సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆదిభట్ల నారాయణదాసు
ఆదిభట్ల నారాయణదాసు : ఆజానుబాహు విరాజితుడయి, బలిష్ఠమైన శరీరము, విశాల నేత్రములు, గొప్ప ఠీవి కలిగి హరికథ చెప్పు నవసరమున సిరిబొజ్జ నృత్యమునకు వింతగొలుప ఆడుచు, పాడుచు, సమయస్ఫూర్తిగా సభాసదులను కొనియాడుచు, ఆక్షేపించుచు, రంజింప జేయుచు‘హరిక థాపితామహు'డనుఖ్యాతి వహించినమహా విద్వాంసులు కీ. శే. శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.
శ్రీ నారాయణదాసుగారు శ్రీకాకుళము జిల్లా పార్వతీపుర సమీపములో సువర్ణముఖి తీరమున నున్న అజ్జాడయను గ్రామములో రక్తాక్షి సంవత్సర శ్రావణ బహుళ చతుర్దశి బుధవారమున (1864) ఆదిభట్ల వేంకట చయనులుగారి వలన నరసమాంబగారియందు ఆష్టమ గర్భమున సంజాతులయి యుండుటవలననే శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవులు ఈ రీతిగా వర్ణించిరి.
అల నారాయణుఁ డప్డు కృష్ణుఁడయి గే
యమ్మందు సంతోషముం
గొలిపెంగాని కవిత్వమందుఁ గొలువన్
కొం తేనియున్నోచుకోఁ
డల లోపమ్మును దీర్చుకోఁ దలచి కా
దా యిట్టి రూపమ్ముతో
నిల నారాయణదాస నామమున ని
ట్లేపారె నాఁ జెల్లదే.
నారాయణదాసుగారు దాదాపు అయిదు సంవత్సరముల వయస్సున తల్లిగారితో కలసి పార్వతీపురము వెళ్లిరి. అక్కడ నొక పుస్తకముల దుకాణములో భాగవతము చూచి తనకు కొని పెట్టు మని తల్లిని నిర్బంధించిరి. తల్లిగారి వద్ద సొమ్ము లేకపోవుటవలన కొని పెట్టలేకపోయెను, కాని నారాయణదాసుగారు చీకాకు పడుట దుకాణదారుడు చూచి ‘అబ్బాయీ! నీవు పద్యములు చదువగలవా? అటులయిన నీకు ఈ భాగవతమును ఉచితముగా నిచ్చెదను' అని పలికెను. అప్పుడు నారాయణదాసుగారు 'అయ్యా! నేను పద్యములు చదువగలను, మా యమ్మ అర్థము చెప్పగలదు' అని పలికి వెంటనే ఆ పుస్తకమును తెరచి రాగ యుక్తముగ పద్యములు చదువుటయు తల్లిగారు చక్కగా అర్థము చెప్పుటయు జరిగెను. నారాయణదాసు గారి కపుడు భాగవతము బహుమతిగా లభించెను.
నారాయణదాసుగారి రెండవ అన్నగారయిన సీతారామయ్యగారు విజయనగరములో నుండెడివారు. వారు నారాయణదాసు గారి తెలివితేటలను గ్రహించి వారికి ఆంగ్లేయవిద్య చెప్పించి, పెద్ద ఉద్యోగమిప్పించవలెనని అభిప్రాయ పడిరి. అందు వలన 13 ఏండ్ల వయస్సులో నారాయణదాసుగారు విజయనగర మహారాజాగారి కాలేజీలో ఆంగ్లేయ భాషను ప్రారంభించి ఆంగ్లేయ భాషయందును, సంస్కృతమందును, సంగీతమందును, విశేషముగ ప్రావీణ్యమును స్వయంకృషి చేతనే సంపా దించుకొనిరి.
