Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చైనాదేశము (చ)

వికీసోర్స్ నుండి

చైనాదేశము (చ) :

పేరు - ఉనికి : చైనాదేశమును ప్రాచీన కాలమున “చుంగ్ హ్వామిన్ కువో” అని పిలిచెడివారు ; అనగా “మధ్య పుష్పరాజ్యము" అని అర్థము. దీని సంక్షిప్త రూపమే “చుంగ్ కువో”. చైనా అను పేరు చిన్ రాజవంశము వలన వచ్చినది.

చైనాదేశము 15°48" ఉత్తర అక్షాంశము నుండి 53°35" ఉత్తర అక్షాంశము వరకును, 73°31" తూర్పు మధ్యాహ్న రేఖనుండి 135°2" తూర్పు మధ్యాహ్న రేఖవరకును విస్తరించి యున్నది. ఉత్తరమున సోవియట్ రష్యా; పశ్చిమమున మంగోలియా; ఈశాన్యమున కొరియా; తూర్పున పసిఫిక్ మహాసముద్రము; దక్షిణమున బర్మా, ఇండో - చైనాలు చైనాకు ఎల్లలు. వీని మధ్య, హోయాంగ్‌హో(పచ్చనది), యాంగ్సి, సికియాంగ్ (పశ్చిమనది) నదుల పరీవాహ ప్రదేశమే చైనా నడిగడ్డ. ఈ ప్రాంతము 18 రాష్ట్రములుగ విభజింపబడి యున్నది. ఇవిగాక మంచూరియా, అంతర మంగోలియా, సింకి యాంగ్, టిబెట్లపైగూడ చైనా అధికారము విస్తరించినది. ఈ ప్రాంతముల జాతు లన్నియు కలిసి చైనా ప్రజలైరి. చైనా విస్తీర్ణము పది లక్షల, ఏబది వేల చతురపు మైళ్లు. జనాభా సుమారు 60 కోట్లు ఇది ప్రపంచ జనాభాలో ఐదవ వంతు.

భౌతికస్వరూపము - చరిత్ర : సారవంతమైన లోయలు, మైదానములు, తగుమాత్రము వర్ష పాతము, సమశీతోష్ణ పరిస్థితులు, అపారమగు ఖనిజసంపద - చైనాలో ప్రశస్త నాగరికతా నిర్మాణమునకు అనుకూలించినవి. ఎత్తైన పర్వతములు గాని, పెక్కు నదులు గాని లేకపోవుటచేత చైనా రాజకీయ సమైక్యతను సాధింప గలిగినది ; కాని దేశము పెద్ద దగుటచేత, కేంద్రాధికారము బలహీనమై, రాష్ట్రీయ దురభిమానములు ప్రబలి, తరచు స్వతంత్ర రాజ్యము లేర్పడు చుండెడివి. చైనాను చుట్టి ఎడారులు (మధ్య ఆసియా), పీఠభూములు (పామీరు), పర్వత శ్రేణులు (హిమాలయములు) ఉన్నవి. ఇందు నివసించిన క్రూర, అనాగరిక జాతులవారు తరచు దండయాత్రలు సాగించి, చైనాశాంతికి భంగము కలిగించిరి. నాగరికతా కేంద్రములైన పర్షియా, ఇండియాలతో చైనా అవిచ్ఛిన్నమైన సంబంధ మేర్పరచుకొనలేకపోవుట కీ భౌతిక ఆటంకములే కారణములు.

శిలాయుగములు : జే. జి. ఆండర్సన్ నిర్ణయము

చిత్రము - 216

పటము - 1

ననుసరించి, హొయాంగ్‌హో నదీలోయలో 50,000 సంవత్సరములకు పూర్వమే మానవుడు నివసించినాడు.

పీకింగ్, చౌకుటీన్‌ల చెంతను, యాంగ్సీ నదీలోయలో వాన్‌హిసీన్ ప్రాంతమునను క్రీ. పూ. 5000 సం. లకు చెందిన ప్రాత రాతి యుగ శిథిలములు బయల్పడినవి. వీనికిని, ఇండియా వాయవ్య సరిహద్దులలో దొరికిన సోనులోయ నాగరికతా శిథిలములకును పోలికలు గలవు. జీహాల్, దిన్‌హిసీ, ఉలన్‌హోట మొదలైన తావులు చైనాలోని నవ శిలాయుగ కేంద్రములు. ఈ యుగము నందే చైనాలో వ్యవసాయ మారంభమయినది. ఎద్దు, గుఱ్ఱము మచ్చికచేయ బడెను ఐరోపాలోని నార్డిక్ జాతులకు పూర్వమే మంగోలియా ప్రజలు గుఱ్ఱమును మచ్చిక చేసిరి.

పౌరాణిక యుగము, ప్రాచీన చరిత్రలు : చైనాలో పౌరాణిక యుగము క్రీ. పూ. 3000 సంవత్సరముల ప్రాంతమున ప్రారంభమైనది. నాటి చరిత్రను తెలిసికొనుటకు కొన్ని ప్రాచీన గ్రంథములు లభించినవి. వానిలో "చుషు చినీన్" (Annals of the Bamboo Books) ప్రధానమైనది. ఇది క్రీ. పూ. 300 సమీపమున వ్రాయబడెను. క్రీ. శ. 280 లో ఒక సమాధిలో ఈ గ్రంథము లభించెనని చెప్పుదురు. దీని తరువాత పేర్కొన దగినది 'ఫాన్‌కు' రచితమైన “చీన్‌హాన్‌షు" అను గ్రంథము. క్రీ. పూ. 1500 సం. లకు చెందిన దివ్య సందేశములు (Oracles) గల ఎముకలు గూడ చైనా పౌరాణిక యుగ చరిత్రకు ఆధారములు.

పౌరాణిక రాజవంశములు, సంస్కృతి : 'హిసియా' వంశ స్థాపకుడైన 'ఫాన్‌కు' అను నాతడు చైనానేలిన మొదటి చక్రవర్తి యని తెలియుచున్నది. హిసియాలే చైనాలో నాగరికతను ప్రవేశపెట్టిరి. నిప్పు, వ్యవసాయములే గాక, లిపి, వాద్య సంగీతములుకూడ వాడుకలోనికి వచ్చెను. వివాహ సంబంధములు క్రమబద్ధ మొనర్ప బడెను. హుయాంగ్ టి చక్రవర్తి పట్టమహిషి పట్టు వస్త్రములను సృష్టించెనట ! హిసియాల అనంతరము షాంగ్ వంశము క్రీ. పూ. (1523 - 1027) వారు పరిపాలనచేసిరి. వీరి రాజధాని అన్యాంగు అనునది.

1928 లో జరిగిన పురావస్తు ఖననములో ప్రాచీన అన్యాంగు నగర శిథిలములు బయల్పడినవి. మట్టి పునాదులపై దారు స్తంభములు నిల్పి, నిర్మించిన భవనములు నాటి ప్రజల వాస్తు విజ్ఞానమునకు నిదర్శనములు. ఒక మహా భవనము నందలి హాలు పొడవు 180 అడుగులు; వెడల్పు 30 అడుగులు. చక్కని పనితనము కలిగి, రంగు పూతలుగల కంచు పాత్రలు ఈ శిథిలములలో దొరకినవి. ప్రజలు గుఱ్ఱములు పూన్చిన రథములను, చంద్రకళలు ఆధారముగా తయారైన పంచాంగమును వాడిరి. పితృదేవతలను, ప్రకృతి శక్తులను ఆరాధించిరి. ఆకాశము, దిశలు, నదులు, వాయువు, వారి దేవతలు. దేవతల తృప్తికై నరబలి కూడ అర్పించిరి. దివ్యవాణి యందును, ఆత్మ, పునర్జన్మలందును వారికి నమ్మక ముండెను. రాజుతో బాటు ఆతని బానిసలను కూడ సమాధి చేయుచుండిరి.

ప్రాచీన యుగము : (క్రీ. పూ. 1027- క్రీ. శ.618).

ప్రాచీన రాజవంశములు : షాంగ్ వంశమును నిర్మూలించిన చౌ వంశీయులు క్రీ. పూ. 1027 నుండి క్రీ. పూ. 256 వరకును చైనాను పరిపాలించిరి. వీరికి కొంతకాలము చావోకి నగరము (క్రీ. పూ. 1027-771), తరువాత లోయాంగ్ నగరము రాజధానులైనవి. చౌ రాజులు దుర్బలు లైనందున చైనా అంతర్యుద్ధములకును, విదేశ దండయాత్రలకును గురియైనది.

ఈ అరాజకతను తుదముట్టించి, చిన్ వంశస్థుడైన షిహు యాంగ్ టి అనునాతడు చైనా నుద్ధరించెను. (క్రీ. పూ. 221 - 207). చిన్న చిన్న రాజ్యములను జయించి, ఇతడు ప్రథమ చైనా సామ్రాజ్యమును స్థాపించెను.

చైనాపై బడుచున్న హూణుల దౌర్జన్యముల నరికట్టుటకై ఉత్తర సరిహద్దులలో గొప్ప కోటగోడను ఇతడు నిర్మించెను. దీని పొడవు 1800 మైళ్లు; ఎత్తు 22 అడుగులు; మందము 20 అడుగులు. ఈ గోడకు నూరు గజముల కొకటి చొప్పున 31680 బురుజులు కలవు. ఒక్కొక్క బురుజు ఎత్తు 40 అడుగులు. ఈ గోడ ప్రపంచమందలి వింతలలో నొకటిగా ప్రసిద్ధి చెందినది.

షిహుయాంగ్ టి, చైనాలో భూస్వామ్యమును రద్దుపరచి రాజ నిరంకుశత్వమును నెలకొల్పెను. నిరంకుశత్వమును సుస్థిర మొనర్చుటకై 'లిన్సు' అను మంత్రి సలహాపై ప్రాచీన గ్రంథములను పరశురామప్రీతి చేసి, కవులను క్రూరముగ శిక్షించెను. మానసిక స్వాతంత్ర్యమే నిరంకుశత్వమునకు విరోధి అని వీరి యభిప్రాయము. కాని చైనా సారస్వతము పూర్తిగా నశింపలేదు, నిరంకుశత్వము శాశ్వతము కాలేదు. ఇట్టి చిన్ వంశము 'చైనా' పేరట చిరస్థాయి యైనది.

