సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చైతన్యమహాప్రభువు
చైతన్య మహాప్రభువు :
హిందూదేశములో మధ్యయుగపు మహా సాధుపుంగవులలో, మహాభక్తులలో శ్రీ చైతన్య మహాప్రభువు మిగుల ప్రసిద్ధిచెంది యున్నాడు. ఈతని అసలు పేరు విశ్వంభరుడు. ఈతని తండ్రి జగన్నాథ మిశ్రుడు. తల్లి పేరు శచీదేవి. విశ్వంభరుని మనోహర శరీరచ్ఛాయను బట్టి ఇతనికి గౌరాంగు డను పేరు కూడ కలిగెను. తల్లి పెట్టుకొనిన ముద్దుపేరు 'నిమాయి'. ఈతడు తురీయాశ్రమమును గైకొనినప్పుడు "శ్రీకృష్ణ చైతన్య భారతి" అను నామమును వహించెను.
క్రీ. శ. 1486 ఫిబ్రవరి నెలలో పశ్చిమ బెంగాలులోని నవద్వీప నగరమందు ఈతడు జన్మించెను. అచ్చటి శాస్త్ర పాఠశాలలో విద్యాభ్యాసము చేసి పదునెనిమిది సంవత్సరముల ప్రాయముననే బంగాళాదేశమున గొప్ప విద్వాంసుడని ప్రసిద్ధి చెందెను. వేదవేదాంగములు, తర్క వ్యాకరణాది విద్యలందు ప్రౌఢుడయి యుండెను. ఇపుడు విశ్వంభరుడు గురువులకు గురువు. తండ్రి చనిపోయిన పిమ్మట ఇతడే ఒక శాస్త్ర పాఠశాలను స్థాపించి, అందు ఉపాధ్యాయు డయ్యెను. ఉద్దండ పండితులను సృష్టించెను. ఇతనికి రెండుసార్లు వివాహ మయ్యెను. మొదటి భార్య గతించగా ఇతడు ద్వితీయ కళత్రమును గైకొనెను .
22 ఏండ్ల వయస్సులో నున్నపుడు తన పితృపాదులకు పిండప్రదాన కర్మ జరుపుటకై విశ్వంభరుడు గయా క్షేత్రమునకు వెడలెను. అచ్చట స్వామి "ఈశ్వరపురి" అను మహనీయునితో ఇతనికి పరిచయము కలిగెను. ఆ పరివ్రాజకు డీతనికి దశాక్షర పరిమితమగు 'గోపాల మంత్రము'ను ఉపదేశము చేసెను. ఈ సంఘటనము ఈతని జీవిత విధానము నంతయు మార్చివేసెను. ఆనాటినుండి విశ్వంభరుడు భగవద్భక్తి పరుడై, భగవద్దర్శన వ్యసనిగా
మారసాగెను. ఇతడు దివ్యవిద్యా సంకలితుడై భావోద్రేకానుభూతులను పొంది కృష్ణ నామమును పదేపదే జపించు చుండెడివాడు.“హరిబోలో " అనుచు, నవ్వుచు, ఏడ్చుచు, అద్వైతాచార్యులు, నిత్యానందుడు అను వారిద్దరు మహాభక్తులు. వీరి సహకారముతో ఇతడు ప్రజల ధార్మిక జీవనమునందు ప్రస్ఫుటమైన నూతన విధానములను కల్పించెను. అద్వైతాచార్యులు మొట్టమొదట విశ్వంభరునకు గురువుగానుండి తదుపరి అతనికే శిష్యు డయ్యెను. పూర్వాశ్రమములో విశ్వరూపు డను పేరుగల నిత్యానందుడు విశ్వంభరుని అన్న. నిత్యానందుడు శ్రీ బలరామావతార మనియు, విశ్వంభరుడు శ్రీకృష్ణుని అవతార మనియు భక్తుల విశ్వాసము.
