సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చైనాభాషా సాహిత్యములు
చైనా భాషాసారస్వతములు :
ప్రపంచమునందు అత్యధిక సంఖ్యాకులచే వ్యవహరింప బడుచున్న భాషలలో చైనాభాష యొకటి. చీనో - టిబెట్ భాషా కుటుంబమునకు చెందిన రమారమి 115 భాషలలో చైనాభాషది అగ్రతాంబూలము . ఈ భాషలో మాటాడు ప్రజలు ఏబదికోట్లకు పైబడి యున్నారు. ఈ భాష, దీని లిపి, సారస్వతము అతి ప్రాచీనము లయినవి. లిపికిని ఉచ్చారణమునకును ఎట్టి సంబంధమును లేకుండుట చైనీయ భాషయందలి యొక ప్రత్యేకత. ఈ కారణము వలననే ఈ భాష ఎంత ప్రాచీనమైనదైనను, దానియొక్క పరిణామమును చక్కగా నిరూపించుట కష్టమగుచున్నది. చైనాభాష సుమారు 3000 ఏండ్ల నుండియు వ్యవహారమునం దున్నట్లు తెలియుచున్నది. దీనికి లిపి ఏర్పడికూడ సుమారు 2000 ఏండ్లకు పైబడినది.
చైనీయ భాషయందు మాండలిక భేదములు పెక్కులు గలవు. వీటిలో కొన్ని పరస్పరము ఎట్టి సంబంధమును లేనివని తలపదగినంత భిన్నములుగా నున్నవి. ఇట్టి మాండలిక భేదములు విశేషముగా చీనా సముద్రతీర ప్రాంతములలో వ్యవహారమునం దున్నవి. కేంటానీస్, స్వాటో, ఎమోయ్, ఫూచౌ, వెన్‌చౌ, నింగ్పో, వూ మున్నగునవి సాగరతీర మాండలికములు. మండారిన్ అని పాశ్చాత్యులచే పిలువబడు 'క్వాన్ హ్వా' (అధికారభాష) మాండలికము లన్నింటిలో అగ్రగణ్యము. చైనాదేశమున ఐదింట నాలుగువంతులలో ఈ మాండలిక మే వ్యవహరింపబడు చున్నది. దీనిని మాటాడు జనాభా రమారమి 30 కోట్లకు పైబడి యుండును. ఇన్ని మాండలిక భేదములను ఒక్కటిగా బంధించుచున్నది చైనీయ లిపియే. మండారిన్ మాండలికమునందును ప్రాంతీయములైన స్వల్ప భేదములు పెక్కులున్నను, ఒక ప్రాంతీయభేదము వేరొక ప్రాంతము వారికి సులభముగ అర్థమగుచునే ఉండును. ప్రస్తుతము చైనాదేశ మందంతటను జాతీయ భాషగా ఉపయోగింపబడు చున్నది పీకింగు ప్రాంతీయమైన మండారిన్ భాష. ఈ యుప మాండలికమును 'క్వోయూ' (జాతీయ భాష) అని యందురు. ఇదివరకు గ్రాంథిక భాషగా నుండిన వెన్-లీ స్థానమును ప్రస్తుతము 'క్వోయా' ఆక్రమించినది.
చైనీయ లిపి చాలవరకు భావాత్మకమే గాని ధ్వన్యాత్మకము కాదు. ఉచ్చరించు శబ్దమునకు, లిఖించు వర్ణము నకు ఎట్టి సంబంధములేదు. కనుకనే ప్రాంతీయములైన మాండలిక భేదము లెన్నియున్నను, చైనాజాతి కంతకును ఒక్క లిపియే వ్యవహార యోగ్యమగుచున్నది. చైనా జాతీయైక్యమునకు భాషకంటె లిపియే ప్రధాన చిహ్నము. చైనాభాష యందు గుర్తింప దగిన లక్షణములు రెండు.
(1) ఇందలి పదములన్నియు ఏకాక్షరము కలవే.
(2) ఇందు వ్యంజనముల సంఖ్య మిక్కిలి అల్పము.
ఈ కారణముల చేత చైనీయ శబ్దజాలము అత్యల్ప సంఖ్యాకము. కాంటన్ ప్రాంతము లందలి శబ్దములు 800 నుండి 900 వరకు ఉండ వచ్చును. పీకింగ్ ప్రాంతమునం దన్ననో, శబ్దముల సంఖ్య 420 కంటె మించదు. శబ్దాది యందలి వ్యంజనములు అల్ప ప్రాణములుగా, మహా ప్రాణములుగా ఉచ్చరింప బడుట వలన శబ్దములం దర్థ భేదము కల్పింపబడును. 'పు' అన్న వ్యంజనము, 'వ్‌హు' గా ఉచ్చరింప బడి అర్థభేదమును కల్పించును. చైనాభాష యందు వ్యంజనములు 23 మాత్రమే ఉన్నవి. స్వరములు మాత్రము 21 వరకు గలవు. స్వరములు హ్రస్వ, దీర్ఘ ప్లుతములే కాక, రెండు మూడు స్వరముల కలయిక వలన ఏర్పడిన మిశ్రమ స్వరములు కూడనై యుండెను. ఉదా : అవో, ఇయే, ఇయేఓ, ఇయు, ఉవా మున్నగు మిశ్రమ స్వరములు తరుచు వినబడుచుండును. ఉదాత్త, అనుదాత్తాది భేదములు కూడ అర్థభేదమునకు కారణములుగా ఉపయోగింప బడుచున్నవి. ఈ స్వర భేదము వలన చైనా భాషకు ఒక విధమగు శ్రుతి రమ్యత కలుగుచున్నది. ఈ స్వర భేదము బుద్ధిపూర్వకముగ చేయునది కాదు. ఇది శబ్దము నందలి యంశమే. కొన్ని ప్రాంతములందు 4 స్వరభేదములు, కొన్ని ప్రాంతము లందు 8 స్వరభేదములు ఉపయోగింపబడుచున్నవి. 'పూ' అను పదమునకు తారతర స్థాయిలో మనుజుడు అనియు, తారస్థాయిలో ఐశ్వర్యము అనియు, మధ్య స్థాయిలో మండలము అనియు, మంద్ర స్థాయిలో ధనవంతుడు అనియు అర్థభేదములు కలుగుచున్నవి. కాంటన్ ప్రాంతపు ప్రజలు ఎనిమిది స్వరభేదములను ఉపయోగించు చుండగా పీకింగు ప్రాంతీయులు నాలుగు భేదములనే ఉపయోగించు చున్నారు. ఇన్ని స్వరభేదములను ఉచ్చరించుటయు, తత్కృతమైన అర్థభేదమును గ్రహించుటయు చైనీయులకు సహజమైపోయినది. చైనా భాష యందు గ, డ, త, ద, బ అను వ్యంజన ధ్వనులు లేవు.