క్రీ. పూ. 202 లో 'లియూచి' అను నాతడు చిన్ వంశమును నిర్మూలించి, హాన్ వంశమును స్థాపించెను. వీరి రాజధాని సియాన్ అనునది. హాన్ వంశస్థుడైన వూటి అను నాతడు రోమను సామ్రాజ్యముతో తులతూగగల మహా సామ్రాజ్యమును స్థాపించెను. క్రీ. శ. 220 నాటికి హాన్ సామ్రాజ్యము వై, వు, షు అను రాజ్యములుగా విచ్ఛిన్నమైనది. చైనాచరిత్రలో ఇది మూడు రాజ్యముల యుగము . క్రీ. శ. 590 ప్రాంతమున సుయి వంశస్థులు చైనాను సమైక్యమొనర్చి, క్రీ. శ. 618 వరకును పరిపాలించిరి.

ప్రాచీన నాగరికతా సంస్కృతులు : ప్రాచీన కాలమునుండియు చైనా ఆర్థిక సౌష్ఠవము కలదై యున్నది. అనాది పరిశ్రమ యగుటచే రైతులు వ్యవసాయములో ఆరితేరిరి. వరిధాన్యముతోబాటు తేయాకు పంటకు చైనా ప్రసిద్ధి చెందినది. చౌ వంశస్థులు పంటకాలువలు త్రవ్వించి నీటిపారుదల సౌకర్యములను కలిగింపగా. షీహుయాంగ్‌టి భూస్వాముల నణచి రైతులకు మేలు చేకూర్చెను. ఇండియానుండి ముతక పంచదారను చేయుట నేర్చుకొని, చైనావారు చక్కెరను తయారు చేసిరి. పట్టు, పింగాణీ పరిశ్రమలకు చైనా పెట్టినది పేరు. పట్టు వస్త్రములు ఇండియాలో చీనాంబరములని ప్రసిద్ధి చెందినవి. ఈ పరిశ్రమకు టింగ్‌చౌ నగరము కేంద్రము. ఈ యుగముననే, కాగితమును గూడ చైనా తయారు చేసెను. జపాను మొదలు రోము వరకును చైనా పట్టు బట్టలు ఎగుమతి యగుచుండెను. ఒక 'లోయాంగ్ 'లోనే 120 వర్తకశ్రేణు లుండెడివి.

మతప్రవక్తలు : గ్రీసు, పర్షియా, ఇండియా దేశములలో వలెనే, చైనాలో కూడ క్రీ. పూ. 6 వ శతాబ్దమున గొప్ప సాంస్కృతికోద్యమము ప్రారంభమైనది. సుప్రసిద్ధ మతప్రవక్తలు బయలుదేరి, శుష్కకర్మకాండ, మూఢవిశ్వాసముల నుండి ప్రజల దృష్టిని ఆత్మ పరిశీలన, నైతిక ప్రవర్తనల వైపు మరలింప యత్నించిరి. చైనాలో ఈ ఉద్యమమునకు కన్‌ఫ్ఫ్యూషియస్ (క్రీ. పూ. 551-478) నాయకుడు. ఈతడు చైనాకు వేదవ్యాసునివంటి వాడు. 'లు' రాష్ట్రమున, చౌ పట్టణవాసియైన షులియాంగ్‌హో అను నిరుపేదకు, కన్ఫ్యూషియస్ జన్మించెను. బాల్యమునందే, ప్రాచీన సారస్వతము నంతటిని పుక్కిటబట్టి మహావిద్వాంసుడని పేరు ప్రతిష్ఠలు సంపాదించెను. క్రమముగా కన్‌ఫ్యూషియస్‌కు పెక్కు మంది శిష్యులు ఏర్పడిరి. కొంతకాలము చుంగ్‌ టు మండలాధ్యక్షుడుగాను, 'లు' రాష్ట్ర ప్రధానిగాను వ్యవహరించి, శేషించిన జీవితము పదునాలుగు సంవత్సరములు, దేశాటనమొనర్చుచు ధర్మబోధలో గడపెను.

చిత్రము - 217

పటము - 2

చైనా ప్రాచీనశిల్పము, దేవతామూర్తులు

చిత్రము - 218

పటము - 3

చైనా ప్రాచీన శిల్పము, డగోబా

ప్రాచీన ధర్మసూత్రములను క్రోడీకరించి మానవతా వాదము పునాదిగా, విశిష్టమైన సాంఘిక రాజకీయ తత్త్వమును, కన్‌ఫ్ఫ్యూషియస్ ప్రతిపాదించినాడు. ప్రశాంతమైన కుటుంబమునకు ఆధారమైన సహనము, సామరస్యము, సౌమనస్యము, విశ్వాసము, భక్తిప్రపత్తులు మొదలైన గుణములే ప్రజలందరిలోను, ప్రజలకును ప్రభుత్వమునకును మధ్య ఏర్పడి నప్పుడే మానవుడు సుఖముగా జీవింపగలడు. ప్రపంచము శాంతిధామము కాదు అనునదే కన్‌ఫ్యూషియస్ తత్త్వములోని సారాంశము. కన్‌ఫ్యూషియస్ రచనలను నిన్న మొన్నటి వరకును చైనాలో కంఠస్థము చేయుచుండెడి వారు. చైనా విద్వత్తుకు అదియే గీటురాయియై యుండెను.

కన్‌ఫ్యూషియస్ సమకాలికుడైన లౌజే (Laotse) టోయీ మతమును (Toism) స్థాపించినాడు . ఈ మతస్థులకు లౌజే రచించిన లావోటి కింగ్ (పవిత్రమార్గము) అను గ్రంథమే వేదము. ఇందలి సిద్ధాంతములు చాలవరకు హేతువాద బద్దము లయినవి. లౌజేకూడ శీలమునకు ప్రాధాన్యము నిచ్చెను. కాని సంప్రదాయ సిద్ధములైన మూఢాచారముల పట్ల విశ్వాసమే సమస్త అనర్థములకు కారణమని అతడు చాటెను. అందుచేతనే కన్‌ఫ్యూషియస్ సంప్రదాయవాదులకును, లౌజే విప్లవవాదులకును మార్గదర్శకులైరి.

టోయీ మతముకంటె, చైనాలో కన్‌ఫ్యూషియస్ సిద్ధాంతములే ప్రజాదరణమును పొందినవి.

చిత్రము - 219

పటము - 4

కన్‌ఫ్యూషియస్

అందుకు మెన్సియస్ (క్రీ. పూ. 372-289), హ్సుజు (క్రీ. పూ. 320 - 285), అను దార్శనికులు కారణము. వీరు కన్‌ఫ్యూషియస్ సిద్ధాంతములకు వ్యాఖ్యానములు రచించి ప్రజలలో ప్రచార మొనర్చిరి. “మానవుడు సహజముగా నీతిపరుడు. అవినీతికి దుష్టశక్తుల ప్రభావమే కారణము. ప్రేమ, ధర్మము, నశించినప్పుడు మానవులను మృగములు భక్షించుటేగాక, మానవు లొకరి నొకరు భక్షింతురు” అని మెన్సియస్ బోధించెను. హ్సుజు సిద్ధాంతములకును భారతదేశములోని చార్వాక దర్శనమునకును పోలిక లున్నవి.

బౌద్ధము : ఈ మతములకు తోడుగా, ఇండియానుండి బౌద్ధము క్రీ. పూ. 1, 2 శతాబ్దములలోనే చైనాలో ప్రవేశించినది. చిన్ వంశస్థులు బౌద్ధమతమును విశేషముగ ఆదరించిరి (అచిరకాలములో, కన్‌ఫ్యూషియస్, లౌజే, గౌతమబుద్ధుడు - చైనీయులకు త్రిమూర్తులైనారు). చిన్ యుగమున, చైనాలో ముప్పదివేల బౌద్ధవిహారములు వెలసినట్లును, వానిలో 20 లక్షల మంది భిక్షువులు నివసించినట్లును తెలియుచున్నది. టావాన్ అను బౌద్ధ భిక్షువు (క్రీ. శ. 312-285) పెక్కు మత గ్రంథాలు రచించి ప్రసిద్ధి చెందెనట ! చైనీయులు భారత బౌద్ధాచార్యులను తమ దేశమునకు ఆహ్వానించి గౌరవించిరి. అట్టివారిలో కుమారజీవుడు అగ్ర గణ్యుడు (క్రీ. శ. 343-413). ఇతడు మూడు వందలకు పైగా బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోనికి తర్జుమా చేసెను. చైనా బౌద్ధభిక్షువు లనేకులు ఇండియాలోని బౌద్ధ క్షేత్రములను దర్శించుటకై వచ్చిరి. అందు పాహియాను, హుయాన్‌సాంగ్ అనువారు సుప్రసిద్ధులు. హుయాన్‌సాంగ్ (క్రీ. శ. 604-664) నలందాలో విద్యాభ్యాస మొనర్చి, ఆచార్యుడుగా పనిచేసి, దేశమందలి ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రములను దర్శించి, 600 బౌద్ధ గ్రంథములతో స్వదేశమునకు మరలెను. ఇతడు చైనా భాషలోనికి తర్జుమా చేసిన బౌద్ధ గ్రంథములు 1300 సంపుటములైన వట! నాగార్జునాచార్యుని శూన్యవాదము. అతని మహాయాన మత శాఖగా పరిగణింపబడు ధ్యాన బౌద్ధము చైనాలో విశేష వ్యాప్తి చెందెను. చాంగన్ బౌద్ధమత విద్యా కేంద్రమై దూరదేశములనుండి కూడ విద్యార్థుల నాకర్షించెను. ఇండియాలో వలెనే చైనాలోకూడ బౌద్ధమతము శిల్ప, చిత్రలేఖనములకు దోహదకారి యైనది. ఇందుకు ఉత్తర చైనాలో యున్ కాంగ్ పర్వత సానువున చెక్కబడిన 50 అ. ఎత్తు బుద్ధ విగ్రహము, టెన్ హుయాంగ్ చెంత తవ్వబడిన వేయి బుద్ధ గుహలు నిదర్శనములు. ఈ గుహలలో మనోహరములైన శిల్పములు, కుడ్య చిత్రములు కన్నులకు విందుచేయును. వీనిలో అమరావతీ, అజంతా కళా సంప్రదాయములు స్పష్టముగ కన్పించును.