చైతన్యుని ధర్మ ప్రబోధమునందు భక్తి భావ ప్రకోవనములగు కీర్తన గాన విధానము నూతన ఆరాధనా విధాన మయ్యెను. ఈ కీర్తనలో 'హరి - కృష్ణ' అను నామోచ్చారణ నినాదము మాత్రమే యుండును. ఈ సంకీర్తన సందర్భమున జంత్ర వాద్యముల సమ్మేళనముతో, మహా ధ్వనితో భక్తులు బృందగానము చేయు చుండెడివారు. ఇదియే వారి ప్రతి దిన చారుచర్యగా నుండెను. ఈ కీర్తన సంఘముల వారు గొప్ప సమూహముతో నవద్వీప నగర వీథులందు ఊరేగుచుండెడివారు. విశ్వంభరుడును, ఆతని ముఖ్యానుచరులును ఈ ఊరేగింపున ముందు నడచుచుండెడివారు. వారందరు బ్రహ్మానంద భరితులై ఆడుచు, పాడుచు, గంతులు వేయుచు పోవుచుండిరి. భక్తి సత్సంగములు ప్రతి దినము శ్రీనివాసుడను భక్తునియింట జరుగుచుండెను. ఈ సత్సంగము లందు ప్రధాన విశేషము కీర్తన పరాయణత్వమే.
'సంకీర్తన పద్ధతి' యనునది ఒక క్రొత్త విధమగు ఆరాధన. ఆ కాలమున నామగాన పద్ధతి యెచ్చటను లేదు. ఎవరికిని తెలియదు. దీనికి సంగీత సాధనములు "భోల్" అను పొడుగుపాటి మృదంగమును, కరతాళములును మాత్రమే. కీర్తనలు భగవంతుని నామావళిని మాత్రమే గూడుకొని యుండెను. ఇవి చిన్నవియు, అందరును ఉచ్చరింప దగినవై యుండెను. కొంచెము సేపు మృదంగము మ్రోయించిన తరువాత ఆ నామములపయి మనస్సులు లగ్నముచేసి, నామావళిని పాడుటకు భక్తులు ఉపక్రమించెదరు. అపుడు మహాప్రభువు నృత్యము చేయుటకు లేచును. అందరును లేచి, చిందులు త్రొకుచుందురు. మహాప్రభువు చేతులు పైకెత్తి ఊర్ధ్వ దృష్టితో మాటి మాటికి "హరిబోల్ - హరిబోల్" అనుచు కేకలు పెట్టుచుండును. అనుచరులందరును అట్లే నామోచ్చారణముతో, కేకలతో పరవశు లగుచుందురు. అందరు ఉన్మాదోద్రేకములతో వికార చేష్టలు చేయుచు, ప్రబలముగ నృత్యము చేయుచు తమ్ము తాము మరచి ఆనందమగ్ను లగుచుందురు. వీరు ఒండొరులను కౌగిలించు కొనుచుందురు. వణకుచు ఏడ్చుచుందురు. అరచుచుందురు. ఇట్లు గంటలకొలది నృత్యము చేయుచుండుటచే వీరల శరీరములనుండి చెమటలు కారుచుండును. కొందరు అలసి, వశముతప్పి, పడిపోయి, సమాధిగతులయ్యెదరు. ఈ విధానమును గూర్చి మన మేమనుకొన్నను, కేవలము 'హరి బోలో, కృష్ణ బోలో' అను నామద్వయోచ్చారణ గాన కలాపముతో కూడిన అట్టి భావోద్రేక పూరితమగు ఆరాధన పద్ధతి, వైష్ణవ మతములో నూతన సంప్రదాయ విధానమై ప్రజలకు అధికముగ ప్రీతిపాత్ర మయ్యెను.
