Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆధునిక పాశ్చాత్య చిత్రకళ

వికీసోర్స్ నుండి

ఆధునిక పాశ్చాత్య చిత్రకళ  :- ప్రాచ్య పాశ్చాత్య నాగరకతా సమ్మేళనమువలన ఐరోపా దేశములో నొక నూతన కళావిర్భావము ఘటిల్లిన కారణముగా చిత్రకళా జగత్తునం దాకాలము బై జంటైన్ యుగము (Byzantine Period) అను పేర వ్యవరింపబడెను. నాటినుండి నేటివరకు నిత్యనూతన రీతులతో నీకళ సెలయేరువలె ప్రవహించుచునే యున్నది. ఈ బై జంటైన్ యుగమునకు చెందిన కళాకారులు మహమ్మదీయ కళారీతుల ననుసరించక, విలక్షణమైన పద్ధతుల నవలంబించియున్నారు. సాధారణముగ ఈ యుగ ప్రారంభకాలమునందు గాని, క్రైస్తవశక ఆరంభకాలమందు గాని, చిత్రకారులపని, కేవలము క్రైస్తవాలయ కుడ్యముల నలంకరించుట యందును, క్రైస్తవ మతసంబంధములగుగాథలను చిత్రరూపమున చిత్రించుట యందును, మతసంబధములగు విషయములకు రూపవికాసములను కల్పించుటయందును కేంద్రీకరింపబడి యుండెను. ఈ విధముగ క్రైస్తవ మత సంబంధమగు విషయమునే ప్రధాన వస్తువుగా గ్రహించి నప్పటికిని, ఆ చిత్రకారు లవలంబించిన పద్ధతిమాత్రము మొదట హెల్లనిక్ (Hellanic) గను, రానురాను, సాంకేతికముగను భావనాత్మకముగను పరిణమించినది. ఈ యుగమునకు చెందిన కళాకారుడు గుడి (చర్చి)కి సంబంధించిన కొన్ని నియమములకు లొంగవలసి యుండెను. ఈ నిబంధనలే, నియమములే కళయందు అపు రూపమైన ఒక నూతనత్వ మేర్పడుటకు దారితీసినవి. ఈ కాలమునాటి కళాకారులు అనవసర విషయములను తొలగించి, ప్రధాన విషయము యొక్క లోతుల నరసి, కళను సృజనాత్మకముగను, భావనాత్మకముగను, సృజించుట యందే తమశక్తులను కేంద్రీకరించిరి.

13 వ శతాబ్దమునుండి దాదాపు 500 సంవత్సరములు కాలము ఒక గొప్ప ప్రవాహమువలె ఐరోపా చిత్రకళా వాస్తవికత, శాస్త్రీయ పద్ధతుల (Scientific realism) వైపు పరుగెత్తెను. ఈ 5 వందల సంవత్సరములలో, గియాటో (Giotto) మొదలు టర్నర్ (Turner) వరకు గల మధ్యకాలముననున్న టిటియన్ (Tition), ఫైటర్ (Pieter), పెద్ద బ్రూఫెల్ (Brughel the Elder), రెం బ్రాంట్స్ (Rembrants), కారట్ (Corot), రేనాల్డ్సు (Reynolds), కాన్ స్టబుల్ (Constable) మున్నగు ప్రసిద్ధ కళాకారులందరు అనేక ఉపనదులవలె వచ్చి ఈప్రధాన చిత్ర కళా ప్రవాహమునకు సంపూర్ణత్వమును చేకూర్చిరి. ఈ 13వ శతాబ్దము తరువాత చిత్రము కేవలము ద్వైమానమునే (Two dimensional) చూపునదిగా నుండు పద్ధతి యంతరించినది. ఇప్పుడు చిత్రపటము (Painting) వస్తువు యొక్క కేవలపరిమాణ పరిమితిని (object in space)ఆకార వర్ణనలనే కాక ఆయతనము (volume) ను తెలుపునదిగా కూడ బయలు వెడలినది, 13వ శతాబ్దమునందలి సుప్రసిద్ధ చిత్రకారుడగు గియట్టో (Giotto) వలెనే 15 వ శతాబ్దము నందలి లియోనార్డ్స్ డావిన్సీ (Leonards davinci) అను కళాకారుడు, చిత్రకారుని దృష్టిని శాస్త్రకారుని దృష్టిపథముతో మేళవించెను. ఈ అధ్యాయమునందు స్మరింప బడిన చిత్ర కారులందరిలో టర్నర్ (Turner), కాన్స్టబుల్ (Constable) అనువారలిద్దరు విశేషముగా స్మరణీయులు. వారి చిత్రకళారీతుల ప్రభావమునకు లోనైనవారు ఫ్రాన్సు దేశీయులు. వారి ప్రభావమే ఫ్రాన్సు దేశీయ చిత్రకారుల ఛాయావాదము (impressionism) నకు పునాది యని చెప్పవచ్చును.