సారస్వతము : చైనా ప్రాచీన సారస్వతము తొమ్మిది గ్రంథములుగా విభాగము గావింపబడినది. అందు మొదటి ఐదు గ్రంథములు హాన్ యుగమున (క్రీ. పూ. 200-క్రీ. శ. 220) క్రోడీకరింప బడెను. మిగిలినవి సుంగ్ యుగములో (క్రీ. శ. 960-1279) తయారైనవి. ఆ గ్రంథములు : (1) ఇచింగ్ (మత గ్రంథము), (2) షూచింగ్ (చరిత్ర); (3) షిచించ్ (కవిత్వము); (4) లీచీ (సాంఘి కాచారములు); (5) చున్ చియు; (6) లున్‌య; (7) టూహిస్యు; (8) చుంగ్‌యంగ్ ; ; (9) మెంగ్‌ట్సుషు. ఈ గ్రంథములపై హాన్ యుగమున భాష్యములు రచింపబడినవి. ఇదిగాక చైనాలో అపారమగు బౌద్ధమత వాఙ్మయ సృష్టి జరిగినట్లు పైన పేర్కొనబడినది.

చైనా చక్రవర్తులు ప్రజలలో విద్యాబుద్ధుల వ్యాప్తికై శ్రద్ధ వహించిరి. చౌ యుగముననే పాఠశాలలు అసంఖ్యాకముగ నెలకొల్ప బడెను. హాన్ వంశస్థులు ప్రారంభించిన ప్రభుత్వ పరీక్షలు విద్యాభివృద్ధికి దోహద మొసగెను. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారే ఉద్యోగములలో నియమింపబడుచుండిరి. ప్రతి సంవత్సరము 30,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుగు చుండిరి. జన్మహక్కును బట్టి కాక విద్యను, సమర్థతను నిర్ణయించు పరీక్షా ఫలితములనుబట్టి ఉద్యోగము లిచ్చు ఈ పద్దతి ప్రాచీన చైనా సంస్కృతి లోని విశిష్ట లక్షణము.

మధ్యయుగము : (క్రీ. శ.618-1644). మధ్యయుగమున, తరచు రాజకీయ ఐక్యము నశించి, చైనా విదేశ దండయాత్రలకు గురియైనది. క్రీ. శ. 618 లో, చాంగన్ రాజధానిగా స్థాపించిన టాంగ్ వంశము వారు చైనాను సమైక్య మొనర్చి పాలించిరి. వీరు కొరియా, మంచూరియా, ఇండియా, పర్షియాలతో మైత్రి నెరపిరి. క్రీ. శ. 907 లో, చువెన్ అను నాతడు విజృంభించి, టాంగ్ వంశమును నిర్మూలించుటతో చైనా సామ్రాజ్యము విచ్ఛిన్నమై లియాంగ్, టాంగ్, జిన్, హాన్, చౌ మున్నగు వంశముల వారు పది రాజ్యములను స్థాపించిరి. చివరకు చౌ వంశస్థుడైన చావో కు యాంగ్ యిన్ అను నాతడు క్రీ. శ. 960 లో సింహాసన మాక్రమించి సుంగ్ వంశమును స్థాపించెను. ఈ వంశమువారు క్రీ. శ. 1279 వరకును చైనాను పాలించిరి.

సుంగుల కాలమున కీటాన్, తార్తార్, మంగోలు


సుంగ్‌వంశస్థాపకు డయిన చైనాచక్రవర్తి "చావో కుయాంగ్ యిన్" (క్రీ. శ. 960)

దారువిగ్రహ చిత్రణము

మున్నగు అనాగరిక జాతుల వారు చైనాపై దండెత్తిరి. వీరిలో మంగోలుల నివాస స్థానము ఆల్టాయి కొండలు ;

వారు వేట, పశుపాలనము వృత్తులుగా గల సంచార జీవనులు, చాల క్రూర స్వభావులు. క్రీ. శ. 13 వ శతాబ్దారంభమున టెమూజన్ అను నాయకుడు మంగోలులను సమైక్య మొనర్చి, దండయాత్రలు ప్రారంభించెను. ఇతడే లోక విద్రావణుడైన చెంగిజ్‌ఖాను. ఇతడు చైనాపై దండెత్తి హొయాంగ్‌హో నదికి ఉత్తర భాగము నాక్రమించెను. చెంగిజ్‌ఖాను మనుమడైన కుబ్లయిఖాను, (క్రీ. శ. 1259-1294) సుంగులను తొలగించి, చైనా నాక్రమించెను. ఖాన్ బాలీక్ అను నామాంతరము గల పీకింగ్ నగరము కుబ్లయిఖానునకు రాజధాని. సువిశాల మయిన మంగోలు సామ్రాజ్యమున కధిపతియైన కుబ్లయిఖాను ఆస్థానము, పలుదేశముల రాయబారుల నాకర్షించెను. జినోవా (ఇటలీ) వర్తకుడు, సుప్రసిద్ధ ప్రపంచ యాత్రికుడును ఐన మార్కో పోలో అనునాతడు కుబ్లయిఖాను ఆస్థానములో గౌరవము లందుకొనెను.

మంగోలులను తుదముట్టించి, చుయువాన్ చాంగ్ (హుంగ్ వు) మింగ్ వంశమును స్థాపించెను. ఈ వంశము వారు చైనా జాతీయులు : వీరు సుమారు 300 సంవత్సరములు పాలించి చైనా సంస్కృతిని పునరుద్ధరించి మెరుగులు దిద్దిరి. ఆంతరంగిక విప్లవముల వలనను, విదేశ దండయాత్రల వలనను మింగులు బలహీనులైరి. క్రీ .శ. 1644 లో మంచూ జాతులచే జయింప బడిరి. చైనాలో మంచూ వంశము స్థాపింపబడెను.

మధ్యయుగ సంస్కృతి : రాజకీయ కల్లోలములకు గురియైనను, మధ్యయుగమున చైనా ఆర్థిక సాంస్కృతిక పురోగతిని సాధింపగలిగెను. జాతి ఆదాయమునకు ముఖ్య ఆధారమైన వ్యవసాయమునందు చక్రవర్తులు శ్రద్ధవహించిరి. రైతులకు భూములు పంచి పెట్టబడెను. టాంగ్ చక్రవర్తి లిషిమిన్ (క్రీ. శ. 627-649) "రైతుల నుండి ఎక్కువ పన్నులు వసూలుచేయు రాజు తన శరీరమాంసమును తానే భక్షించు మూర్ఖుడు" అట ! సుంగ్ ప్రధాని యైన వాంగ్ ఆన్‌షి (క్రీ. శ. 1021-1081) ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజల శ్రేయోభివృద్ధికి దోహదమైనవి. ఇనుము, రాగి, వెండి, బంగారము మున్నగు ఖనిజములు విరివిగా త్రవ్వబడెను. పరిశ్రమలు పెంపొందెను; కై ఫెంగ్, లోయాంగ్, జుంకా మొదలైన నగరాలు పట్టుపరిశ్రమకును; కాంటన్, మింగ్‌చౌ నగరాలు విదేశ వాణిజ్యమునకును కేంద్రములైనవి. ఇంతటి గొప్ప ఐశ్వర్య సంపన్నమగుటచేతనే మార్కోపోలో చైనాను బంగారు దేశ మని అభినుతించినాడు. మంచూ చక్రవర్తియైన చీన్‌లుంగ్ అను నాతడు సగర్వముగా ఆంగ్లేయుల కీ విధముగా చాటగల్గెను. “మేము సమస్త ఐశ్వర్య సంపన్నులము; మా దృష్టిలో మీ వింత వస్తువులకు విలువలేదు. కాబట్టి మీ దేశ వస్తువులతో మాకు పనిలేదు.”

బౌద్ధమతముతో బాటు చైనాలో మహమ్మదీయ క్రైస్తవ మతములు వ్యాప్తిచెందినవి. దేశ ఐశ్వర్యము, సారస్వత లలిత క ళాభివృద్ధిలో ప్రతిఫలించినది. సుప్రసిద్ధులైన లిపో కవి (క్రీ. శ. 701-762), టుపు కవి అనువారు (క్రీ. శ. 712-770) టాంగ్ చక్రవర్తుల పోషణము నందుకొనిరి. మింగ్ వంశస్థులు చైనా సంస్కృతికి మెరుగులు దిద్దిరి. చైనాభాషలో పెక్కు నిఘంటువులు, సచిత్ర విజ్ఞాన సర్వస్వములు ప్రచురింపబడెను. కొయ్యదిమ్మలపై సిరాపూసి అచ్చువేయు సాధనమును చైనీయు లీ యుగమున నిర్మించిరి. కాగితము, అచ్చుయంత్రము సారస్వత వ్యాప్తికి చాల సహాయకారులైనవి. ప్రభుత్వ పరీక్షలు కూడ ప్రజలలో విద్యాభివృద్ధికి తోడ్పడెను. పీకింగ్ నగరమున కుబ్లయిఖాన్ ఒక విశ్వవిద్యాలయమును స్థాపించెను.

ఆధునిక యుగము - మంచూ రాజవంశము : (క్రీ. శ. 1644–1911) మంచూ వంశస్థులు చైనా, టిబెట్, ఫార్మోజా, టర్కీస్థానుల నాక్రమించి, సువిశాల సామ్రాజ్యమును స్థాపించిరి. బర్మా, నేపాల్, అస్సాములుకూడ వీరి దండయాత్రలకు గురియైనవి. కొరియా, మంచూ చక్రవర్తులకు కప్పము చెల్లించెను. మంచూ చక్రవర్తులు చైనా సంస్కృతి నవలంబించి ఆదరించిరి. రాజ్యాంగ విధానమును కూడ యథాతథముగ ననుసరించిరి. కాని చైనా ప్రజలకు మంచూ చక్రవర్తులపట్ల గౌరవ విశ్వాసము లేర్పడలేదు. చైనా ప్రజలు వారిని విదేశీయులుగా, దురాక్రమణదారులుగా నిరసించిరి. అందుచేత మంచూ చక్రవర్తులు దేశమున కీలక స్థానములందు సైన్యములు నెలకొల్పి పరిపాలన సాగించిరి. ఈ పరిస్థితులలో చైనాలో ఐరోపియనులు ప్రవేశించిరి.

