Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చైనాదేశము (భూ)

వికీసోర్స్ నుండి


చైనాదేశము (భూ) :

ప్రపంచమందు జనసంఖ్యా విషయమున దేశములలో నెల్ల చైనా గరిష్ఠమైనది. వైశాల్యమున రష్యా, కెనడాలు మాత్రమే దీనికంటె పెద్దవి. ఇది ప్రధానముగా వ్యవసాయముపై ఆధారపడు దేశము. ఏ ఒక్క దేశము నందైనను పండనన్ని పంటలు మొత్తము ఇచ్చట పండుచున్నవి. ఇతర ప్రాచ్యదేశములవలె చైనాగూడ గ్రామీణ జనసంఖ్య యనెడు ప్రధాన సమస్యను ఎదుర్కొనవలసి యున్నది. 1953 వ సంవత్సరము జులై 30 వ తేదీన దేశవ్యాప్తముగా ప్రప్రథమమున చేయబడిన ప్రభుత్వపు జనాభాలెక్కల ప్రకారము చైనా ప్రధాన భూభాగము నందును. ఫార్మోజా దీవి యందును కలిసి మొత్తము 59 కోట్ల జనులు కలరని తెలియుచున్నది. చైనా వైశా ల్యము 36,43,000 చదరపు మైళ్ళ నుండి 38,77,000 చదరపు మైళ్ళ వరకును గలదని అంచనాలు వేయబడినవి.

చైనా మిక్కిలి పురాతనమైన దేశము. వేదాంతము నందును, వాఙ్మయము నందును, కళలయందును చైనా దేశము సాధించిన ఘనకృత్యములు బహు కాలికముగా చరిత్ర పుటల కెక్కినవి. అయినను, చైనాదేశము ఆధునిక కాలమున పాశ్చాత్య సంస్కృతికి ప్రసిద్ధ లక్షణములయిన సాంకేతిక విద్యలందును, శాస్త్ర విజ్ఞానమునందును విశేషముగా అభివృద్ధిగాంచి యుండలేదు.

నేటి చైనా ప్రజాస్వామికము (Republic) లో, చైనా ప్రధాన భూభాగమనియు, (china proper), బాహ్యమండలములనియు (outer territories) రెండు ప్రధాన విభాగములు కలవు. సింకియాంగ్ (Sinkiang), చింఘైర్ (Cninghair), మంచూరియా (Manchuria), మంగోలియా తూర్పుభాగము, టిబెట్టు అనునవి బాహ్య భూభాగములునై యున్నవి. వాయవ్య దిశాంతరమున నున్న సికియాంగ్ అను ప్రాంతము ప్రధానముగా ఒక ఎత్తైన ఎడారిపీఠభూమి. దీనిని, ఉత్తరముననున్న టైన్-షాన్ (Tin-shan), పామీర్ (Pamir) పర్వతముల యొక్క లోయ, ఉత్తరటిబెట్టునకు చెందిన ఆల్ఫిన్‌టాగ్ (Alphintag) అనుప్రాంతములు గుఱ్ఱపులాడా ఆకారమున ఆవరించి యున్నవి. భూగోళరీత్యా చింఘైర్ (chinghair) సింకియాంగ్ (sinkiang) అను నీ రెండును గొప్పదైన టిబెట్టు పీఠభూమిలోని భాగములే.