అత్యల్ప సంఖ్యాకమైన శబ్ద జాలములో చైనీయులు వ్యవహారము జరపుకొనగల్గుటకు స్వరభేద కల్పన వలెనే వేరొక కల్పనయు గలదు. అది శబ్దద్వయ సంయోజనము. ఉదా : 'కో' అనగా జ్యేష్ఠ భ్రాత. కాని 'కో' యను ఏక శబ్దమే ఈ యర్థమును సర్వ సాధారణముగా నీయ జాలదు. కనుక దానిని 'కో-కో' అని యామ్రేడితము చేయుదురు. లేదా, 'ట' అను శబ్దమును దాని ముందు చేర్చెదరు. 'ట' అనగా 'గొప్ప' అని యర్థము. కాగా, 'కో-కో' అనినను, 'ట-కో' అనినను జ్యేష్ఠభ్రాత యను నర్థము ఘటిల్లును. ఒక్కొక్కప్పుడు ఏకార్థములై న రెండు శబ్దములను గూడ కలిపి ప్రయోగింతురు. ఉదా : ఖుంగ్ - ఫా= భయపడుట; ఫి- ఫ్యూ= చర్మము; షుము=వృక్షము మున్నగునవి. ఇట్లే మీగడ అనుటకు 'పాలు - చర్మము' అనియు, లాంతరు అనుటకు 'దీపము - పంజరము' అనియు ప్రయోగింతురు.
అక్షరములు : చైనీయ వర్ణములు ధ్వని చిహ్నములు కావని తెలిసి కొనియున్నాము. అవి చాలవరకు భావ చిహ్నములు. చైనీయ లిపి చిత్ర లిపి యని చెప్పవచ్చును. ఐక్కొక్క వర్ణము ఒక్కొక్క వస్తువునకో, భావమునకో చిహ్నముగా నుండును. కనుకనే చైనీయ భాష యందు రమారమి 5000 అక్షరముల యవసర మేర్పడినది. ఒక అక్షరము ఒక పదము. ఖుంగ్, షాంగ్, యింగ్, షూ, కవో, ఫ్యూ - ఇవన్నియు ప్రత్యేకములైన అక్షరములు. ఇవి స్వతంత్ర వర్ణములుగా వ్రాయబడును. భారతీయ భాషల యందువలె ఇందు వర్ణక్రమము ననుసరించి అక్షరములు వ్రాయబడవు. అర్థవంతమైన ఒక్కొక్క శబ్ధము ఒక్కొక్క అక్షరముగా ప్రత్యేక స్వరూపములో వ్రాయబడును. ఈ యక్షరములు చూచుటకు బొమ్మలవలె నుండును. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క చిన్న చదరపు గడిలో ఇముడునట్లుండును. చైనీయుల రచనా పద్దతియు చిత్రమైనదే. పుట యొక్క కుడివైపు పై భాగమున వ్రాత ఆరంభింప బడును. పంక్తులు పై నుండి క్రింది దిక్కునకు నడచును. చైనీయ లిపి, ఆరంభ దశ యందు ఇంచుమించుగా వస్తువుల చిహ్నములతో ఆరంభమైయున్నను, కాలక్రమమున దానియందు పెక్కు మార్పులు జరిగినవి.
క్రీస్తు పూర్వమునందు 18 శతాబ్దములనాటి అక్షర స్వరూపమునకును, నేటి అక్షర స్వరూపమునకును చాల వ్యత్యాసము కలదు. క్రీ. పూ. 1766 మొదలు 1122 వరకు పాలించిన 'యిన్' వంశపు రాజుల నాటివని ఊహింప బడుచున్న భూమికలపై వ్రాయబడిన లేఖనములు ఇటీవల దొరకినవి. వాటిలో సుమారు 2500 అక్షర చిహ్నములు ఉన్నవట. తరువాత 'చౌ' రాజ వంశము పాలించు కాలమున 'ముద్ర' అనబడు లిపి వాడుకలోనికి వచ్చెను. క్రీస్తు శకారంభమున 'అధికార లిపి' అమలులోనికి వచ్చెను. దీనిని ఆరంభించినవారు 'హాన్' వంశ చక్రవర్తులు. దీని నుండి క్రమముగా రెండు విధములైన లిపులు పుట్టినవి. (1) 'ఛేవోషు' అనబడు గడ్డి పరకలవంటి అక్షరములు; (2) 'శింగ్‌షు' అనబడు గొలుసుకత్తు అక్షరములు. క్రీ. శ. 4వ శతాబ్దియందు ప్రసిద్ధ లేఖకుడైన వాంగ్-శి-చిహ్ అను నాతడు మిక్కిలి సుందరమైన 'ఖెమ్ షు' అను లిపిని ప్రవేశ పెట్టెను. ముద్రణ విధానము కనిపెట్టబడినప్పుడీ అక్షరములే స్వీకరింప బడెను. నేటివరకును ఈ లిపియే వాడుకలోనున్నది.
చైనీయులు మొదట వెదురు కలములతో వెదురు బద్దల మీదనో, కొయ్యపలకల మీదనో వ్రాయుచుండు వారు. కాలక్రమమున క్రీ. పూ. 200 సంవత్సర ప్రాంతమున వెదురు కలమునకు బదులు సన్నని కుంచెను వాడ నారంభించిరి. కొయ్య పలకకు బదులు పట్టువస్త్రములను ఉపయోగింప దొడగిరి. క్రీ. శ. 105 వ సంవత్సర ప్రాంతమున 'హాన్' వంశ ప్రభువులు కాగితమును తయారు చేయించిరి. క్రీ. శ. 770వ సంవత్సర ప్రాంతమున ముద్రాక్షరములు కనిపెట్టబడుటచే, బౌద్ధధర్మ గ్రంథములు మున్నగునవి ముద్రింపబడ సాగినవి.
