Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చైనా చిత్రకళ

వికీసోర్స్ నుండి

చైనా చిత్రకళ :

మానుషములును, విశ్వజనీనములును అగు శాసనముల మధ్య గల సమ్మోహనమయిన మైత్రి యందలి విశ్వాసముపై చైనీయుల మతము ముఖ్యముగా ఆధారపడియున్నది. మనము పూర్వులకు ఒనర్చు పూజ ఈ విశ్వజనీన మైత్రికి దోహద మొనర్చును. ఎందుచేతనన, మృతుల ఆత్మలు మాధ్యస్థమును వహించును. ఈ మతము యొక్క నైతిక ధర్మ శాస్త్రమే పౌర ధర్మశాస్త్రము కూడ నై యున్నది. అది క్రీ. పూ. ఆరవ శతాబ్దిలో కన్ ఫ్యూషియస్ (Confucius) అనునాతనిచే సూత్రింప బడినది.

చైనీయుల మనస్సుపై టాయోమతము (Toism) యొక్క ప్రభావము ప్రసరించినది. టాయోమతమునకు

చిత్రము - 215

కవి, చిత్రకారుడు మెంగ్ ఫు

"టాస్ యువాన్ మింగ్" అడవులలో (1254-1322 A. D.)

లౌడ్జు (Laotse) అను యోగిపుంగవుడు ప్రవక్త. టాయో యనగా సత్యాన్వేషణమని అర్థము. అతడు కూడ క్రీ. పూ. ఆరవ శతాబ్దిలో నివసించినవాడే. చిత్రకళపై టాయోమతము (Toism) యొక్క ప్రభావ మనల్పము. మొదట చిత్రకళ నభ్యసించినవారు శ్రమణులు. అనంతర మది క్రీ. శ. మొదటి శతాబ్ది నాటికి చైనాలో ప్రవేశపెట్టబడెను. దాని ఉద్దేశము వినయమును ప్రేరేపించుటయై యున్నది. ఆత్మస్తవమును ప్రేరేపించుటకాదు. ప్రకృతి, ఓషధులు, మృగములు, మేఘములు, వాయువులు మొదలగువానితో కూడిన ఎల్ల విశ్వము నెడ ప్రేమపూర్వకమైన భక్తిని అది బోధించును.

ఈ గూఢతత్త్వము (Mysticism) యొక్క వివిధములయిన లక్షణములు (Traits) మన శకపు ప్రారంభ శతాబ్దులలో, చైనా యందు బౌద్ధమత వ్యాప్తిని సుకర మొనర్చెను. జెన్ (Zen) యొక్క ఉపదేశము (Teaching) బౌద్ధము యొక్క ఒక విశిష్టరూపమై యున్నది. దానికిని, టాయో మతమునకును మిక్కిలి సాధారణత గలదు. జెన్ - బౌద్ధము (Zen- Buddhism) చైనాయందు క్రీ. శ. 6 వ శతాబ్దిలో ఆవిర్భవించెను. పిదప దాని ప్రాముఖ్యము జపాను విషయమునగూడ ప్రముఖముగా నుండెను.