చిత్రము - 220

పటము - 1

చైనా మహాకుడ్యము

ఈ టిబెట్ పీఠభూమి యూరపుఖండములోని మిక్కిలి ఎత్తైన పర్వతము కంటె ఎత్తయినది. చైనా ప్రధాన భూభాగమునకు ఉత్తరముగాను, అనగా చైనా మహాకుడ్యము (Great Wall) కు ఉత్తరముగాను, గోబీ ఎడారికి దక్షిణముగాను, తూర్పు మంగోలియా ఉన్నది. దీనినే పొడవైన పచ్చిక భూమి (Land of long Grass) అందురు. ఇది దేశ దిమ్మరులైన మంగోలియను గొల్ల కాపరులకు ఆవాసభూమి. ఇది విశేషముగా పచ్చిక బయలు – స్టెప్పీలవంటిది (Praili Steppe). ఐనను చైనా రైతు తన పారతోను, నాగలితోను ప్రవేశించి ఈ పచ్చిక బయలును నిబ్బరముగా సాగుబడిలోనికి తెచ్చుచున్నాడు. వాయవ్యమునగల కాంసు (Kansu), ఉత్తరమునగల షెన్సీ (Shansi), మరియు షాన్సీ అను మండలములు (Provinces) ప్రధానముగా ఎత్తయినవి. అనగా ఇది యొక విచ్ఛిన్నమయిన పీఠభూమి. ఇది విశాలమును, లోతును కల వండలిమట్టి కప్పుచే ఆవృతమయి యున్నది. ఎడారి గాలులచే ఉత్తరమునకు తేబడిన సున్నితమయిన, పసుపుపచ్చని వండలిమేట ఇది. వండలిమట్టి పొరను “లోయస్” అందురు. ఈ లోయస్ మెత్తగా, పొడిగా నుండును. మానవులయొక్కయు, గుఱ్ఱములయొక్కయు, లొట్టియల యొక్కయు పాద ఘట్టనలచేతను, శకట చక్రముల ఒరిపిడిచేతను, మార్గములు అరిగి అరిగి, చెట్లు, కప్పు లేని ఒక సొరంగముగా నేర్పడును. ఈ సొరంగ మార్గము భూమ్యుపరితలమునకు 20 అడుగులకంటె ఎక్కువ లోతున నుండును. ఈ సొరంగ మార్గములందు ప్రయాణముచేయు పథికులకు భూమిమీది పరిసరములను చూచుట కవకాశము లేకుండనే రోజుల కొలది ప్రయాణము చేయవలసి వచ్చును. కొన్ని ప్రాంతములలో వండలిమట్టి (Loess) గుట్టలయందు తొలచబడిన గుహా మందిరములందు జనులు నివసింతురు. ఆల్మయిరాలతో, మేజాబల్లలతో, అరుగులు ఉండుటకు వీలుగా, విశాలముగా ఈ గుహ మందిరము లుండును. జొన్నలు, గోధుమలు ఇచ్చటి నేలలలో పండునట్టి ముఖ్యమైన పంటలు. గాలి తూర్పువైపుగా, ఉత్తర చైనా మైదానము మీదికి లోయసును (Loess) ను గొని వచ్చును. ఏంగ్ టీజ్ కెంగు లేక యాంగ్ టీజ్ నది (Yangtze River) ఈ వసుపుపచ్చని వండలి మట్టిని సముద్రమునకు చేర్చును. ఇంకను ఆవల ఉత్తరమున హోయాంగ్ హో (Howang Ho) లేక ఎల్లో నది (Yellow River) పసుపు పచ్చని వండలి మట్టిని సముద్రమునకు చేర్చును. ఈ రెండు నదుల మూలముననే నిరంతరాభివృద్ధి చెందుచున్న ఉత్తర చైనా మైదానము ఏర్పడినది. ఈ మైదానములో దాదాపు చెట్లు చేమలు లేవు. ఇచ్చట హెచ్చుగా కాపులు సేద్యము చేయుచుందురు. సేద్యపు భూమి కొద్ది కొద్ది భాగములు రైతు క్రింద నుండును. ఆ క్షేత్రములందు జొన్న, గోధుమ, సోయాచిక్కుళ్ళు పండించ బడును. రెండు ప్రచండ పర్వతము మైదానముపై ఎత్తుగ ఏర్పడియున్నవి. ఎత్తయి, శిలామయమైన షాంటుంగ్ (Shantung) ద్వీపకల్పము తూర్పువైపు ఎల్లో నదిలోనికి చొచ్చుకొనిపోయి యున్నది. మరియు నైరృతి దిశ యందు (South West), లాప్ లే (laple) చే వ్యాప్తమయిన మైదానమునకు (ఈ మైదానమునకు సెంట్రల్ బేసిన్ ఆఫ్ చైనా అని పేరు.) ఉత్తరముగా క్వైయాంగ్ షాన్ (Kwaiyang-Shan) ప్రాగ్దక్షిణ దిశలకు వంపు కలిగియున్నది. ఉత్తర చైనా వర్షాభావముచే ఎండిగాని, చలిచే తెల్లబారి కాంతివిహీనమైగాని ఉండును. దక్షిణ చైనా, వర్షపాత సమృద్ధియు, ఉష్ణతరమయిన శీతోష్ణస్థితియు కారణములుగా, సంవత్సరము పొడుగునను జలభరితమై సస్యశ్యామలమై ఒప్పారుచుండును. దక్షిణ చైనాలో విశేష ప్రాంతము పర్వత మయమైనదిగా నున్నది. యాంగ్సీ (Yongtze) నది నీటిపారుదల గల గొప్ప పరివాహ ప్రదేశములును, కాంటను నందలి చిన్న డెల్టా భాగమును, ఇందలి ప్రధాన నిమ్న ప్రదేశములు (low lands). నదీ లోయ లోని సన్నని నడవల మూలమున మూడు యాంగ్సీ పరీవాహ ప్రదేశములు (Basins) ను పరస్పరముగా ప్రత్యేకింపబడి యున్నవి. క్రిందిభాగమున నున్న పరివాహ ప్రదేశము (Basin) ఒక డెల్టాగాఏర్పడి హోయాంగ్ హో పరీవాహ ప్రదేశముతో కలిసి పోవుచున్నది. మధ్యభాగమున నున్న పరివాహప్రదేశము (Basin) అదేవిధముగ అనేక నదుల వండలిచే ఏర్పడియున్నది. మూడవ పరీవాహప్రదేశము (Basin) లేక ఎఱ్ఱమడుగు, నదికి ఎగువను గలదు. అది, మధ్య పరీవాహ ప్రదేశమునుండి పర్వతభిత్తిచే వేరు చేయబడినది. ఈ భిత్తియందు నదీమూలమున ఒక సన్నని గండి ఏర్పడినది. అడుగునను, నడుమను గల పరివాహ ప్రదేశముకంటె, రెడ్ పరీవాహ ప్రదేశము ఎన్ని యో అడుగుల ఎత్తున నున్నది. అది చిన్న కొండలతోను, చిన్న చిన్న పరీవాహ ప్రదేశముల తోను అలరారుచున్నది. ఈ గుట్టల మధ్యనే, సారవంతమైన చెంగ్‌టూ (Chengtu) మైదాన మొకటి గలదు.