వ్యాకరణము : చైనీయభాషకు వ్యాకరణము లేదనియే చెప్పవచ్చును. చైనీయులకు వ్యాకరణ సూత్రముల అవసరమే కనిపింపలేదు. నామవాచకము, క్రియ, సర్వనామము మున్నగు భాషాభాగములు అందులేవు. పూర్ణపదములు, రిక్తపదములు అని పదములను ప్రాచీన చైనీయులు రెండు తెగలుగ చేసిరి. పూర్ణపదములు మరల జీవత్పదములు, మృతపదములు అని విభజింప బడెను. జీవత్పదము లనగా క్రియాపదములు. మృత పదము లనగా నామవాచకములు. రిక్తపదము లనగా ప్రత్యయములు, అవ్యయములు మున్నగునవి. కారకము, సంధి, సమాసము మున్నగు ప్రక్రియలు చైనా భాషయందు లేవు. ఏ పదమున కాపదము స్వతంత్రము . సందర్భమును బట్టియు, వాక్యమందలి దాని స్థానమును బట్టియు ఒకే పదము సర్వ భాషాభాగములు పనిచేయు చుండును. లింగ, వచన, విభక్తి, కాల, పురుషాది భేదములు ఏ పదమునకును ప్రత్యేకముగా నుండవు. ఉదా : 'పై' అనుమాట రాజు, గొప్ప, ఎత్తైన, మీదుగా, ఎక్కుట అను అర్థములలో వివిధ భాషాభాగములుగా పనిచేయును. క్రియా పదమునకు ముందు నిన్న, పూర్తి మున్నగు పదములను చేర్చుటచే భూతకాలము, మరునాడు, ముందుకాలము అను శబ్దములను చేర్చుటచే భవిష్యత్కాలము సూచింప బడును.
గ్రాంథిక, వ్యావహారిక భాషలు : చైనీయుల గ్రాంథిక భాషకును, వ్యావహారిక భాషకును చాల వ్యత్యాసము కలదు. వ్యవహారమందలి ద్వ్యక్షర పదములు గ్రంథములం దుండవు. ఉదా : షీన్- చూచు; ఖాన్ - కను. వ్యవహారమున 'చూచు' అనుటకు 'ఖాన్ - షీన్' ఆను ద్వ్యక్షర ప్రయోగముండును. గ్రంథములందు 'షీన్' అను ఏకాక్షర పదప్రయోగమే ఉండును. వ్యర్థపదములు, ప్రత్యయములు గ్రాంథిక భాషయం దుండవు. గ్రాంథిక భాష సూత్రప్రాయమై అర్థబంధురముగను, వ్యాఖ్యాన సాపేక్షముగను ఉండును. సంక్షిప్తత ప్రాచీన చైనా వాఙ్మయముయొక్క ముఖ్యలక్షణము, అక్షర రచన సౌలభ్యము చెందిన కొలది, ముద్రణాది సౌకర్యములు పెంపొందిన కొలది, గ్రంథ రచనాశైలియు, వెనుకటి సంక్షిప్తతను క్రమముగా సడలించుకొనినది. తమ ప్రాచీన సాహిత్యముపై చైనా ప్రజలకు మిగుల భక్తిగలదు. విద్యాధికులకు కూడ అది యొకపట్టున అర్థముకాదు. గ్రాంథిక పదములు పెక్కు వ్యవహారమునలేవు. వ్యవహార మందలి పదములకు పెక్కింటికి అక్షర చిహ్నములు లేవు. అనుప్రాసాది శబ్దాలంకారములతో గూడినదై, గ్రాంథికభాష మిక్కిలి ప్రౌఢముగను, రమ్యముగను ఉండును. పాశ్చాత్య నాగరికతా సంపర్కమువలన నూతన విజ్ఞానము చైనాదేశమునందు ప్రవేశించినప్పుడు, పెక్కు పారిభాషిక పదములు చైనీయ భాషలోని కెక్కినవి. వీటికి చైనావారు క్రొత్త పదములను సృష్టింపక, ఉన్న పదములయొక్క నానావిధ సంయోగముల చేతనే పద విశేషములను కల్పించుకొనిరి.
లిపి సంస్కరణోద్యమము : చిత్రరూపములు, భావరూపములు, ధ్వనిరూపములు నయిన వేలకొలది అక్షరములను గుర్తుపెట్టుకొనుట ఎట్టి మేధావంతునకైనను దుర్ఘటమే. కనుక చైనీయులు తమ లిపిని ఇతర భాషా లిపులవలెనే ధ్వన్యాత్మకము చేసికొనవలెనని తలచి కొంత ప్రయత్నము చేయుచున్నారు. రోమన్ అక్షరములను తమ భాషాస్వభావమున కనుగుణముగ సవరించి ఉపయోగించుకొనవలెనని వీరు యత్నించు చున్నారు. చైనీయ భాషయందు మాండలిక భేదము లెన్నియున్నను, అన్ని మాండలికములకును లిపి యొక్కటియే అనియు, అదియే వారి జాతీయైక్యమునకు చిహ్నముగా నున్నదనియు గ్రహించనగును. అట్టి లిపిని సంస్కరించు యత్నము సఫలమగుట సామాన్య విషయము కాదు. ఎట్టి ధ్వన్యాత్మక లిపియైనను, ప్రాచీన చైనా వాఙ్మయమును తిరిగి వ్రాయుటకు పనికివచ్చునట్లు కనిపించదు. ఆ భాషయందలి స్వరభేదములు కూడ చాల వైవిధ్యము కలవి. ఎన్ని స్వర చిహ్నములను ఉపయోగించినను, అన్య లిపిలో తిరిగి వ్రాయబడినచో, ప్రాచీన చైనా సాహిత్యము తన సౌందర్యమును, శ క్తిని చాలవరకు కోల్పోవలసియుండు నని విజ్ఞుల అభిప్రాయము.
చైనీయ సారస్వతము : క్రీస్తు పూర్వము 16 శతాబ్దుల నుండి, అనగా ఇప్పటికి ముప్పదియారు శతాబ్దులకు పైగా అవ్యాహతముగా కొనసాగుచుండిన చైనీయ సారస్వతము ప్రపంచమందలి జీన ద్భాషా సారస్వతములన్నింటిలో ప్రాచీనతమమని చెప్పుట అతిశయోక్తి కాదు. ఈ సారస్వతములో ప్రతివిషయమునుగూర్చియు అత్యంత విపులములగు గ్రంథములు గలవు. శబ్దకోశములు, విజ్ఞాన సర్వస్వములు, చరిత్రలు, ప్రమాణ గౌరవమున సాటిలేనివని చెప్ప నొప్పును. పెక్కు చారిత్రక గ్రంథములు సత్య కథనమున విఖ్యాతి గడించినవి.
చైనీయులు తమ సారస్వతమును సామాన్యముగ నాల్గు శాఖలుగా విభజించుట కలదు :
(1) కన్‌ఫ్యూషియన్ సిద్దాంతములు, శబ్దకోశములు, భాషా తత్వశాస్త్రము, పద పరిణామము మున్నగునవి.