ఈకెలతో వ్రాయు పద్దతినుండి చైనా చిత్రకళ విధానము వికసించి యున్నది. చైనీయులు తమ వ్రాతలను సమాచారము లందజేయు ఒక సాధనముగా మాత్రమే భావించి యుండలేదు. కాగా లేఖనమును వారొక కళగా భావించిరి. ఆ కళయందు తూలికారేఖల (పదార్థాపేక్ష లేకయే) విసురుడు మిక్కిలి ప్రాముఖ్యము కలది. చైనా చిత్రకళా ప్రముఖు లందరు కవులుగనో, వేదాంతులుగనో, మతాచార్యులుగనో యుండుటయే గాక, లిపి కళాకోవిదులుగకూ డనై (Callingraphers) యుండిరి. చైనీయుల యొక్కయు, జపానీయుల యొక్కయు హస్తనైపుణ్యము కారణముగా, మషీతూలిక తడిదైనను, పొడిదైనను, స్థూలరేఖనుండి అతి సూక్ష్మరేఖ వరకును, గాఢమయిన నల్లరంగు మచ్చనుండి, అత్యంత కోమల మయిన వన్నె వరకును జంకుగొంకుతోనో, ధైర్యసాహసములతోనో ఉపయోగింపబడినను, అది హావభావ వికారములను అభివ్యక్తము చేయగలిగెడిది. అట్టి చిత్తరువులు గోడలపై గాని, కాగితపు చుట్టలపై గాని, పట్టువస్త్రములపై గాని వ్రాయబడెడివి. వాటిని ప్రత్యేకపు గొట్టములలో భద్రముచేసి యుంచెడివారు. జపాను భాషలో చిత్రపటముల చుట్టలను అడ్డముగా తెరచినచో వాటిని 'మాకిమోన్' అనియు, నిలువుగా తెరచినచో వాటిని 'కాకిమోనీ' అనియు అందురు. ఈ చిత్తరువులు చూచి నంత మాత్రమున అర్థమగునవి కావు. కాని హస్తలేఖనము ఎట్లో, అట్లే ఇవి యథాక్రమముగా శ్రద్ధతో పరీక్షింప దగినవై యున్నవి. ఒక్కొక్కసారి చిత్తరువులను మడిచి చిత్రములుంచు పుస్తకము(Album)లో భద్రపరచు చుందురు. విసనకఱ్ఱలు, కట్టె కిస్తీలు (Trays), తెరలు ఎత్తి జారవిడుచు తలుపులు- వీటిపై వివిధ రంగములు, ప్రకృతి దృశ్యములు చిత్రింప బడుచుండును. చైనాయందు హాన్ రాజవంశ కాలము (Han Dynasty) నుండి గొప్ప ఎత్తున పచ్చిగచ్చుపై చిత్ర రచన (Fresco Painting) అభ్యసింప బడెను. బౌద్ధము ఆరంభమైనది మొదలుకొని ఈ కళకొక నూతన ఉత్తేజము (Impetus) చేకూరెను. కాని వస్తుతః కళాఖండ మెద్దియు సంరక్షితము కావింపబడి యుండలేదు. కాని వాటికి ప్రతులుగా చెక్కబడిన ఖననక్రియా శిలాఫలకముల వలన, మనకు ఆ పచ్చిగచ్చు చిత్రలేఖనములను గూర్చి కొంత తెలియు చున్నది. ఈ ప్రతి ప్రకాశచిత్రములలో (Silhouettes) నొక చిత్తోన్మాదకరశక్తి కలదు.

చైనీయులు తమ కళాకారులను గూర్చియు, వారి రచనలను గూర్చియు వృత్తాంతములను శతాబ్దముల తరబడిగా వ్రాసిపెట్టి యుంచినారు. కాని వాటిలో నొక్కటి యైనను నిలిచియుండలేదు. కు - కై - చై (Ku-Kai-Chai) చిత్రలేఖనము ఒకటి లండనులో బ్రిటిషు మ్యూజియమున నున్నది. అది క్రీ. శ. నాలుగవ శతాబ్దికి చెందిన కళాకారుని రచనకు ప్రతిగానున్నది. అది తాంగ్ యుగమునకు (Tong period) చెందినదై యున్నది. దానిని బట్టి అప్పటికే చైనా కళ రూపొందియున్నట్లు తెలియు చున్నది.

తాంగ్ యుగములోనే (క్రీ. శ. 618-906) చైనా చిత్రకళ ఒక కళగా రూపొందినది. అప్పుడే చైనా కవిత గూడ రూపొందెను. చైనా కళకును, చైనా కవితకును సన్నిహితమయిన సంబంధము కలదు. ఈ యుగపు చిత్ర కళాఖండములలో గూడ స్వల్ప సంఖ్యాకములే నిలిచియున్నవి. ఈ కాలమున ప్రప్రథమముగా పర్వతములు, వృక్షములు, జలపాతములు మొదలగు వాటిని (Moods and atmospheres) చిత్రకళా ఖండములను సృజించుటకై ఉపయోగించిరి. లిస్యు హసన్ (Lissu-hseen) అను నాతడును, కవియు, చిత్రకారుడు నైన వాంగ్‌వేయ్ (Wangwei) అను నాతడును ఈ జాతి చిత్రకళాకారులలో ప్రవీణులుగా నెన్నబడిరి. అయితే యథార్థముగా వారివని చెప్పబడు కృతులెవ్వియు నిలిచియుండ లేదు. ఈ కాలపు కళాకారులు ఒక నియతమయిన సంక్షేపవర్ణనముచే దృష్టిగోచర ప్రదేశ చిత్రములను (Landscapes), బొమ్మల చిత్రములను చిత్రించు విషయమున అవలంబింప దగిన స్వరూపములను నిర్వచింపదలచి నట్లు కనిపింతురు. వారు జీవించియున్న యుగపు వాస్తవికతాదృష్టిని (Realistic outlook) బట్టి చూడ అది సంభావ్యమే అగుచున్నది.

