రణమును, అజెటిక్ చిత్రములలోని అప్రకాశయుతత్వమును, ఆదిమ కాప్టిక్ కళయందలి నైశిత్యమును, సుంగ్ ప్రకృతి వర్ణచిత్రములందలి దృష్టి వైశాల్యమును,హిరోషిగె కళలోని రసపరిపూర్ణతయు, టిబెట్టునందలి ధ్వజపట చిత్రములలోని కథానక పద్దతియు, నీగ్రో కళ యందలి సాంకేతికత్వమును - దూర దేశకాలములకు సంబంధించిన ఇవన్నియు ఆధునిక భారతీయ కళపై తమ ప్రభావమును చూపి ఉన్నవి.
కొందరు భారతీయ చిత్రకారులు పరమతములకు సంబంధించిన వస్తువులను కూడ సమర్థతతో చిత్రింపజాలుటకు ఆధునిక ప్రకృతియందలి విశ్వజనీనతయే కారణము. క్రీస్తు జననము, మాజి (Mogi) యాత్ర, సిలువపై మరణము మున్నగు కథావస్తువులను గ్రహించి భారతీయ చిత్రకారులు వర్ణచిత్రములు రచించియున్నారు. ప్రతి కళయు విశ్వజనీనమయిన అర్థమునకు వైయక్తికమయిన రూపనిరూపణమని చెప్పదగును. మత సంస్థాపకులు మున్నగు మహనీయుల విశ్వజనీనతలోని వింత యేమన వారి సందేశము ఆమోదింపబడిన ప్రదేశములం దెల్ల వారు జాతీయులుగా పరిగణింప బడుచుందురు. క్రైస్తవమత సంబంధమయిన కళను భారతీయముగా నొనరించుటలో క్రైస్తవ చిత్రకారులు చాల తోడ్పడిరి.
నేడు భారతీయుల యెదుట ఉన్న ప్రధాన సమస్య పార్థక్యమును పాటించుటయా లేక పరదేశ ప్రభావ ముల నామోదించుటయా అనునది. జాతి బంధములచే యూరపునకు అంత సన్నిహితముగా కట్టబడియున్న అమెరికాలో గూడ ఇట్టి సమస్య ఉప్పతిల్లె ననుట విస్మయకరముగాఉండును. నిశిత మయ్యు అసంబద్ధమయిన ఆకస్మిక దేశాభిమానముచే అమెరికను విమర్శకులు కొందరు ఆ ప్రాచీన ఖండము నందలి సంస్కృతిని అలవరుచుకోనుట కయి యూరపునకు అరిగిన ఫ్రాంకో, ట్యూటో అమెరికనులను నిరసింప మొదలిడిరి. కాని బాగుగా ఆలోచించిన పిమ్మట సమకాలిక విమర్శక తత్త్వము 1864 లో కళాపార్థక్యమునకు వ్యతిరేకముగా వ్రాసిన జేమ్సు జాక్సను జార్వెసు అను నాతని వాదముతో ఏకీభవించు చున్నది. శాస్త్రము, నీతి, భౌతిక శాస్త్రము అను వాని యందు ఎవ్వరును అట్టి పార్థక్యము ఉండునని కలలో కూడ తలంచి ఉండలేదని జార్వెసు నూచించి ఉండెను.“మనము ఇతర నాగరకతా విధానములందువలెనే మన కళయందుకూడ సమన్వయమునకై యత్నింప వలయును. అన్ని ఆధారములనుండియు గ్రహింపబడినట్టియు, స్థిరమయిన మన ఆత్మీయతచే జాతీయమును సధర్మమును చేయబడినట్టియు ఉదాహరణములు, జ్ఞానము, భావములు మున్నగు వానివలన కళాసంపదను పొందుట, అందు సమగ్రత్వమును సంపాదించుటకు సరియైన పద్ధతి.”
భారతీయ పునరుజ్జీవనమునకు వెనుక నుండి ప్రాక్స్వాతంత్య్ర కాలభావములను ఇంకను విడువక పరదేశ ప్రభావమును అనుమానించువారు ఈ మాటలనుగూర్చి పర్యాలోచన చేయవలెను. కాని సమూల సంస్కరణము వాంఛించు భారతీయులు ఈ దృక్పథము యొక్క విజ్ఞానము తమ ప్రత్యేక సహకారముగా భావించి దానిని భారతదేశమున ఆచరణలో పెట్టుచో వారుకూడ పొరపడినవారే అగుదురు. ఏలయన పెక్కు శతాబ్దుల నుండి భారతీయ సంప్రదాయములకును, ఆసియా సంప్రదాయములకును నడుమ అధికమైన సమ్మేళనము జరుగుచున్నది. భారతీయాదర్శములు సింహళము, చీనా, జపాను, ఇండోచైనా, ఇండొనీషియా మున్నగుచోట్లకు పయనించినవి. మధ్య ఆసియా ప్రభావము మన శిల్పమును చిత్రకళను అధికముగా మార్పు చెందించినది.
అనుకరణము, ' స్వాయత్తీకరణము అను వాని భేదమును గుర్తించినచో మనము సరియైన మార్గమును త్రొక్కినట్లే.
వి. ము.