19వ శతాబ్ది అంత్యదినములలో కళాకారుడు శాస్త్రీయ జాగృతిని గుర్తించి, తత్ప్రభావ ఆవేశములకు వశ్యుడుకాక ఉండలేకపోయెను. రెండవమారు ఐరోపా దేశీయ చిత్రకళా చరిత్రలో శాస్త్రీయ పద్ధతుల విజృంభణము, జయోత్సాహములు, కళాకారుని సమస్యలను తీర్చుటకు బాసటయై నిలిచెను. నిజమైన వాస్తవికతను సృజింపవలయు నన్నచో పరిశోధనాగారపు పద్ధతులను (Laboratory methods) వినియోగించవలసిన యవసర మేర్పడెను. ఘనపదార్థములను (Solid bodies) వెలుతురు మూలమున చూపవచ్చునన్న సత్యమును గ్రహించి ఛాయావాదులు నవీనమైన శాస్త్రీయ సిద్ధాంతముల సాహాయ్యమున, వర్ణదృష్టి సంబంధ విషయమును (optic & colour) గ్రహించినారు. వారు వర్ణమును విచ్ఛిన్నకిరణాంతర్గత రేఖలు గను, అపసర్పణరశ్మి వర్ణములుగను (tunes of spectrum) విభజించి, పాలెట్ (pallet) నుండి భూమిరంగులను బహిష్కరించిరి. ఛాయా వాదుల కాలము వరకు చిత్రకారుడు విశ్రాంతిగ చిత్రశాల (Studio) యందు చిత్రమును చిత్రించుచుండెడువాడు. ఆతనికి చిత్రింపబోవు చిత్రము యొక్క ఆకారమ యొక్క పొందికయే ప్రధాన విషయముగ నుండెను. అంగియైన ఆకారమునకు (Form) వర్ణమును అంగముగ గ్రహించి, దాని ఆకారపు పొందికయందే తన సర్వశక్తులను వినియోగించెడివాడు. తరువాత మోనోక్రోము (mono chrome) ను భూమికగ (underpaint) గ్రహించి దానిమీద వర్ణములను వేయుట చిత్రకారుల సంప్రదాయ సిద్ధమైన పద్ధతిగా నుండెను. ఈ విధమైన పద్ధతియందు చిత్రకారుడు తన పనిని రెండు భాగములుగా విభజింపవలసియుండెను. మొదట తన శక్తిని చిత్రము యొక్క పొందిక యందును ఆయా స్థితుల యొక్క రాగముల మేలు కలయిక (disposition of tones) యందును శ్రద్ధవహింపవలసియుండెను. ఈ కూర్పు తనకు తృప్తికలిగించిన తరువాత అతడు తగిన వర్ణములను చిత్రించుటకు పూనుకొనువాడు, ఛాయావాదమునకు పూర్వము వెలసిన ప్రసిద్ధ చిత్రకళా ఖండములన్నియు