యాంగ్సీ పరీవాహప్రదేశము లుత్తరచైనానుండి అనేకములయిన కట్టల కలయికచే ప్రత్యేకింపబడినవి. అనేక నదులయొక్క ఈశాన్యభాగమున ఎత్తైన డెల్టా భూముల సముదాయములు విశేషమైన ఆటంకముగా నేర్పడినవి. పశ్చిమ దిశయొక్క ఎగువభాగమున మొదట ఒక పర్వతశ్రేణియు, పిదప చిన్‌లింగ్ పర్వతములును (ఇవి క్రమముగా 10,000 అడుగుల ఎత్తునకు మించి యున్నవి.) సరిహద్దు మండలమునకు గురుతులుగా

నున్నవి. ఈ ఆటంకములను అనేక స్థలములలో, కాలిబాటలచే జనులు దాటుచున్నారు. సైనికులకును, వర్తకుల

చిత్రము - 221

పటము - 2

చైనా నగరప్రాకారములు

కును ఉపయోగపడునట్టి రహదారిమార్గములు తక్కువగ నున్నవి. ఇవి చైనా చరిత్రముయొక్క ఆరంభకాలము నుండి నేటివరకును స్వల్పమయిన మార్పునకు లోనై యున్నవి. అంతేగాక, రైలుదారులయొక్కయు పంట కాలువల యొక్కయు నిర్మాణము గూడ ప్రధాన సంయోజక మార్గముల (Principal Connecting routes) ఆకారమునకు ఏమాత్రము మార్పును చేకూర్చలేదు.