నడి బజారులలో జరుగు వీరి వికట తాండవ దృశ్యము కొందరకు ఏవగింపు కలిగించెను. రాష్ట్ర పాలకుడయిన ముస్లిం అధికారి ఈ కీర్తన విధానమును నిషేధించెను. కాని విశ్వంభరుడు సత్యాగ్రహ పద్ధతి నవలంబించెను. ఆతడు ప్రభుత్వపు టాజ్ఞను బహిరంగముగ ధిక్కరించెను. చివరకా ఆజ్ఞ రద్దు చేయబడెను. భగవంతు డడ్డుపడి, స్వప్నసందేశ మిచ్చి నిషేధాజ్ఞను మాన్పించెనని చెప్పుదురు.
క్రీ. శ. 1510 జనవరి నెలలో కేశవభారతీస్వామి వారు విశ్వంభరునకు సన్యాస దీక్ష నొసగిరి. అప్పుడు కృష్ణచైతన్య భారతి అను పేరు పెట్టబడెను. కృష్ణచైతన్య పదమే సంగ్రహోచ్చారణలో చైతన్యుడను పదముగా మారెను.
భాగవత పురాణమునందు వర్ణితమైన శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు తావలమైన బృందావనమునందు స్థిర నివాస మేర్పరచుకొనుటకు చైతన్యుడు నిశ్చయించుకొనెను. కాని మాతృదేవి ఆదేశానుసారము ఆమెకు దూరముగా కాక, దగ్గరగా పురీక్షేత్రమునందు నివసించుటకు ఆతడు ఒప్పుకొనెను. పురీక్షేత్రములో ఓడ్రదేశ ప్రభువగు ప్రతాపరుద్ర గజపతి, సుప్రసిద్ధ వేదాంతియైన వాసుదేవ సార్వభౌమ భట్టాచార్యులు అనువార లిద్దరు చైతన్య స్వామి కనుయాయు లయినట్లు తెలియుచున్నది. ఈ విధముగా అచ్చట ఈ నూతన సంప్రదాయమునకు సుస్థిర స్థానము లభించెను.
తరువాత చైతన్యుడు దక్షిణ భారతము నందును, పశ్చిమభారతమునందును చాలవరకు సంచారము చేసెను (1509-1511). ఈ సంచారమునందు త్రోవపొడుగునను తన నూతన పవిత్ర సందేశమును ప్రబోధించుచు పోయెను.
ఈ సంచారమునుండి తిరిగి వచ్చిన తరువాత, కొద్దినాళ్ళకే అట్లే ఉత్తరభారతము నందును సంచారము చేయుచు బృందావనము వరకును వెడలెను. ఈ ప్రయాణ సందర్భమున ఒకసారి వారణాసియందు ప్రకాశానందుడను పండితునితో తత్త్వవిచారమున చైతన్యుడు వాదోపవాదములు సలిపెను. ప్రకాశానందస్వామి శ్రీ శంకరాచార్యులవారి అద్వైతవేదాంతవాదియగు పరివ్రాజకుడు. శంకరులవారు వేదాంత సూత్రములపై వ్రాసిన భాష్యమును చైతన్యుడు ఖండించి, శంకరులు వేదాంత సూత్రముల స్పష్టార్థమును క్లిష్ట పరచిరని చెప్పెను. శంకరాచార్యులవారు బాదరాయణుని సరళభావములను తెలుపక, తన భావములనే బలవంతముగ వాటియందు జొనిపినా రనియు, వేదాంత సూత్రకారుడు పరిణామ వాదమును అంగీకరించి యుండగా, శంకరులు దానిని తిరస్కరించి తన వివర్త (మాయా) వాదమును తెచ్చి పెట్టినారనియు, చైతన్యుడు విమర్శించెను. చైతన్యుని అభిప్రాయము ప్రకారము పరిణామవాదమే సత్యమైనది, సమంజన మయినది.