సంగ్ యుగమున (క్రీ. శ. 960-1279) టోయిస్ట్, జెన్ (Toaist and Zen mystics) అను గూఢ తత్వజ్ఞుల ప్రభావముచే దృష్టిగోచర ప్రదేశ చిత్రణము (Landscape) ఆధ్యాత్మిక తత్త్వబద్ధ మయ్యెను. ఈ తాత్త్వికతాముద్ర కవితపై గూడ పడెను. ఇందు కళాకారులు సహజావేశముతో తమ మనో వృత్తులను ఆవిష్కరింప యత్నించిరి. వారు సమకాలిక వేదాంతము ననుసరించి ప్రపంచ దృష్ట్యా సకల వస్తు ప్రపంచము అనిత్యత్వముగా భావింప దొడగిరి. అంత కళాకారులు దృష్టి గోచరములగు పర్వత ప్రదేశ రంగములను (Landscape of mountains), జల ప్రదేశ రంగములను చిత్రించ దొడగిరి. అట్టి చిత్రము లందు పొగమంచులో మగ్నమయిన ఆకృతులు (Mist drenched forms) కననగును. ఆయాకృతులు అంతరించుచున్న ప్రపంచమునకు సంబంధించినవా అని యనిపించుచుండెను. కాకెమానోస్ (Kakemonos) అను చిత్ర పటములలో అంతరువులు ఒకదానిపై నొకటి గోచరించు నట్లుగా ఏర్పరచబడును. అందుచే నవి నొక దానిపై నొకటి యున్నట్లు కాన్పించును. ప్రదేశ చిత్రమును పూర్తిగా నాకళించినచో చిత్రకారుడు అత్యున్నత స్థానమునుండి ఆ రంగమును దర్శించినట్లు తోచును. ధ్యానమగ్నుడయిన ఒంటరి బాటసారి వంటి అల్పవ్యక్తులను చిత్రించుట చిత్రకారులకు అభీష్టములైన విషయములయ్యెను. ఎల్ల సృష్టిలో భగవంతుడున్నాడు. పొగమంచులో వంగిన శాఖా పుష్పములపై వ్రాలిన సీతాకోక చిలుక, మురికిలో పడియున్న బిచ్చగాడు - అందరును బుద్ధావతారులే అని హిషియకుయ్ (Hsiakuei) అను చిత్రకారుడు వచించెను. సంగ్ (Sung) కాలమునాటి దృగ్గోచర ప్రదేశ చిత్రములలో ముందు భాగమున ఒక చెట్టురూపము ఉండును. అదియొక వికృత, విరూప రేఖా చిత్రము. ఆచెట్టు (చిత్రము 215) దుష్టచర్యా ఫలితమునకు సంకేతము. చిత్రకారులు ఆధ్యాత్మిక భావమును చిత్రించుటకు యత్నించుచు తాంగ్ కళాకారులయొక్క వాస్తవికతా రూపమును విస్మరించి, సంప్రదాయపు విలువలపైన మాత్రమే ఆధారపడుచు, దృగ్గోచర ప్రదేశ చిత్రములను మోనోక్రోం వాషుల తోనే వారు నిర్వహించిరి. అట్టి ప్రదేశ చిత్రములతోబాటు ఒక అడవిబాతుల ఆకాశపథ విహారమునకు సంబంధించిన విడ్డూరపు భ్రమాన్విత దృశ్యమో, లేక ఒక గండశైలాంచలమున నున్న పక్షి మున్నగు నవియో కళాకారుల అభిరుచి పాత్రములైన విషయములై యుండెను.