చైనా ప్రధాన భూభాగమున యాంగ్సీ నది ప్రవాహ గతియందు, విశాలముగాను, లోతుగాను, కొన్నిచోట్ల వడిగాను కనిపించు చున్నది. యాంగ్సీనది చైనా యందలి రహదారి మండలమునకు ఒక వెన్నెముక వంటిది. ఈ నదియొక్క దిగువభాగమున కిరుప్రక్కల రైలుదారులు సమాంతరముగా నుండియున్నను ఈ మూడు పరీవాహ ప్రదేశములతో మొదటినుండి చివర వరకును ఎక్కువ సంబంధము కలిగి యున్నది. ఈ నదియే యైయున్నది. ఇది సర్వదా నౌకలును, వర్తకపు టోడలును ప్రయాణించుటకు ఉపయోగపడు చున్నది. నాంకింగ్ వరకు పెద్ద పెద్ద సముద్రపు నౌకలు అన్ని ఋతువుల యందును ఇందు ప్రయాణించగలవు. 10 అడుగుల లోతు నీట ప్రయాణింప గల ఓడలు, హాంకోవరకు అన్ని ఋతువులయందును ఇందు ప్రయాణము సాగించవచ్చును. హాంకో అను పట్టణము యాంగ్సీ యొక్క మధ్య పరీవాహ ప్రదేశమునకు రాజధానియై యున్నది. చుంకింగ్ పట్టణము యాంగ్సీ నదీ ముఖ ద్వారమునకు 1300 మైళ్ళ దూరమున నున్నది. ఇది చిన్న చిన్న పొగయోడలు యేడాది పొడుగున వచ్చిపోవు ఒక ముఖ్యస్థానము. రెడ్ పరీవాహ ప్రదేశము (Red Basin) పర్వత సమూహముల మూలమున విడివడి యున్నది. ఇది క్రీ. పూ. నాలుగవ శతాబ్ది వరకును చైనాలో చేర్చుకొన బడలేదు. తూర్పు ఆసియాలోని సారవంతమైన అన్ని భాగములకంటెను ఇది ఎక్కువ అనాయాసముగా రక్షణీయ మగుచున్నది.

ఎత్తయిన పర్వతపు పంక్తుల అడ్డుపాటు ఒక్కటి, రక్షణతోగూడిన చూంగ్సీ గండి యొక్కటి-ఇవి తూర్పునుండివచ్చు పదాతిదాడుల నెదుర్కొన గలుగు చున్నవి. రెడ్ పరీవాహ ప్రదేశము వరిని, గోధుమను పండించు దక్షిణోత్తర చైనాల లక్షణములను ఉత్పత్తి విషయమున తనలో మేళవించు కొనుచున్నది.