ఆ కాలములో బృందావనములోని పవిత్ర స్థలములన్నియు నిర్జనములై యుండెను. వాటిని జనులు మరచి పోయియే యుండిరి. చైతన్యస్వామి ఉపదేశానుసారము బెంగాలులోని వైష్ణవోత్తములు బృందావన క్షేత్రమును సుస్థితికి తెచ్చిరి. ఆ పుణ్యస్థలము ఒక ప్రముఖ ధర్మక్షేత్రముగా మారినదని చెప్పినచో అది వైష్ణవ మతచరిత్రలో ఘనమైన సంఘటనముగా ఎంచవలసి యున్నది. బెంగాలు ముస్లిం ప్రభువునొద్ద ఉన్నతాధికారు లగు నిద్దరు హిందువులు ఆ ఘనకార్యమును నిర్వహించిరి. చైతన్యప్రభువు బృందావనమునకు ప్రయాణము చేయు సందర్భమున ఆ యిద్దరకు చైతన్యస్వామి దర్శనము లభించెను. వీరిద్దరు చైతన్యస్వామికి పరమభక్తు లయిపోయిరి. వీ రిద్దరు రూప గోస్వామి, సనాతన గోస్వామి అను నామముల ప్రసిద్ధి చెందిరి. వీరు బృందావనములోనే నివసింప సాగిరి.
1515 నుండి 1533 లో పరమపదము చెందువరకు చైతన్యప్రభువు జగన్నాథపురీ క్షేత్రములోనే నివసించి యుండెను. అచ్చట నున్నంతకాలము చైతన్య మహాప్రభువు తన నూతన ధర్మోపదేశములను వివరించు వ్యాఖ్యాన ప్రసంగములను చేయుచుండెను. ఈ ప్రసంగముల మధ్య ఒక్కొక్కప్పుడు చైతన్య మహాప్రభువు నిర్వికల్ప సమాధి నిష్ఠుడై, దివ్యానుభూతులను పొందు చుండెను. అతని జీవిత మందలి తుది 12 సంవత్సరములలో భక్త్యావేశము అత్యంతముగ పెరుగ, ఆయన ఎల్లకాలము మతోద్రేకమునకు పరవశుడై యుండుచుండెను. ఈ పారవశ్యమును వైష్ణవ వాఙ్మయములో "దివ్యానందము” లేక “ప్రేమానందము” అనియెదరు.
భగవంతుడు మానుష వేషము తాల్చి మనుష్యులలో మెలగుటకే శ్రీకృష్ణ రూపమున అవతరించినాడు. అనన్య భక్తితో ఆ కృష్ణుని ధ్యానించుటయే, సేవించుటయే మోక్షసిద్ధికి హేతు వగును. కాని రాధాకృష్ణ సంబంధమయిన మధుర భక్తియెడ చైతన్యస్వామి భక్తిప్రపత్తులు ప్రగాఢములై వరలెను. ఈ మధురభక్తి భావమును ఇంక నే మతప్రవక్తయు ఇంత గాఢముగ ప్రవచనము చేసియుండలేదు. ఈ ప్రేమకు శారీరక సంబంధము లేదు. చైతన్యప్రభువు దానిని ప్రగాఢాధ్యాత్మిక తత్త్వముపై నిలిపెను. తన సంప్రదాయము శృంగారవిహార పథములో పడి భ్రష్టము కాకుండ చైతన్యప్రభువు తగు జాగరూకత తీసికొనెను. “ఈ సమాజములో స్త్రీలు చేరకూడదు ; తన సంప్రదాయ భక్తులు స్త్రీలతో ఎట్టి సంగతి కలిగి యుండకూడదు" అని మహాప్రభువు శాసించెను.
చైతన్య మహాప్రభువు ఉపదేశములనుండి ఘనమైన వేదాంత తత్త్వవాఙ్మయము వర్థమానమై యున్నను, ఆతడు విద్యా విజ్ఞాన సంప దావశ్యకతను గణించలేదు. తాను చెప్పి, చేసి, హృదయపూర్వక మయిన ఉత్సాహ భక్తి ప్రపత్తులను తన జీవితమునందే కనబరచి, హరి-కృష్ణ నామోచ్చారణమునే పవిత్ర మహామంత్రముగా నొనర్చి, ఆధ్యాత్మిక లక్ష్యసాధనకు మార్గ మేర్పరచెను. భగవంతుని యందు ప్రేమభావమును జూపుటకు మొదటి సోపానము విశ్వప్రేమ అని అతడు బోధించెను.