(2) ప్రభుత్వములు గాని, వ్యక్తులు గాని రచించిన వివిధ చరిత్రలు, రాజ్యాంగ శాస్త్రము, జీవిత కథలు, గ్రంథ పట్టికలు, భూగోళశాస్త్రము, ప్రభుత్వ వ్యవహారములు మున్నగునవి.
(3) తత్వశాస్త్రము, మత గ్రంథములు, బౌద్ధ సిద్ధాంతములు, విజ్ఞాన శాస్త్రములు, కళలు మున్నగునవి; యుద్ధతంత్రము, నీతి, కృషి, జ్యోతిషము, వైద్యము, సంగీత సాహిత్య శాస్త్రములు, విజ్ఞాన సర్వస్వములు మున్నగునవి.
(4) ప్రత్యేకములయిన కావ్యములు, కావ్య విమర్శనములు, ఛందోగ్రంథములు, అలంకార గ్రంథములు మున్నగునవి. చారిత్రక దృష్టితో చైనీయ సాహిత్యమును వేర్వేరు యుగములుగా విభజించు సంప్రదాయము కూడ కలదు. అందు పేర్కొన దగినవి : (1) ఆదిమ యుగము, (2) కన్‌ఫ్యూషియన్ యుగము, (3) బౌద్ధం-టావో సిద్ధాంత యుగము, (4) కావ్యయుగము, (5) సారస్వత వికాస యుగము, (6) నాటక, నవలా యుగము, (7) వైజ్ఞానిక యుగము, (8) ఆధునిక యుగము.
చైనీయ సారస్వతము వివిధ శాఖల యందు కాలక్రమమున వర్ధిల్లిన రీతి :- కవిత : క్రీ. పూర్వము పది శతా బ్దుల క్రిందటనే చైనాభాష యందు కవితారచన ప్రారంభింపబడినది. 'చౌ' వంశ ప్రభువుల కాలమునకు చెందినవని తలంప బడుచున్న పెక్కు గీతములు 'షిహ్ చింగ్ ' (గీత మంజరి) అను పేర గ్రంథ రూపమున సంకలనము చేయబడినవి. ఇందు పెక్కు గీతములు కన్‌ఫ్యూషియన్ సిద్ధాంతము ననుసరించినవి. మతము, ప్రేమ, భోగములు, ప్రభువుల వ్యసనములు, అధికారులు దుండగములు మున్నగు నానా విషయములపై వ్రాయబడిన గీతము లిందు గలవు. ఎక్కువ భాగము మత సంబంధమైన కర్మకలాపమునకు చెందినది. చైనీయ కవితకు టాంగ్ వంశపు కాలము స్వర్ణయుగము వంటిదని చెప్పవచ్చును. అత్యుత్తమ శ్రేణికి చెందిన మహాకవు లెందరో ఆ యుగమున వర్ధిల్లిరి. మెంగ్ హో - జన్ (క్రీ. శ. 689-740) ; వాంగ్ వీ (699-759) అనువారు అరణ్యమునం దాశ్రమములు నిర్మించుకొని, అచ్చట ఏకాంత జీవనము గడిపిన మహా కవులు. వాంగ్ వీ గొప్ప ప్రకృతిదృశ్య చిత్రకారుడు. లిటై-పో (705-762) అనునాతడు మధురాతి మధురమైన కవిత చెప్పినవాడు. సారాయపు మత్తులో ఆతడు గానము చేసిన గీతములు అమృత ధారల వలె ఉండునట. అతృప్తి, నైరాశ్యము ఆయన కవితకు ప్రధాన లక్షణములు. ఈతనితో సాటి రాదగ్గవాడే టుఫూ (712-770) అను కవి. పో చ్యూ - ఇ (772–846)అనునాతడు గొప్ప ప్రభుత్వోద్యోగి. అయినను ఆతడు రసవంతములైన పెక్కు గీతములు రచించెను. నాటి చక్రవర్తి యొక్క ఆదేశము ననుసరించి ఆతని గీతములు పెద్ద శిలాఫలకములమీద చెక్కింపబడెను. ఈ యుగమందలి కవులపై కన్ఫ్యూషియన్ సిద్ధాంతముల యొక్కయు, బౌద్ధ, టావో సిద్ధాంతముల యొక్కయు ప్రభావము మిక్కుటముగా కనిపించును. నూతన ఛందోరీతులెన్నియో ఈ యుగమున వ్యాప్తిలోనికి వచ్చెను. ఈ యుగమున దాదాపు 2200 మంది కవులుండినట్లును, వారు మొత్తము 48,000 కావ్యములు రచించి నట్లును తెలియుచున్నది. గద్యరచనలుకూడ ఈ యుగమున ఆరంభ మయ్యెను. 'హాన్‌యు' యొక్క గద్యశైలి మిక్కిలి మనోహరమైనది. ఇతని శైలి ననుసరించిన మరియొక గద్యరచయిత 'ట్యాచింగ్ య్వాన్ అను నతడు.
సుంగ్ వంశపు రాజుల పాలనలో కవులు కొంతవరకు భోగ విముఖత్వమును ప్రదర్శించినట్లు తెలియు చున్నది . ఈ యుగమందలి కవులలో స్స్యూ-మా క్వాంగ్, ఔ - యాంగ్ శియ, వాంగ్ ఆన్ - షిప్, సు టుంగ్ - పో ముఖ్యముగా పేర్కొన దగిన వారు. అనంతరము పాలించిన మంగోలీ, మింగ్ వంశముల కాలములందును, కవితా వ్యాసంగము విస్తారముగ కొనసాగినను, గుణమునందు వాటి కవిత తత్పూర్వ కవితా స్థాయిని అందుకొనలేదు. మంచూ రాజులలో ఖాంగ్‌శి , చీన్ లుంగ్ అను నిరువురు గొక్ప కవి పుంగవులుగా వాసికెక్కిరి. వారిలో నొకడు 33,950 పద్యములు రచించెనట.
చైనా కవులు సామాన్యముగా ప్రేమ, మానవత, కరుణ అను భావములచే ఆవిష్టులైనట్లు తోచుచున్నది. శృంగార కవితయు కొంత లేకపోలేదు. అరణ్యములు, నదీ పర్వతములు మున్నగు ప్రకృతి దృశ్యములు వారి హృదయములను మిక్కిలి ఆకర్షించును. అనిర్వచనీయమైన యొకానొక విషాదచ్ఛాయ చైనీయ కవిత యందు గోచరించుచుండును.