నీపద్ధతిపై చిత్రింపబడినవే. కాని ఛాయావాదుల యుగము నందలి చిత్రకారులు అనుక్షణము చంచలమైన వెలుతురు యొక్క ఫలితములను సహితము రాబట్టుటకు ప్రయత్నించిరి. ఈ విధమైన ప్రయత్నము సిద్ధింపవలయునన్నచో చిత్రకారుడు మోనోక్రోము (Monochrome) భూమిక యొక్క అవసరము లేకయే వర్ణమును సూటిగా ఫలకము (Canvas) నందు ఉపయోగింపవలయును. ఇది సులభరీతి కాదు. ఇది తాను చిత్రించువిషయము యొక్క పరిపూర్ణ జ్ఞానమునుపొంది, మనస్సునందు భావించి, సిద్ధహస్తుడైన చిత్రకారుడు చేయగలిగిన పద్ధతి. ఛాయావాదులు వర్ణములను ఇతర భూమి కల సహాయము లేక వాడుటయే కాక, సాధ్యమైనంతవరకు మిశ్రమములు కాని (Pure) వర్ణములనే వాడిరి. పసుపు, నీలవర్ణముల కలయికవలన ఆకుపచ్చవర్ణ మేర్పడినప్పటికి మిశ్రమవర్ణము, రెండు రంగుల ప్రకాశమును (Brilliance) పతనము చేయుచున్నదను జ్ఞానము కలిగినవా రీపద్ధతి నవలంబించిరి.ఈ విధమైన విలక్షణ పద్ధతుల నవలంబించుట వలన ఫలితములు విజయ వంతములుగా నుండి చిత్రమునకొక యపురూపమైన సౌందర్యము నిచ్చినవి. ఈ పద్ధతివలన చిత్రము కేవల ఘనపదార్థము యొక్క వస్తురూపము చిత్రించుటయేగాక ఆ వస్తువు నావరించియున్న వాతావరణమును గూడ వ్యక్తీకరింపగలిగినది. ఈ యుగమునకు చెందిన చిత్ర కారులలో ప్రసిద్ధి వహించిన వారు మానెట్ (Manet) రినొయిర్ (Renoir) డిగాస్ (Degas) అనువారలు గత 5 శతాబ్దముల నుండి వాస్తవికతను సృజించుటకు చేసిన కృషి. వీరికాలములో ఫలవంతమైనది.