ఐరోపియనులు, నల్లమందు యుద్ధములు : వాస్కోడిగామా గుడ్‌హోపు మార్గమును కనుగొన్ననాటినుండి, సముద్రమార్గమున పాశ్చాత్యులు చైనాకు రాసాగిరి. క్రీ. శ. 1557 నాటికి పోర్చుగీసువారు క్వాంటంగ్, ఫ్యూకిన్ రాష్ట్రములలో స్థావరము లేర్పరచుకొనుటయే గాక, మకావోలో కోటలు కట్టుకొనిరి. పోర్చుగీసువారి అడుగు జాడలలో, డచ్చివారు ఫార్మోజా దీవి (తైవాన్) లో క్రీ. శ. 1664 నాటికి స్థావరములను సాధించిరి. క్రమముగా చైనా వాణిజ్యము ఆంగ్లేయులను కూడ ఆకర్షించెను. 1773 లో ఆంగ్ల రాయబారి యైన మెకార్ట్నీ, మంచూ చక్రవర్తి చీన్‌లుంగ్‌ను దర్శించి, చైనాలో వాణిజ్య హక్కుల వర్థించెను. చక్రవర్తి నిరాకరించుటతో మెకార్ట్ని రాయబారము విఫలమైనది. కాని మంచూ చక్రవర్తులు మకావో రేవులోను, కాన్‌టన్‌లోను విదేశ వర్తకులకు ప్రవేశార్హత నొసగిరి. కావున ఈ రెండు నగరములు పాశ్చాత్య వాణిజ్య కేంద్రములైనవి.

ఆంగ్లేయులు చైనాకు నల్లమందు దిగుమతిచేసి అపారమైన లాభములు గడించు చుండిరి. నల్లమందు అలవాటు వలన ప్రజల ఆరోగ్యమునకు హాని కలుగు చున్నదని, చియాచింగ్ చక్రవర్తి (1800) నల్లమందును నిషేధించెను. ఆంగ్లేయులు దొంగచాటుగా నల్లమందు వర్తకమును కొనసాగించిరి. 1839 లో లిన్‌చిహిసు అను ఉద్యోగి, క్యాంటన్ లో 20 వేల పెట్టెల దొంగ నల్లమందును పట్టుకొని తగులబెట్టెను. దీనితో చైనా ప్రభుత్వమునకును; ఆంగ్లేయులకును రెండు యుద్ధములు జరిగెను. ఇవియే నల్లమందు యుద్ధములు (Opium wars). మొదటి యుద్ధములో (1839-1842) చైనా ఓడిపోయి 'నాన్‌కింగ్' సంధి చేసికొని ఆంగ్లేయులకు హాంగ్ కాంగ్ ద్వీపము నిచ్చుటయేగాక కాన్‌టన్, షాంఘై, అమాయ్, ఫూచో, నిన్‌గ్‌ఫూ రేవులలో స్వేచ్ఛగా వర్తకము చేసికొనుటకు హక్కుల నిచ్చెను. క్రైస్తవమత ప్రచారమునకును అనుమతించెను. 1856 వ సం॥ యుద్ధములోకూడ చైనా పరాజయము పొంది, టీన్‌ట్సిన్ సంధి చేసికొని, ఆంగ్లేయులకు మరికొన్ని హక్కు లొసగి పై సంధి షరతులను ఫ్రాన్సు, అమెరికా, జర్మనీ, నార్వే మొదలయిన దేశములకు గూడ వర్తింపజేసెను. దీనికే "మిక్కిలి అభిమానముతో చూడబడెడి జాతుల" హక్కులందురు (Most favoured Nation treatment). చైనాలో తమతమ న్యాయస్థానములు నెలకొల్పుటకుకూడ పాశ్చాత్యులకు హక్కు లీయబడెను (Extra - territorial Rights). మంచూ సామ్రాజ్యాధికారము విచ్ఛిన్నమై, చైనాలో పాశ్చాత్యుల అధికార ప్రాబల్యములు స్థిరపడసాగినవి.

టైపింగ్ తిరుగుబాటు క్రీ. శ. 1850-1865 : పై పరిణామముల ఫలితముగ చైనా ఆర్థిక వ్యవస్థ భగ్నమైనది. పన్నులబాధ నానాటికి పెరుగుచుండెను. నల్లమందుతో బాటు, వస్త్రములు మొదలైన పెక్కు విదేశ వస్తువులు దిగుమతియై దేశపరిశ్రమలు పూర్తిగ నశించెను. నిరుద్యోగము ప్రబలమైనది. మంచూ ప్రభుత్వమునందును, విదేశీయుల పట్లను ద్వేషము పెచ్చు పెరుగ సాగినది. "ప్రజలకు ఉద్యోగు లనిన భయము. ఉద్యోగులకు విదేశ భూతము లనిన భయము. విదేశ భూతములకు ప్రజ లనిన భయము.”

ఈ పరిస్థితిలో, క్వాంగ్సీరాష్ట్రవాసియైన హుంగ్ హిస్యు సుంగ్ అను క్రైస్తవ ఉపాధ్యాయుడు, తాను "జీససు తమ్ముడ" నని ప్రకటించుకొని మంచూ ప్రభుత్వముపై తిరుగుబాటు పురికొల్పెను. తండోపతండములుగ ప్రజ లీ తిరుగుబాటున చేరుటతో, 1856 నాటికి తొమ్మిది రాష్ట్రములు హుంగ్ వశమైనవి. నాన్‌కింగ్ రాజధానిగా “దివ్యశాంతి రాజ్యము” ను (Tai Ping Tien Kuo) హుంగ్ స్థాపించెను. కాని, విదేశీయుల సహాయముతో మంచూ చక్రవర్తులు ఈ తిరుగుబాటు నణచివేయ గలిగిరి. టైపింగ్ తిరుగుబాటు మంచూ చక్రవర్తుల అసమర్థ నిరంకుశత్వమునకు తోకచుక్క యైనది.

చైనా జపాన్ యుద్ధము 1894 : పాశ్చాత్య రాజ్యములతో బాటు జపాన్‌కూడ. చైనాదుస్థితిని అవకాశముగా గొని ఆసియాలో విస్తరించుటకు ప్రయత్నించెను. 1894 లో కొరియాపై అధికారమును గురించి చైనా, జపానులకు జరిగిన యుద్ధములో చైనా ఓడిపోయి 'షిమొనెస్కీ ' సంధి చేసికొనెను. దీనిప్రకారము ఫార్మోజా దీవిని, లయోటంగ్ ద్వీపకల్పమును, ఆర్థర్ రేవు పట్టణమును, జపాను పరము చేయుటకు చైనా అంగీకరించెను. కాని ఆర్థర్ రేవుపట్టణముపై చిరకాలమునుండి రష్యా తన దృష్టిని ప్రసరించి యుండెను. అందుచే రష్యా, ఫ్రాన్సు, జర్మనీలను కలుపుకొని 'షిమొనెస్కీ' సంధిని రద్దుచేయించెను. జపాను రష్యాల వైరమునకు ఇదియే నాంది. ఈ యుద్ధము వలన చైనా నిస్సహాయత పూర్తిగా వ్యక్తమగుటయే గాక, చైనా భూభాగములకై విదేశీయుల మధ్య పోటీ ఆరంభమైనది.

చైనాలో పాశ్చాత్య అధికార విస్తరణము 1895-1898 : పాశ్చాత్య రాజ్యములవారు అపారమగు ధనమును చైనాకు అప్పుగా నిచ్చి యుండిరి. వారు 'షిమొనెస్కీ' సంధి సందర్భమున జపానునకు వ్యతిరేకముగ చైనాపక్షమునే వహించిరి. అందుచే వారు, మంచూ ప్రభుత్వము నుండి పెక్కు హక్కులను బడసి తమ ప్రాబల్యమును ఇనుమడించుకొన సాగిరి. రష్యా ఆర్థరురేవును, జర్మనీ సింగ్ టావోరేవును, ఫ్రాన్సు క్వాంగ్ చౌవాన్ రేవును, ఇంగ్లండు వై హెవై రేవును ఆక్రమించిరి. విదేశ వస్తువులపై రహదారి సుంకములు తొలగింపబడెను. దేశమున పన్నుల వసూలుపై తనిఖీ చేయు నధికారమును ఆంగ్లేయులు సంగ్రహించిరి. రైలుమార్గములను నిర్మించు హక్కులు పాశ్చాత్యుల కీయబడెను. క్రమముగా రష్యా మంచూరియా, మంగోలియాలలోను, ఫ్రాన్సు ఫ్యూనాన్ రాష్ట్రములోను, జర్మనీ షాన్‌టుంగ్ రాష్ట్రములోను, బ్రిటను యాంగ్సీ లోయలోను, జపాను ఫూకిన్ రాష్ట్రములోను తమ తమ ప్రాబల్యములను నెలకొల్పిరి.

అచిరకాలములో, చైనా స్వాతంత్ర్యమును అంతరింప జేసి, పాశ్చాత్యులు తమలో తాము చైనాను విభజించు కొందురేమో అను భయ మేర్పడెను. నాటి వరకును, అమెరికా చైనాతో వర్తకము చేయుచుండెనే కాని, చైనాలో పలుకుబడి ప్రాంతమును సంపాదించుటకు ప్రయత్నింపలేదు. చైనా స్వాతంత్య్ర మంతరించినచో తన వాణిజ్యపు హక్కులకు భంగము వాటిల్లు నని అమెరికా భయపడెను. అందుచే ఆమెరికాప్రభుత్వ కార్యదర్శియైన హే అను నాతడు 1899 లో నొక ప్రకటన (Open Door Policy) గావించెను. దాని సారాంశమేమనగా, చైనాలో అన్నిజాతులవారును వర్తకము చేసికొనవచ్చును. కాని ఏ ప్రాంతమునుగాని సంపూర్ణాధికారములతో నాక్రమింప గూడదు. నామమాత్రావశిష్టమైన స్వాతంత్ర్యమును గుర్తించి పాశ్చాత్యులు చైనాను ఉమ్మడిగా దోచుకొన సాగిరి.