దార్శనిక సారస్వతము : తత్వజిజ్ఞాస చైనీయులందు అతి ప్రాచీనకాలము నుండియు సువ్యక్తమగుచునే యుండెను. చైనీయ తాత్త్వికులలో పలువురు ప్రభుత్వోద్యోగులే. వారి ఆలోచనా విధానము విస్తారముగా సాంఘిక, రాజకీయ, నైతికజీవనమునకు సంబంధించియుండును. చైనీయ మేధావులతో గొప్ప దార్శనికుడుగా ఎన్నదగిన వాడు కన్‌ఫ్యూషియస్. ఈతడు క్రీ. పూ. ఐదవ శతాబ్దికి చెందినవాడు, ఇతడు అత్యుదాత్తమైన నైతిక దృక్పథము గలవాడు. నైతిక శుద్ధియే మానవజాతి మోక్షమునకు మార్గమని ఆతని ఆశయము. ఆతడు సనాతన సంప్రదాయవాది. రాజులు, రాజపురుషులు, విశుద్ధవర్తనులును, విశాలహృదయులును కావలెననియు, మత సాంఘికాచారములను పాలించవలెననియు, అప్పుడే ప్రపంచము బాగుపడుననియు ఆతడు బోధించెను. జన్మాంతరములను గూర్చి ఆతడు చర్చించియుండలేదు. విశ్వమును పాలించు దైవశక్తి యొకటి ఉన్నదని అతడు దృఢముగ విశ్వసించెను. చౌ వంశ రాజుల యుగమునందే వర్ధిల్లిన మరియొక తత్వము టావో సిద్ధాంతము. ఇది 'టావో టే చింగ్' అను గ్రంథమున ప్రపంచింపబడినది. ప్రకృతియే ఉత్తమ జీవిత మార్గోపదేశిక; నాగరిక జీవితము కృత్రిమమని ఈ టావో సిద్ధాంంతము వివరించును. క్రీ. శ. 4, 5 శతాబ్దులలో చువాంగ్‌ట్జూ, మోటీ, యాంగ్ చూ మున్నగు మేధావులు చైనీయ తాత్వికదృష్టిపై గొప్ప ప్రభావమును ప్రసరింపజేసిరి.
హాన్ చక్రవర్తుల కాలమున కన్‌ఫ్యూషియన్ సిద్ధాంతము, టావో సిద్ధాంతముకూడ రాజాదరణము పొందెను. ఆ సమయముననే బౌద్ధ సిద్ధాంతము గూడ చైనాదేశమునం దడుగుపెట్టెను. సుంగ్ చక్రవర్తుల కాలమున ఈ మూడు సిద్ధాంతముల నడుమ తీవ్రవైరములు చెలరేగెను. క్రీ. శ. 1130-1200 సంవత్సరముల నడుమ చుశీ యను మేధావి కన్‌ఫ్యూషియను సిద్ధాంతమును విశాల దృష్టితో వ్యాఖ్యానించి, టావో, బౌద్ధసిద్ధాంతములను గూడ దానియం దంతర్భవింపజేసెను. ఇటీవల వరకును చుశీ వ్యాఖ్యానమే ప్రామాణికమై యుండినది .
చరిత్ర : చైనీయుల అత్యంత ప్రాచీనేతిహాసగ్రంథము 'షూచింగ్ ' అనునది. ఈ గ్రంథము యో, షున్, యూ మున్నగు పౌరాణిక చక్రవర్తుల కథలతో ఆరంభమై, చౌవంశచరిత్రమున కొంతవరకు వచ్చి ఆగిపోయినది. దీనితరువాత పేర్కొనదగిన చరిత్రగ్రంథము కన్‌ఫ్యూషియస్ వ్రాసిన 'ఛూన్ ఛియు' (వసంతము - హేమంతము) అను 'లూ' రాష్ట్రపాలకుల వృత్తాంతము. షీ చీ అను మహాగ్రంథము పేరెన్నికగన్న ఇతిహాసము. దీనికర్త రాజజ్యోతిష్కుడైన స్స్యూ-మా ఛీన్ (క్రీ. పూ. 145–187) అనునాతడు. ఇతడు ఆజన్మ విద్వాంసుడు. పదియేండ్ల వయస్సుననే ఆతని పాండిత్యము పట్టరానిదై యుండెను. ఇరువదేండ్ల వయస్సుననే ఆతడు చైనా దేశ సంచారమును ముగించెను. తండ్రి యనంతరము రాజ జ్యోతిష్కుడై, ఆతడు తండ్రి యారంభించిన ఇతిహాస గ్రంథమును పూర్తిచేసెను. 'షీ చీ' అను ఈ ఇతిహాస గ్రంథము ఐదు బృహత్ శీర్షికలక్రింద విభజింప బడినది. (1) ప్రభువుల చరిత్రము; (2) కాలానుక్రమణికలు; (3) లఘువ్యాఖ్యలు; (4) సామంతరాజుల వృత్తాంతములు: (5) జీవితచరిత్రలు. ఇది 'పీత చక్రవర్తి'యను పౌరాణిక పురుషుని కథతో ఆరంభమై, హాన్ వంశ చరిత్రతో అంతమగుచున్నది. తరువాత పుట్టిన చరిత్ర గ్రంథములన్నింటికి ఇదియే అదర్శమైనది. అట్టి గ్రంథములలో క్రీ. శ. 11 వ శతాబ్దియందలి టుంగ్ షీన్ అను ఇతిహాస దర్పణము పేర్కొన దగినది. దీని నిర్మాత స్స్యూ-మాక్వాంగ్ అనునాతడు. ఇట్టి మహాచరిత్ర గ్రంథములతో పాటు వందలకొలది జీవిత చరిత్రలు చైనీయ వాఙ్మయమున గలవు.
యాత్రాగ్రంథములు : చైనాదేశము యొక్కయు, అందలి రాష్ట్రముల యొక్కయు భౌగోళిక విషయములను వివరించు గ్రంథములు పెక్కు గలవు. క్షేత్రములను, తీర్థములను, శిథిలములను, పట్టణములను, మహా భవనములను వర్ణించు గ్రంథములు గూడ విశేషముగ గలవు. బౌద్ధమతము చైనాదేశమునం దడుగిడిన అనంతరమే చైనాప్రజలకు విదేశయాత్రాసక్తి కలిగెను. అట్టి యాత్రలుగూడ ముఖ్యముగ బౌద్ధమత జన్మభూమియగు భారతదేశమునకే పరిమిత మయ్యెను. పలువురు చీనా యాత్రికులు భారతదేశమునకు వచ్చియుండిరి. కాని వారిలో తమ యాత్రలను గురించిన వివరములను గ్రంథరూపమున రచించి, విజ్ఞానమునకు దోహదము గావించిన ఫాహియాన్ (క్రీ. శ. 399-414), హ్యుయన్ త్సాంగ్ (క్రీ.శ. 629-645) అను నిరువురు మాత్రమే చిరస్మరణీయులై యున్నారు.