ఛాయావాదము పరిపూర్ణముగ వికసించి, తన గమ్య స్థానమును చేరకపూర్వమే కొందరు కళాకారులు నూతన పద్ధతుల ననుసరించుటకు ప్రయత్నించిరి. ఆ ప్రయత్నమే పోస్టు ఇంప్రెషనిజం (Post impressionism) అను సిద్ధాంతము పేర వెలసినది. ఈ విధమైన నూతన సిద్దాంతమును కళా జగత్తున ప్రవేశ పెట్టుటలో తోడ్పడినది క్యామెరా (Camera) యొక్క ప్రభావ ఫలితములై యున్నవి. ఈ పోస్టు ఇంప్రెషనిజం అను దానికి సంబంధించిన చిత్ర ప్రదర్శనము లండన్ లొ జరిగిన సందర్భమున రోగర్ ఫ్రై (Roger Fry) అనునాతడు—“It was a new movement in Art, a movement which was the more disconcerting in that it was no more variation upon accepted themes but implied a reconsideration of the very purpose and aim as well as the method of plastic art. It was not surprising, therefore, that a public which had come to admire above every thing in a picture the skill with which the artist produced illusion should have resented an art in which such skill was completely subordinated to the direct expression of feeling.” అని వ్యక్తపరచిరి. ఈ నూతన సిద్ధాంతము నంగీకరించి సాధించినవారు సోరట్ (Seurat), పాల్ సై నాక్ (Paulsignac) అను వారలై ఉన్నారు. ఈవిధముగ చిత్రకళ శిఖరస్థానమునందినది. ఈ రోజులలో చిత్రకారునకు ఆకారము (Form) అంత ప్రధానమైనదిగా కాకుండెను. చిత్రమునకు పరిపూర్ణత్వము ప్రసాదించుటలో నొక వేళ ఆకారమును విరూపము చేయవలసిన యవసర మేర్పడినచో చిత్రకారుడావిధముగనే చేయుచుండెను. దాదాపు ఈ కాలమునందే ఛాయావాద రీతులందు విరక్తి పొందిన ముగ్గురు ఆచార్య శ్రేష్ఠులు విభిన్న దృక్పథములతో మూడు నూతన విధానములకు దారితీసిరి. వీరు పాల్ గాగిన్, వాంగోమ్, సీజా నె అనువారు. సాధారణముగా ఉద్రిక్త స్వభావుడైన వాంగోమ్ యొక్క చిత్రము లందు వర్ణముల విజృంభణము అధికముగా కానవచ్చును. కాని అతడుమాత్రము తుదివరకు ఛాయావాద సిద్ధాంతములనే యనుసరించెను. ప్రాచీనాలంకారిక పద్ధతి ననుసరించిన గాగిన్ అనువానివలె సిజాన్ అను నాతడు ఛాయావాదపద్ధతులకు పూర్తిగ తిలోదకములను వదలలేదు. అతడు అవసరమైనచో తాను ప్రతిపాదింపబోవు నూతన సిద్ధాంతములయందు ఛాయావాదము యొక్క సాహాయ్యము సైతము స్వీకరించి తన వ్యక్తిత్వమును కాపాడుకోనెను. చిత్రకళ ఉదాత్తమైన కళయని ఎంచు దేశములన్నింటి యందును సిజానె అను చిత్రకారుని పేరు కీర్తింపబడుచున్నది. అతడు తాను స్వయముగ (Abstract) చిత్రకళాకారుడు కాకపోయినను రాబోవు శకములో వర్ధిల్లగల (Abstract) చిత్రకారులకు ఆచార్య ప్రాయు డయినాడు. అతని ప్రయత్నమంతయు ఎదుటనున్న దృశ్యమునకు సంపూర్ణమై శాశ్వతమైన లక్షణము (Characteristic) నాపాదించుటయందే లగ్నమై యుండెను. అతడే ఒక పర్యాయము నేను ప్రకృతిని యథారూపమున చిత్రించుటకు పూనుకొనలేదు. కాని దాని ప్రతినిధిరూపమును జూపి నాను - అని అనెనట. అతడు తనకు కలిగిన (మూడవ) పరిమాణ విషయకమయిన అనుభూతిని, చిత్రము యొక్క లోతును, (depth) చిత్ర ఫలకమునందు తార్కిక దృష్టిని పునర్నిర్మితము గావించుటకు పూనుకొనెను, సాధారణముగ శాస్త్ర దృష్టిచే నావృతమైన వస్తువుల ఆకార ప్రాతిపదిక లన్నియు, శంకు, స్తూపము, గోళము. వీటియొక్క ఆకారములోనుండునన్న సత్యము నాతడు పునః ప్రతిస్థిత మొనర్చెను. అతడు ఆరేఖాగణిత సంబంధములగు ఆకృతులన్నియు (plane by plane) విధానములో నమర్చి తగిన రంగులతో సంక్షేపముగను, ప్రస్ఫుటముగను చూపగలిగెను. అతని సమకాలిక కళాకారులు, విమర్శకులు అందరు, అతనికళ నిపుణమైనది కాదనియు, వికాసహీనమైన దనియు విమర్శించిరి. అయినను అతడు సరకుగొనక సమకాలిక భావముల కెదురీది తన సిద్దాంతమునకు రూపురేఖల నొసగి ఘనాత్మకత (cubism) అని ప్రపంచములో ప్రఖ్యాతినొందిన సిద్ధాంత విషయమున గురు పీఠము నధిష్ఠించెను. . ఛాయావాదముకంటే ఘనాత్మకత (cubism) అను సిద్ధాంతము యొక్క జీవనపరిమితి చాల స్వల్ప మనియే చెప్పవచ్చును. నిజానె అనునాతనికి సమకాలికుడైన గాగిన్ అనునతడు ప్రతిపాదించిన ప్రాచీనాలంకారిక పద్ధతి ననుసరించినవాడు మతిసే అను చిత్రకారుడు. తన భావములను వ్యక్తీకరించుటకు తోడ్పడు వివిధాంశములను చిత్రకారుడు సాలంకారముగ కూర్చు కళయే చిత్రరచన యని అతడు భావించెను. అతని అనుయాయి వర్గమునే షావులు లేక ఆటవికులు అని పిలిచిరి. ఈ ఫావుల సంచలనమీ శకమునందు ప్రారంభించి దాదాపు 1914 సం. నాటి ప్రథమ ప్రపంచ సంగ్రామము వరకు సాగెను. ఈరీతియందు ప్రసిద్ధులయిన చిత్రకారులు వ్లామింకు, డిరాయిన్, రౌనాల్టు అనువారలు. ఈషావుల వలె వీరె, జొన్నార్టు ఎడునార్డు, విల్లార్డు అనువారు ఉద్రిక్త విధానము ననుసరింపక ప్రశాంత విధానమును చేపట్టిరి. వీరిని ఇంటినిస్ట్రీస్ (Intinistes) అందురు.