బాక్సరు విప్లవము 1900-1901 : చైనా సామ్రాజ్య మెప్పుడో అంతరించినది. చైనా నడిగడ్డపై కూడ మంచూ చక్రవర్తుల అధికారము నామమాత్రమైనది. దేశ ఆర్థిక జీవితముపై విదేశీయుల ఆధిపత్య మేర్పడెను. దేశము నలుమూలల విదేశ సైన్యములు నిల్పబడినవి. దేశీయ పరిశ్రమలు నశించినవి. నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరిగి పోవుచుండెను. కరువు కాటకములు తాండవింప సాగినవి. మరొక వైపున పాశ్చాత్య సంపర్కము వలన ప్రజాస్వామ్యము, జాతీయత, మొదలైన భావములు ప్రజలలో వ్యాపింప సాగెను. విద్యావంతులలో మంచూ చక్రవర్తుల పట్ల అసంతృప్తి. విదేశీయులపై ద్వేషము ప్రబలు చుండెను. బాక్సరులు మొదలైన రహస్య విప్లవ సంఘముల వారు విధ్వంసక చర్యలు సాగించిరి.

చక్రవర్తి క్వాంగ్ షూ అనునాతడు పరిస్థితి విషమించిన దని గ్రహించి, సంస్కరణముల ద్వారా దేశమును ఉద్దరించుటకు సంకల్పించెను. కాంగ్ యువై, లియాంగ్ చిచో అను విద్వాంసు లాతనికి సలహాదారు లైరి. కాని సంరక్షకురాలుగా నున్న రాజమాత, జీహిసి అనునామె చక్రవర్తిని నిర్బంధములో నుంచి, సంస్కరణోద్యమమును రద్దుచేసెను. అంతటితో, బాక్సరులు తిరుగుబాటు చేసిరి. బాక్సరులను విదేశీయులపై మరలించుటకు జీహిసి ప్రయత్నించెను. బాక్సరులు పీకింగ్ లోని విదేశ స్థావరములను ముట్టడించుటతో, విదేశీయు లందరు నేకమై, బాక్సరుల నణచివేసిరి. విదేశీ సైనికులు మంచూ రాజాంతఃపురమును కూడ కొల్లగొట్టిరి. దేశమున శాంతి నెలకొల్పబడెను. మంచూప్రభువు విదేశీయులతో సంధి చేసికొని 135 కోట్ల రూపాయల విలువ గల ధనమును నష్టపరిహారముగ నొసగెను. చైనా జాతీయదైన్యములో ఇది చివరి మెట్టు.

రష్యా - జపాను యుద్ధము 1904-1905 : షిమొనెస్కి సంధి రద్దయి నప్పటినుండి, రష్యాపై జపాను పగబట్టి యుండెను. బాక్సర్ విప్లవ సందర్భములో రష్యా సైన్యములు మంచూరియా నాక్రమించెను. అందుకు జపాను అభ్యంతరముచెప్పెను. కాని రష్యా లెక్కచేయలేదు. ఆసియాలో, రష్యా సామ్రాజ్య విస్తరణము జపానుకేకాక, ఆంగ్లేయులకు గూడ కంటకముగా నుండెను. అందుచేత 1902 లో ఇంగ్లండు, జపాను దేశములు సంధి చేసికొని మైత్రి వహించెను. ఇది అవకాశముగా, జపాను రష్యాపై యుద్ధమునకు దిగెను. ఈ యుద్ధమున రష్యా ఓడిపోయి పోర్ట్సుమత్ సంధి (1905) చేసికొని, కొరియాను, లయోటంగ్ ద్వీపకల్పమును, సాఖలీను ద్వీపములో అధిక భాగమును జపానున కొసగుటయేగాక, మంచూరియా నుండి వైదొలగుట కంగీకరించెను. రష్యాపై జపాను విజయము, పరాధీను లయిన ఆసియా ప్రజలలో ఆత్మవిశ్వాసమును కలిగించినది.

చైనా సంస్కరణోద్యమము : జపాను విజయము మంచూ ప్రభువుల కండ్లు తెరచెను. రాజమాతయు, క్వాంగ్‌షు చక్రవర్తియు, సంస్కరణల ద్వారా చైనాను పునరుజ్జీవింప సమకట్టిరి. సైన్యము నందును, పరిపాలనలోను, పెక్కుమార్పులు తేబడెను. బానిసత్వము రద్దు చేయబడెను. ప్రభుత్వపు పరీక్షలు నిలిపివేయ బడెను. పాఠశాలలు అసంఖ్యాకముగ నెలకొల్పబడెను. వానిలో పాశ్చాత్య విద్యా విధానము అమలు జరిగెను. రాష్ట్రములలో శాసనసభ లేర్పాటు చేయబడెను (1908). పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక విధానములను పరిశీలించుట కొక సంఘమును పంపి, వారి సూచనలను అమలు జరుపుదు మని మంచూ ప్రభువులు ప్రకటించిరి.

1908 లో రాజమాతయు, చక్రవర్తియు మరణించిరి. పసిబాలుడైన 'పూయి' సింహాసన మెక్కెను. ఆతని సవతి తల్లి 'లంగ్ యూ' అనునామె సంరక్షకురాలైనది. చైనాను దోచుకొనుచున్న విదేశ సామ్రాజ్యవాదుల కిది మంచి అవకాశమైనది. సంస్కరణోద్యమము వెనుకంజవేసెను. పూర్వ పరిస్థితులు పునరుద్ధరింపబడెను. ప్రజల కిది పెద్ద అశాభంగమును కల్పించెను.

అందుచే మంచూ రాజవంశము అంతరించి, ప్రజాస్వామ్య మేర్పడినగాని చైనాకు మోక్షములేదను భావము ప్రజలలో తీవ్రరూపము వహించినది.

జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమము; సన్యట్ సేన్ : నాటికే దక్షిణ రాష్ట్రములలో సన్-యట్-సేన్ జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమమును రూపొందించు చుండెను. సన్-యట్ -సేన్ (1866-1925) క్వాంగ్‌టంగ్ రాష్ట్రములో నొక సామాన్య క్రైస్తవ కుటుంబములో జన్మించి, కాంటన్‌లో వైద్యవృత్తిలో ప్రవేశించెను. టైపింగ్, బాక్సరు విప్లవములు ఇతనిలో దేశభక్తిని పురికొల్పినవి. మంచూ వంశమును కూలద్రోసి, ప్రజాస్వామ్యము ద్వారా చైనా నుద్ధరింపవలె నని సన్-యట్-సేన్ సంకల్పించెను. జాతీయత, ప్రజాస్వామ్యము, ఆర్థిక సమానత్వము (శాన్, మిన్, చుయి) ఆతని ఆశయములు. తన ఆశయములను సాధించుటకై ఆతడు 'హిసిన్ చంగ్ హై' అను సంఘమును స్థాపించెను. అదియే తరువాత టుంగ్ మెంగ్ హుయిగా మారినది. 1904-1909 సం.ల మధ్య సన్- యట్ - సేన్ కియాంగ్సీ, క్వాంగ్ టంగ్ రాష్ట్రములలో తిరుగుబాటులు పురికొల్పి విఫలు డయ్యెను. ఆ తరువాత అతడు జపాను, అమెరికా, ఇంగ్లండు దేశములలో పర్యటించి, చైనాకు ఆ ప్రజల సానుభూతి, సహకారములను బడయుటకై ప్రయత్నించెను.

విప్లవ ప్రారంభము, రాచరికము రద్దు-1912 : క్రమముగ జాతీయ విప్లవ జ్వాలలు దేశము నలుమూలలకు వ్యాపించినవి. 1911 అక్టోబరులో హాంకో నగరవాసులు తిరుగుబాటు చేసిరి. అది పూచాంగ్ రాష్ట్రమునకు విస్తరించినది. ప్రజల నణచుటకై ప్రభుత్వము పంపిన లీ యున్ హంగ్ సేనాని తిరుగుబాటుదారులతో చేరెను. ఒకదాని తరువాత నొకటిగా పదునేడు రాష్ట్రములు స్వాతంత్య్రమును ప్రకటించుకొనెను. ఈ రాష్ట్రములకు 1912 జనవరి 1 వ తారీఖున సన్ యట్ సేన్ అధ్యక్షుడయ్యెను. విప్లవ ప్రభుత్వమునకు నాన్‌వెంగ్ రాజధాని యయ్యెను.

పరిస్థితి విషమించిన దని గ్రహించి, మంచూ చక్రవర్తి విప్లవకారులతో సంప్రతింపులు జరుపుటకై యువాన్ షి కాయిని నియమించెను. కాని స్వార్థపరుడైన యువాన్ మంచూ రాచరికము రద్దగుట కంటె గత్యంతరము లేదని సలహా ఇచ్చుటచే, ఫిబ్రవరి 1912 లో మంచూ చక్రవర్తి సింహాసనమును పరిత్యజించెను. యువాన్ అధ్యక్షత క్రింద

చైనాలో సమైక్య ప్రజాస్వామ్య మేర్పడగలదని ఆశించి,
చైనా శిల్పము - పౌరాణిక యుగపు భయంకర రాక్షసజంతువుల విగ్రహములు
14-2-1912 లో సన్ యట్ సేన్ తన పదవిని త్యజించెను. క్రొత్తరాజ్యాంగము ప్రకారము యువాన్ అధ్యక్షుడుగా

(10-3-1912) చైనా గణతంత్ర మేర్పడినది. యువాన్ ప్రభుత్వమును రాజ్యాంగ బద్ధము గావించుటకై, టంగ్ మెంగ్ హుయి స్థానమున కూమిన్‌టాంగ్ పక్షమును (ఆగస్టు 1912) సన్ యట్ సేన్ స్థాపించెను. కాని విజయ వంతమగుచున్న ప్రజా విప్లవమును విశ్వాస యోగ్యుడు కాని యువాన్ హస్తగత మొనర్చుట సన్ యట్ సేన్ చేసిన గొప్ప పొరపాటు.