విజ్ఞానశాస్త్ర సారస్వతము : క్రీ. పూ. 4 వ శతాబ్దికి చెందిన 'యుద్ధతంత్రము' అను గ్రంథమే చైనాభాష యందు అతి ప్రాచీనమైన శాస్త్రగ్రంథ మనవచ్చును. చైనాదేశమున కృషికిని, కర్షకునికిని అత్యంత ప్రాధాన్యము, గౌరవము ఉండినను, కృషి పాశుపాల్యములకు సంబంధించిన గ్రంధములు ప్రాచీనకాలమం దెవ్వియు రచింప బడినట్లు తోచదు. శూక్వింగ్ ఛీ అనునాతడు (క్రీ. శ. 1562-1634) సంకలనము చేసిన 'నుంగ్ చెంగ్ ఛువాన్ షు' అను గ్రంథమే ఇటీవలివరకును కృషి పాశుపాల్యములందు ప్రామాణిక గ్రంథముగా పరిగణింపబడు చుండెను. ఇది 60 అధ్యాయముల గ్రంథము. భూవిభజనము, కృషి, జలాధారములు, వ్యవసాయ సాధనములు, ఊడ్పు, పట్టు పురుగుల పెంపకము, చెట్ల పోషణము, పశుపోషణము, ఆహారధాన్యములు మున్నగు విషయములను గురించి ఈ గ్రంథమున విపులముగ వ్రాయబడి యున్నది. మంత్ర శాస్త్రము, సాముద్రిక శాస్త్రము, రసవాదము మున్నగు వివిధ శాస్త్రములపై పెక్కు గ్రంథములు గలవు. పురాతత్వ శాస్త్రము, ముద్రికా నిర్మాణము, కుమ్మరము, నాణెములు మున్నగువాటిపై ఎన్నో గ్రంథములు గలవు. లీషిహ్-చెన్ (క్రీ.శ.1578) రచించిన ' పెన్‌ట్సో' అను వైద్య గ్రంథము పేర్కొనదగి యున్నది. ఇందు 1892 మూలికలను, లవణములను, లోహములను గూర్చిన వివరణము కలదట. శ్యువాన్ హో (క్రీ. శ. 1119 - 1126) అను చక్రవర్తి కాలమున రచింపబడిన 'శ్యువాన్ హోహ్వావ్యు' అను చిత్రలేఖన గ్రంథము చాల ప్రసిద్ధమైనది. ఇందు ఆ చక్రవర్తి సేకరించిన 6192 చిత్రములను గురించిన వర్ణనములు కలవు. నిఘంటువులు : 'ఎర్హ్‌యా' అను నిఘంటువు క్రీ. పూ. వేయి సంవత్సరముల నాటిదని పేర్కొన బడుచున్నది. శ్యూషెన్ (క్రీ. శ. 120) అను పండితుడు తన కాలమున నున్న గ్రంథముల నన్నిటిని పరిశీలించి, సుమారు 10 వేల శబ్ద చిహ్నములను సేకరించి, వాటిని ప్రాథమిక రూప క్రమము ప్రకారము ష్వోవెన్ అను నిఘంటువును రచించెను. ఈ విధానము వలన కోరిన శబ్ద చిహ్నమును సులభముగా వెదకి పట్టుకొనవచ్చును. దీని తరువాత పేర్కొన దగిన గొప్ప నిఘంటువు క్రీ. శ. 1662-1723 సంవత్సరముల మధ్యకాలమున పాలించిన 'ఖాంగ్‌శీ' చక్రవర్తి పేర ప్రచారమున నున్నది. ఇందు మొత్తము 44,000 శబ్ద చిహ్నము లున్నవి. ఇవి 214 మౌళిక రూపముల క్రింద కూర్పబడినవి. పూర్వగాథలను కూర్చి రచించిన గ్రంథములు కూడ పెక్కు కలవు. తమ విజ్ఞానము నంతను ఒక్కచో చేర్చు తలంపున, చైనీయులు విజ్ఞాన సర్వస్వములను గూడ ప్రచురించియుండిరి. ఇట్టి వాటిలో పేర్కొనదగినవి 'టెయ్‌పింగ్ యురాన్ ' (క్రీ. శ. 10 వ శతాబ్ది) 'యుంగ్ లోటాటైన్' (క్రీ. శ. 1403) అనునవి. ఈ రెండవ విజ్ఞాన సర్వస్వమును మింగ్ వంశ సార్వభౌముడగు 'యుంగ్ లో' అను నాతడు రెండువేల మంది పండితులను నియోగించి 22,937 సంపుటములలో సిద్ధము చేయించెను. ఇంతటి మహాగ్రంథమును అచ్చువేయించుట అసాధ్యమైనందున, మూడు ప్రతులుమాత్రమే వ్రాయించెనట. మింగ్ వంశము పతన మగుటతో, వీటిలో రెండు ప్రతులు నిర్మూలించ బడెను.
నవలా నాటక సాహిత్యము : ప్రాచీనచైనా సారస్వతమున నవల యని చెప్పదగు రచన యున్నట్లు కానరాదు. ఉన్నను, దానికి సాహిత్య గౌరవము లేదని స్పష్టముగా చెప్పవచ్చును. సుంగ్ వంశమును తుదముట్టించి, క్రీ. శ. 13 వ శతాబ్ద్యంతమున మంగోలు జాతికి చెందిన కుబ్లయ్ ఖాన్ అనునాతడు చైనా దేశమునకు ప్రభువయ్యెను. విజాతీయుడయ్యు, ఇతడు చైనీయ సాహిత్యమును పోషించెను. కాని ప్రఖ్యాత చైనీయ కవిపండితు లీ విజాతీయుని సేవింప నిష్టపడక మారుమూలల తలదాచు కొనియుండిరి. చైనాభాష యందు చెప్పదగిన మొదటి నవల ఈకాలముననే వెలువడినది. 'సాన్ క్వోచి' (మూడు రాజ్యముల కథ) అను నవల అజ్ఞాత కర్తృకము. క్రీ. శ. రెండవ శతాబ్ద్యంతమున హాన్ వంశము పతనమై, సామ్రాజ్యము మూడు ముక్కలయిన విషాద వృత్తాంతము ఈ నవల యొక్క ఇతి వృత్తము. యుద్ధములు, సాహస కృత్యములు, త్యాగములు, కుట్రలు అతి నిపుణముగ వర్ణింపబడిన ఈ నవల మిక్కిలి రసవంతమైన రచనగా గణుతికెక్కినది. ష్విహు చ్వాన్, హుంగ్ తామెంగ్ అను నవలలు గూడ కథా నిర్వహణమునను, శైలి యందును మిగుల చమత్కృతి గలవి.