చైనాలో దూర దక్షిణ దిశయందు 'హాయి' అను ఏరు ప్రధాన మయినది. దీనిని వెస్టు రివ రందురు. (West river) యాంగ్సీనది కంటెను, హొయాంగ్ (Howang) నది కంటెను పొడవున ఇది చిన్నదిగా నున్నది. కాంటను డెల్టానుండి ప్రవహించు చిన్ననదుల డెల్టాలతో దీని డెల్టా కలియు తావునందుతప్ప. ఈ హాయినది మెట్టప్రదేశము నందే ప్రవహించును. ఈ కాంటన్ డెల్టా జన సమ్మర్దము గలది. ఇదియొక నిమ్నప్రదేశము. ఆవల ఉత్తరముననున్న డెల్టాలకంటె విస్తీర్ణమున ఇది చిన్నదై యున్నది. ఈ నిమ్న ప్రదేశము యాంగ్సీనదినుండి కొండలయొక్కయు, గుట్టలయొక్కయు విశాలమయిన మేఖలచే వేరుచేయ బడి యున్నది. ట్సిన్ (Tsin) హాన్ (Han) రాజవంశ్యుల కాలము వరకును ఇది చైనాతో సంయుక్తము కావింప బడలేదు. అనగా హవాంగ్ హో (Hwang Ho) పరీవాహప్రదేశము (Basin), యాంగ్సీ నదియొక్క మధ్య, నిమ్నతర పరివాహప్రదేశములు స్థిరీకరింపబడిన పిదప, వేయి సంవత్సరముల తర్వాతికాలము వరకు, ఇది చైనాతో సంయుక్తముకాంప బడలేదు అని అర్థము. యాంగ్సీ హై (Hsi) నదుల డెల్టాల నడుమ నున్న తీరమండలము మిక్కిలి చొర రానిదై యుండెను. అందుచే అది 3 వ శతాబ్దివరకు చైనాలో చేర్చబడలేదు. దీని ఎత్తుపల్లముల యొక్క మేర (పరిమితి) 1500 అడుగుల నుండి 2500 అడుగుల వరకు గలదు. అయితే కొన్ని పీప్సు (peeps) 6000 అడుగుల వరకు ఎత్తుకలవై యుండుట కూడ కలదు. ఇచ్చటి నదులు పొడవైనవికావు. ఇవి వేగముతో ప్రవహించును. ఇవి ఓడల ప్రయాణమునకు అననుకూలములైనవి. ప్రతి పరీవాహ ప్రదేశము, దేనికది మరియొకదానితో సంబంధము లేకుండ ప్రత్యేకముగా ఏర్పడియున్నది. నదీ ముఖముల వద్ద గల పట్టణముల పరిమాణము, ఉపయోగపడు పరీవాహ ప్రదేశముల ఉత్పాదక శక్తిచే పరిమితమై యున్నది. చెదరి యున్న చిన్న లోయ ప్రదేశములకు మాత్రమే వ్యవసాయము పరిమితమయి యున్నది. సముద్ర తీరమందు చదురు మదురుగా బెస్తపల్లెలు గలవు. కాయకష్ట విషయమున ప్రజలు ఎక్కువ అభిరుచి చూపు చైనాలోని ప్రాంత మిది యొక్కటియే.

యూనాన్, ప్రధానచైనాదేశమున అత్యంత నైరృతి మండలము. ఇదియొక లోతై, గండ్లు పడిన పీఠభూమి భాగము. ఈ పీఠభూమి షుమారు 6000 అడుగుల ఎత్తున నున్నది. దక్షిణముగా, చైనీయు లొనర్చిన పురోగతిని తెల్పు సుదీర్ఘ చరిత్రను బట్టి చూడగా, మొన్న మొన్ననే యూనాన్ లోనికి చైనీయులు చొచ్చుకొని వచ్చిరని తెలియు చున్నది. ఇచ్చట ఇప్పటికిని ఆదిమ వాసులకు చెందిన పెక్కు తెగలవారు నివసించు చున్నారు. ఈ ఆదిమవాసులు చైనీయుల జీవిత విధానముతో తమ జీవిత విధానమును మేళవింపరు. కాగా తరచు గొరిల్లా పద్ధతిని ఆశ్రయించి క్రొత్తగా కాపుర మేర్పరచుకొనిన చైనీయులతో యుద్ధములను ఇంకను వీరు సాగించుచునే ఉన్నారు.