తరువాత, చిత్రలేఖనము యొక్త దృక్పథములు కూడ రాజకీయ దృక్పథములతో నేకీభవింపబడ వలయునను ప్రయత్నములు గావింపబడినవి. ఆయత్నముల ఫలితమే ఫ్యూచరిస్టు (Futurist) సంచలనము. 1909 వ సం న మారినెట్టు అనునాతడు ఫ్యూచరిస్టు సిద్ధాంతములను రాజకీయ సిద్ధాంతములతో మేళవించెను. మారి నెట్టు, సేవరీని, అనువారు తమ చిత్రములలో చాలభాగము యంత్రముల యొక్క శక్తుల నధికతరముగ కనబరచుట యందును, అతి త్వరితగమనముగల మోటారు ధ్వనికి సాంకేతిక చిహ్నములను కల్పించుటయందును, విప్లవము చేత నుద్రి క్తమయిన భావములను ప్రదర్శించుటయందును, శ్రద్ధ వహించినట్లు కానవచ్చును. ఐరోపా రాజకీయములు ముఖ్యముగా మస్సోలినీ కాలమునాటి రాజ్యాంగ విధానములు, ఆనాటి చిత్రకళకు సామగ్రిగా గ్రహింపబడినట్లు తెలియుచున్నది. ఈ విధానము ఆనాటి ఫ్రెంచి చిత్రలేఖనముపై అధిక ప్రభావము కలిగించెను.

ఫ్యూచరిస్టుల యొక్క ప్రయోగములు Shock tactics చిత్రకారుల రచనా విధానమునకు తోడుపడు నట్లుగా గ్రహింపబడినవి. 'డాడిజం' అనునవీన సిద్ధాంతము ఫ్రాన్సునందు జన్మింపక జ్యూరిచ్ నందు తలయెత్తినది. దాని ప్రముఖానుయాయి దేశములు జర్మనీ, రుమేనియా అనునవి. ఇంత వరకుగల నియమముల నుల్లంఘించుట, ఏవిధమయిన లక్షణమునకు లొంగకపోవుట అనునవియే ఈ సిద్ధాంతము యొక్క ప్రధానాశయములు. కేవలము చిత్రకళయందేకాక సాహిత్యమునందును, రాజకీయము లందును, తుదకు జీవితమందుకూడ ఏ నియమముచేతను వ్యక్తి బంధింపబడకూడ దనియే వారి భావము. అన్ని పద్ధతులను తిరస్కరించుట, జన సమ్మతినొందిన అన్ని విలువ. లను ధ్వంసముచేయుట, సృష్టి నిర్మాణము తదర్ధమే (స్వాభావికమే) అనుట, సృష్టి నిర్మాణ కళ యందు అది (ప్రకృతి) స్వయముగ నాశన మొందుట” అను సిద్ధాంతములను వారు ఉద్ఘాటించిరి. ఈ సంచలనము 1918 నాటి ప్రపంచ యుద్ధ ఫలితములగు నిరాశ, నిస్పృహ, ప్రతీకార వాంఛ అనువాటివలన ప్రభవించిన దని చెప్పవచ్చును.

తరువాత ప్రొఫెసరు ఫ్రెండు అనువాని సిద్ధాంతముల నాధారముగ జేసికొని అతివాస్తవికత (Surrealism) అను నూతన విధాన మొకటి చిత్రకళయందు ప్రవేశ పెట్టబడెను. ఈ సిద్ధాంత మీ సామాన్య జాగ్రజ్జగత్తునకు సంబంధించినది కాదు. ఇది మానవుని స్వప్నావస్థకును, స్పృహారహిత స్థితికిని సంబంధించినది. మానవుని మనస్సు అతార్కికముగ పరిభ్రమించినప్పటికిని అది యిట్టి స్థితిలో జాగ్రదవస్థయందు కంటె విశాలముగను, సత్యముగను, ప్రస్ఫుటముగను కనబడునని వాదించి చిత్రోపేతమయిన ప్రదర్శనము మూలమున (pictorial representation) దీని సిద్ధాంతమును వ్యక్తీకరించిరి. ఈ సిద్ధాంతమునకు సంబంధించిన చిత్రకారులగు చిరికో, మార్క్ చేగల్ వారల చిత్రములందు సంభావ్యము అసంభావ్యముగ గన్పట్టుట, కొన్నియాకారములు (Figures) గాలియందు తేలిపోవుట మున్నగువాటిని కవితా సౌందర్యముతో ఆకర్షణీయమయిన పద్ధతిలో (design) ను, రచనా కౌశల్యముతో (draughtsmanships) ను చిత్రించుట గోచరించును.