రూపక రచనము, ప్రదర్శనము గూడ మంగోలు రాజుల కాలముననే వర్ధిల్లినవి. నాడు రచింపబడిన రూపకములు సుమారు 101 సంపుటములుగా ప్రకటింప బడినవి. ప్రామాణికములుగా పరిగణింపబడిన రూపకములలో 'శిశ్యుంగ్' అనునది పేర్కొన దగియున్నది.
నవీన యుగము : నవీన యుగమున చైనా లిపి, భాషా సారస్వతములందు అపూర్వములైన పరిణామములు, విప్లవములు జరిగినవి. జాగృతమైన జాతి యొక్క చైతన్యము ఎన్ని తీరుల, ఎట్టి అద్భుతములను సాధించగలదో చైనా ప్రజలు వ్యక్త పరచియున్నారు.
చైనీయుల అక్షర చిహ్నములు వేలకొలదిగా నున్నవి. ఒకే పదము వేర్వేరు అర్థసంధర్భములలో వేర్వేరు చిహ్నములతో వ్రాయబడును. చైనా గ్రాంధికభాష యర్థము కావలెనన్నచో, పదములను చెవితో వినుట చాలదు; కంటితో అక్షర చిహ్నములను చూడవలెను. పదముల సంఖ్యకంటె అక్షర చిహ్నముల సంఖ్యయే అధికముగ నున్న దనిన అతిశయోక్తి కాదు. ఇట్టి పరిస్థితియే చైనా యందలి దారుణ నిరక్షరాస్యతకు హేతు వైనది. విద్యా వ్యా ప్తిని విశ్వజనీనము చేయవలెనన్నచో, అక్షరచిహ్నము లందు తీవ్రమైన సంస్కరణము జరుగ వలెను. అట్టి సంస్కరణము చైనా జాతియొక్క ఐక్యమునకు భంగము కలిగించునదిగా నుండరాదు. రోమను వర్ణములను, లాటిన్ వర్ణములను ప్రవేశ పెట్టు యత్నములు పెక్కు జరగినవి. కాని చైనా భాష యందలి నానా విధములైన స్వరములను సూచించుట కష్ట మయ్యెను. 1919 వ సంవత్సములో చైనీయ విద్యాశాఖాధికారులు 39 ధ్వనులతో గూడిన యొక లిపిని ప్రవేశపెట్టిరి. 1928 సంవత్సరములో 'కుమింటాంగ్ ' ప్రభుత్వము రోమన్ వర్ణములను ప్రవేశపెట్ట యత్నించెను. కాని ఈ యత్నము ప్రజానీకము యొక్క అంగీకారమును పొందలేదు. ప్రాచీన చైనీయ లిపి యందలి ప్రధాన ధ్వని చిహ్నములను, మౌలికములు అని ఎన్నదగిన వాటిని సేకరించి ప్రస్తుతము రచనకు, ముద్రణమునకు, టైపురైటింగునకు ఉపయోగించు చున్నారు. నవీన వ్యావహారిక భాషకు ఈ లిపి సవ్యముగనే ఉపయోగ5పడుచున్నది.
సార్వజనిక విద్యా వ్యాప్తి, నవీన సిద్ధాంత ప్రచారము, తద్వారా చైనా ప్రజల సర్వతోముఖ విజ్ఞానాభివృద్ధి చైనీయ భాషా సంస్కరణము యొక్క ప్రధాన లక్ష్యములు. చైనీయ గ్రాంథిక భాషకును, వ్యావహారిక భాషకును విపరీతమైన వ్యత్యాసము కలదు. ఈ వ్యత్యాసమును తొలగించుటకు చాలకాలముగా ప్రయత్నములుజరుగుచుండినవి. సన్ యట్ సేన్ చైనా ప్రజానీకమునందు జాతీయ భావ బీజములు నాటిననాటినుండియు ఇట్టి యత్నములు ఆరంభ మైనవి. ఆ మార్గమును చేపట్టి 1898 వ సంవత్సరము నందు ఖంగ్-యూ-లీ, ల్యాంగ్ చీ - చావ్ అను వారు సారస్వత, వైజ్ఞానిక, రాజకీయ రంగములందు ఒక నూతనోద్యమమును ఆరంభించిరి. గ్రాంథికభాష ప్రజాసామాన్యమునకే కాక, ఒక శ్రేణికి చెందిన పండిత వర్గమునకు కూడ అర్థము కాదు. కనుక ప్రజలు మాట్లాడు వ్యావహారిక భాషయందే గ్రంథరచన సాగవలె ననునది ఈ ఉద్యమ లక్ష్యము. ప్రథమ ప్రపంచ సంగ్రామా నంతరము డా. హుషిహీ అను పండితుడు ఈ ఉద్యమమును పట్టుదలతో తీవ్రముగ సాగించెను. చైనాయందు ఆత్యధిక సంఖ్యాకులు వ్యవహరించు 'మండారిన్' అను మాండలికమును ఇతడు అవలంబించెను. ఈ ఉద్యమమునకు 'పెయ్-హ్వా'(వ్యవహారిక భాషా) ఉద్యమ మని పేరు. చెన్‌టూశ్యూ వంటి తీవ్రసంస్కరణ వాదులును, పీకింగ్ జాతీయ విశ్వకళాపరిష దధ్యాపకులును, విద్యార్థులును దీనిని బలపరచిరి. 1930 వ సంవత్సరమునాటికి ఈ యుద్యమము చైనాయందు బలముగా వ్రేళ్లు తన్నుకొనెను. క్రమముగా పెయ్ - హ్వా పాఠ్యగ్రంథ భాషగా అంగీకరింప బడినది. అన్య భాషా సాహిత్యములనుండి పెక్కు గ్రంథములు ఈ వ్యావహారిక భాషలోనికి అనువదింప బడినవి. పత్రికలు, నవలలు, ఆధునిక శాస్త్రగ్రంథములు కోకొల్లలుగ వెలువడినవి.