నగరములు : చైనా యందు మొత్తము జన సంఖ్య అపరిమితమైనది. కాని దీనికి తగినట్లుగా చైనాలో మహా నగరములు పెక్కులు లేవు. దీనికి గల కారణము లివి : ముఖ్యముగా చైనాలో ఎక్కువ భాగము పల్లెలతో నిండి యున్నది. అందు నాగరిక ప్రాంతములు తక్కువగ నున్నవి. దీనికి తోడు విదేశముల తోడి వర్తకము తక్కువగ నున్నది. పరిశ్రమల అభివృద్ధి స్వల్పమైనదిగ నున్నది. షాంఘై (60,00,000) అను పట్టణము సర్వవిధముల మహత్తరమైనది. ఇది ఆసియా ఖండములో మహోత్కృష్టమైన పట్టణములలో నెల్ల రెండవది. ఇది నౌకా యానమునకు అనువైన యాంగ్సీ నది యొక్క ఉపనది యొడ్డున నున్నది. మరి మూడు నాగరిక ప్రాంతము లున్నవి. అవి పది లక్షలు జనాభా కలవై యున్నవి. అవి యాంగ్సీ నదీ తీరము పొడవున ఎడ నెడ వ్యాపించి యున్నవి. వాటిలో మొదటిది (1) నాన్‌కింగ్ (జనసంఖ్య 13,00,000) అను పట్టణము. 1937 వ సంవత్సరమునకు పూర్వమందును, తిరిగి 1945 నుంచి 1949 వరకును ఇది చైనా జాతీయవాదులు రాజధానిగా నుండెను. (2) వూహన్ (Wuhan) (హాంకౌ, వూహన్‌ల మొత్తపు నాగరికమయిన జనాభా (13,00,000). ఇది గొప్ప పారిశ్రామిక కేంద్రము (3) చుంకింగ్ (Chungking) (జనాభా 11,00,000). ఇది రెడ్ పరివాహక (Red basin) ప్రదేశములో గలదు. ఇది 1937 నుండి 1945 వరకు రాజధాని పట్టణముగా నుండెను. యాంగ్సీనదికి దక్షిణముగా నున్న చైనా రేవుపట్టణము కాంటన్ (15,00,000) హై (Hsi) డెల్టాలో నున్నది. ఇది యొక్కటే పదిలక్షలు పరిమితి జనాభా గల పట్టణము. పదిలక్షల కంటె ఎక్కువ జనాభా గల మరి రెండు పట్టణము లున్నవి. ఇవి ఉత్తర చైనా మైదానము యొక్క ఉత్తరపు టంచునకు సమీపమున నున్నవి. (1) పీకింగ్ (Peking) పట్టణము (22,40,000). ఇది 1911 సంవత్సరమునకు పూర్వమందును, మరల 1949 నుండియు రాజధానిగా నున్నది. (2) టైన్‌సిన్ (Tientsin) అను పట్టణము (జనాభా 20,00,000). ఇది ఎల్లో సముద్రము (Yellow Sea) తీరమునను, పీకింగ్ నకు ఈశాన్య భాగమునను 70 మైళ్ళ దూరమున నున్నది. ఇదియొక ముఖ్య మయిన రేవుపట్టణము.