యువాన్ సైనిక ప్రభుత్వము 1912-1916 : యువాన్ షికాయికి ప్రజాస్వామ్యములో విశ్వాసములేదు. సైనిక నియంతృత్వము ద్వారా రాచరికమును పునరుద్ధరించుటయే ఆతని యాశయము. అమెరికా రాజ్యాంగవేత్త యైన “ఫ్రాంక్ గుడ్ నౌ" అనునతని సలహాపై పాశ్చాత్య సామ్రాజ్య వాదులనుండి 25 మిలియన్లు ఋణము గ్రహించి యువాన్ తన కార్యక్రమమునకు ఉపక్రమించెను. కూమిన్‌టాంగ్‌ను బహిష్కరించి, కియాంగ్సీ పూకిన్, హూనాన్, జెకువాన్ మున్నగు రాష్ట్రములలో జరిగిన తిరుగుబాటులను దారుణముగ అణచివేసెను. సన్‌యట్ సేన్ కూడ జపాన్‌కు పారిపోయి తల దాచుకొనెను. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధము ఆరంభమైనది. చైనాలోని కల్లోలములను అవకాశముగా గ్రహించి జపాను, చైనాను ఇరువదియొక్క కోరికలను కోరెను (Twenty one Demands). వీటిని అంగీకరించినచో చైనా ఇంచుమించు జపానుకు సామంతరాజ్యము కాగలదు. యువాన్ ప్రభుత్వము ఈ కోర్కెలను అంగీకరించెను. జపాను యొక్కయు, పాశ్చాత్య రాజ్యముల యొక్కయు సహాయముతో ప్రజా వ్యతిరేకతను లక్ష్య పెట్టక 1916 లో యువాన్ తనను చక్రవర్తిగా ప్రకటించుకొనెను. కాని అతడు అనతి కాలములోనే మరణించెను. అతని మరణానంతరము తిరిగి రాచరికము రద్దయినది.

సైనిక ప్రభువులు : యువాన్ మరణానంతరము లియువాన్ హుంగ్ అధ్యక్షుడుగాను, ట్వాంచిజుయి ప్రధానిగను ఎన్నుకొనబడిరి. కాని సైనిక వర్గములు బలపడి అంతర్యుద్ధములతో దేశమును సంక్షుభిత పరచిరి. ట్వాంచి జుయి (ఆన్‌హివై వర్గనాయకుడు) జపాను నుండి 200 మిలియను ఎన్నుల ఋణమును గ్రహించి, చిహిలీ, ఫెంగ్‌టీన్ సైనిక వర్గముల నడచుటకు ప్రయత్నించెను. ఇంతలో కీయాంగ్సీ గవర్న రయిన చాంగ్ హసన్ అను నతడు పెకింగ్‌ను వశపరచుకొని, హసువాన్‌టుంగ్ అను మంచూ రాకుమారుని సింహాసన మెక్కించెను. కాని, ట్వాంచిజుయి వారిని వెడలగొట్టి, లియువాన్‌హుంగ్‌ను పునరుద్ధరించెను. ట్వాంచిజుయి వర్గము బలపడకపూర్వమే వారిని తొలగించి, వూ పైపు నేనాని అధికారమును హస్తగత మొనర్చుకొని చోకన్ సేనానిని, ఆ తరువాత లీయున్ హంగ్‌ను అధ్యక్షులను గావించెను. దక్షిణ రాష్ట్రములను గూడ ఆక్రమించుట వూపైపు సేనాని సంకల్పము.

కాన్‌టన్ ప్రజాస్వామ్యము : యువాన్ సైనిక నియంతృత్వము పట్లను, జపాను దురాక్రమణముల పట్లను నిరసనగా దక్షిణరాష్ట్ర ప్రజలు తిరుగుబాటు ప్రారంభించిరి. 1916 లో సన్ యట్ సేన్ వీరికి నాయకత్వము వహించి, కాన్‌టన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వమును స్థాపించెను. కాని ఆతని సర్వ సైన్యాధ్యక్షుడైన చన్ చుంగ్ మింగ్ (చన్ హక్కా) వూవైపు సేనానితో కుట్రపన్నుటచే, సన్‌యట్ సేన్ కాన్‌టన్ విడిచి షాంఘైకి పారి పోవలసి వచ్చెను. కొండజాతి బందిపోటు దొంగ యగు చన్ హక్కాను విశ్వసించుట సన్ చేసిన మరియొక పొరపాటు.

వర్సెయిల్సు శాంతి సమావేశము : కాంటన్ ప్రభుత్వ పక్షమున టి. వి. సూంగ్ వర్సెయిల్సు శాంతిమహాసభకు హాజరైనాడు. చైనా అభివృద్ధికి అంతర్జాతీయ సహాయము నర్థించుచు, ఒక పథకమును ఆ సమావేశమునకు సన్ సూచించెను (International Development ofChina). సన్ సూచనలను తిరస్కరించుటయే గాక, శాంతి సమావేశము జర్మనీకి చెందిన పాన్‌టంగ్ రాష్ట్రమును జపానువారి పర మొనర్చెను. ఈ సంధిపై సంతక మొనర్చుటకు చైనా నిరాకరించినది. మే, 1919 లో విశ్వ విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గముల వారును కలిసి వర్సెయిల్సు సంధిని ప్రతిఘటించుచు, దేశవ్యాప్తమగు ఉద్యమమును సాగించిరి. 1922 లో జరిగిన వాషింగ్‌టన్ సమావేశమున పాశ్చాత్య రాజ్యములవారు చైనా స్వాతంత్ర్యమును, ఐక్యమును గుర్తించిరి గాని చైనాలో తమకు గల హక్కులను త్యజింప నిరాకరించిరి. శాంతి, ప్రజాస్వామ్యములలో పాశ్చాత్యుల విశ్వాసమును చైనీయులు అనుమానింప సాగిరి.

కూమిన్‌టాంగ్ – సోవియట్ రష్యా సహకారము : సన్ యట్ సేన్ షాంఘైలో నున్న కాలమున సోవియట్ రష్యాతో సహాయ సంప్రదింపులు జరిపెను. 1917 లో లెనిన్ నాయకత్వమున రష్యాలో స్థాపితమైన సామ్యవాద ప్రభుత్వము సామ్రాజ్యవాదమును ఖండించి, పీడిత ప్రజలకు ఆశాజ్యోతి యైనది. అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీని స్థాపించి, ప్రపంచములోని సామ్రాజ్యవాద వ్యతిరేకులకును, శ్రామిక వర్గములకును సహాయము చేయ లెనిన్ నిశ్చయించెను. సోవియట్ ప్రతినిధియైన అబ్రహాం అడాల్ఫుజోఫి షాంఘైలో సన్ యట్ సేన్‌తో సంప్రదించి చైనాకు రష్యా సహాయమొనర్చునని వాగ్దాన మొనర్చెను. మే, 1920 లో, చన్ ట్యు హ్సి అను పీకింగ్ విశ్వవిద్యాలయాచార్యుని నాయకత్వమున, షాంఘైలో చైనా కమ్యూనిస్టుపార్టీ స్థాపింపబడినది. 1923 జూన్ లో జరిగిన మహాసభలో కమ్యూనిస్టులు సన్‌యట్ సేన్‌తో పొత్తు కలియుటకు నిర్ణయించిరి. సన్‌ యట్ సేను కూడ రష్యా సహాయముతో విదేశ సామ్రాజ్యవాదులను పారద్రోలి చైనాలో ఆర్థిక సమానత్వముపై ఋజువైన ప్రజాస్వామ్య ప్రభుత్వమును స్థాపించుటకు సంకల్పించెను.

చైనా సమైక్యమునకు ప్రయత్నము : సన్ యట్ సేను అనుచరులలో వాంగ్ చింగ్ వై, చియాంగ్ కేషేక్ అను వారు ముఖ్యులు. అందు, చియాంగ్ కేషేక్ 1923 లో సైన్యమును సమకూర్చుకొని, కాన్‌టన్‌లోని సైనిక ప్రభువును పారద్రోలెను. సన్ యట్ సేన్ తిరిగి కాన్ టన్ ప్రభుత్వమున కధ్యక్షు డయ్యెను. 1924 లో జరిగిన అఖిల చైనా కూమిన్ టాంగ్ మహాసభకు మావ్ సే టుంగ్ మున్నగు కమ్యూనిస్టు నాయకులు కూడ హాజరై సన్ యట్ సేన్‌తో సహకరింప సమ్మతించిరి. ఇదే సమయమున కాన్‌టన్ ప్రభుత్వమునకు సహాయ మొనర్చుటకై రష్యానుండి 70 మంది సేనానులతో మైకేల్ బొరోడిన్ పంపబడెను. చైనా విప్లవకారులను తర్ఫీదు చేయుటకై వాంపోవా సైనిక పాఠశాల స్థాపింపబడెను. మే, 1924 లో మంచూరియా, తూర్పు చైనాలలో, తన హక్కులను రష్యా త్యజించుటచేత, చైనీయులకు రష్యాపట్ల గౌరవ మినుమడించెను.

ఇట్టి పరిస్థితులలో పీకింగ్ లోని సైనిక ప్రభువుల మధ్య కలహము లారంభమైనవి. మంచూరియా నాయకుడైన చాంగ్ సోలిన్ పీకింగ్ నుండి వూ పైపును వెడలగొట్టి, ట్యాంచిజుయిని అధ్యక్షునిగా నొనర్చెను. ఈ ఉభయులు కలిసి, సన్ యట్ సేను నాహ్వానించి సమైక్య చైనాకు అధ్యక్షుడవు కమ్మని కోరిరి. ఈ ఆహ్వానము నంగీకరించి, సన్ పీకింగ్ చేరెను. కాని తన ఆశయము పూర్తిగాక పూర్వమే, 12-3-25 లో సన్ యట్ సేను మరణించెను. సన్ యట్ సేను చైనా జాతి పితగా భావింపబడుచున్నాడు. కాని, అతడు నిర్దుష్టమై ప్రగతి శీలమైన విధానమును రూపొందించి ఏకాగ్రతతో అవలంబింపలేక పోవుటచేతనే చైనా జాతీయోద్యమము అడ్డదిడ్డముగా నడచెను.