ఆధునిక చిత్రికారు లందరిలోను తలమానికముగా ఎన్నతగినవాడును, సృజనాత్మకుడును, స్వతంత్రుడును అయిన పికాసో అనువానిని ప్రత్యేకముగ స్మరింపక చిత్రకళా పరమర్శము పూర్తి కాజాలదు. విశాలదృక్పథము కల ఇతని చిత్రకళారంగము చాల భిన్నము విపులము నైనది. ఈ యుగములో తలసూపిన అధికసంఖ్యగల ప్రాయోగిక (experimental) చిత్రకళాఖండములకు కారణభూతుడు అతడే. అతని పేరు 'Abstract'చిత్రకళతో సంబంధముకలదై యున్నప్పటికిని, వాని చరిత్రము తమ కాలమందలి పురోగమించుచున్న కళ యొక్క ముందడుగు. "His history is very much the record of the Forward Art movement in our time” అని విమర్శకులు అభిప్రాయపడిరి. ప్రతిభావంతుడైన ఇతడొక్కొక అపురూపమైన చిత్రమును ఒక్కొక శాఖకు చిహ్నముగా వెలయించి తన సమకాలిక చిత్రకారులును, సాధారణ ప్రజలును అత్యాశ్చర్యపడునట్లు చేసినాడు. అతని ప్రథమ చిత్రమునందు రావేలును, 'ఆకా ఫే'అను చిత్రమునందు పాత్ర చిత్రణ విధానమును "ఫెమ్మె సాల్బార్" అను చిత్రమునందును కొంతవరకు ఛాయావాద రీతులును కొంతవరకు మనకు గోచరించును. ఇదియే అతని ప్రథమదశ (blue period) యొక్క ప్రారంభము. తరువాత నతడు నీగ్రోశిల్పము లందలి స్వతంత్ర భావమును, కళాసౌందర్యమును, కని వాటి ప్రభావమునకు లోనయ్యెను. 'విలేజి ప్రెస్ ఒ టెర్రాగోనె' అను చిత్రమునందు 'సిజానె' యొక్క రచనా సంప్రదాయమును అనుకరించెను. తరువాత ప్రౌఢదశ (Rose period) ప్రారంభమయ్యెను. ఇందు సర్కస్ ప్రదర్శకుల జీవితమును, హెరెలిక్విన్సు యొక్కయు, ఎక్రోబా ట్సు యొక్కయు జీవితముల నితివృత్తములుగా గొని నాడు. ఇందు పికాసో 'బ్లూ పిరియడ్' నందుకంటే పరిపూర్ణత నొందెను. అతడు ఫ్యూచరిజమును మాత్రము ఆమోదింప లేదు. తిరిగి అతడు తనదృష్టిని ప్రదర్శనాత్మక చిత్రకళా సంప్రదాయమునుండి మరలించి ప్రాచీన సంప్రదాయములకు సులభరీతిలో మెరుగులను దిద్దెను. ఫెర్నీస్ ఎఫ్రాయిజన్ బోర్డు డిలా మెర్ అను చిత్రమునందు అతి వాస్తవికత (surrealism) పునరుద్భవించినది. అనంతమైన నూతన రీతులతో వివిధ రంగములలో విహరింపగల ఈ దక్షుని అనంతశక్తులకు ఆధునిక కళాకారులందరు జోహారు లర్పించవలసినదే.

ఆధునికులలో పాల్,క్లీ పాల్ నాష్, రాబర్టు, క్రిస్టఫర్ వుడ్, బెన్నికల్సన్, రోడ్రిగో, మొయని హారిన్, మాథోస్మిత్, వింఢాం మున్నగువారందరు ప్రాచీనాచార్యుల పద్ధతుల ననుసరించి తమకు రుచించిన మార్గమును సాధించిరి. ఈ విధముగ ఆధునిక చిత్ర కళా ప్రవాహము నిలుకడలేక నూతనమార్గముల సంతరించు కొనుచు ప్రవహించుచునే యున్నది.

పి. టి. ఆర్.