ఖనిజముల ఉపపత్తి (Mineral Resources) - విద్యుచ్ఛక్తి : దూరప్రాచ్యమందలి దేశములలో బొగ్గు గనుల విషయమున చైనా ఒక్కటియే ప్రపంచ ఖ్యాతి వహించిన దేశము. ఇదివరలో ఒకానొకప్పుడు వాడుక పడినంత బొగ్గు సంపత్తి కలది కాకున్నను, నేడు అంచనా వేయబడిన దీని బొగ్గు గనుల ఉపపత్తి (resources) పరిమాణమందు బ్రిటిష్ దీవులందలి బొగ్గు గనుల ఉపపత్తి కంటె మిక్కిలి అధికమైనదిగా నున్నదని తెలియుచున్నది. ఇచ్చట దొరకు బొగ్గు, గుణమున చాల శ్రేష్ఠమైనది. వంటకు ఉపయోగించు బొగ్గు పెక్కు గనుల నుండి లభించు చున్నది. చైనాయొక్క లోతట్టునందు బొగ్గును ఉత్పత్తిచేయు ముఖ్యమయిన ప్రదేశములు కలవు. హ్వాంగ్‌హో సమకోణపు వంపులో షాన్సీ (Shansi) కలదు. అందు ముఖ్యమయిన గని యొకటి కలదు. వేరొక గని షాన్సీ మండలములో నైరృతి మూలలో కలదు. బొగ్గు యొక్క ఉత్పత్తిలో విశేష భాగము ప్రధాన చైనా యొక్క ఉత్తర మండలముల లోను, మంచూరియా లోను జరుగుచున్నది. పెక్కు సంవత్సరముల వరకు చైనా యందలి పెట్రోలియం ఉపపత్తి చాల స్వల్పమనియే భావింపబడెను. కాని, 1934 లో చైనా జాతీయ భూగర్భ పర్యవేక్షణ సంఘము వారు చైనా ప్రధాన భాగమునందును, మంచూరియాయందును కలిసి మొత్తము 4337 మిలియను పీపాల (Barrels) చమురు నిల్వ గల నూతులు గలవని తమ అంచనాను ప్రకటించిరి. ఇందు ఈ అంచనాలో షాలి (Shali) నుండి లభించు చమురు గూడ చేరియున్నది. మంచూరియాలో విషాలి ప్రాంతమున మాత్రము చమురును ఉత్పత్తిచేయుటకు సాధనములు అభివృద్ధిచేయబడినవి. తదితర ప్రాంతములందు గల చమురు ఉత్పత్తిచేయు సాధనము లింకను అభివృద్ధిని గాంచలేదు. దక్షిణము నందలి పర్వతమయమైన మండలము లందు జలశక్తితో కూడిన స్థానము లున్నను, అవి అంత సంభవనీయమైన ఉపపత్తి కలవిగా కన్పట్టవు. చైనాయందు ముడి ఇనుము గనుల నిలవలు కూడ (resources) చెప్పదగినంతగా లేవు. లోహ సంపదలో సగముకంటె అధికభాగము మంచూరియాయందే కలదు. ఇచ్చట దొరకు ముడిసరుకులో ఇనుముయొక్క భాగము తక్కువగా నున్నది. చెప్పుకొనదగిన లోహ సంపదలో సగముకంటె పైభాగము ప్రధాన చైనా యొక్క ఈశాన్య దిక్కున నున్నది. శేషించిన లోహసంపద, యాంగ్సీ నదియొక్క దిగువ లోయలో కలదు. లోహమును ప్రధానముగా ఉత్పత్తి చేయు గనులు మంచూరియా యందు కలవు. ఇచ్చట జపాను వారిచే ఇనుము, ఉక్కు పరిశ్రమలు స్థాపించబడినవి. చైనా యందలి పేర్కొనదగిన ఇతర లోహములు : తగరము (Tin), సౌవీరము (Antimony), టంగ్‌స్టన్ (Tungston), మాంగనీసు అనులోహములు. ఇవి చాల విలువ గల లోహములై యున్నను, ప్రపంచ సరఫరాకు ఎంతేని ముఖ్యమైనవిగా నున్నను, వీటిని మూలపదార్థములుగా గ్రహించి పరిశ్రమల నెలకొల్పుట వలన అంతగా ప్రయోజన ముండదు. అత్యంత విస్తృతములైన లోహోత్పత్తి స్థానములు దక్షిణ చైనా యందు గలవు.

పరిశ్రమలు - (Industries) : చైనాలో పారిశ్రామికాభివృద్ధి ఆధునిక పారిశ్రామిక సిద్ధాంత రీత్యా 20 వ శతాబ్దికి కొంచెము పూర్వముననే ఏర్పడినది. కాని 1905 వ సంవత్సరములో విదేశీయ ప్రభుత్వములు, ఒడంబడికకు చెందిన రేవుపట్టణములలో ఫ్యాక్టరీలను స్థాపించుటతో, చైనాలో పారిశ్రామికాభివృద్ధి అతి త్వరితముగా జరిగినది. 1937 వ సంవత్సరము వచ్చుసరికి దేశములో మూడు ప్రవృద్ద పారిశ్రామిక మండలములు ఏర్పడినవి.