శ్రీ నారాయణదాసుగారికి లయ జ్ఞానము పుట్టుకతోనే కలిగెను. వారు మెట్రిక్యులేషను క్లాసు చదువుచుండగా చెన్న పట్టణము నుండి కుప్పుస్వామి నాయుడు గారు అను హరిదాసు విజయనగరమునకు వచ్చి ధ్రువ చరిత్రమును హరికథా రూపమున చెప్పి శ్రోతలను రంజింప జేసిరి. నారాయణదాసుగారు కుప్పుస్వామి నాయుడుగారి హరికథను వినుటవలన, కవిత్వము చెప్పుటకంటెను, సంగీతము పాడుట కంటెను, శాస్త్రార్థము చేయుటకంటెను హరికథను చెప్పుటయే మిన్న యని గ్రహించిరి. గ్రహించుటయ తడవుగ హరికథను చెప్పవలెనను కోరిక వారికి మ్కలిగెను. కలిగి విశాఖపట్టణ వాస్తవ్యులగు ధూళిపాటి కృష్ణయ్యగారు రచించిన ధ్రువ చరిత్రమును ఆధారముగా తీసికొని భాగవతములోని కొన్ని పద్యములను, తాము స్వయముగా రచించిన కొన్ని పద్యములను. కొన్ని కీర్తనలనుచేర్చి సోదరుడగు సీతారామయ్య గారి ఇంటిలో ప్రప్రథమమున హరికథా కాలక్షేపమును చేసిరి. సీతారామయ్యగారు ఆతని నృత్యమును వీక్షించి లెస్సగా మెచ్చి, హరికథ చెప్పునపుడు గజ్జెలు కట్టుకొని నృత్యము చేయుమని వారిని ప్రోత్సహించిరి. ఈ రీతిగా ప్రప్రథమమున తెలుగు దేశములో శ్రీ నారాయణదాసుగారు హరికథా కాలక్షేపము చేయుట జరిగెను. వారు మొదట హరిదాసులగుట యేగాక, హరికథా పితామహుడనియు ప్రసిద్ధి నొందిరి.
అప్పటినుండియు నారాయణదాసుగారు హరికథలు యక్షగానములుగా రచించి హరికథా కాలక్షేపములను ప్రారంభించిరి. నారాయణదాసుగారును వారి మరియొక అన్నగారగు పేరన్నగారును చిన్ననాటినుండియు కవలల వలె పెరిగిరి. పేరన్నగారు సంగీతములో మంచి ప్రావీణ్యమును, శ్రావ్యమగు కంఠధ్వనియు కలవారు. అందుచే వారు వెనుక పాట పాడుచు నారాయణదాసుగారి హరికథకు వన్నె తెచ్చెడివారు. నారాయణదాసుగారు మెట్రిక్యులేషను పరీక్షలో కృతార్థులయి ఎఫ్. ఏ. క్లాసులో చేరి మొదటి సంవత్సరము విజయనగరములో చదివిరి. ఆ తరుణములో వారి సంగీత సాహిత్యములు విశాఖపట్టణము కాలేజీలో ప్రిన్సిపాల్ డబ్ల్యు. రామయ్యగారిని ఆకర్షించెను.అందుచే ప్రిన్సిపాలుగారి కోరికపై దాసుగారు వారిగృహ మందుండి రెండవసంవత్సరము విశాఖపట్టణములో చదివిరి.
నారాయణదాసుగారు ఆంధ్రదేశములో అనేకపట్టణములలో 'హరికథా కాలక్షేపములు చేసి ప్రజల ఆదరాభిమానములకు పాత్రులైరి. మైసూరు మహారాజు వారి యాస్థానములో హరికథలు చెప్పి వీణవాయించి గొప్ప గౌరవమును పొందిరి. మలయాళ దేశములో హరికథలు చెప్పి కేరళపండితుల మన్ననలకు పాత్రులయిరి. కలకత్తాలో సంస్కృతములోను హిందీలోను హరికథా కాలక్షేపము లొనర్చి రవీంద్రనాథ ఠాగూరు మొదలగు వారిచే కొనియాడబడిరి. అట్లు ప్రసిద్ధిగాంచిన నారాయణదాసు గారినిగూర్చి పెక్కురు కవులు, పండితులు కావించి యున్న ప్రశంసల నన్నిటిని కూర్చినచో నవి యొక మహా గ్రంథముగా పరిణమింపగలవు. శ్రీ రాంభట్ల జగన్నాథ శాస్త్రిగారు నారాయణదాసుగారి నిట్లు ప్రశంసించిరి.