దీనివెంట చైనీయ సాహిత్యమున గూడ గొప్ప విప్లవము జరిగినది. 1919 వ సంవత్సరమున చైనా యందలి షాంటంగ్ రాష్ట్రముపై జపాన్ అధికారము ప్రతిష్ఠింపబడినది. దీనికి వ్యతిరేకముగా చెలరేగిన జాతీయోద్యమము యొక్క ప్రభావము నాటి సాహిత్యపరులమీద గూడ ప్రసరించినది. 1919 వ సంవత్సరము మేనెల 4వ తేదీన ఈ ఉద్యమము ఆరంభ మైనది. ఈ యుద్యమ నాయకులు చేసిన ప్రబోధమును అనుసరించి ముఖ్య రచయిత లందరును వ్యావహారిక భాషను అవలంబించి, నిత్యజీవిత వ్యవహారములను ఇతివృత్తముగా స్వీకరించి, సర్వ సుబోధక మగు సరళ శైలిలో గ్రంథరచన సాగించిరి. ఈ మార్గమును బాగుగా వ్యాప్తిలోనికి తెచ్చినవారు చైన్‌శ్వాన్ - టుంగ్, హుషీ, లూశున్, చెన్‌టూ -శ్యూ ప్రభృతులు.
లూశున్ (అసలు పేరు చౌఫ-జెన్) గావించిన రచనలు ఖడ్గతుల్యములైనవి. తీవ్రమైన అపహాసము ఆతని రచనకు ప్రాణము. పెక్కు నవలికలు, కథానికలు, వ్యాసములు ఆతడు రచించెను. నవచైనా సారస్వతమునకు ఆతడు రచించిన 'ఆక్యు' అను నవలిక శ్రీకారము వంటిది. అనంతరము వచ్చిన కమ్యూనిస్టు రచయిత లందరకు ఇతడు గురుస్థానీయుడు. కవిగా, నాటకకర్తగా, నవలారచయితగా విశేషించి విప్లవ సిద్ధాంతవాదిగా, క్వొమో-జో ప్రసిద్ధికెక్కెను. ఇతడు పురాతత్వ పరిశోధకుడు, కమ్యూనిస్టు ప్రభుత్వమున సాంస్కృతిక వ్యవహారశాఖయందు ఇతడు ప్రముఖ డయ్యెను. చైనా - జపాను యుద్ధకాలమున పెక్కు రూపకములు రచించి ప్రఖ్యాతి గన్నవాడు వాన్‌చియా-పో. ఈతని రచనలు పెక్కు విదేశీయ భాషలలోనికి అనువదింప బడెను. ఈ రూపకములు చైనీయ వ్యావహారిక భాషా పటుత్వమునకు విజయ ధ్వజముల వంటివి.
కమ్యూనిస్టు ప్రభుత్వము 1949 వ సంవత్సరములో చైనాయందు నెలకొనిన అనంతరము ఈ విప్లవము మరింత ముందునకు పోయినది. ప్రాచీన చైనా సాహిత్యమును నవీన దృష్టితో పరిశీలించి వ్యాఖ్యానించుట, ప్రాచీన మహా గ్రంథములను నవ్య వ్యావహారిక భాషలో పునర్లిఖించుట, ప్రాచీన సాహిత్య ప్రక్రియలను నవీన సిద్ధాంత ప్రచారమునకు వినియోగించుట మున్నగునవి ప్రకృతోదాహరణములు.
చైనా ప్రజా రాజ్య మహాధ్యక్షుడగు మావో- సే-టుంగ్ గొప్ప సారస్వతాభిమాని. ఇతడు స్వయముగా కవిగా, రచయితగా వరలెను. నవచైనా సాహిత్యమునకు ఇతడు నిర్దేశించిన ప్రణాళిక వేదముగ పరిగణింపబడు చున్నది. చైనా ప్రజలయొక్క సర్వతో ముఖాభ్యుదయము ఆతనియొక్కయు, ఆతని ప్రభుత్వముయొక్కయు లక్ష్యము. విద్య, విజ్ఞానము, సాహిత్యానందము సర్వ ప్రజలకును అందుబాటులో నుండునట్లును, చైనా యందు సామ్యవాదము సుస్థిరముగ నెలకొను నట్లును చేయుట ఆతని ధ్యేయము. ఆతడు 1941 వ సంవత్సరమున 'యేనన్' నగరమున అఖిల చైనా రచయితల నుద్దేశించి గావించిన ప్రసంగము నవచైనా సాహిత్యమునకు ప్రామాణికత్వము వహించినది : కార్మికులు, కర్షకులు, సైనికులు - చైనాప్రజ లనగా వీరే. వీరి కుపయోగించెడి సాహిత్యమే సాహిత్యము. సామ్యవాద సిద్ధాంతములపై ఆధారపడి ఉత్తమ సామాజిక వ్యవస్థను నిర్మించుటకు రచయితలు తోడ్పడవలెను. ప్రజలకు ప్రగతిమార్గమును నిర్దేశించి, స్వధర్మ నిర్వహణమున ప్రవృత్తులగునట్లు చేయుటయే గ్రంథకర్తల లక్ష్యముగ నుండవలెను. హేతువాదబద్ధమై, సత్యసమ్మతమైన ఆతని ఈ యుపదేశమును నవచైనా రచయిత లందరును ఆమోదించిరి. 1949వ సంవత్సరములో చైనా ప్రజాతంత్ర రాజ్యము స్థాపింప బడినది. నాటినుండి, చైనా కమ్యూనిస్టు నాయకుడైన మావో-సే-టుంగ్ నిర్దేశించిన మార్గముననే సాహిత్య నిర్మాణము జరగుచున్నది. ఈనాటి ప్రఖ్యాత రచయితలలో పేర్కొనదగినవారు క్వొమో-జో, చెన్-పాయ్-చెన్, చాంగ్ - క్వాంగ్ జూ, హ్యూయెహ్-పిన్, టుంగ్-పింగ్, శ్యాన్ హుంగ్, చావ్ యూ, లీ చిన్-షా, లాన్‌షే, పాషిన్ టింగ్ లింగ్ (కథానికా రచయిత్రి) మున్నగువారు పలువురు కలరు.
చైనా గ్రంథములు ఇతర భాషలలోనికి, ఇతర భాషా గ్రంథములు చైనా భాషలోనికి బహుళసంఖ్యలో పరివర్తనము చేయబడుచున్నవి. భాషా సారస్వతములను ప్రజాసామాన్యమునకు అందుబాటు లోనికి తెచ్చుట, ప్రజలలో వైజ్ఞానిక, సారస్వతాభిరుచిని పెంపొందించుట - నవచైనా సాధించిన ఘన విజయములలో పేర్కొన దగినవి.
పా. మా.