1. సముద్రతీరము వెంబడిగల ఒడంబడికకు చెందిన నౌకాశ్రయ పట్టణములు; ఇచ్చట విదేశీయులకును, చైనీయులకును గల అధునాతన సాధన యంత్రసముదాయ సహాయమున పొగాకు, వస్త్ర పరిశ్రమలు పెంపొందెను.

2. విదేశీయులచే - ముఖ్యముగా జపానువారిచే - స్థాపింపబడిన పరిశ్రమల యొక్కయు, పారిశ్రామిక సాధన యంత్రసముదాయము యొక్కయు, అభివృద్ధి గల నదీ లోయలు, రైల్వే మండలములు.

3. చైనా లోతట్టుభాగములు. ఇచ్చట సంప్రదా యానుసారముగ కొనసాగుచున్న చేతి పరిశ్రమలు ఇప్పటికిని ప్రబలములై యున్నవి. ఈ స్థానిక పరిశ్రమలు స్వల్పపరిమాణము కలవై తరచుగ సేద్యప్రవృత్తితో మేళవింపబడినవి. లఘు పరిశ్రమలలో నూలు వడకుట, బట్టలను చేతితో నేయుట ముఖ్యమై యున్నవి. ఈ పద్ధతి ప్రకారము దేశమునకు కావలసిన నూలు వస్త్రములు విశేష ప్రమాణములో తయారగుచున్నవి. భారీపరిశ్రమలలో పేర్కొన దగినవి - గనులనుండి బొగ్గును త్రవ్వుట, నేత, సిమెంటును, కాగితమును తయారుచేయుట, పిండి మరల పరిశ్రమ, ఇనుము, ఉక్కు, సబ్బు పరిశ్రమలు విద్యుచ్ఛక్తిని, విద్యుత్పరికరములను ఉత్పత్తి చేయుట మొదలగునవి భారీపరిశ్రమలలో పేర్కొన దగినవి.

చైనా ప్రధాన భూభాగము నేడు రష్యావిధానము ననుసరించి బృహజ్జాతీయ ప్రణాళికను తల పెట్టినది. చైనా, 1953 వ సంవత్సరములో ఒక పంచవర్ష ప్రణాళికను ప్రవేశ పెట్టినది. 1949-1953 సంవత్సరముల మధ్య కాలమున భూస్వాముల వద్ద నుండియు, ఎక్కువ ధనికులయిన రైతులవద్ద నుండియు, దాదాపు పూర్తిగా భూముల హక్కును తప్పించి, ఆ హక్కులు కౌలుదారులకును, చిన్న చిన్న భూస్వాములకును ఇయ్య బడినవి. కాని పూర్వము భూస్వాములకు చెల్లించు చుండెడి శిస్తు కంటె అధికముగా శిస్తును ప్రభుత్వమువారికి కట్టవలసిన భారము నేడు వీరిపై బడినది.

కమ్యూనిస్టు చైనా ప్రణాళికలు పరిశ్రమల కిచ్చు చున్న ప్రాధాన్యము నేడు రష్యాలో పారిశ్రామిక ప్రణాళికకు ఒసగ బడుచున్న ప్రాధాన్యమునకు తుల్యమైనదిగా నున్నది. అనగా గనుల త్రవ్వకము, భారీ పరిశ్రమలు, యంత్రనిర్మాణము, దేశాంతర్గతమైన రవాణా సౌకర్యములలో అభివృద్ధి, విద్యుచ్ఛక్తి సౌకర్యములు వీటికి ప్రాధాన్యము చేకూర్చుచున్నవి. పారిశ్రామికోద్యమమును పెంపొందించుట ఇత్యాది కార్యక్రమములను వడివడిగా సాగించి, పారిశ్రామిక విజయము గాంచవలెనని చైనీయులు యత్నించుచున్నారు.

బి. యన్. చ.