శ్లో. అనన్య సాధారణ శక్తి యుక్త
స్స్వయం తు నారాయణదాస ఏకః
అన్యేతు సాధారణ శక్తియుక్తా
స్పర్వేపి నారాయణదాసదాసాః,
నారాయణ దాసుగారి హరికథా కథనశక్తి అనన్య సాధారణ మైనది. అట్టి శక్తికలవారు వారొక్కరే కలరు. సాధారణ శక్తితోకూడిన శేషించిన హరికథా కథకు లందరు ఆ నారాయణదాసునకు భృత్యులవంటి వారే, అని పై శ్లోకమందలి భావము.
1919 వ సంవత్సరములో విజయనగరపు మహారాజా వారు సంగీత కళాశాలను స్థాపించి శ్రీ నారాయణదాసు గారిని అందు ప్రిన్సిపాలుగా నియమించిరి. నారాయణదాసుగారు ప్రిన్సిపాలుగా నుండిన కాలమున కళాశాలలో ఇతర శాఖలతోపాటు 'హరికథ' నొకశాఖగా ఏర్పాటుచేసి ఎందరో హరిదాసులను తయారుచేసిరి. వారు డెబ్బది మూడు సంవత్సరములు పూర్తియయినతోడనే 1936 వ సంవత్సరమున తమ ప్రిన్సిపాలు పదవినుండి విరమించు కొనిరి. దాసుగారి అసాధారణ ప్రజ్ఞను గుర్తించి ప్రభుత్వమువారు వారి కంతకు ముందున్న జీతమునే ఉపకారవేతనముగా నొసగిరి.
నారాయణదాసుగారు హరిదాసుగా గొప్ప పేరు పొందియుండిరి. అందుచే వారి హరికథా కథన కౌశల్య తేజస్సు వారి యందలి యితర ప్రజ్ఞలను గప్పివై చెను. వారు తమ ఇరువది నాల్గవయేటనే 'బాటసారి' యను ఆంగ్ల కావ్యము ననువదించిరి, పారసీక భాషలో గొప్ప కృషి చేసిరి; ఉమర్ ఖయ్యాం రచించిన 'రుబాయతు” లను సంస్కృతము లోనికిని అచ్చ తెనుగులోనికిని అనువదించిరి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణపండితులు సయితము ఈ గ్రంథమును చాల మెచ్చుకొనిరి. ఆంగ్ల మహాకవి యగు షేక్స్పియరు రచించిన నాటకములలోను కాళిదాస మహాకవి వ్రాసిన గ్రంథములలోను గల నవరసములను మధించి తీసి వాటిలోని గంభీరభావములను తెలుగులోనికి మార్చి 'నవరస తరంగిణి' అనునొక మహాగ్రంథమును నారాయణదాసుగారు రచించిరి. వారు అచ్చ తెలుగులో గొప్ప ప్రావీణ్యము కలవారు. 'నూరుగంటి' అను పేరుతో ఈసప్ కథలను, 'వేల్పుమాట' యను నామముతో భగవద్గీతను, 'వెన్నుని వేయి పేర్ల వినుకలి' యను నామముతో విష్ణుసహస్రనామములను, 'గౌరమ్మ పెండ్లి' యను నామముతొ పార్వతీపరిణయమును అచ్చ తెనుగున రచించిరి. 'తారకము అను సంస్కృత గ్రంథమును వ్రాసి జర్మనీ దేశస్థుడగు ప్రొఫెసరు కె. గెల్డెనరు అను నాతని ప్రశంసకు పాత్రులయిరి. 'జగ జ్యోతి' యను గొప్ప వేదాంత గ్రంథమును రచించిరి. "సీమపల్కు వహి" అను నామముతో దేశ్యాంధ్ర నిఘంటువును రచించిరి. చరమదశలో శ్రీ నారాయణ దాసుగారు లలితా సహస్ర నామములను అచ్చతెనుగు లోనికి భాషాంతరీకరించిరి. ఇంకను వారి అముద్రిత గ్రంథములు పెక్కులు గలవు.
నారాయణదాసుగారి ఏకైక పుత్రిక సావిత్రమ్మ. ఆమెను ఉపాధ్యాయుల అప్పల నరసయ్యగారు పెండిలి యైరి, నారాయణదాసుగారు సహస్రమాసజీవియై 3-1-1945 తేదీని స్వర్గము నలంకరించిరి.
వ. బ్ర.