యూయన్‌కు చెందిన మంగోలియన్ రాజవంశపు (క్రీ. శ. 1280-1368) పోషణక్రింద ఔత్తరాహ - దాక్షిణాత్య చిత్రకళా సంప్రదాయముల మధ్య సరిసమానత్వము రక్షితమయ్యెను. సంగ్ యుగపు ప్రదేశ చిత్ర సంప్రదాయములలో ఇంద్రియముల యొక్కగాని, బుద్ధి యొక్కగాని శక్తివలన గ్రహించెడు అత్యల్ప వ్యత్యాసమునందు ప్రేమ, ఆకార రేఖలులేని చిత్రణములు - లిపి కళతోను, కవితా కళతోను సన్నిహిత సంబంధము పరిపోషింపబడెను.

మంగోలు జాతివారిని పరాజితుల నొనర్చిన మింగ్ సమ్రాట్టులు (క్రీ. శ. 1368-1644) ప్రాచీన సంప్రదాయ తత్త్వమును పునః ప్రతిష్ఠించిరి. అందు వారు సంప్రదాయమును దృఢీకరించిరి. తన్మూలమున కళ యందు కళాత్మక దృష్టి ఏర్పడెను. ఆ దృష్టి చింగ్ (రాజుల) యుగమున (క్రీ. శ. 1644-1912) ప్రబలమయ్యెను. కళాకారులు తమ ప్రాచీనుల చిత్రకళా లక్ష్మిని జూచి అత్యంతముగ ముగ్ధులై తమ రచనల యందు ప్రాచీన చిత్రలేఖన సంప్రదాయములనే దృఢముగ ననువదించిరి. ఈ ప్రవృత్తి శేషించిన కళలకు కూడ సాధారణమయినది. దృగ్గోచర ప్రకృతి దృశ్యములలో ఏక వర్ణమునే వాడవలయునను నిర్బంధ నియమమును ఉల్లంఘించుటచే అసంఖ్యాకము లయిన వర్ణముల మిశ్రీకరణమునకును, క్షుద్ర చిత్రకళా సన్నివేశముల కొరకై యత్నించుటకును, అలంకరణమునకు అతి మాత్రమయిన ప్రాధాన్య మొసగుటకును అవకాశము కలిగినది. దృగ్గోచర ప్రకృతిదృశ్య చిత్రణము నర, మృగ, పక్షి విగ్రహ సంతానముతో క్రిక్కిరిసియుండు నట్లు చేయబడెను. ఐనను అనేకము లయిన అత్యుత్తమ కళాఖండములలో సయితము, తాంగ్-సంగ్-యుగ చిత్రకళ యందలి గాంభీర్యము, అభినివేశము మరల సిద్ధించినవి కావు.

చైనాదేశమున రాజరికము (Monarchy) 1912 వ సంవత్సరము నందు అంతమొందుటతో, ప్రజాస్వామికము (Republic) స్థాపిత మయ్యెను. ఇపుడు చైనాకు పశ్చిమ దేశములతో ఎక్కువ సంబంధము ఏర్పడినది. అప్పటి నుండి చైనా చిత్రకళయందు రెండు తెన్నులు (trends) - పాశ్చాత్య పద్ధతి, జాతీయ పద్ధతి అనునవి రూపొందెను. జూపియన్ (Jupeon), చై పై షీ (Chai pai sheih) అనువారు అత్యంత విఖ్యాత, సమకాలిక చిత్రకళా కోవిదులలో పేర్కొనదగినవారు.

చైనా యందు ప్రజాప్రభుత్వము ఏర్పడిన తరువాత చిత్రకళా వస్తువుల వరణమునందు సాంఘిక వాస్తవికతను మాత్రమే చిత్రించుటకు చైనా ప్రభుత్వమువారి ప్రోద్బలము ఎక్కువగుటచే, చైనాదేశపు చిత్రకళయందు మినుకు మినుకు మనుచున్న ఆనంద గుణమును చైనీయులు కోల్పోయినారు.

జ. మి.