చైతన్యతత్త్వము : చైతన్యస్వామి వైష్ణవమతాను యాయి. అయినను ఇతనికి ముందు వచ్చిన శ్రీ రామానుజాచార్యులు, శ్రీ విష్ణుస్వామి, శ్రీ వల్లభాచార్యులు ప్రవచించిన సంప్రదాయమునకు కొంతవరకు భిన్నమైన సంప్రదాయమును ఇతడు నెలకొల్పెను. చైతన్యస్వామి తత్త్వము ప్రకారము భాగవతము ప్రమాణగ్రంథము. శ్రీకృష్ణుడే దేవాధిదేవుడు. త్రిజగన్మోహనాకారుడు, వన్నెలాడు, సర్వాంతర్యామి యగు పరబ్రహ్మము. ఆపర బ్రహ్మము తాను జగద్వికారాను గతుడయ్యును, తన అద్భుత మాయాశక్తిచే పెక్కు రూపధారియగును. శ్రీకృష్ణునకు విలాసశక్తి కలదు. 'విలాసశక్తి' అనగా తనంతట తానే బహురూపములు పొందగల్గుట. ఈ విలాసశక్తి రెండు విధములు : మొదటిది ప్రభావ విలాసము. ఇది గోపికా విహార సంబంధమున కనబడును. ఈ విహార సందర్భమున తన ప్రభావ విలాసశక్తిచే గోపికల సంఖ్యాను గుణముగ ఇద్దరిద్దరు గోపికలమధ్య ఒక కృష్ణుడుండునట్లు, పెక్కు కృష్ణరూపములను ధరించి, వ్యవహరించినాడు. రెండవది 'వైభవ విలాసము'. ఈ వైభవ విలాసశక్తిచే కృష్ణుడు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములను తాల్చినాడు. ఈ నాలుగు విభవములను చతుర్‌వ్యూహము లందురు. ప్రపంచోత్పత్తి నిమిత్తముగా పరాత్పరుడు ఈ నాలుగు వ్యూహ రూపములను ధరించును. చైతన్యుని తత్త్వము ప్రకారము వాసుదేవుడు విజ్ఞాన విభూతికిని, సంకర్షణుడు బలవిభూతికిని, ప్రద్యుమ్నుడు ప్రేమవిభూతికిని, అనిరుద్దుడు లీలావిభూతికిని ప్రతిబింబ గుణవిశిష్టులై యుందురు. ఈ వైభవవిలాసము ననుసరించియే ఏదేని ఒక వ్యూహమును పురస్కరించుకొని అవతారములు ఉద్భవిల్లును. సత్త్వ, రజస్తమో గుణముల ఆధిక్యము ననుసరించి కృష్ణుడే వరుసగా విష్ణుడుగనో, బ్రహ్మగనో, శివుడుగనో, భాసించును.
కృష్ణుని లీలలు సూర్యోదయ, సూర్యాస్తమానముల వలె సర్వకాలము సాగుచునే యుండును. ఆతని శాశ్వత లీలలు గోలోకమునందు విరాజమానము లగుచుండును. గోలోకము వైకుంఠలోకముపై నున్నది.