చియాంగ్ కేషేక్ నాయకత్వము : సన్ మరణముతో చైనా సమైక్యమునకు అవకాశములు సన్నగిల్లెను. ఉత్తరమున సైనిక ప్రభువులమధ్య కలహములు తిరిగి చెలరేగెను. పీకింగ్ లో చాంగ్ సోలిన్ అధ్యక్షుడైనాడు. కొన్నికొన్ని రాష్ట్రములలో వూపైపు, మరికొన్నింటిలో ఫెంగ్ సేనాని అధికారము వహించిరి.

కాన్‌టన్‌లోని కూమిన్ టాంగ్ ప్రభుత్వమునకు వాంగ్ చింగ్ వై అధ్యక్షుడయ్యెను. చియాంగ్ కేషేక్, లియోచంగ్ కే అనువారు ఆతని సలహాదారులైరి. రష్యా ప్రతినిధియైన బొరోడిన్ కూడ కాన్‌టన్ ప్రభుత్వమునకు తోడ్పడుచుండెను.

ఉత్తరదండయాత్ర : ఉత్తరరాష్ట్రములను జయించి చైనాను సమైక్యమొనర్చుటకై, కాంటన్ ప్రభుత్వము, చియాంగ్ కే షేకును సర్వసైన్యాధిపతిగా నియమించెను. జులై, 1926 లో ప్రారంభమైన ఈ దండయాత్రకు కమ్యూనిస్టులేగాక, ఉత్తరరాష్ట్రప్రజలు కూడ హృదయ పూర్వకముగ తోడ్పడిరి. మార్చి 1927 నాటికే వూహాన్, హూనన్, హ్యుపే, కియాంగ్సీ, ఫూకిన్, చిక్ యాంగ్ రాష్ట్రములు, నాన్‌కింగ్ నగరము, చియాంగ్ వశమైనవి. డిసెంబర్ 1927 లో కూమిన్‌టాంగ్ కార్యస్థానము హాంకోకు మార్చబడెను. హాంకోలోని తమ హక్కులను వదలుకొని బ్రిటిషువారు షాంఘైకి మరలిరి. చైనా భూభాగమునుండి పాశ్చాత్య సామ్రాజ్యవాదులు తరలుట కిదియే నాంది !

క్యూమిన్‌టాంగ్‌లో చీలికలు, కమ్యూనిస్టులు :సన్ యట్ సేను మరణించి నప్పటినుండియు, కూమిన్‌టాంగ్‌లో చీలికలు ప్రారంభమైనవి. ధనిక భూస్వామ్య వర్గములు ప్రజాస్వామ్యమును ప్రతిఘటింప పూనుకొనిరి. వీరికి సైనిక ప్రభువులు, విదేశ సామ్రాజ్యవాదులు మద్దత్తు నిచ్చిరి. మరొకవైపున కమ్యూనిస్టులు సమ్మెలను, విదేశ వస్తుబహిష్కరణమును ప్రోత్సహించుచుండిరి. 1925 లో కాన్‌టన్, షాంఘైలలో కార్మికులు సమ్మె జరిపిరి. ఆంగ్ల సైనికులు సమ్మెదార్లపై కాల్పులు జరిపిరి. కమ్యూనిస్టు విధానము చైనా సమైక్యమునకు భంగము కలిగించు నను భయముతో చియాంగ్ ధనికవర్గము వైపునకు మ్రొగ్గెను. చివర కతడు, ఏప్రెల్ 1927 లో హాంగ్‌కాంగ్ ప్రభుత్వమునకు పోటీగా నాన్‌కింగ్‌లో జాతీయ ప్రభుత్వమును స్థాపించి కమ్యూనిస్టుల నణచసాగెను. స్థానిక ధనికవర్గము, విదేశ వర్తకులు చియాంగ్ ప్రభుత్వమునకు ధనసహాయ మొసగిరి. ఆగస్టు 1927 లో షాంఘైలో జరిగిన సమ్మెను చియాంగ్ అతి దారుణముగ అణచివేసెను.

ఈ సమయమున కమ్యూనిస్టు ఉద్యమములో చీలిక లేర్పడినవి. 1924 లో రష్యా నియంత యైన స్టాలిన్, చైనాలో గూడ సత్వరము కమ్యూనిస్టు విప్లవమును సాధించు నాశయముతో బోరోడిన్‌కు సహాయముగ, ప్రముఖ భారతీయ విప్లవకారుడైన యం.యన్. రాయ్‌ని చైనాకు పంపెను. అంతకుపూర్వమే చైనాలో కమ్యూనిస్టు విధానమును గూర్చి రాయ్ చేసిన సూచనలను లెనిను, అంతర్జాతీయ కమ్యూనిస్టు సంఘమువారును, ఆమోదించియుండిరి. కాని చైనాలో బొరొడిన్, రాయ్‌ల మధ్య అభిప్రాయభేద మేర్పడెను. కూమిన్‌టాంగ్‌తో సర్వదా సహకరింపవలెనని బొరొడిన్ నిర్ణయము. కూమిన్‌టాంగ్ ప్రతీపగామిశక్తుల అదుపులో నుండుటచేత దాని ద్వారా సామ్యవాద మేర్పడుట అసంభవము కావున, రైతు కూలీ వర్గములలో విప్లవాత్మక చైతన్యమును ప్రబోధించి, వారి నాయకత్వమున, రష్యా సహాయముతో సామ్యవాదమును స్థాపించుట రాయ్ కార్యవిధానము. కాని, నాడు చైనా అతివాద వర్గ నాయకులు సామ్యవాదము నాదరించినను, వారిలో జాతీయ భావము, సామ్రాజ్యవాద వ్యతిరేకత బలముగా నుండెను. అందుచే, సామ్యవాద స్థాపనతో తమదేశమున రష్యా ఆధిపత్యము నెలకొన గలదని వారు భయ పడిరి. ఈ కారణమున వాంగ్‌చింగ్‌వై కమ్యూనిష్టు ఉద్యమమునకు విద్రోహియై అధికారమును చియాంగ్ పరమొనర్చి దేశమును విడిచి పారిపోయెను. (17-12-1927). చియాంగ్ సర్వాధికారియై దౌర్జన్యముగ కమ్యూనిస్టుల నణచివేసెను. రాయ్, బొరొడిన్ మున్నగువారు చైనా నుండి బహిష్కరింప బడిరి. ప్రజావిప్లవ మడుగంటెను.

పీపింగ్ ఆక్రమణ 1928 : మే 1928 నాటికి చియాంగ్ సేనలు పీపింగ్ నగరమును ముట్టడించెను ; చాంగ్‌సోలిన్ మంచూరియాకు పారిపోయెను. పీపింగ్ చియాంగ్ వశమైనది; దానికి పీకింగ్ (ఉత్తరశాంతి) అని పేరు పెట్ట బడెను. కొలదికాలములో మంచూరియా, తూర్పుమంగోలియాలు కూడ చియాంగ్ స్వాధీనమైనవి ; చైనా సమైక్యము పూర్తియైనది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు, జపానులు చైనాను గుర్తించినవి.

చియాంగ్ కేషేక్ అక్టోబరు 1928 లో కూమిన్‌టాంగ్‌ను సమావేశపరచి క్రొత్త రాజ్యాంగమును తయారు చేయించెను. దాని ప్రకార మేర్పడిన ప్రభుత్వము పేరునకు మాత్రమే ప్రజాస్వామ్యము; వాస్తవమున కది సైనిక, ధనిక వర్గముల నియంతృత్వము. చైనాలో రైతుకార్మిక ఉద్యమములు పూర్తిగా అణచి వేయబడినవి. ముఖ్యముగ ఉత్తర రాష్ట్రములలో సైనిక పాలన సాగినది. 1932 లో జరిగిన ఎన్నికలలో లిన్‌షెన్ అధ్యక్షుడుగాను, వాంగ్ చింగ్ వై ప్రధానిగాను, చియాంగ్ సేనానిగాను ఎన్నికైరి.

అంతర్యుద్ధము, 1927-1949 : వాంగ్ చింగ్ యొక్క విద్రోహచర్య వలన చైనా కమ్యూనిస్టు ఉద్యమము 1927 లో భగ్నమైనది. నాటి వరకును, చైనా కమ్యూనిస్టులకు సరియైన నాయకత్వము కూడ లేదు. వారు తమ దృష్టిని పాశ్చాత్య సామ్రాజ్య వాదులపై కేంద్రీకరించిరే గాని ప్రజలను సాంఘిక విప్లవమునకై తర్ఫీదు చేయలేదు. క్రమముగా, మావ్‌సే టుంగ్, చౌ-ఎన్-లై, చూటే, యేటింగ్ మున్నగువారు కమ్యూనిస్టులకు నాయకత్వము వహించి, చియాంగ్ దౌర్జన్యములను ప్రతిఘటించుటకు నిశ్చయించిరి. వీరు కియాంగ్సే, హూనాన్ రాష్ట్రముల సరిహద్దులలో నున్న చింగ్ కాంగ్ షాన్ పర్వతశ్రేణులలో స్థావరములేర్పరచుకొని, ఫూకిన్, హునాన్, హు పే, క్వాంగ్సీ, షెన్సీ రాష్ట్రములలో బలపడిరి. గొరిల్లా యుద్ధ పద్ధతులలో శిక్షణ పొందిన 60,000 సైనికులతో చైనా రెడ్ ఆర్మీ (Red Army) తయారైనది. దేశ ఐక్యము నశించి, అంతర్యుద్ధ మారంభమైనది.

కమ్యూనిస్టుల నడచుటకై, చియాంగ్ మూడు మార్లు (1930-1931) ప్రయత్నించెను. మావ్ సే టుంగ్ నాయకత్వమున కమ్యూనిస్టు లాదండయాత్రలను విఫలమొనర్చిరి. చివరకు 1934 లో కియాంగ్సీ రాష్ట్రమును వీడి, కమ్యూనిస్టులు, ఉత్తర చైనాలోనున్న షెన్సీ రాష్ట్రమును చేరి స్థావరము లేర్పరచుకొనిరి. మార్గ మధ్యమున వేలకొలది రైతులు కమ్యూనిస్టులతో చేరి వారికి మరింత బలము చేకూర్చిరి.

జపాను దండయాత్ర : మంచూరియాను ఆక్రమించుటకు, చైనా అంతర్యుద్ధము కంటె మంచి అవకాశము లేదని భావించి 1931 లో జపాను చైనాపై దండెత్తెను. అచిర కాలములో మంచూరియా జపాను హస్తగతమైనది. మంచూరియాకు "మంచుకో" అని పేరుపెట్టి, పదభ్రష్టుడైన మంచూ చక్రవర్తి “పూయీ"ని జపాను వారు మంచూకో సింహాసన మెక్కించిరి. జీహాల్, షాంఘైలు కూడా జపాను వశమయ్యెను.

కమ్యూనిస్టులతో పోరాటములో మునిగి యున్న చియాంగ్, జపాను దండయాత్రలను ప్రతిఘటించుటకు బదులు, 1933 లో 'టాంగ్ కు' ఒడంబడిక చేసికొని జపానువారి ఆక్రమణలను గుర్తించెను. దేశద్రోహకరమైన చియాంగ్ విధానమును మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు గర్హించిరి.

చియాంగ్ పలుకుబడి నశించుట కమ్యూనిస్టులకు మంచి అవకాశమైనది. అంతర్యుద్ధమును మాని సమైక్యముగా జపానును ప్రతిఘటింప వలెనని కమ్యూనిస్టులు మొదటి నుండియు వాదించిరి. కాని చియాంగ్ తో పోరాటమును మాత్రము కమ్యూనిస్టులు మానలేదు. ఈ పరిణామములను చైనాలోని జాతీయవాదులు, దేశభక్తులు గర్హించిరి. చివరకు, 1936 లో కమ్యూనిస్టులపై దండెత్తిన చాంగ్‌సూలియాంగ్ అను కూమిన్‌టాంగ్ సేనాని చియాంగ్ కేషేక్‌ను సియాన్ అనుచోట నిర్బంధించి, అంతర్యుద్ధము నాపి, జపానువారిపై బలమును కేంద్రీకరింప వలసినదిగా ఆతనిని కోరెను. చియాంగ్ అంగీకరించెను. కూమిన్‌టాంగ్-కమ్యూనిస్టు సంయుక్త సైన్య మేర్పాటు చేయబడెను.

చైనా ప్రయత్నము లిట్లుండగా 1937 లో జపాను విజృంభించి పీకింగ్, టీన్‌ట్సిన్ (జులై), షాంఘై (నవంబరు). నాన్‌కింగ్ (డిసెంబరు) నగరములను సులభముగ నాక్రమించెను. చియాంగ్ తన రాజధానిని హాంకౌ నగరమునకును, తరువాత జెకువాన్ రాష్ట్రములోని చుంగ్‌కియాంగ్ నగరమునకును మార్చెను. తాము జయించిన చైనా భూభాగమునకు నాన్‌కింగ్ రాజధానిగా, జపానువారు వాంగ్ చింగ్‌వైని పరిపాలకుడుగా నియమించిరి. సన్ యట్ సేన్ శిష్యులలో అగ్రగణ్యుడైన వాంగ్ చింగ్‌వై దేశభక్తి తుదకు అధికారవ్యామోహముగా, అవకాశవాదముగా పరిణమించినది!

రెండవ ప్రపంచ యుద్ధము : సెప్టెంబర్ 1939 లో రెండవ ప్రపంచ యుద్ధ మారంభమైనది. జర్మనీ, ఇటలీలు అక్షరాజ్యములను (Axis Powers) పేర నొక పక్షముగను, మిత్రమండలి యైన బ్రిటను, ఫ్రాన్సు లొక పక్షముగను పోరాడిరి. జపాను అక్షరాజ్య కూటమి లోనిది. జర్మనీ, జపానులతో సోవియట్ రష్యా సంధిచేసికొని మైత్రి వహించి యుండెను. అందుచేత 1939-41 మధ్య చైనా కమ్యూనిస్టులు జపానుతో పోరాడుటకు బదులు కూమిన్‌టాంగ్ సేనలతో తలపడి తమ ప్రాబల్యమును పెంపుచేసికొనిరి, జపాను ఆక్రమిత ప్రాంతములలో కూడ ప్రవేశించి రహస్యముగ గొరిల్లా దళములను తయారుచేసిరి. 1941 జూన్ నెలలో జర్మనీ రష్యాపై దండెత్తెను. డిసెంబరులో అమెరికా నౌకాశ్రయమైన పెరల్ హార్బరుపై, జపాను ఆకస్మిక విమానదాడి చేసెను. ఇంతటితో యుద్ధ స్వభావము మారినది. రష్యా, అమెరికాలు మిత్రమండలితో చేరి అక్షరాజ్య కూటమితో అన్నిరంగము లందును యుద్ధము ప్రారంభించిరి. 1-1-1942 నాడు చియాంగ్ కేషేక్ మిత్రమండలితో చేరి, చైనారంగమున మిత్రమండలి సైన్యములకు నాయకు డయ్యెను. ఆ సంవత్సరము అక్టోబరు నెలలో బ్రిటను, అమెరికాలు తమకు చైనాలోగల హక్కులను త్యజించిరి. ఐక్యరాజ్య సమితిలో అమెరికా, రష్యా, బ్రిటను, ఫ్రాన్సులతో పాటు చైనా అగ్రరాజ్యముల కోవలో చేరినది.

యుద్ధానంతరము చైనా : అణుబాంబు ప్రయోగముతో 10-10-1945 వ తేదీన జపాను మిత్రమండలికి లొంగినది; యుద్ధము ముగిసినది. చైనా, మంచూరియాలనుండి జపాను తిరోగమించినది. చైనా విదేశీయులనుండి విముక్తి పొందినది. కాని కూమిన్‌టాంగ్, కమ్యూనిస్టుల మధ్య అంతఃకలహము తీవ్రరూపము దాల్చినది. యుద్ధము ముగియు చుండగనే మంచూరియా మొదలు హొయాంగ్‌ హో నది పర్యంత భాగము కమ్యూనిస్టుల వశమైనది. కమ్యూనిస్టులు రైతుల సానుభూతిని పడసిరి. గొరిల్లా దళములను తయారుచేసిరి. జపాను సైనికులనుండి సంగ్రహించిన ఆయుధములు, చియాంగ్ కు అమెరికా సరఫరాచేసిన ఆయుధములు వారి హస్తగతమైనవి. అంతేగాక సోవియట్ రష్యా మద్దతు వారికి పూర్తిగా నుండెను. అన్నిటికంటె ప్రధానమైనది చియాంగ్ ప్రజాదరణమును కోల్పోయినాడు. అందుచేత అంతర్యుద్ధముద్వారా తమ ప్రభుత్వమును స్థాపింపగల మను విశ్వాసముతో కమ్యూనిస్టులు చియాంగ్ తో యుద్ధమునకు తలపడిరి. ఉభయపక్షములకు ఒడంబడిక కుదుర్చుటకై అమెరికన్ రాయబారి పాట్రిక్ హార్లీ, జార్జి మార్షల్ సేనాని, శక్తికొలది ప్రయత్నించిరి. లాభములేక పోయెను. చుంకింగ్ లో, చియాంగ్ కే షేక్ మావ్ సేటుంగ్ లమధ్య జరిగిన సంధిప్రయత్నము విఫలమగుటతోడనే (1946) కమ్యూనిస్టు సైన్యములు విజృంభించి పెక్కు రాష్ట్రముల నాక్రమించెను. హిసూచో, చించో, ముక్డెన్, చాంగ్ చన్ మొదలయిన యుద్ధములలో నోడిన కూమిన్‌టాంగ్ సైన్యములు కమ్యూనిస్టులతో చేరెను. 12-12-1948 వ తేదీన పీకింగ్ ను కమ్యూనిస్టులు ఆక్రమించిరి. చియాంగ్ - కే-షేక్ అధ్యక్ష పదవికి రాజీనామా యిచ్చెను. ఉపాధ్యక్షుడైన వీసంగ్ జన్ జరిపిన సంప్రదింపులు విఫలమైనవి. యాంగ్సీనదిని దాటి, కమ్యూనిస్టులు నాన్‌కింగ్, షాంఘై, కాన్‌టన్ మున్నగు నగరముల నాక్రమించిరి. చియాంగ్ మున్నగు కూమిన్‌టాంగ్ నాయకులు ఫార్మోజా (తైవాన్) ద్వీపమునకు వలసపోయి జాతీయ ప్రభుత్వమును స్థాపించిరి. చైనాలో కమ్యూనిస్టు విజయము పూర్తియైనది.

చైనా ప్రజాగణతంత్రము (Peoples Republic) : పీకింగ్ రాజధానిగా చైనాలో 1-10-1949 నాడు చైనీయ ప్రజాగణతంత్రమను పేర కమ్యూనిస్టు ప్రభుత్వము స్థాపింపబడినది. మావ్ సేటుంగ్ అధ్యకుడై వాడు. చౌ-ఎన్-లై ప్రధాని అయ్యెను. 1959 లో మావ్ సేటుంగ్ అధ్యక్ష పదవినుండి విరమించి, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వము వహించెను. లియోసౌచీ, చైనాకు అధ్యక్షుడైనాడు.

కమ్యూనిస్టు సిద్ధాంతముల ననుసరించి చైనాలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక పునర్నిర్మాణము జరుగుచున్నది. 1954 లో నొక రాజ్యాంగము అమలు జరిగినది. పేరునకు ప్రజాస్వామ్యమే ఐనను, ఏకపక్ష ప్రభుత్వమై, ఆర్థిక, రాజకీయాధికారములు ఆ ప్రభుత్వమునందే కేంద్రీకృతమై యున్నవి. భూ సంస్కరణములద్వారా సమష్టి వ్యవసాయ క్షేత్రములు స్థాపింపబడెను. విద్యాభివృద్ధి సాధింపబడినది. కమ్యూనిస్టు సిద్ధాంతములు ప్రచారములోనికి వచ్చినవి.

బి. యస్. యల్. హ.