కృష్ణునకు మూడుశ క్తులు కలవు. మొదటిది అంతశ్శక్తి. ఇది విజ్ఞానాత్మకము. రెండవది బాహ్యశక్తి. ఇది భ్రమాత్మకము. మూడవది పై రెండింటికి అభేదముగా నుండునది; ఇది జీవాత్మకము. కృష్ణుని ప్రధానశక్తి హృదయానంద సంధాయకము. ఇదియే ప్రేమశక్తిగా కనబడుచున్నది. భక్తునియొక్క హృదయములో ఈ రాగాత్మిక భక్తి స్థిరమైపోయినపుడు అది “మహానుభావత్వము" ను పొందును. ప్రేమ పరాకాష్ఠను చెందినప్పుడు అదియే 'రాధ' యనబడును. కృష్ణునకు ఈ రాధాదేవి అత్యంత ప్రేమపాత్రురాలు ; సకలసద్గుణ సంపన్న. కృష్ణుని గాఢ ప్రేమకు రాధయే లక్ష్యస్థానము. ప్రేమావతారముగా భావించుటచే హృదయ సంగతములగు సద్భావములు ఆమెకు భూషణములుగా భావితమగును. ఇదియే రాధాకృష్ణ భావము.
శ్రీ రామానుజాదులు లక్ష్మీనారాయణ భావమును ప్రతిపాదించిరి. విష్ణువే నారాయణుడు, ఆయన శక్తియే లక్ష్మి. వీరు వై కుంఠ వాసులు, పాలనాధికారులు; కావున ఈ భావము భయభక్తి సమన్వితము. వారికి దూరము నుండియే నమస్కరింపవలయును. వైకుంఠవాసులు విషయమున ప్రభుత భయముతో కూడిన భక్తిభావమది.
రాధాకృష్ణభావము అట్టిది కాదు. రాధాకృష్ణభావము స్నేహభావము, సామీప్యము. అనురాగమునకు సంబంధించినది. బృందావన లీలావిహారి శ్రీకృష్ణుడు. ఈ కృష్ణుడు మిత్రుడు, బాలుడు, ప్రియుడు. కావున లక్ష్మీనారాయణ భావముకంటె రాధాకృష్ణభావము మిన్న యైన దని చైతన్యులు సిద్ధాంతీకరించిరి. ఆత్మసమర్పణము తుదిపరిణామముగలది రాధాకృష్ణభావము. గోపికా విహారమునకు విశుద్ధప్రేమయే మూలభూతము. ఇట్టి ప్రేమ సాన్నిధ్యమును బొందుటకు ఉద్ధవాదులగు భక్తులు ప్రయత్నించిరి.
కృష్ణపరమాత్ము డనంతుడు. పరిపూర్ణ విజ్ఞానవంతుడు. ఇక జీవాత్ముడో విజ్ఞాన విషయములో అణువు. వారిద్దరు యథావసరముగ పరస్పరాశ్రయులు. ఈ సంబంధమునకు ఎన్నడును భంగము కలుగ నేరదు. కృష్ణుడు ఆశ్రయుడు, జీవుడు ఆశ్రితుడు. ఈ యిరువురికిని గల సంబంధము ఏకత్వమును, భేదత్వమును. ఇదియే చైతన్య వేదాంత సంప్రదాయముయొక్క సిద్ధాంతము..
తుమ్మెదయు, మధువు వేర్వేరు. అయినను తుమ్మెద మధువుకొరకు పైని ఎగురుచు, ఆ మధువును గ్రోలినప్పుడు తుమ్మెదయొక్క పూర్ణగర్భముననే మధు వుండెను. అనగా దానితో ఏకత్వము చెందెను. అటులే జీవుడు పరమాత్మతో మొదట వేరుగా నున్నను నిశ్చలముగా నిరంతరము పరమాత్మనే వెదకుచుండును. జీవుడు ప్రేమఫలితముగా పరమాత్మమయు డయినప్పుడు తన వ్యక్తిత్వపు టునికినిగూర్చి విస్మృతు డగును. అంత భగవంతునితో లీనమగును. దీనినే నిర్వికల్ప సమాధిస్థితి యందురు. అప్పుడు ప్రతి జీవాత్మయు భగవంతునితో సారూప్యము చెందును. అయినను వీరిరువురును నిక్కముగ భిన్నులే.
కృష్ణుడు మాయాశక్తియొక్క అధిపతి ; జీవుడు ఆ శక్తియెక్క దాసుడు. జీవుడు శృంఖములను త్రెంచి పారవైచినపుడు తన ప్రకృతిని, తనకును భగవంతునకునుగల సత్యసంబంధమును ప్రస్ఫుటముగా చూడగలడు. భక్తి - ప్రేమమార్గముననేశ్రీకృష్ణ పరమాత్ముని సేవించి, మోక్షమును పొందవలయును.
చైతన్యస్వామి ధైర్యశాలియైన సంఘ సంస్కరణ పరాయణుడు. అతడు కులభేదములను పాటించలేదు హిందూమతములోని కర్మకాండను ఆతడు ఖండించినాడు. బ్రాహ్మణులును, చండాలురును, ముస్లిములును, ఆతని సంప్రదాయమునందు చేరి యుండిరి. "ప్రేమించుట, ధర్మము చేయుట” అనునవే చైతన్య సంప్రదాయమునకు విశిష్టాదర్శములు. చైతన్యస్వామి వర్గమువారు ఉదారాశయులై యుండుటచే ఆ మతము ప్రాకృత జనముయొక్క విశాలాదరణమునకు పాత్రమయ్యెను.
శ్రీచైతన్యదేవులు పవిత్రమూర్తి. లోకకల్యాణార్థమే ఈ మహాపురుషు డవతరించెనని పెక్కుమంది విశ్వాసము. భక్తులపాలిటి పెన్నిధిగా నితడు ప్రసిద్ధి చెందెను.
ఈ మహానుభావుని చరిత్రము అద్భుతసంఘటనములకు ఇరువయినట్టిది. ఈతని దర్శన, స్పర్శనాదుల వలనను, ప్రబోధము వలనను, దుష్టులు శిష్టులయిరి; చోరులు సద్వర్తనులైరి; దురహంకారులు వినీతులైరి; రోగులు నిరోగులైరి. ఇట్లు అందరను చైతన్యమహాప్రభువు తన ప్రభావమున భగవద్భక్తి యొక్క పావనమార్గములో పడవేసెను. సులభ తరణోపాయమునకు దారి చూపిన వాడు శ్రీ శ్రీకృష్ణ చైతన్యదేవుడు.
నవద్వీపనగరములో నిత్యానందుడును, శాంతిపురము నందు అద్వైతాచార్యులును, గురుపీఠముల నధిష్ఠించి, ఆధ్యాత్మిక విషయబోధకులైరి. ఈ మతానుయాయుల కొరకు బెంగాలులోను మధురలోను, బృందావనములోను పెక్కు దేవాలయములు వెలసినవి. నవద్వీపములో చైతన్యస్వామి కంకితమైన మందిరము కలదు. ఉత్తర సిల్హటులో ఢాకా దక్షిణముచెంత చైతన్యస్వామి మందిర మొకటి కలదు. అది గొప్ప యాత్రాస్థలము. అచటికి వేలకొలది భక్తులు వచ్చుచుందురు. రాజషాహి జిల్లాలోని భేతూరునందు చైతన్యస్వామి కంకితముగా ఒక దేవాలయము కలదు. అక్టోబరు నెలలో ఇచ్చట గొప్పగా మత సమ్మేళనపు జాతర జరుగును. ఈ యుత్సవమునకు 25,000 మంది జనులు వచ్చుచుందురు.
చైతన్యస్వామి సాంప్రదాయికులు నుదుట తెల్లని తిరుమణి గీతలను రెండింటిని నిలువుగా దిద్దెదరు. ఈ రెండు గీతలను కనుబొమలమధ్య కలిపి, అచ్చటినుండి నాసికాగ్రమువరకు ఒక గీతను పొడిగించెదరు. మూడు పేటలుగల తులసిపూసల హారము వీరు ధరించెదరు. తులసి పూసల హారమును జపమాలగా ఉపయోగించెదరు. వీరు గురువులను ప్రభువు లందురు. శ్రీ శ్రీకృష్ణచైతన్యస్వామిని మహాప్రభు వందురు.
ఆ. వీ.